sriramana
-
Ugadi 2024: కవి పలికిన ఉగాది
చిన్నప్పుడు వీధిబడిలో చదివిన పిల్లలకు తెలుగు ఋతువులు, వాటి ధర్మాలు నోటి మీద వుంటాయ్. సాయంత్రం పూట అన్ని తరగతుల్ని ఒకచోట మళ్లేసి, చైత్ర వైశాఖాలు, ప్రభవ విభవలు చెప్పించేవారు. అందులో జ్ఞాపకమే – ‘చైత్ర వైశాఖాలు వసంత ఋతువు, చెట్లు చిగిర్చి, పూలు పూయును’ అనే మాటలు. తెలుగు నెలల్లో ఫాల్గుణం పన్నెండోది. చైత్రం మొదటిది. మొదటి నెల మొదటి రోజునే ఉగాది అని, యుగాది అని అన్నారు. ప్రాచీన సాహిత్యంలో వసంత శోభలు వెల్లివిరుస్తాయి గాని, ఉగాది పండుగ ప్రస్తావనలు రావు. కవులు ప్రకృతిని అక్షరాలలో నిక్షిప్తం చేయడానికి తమ శక్తి సామర్ధ్యాలను ధారపోశారు. కొత్త చిగుళ్లతో పొటమరించే మొగ్గలలో ప్రతి చెట్టూ దీప స్తంభమై వెలుగుతుంది. కవిత్రయ కవి ఎర్రన – ‘ఎందున పుష్పసౌరభమే ఎందును మంద మాదాలిఝంకృతుల్ ఎందును సాంద్ర పల్లవము లెందునుకోకిల కంఠ కూజితం’ అని వర్ణించాడు. ఋతు సంహార కావ్యంలో కాళిదాసు: పుంస్కోకిలః చూత రసాస వేన మత్తః ప్రియాం చుమ్బతి రాగహృష్ణః అన్నారు. ఎవరే భాషలో అన్నా కోయిలలు, తుమ్మెదలు శృంగార క్రీడలో మునిగి తేలుతున్నాయనే కవి హృదయం. ఉగాది అనగానే గుర్తొచ్చేది పంచాంగాలు, అందులో మన కందాయ ఫలాలు, సంవత్సర ఫలితాలు. భవిష్యత్తు గురించి తెల్సుకోవడంలో ఎవరికైనా వుత్సుకత, వుత్సాహం వుంటుంది. షడ్రుచుల ఉగాది ప్రసాదం తర్వాత పంచాంగ శ్రవణం యీ రెండే ప్రస్తావనకి వస్తాయి. ఆరు రుచులకు ఆరు స్వారస్యాలు చెబుతారు. ఆరోగ్య రహస్యాలు వివరిస్తారు. ఊగిపోయే చెరకు తోటలు ఊహల్లో తీపి నింపుకోమంటాయ్. విరబూసిన వేపపూతలు పచ్చి నిజాల్లోని చేదుని గ్రహించ మంటున్నాయ్. ఈ తరుణంలో లేచిగుళ్లు తింటూ పచ్చని చెట్టుకొమ్మల్లోంచి కోయిల మధుర మధురంగా పాడుతుంది. కొండా కోనా కూహూ రావాలతో ప్రతిధ్వనిస్తాయి. మనం రెట్టిస్తే ‘కూహూ’ అని మరింత ధాటిగా కోయిల జవాబిస్తుంది. కవులు వసంత వర్ణనల్లో కోయిలకు అగ్రస్థానం యిచ్చారు. కోయిల స్వరానికి తిరుగులేని స్థాయి వుంది. అందుకని కవికోకిలలుగా వ్యవహారంలోకి వచ్చారు. వీణ చిట్టిబాబు కోయిలని అద్భుతంగా పలికించేవారు. అయితే, శ్రోతల్ని వూరించేవారు. ఇంత గొప్ప గౌరవం ఇచ్చినందుకు మనం వసంత రుతువులో గళం విప్పకపోతే ఏమాత్రం మర్యాదకాదని కవులు ఉగాదికి కవితలల్లడం మొదలుపెట్టారు. అది క్రమంగా ఆచారంగా మారింది. ఆకాశవాణిలో ఉగాది కవిసమ్మేళనం ఉండి తీరాల్సిందే. దువ్వూరి రామిరెడ్డికి, గుర్రం జాషువాకి ‘కవి కోకిల’ బిరుదు ఉంది. హేమా హేమీలతో వాసిగల కవులందరితో కావ్యగోష్ఠి జరుగుతోంది. విశ్వనాథ, జాషువా, కాటూరి ప్రభృతులున్నారు. ‘నిర్వాహకులు ఇక్కడ గుర్రాన్ని గాడిదని ఒక గాటన కట్టేశారు’ అన్నారట విశ్వనాథ ప్రారంభోపన్యాసంలో. ‘నాకూ అదే అనిపిస్తోంది’ అన్నారు గుర్రం జాషువా. అంతరార్థం తెలిసిన సభ చప్పట్లతో మార్మోగింది. బెజవాడ ఆకాశవాణి కేంద్రంలో ఉగాది కవి సమ్మేళనం ఆహూతుల సమక్షంలో జరుగుతోంది. సంగీత సాహిత్యాల మేలు కలయిక. బాలాంత్రపు రజనీకాంతరావు నాటి స్టేషన్ డైరెక్టర్. పేరున్న కవులంతా నాటి సమ్మేళనంలో ఉన్నారు. సుప్రసిద్ధ పత్రికా సంపాదకులు నార్ల వెంకటేశ్వరరావుకి అధ్యక్షపీఠం కట్టబెట్టారు. విశ్వనాథ గురించి మాట్లాడుతూ నార్ల ‘నాకూ వారికీ అభిప్రాయ భేదాలున్నప్పటికీ ప్రతిభ విషయంలో నాకెప్పుడూ గౌరవమే’ అన్నారు. ప్రేక్షక శ్రోతల్లో వొదిగి కూర్చున్న రజనీకి గుండెల్లో రాయి పడింది. విశ్వనాథ మైకు ముందుకొస్తే ఏదో అనకమానడు, రచ్చరచ్చ అవుతుందని భయపడుతున్నారు. విశ్వనాథ వంతు రానే వచ్చింది. ‘మిత్రుడు నార్ల అభిప్రాయ భేదాలున్నప్పటికీ అన్నాడు. మాకు సొంత అభిప్రాయాలు ఏడిస్తే అప్పుడూ భేదాలుండేవి. ఆయన కారల్ మార్క్స్ అభిప్రాయాలు పట్టుకు వేలాడుతున్నాడు, నేను శంకరాచార్యని పట్టుకు అఘోరిస్తున్నా’ అనగానే సభ నిలబడి కరతాళ ధ్వనులు చేసింది. ఒక్కసారి ప్రాచీనుల్ని పరామర్శిస్తే ఆదికవి నన్నయ్య భారతం ఆదిపర్వంలో వసంతకాలాన్ని వర్ణిస్తూ ఎన్నో పద్యాలు చెప్పాడు. వసు చరిత్రలో రామరాజ భూషణుడి పద్యాలు లయాత్మకంగా ఉంటాయని చెబుతారు. వసంత వర్తనలో–‘లలనా జనాపాంగ వలనా వసదనంగ తులనాభిగాభంగ దోప్రసంగ మలయానిల విలోలదళ సాసవరసాల ఫలసాదర’ అని సాగే ఈ పద్యాన్ని వీణ మీద వాయించగా విన్నవారున్నారు. జానపదుల జీవన స్రవంతిలో ఉగాది ఉన్నట్టు లేదు. ఎక్కడా మన సామెతల్లో ఈ పండగ ప్రసక్తి కనిపించదు, వినిపించదు. సంకురాత్రి, శివరాత్రి సామెతల్లో కనిపిస్తాయ్. పూర్వం గ్రామ పురోహితుడు ఈ పండగనాడు వేప పూత ప్రసాదం ఇంటింటా పంచేవాడు. వారు ధనధాన్యాల రూపంలో చిరుకానుకలు సమర్పించేవారు. ఉగాదినాడు వ్యక్తులవే కాదు దేశాల రాష్ట్రాల జాతకాలు కూడా పంచాంగం ద్వారా పండితులు నిర్ధారిస్తారు. ‘ఖగోళంలో కూడా క్యాబినెట్ ఉంటుందండీ. సస్యాధిపతిగా ఫలానా గ్రహం వుంటే పంటలు బాగుంటాయి. అలాగే వర్షాలకి హర్షాలకి అధిపతులుంటారు. పంచాంగమంటే తిథి వార నక్షత్ర యోగ కరణాలే కాదు చోర అగ్ని యుద్ధ ప్రమాదాల్ని కూడా ఢంకా బజాయించి చెబుతాయ్’ అంటారు పంచాంగవేత్తలు. ఆ ఢంకా సంగతి అట్లా వుంచితే, ప్రస్తుత కాలంలో మాత్రం పంచాంగాల్ని బహుముఖంగా ప్రదర్శింపచేస్తున్నారు. ఏ పార్టీ కార్యాలయానికి వెళితే ఆ పార్టీకి అనువుగా పంచాంగ ఫలితాలుంటాయి! పార్టీ అధినాయకులు కూడా చక్కగా సమయానికి తగుమాటలాడే వారినే పిలిచి పీట వేస్తారు. పంచాంగం మీద పట్టు కంటే లౌకికజ్ఞానం ప్రధానం. పేరులో విళంబి వుంది కాబట్టి నిదానంగా హిందుస్థానీ శాస్త్రీయ సంగీత గోష్ఠిలా సాగుతుందని అనకోవద్దు. కాలానికి ఒక వేగం వుంటుంది. అది చచ్చినా మారదు. తెలుగు సంవత్సరాల పేర్లకి వాటి లక్షణాలకి మాత్రం సంబంధం లేదు. ఈ మధ్య కొత్త సంవత్సరమంటే ఉగాది మాత్రమేనని, జనవరి ఒకటి కానేకాదని ఒక సిద్ధాంతం లేవనెత్తారు. ముఖ్యంగా దేవాలయాలు తెలుగుకి కట్టుబడి వుండాలన్నారు. ఉన్న సమస్యలకి కొత్తవి తగిలించుకోవడమంటే యిదే! మన ఆడపడుచులు పుట్టినరోజుని ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం అత్తారింటోనూ, తెలుగు లెక్కన పుట్టింట్లోనూ జరుపుకుంటున్నారు. అన్నీ డబల్ డబల్... ఆనందం కూడా డబల్. జీవితాన్ని సాల్వా దాళ్వాలతో పండించు కోవడమంటే యిదే. ఒక పెద్దాయన దగ్గర ఉగాది ప్రస్తావన తెస్తే, మాకు మార్చిలో బోనస్‌లు వచ్చేవి. సంవత్సరాదీ అప్పుడే వచ్చేది. ఇప్పుడే వుంది, మార్చి వచ్చిందంటే, ఐ.టి.రిటర్న్స్ దిగులు తప్ప అన్నాడు. ఇంకో సీనియర్ సిటిజెన్ ఆ నాటి ఆంధ్రవారపత్రిక ఉగాది సంచికల్ని తల్చుకున్నాడు. ‘కునేగా మరి కొళుందు’ సెంటు కొట్టుకుని ఘుమ ఘుమలతో వచ్చేది. ఇప్పుడు ఏ పరిమళమూ లేదని చప్పరించేశాడు. ‘మీకు తెలియదండీ, విజయవాడ రేడియో కవి సమ్మేళనలో అద్భుతమైన కవితలు వినిపించేవి. ఓ సంవత్సరం ఆరుద్ర, వేదంలా ప్రవహించే గోదావరి/ వెన్నెల వలె విహరించే కృష్ణవేణి అంటూ కవిత చదివారు. ఆ తర్వాత పాతికేళ్లకి ‘ఆంధ్ర కేసరి’ సినిమాకి పాట రాస్తూ వేదంలా ఘోషించే గోదావరి/ అమరధామంలా వెలుగొందే రాజమహేంద్రి అని రాశారు. నేను చెన్నపట్నం ఆరుద్ర ఫోన్ నెంబర్ తీసుకుని చేశా. మీరప్పుడు చదివిందే యిప్పుడు మళ్ళీ రాశారని నిలదీశా. ఆరుద్ర స్టన్ అయిపోయి మీకున్నంత జ్ఞాపకశక్తి నాకు లేకపోయింది. మన్నించండని ఫోన్ పెట్టేశాడు. మనకేంటి భయం?’ అని లోకల్ పొయెట్ నాకు వివరించారు. ఒకళ్లేమో ‘రారా ఉగాదీ’ అనీ, ఇద్దరేమో ‘రావద్దు ఉగాదీ’ అని మొదలుపెడతారు. యీ కవి గోష్ఠులలో ఏదో ఒకటి తేల్చండి పాపం అన్నాడొకాయన అసహనంగా. పిలుపులు రాని కవులకు కొంచెం అలకగానే ఉంటుంది. ఒక్కోసారి యీ అలక కవులంతా ఓ వేదిక మీదకు చేరుతారు. అవి పి.క.సమ్మేళనాలవుతాయ్. ఉగాది నాడు పిలుపొస్తే ఏడాది పొడుగునా మైకు అందుబాటులో ఉంటుందని ఓ నమ్మకం. ‘మాకుగాదులు లేవు, మాకుష్షస్సులు లేవు’ అని కోపం కొద్దీ అన్నారే గాని కృష్ణశాస్త్రి వసంతాన్ని దోసిళ్లకెత్తుకున్నాడు. ‘మావి చిగురు తినగానే.. ’ లాంటి పాటలెన్నో రాశారు. సుఖదుఃఖాలు చిత్రంలో ‘ఇది మల్లెల వేళయనీ, ఇది వెన్నెల మాసమనీ తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ’ పాట హిట్టున్నర హిట్టు. తర్వాత ఎవరో అడిగారట వెన్నెల మాసమేమిటి, వెన్నెల పక్షం ఉంటుంది గాని అని. నేను మల్లెల మాసమనీ, వెన్నెల వేళయనీ రాయాలని మనసులో అనుకున్నా కాని కాయితం మీదకి అలా వచ్చింది అన్నారట. మిగతా సంగతులు ఎట్లా వున్నా ఉగాది మార్కెట్లోకి మల్లెపూలు తీసుకువస్తుంది. వేసవి చెమటల్ని పరిహరిస్తూ మల్లెలు పరిమళిస్తాయ్. ఈ కాలం యువత ఇతర వత్తిళ్లలో పడిపోయి దాంపత్య వత్తిళ్లు మర్చిపోతున్నారు. ఇంటికి వెళ్తూ ధరకి వెరవకుండా రెండుమూరల మల్లె మొగ్గులు తీసికెళ్లండి. ఆ మల్లెవాసనలు వుత్తేజకరమైన ఆలోచనలు పుట్టిస్తాయి. వచ్చిన వసంతాన్ని అందిపుచ్చుకుని ఆనందించాలి గాని జారిపోనీకూడదు. ప్రతీరాత్రి వసంతరాత్రి కావాలని కాంక్షిస్తూ– – శ్రీరమణ (2018లో ఉగాది సందర్భంగా దివంగత రచయిత, కవి శ్రీరమణ అందించిన ప్రత్యేక వ్యాసం ఇది) -
మిథునం రచయిత శ్రీ రమణ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ రచయిత, సీనియర్ జర్నలిస్ట్ శ్రీరమణ ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ వేకువఝామున(5 గంటల ప్రాంతంలో..) తుదిశ్వాస విడిచారు. దిగ్గజాలు బాపు-రమణతో కలిసి పని చేసిన అనుభవం రమణది. పేరడీ రచనలకు శ్రీ రమణ ఎంతగానో ప్రసిద్ధి. ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన మిథునం సినిమాకు శ్రీరమణే కథ అందించారు. 2012 లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాదాపు సినిమా తీసిన నాటికే పాతిక సంవత్సరాల క్రితం ఆయన రచించిన 25 పేజీల మిథునం కథకు తనికెళ్ళ భరణి అద్భుతంగా చిత్రీకరించారు. శ్రీ రమణ గుంటూరు జిల్లా, వేమూరు మండలానికి చెందిన వరహాపురం అగ్రహారంలో 1952 సెప్టెంబరు 21న జన్మించారు. ఆయన అసలు పేరు కామరాజ రామారావు. ఆంధ్రజ్యోతి నవ్యతో పాటు సాక్షి.. పలు తెలుగు పత్రికలకు ఆయన పని చేశారు. వ్యంగ్య హాస్య భరితమైన కాలమ్స్ నడిపిన కాలమిస్టుగా, కథకుడిగా, సినిమా నిర్మాణంలో నిర్వహణ పరంగా పలు విధాలుగా సాహిత్య, కళా రంగాలకు విశిష్ట సేవలందించారు. శ్రీ రమణ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. -
పాదయాత్రకి మూడేళ్లు
జగన్ పాదయాత్రకి, మహాజైత్ర యాత్రకి మూడేళ్లు. ఆయన కన్నాడు, ఆయన విన్నాడు, ఆయన సాధించాడు. నాడు బుద్ధుడు బయట సంచారంలో ఏమి చూశాడు? వాటినిబట్టి పూర్తిగా మారిపోయాడు. అప్పటి దాకా రాజ ప్రాసాదంలో పుట్టి పెరిగిన గౌతముడికి జర రుజ మరణాలు గురించిన స్పష్టత లేదు. తన రథం నడిపిన సారథిని అడిగి తెలుసుకున్నాడు. జర రుజ మరణాలు ప్రతి మనిషిని ఆవహి స్తాయ్ అని సారథి తేటతెల్లం చేశాడు. ఒక్కసారిగా రాకుమారుడికి బుద్ధి వికసించింది. జగన్మోహన్రెడ్డి అప్పటిదాకా అంతఃపురంలో పెరి గాడు. ఒక్కసారిగా విశాల ప్రపంచాన్ని చూడాలని, చూసి అర్థం చేసుకోవాలనుకున్నాడు. పాదయాత్రకి బయలు దేరాడు. ఎండనక, వాననక.. చీకటిని, వెన్నెలని సమంగా సమాదరిస్తూ, పేద గుడిసెల్లో రాజ్యమేలే దరిద్య్రాన్నీ, లేమినీ జాగ్రత్తగా ఆకళింపు చేసుకున్నాడు. రాష్ట్రంలో ఇంతటి కరువు రాజ్యమేలుతోందా? అని జగన్ నివ్వెర పోయాడు. వీళ్లకి ఏదైనా చెయ్యాలని ఎంతో కొంత మేలు చెయ్యాలని అడుగడుగునా ప్రతిజ్ఞ చేస్తూ జగన్ నడిచాడు. జనం ఆడామగా, పిల్లాజెల్లా నీరాజనాలు పలికారు. ప్రతి చిన్న అంశం ఆయన గమనించారు. స్కూల్ బ్యాగుల నుంచి యూనిఫారమ్‌ల నించీ అన్నీ అందరికీ సమకూర్చాలని సంకల్పించారు. గ్రామాల పాఠశాలల రూపు రేఖలు మారిపోయాయి. పిల్లలు గర్వంగా ‘ఇది మా బడి’ అనుకునే స్థాయికి తెచ్చారు. గ్రామ సుపరిపాలనకి నాంది పలికారు. చాలా ఉద్యో గావకాశాలు కల్పించారు. ఇది మన రాజ్యం అనే స్పృహ కల్పించారు. గతంలో పాలకులు పల్లెల్ని బాగు చేయడం ఎవరివల్లా కాదన్నారు. వ్యవసాయం లాభసాటి వృత్తి కాదన్నారు. గ్రామాల్లో ఎందరో పెద్దలు అనేకానేక ప్రయోగాలు చేసి చక్కని సిద్ధాంతాలను ఏర్పాటు చేశారు. అప్పట్లో ప్రతి గ్రామంలో కొద్దిమందైనా ఆదర్శరైతులుండేవారు. మావూళ్లో చిదంబరానికి మంచి పేరుండేది. ఆయనని, ఆయన సేద్యాన్ని చూడటానికి అడపాదడపా పొరుగూరి రైతులు వచ్చేవారు. ఆయన పెద్ద భూస్వామి కాదు. కేవలం ఒక ఎకరం భూమి వసతులన్నీ ఉన్నది ఉండేది. పొలంలో రెండు కొబ్బరి చెట్లు, రెండు నిమ్మ మొక్క లుండేవి. బాగా కాసేవి. ఆ నేలలోనే ఐదు సెంట్ల చిన్న చెరువు ఓ మూల ఉండేది. దాంట్లో చేపల పెంపకం నడిచేది. చుట్టూ అరటి మొక్కలు పెంచేవారు. ఏటా మూడు పంటలు పొలంలో పండించేవారు. ఒక ఆవు వారి పోషణలో ఉండేది. పది బాతులు పంటచేలో తిరుగుతూ ఉండేవి. సేంద్రియ వ్యవసాయానికి ఆవు, దూడ విని యోగానికి వచ్చేవి. పొలం పనులన్నీ చిదంబరం కుటుంబ సభ్యులే సకాలంలో బద్ధకించకుండా చేసుకునేవారు. తక్కువ భూమి కావడంవల్ల శ్రద్ధ ఎక్కువ ఉండేది. రాబడి అధికంగా ఉండేది. మంచి దిగుబడికి మూలం మంచి విత్తనం అన్నది చిదంబరం నమ్మిన సిద్ధాంతం. ఇప్పుడు ప్రభుత్వం రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటు చేసింది. పెట్టుబడికి సకాలంలో డబ్బు అందిస్తోంది. రైతుకి గిట్టు బాటు ధర కల్పిస్తోంది. ఇవ్వాళ రైతులకు ముఖ్యంగా సన్నకారు రైతుకి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. జగనన్న పాదయాత్రలో తెలుగునేల ప్రతి అంగుళం నడిచి చూశారు. అందరి గోడు విన్నారు. వాటికి విరు గుడుగా ఏమి చెయ్యాలో కూడా అప్పుడే పథక రచన చేశారు. దాని పర్యవసానమే ఇప్పుడీ ప్రభుత్వం తెచ్చిన పథకాలు.. అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు. ఇంకా చెయ్యాల్సినవి ఎన్నో ఉన్నాయి. సుమారు ఏడాది కాలం కోవిడ్‌వల్ల నష్టపోయాం. విలువైన పౌష్టికాహారం మనమే యథాశక్తి పండించుకోవచ్చు. పల్లెల్లో పళ్లు, పచ్చికూరలు రసాయనాలు లేకుండా పండించుకోవచ్చు. వ్యవసాయ రంగంలో, విశ్వవిద్యాలయాల్లో వస్తున్న పరిశోధనా ఫలి తాలు ఎప్పటికప్పుడు చిన్న రైతులకు చేరాలి. హైబ్రిడ్ విత్తనాలు, తక్కువ వ్యవధిలో అధిక దిగుబడులిచ్చే ధాన్యాలు ధారాళంగా అందుబాటులోకి రావాలి. రైతులకు ఎప్పటికప్పుడు వర్క్‌షాపులు నడపాలి. వారికి ఉండే మూఢ నమ్మకాల్ని వదిలించాలి. చిన్న చిన్న రైతులు వినియోగించుకోగల వ్యవసాయ పనిముట్లు అందు బాటులోకి రావాలి. నాగళ్లు, హార్వెస్టర్లు, డ్రోన్లు తక్కువ ధరలకే అద్దెలకు దొరకాలి. వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భాన్ని పేదరైతులకు అంకితం చేసి, ప్రతి ఏటా వారి వికాసానికి ఒక కార్య క్రమం చేపట్టాలి. -శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
అదే బెటరు..
నాలుగు రోజులుగా పత్రి కల్లో వరదల్ని వరుణ దేవు డిని విమర్శిస్తూ పతాక శీర్షి కలు చూస్తున్నాం. ఇట్లాంట ప్పుడు పత్రికల్ని శ్రద్ధగా చదు వుతాం. ఇన్ని సెంటీమీటర్లు వానపడిందిట. అన్ని సెంటీ మీటర్లు పడిందిట.. అంటూ పేపర్లు ఇచ్చిన గణాంకాలు చూసి మరోసారి నివ్వెర పోతూ ఉంటాం. పూర్వం వర్షాన్ని ‘దుక్కులు’ లెక్కన చెప్పుకునేవారు. అటూ, ఇటూ చేసి చివరకు ఏలిన వారు ఏం చేస్తున్నారనే విమర్శ దగ్గరకు వచ్చి ఆగి పోతుంది. ఏలిన వారైనా ఏలని వారైనా ఏం చేస్తారు? రమారమి వందేళ్లలో ఇంత పెద్ద వాన పడలేదుట. ఒక అసాధారణ సందర్భంగా ముందు ప్రభుత్వాలు చెప్పేసి చేతులు దులుపుకుంటాయ్. తర్వాత నిజం పంచాయతీ ఆరంభమవుతుంది. చెరువులు అక్ర మంగా ఆక్రమించి ఇళ్లు కట్టారని ఆరోపిస్తారు. ఏ మహా నగరంలో అయినా ఇదే కథ వినిపిస్తుంది. గుట్టలు, కొండలు కబ్జా అయినట్టే చెరువులు అయి నాయ్. నదులు ఆక్రమణలకు గురై లంకలు ఏర్ప డ్డాయ్. అవన్నీ పెద్ద పెద్ద పట్టణాలుగా మారాయి. ఒకవైపు నీటి కొరత, మరోవైపు వరద ముంపు. నీళ్లని నిలవ చేసుకుని హాయిగా వాడుకోవడం ఎలా? ఇరుగుపొరుగు దేశాలెవరన్నా మన నీళ్లు దాచిపెట్టి కావల్సి వచ్చినపుడు వదిలి పుణ్యం కట్టుకోవచ్చు. కావాలంటే లక్ష క్యూసెక్కులు డిపాజిట్ చేసి ఇచ్చి నందుకు డబ్బు తీసుకోవచ్చు. ఇతర రాష్ట్రాలవారు కూడా ఈ సేవకి లేదా వ్యాపారానికి పూనుకోవచ్చు. రాష్ట్రానికి కాపిటల్ కడదామని మాన్య మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు సుమారు నలభైవేల ఎకరాలు పూల్ చేశారు. ఆ స్థలాన్ని కాంక్రీట్ అరణ్యంగా మార్చే బదులు ఇంకుడు గుంతగా లేదా నాలుగు అతిపెద్ద చెరువులుగా మారిస్తే వెంటనే ఉపయోగంలోకి వచ్చేవి. ఇప్పుడు మనకు అర్జెంటుగా కావాల్సింది రిజర్వాయర్లు లేదా జలాశయాలు. అశోకుడు చెరు వులు తవ్వించాడని, చెట్లు నాటించాడని చిన్నప్పటి నుంచీ చదువుతున్నాం. ‘తటాకం’ కూడా ఒక విధంగా సంతానం లాంటిదేనని మన శాస్త్రాలు చెబు తున్నాయ్. మొన్నటిదాకా వాన చినుకుల్ని ఒడిసి పట్టండని చెప్పుకున్నాం. ఇప్పుడు నీళ్లను వదిలిం చుకోవడం ఎలాగో తెలియక తికమక పడుతున్నాం. మేధావులు ఆలోచించాలి. నీళ్లని నిలవపెట్టడం ఎలాగ? తేలిక పద్ధతులు కావాలి. ఎక్కువ డబ్బు ఖర్చు కాకుండా నిలవ పెట్టడం ఎలాగ? భూగర్భ జలాల్ని పెంచడం ఎలా? ఈ సమస్యల్ని పరిష్కరించుకుంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఆంధ్రాకి చెరువుల వ్యవసాయ సంస్కృతి లేదు. పూర్వం నుంచీ నదులు, ఆనకట్టలు, కాలువలు ఉండ టంతో పంట కాలువలతో వ్యవసాయం చేసేవారు. తెలంగాణలో, రాయలసీమ జిల్లాల్లో చెరువుల వ్యవసాయం ఉంది. అక్కడ చెరువుల చెయిన్ ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి నిండుతూ ఉంటాయి. ఇప్పుడు నిండుకుండల్లా ఉండి, జలకళ సంతరించుకుని ఉండే రిజర్వాయర్లు ఒక్కసారి బావు రుమంటాయి. అడుగురాళ్లు బయటపడతాయి. ఇది తరచూ చూసే సమస్య. ఇంత చిన్న సమస్యకి పరిష్కారమే లేదా? మళ్లీ అశోక చక్రవర్తిలా రంగంలోకి దిగి చెరువులు తవ్విం చాలి. ప్రతి గ్రామానికి కనీసం రెండు పెద్ద చెరువులు. ఎన్ని ఎకరాల వ్యవ సాయ భూమి ఉందో, అందుకు ఎంత పెద్ద చెరువులు అవసరమో గణించి ఏర్పాటు చెయ్యడం. అవి కబ్జా కాకుండా కాపాడటం. దీనికి అన్ని విధాలా రైతుల సహకారం అందిపుచ్చుకోవాలి. ఏటా వాటికి పూడికలు తీయాలి. గ్రామ పంచాయ తీల్లోని బంజర్లను, ప్రభుత్వ బీడు భూముల్ని, పొరంబోకుల్ని చెరువులుగా పునర్నిర్మించడం ఒక పద్ధతి. ఇన్ని లక్షల క్యూసెక్కుల నీళ్లని సముద్రానికి వదలడం చాలా అన్యాయం. వంద సంవత్సరాలలో అవసరాల మేర నీళ్లని కట్టడి చేయలేకపోవడం ప్రభుత్వాలకి చిత్తశుద్ధి లేకపోవడమే. కొన్నేళ్లపాటు రాష్ట్ర బడ్జెట్‌ని వేరేవిధంగా తీర్చిదిద్దాలి. ఎక్కడికక్కడ అడ్డుగోడలు కట్టాలి. కనీసం ప్రైవేట్ చెరువులు లేదా రిజర్వాయర్లని అనుమతించాలి. రిలయన్స్ వారో, అమెజాన్ వారో, ఎక్కడికక్కడ నిలవచేసి హాయిగా మీటర్లు పెట్టి అమ్ముకుంటారు. అది బెటరు. వెంటనే జరిగే పని కూడా! శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
జంట నగరాల కాలనీలలో కంపు!
జంట నగరాలంటేనే కాలనీల మయం. ప్రపంచంలోనే అతి పెద్ద కాలనీలు ఇక్కడ ఉన్నా యని గర్వంగా చెప్పుకుంటారు. ప్రతి పెద్ద రోడ్డు పక్కనా కొమ్మల్లా రెమ్మల్లా కాలనీలు మొలుస్తాయ్. ఇవన్నీ బల్దియా పాలనలోనే వర్ధిల్లుతుంటాయి. వాటి సౌలభ్యాన్నిబట్టి మేడలు, మిద్దెలు, బహుళ అంత స్తుల భవనాలతో నిండిపోతుంది. ఇక్కడకూడా పన్నులు భారీగానే పిండుకుంటారు. కానీ, అంతగా పట్టించు కోరు. కార్పొరేటర్ల పాలన, అజమాయిషీ వీటిమీదే అధి కంగా ఉంటుంది. ఇలా నగరం వేగంగా వృద్ధి చెందడం ఆనందంగానే ఉంటుంది. కానీ, ఆరోగ్యంగా మాత్రం ఉండదు. కాలనీ రూపుదిద్దుకునేటపుడే ముందుచూపు, ఆర్థిక స్తోమత ఉన్నవారు ఒకటికి నాలుగు ప్లాట్లు కొని పడేస్తారు. ఒక దాంట్లో ఇల్లు కట్టుకుంటారు. మిగిలిన నాలుగు స్థలాలు ఓ పక్కన పడుంటాయ్. కాలనీ చిక్క పడినకొద్దీ స్థలాల రేట్లు ఆకాశంవైపు చూస్తుంటాయి. అవి మధ్య మధ్యలో ఖాళీగా ఉండి, అందరికీ ‘డంపింగ్ యార్డ్’లుగా మారతాయి. ఇవి కాలక్రమంలో భయంకర మైన అపరిశుభ్ర కేంద్రాలుగా మారతాయ్. ఈగలు, దోమలు, వీధికుక్కలు అక్కడే పుట్టి పెరుగుతుంటాయి. ఈ కరోనా టైంలో వాటిని నిత్యం శుభ్రం చేసేవారు లేక, శానిటేషన్ లేక కాలనీవాసులకు ఎన్ని సమస్యలు తెచ్చి పెట్టాయో అందరికీ తెలుసు. సీజనల్ అంటువ్యాధులు ప్రబలినపుడు మాత్రం కార్పొరేషన్ కుంభకర్ణుడిలా ఒక్క సారి మేల్కొంటుంది. నాలుగు ఫాగింగ్‌లతో ఆవలించి, మళ్లీ నిద్రకి ఉపక్రమిస్తుంది. ఎక్కడైనా కాలనీలలో ఇసుక, కంకర దిగిన ఆనవాళ్లు కనిపిస్తే కార్పొరేటర్లు హడావుడిగా వచ్చేస్తారు. కొలతల ప్రకారం, లెక్కల ప్రకారం ఉందా? లేదా? అంటూ ఇంటి యజమాని ప్రాణం తీస్తారు. ఇది నిత్యం మనం చూసే తంతు. ఈ ఖాళీ ప్లాట్ల యజమానులు తెలియకుండానే రియల్ ఎస్టేట్ వ్యాపారులైపోతారు. అక్కడ ఏమీ కట్టరు. వాటిని అమ్మరు. వారు ఎక్కడో ఉండి తమ ప్లాట్లని పర్య వేక్షిస్తూ, ధరలు తెలుసుకుంటూ, లాభాలు లెక్కించు కుంటూ ఉంటారు. వాళ్ల ఖాళీ ప్లాట్లు ఎంత అశుభ్రంగా చెత్త నిలయంగా ఉన్నాయో వారికి తెలిసినా పట్టించు కోరు. కాలనీవాసులకి ఈ ఖాళీ స్థలాలు నానారకాల చెత్తల్ని వదిలించుకోవడానికి చేతివాటంగా అందు బాటులో ఉంటాయి. ఇదంతా కార్పొరేషన్ వారే బాధ్యత తీసుకుని బాగు చేస్తారని, బాగు చేయాలని అనుకుంటారు. ఎవ్వరూ ఏమీ పట్టించుకోరు. నిత్యం రకరకాల బయో వ్యర్థాలు ఆ గుట్టల్లో పడి ఎంత అనా రోగ్యాన్ని సృష్టిస్తాయో అందరికీ తెలుసు. ఇక మధ్య మధ్య పడే వానజల్లులు మరింత అపకారం కలిగిస్తాయి. చిన్న ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ ఫెన్సింగ్ వేస్తారు. అందు లోకి కావల్సినంత చెత్తపడుతుంది. ఇది మనవాళ్ల నైజం. దీన్ని పూర్తిగా అరికట్టాలి. ఇది ఒక జంట నగరాల లోనే కాదు రెండు రాష్ట్రాల పెద్ద నగరాలన్నింటిలో ఉన్న సమస్య. విజయవాడ, గుంటూరు, ఏలూరు, తెనాలి ఏదైనా కావచ్చు ఇలాంటి భయంకరమైన అశుభ్ర దృశ్యాలతోనే ఎదురవుతాయి. కార్పొరేషన్లు ముందు వాటిపై నిఘాపెట్టాలి. ధరలొస్తాయని కొనిపడేసిన స్థలా లపై అజమాయిషీ చాలా ముఖ్యం. పరోక్షంగా రియల్ ఎస్టేట్ చేస్తున్న వారిపై పన్ను అధికం చేయండి. లేదా జప్తు చేయండి. ఫలానా సమయంలోగా నిర్మాణాలు చెయ్యండని చెప్పండి. లేదంటే ఆ స్థలాలని తీసుకుని సద్వినియోగం చెయ్యండి. మనం పదేపదే ‘విశ్వనగరం’ చేస్తామని కబుర్లు చెబితే చాలదు. స్వచ్ఛ భారత్ ఉద్యమానికి ఇవి ఎంతగా అడ్డుతగిలాయో అందరికీ తెలుసు. చాలామంది స్థలాలు కొని, పడేసి ఏ దేశమో వెళ్లిపోతారు. వారికి దోమల బాధ, ఈగల బెడద, పురుగు చెదల గొడవ ఏదీ ఉండదు. ధర వచ్చినపుడు ఫోన్‌మీద అమ్మకాలు సాగిస్తారు. లేదా వాటిని సక్రమంగా పరిశుభ్రంగా నిర్వహించి మిగిలినవారికి ఇబ్బంది లేకుండా చేయ డానికి వాటి యజమానుల నించే అధిక పన్ను వసూలు చేయండి. కార్పొరేటర్లు బాధ్యత వహించాలి. జగన్ మోహన్‌రెడ్డి గ్రామ పంచాయతీల్లో ప్రారంభించిన వ్యవస్థ లాంటి దాన్ని ప్రతి వార్డులోనూ పెట్టాలి. పదవి కోసం కాకుండా, ఎంతో కొంత సేవ చేయడానికి వార్డు లీడర్లు ఉండాలి. స్వచ్ఛ భారత్ ఉద్యమం ఇక్కడ నించే ప్రారంభం కావాలి. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
బ్రాండ్లూ–వ్యాపారాలూ
ఏ చిన్న అవకాశం వచ్చినా సంప్రదా యాల్ని అడ్డం పెట్టుకోవడం, నమ్మకంగా వ్యాపారం చేసుకోవడం మనకి అలవాటు. కరోనా తెరమీదకు వచ్చినపుడు భారతీ యత, వాడి వదిలేసిన దినుసులు మళ్లీ మొలకలెత్తాయి. ‘కోవిడ్ ఏమీ చెయ్య దండీ, ధనియాల చారు ఓ గుక్కెడు తాగండి. అడ్రస్ లేకుండా పోతుంది’ అంటూ హామీలు ఇచ్చినవాళ్లు ఎందరో?! ఇది చైనాలో పుట్టింది. వాళ్లే చెబుతున్నారు. చిటికెడు పసుపుపొడి వేసుకుని ముప్పూటా ఆవిరి పట్టండి. సమస్త మలినాలు వదిలిపోతాయ్ అంటూ ఎవరి పద్ధతిలో వాళ్లు దొరికిన చోటల్లా చెప్పుకుంటూ రాసుకుంటూ వెళ్లడం మొదలు పెట్టారు. ఏమీ దిక్కుతోచని స్థితిలో ఉన్న జనం ఎవరేం చెబితే అది నెత్తిన పెట్టుకుని అమలు చేశారు. చేసిన వాళ్లంతా బావుందంటూ ప్రచారం చేశారు. పైగా దానికితోడు మన భారతీయత, దేశవాళీ దినుసులు చేరే సరికి అగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది. ఒకప్పుడు ఆవఠేవలు, ఇంగువ హింగులు మన రోజు వారీ వంటల్లో బొట్టూ కాటుకల్లా అలరించేవి. చూశారా, ఇప్పుడవే దిక్కు అయినాయి. మడి, ఆచారాల పేరు చెప్పి వ్యక్తిగత శుభ్రత, సమాజ శుభ్రత పాటిస్తే తప్పులు అంటగట్టారు. ఇప్పుడవన్నీ ఈ మహా జాఢ్యానికి మందుగా తయారయ్యాయి. సందట్లో సడే మియా అన్నట్టు పాత దినుసులన్నిటికీ గుణాలు అంటగట్టి ప్రచా రంలోకి తెచ్చారు. ‘ఉసిరి’ బంగారం అన్నారు. దాంట్లో ఉన్న రోగ నిరోధక లక్షణాలు అమృతంలో కూడా లేవన్నారు. ఉసిరిగింజ, ఉసిరి పప్పు అన్నీ సిరులేనని ప్రచారం సాగింది. ఇట్లా లాభం లేదని లాభసాటి పథకం తయారు చేశారు. సింగినాదానికి, జీల కర్రకి, పసుపుకి, ఇంగువకి బ్రాండ్ తగిలించి, దానికో పేరు చిరు నామా ఉన్న ముఖాన్ని అడ్డంపెట్టి అమ్మకాలు సాగించారు. అశ్వగంథ, కస్తూరి లాంటి అలనాటి దినుసులకి ఒక్కసారి లెక్కలు వచ్చాయి. ధనియాల నించే కొత్తిమీర మొలకెత్తుతుందని కొన్ని తరాలు కొత్తగా తెలుసుకున్నాయ్. ‘మన వేదాల్లో అన్నీ ఉన్నా యిష!’ అన్నారు పెద్దలు. ఏ మాత్రం విస్తుపోకుండా ‘సబ్బులు మీ చేతి కోమలత్వాన్ని పిండేస్తాయ్ జాగ్రత్త! అందుకని సంప్రదాయ మరియు ప్రకృతిసిద్ధమైన కుంకుడుకాయని మాత్రమే వాడండి’ అంటూ మూడంటే మూడు భద్రాచలం కుంకుళ్లని సాచెలో కొట్టి పడేసి, దానికి రాములవారి బ్రాండ్ వేసి, వెల రూపాయి పావలా, పన్నులు అదనం అంటూ అచ్చేసి అమ్ముతున్నారు. దాన్ని మిం చింది ‘సీకాయ్’ అంటూ పై సంగతులతో మరో బ్రాండు. ఇందులో ఉసిరి గుణాలున్నాయ్, ఇంగువ పలుకులున్నాయ్ అంటూ ట్యాగ్ లైన్లు తగిలించి మార్కెట్లోకి వదులుతున్నారు. మృత్యుభయం ఆవరించి ఉన్నవాళ్లు దేన్ని సేవించడానికైనా రెడీ అవుతున్నారు. దాదాపు ఏడాదిగా ఈ చిల్లర వ్యాపారాలు టోకున సాగుతున్నా, ఏ సాధికార సంస్థా వీటి గురించి మాట్లాడిన పాపాన పోలేదు. మన దేశంలో దేనికీ జవాబుదారీతనం లేదు. వ్యాపారంలో ఒకే ఒక్క ఐడియా కోట్లు కురిపిస్తుందని వాడుక. రకరకాల బ్రాండ్ పేర్లతో శొంఠి, అల్లం, లవంగాలు, వెల్లుల్లి లాంటి ఘాటు ఘాటు దినుసులు ఔషధ గుణాలు సంతరించుకుని ఇళ్లలోకి వస్తున్నాయ్. పెరటిచెట్టు వైద్యానికి పనికిరాదని సామెత. ఇప్పుడు అన్ని రకాల తులసీదళాలు గొంతుకి మేలు చేస్తాయని నమ్ముతున్నారు. ఆ తులసి ఫలానా నేలలో పుట్టి పెరిగితే, అది మరింత సర్వ లక్షణ సంపన్నగా బ్రాండ్ వేస్తే– ఇక దాని గిరాకీ చెప్పనే వద్దు. ‘ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యదు’. ఔను, మర్చేపోయాం గురూ అంటూ అంతా నాలికలు కరుచుకున్నారు. అయితే ఓ చిన్న మెలిక ఉంది. ఆ ఉల్లి ఫలానా గుట్టమీద పండాలి. అప్పుడే దానికి గుణం అని షరతు విధించారు. ఇహ ఆ ఉల్లిని బంగారంలో సరితూచాల్సిందే! పొద్దున్నే పేపర్ తిరగేస్తే, టీవీ ఆన్ చేస్తే రకరకాల వ్యాపార ప్రకటనలు. అన్నీ పోపులపెట్టె సరంజామాలోంచే. మన అమ్మలు, అమ్మమ్మలు చిన్నప్పుడు పోసినవే. ఎవరికీ లేని వైద్య వేదం ఆయు ర్వేదం మనకుంది. అది వ్యాధిని రూట్స్ నించి తవ్వి అవతల పారేస్తుందంటారు. ప్రస్తుతం కూరలు, పళ్లు వాటి ప్రత్యేక ఔషధ గుణాల పేర్లు చెప్పి అమ్ముతున్నారు. పైగా, వాటి శుభ్రత దానికి బ్రాండ్ యంత్రాలు మార్కెట్లోకి వచ్చాయి. కొనగలిగినవాళ్లు ఆన్లైన్లో తెప్పించుకుంటున్నారు. ఉన్నట్టుండి ఒకరోజు ఒంటెపాల ప్రకటన వచ్చింది. అన్నీ ఇమ్యూన్ శక్తి పెంచేవే. చిన్నప్పుడు చందమామ కథలో రాజుగారి వైద్యానికి పులిపాలు అవసరపడటం దాన్ని ఓ సాహసి సాధించడం గుర్తుకొచ్చాయి. చివరకు ఆ సాహసికి అర్ధ రాజ్యం కూడా దక్కుతుంది. స్వచ్ఛభారత్‌ని దేశం మీదకు తెచ్చినపుడు గాంధీగారి ఫేమస్ కళ్లజోడుని సింబల్‌గా వాడుకున్నారు. కరెన్సీ మీద కూడా ఆ కళ్లజోడే! ఎవరో అన్నారు గాంధీజీ వేరుశనగ పప్పులు, మేకపాలు సేవించేవారని చెప్పుకుంటారు. ఈ విపత్కర పరిస్థితిలో మేక పాలను మార్కెట్లోకి తెచ్చి మహాత్ముణ్ణి బ్రాండ్ అంబాసిడర్‌గా వాడుకుంటే.. పరమాద్భుతంగా ఉంటుంది అనే ఆలోచన ఓ కార్పొ రేట్ కంపెనీకి వచ్చింది. మరిహనేం అయితే.. మేకపాలతో పాటు, మేక నెయ్యి కూడా వదుల్దాం, అన్నీ కలిపి ఓ యాడ్‌తో సరి పోతుంది. అనుకున్నారు. పనిలోపనిగా మేక మాంసం కూడా కలి పారు! సేమ్ బ్రాండ్! శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
కొంచెం కొంచెం.. ఇప్పుడిప్పుడే..
కొంచెం కొంచెం, ఇప్పుడిప్పుడే లెక్కలు తేలుతున్నాయ్. క్యాపిటల్ అమరావతి భూకుంభకోణం వ్యవ హారంలో రమారమి నాలుగువేల ఎకరాల బినామీ ఉంటుందని ఆరో పణ. దీనిపై నిజం నిగ్గు తేలాల్సి ఉంది. అయితే, అమరావతి పునాది బినామీ భూముల మీదే పడింద న్నది సత్యం, పునఃసత్యం. అప్పట్లో మన ప్రియతమ ముఖ్య మంత్రి నాలుగు జిల్లాలకి ఆశపెట్టి చివరకు ఆయన కట్ట పెట్టాలనుకున్నవారికి సంపూర్ణంగా న్యాయం చేకూర్చారు. అయితే, అది నెమర్లకు మాత్రం అందడం లేదు. కథ అడ్డంగా తిరిగింది. ముప్పై వేల ఎకరాల పూలింగ్ ఒక చిత్రం. అసలు అంత పచ్చటి భూమి అవసరమా అంటే ఇంకా అవసరం అన్నారు. ప్రధానమంత్రి మట్టి పిడతలతో అనేక నదీ జలాలు, నదుల మట్టి వారి దీవెనలతో రంగరించి క్యాపిటల్ శంకుస్థాపన పవిత్రం చేశారు. ముహూర్త బలం ఉన్నట్టు లేదు. ఆ పునాది ఏ మాత్రం ఎక్కి రాకుండా గుంటపూలు పూస్తోంది. పైగా ఆ గుంటలో నిజాలు రోజుకొక్కటి పూస్తు న్నాయ్. వాళ్లని వీళ్లని ఆఖరికి తెల్లరేషన్ కార్డు వారిని, అసలు కార్డే లేని వారిని బెదిరించి స్వాములు చదరాలు చదరాలుగా భూమి కొనేశారు. ఇక క్యాపిటల్ వస్తే ఆ నేలలో పైకి విస్తరిం చడమేనని కలలు కన్నారు. అసలీ వేళ క్యాపిటల్ ఎక్కడున్నా ఒకటే. ఏడాది కాలంలో కరోనా ప్రత్యక్షంగా బోలెడు పాఠాలు నేర్పింది. గొప్పగొప్ప ఐటీ పార్కులు, సాఫ్ట్వేర్ సామ్రాజ్యాలు ఓ మూలకి ఒదిగిపోయి కూర్చున్నాయ్. వర్క్ ఫ్రం హోం సంస్కృతి వచ్చింది. కాలుష్యాలు తగ్గాయి. ఎవరిల్లు వారి వర్క్ ప్లేస్ అయింది. పెద్ద పెద్ద షోరూములన్నీ ఆన్లైన్లో దర్శనమిస్తున్నాయ్. ఎటొచ్చీ మనీట్రాన్స్‌ఫర్ చేస్తే చాలు ధనాధన్ సరుకు గుమ్మంలో ఉంటుంది. టెలీ మెడిసిన్ ప్రాచుర్యం పొందుతోంది. టెక్నాలజీ రోజురోజుకీ చిలవలు పలవలుగా వృద్ధి చెందుతోంది. ఈ సందర్భంలో ముప్పై వేల ఎకరాల మూడు పంటల భూమి క్యాపిటల్‌కి అవస రమా? టోక్యోలో, కియోటోలో వంద చదరపు అడుగుల్లో కోట్లాది రూపాయల వ్యాపారం నడుస్తుందిట. మనవి అసలే పచ్చని వ్యవసాయ క్షేత్రాలు. రాబోయే రోజుల్లో టెక్నాలజీ ఇంకా ముందుకువెళ్లి అతి తక్కువ స్పేస్‌లో ఇమిడిపోతాయి. అన్ని అవసరాలు తీరుస్తా. నేడు మహా విశ్వం మనిషి గుప్పి ట్లోకి వచ్చేసింది. అతి త్వరలో రానున్న సాంకేతిక విప్లవం అనేక పెను మార్పులు తీసుకురానుంది. ఆధునిక మానవుల్లారా! మనతోపాటు ఒక మట్టి గడ్డ కూడా రాదని తెలిసి నేలమీద భ్రమలు వదలండి. నిన్నగాక మొన్ననే కోవిడ్ నేర్పిన పాఠాలు మన కళ్లముందు కదులుతు న్నాయి. జీవితం క్షణభంగురం, బుద్బుదప్రాయం ఇత్యాది ఎన్నో ఉపమానాలు మనకు తెలుసు కానీ లక్ష్యపెట్టం. ఆఖ రికి ఆరడుగుల నేల కూడా కరువైంది కాదా?! మనది వేద భూమి, కర్మక్షేత్రం. మనది వేదాలు, ఉపనిషత్తులు పండిన నేల. ప్రపంచాన్ని జయించి విశ్వవిజేతగా పేరుపొందిన అలెగ్జాండర్ ది గ్రేట్ భారతీయ రుషి ప్రపంచాన్ని పలక రించాలనుకున్నాడు. తన గుర్రం మీద ఒక రోజు సాంతం తెల్లారకుండానే రుష్యాశ్రమాలవైపు బయలు దేరాడు. దూరంగా ఒక ఆశ్రమం దగ్గర గుర్రందిగి మెల్లగా వినయంగా నడుచుకుంటూ కదిలాడు అలెగ్జాండర్. అక్కడ భారతీయ రుషి అప్పుడప్పుడే లేలేత అరుణ కిరణాలతో ఉదయిస్తున్న సూర్యునికి అభిముఖంగా తిరిగి, రకరకాల భంగిమలలో నమస్కరిస్తూ మంత్రాలతో అర్చిస్తున్నాడు. కాసేపు గమనిం చాడు. విశ్వవిజేతకి ఏమీ అర్థం కాలేదు. నాలుగు అడుగులు ముందుకు వేసి, మహాత్మా! నన్ను అలెగ్జాండర్ అంటారు. విశ్వవిజేతని. ఈ మహా ప్రపంచంలో నాది కానిది ఏదీ లేదు. మీ దర్శనభాగ్యం అబ్బింది. చెప్పండి. తమరికేమి కావాలో ఆజ్ఞాపించండి. మీ పాదాల వద్ద పెట్టి వెళ్తాను. సంకోచించ కండి అంటూ ప్రాధేయపడ్డాడు. రుషి ఒక్కసారి వెనక్కు తిరిగి ప్రతి నమస్కారం చేశాడు. ‘అయ్యా, ధన్యవాదాలు. ప్రస్తుతానికి నాకేమీ అవసరం లేదు. కాకపోతే చిన్న విన్నపం. మీరు కొంచెం పక్కకి తప్పుకుంటే, నాపై ఎండపొడ పడు తుంది. సూర్య భగవానుడి స్పర్శ తగులుతుంది. అదొక్కటి ప్రసాదించండి చాలు’ అన్నాడు రుషి. వేద భూమి నిర్వచనం విశ్వవిజేతకి అర్థమైంది. తర్వాత కాలం చెల్లి అంతటి విశ్వవిజేతా గతించాడు. నన్ను అంతిమయాత్రగా తీసుకువెళ్లేటప్పుడు, నా రెండు చేతులూ బయటకు ఉంచి, ఇంతటి విజేత ఆఖరికి రిక్త హస్తాలతో వెళ్తున్నాడని సాటివారికి ఎరుకపరచండి. నా జీవితం కడసారి ఈ సందేశం జాతికి ఇవ్వాలని విన్నవిం చుకున్నాడు. చాలా చిన్నది జీవితం. చేయతగిన మంచి ఇప్పుడే చేయాలి. వేలాది ఎకరాలు వీపున పెట్టుకు వెళ్తామని ఆశించవద్దు. అది జరిగే పని కాదు. వ్యాసకర్త : శ్రీరమణ, ప్రముఖ కథకుడు -
రంగస్థలంపై 80 వసంతాలు
పౌరాణిక రంగస్థలంపై 80 వసంతాల ఉప్పాల రత్తయ్య మేష్టారు! మేష్టారే కాదు, ఆ రోజుల్లో ఉప్పాల వేంకట రత్తయ్యగారు ‘స్టారు’ కూడా! మా చుట్టు పక్కల ఎక్కడ పౌరాణిక నాటకం ఆడుతున్నా, మైకుల్లో చెబుతూ కర పత్రాలు పంచేవారు. అవి పోగు చేయడం చిన్నతనపు సరదాలలో ముఖ్యమైంది. ఆ కరపత్రాలలో మా మేష్టారి ఫొటో దాని పక్కన ఆయన హావభావాల గురించి నటనాను భవం గురించి రెండు వాక్యాల్లో అచ్చువేసేవారు. చివర్లో షరా మామూలే. స్త్రీలకు ప్రత్యేక స్థలము గలదు అని ఉండేది. ఆ కరపత్రాలు చదువు కోవడా నికి భలే తమాషాగా ఉండేవి. బెజవాడ రేడియో ద్వారా కూడా ఆయన సుప్రసిద్ధులు. మా తెనాలి ప్రాంతం నేల, నీరు, గాలి తెలుగు పౌరాణిక నాటక పద్యాలను కలవరిస్తుండేవి. మరీ ముఖ్యంగా పాండవో ద్యోగ విజయాలు మొదలు బ్రహ్మంగారి నాటకం ద్వారా టికెట్ డ్రామాలు ఫ్రీ డ్రామాలు సదా నడుస్తూనే ఉండేవి. ప్యారిస్ ఆఫ్ ఆంధ్రాగా పేరుపొందిన తెనాలి టౌను పౌరాణిక డ్రామా వ్యాప కానికి ‘మక్కా’గా ఉండేది. కిరీటాలు, పూసల కోట్లు ధరించి లైటింగుల మధ్య నిలబడాలంటే తెనాలి చేరాల్సిందేనని వాడుక ఉండేది. ఎక్కడో ‘రాముడు వలస’ నించి వలసవచ్చి పిశుపాటి నరసింహమూర్తి కృష్ణ వేషధారిగా ఎనలేని ఖ్యాతి గడించారు. వేమూరు గగ్గయ్య, రామయ్యగార్లు నాటక రంగాన్ని, తెలుగు సినిమా రంగాన్ని సుసంపన్నం చేశారు. ఆ రోజుల్లో తెనాలిలో కొన్ని వీధుల్లో నడుస్తుంటే ఖంగున డబుల్ రీడ్ హార్మోణీ పెట్టెలు వినిపించేవి. ఎందరో మహా నుభావుల సరసన దశాబ్దాల తర బడి కమ్మని గాత్రంతో శ్రోతల్ని అలరించిన అదృష్టవంతులు ఉప్పాల రత్తయ్య మేష్టారు. శనగవరపు, ఓగిరాల, ఆరేళ్ల రామయ్య లాంటి తర్ఫీద్ ఒజ్జలుండేవారు. పంచ నాథం లాంటి ఆల్‌రౌండర్లు తెనాలిలోనే దొరికేవారు. డ్రెస్ కంపెనీలు, తెనాలి ప్రెస్సుల్లో ప్రసిద్ధ రంగస్థల నటుల ఫొటో బ్లాకులు రెడీగా దొరికేవి. రావికంపాడు మొసలి పాడు గ్రామాలు కవల పిల్లల్లా జంట నగరాల్లో కలిసి ఉంటాయి. గుమ్మడి గారు పుట్టి పెరిగిన ఊరు. రత్తయ్య మేష్టారంటే గుమ్మడి గారికి ఎనలేని గౌరవం. మద్రాసులో వారిని ఎప్పుడు కలిసినా మొట్ట మొదటగా మేష్టారి యోగక్షేమాలు అడిగి తెలుసుకునేవారు. రత్తయ్య గారిది ఫెళఫెళలాడే గాత్రం, స్పష్టమైన వాచకం, భావం తెలిసి పద్యం పలికించే విధానం ఉప్పాల రత్తయ్యగారి స్వార్జితం. వేదిక మీద సహనటుల శృతుల్ని మతుల్ని వారి స్థాయిలను కలుపుకుంటూ, కాడిని లాగుతూ నటరాజు రథాన్ని ముందుకు నడిపించడం మేష్టారికి పుట్టుకతో వచ్చిన విద్య. ఆయన చాలామంచి సంస్కారి. ఎన్నో దశాబ్దాల స్టేజి అను భవం, పెద్దల సాంగత్యంతో నిగ్గుతేలిన సమయస్ఫూర్తి మేష్టారి నట జీవితానికి వన్నె కూర్చాయి. ఒకనాటి సురభి నాటకాల పంథాలో క్రమశిక్షణ ఆయన అలవరచుకున్నారు. సురభిలో ఎవరు ఏ వేషాన్నైనా ధరించి లీలగా, అవలీలగా పోషించి నాటకాన్ని రక్తి కట్టించేవారు. మా మేష్టారు పలు సందర్భాలలో పలు పాత్రలు పోషించడం నేను చూశాను. ఒక్కొక్క పాత్ర హావభావ ఉచ్ఛారణలు ఒక్కోలా ఉంటాయి. నడకలు, నవ్వులు ఎవరివి వారివే. వాటిని గుర్తెరిగి ప్రేక్షక శ్రోతల్ని రంజింప జేయాలి. అలాంటి స్వస్వరూప జ్ఞానం పుష్కలంగా కలిగిన విద్వన్మణి రత్తయ్యగారు. పైగా మేష్టారు నాడు కలిసి నడిచిన నటీనటులు అగ్రగణ్యులు, అసామాన్యులు! అన్నీ నక్షత్రాలే! అదొక పాలపుంత వారంతా ఆదరాభిమానాలతో గౌరవంగా రత్తయ్యగారిని అక్కున చేర్చుకున్నారు. అందరూ మన ట్రూప్ వాడే అని మనసా భావించే వారు. పౌరాణిక నాటక రంగంపట్ల మేష్టారికి గల అవ్యాజమైన ప్రేమాభిమానాలను వారి సమకాలి కులంతా గ్రహించి, గుండెలకు హత్తుకున్నారు. నాడు నాటకరంగం గొప్ప ఆదాయ వనరైతే కాదు. కీర్తి ప్రతిష్టలా అంటే అదీ కాదు. తిన్న చోట తినకుండా తిరిగిన చోట తిరగక సరైన వసతులు లేక సకాలంగా గ్రీన్రూమ్కి చేరు కుంటూ జీవితం గడపాలి. చెప్పిన పదీ పాతిక ఇస్తారో లేదో తెలి యదు. ఉంగరాలు తాకట్టుపెట్టుకుని గూటికి చేరిన సందర్భాలు ప్రతివారికీ ఉండేవి. అయినా అదొక పిచ్చి. మేష్టారు మంచి క్రమశిక్షణతో, అలవాట్లతో ఈ ప్రపంచంలో ఉంటూ ఉత్సాహ ఆరోగ్యాల్ని కాపాడుకున్నారు. నిత్య విద్యార్థిగా కావాల్సినంత ప్రతిభని, అనుభవాన్ని గడించుకున్నారు. మా గ్రామంలో (వరహాపురం) ఉప్పాల రత్తయ్య మేష్టారు కొంతకాలం పని చేశారు. మా వూళ్లో పౌరాణిక నాటక పునర్ జాగృతికి ఆయన కృషి చేశారు. ఆ విధంగా ఆయన మేలు ఎన్నటికీ మావూరు మర్చిపోదు. వ్యక్తిగతంగా ఎక్కడ ఆనందపడ్డారో అదే ఆనందం తనకు తెలిసిన ప్రతిభా వంతులకు పంచివ్వాలని సరదా పడేవారు. చేతనైన మేర చేసేవారు. సంస్కారశీలి. ‘చీకట్లను తిట్టుకుంటూ కూర్చోవద్దు. చిరు దీపాన్నైనా వెలిగించు’ అని చెప్పిన ప్రవక్త మాటల్ని తన జీవితంలో అక్ష రాలా అమలుపరిచిన ధన్యజీవి రత్తయ్య మేష్టారు. ఇంతటి సుదీర్ఘ చరిత్ర ఎవరికైనా అరుదు. పద్య నాటకానికి కళాకాంతి జనం వన్స్మోర్లు. మా మేష్టారి వేయిపున్నముల ఈ బంగారు చరిత్రకి మా తెనాలి నేల చప్పట్లతో ‘వన్స్‌మోర్’ కొడుతోంది. నిత్యగారాల పంటగా శృతి సుఖంగా వర్ధిల్లండి! వారిని మేమూరు శ్రీలక్ష్మీ గణపతి స్వామి ఆయురారోగ్య ఐశ్వర్యాలిచ్చి కాపాడుగాక! శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ఆదర్శాలకు గుడి కట్టద్దు
రాములు ఎందరు రాములు?! కౌసల్య రాముడు, దశరథ రాముడు, అయోధ్య రాముడు, కోదండ రాముడు, సీతారాముడు, సకల గుణాభిరాముడు, ధర్మమే మహామాన వుడిగా భువికి దిగివచ్చిన అవతారం. ధర్మరక్షణ కోసం ఎన్ని కష్టాలు పడ్డాడో రామాయణం చెబుతుంది. అందుకే రామకథ విశ్వవ్యాప్తమైంది. రాముడూ విశ్వమంతా వ్యాపించి నీరాజనాలందుకుంటున్నాడు యుగయుగాలుగా. అయోధ్య, మిథిల, కిష్కింధ, లంక రామకథలో ముఖ్య భూమికలు పోషిం చాయి. అయోధ్య రాముడు పుట్టినచోటు. పెళ్లికొడుకై సీతాప తిగా ఊరేగిన నగరం మిథిల. కష్టకాలంలో కావల్సిన బలగా లను సమకూర్చుకున్న నేల కిష్కింధ. అంతేనా, హనుమలాంటి సర్వసమర్థుడు, విద్యావేత్త కిష్కింధలోనే రాముడికి దొరికాడు. నమ్మిన బంటుగా రామ చరితను రసరమ్యంగా నడిపించాడు. అప్పటిదాకా అయ్యో పాపం అనుకుంటూ నీరుకారిపోతున్న జనావళికి ఒక కొత్త వెలుగై హనుమ ముందుకు నడిపిస్తాడు. ఎంతటి కార్యమైనా సుసాధ్యతయే తప్ప అసాధ్యమెరుగని మహనీయుడు. రామా జ్ఞకి బద్దుడై సంజీవి పర్వతాన్ని పెకిలించి తెచ్చి, చేతులమీద నిలుపుకున్నవాడు. ఇతనే నా పూజాఫలం అనుకుని రాముడు ప్రేమగా హనుమని ఆలింగనం చేసుకున్నాడు. ‘నాకిది చాలు’ అనుకున్నాడు యోగి పుంగవుడు హనుమంతుడు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి స్పీకర్ అయ్యదేవర కాళేశ్వరరావు తన చైనా యాత్రను సవివరంగా రచించారు. అందులో ఆయన– చైనా నేత మావో ఆఫీస్ చాంబర్లో మన హనుమంతుడి వర్ణచిత్రం గోడకి చూసి నివ్వెరపోయారట! ‘ఈయన మా పురాణ పురుషుడు..’ అంటూ ప్రశ్నార్థకంగా ఆగిపోయారట అయ్యదేవర. వెంటనే ఆ కమ్యూనిస్టు నేత, ‘ఔను, నాకు తెలుసు. ఆయన గొప్ప కార్యకర్త. రాజు ఒక పని అప్పగిస్తే దాన్ని సమగ్రంగా నిర్వర్తించి తిరిగి కనిపించే కార్యదక్షుడు. పడిన కష్టాల జాబితా వల్లించకుండా ‘వెళ్లినపని అయింది. సీత జాడ దొరికింది’ అని మూడు ముక్కల్లో చెప్ప డంలో ఆయన గుణగణాలన్నీ అర్థమవుతాయి. ఒక సలక్షణ మైన కార్యకర్తకి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఆయనలో ఉన్నాయి. వెళ్లేటప్పుడు ఎక్కడా క్షణంసేపు ఆగలేదు. వచ్చేట ప్పుడు తీరికగా మిత్రమూకతో వినోదిస్తూ తన రాజుకి పరో క్షంగా శుభ సందేశం చేర్చాడు. ఆయన అసామాన్యుడు. ప్రపంచంలో ఏ కార్యకర్తకైనా ఆదర్శప్రాయుడు. అందుకే ఆయ నకు సమున్నత స్థానం ఇచ్చానని మావో వివరించారట. ఎక్కడా ఏ యుగంలోనూ, ఏ చరిత్రలో, ఏ పురాణంలో ఒక బంటుకి ఆలయాలు నిర్మించి రాజుతో సమంగా పూజ లందించే వైనం కనిపించదు. ఆ మర్యాద అందుకున్న మహ నీయుడు ఆంజనేయస్వామి మాత్రమే. తిరిగి ఇన్నాళ్లకి అయో ధ్యలో రామమందిరం చిగురించడంతో యావద్భారతావనిలో వసంతోదయమైంది. న్యాయం, ధర్మం తిరిగి నిలదొక్కుకున్నా యని భారతజాతి మొత్తం నమ్మి ఆనందపడింది. మనుషులకి గుడి కట్టడం మన శాస్త్రంలో లేదు. రాముణ్ణి ఆది నించి భక్తులు దేవుడిగానే కొలిచారు. ఎంతటి చక్రవర్తి కుమారుడైనా పర్ణశా లల్లో, పందిళ్లలో ఒదిగి ఉండటం ఆయన మతం. ఇప్పుడూ అంతేలా జరిగింది. ఆయనతోనే సీత. ఆ పాదాల చెంతనే హనుమ. శ్రీ సీతారామ కళ్యాణమంత తీయగా, చెరకు పానక మంత కమ్మగా అయోధ్య భూమిపూజోత్సవం జరిగింది. ఓ పనై పోయిందని ఆదర్శాలను పక్కనపెట్టి, రాముడికి పూజలు, హారతులు, సేవలు, నైవేద్యాలను సమర్పిస్తూ, వాటిని హైలైట్ చేస్తూ జన సామాన్యాన్ని మభ్యపెట్టకూడదు. వారూ, వీరూ అని లేకుండా ఈ ఉత్సవం, ఆలయం సర్వమత సామరస్యానికి ప్రతిబింబంగా నిలుస్తుందని ఆకాంక్షించారు. తథాస్తు! పురుషో త్తముడన్న సార్థక నామధేయం పొందినవాడు రాముడు. నరేంద్ర మోదీ ప్రధానిగా ఉండగా ఈ మహత్తర కార్యక్రమం జరగడం ఆయన పూర్వజన్మ సుకృతం. ఈ సందర్భంగా జనం పులకించిపోయారు. నిజంగా, మన రామభక్త హనుమాన్ బాపు ఉండి ఉంటే ఎంత ఆనందపడేవారో? చూస్తూ ఎన్ని బొమ్మలు వేసేవారో? జీవితకాలంలో బాపు అనేకసార్లు రామాయణానికి బొమ్మలు రచించారు. సెల్యులాయిడ్‌పై పలుసార్లు రామకథ తీశారు. నాటి ప్రధాని వాజ్‌పేయి బాపు రామాయణ పోస్టర్లని పార్ల మెంట్ సెంట్రల్ హాల్లో ఆవిష్కరించారు. కపీశ్వరుణ్ణి బాపు చిత్రించినంత అందంగా మరొకరు చిత్రించలేరు. దీక్షగా రామ బొమ్మలు మధురాతిమధురంగా వేలకొద్దీ గీసిన కర్మయోగి బాపు. అయోధ్య ఆలయ ప్రాంగణ మ్యూజియంలో బాపు రాముడికి దోసెడంత చోటు కల్పించాలి. ఇది తెలుగువారి కోరిక, అభ్యర్థన. (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
జగన్నాథ రథ చక్రాల్!
ఆరోగ్యశ్రీ పథకం మరో ఆరు జిల్లాలకి విస్తరించడం ఆనం దంగా ఉంది. చికిత్స ఉన్నా డబ్బుల్లేక మరణించడం చాలా దీనం. ఔను, గత ప్రభుత్వం హయాంలో ఆరోగ్యశ్రీ రోగు లపై చిన్నచూపు ఉండేది. కారణం వారివల్ల పడకలు నిండుతాయ్ గానీ గల్లాపెట్టెలు నిండవు. వారి బిల్లులు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నించి రావాలి. అందునా చంద్ర బాబుకి విపరీతమైన ‘ధనబద్ధకం’ చేసిన చేతులకి ఎప్పటికి డబ్బు వస్తుందో ఆస్పత్రులకి తెలియదు. అందుకని రోగుల్ని అరువు కేసులుగా భావించేవారు. ఇప్పుడు జగన్ వేలకోట్ల బకాయిలు తరుగులు లేకుండా చెల్లించారు. ఆరోగ్యశ్రీ పేషెంట్లు దర్జాగా తలెత్తుకుని వైద్యంకోసం వెళ్లాలని ఆకాంక్షించారు. అరువుని చిన్న బస్తీల్లో ‘గాత్రం’ పేరుతో వ్యవహ రిస్తారు. చాలా అవమానంగా అరువు బేరాన్ని చూస్తారు. నా చిన్నతనంలో సొంత అనుభవాలు.. కాదు అవమా నాలు నేను ఎన్నటికీ మర్చిపోలేను. మా నాన్న పల్లెటూరి బడిపంతులు ఉద్యోగం చేస్తుండేవారు. ఆ వచ్చే వందలోపు జీతం ఆరునెలలకో, తొమ్మిది నెలలకో విడు దల అయ్యేది. ఈలోగా అరువు బతుకులు వెళ్లదీస్తూ ఉండేవాళ్లం. రోజూ పాలుపోసే మంగమ్మ ఎన్ని నీళ్లు కలిపినా అడగటానికి లేదు. ఎందుకంటే అరువు. బియ్యంలో రాళ్ల గురించి నోరు విప్పకూడదు. ఇక చిల్లరకొట్టు షావుకారు దయమీద, శాంక్షన్ మీద ఆధార పడి సరుకులు వచ్చేవి. అమ్మ ఇచ్చిన జాబితాలో వీశ ఉంటే అరవీశ, సవాశేరు ఉంటే సవా పావు చాలని పొట్లాలు కట్టేవాడు. ఒకసారి పట్టీలో కొబ్బరికాయ రాసి వుంటే, ‘ఎందుకయ్యా రూపాయి పావలా టెంకాయ’ అన్నాడు వ్యంగ్యంగా కొట్టు షావుకారు. ‘దేవుడికి’ అన్నాను. పెద్దగా నవ్వి, ‘మీ అరువు రావాలని మేం కొట్టుకోవాలి దేవుడికి కొబ్బరికాయలు. మీకెందుకు బాబూ!’ అని ఎద్దేవా చేశాడు. నాకు పిచ్చి కోపం వచ్చింది. కానీ దరిద్రం సహ నాన్ని నేర్పుతుంది. అరువు కస్టమర్లు హేళనలు భరించా ల్సిందే! రేవులో నావ దగ్గర కూడా, డబ్బున్నవాళ్లు ముందు ఎక్కండి.. లేనోళ్లు కాస్త ఆగండి’ అని అరుస్తూ ఉంటాడు సరంగు. అరువు బేరాల్లో తూకంలో తేడా ఉంటుంది. కాటాని గమనిస్తున్నా కిమ్మనడానికి భయం. ఖాతాలో పుస్తకంలో కూడా అంతో ఇంతో హెచ్చుగానే అంకెలు పడేవి. ఇంటికెళ్లాక నాన్న కూడా చూసీ చూడ నట్టే ఉండేవారు. చిన్నతనంవల్ల అజ్ఞానం వల్ల నెత్తురు వేడెక్కేది. పెద్దయ్యాక వీళ్లందర్నీ గొడ్డలి, కొడవళ్లతో నరికెయ్యాలనుకునేవాణ్ణి. అవేం చెయ్యలేక పోయాగానీ జీవితంలో అరువుబేరాలు చెయ్యరాదని శపథం చేశా. ఉంటే తినడం లేదంటే లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తరాలుగా కలిగిన కుటుంబంలో పుట్టి పెరిగినా బకాయి వ్యవహారాల్లో ఉండే చిన్నచూపు గురించి ఆయనకు ఎట్లా తెలుసో, బడుగుల అసలైన నేతకి తెలిసి ఉండటం చాలా ముఖ్యం అనిపించింది. ఊరికే ప్రతిమాటకి ముందూ ఆత్మ గౌరవం నినాదాన్ని పలికితే చాలదు. ధనబద్ధకం వది లించుకుని చేతల్లో చూపించాలి బాబూ! జనం ఏదీ పట్టించుకోరనీ, మన సుదీర్ఘ సుత్తి ప్రసంగాలకు పడిపోతారనీ భ్రమలో ఉండకూడదు. నిజానికి ఆభ్రమే చంద్రబాబుని భూస్థాపితం చేసింది. చంద్రబాబు ఉత్తుత్తి మాటలు.. జరిగిన ఎన్నికలు కాదు, జరగబోయే మరో రెండు ఎన్నికల దాకా సరిపడే ప్రఖ్యాతిని మూటకట్టి ఇచ్చాయి. దేవుడి దయవల్ల సకాలంలో వర్షాలు పడుతున్నాయి. నేల తడిస్తే రైతుల మనసులు చల్లపడతాయి. ఇప్పుడు రైతులు క్యాపిటల్ ఎక్కడున్నా పట్టించుకోరు. ఈ సంవత్సరం రుతుపవనాలు అనుకూలంగా ఉంటాయ్. రైతుల కృషి ఫలిస్తుంది. సర్కార్ చేయూత పుష్కలంగా ఉంది, ఇంకా ఉంటుంది. కాసేపు అర్థం పర్థం లేని విమర్శల్ని ఆరోపణల్నీ పక్కనపెట్టి, ప్రజలకి మేలు కలిగే సూచనలు ఇవ్వండి. ఎన్ని మాటలైనా బుక్కెడు కొర్రలకు సరికావని సామెత. శ్రీశ్రీ మహాకవి ఏనాడో ‘‘ఏడవకండేడవకండి, నేనున్నా నేనున్నా పతితు లార! భ్రష్టులార! బా«ధాసర్పద్రష్టులార!’’ అని ఎలుగెత్తి పాడినపుడు అదో కలవరింత అనిపించింది. కానీ ఇప్పుడు ‘జగన్ నాథ రథ చక్రాలొస్తున్నాయ్, వస్తు న్నాయ్!’ అనే సింహగర్జన నిజం.. ముమ్మాటికీ నిజం అనిపిస్తోంది. ఆరోగ్యశ్రీ విస్తరణతో అందరికీ కొత్త బతు కులు, కొత్త ఆశలు ప్రసాదించిన జననేతకు సర్వం శుభ మగుగాక! దీర్ఘాయుష్మాన్ భవ! శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
మాట్లాడే బొమ్మ
‘‘నగరవాసులు తాము మేధావులమని భావిస్తారు గాని పల్లెల్లో ఉండేవారే చాలా సున్నితంగా ఆలో చిస్తారు. చాలా పరిశీల నగా ప్రతి చిన్న విష యాన్ని గమనిస్తూంటారు. చూశారా! యీ మధ్య యన్టీఆర్ మళ్లీ ఫ్రేములోకి వచ్చారు’’ అంటూ మా ఊరి ఓటరు మాట ప్రారంభిస్తే నాకేమీ అర్థం కాలేదు. పిచ్చి చూపు చూశాను. మా ఓటరు నవ్వి, ‘‘అదేనండీ జనంలో తనమీద నమ్మకం పడి పోయిందని సందేహం వచ్చినప్పుడల్లా చంద్ర బాబు అన్నగారి బొమ్మని దగ్గరకి తీసుకుంటారు. గమనించండి కావలిస్తే, యీ మధ్య ఒకే ఫ్రేములో యిద్దరూ సన్నిహితంగా కనిపిస్తున్నారు’’ అంటూ నావంక చూశాడు. నిజమే కావచ్చు గాని నేనె ప్పుడూ మా ఓటరు చూసినంత యిదిగా గమనిం చలేను. నేను మర్యాదకి ఔనన్నట్టు తలూపాను. ఓటరు మరోసారి నవ్వి, అన్నగారే పక్కన కూకుని నడిపిస్తున్నారన్న భ్రమ కలిగించే కోణంలో ఆ బొమ్మని పెట్టుకుంటున్నారీ మధ్య. అసలు అదెట్టా వుంటదంటే, అక్కడక్కడ తీర్థంలో తిరునాళ్లలో మాట్లాడే బొమ్మని చేతిలో పట్టుకుని ఒకాయన కనిపిస్తూ వుంటాడు. ఆ బొమ్మచేత చమత్కారంగా మాటలు చెప్పిస్తూ ఉంటాడు. నిజానికి బొమ్మ మాటలన్నీ ఆయనే మాటలాడతాడు, ఇక్కడ గారడీ ఏమిటంటే పెదాలు కదలకుండా మాట్లాడే కళని ఆయన నేర్చుకుంటాడు. చూసే వాళ్లకి వినేవాళ్లకి వినోదంగా, విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు నిజంగా మన వూరి రచ్చబండ జనాభాకి అన్నగారు మాట్లాడే బొమ్మలాగే కనిపిస్తున్నారు. రాష్ట్రంలో ఏం జరిగినా ఏ మంచి చేసినా దాన్ని క్షణంలో తిరగేసి దానికో వక్రభాష్యం చెప్పేసి హాయిగా ఓ పని అయిపోయిందన్నట్టు రిలాక్స్ అవటం చంద్రబాబుకి అలవాటు అయిపోయింది. కోట్లాది రూపాయలు, లక్షలాది కుటుంబాలకు సరాసరి తరుగులు లేకుండా పంచిపెడుతుంటే, ఓస్, యిదేనా... యిది తెలుగుదేశం బ్రెయిన్ చైల్డ్. ఆలోచించి... చించి డిజైన్ చేసింది నేనే! దాన్ని కొంచెం పాడుచేసి యీ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇదొక పెద్ద మోసం. అంటూ చంద్రబాబు అంటుంటే అనుచరగణం అందుకు కోరస్ పాడుతోంది. టీడీపీ ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోవాలి. ఆధునిక ఆంధ్రప్రదేశ్ ఓటర్లు అంత సునాయాసంగా మోసపోయే దశలో ఉన్నారా? ఉండి ఉంటే బాబూ! మీ పార్టీకి ఇలాంటి దశ పడుతుందా? వాళ్లు అనుభవంతో చేవతేలారు. చంద్రబాబు హయాంలో వారు చెప్పుడు మాటలు వినీ వినీ చెడ్డారు. ‘‘అయన పుణ్యమా అని రాటు తేలాం’’ అంటున్నారు వాళ్లు. అసలు అయినా ఎందుకీ అక్కర్లేని రాద్ధాం తాలు. టీడీపీ హయాంలో ఏ సంక్షేమ పథకాలకి ఎంత ఖర్చు చేశారో నిజంగా జనం చేతులకి అందాయో చెప్పండి. ఇప్పుడు ఎంతెంత అందు తున్నాయో చూడండి. ప్రతిదీ మైకు ముందు ఖండిస్తే చెల్లిపోతుందని మునుపటిలాగే చంద్ర బాబు భ్రమలో వుంటున్నారు. ముందు ఆయన ఆ పూర్వపు భ్రమలోంచి బయటపడాలి. అది చాలా మంచిది. అవసరం కూడా. ప్రతిరోజూ చంద్రబాబు వదిలిపెట్టిన బకాయిలు వందల వేల కోట్ల రూపా యలు వద్దన్నా వార్తల్లోకి వస్తున్నాయి. వాటి గురించి మాట్లాడరు. అమరావతి నూతన క్యాపి టల్ గురించి మాట్లాడతారు. చంద్రబాబు హయాంలో లండన్‌లో ప్లాన్లు గీయించారు, సింగపూర్‌తో చర్చలు నడిపారు. జపాన్‌తో యింకేదో జరిపారు. అయిదేళ్లలో వీసమంత పని జరగలేదు. భూములిచ్చిన వారిని ఒకే భ్రమలో ఒక రంగుల కలలో వుంచారు. అదేదో బంగారు గుడ్లు పెట్టే బాతుగా అభివర్ణించి చెబుతున్నారు. ఒక క్యాపిటల్ దానికి తగ్గట్టు ఉండాలి గాని టూరిస్ట్ కేంద్రంగా ఉండాల్సిన అవసరం లేదు, ఆదాయం వచ్చే క్యాపిటల్‌ని చెయ్యాలనుకుంటే, హాయిగా మన నేటివ్ జూదాలు అంటే కోడి పందాలు, పేకాట లాంటి వాటిని అధికారికంగా నడిపిస్తే పిచ్చ బోలెడు ఆదాయం! మద్యానికి మూతలు తీసి విచ్చలవిడిగా అమ్మి సొమ్ము చేసు కున్న చరిత్రగల గత పాలకులకు ఇందులో ఏ మాత్రం తప్పు అనిపించకపోవచ్చు. వ్యాసకర్త: శ్రీరమణ ప్రముఖ కథకుడు -
ఆత్మస్తుతి–పరనింద
ఫలానా వారు పవర్లో వుండగా కోట్లాది రూపాయల కుంభకోణం జరిగింది. అతి పెద్ద సంస్థ నిర్ధారించగానే ‘బాబోయ్ యిందులో అక్రమాలు లేవు కేవలం కక్ష సాధింపు చర్య’’ అంటూ ప్రభుత్వం మీద ఎదురుదాడికి దిగడం పరిపాటే! ఇది యిప్పుడు మొదలైన సీన్ కాదు అనాదిగా వస్తున్నదే. అక్రమాలు చేసిన వారెవరైనా ‘‘చేశాం’’ అని అంగీకరిస్తారా? ఇక అలా అంగీకరిస్తే ధర్మం నాలుగు పాదాలు నడుస్తున్నట్టే లెక్క. ఇక అప్పుడు సీబీఐలు, సిట్లు, కోర్టులు ధర్మాసనాలతో పని ఏముంది. ఎప్పుడు రాజకీయం ఒక ఖరీదైన వ్యాపారంగా మారిందో ఇక అప్పుడంతా బ్రోకరేజీలే మిగిలాయి. చంద్రబాబుకి పుట్టుకతో వచ్చిన వీక్నెస్ ఒకటుంది. అదేంటంటే ఆయన మాత్రమే కుర్చీలో కూర్చోవాలనే ప్రగాఢ వాంఛ. జగన్ పవర్లోకి వస్తారని చంద్రబాబు కలలో కూడా ఊహించలేదు. దృశ్యం తిరగబడేసరికి ఆయన పూర్తిగా తూకం కోల్పోయారు. జగన్ ఏడాది పాలనలో జరిగిన ఏ మంచిమార్పుని బాబు హర్షించలేక పోయారు. అన్నింటికీ ఏవో స్వప్రయోజనాలున్నాయని జనంలోకి నిత్యం వచ్చే ప్రయత్నం చేశారు. దాంతో లీడర్‌గా చంద్రబాబు క్రెడిబిలిటీ బొత్తిగా అడుగుమాడిపోయింది. ఇప్పుడాయన దేశభక్తిగీతం పాడినా జనం నమ్మే స్థితిలో లేరు. తనుకాకుండా ఇతరులెవరు కుర్చీలో వున్నా చంద్రబాబు రోజులు లెక్కపెట్టుకుంటూ వుంటారని ఆయన వర్గీయులే అనుకుంటూ వుంటారు. యన్టీఆర్నే లాగేసి తాను∙కుర్చీ ఎక్కిన అసహనం గురించి అందరికీ తెలుసు. టీడీపీ హయాంలో విచ్చలవిడిగా ప్రజాధనం దారి తప్పిందని అప్పుడే జనం కనిపెట్టారు. దానికి సాక్ష్యం భయంకరమైన ఓటమి. ప్రస్తుత వలసల్ని చూస్తుంటే పార్టీలో చంద్రబాబు కూడా మిగుల్తారో లేదో అని సందేహంగా ఉంది. అతి త్వరలో ప్రతిపక్ష హోదా జారిపోవడం మాత్రం ఖాయం. జగన్ పాలనలో అధికార వికేంద్రీకరణ గ్రామ సచివాలయ పథకం మీకు నచ్చలేదా? అలాగే దశలవారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తానని, దాన్ని అమలు చేయడం తమరికి నచ్చలేదా? స్త్రీ జన పక్షపాతిగా, రైతుమిత్రగా జగన్ యిప్పటికే మన్ననలు అందు కుంటున్నారు. ఆలకించేవారికి, అమలు చేసేవారికి నిజంగా పనికొచ్చే సూచనలు చెయ్యాలనిపిస్తుంది. ప్రతి గ్రామంలో ప్రభుత్వ పక్షాన కొందరు వాలంటీర్లు బాధ్యతగా రాత్రి, పగలు పనిచేస్తున్నారు. బాగుంది. 1980 దశకంలో తమిళనాడు నాటి జననేత ఎమ్జీఆర్ ఒక పథకం ప్రవేశపెట్టారు. పట్టణాలలో, నగరాలలో ఉద్యోగకల్పన, ఉపాధి కల్పన కోసం ఐటీఐలాంటి చిన్నచిన్న సాంకేతిక చదువులు చదివిన వారికోసం వూరూరా స్వయం ఉపాధి కేంద్రాలు ప్రారంభించారు. నగర సెంటర్లో ఒక గది, అక్కడ అందుబాటులో ఒక ఫోను వుండేది. అక్కడ ఎలక్ట్రీషియన్, ప్లంబర్, వెల్డర్, కార్పెంటర్, ఇతర సాంకేతిక నిపుణులు ఒకే వెంచర్లో పిలిస్తే పలికేవారు. ఏ పనులున్నా పిలవగానే వచ్చి చేసి వెళ్లేవారు. పనినిబట్టి ప్రభుత్వం నిర్ణయించిన చార్జీలు తీసుకుని వెళ్లేవారు. ఇప్పుడు యీ స్కీమ్‌ని ఏపీ ప్రభుత్వం కొన్ని కూర్పుచేర్పులతో అమలులోకి తేవచ్చు. అప్పట్లో పనిచేసి ఆర్మీనించి వచ్చేసిన వారు సెక్యూరిటీ గార్డ్స్‌గా సేవలందించేవారు. ఎన్నోరకాల సర్వీసులు లభించేవి. ట్రాక్టర్, కారు డ్రైవర్లు పిలిస్తే పలికేవారు. దీనివల్ల నిత్యం చాలామందికి సిటీల్లో పని దొరికేది. జగన్ సర్కార్ దీన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టి చూడవచ్చు. కావాలంటే వారికి సాధారణ భృతిగా నెలకి రెండుమూడు వేలు ప్రభుత్వం ప్రోత్సాహకరంగా చెల్లించవచ్చు. ఇవి పల్లెల్లోనే కాదు విజయవాడ, గుంటూరు లాంటి పట్టణాలలో ఎక్కువ వుపయోగపడతాయి. కనీసం పదిమందికి మెరుగైన ఉపాధి చేకూరుతుంది. కొన్ని ప్రత్యేక సందర్భాలలో వారంతా ప్రభుత్వ వాలంటీర్లుగా కోరిన సేవలు అందిస్తారు. చంద్రన్న నిరుద్యోగ భృతిద్వారా మోసపోయిన యువతకి కొంత ఊరట కూడా. మన దేశం పల్లెలు పునాదులుగా పుట్టి పెరిగింది. చంద్రబాబు దృష్టిలో పల్లెలకు గౌరవం లేదు. వ్యవసాయం లాభసాటి కాదని ఆయనకు గట్టి నమ్మకం. ఆ కారణంగా గ్రామాలను ఓట్లకోసం తప్ప యితర విషయాల్లో పక్కన పడేశారు. మనం తినే ప్రతి మెతుకు పల్లెసీమలే పండించి యిస్తాయని చంద్రబాబు ఎన్నడూ అనుకోలేదు. కొన్ని పరిశ్రమలు ఉదాహరణకి చక్కెర మిల్లులు, రైస్ మిల్లులు లాంటివి పల్లెల్లో వర్ధిల్లుతాయి. చంద్రబాబు హయాంలో అవి కూడా బతికి బట్టకట్టలేదు. రైస్ మిల్లులు సైతం పట్టణాలకి పారిపోయా యి. ‘‘దేశమంటే మట్టికాదోయ్! దేశమంటే రియల్ ఎస్టేటోయ్’’ అనే నినాదం తెచ్చిన మహనీయుడు చంద్రబాబు. అందుకే కామన్ క్యాపిటల్‌కి పదేళ్లు గడువున్నా అమరావతికి పునాదులు వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ముందస్తుగానే తెరతీశారు. ఇప్పుడు, రేపు, ఎల్లుండి జగన్ మోహన్ రెడ్డి ఏమిచేసినా అది కక్షసాధింపు సెక్షన్ కిందకే వస్తుంది. జనం గమనిస్తూనే వున్నారు. మనం అచ్చువేయించిన కరపత్రాల్ని మనమే చదువుకుని సంబరపడితే ప్రయోజనం లేదు. నిజాలు నిక్కచ్చిగా గ్రహించాలి. కక్షసాధింపా, శిక్ష సాధింపా కాలం నిర్ణయిస్తుంది. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
అమూల్యమైన సందర్భం
గుడికి రోజూ వెళ్తూనే ఉంటాం. అయినా శ్రద్ధగా గమనించం. మూలవిరాట్ని కళ్లింతవి చేసి చూస్తాం. అఖండం వెలుగులో చాలన్నట్టు దర్శనమి స్తాడు. నాడు శిల్పులు అడుగడుగునా, అణువణువునా ఎన్ని అందాలు సృజించి ఉంటారో మనం దశాబ్దాలు గడిచినా గమనించం. అలాగే మహా కవుల ఎన్నో చక్కందనాల్ని పట్టించుకోం. అలాగే కొన్ని జీవితాలు వెళ్లిపోతాయ్. ఇదిగో ఉన్నట్టుండి భయంకరమైన తీరిక వచ్చింది. ఏళ్లుగా అవే సర్వస్వంగా సేకరించిన ఎన్నో పుస్తకాలను దోసి లొగ్గి పరామర్శించే గొప్ప అవకాశం చిక్కింది. ఆ ఉద్యానంలో అడుగుపెడితే, నాకు ఎదురైన మొదటి పుస్తకం పోతన చరిత్రము. అభినవ పోతన వానమామలై వరదాచార్య పోతన జీవితాన్ని ప్రబంధంగా తీర్చిదిద్దారు. ఏ పుట పట్టుకున్నా మందార మకరందాలే. బంగారానికి తావిలా ఆ గ్రంథానికి అబ్బిన మహత్మ్యం మరొకటి ఉంది. గాయక సార్వభౌములు శ్రీ నారాయణరావు గారికి మహా రచయిత సభక్తికంగా సమర్పించిన ప్రతి అది. నారాయణరావు గురించి చెప్పుకోవాలంటే వారిది తెలంగాణ కరీంనగర్. అక్కడ విశ్వనాథ కొంతకాలం పనిచేశారు. ఆ దగ్గర్లో ‘మ్రోయు తుమ్మెద’ అనే వాగు ఉంది. ఆ పేరుతో కవి సామ్రాట్ నారాయణరావు సంగీత జీవితాన్ని నవల రూపంలో రచించారు. నారాయణరావు గొప్ప గాయకుడు. ఆఖరి నైజాం నవాబుకి పరమ ఇష్టుడు, మిత్రుడు. ఆస్థానంలో ఉండమని ఆహ్వానించినా, సున్నితమైన సంగతులతో తిరస్కరిం చారు. వారి అబ్బాయి ఇక్కడ డీఐజీగా పనిచేసిన రాంనారాయణ నా అభిమాని, నా హితాభిలాషి. ఒకరోజు మరికొన్ని మంచి పుస్తకాలతోపాటు పోతన చరిత్ర నాకు కానుకగా పంపారు. వారి తండ్రిగారి స్వరాలను సీడీగా ఇచ్చారు. మ్రోయు తుమ్మెద నవలని సీడీతో సహా ముద్రించి అందిం చాలని అనుకునేవాళ్లం. ప్రస్తుతం రాంనారాయణ గొప్ప భావుకుడు, గొప్ప కవి. స్నేహధర్మంలో ఎన్నో అనుభవాలు పంచుకునేవాళ్లం. మర్చిపోలేని ఒక మాట తొలి వేకువలో పెరటివైపు తులసికోట నీడలో నాన్నగారి తంబురా శ్రుతి మంద్రస్థాయిలో మొదలయ్యేది. ఆ చిరు మంద్రానికే కోటమీది దీప శిఖ తొణికేది. అమ్మ బొగ్గుల కుంపటిమీద అంతే శ్రద్ధగా చాయ్ కోసం పాలు పొంగిస్తూ ఉండేది. చాయ్ తాగేప్పటికంటే తాగబోయే ముందు మరీ బావుంటుందంటారు అనుభవజ్ఞులు. అమ్మకి ఏళ్లుగా తెలుసు నాన్నగారి జిహ్వకి ఎంత చక్కెర పడాలో. ఒక్క రేణువు కూడా తేడా పడేది కాదు. అంతే వేసి చెంచాతో చక్కెర కలిపేది అమ్మ. జాగ్రత్తగా, చెంచా కప్పువంచకి తగలకుండా సుతారంగా ఇతర ధ్వనుల్ని రానీయకుండా ఆమె సంబాళించేది. నాన్నగారు ప్రతిసారీ ముచ్చటపడేవారు. ఆయన అభినందనల చూపు హిందుస్థానీ నొక్కులవెంట తంబురా మెట్ల మీదుగా జారి పారిజాత పరిమళ మంత సున్నితంగా అమ్మని ఆవరించేవి. ఈ జుగల్ బందీ నాకు ఇష్టమైన జ్ఞాపకం అనేవారు రాం నారాయణ. కళాప్రపూర్ణ బాపు రేఖా చిత్రాలతో సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణాచార్య కావ్యం శివతాండవం. ఏమి నడక! అది ఏమి నడక! ఆచా ర్యులవారు తెలుగుజాతి వరం. ఆయనే కావ్యకర్త. ఆయనే తరగతిలో అది పాఠ్యాంశం కాగా విద్యా ర్థిగా ఆయనే చదువుకున్నారు. ఆ కావ్యం పెనుగొండలక్ష్మి. కవి జీవితంలో మహర్దశ అంటే ఇదే. అప్పుడే చోటు నిండుకుంది. ఇంకా తంజావూరు సరస్వతీమహల్ లైబ్రరీ విలు వైన ముచ్చట్లు చెప్పనే లేదు. తంజావూరులో వీణల్ని వెండిగొలుసులతో గౌరవంగా వేలాడతీ స్తారు. అవి నిదానంగా గాలికి నడుములు కదిలి స్తుంటే త్యాగయ్య కృతులు తొణికిసలాడుతున్నట్టు ఉంటుంది. అదొక గొప్ప సాంప్రదాయం, వీణకు ఇవ్వాల్సిన గౌరవం. ఇంకా శ్రీశ్రీ మహాప్రస్థానం లండన్ రాత ప్రతి కబుర్లు చెప్పుకోనేలేదు. శ్రీశ్రీ దస్తూరీ ఎప్పుడైనా చూశారా? ఆ కంచుకంఠం విన్నారా? అవన్నీ గొప్ప అనుభవాలు. లండన్ విదే శాంధ్ర ప్రచురణ, డా. గూటాల కృష్ణమూర్తి చాలా శ్రమించి ముద్రించారు. తెలుగువారు లాకర్లో దాచుకోవాల్సిన వస్తువు ఈ మహాప్రస్థానం. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
హితాభిలాషి ఏపీ విఠల్
తెనాలి దగ్గర వరహాపురం అగ్రహారంలో సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి, చిన్నతనం నుంచీ సమతావాదాన్ని జీర్ణించుకుని కడదాకా అదే వాదాన్ని విశ్వసిస్తూ ఆచరిస్తూ, 78వ ఏట కన్నుమూశారు డాక్టర్ ఏపీ విఠల్. నాకు పాపం పుణ్యం, శ్లేషార్థాలు తెలియని రోజుల్లో విఠల్ పంట్లాము బుష్‌కోటు వేసుకుని బిరుసైన ఉంగరాల జుత్తు దువ్వుకుని మా పెరటి చింత చెట్టుకింద కూచుని పీట చెక్కమీద దరువేస్తూ గొంతెత్తి ‘పతితులార! భ్రష్టులార! ఏడవకండేడవకండి– నేనున్నా నేనున్నా’నంటూ అభయమిస్తూ పాడే వాడు. అప్పటికి ఆటల్లో వాడే కూత పాటలే వచ్చు. ఇంకేం తెలియవ్. అయినా, పాపం మా అగ్రహారం బుడతలందరికీ ఏదో వివరించి చెప్పాలని వృథా ప్రయత్నం చేసేవాడు. ఏపీ విఠల్ నాకప్పట్నించి మొన్న జనవరి 20 దాకా సజీవ జ్ఞాపకం. తండ్రి ఉద్యోగరీత్యా ఊళ్లు తిరుగుతుంటే విఠల్ కూడా తిరిగాడు. గుంటూరు మెడికల్ కాలేజీలో చేరాడు. ఏ సెలవులు వచ్చినా విఠల్ తల్లిదండ్రి, పిల్లలతో స్వగ్రామం వచ్చేవారు. హాయిగా సేదతీరి వెళ్లేవారు. అందుకని వాళ్ల కుటుంబం ఊరికి హితంగా సన్నిహితంగా ఉండేది. మెడికో విఠల్ కూడా ఆ సెల వుల్లో మా అగ్రహారంలోనే కన్పించేవాడు. పచ్చి పల్లెటూరు కావడంవల్ల, విఠలయ్యగారు డాక్టరని పూర్తి నమ్మకంతో వచ్చి చేతులు చూపించేవారు. అంతా బీద, బిక్కి– చిన్న మందుబిళ్లకి మొహం వాచే స్థితి వారిది. వాళ్లందరికీ కూడా తెచ్చిన శాంపిల్స్ పంచేవాడు. వాళ్ల మొహాలు వెలిగిపోయేవి. విఠల య్యపై ఉన్న విశ్వాసం వాళ్ల రోగాలు తగ్గించేవి. పెద్ద ఆరోగ్య సమస్యలున్నవారు మరీ ముఖ్యంగా మావూరి మాలపల్లె, కుమ్మరిగూడెం వాసులు మా విఠలయ్యగారున్నారని ధైర్యంగా రేపల్లె–గుంటూరు రైలెక్కి వెళ్లేవారు. అక్కడి పెద్దాసుపత్రిలో విఠలయ్య పుణ్యమా అని అనుభవజ్ఞులైన ప్రొఫెసర్ల వైద్యంతోపాటు ఉచితంగా మందులు కూడా అందేవి. ఆనాడు డాక్టర్ అందించిన ఈ అమూల్యమైన సేవను ఇప్పటికీ మావూరు గుర్తు పెట్టుకుంది. పోయాడన్న విషాద వార్త విన్నప్పుడు, ‘అయ్యో! ఆ దేవుడు పోయాడా?‘ అని వూరు బావురుమంది. అప్పటికీ ఇప్పటికీ వూరి వారికి విఠల్ డాక్టర్‌గానే తెలుసు. ఆయన కమ్యూనిస్ట్ సిద్ధాంతాల వైపు పూర్తిగా మళ్లడం అవగాహన, విచక్షణా జ్ఞానం పెంపొందించుకోవడం, భావ వ్యక్తీకరణలో సూటిదనం, అందుకు తగిన తెలుగు పలుకుబడి విఠల్ సాధనతో సాధించిన అస్త్రశస్త్రాలు. పూర్తిగా విభేదించినా సౌమ్యంగా, ‘వీరితో ఏకీభవించు భాగ్యము మాకు కలుగదని’ పశ్చాత్తాపం ప్రకటించి వూరుకోవడమే డా. విఠల్ పంథా. విఠల్ నేటి తెలంగాణ సూర్యాపేటలో రెండుచేతులా వైద్యాన్ని సేవగా అందిస్తూ, విఠల్ దవాఖానాని కొండగుర్తుగా మార్చినప్పుడు అందరి దృష్టిని ఆయన ఆకర్షించారు. రాష్ట్రం పట్టనంత పేరు గుబాళింప చేసింది. అప్పుడే ఒకసారి పుచ్చలపల్లి సుందరయ్య దవాఖానాకి వచ్చారు. ఊరకే రాలేదు. మహాత్ములు ఊరక ఎందుకు వస్తారు. పూర్తి సమయం పార్టీకి అంకితం చెయ్యాలని అడిగి ఒప్పించి తీసుకెళ్లడానికి వచ్చారు. చాలా చిన్నతనంలోనే పీఎస్ భావ ప్రభావాలకు సంపూర్ణంగా లొంగిపోయిన విఠల్ ఆయన పిలుపుని గొప్ప పురస్కారంగా భావించారు. ఆ తర్వాత విఠల్ తండ్రికి సంగతి చెప్పారు. ‘మీరూ పెద్దవారు. మావాడూ తెలిసినవాడు. మీ ఇద్దరికి ఇష్టమైతే నాదేముంది’ అంటూ పరోక్షంగా తన అనుమతి తెల్పారు. ఆ తర్వాత విఠల్ తల్లితో ప్రస్తావించారు పుచ్చలపల్లి. ‘ఆమె పెద్దగా చదువుకున్నది కాదు. పిల్లలగన్న తల్లి. సంప్రదాయాల నడుమ వొద్దికగా పెరిగిన హైందవ గృహిణి. ‘మీ అబ్బాయిని మీ అనుమతితో తీసికెళ్లడానికి వచ్చానమ్మా’ అన్నాడాయన సాదరంగా. వెంటనే ఆమె, ‘మీరు చాలా పెద్దవారు. మీరడిగిన తీరు చూస్తుంటే ఆనాడు విశ్వామిత్రుడు దశరథుని దగ్గరకొచ్చి యాగరక్షణ కోసం రాముణ్ణి తీసుకువెళ్తానన్నట్టుంది. మేమేం చెప్పగలం’ అంటూ తల్లి కళ్లు తుడుచుకుంది. ఇది సుందరయ్య ఊహించని జవాబు. తర్వాత విఠల్‌తో, ‘చూడవయ్యా మన పురాణ ఇతిహాసాలు సాధారణ గృహిణుల మనసుల్లో సైతం ఎంతగా నాటుకుపోయాయో’ అని వ్యాఖ్యానించారట. చివరకు విశ్వామిత్రుడులాగానే రాముడితోనే కదిలాడు. తర్వాత డాక్టర్ విఠల్ ప్రజాశక్తి సంపాదక వర్గంలో కీలకపాత్ర వహించారు. ప్రజానాట్యమండలికి ప్రాతినిధ్యం వహించారు. సుందరయ్యకి, లీలమ్మకి ఆప్తుడైన విఠల్ పద్నాలుగేళ్లు పీఎస్‌కి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. ‘విప్లవపథంలో నా పయనం’ పేరిట సుందరయ్య జీవిత కథ గ్రంథస్తం చేశారు. తెలుగు పత్రికలన్నీ ఏపీ విఠల్ అక్షరాల్ని, అభిప్రాయాల్ని కడదాకా గౌరవించాయి. డాక్టర్ కె. రామచంద్రమూర్తి, మురళి సాక్షి దినపత్రిక పక్షాన విఠల్‌ని ఎంతగానో సమాదరించారు. డాక్టర్ విఠల్ పెళ్లికి నరుడో, భాస్కరుడో అని కీర్తించబడ్డ చాగంటి భాస్కరరావు మా వూరు వచ్చాడు. ఆ విప్లవమూర్తితో తర్వాత ఎప్పటికో ఒక అడుగు దగ్గరకు జరిగాను. విఠల్ నిష్క్రమణతో నిజమైన హితాభిలాషిని పోగొట్టుకున్నాను. అక్షర నివాళి. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
అక్షర సంక్రాంతి
కొత్త సంవత్సరం, నూతన సంక్రాంతి పర్వంలో అక్షర చైతన్యం రాష్ట్రమంతా అందిపుచ్చుకుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తీర్చిదిద్దిన ‘అమ్మఒడి’ చదువులకు సంకురాత్రి శ్రీకారం చుట్టుకుంది. నాగాలు లేకుండా శ్రద్ధగా తమ పిల్లల్ని బడికి పంపే బంగారు తల్లులకు భారీ బహుమతులు అందించే పథకం ‘అమ్మఒడి’. ఈ స్కీమ్ గురించి చెప్పినప్పుడు కొందరు విద్యాధికులు, కలిగినవారు ముక్కున వేలేసుకున్నారు. తమ పిల్లల్ని తాము బడికి పంపితే సర్కారు సొమ్ముని ఎందుకు ఉదారంగా పంచాలని ప్రశ్నించారు. రేప్పొద్దున వాళ్ల పిల్లలు చదివి విద్యావంతులైతే ఆ తల్లిదండ్రులకే కదా లాభం అని సూటిపోటి బాణాలు వేశారు. చదువు సమాజంలో ఒక ఆరోగ్యకర వాతావరణం సృష్టిస్తుంది. విద్యతో సర్వత్రా సంస్కార పవనాలు వీస్తాయి. మన దేశం లాంటి దేశంలో, మన రాష్ట్రం లాంటి రాష్ట్రంలో ప్రభుత్వమే అన్నింటికీ చొరవ చెయ్యాలి. ఒకప్పుడు పల్లెల్లో సైతం ఆదర్శ ఉపాధ్యాయులుండేవారు. వారే గడపగడపకీ వచ్చి, ఒక గడపలో పదిమంది పిల్లల్ని పోగేసి వారికి తాయిలాలు పెట్టి కాసిని అక్షరాలు దిద్దించి, కాసిని చదివించి వెళ్లేవారు. తర్వాత వారిలో కొద్దిమంది మేం అక్షరాస్యులమని గర్వంగా చెప్పుకునే స్థాయికి వెళ్లారు. వయోజనులైన రైతుకూలీలు పొలం పనిలో దిగడానికి ముందు గట్టున కూర్చోపెట్టి వారాల పేర్లు, నెలల పేర్లు, అంకెలు, అక్షరాలు చెప్పించేవారు. వారు వీటన్నింటినీ ఎంతో ఇష్టంగా నేర్చుకునేవారు. ఈ కాస్త చదువూ వారికి నిత్య జీవితంలో పెద్ద వెలుగుగా ఉపయోగపడేది. ‘మాకూ తెలుసు’ అనే మనోధైర్యం వారందర్నీ ఆవరించి కాపాడేది. తర్వాత బళ్లు వచ్చాయి. నిర్బంధ ప్రాథమిక విద్యని ప్రవేశపెట్టారు. కానీ మనదేశ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు పిల్లల్ని స్కూల్స్‌కి పంపే స్థితిలో లేవు. ఇద్దరు స్కూలు వయసు పిల్లలుంటే వారు బడికి పోవడంకన్నా కూలీకి వెళితే సాయంత్రానికి కనీసం వారి పొట్ట పోసుకోవడానికి రూపాయో, రెండో వచ్చేది. ఎప్పుడో వారు చదివి సంపాయించే కాసులకంటే, అప్పటికప్పుడు వచ్చిన కాసు తక్షణ ఆకలి తీర్చేది. ఆ విధంగా చదువు వాయిదా పడేది. ఇది మన రాష్ట్రాన్ని స్వాతంత్య్రం తర్వాత నేటికీ పీడిస్తున్న సమస్య. జరుగుబాటున్నవారు, దొర బిడ్డలు వెనక దిగులు లేకుండా సుఖంగా అన్ని దశలలోనూ చదువుకుని స్థిరపడ్డారు. తెలివీ తేటా ఉన్నా రెక్కాడితేగానీ డొక్కాడని పిల్లలు.. మరీ ముఖ్యంగా గ్రామీణ పిల్లలు అసలు చదువుసంధ్యలు మనవి కావు, మనకోసం కావు అనే అభిప్రాయంతో పెరిగి పెద్దయ్యేవారు. కులవృత్తులు నేర్చి కష్టపడి జీవించేవారు. అవి లేని వారు నానా చాకిరీ చేసి పొట్టపోసుకునేవారు. తిరిగి ఇన్నాళ్లకు జగన్ ప్రభుత్వం విద్యపై సరైన దృష్టి సారించింది. అందులో చిత్తశుద్ధి ఉంది. పల్లెల్లో కుటుంబాలను సాకే తల్లులకు అండగా నిలిచింది ప్రభుత్వం. మీ పిల్లలు కూడా దొరబిడ్డలవలె చదువుకోవాలి. మీ జీవితాలు వికసించాలనే సత్సంకల్పంతో అమ్మఒడి ఆరంభించారు. బాలకార్మిక వ్యవస్థ లేదిప్పుడు. అక్షరాలు దిద్దే చేతులు బండచాకిరీ చేసే పనిలేదు. ముందే సర్కార్ వాగ్దానం చేసిన సొమ్ము వారి ఖాతాలలో జమపడుతుంది. ప్రతి పాఠశాల సర్వాంగ సుందరంగా ఉంటుంది. సర్వతోముఖంగా ఉంటుంది. మంచి భోజనం బడిలోనే పిల్లలకు వండి వడ్డిస్తారు. పుష్టికరమైన, రుచికరమైన అన్నం చదువుకునే పిల్లలకు నిత్యం సకాలంలో లభిస్తుంది. ఉపాధ్యాయులు పిల్లల మెదళ్లకు కావాల్సిన మేత అందిస్తారు. తల్లిదండ్రులు ఈ మహదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పిల్లల ప్రయోజకత్వాన్ని విలువ కట్టలేం. ఒక పచ్చని చెట్టు పెరిగాక అది రోజూ ఎన్ని టన్నుల ప్రాణవాయువు మనకిస్తుంది. అలా ఎన్నా ళ్లిస్తుంది? ఆ ఆక్సిజన్‌కి విలువ కట్టగలమా? ఈ మహత్తర పథకం అక్షర సంక్రాంతిగా వర్ధిల్లాలని ఆశిద్దాం. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
రామనామ క్షేత్రం
నాకు ఈ మధ్య అన్నీ అవే కలలు. పిచ్చి కలలు, పీడ కలలు, లాభసాటి కలలు. అమరావతికి ఏ శుభ ముహూర్తంలో, ఎవరి సంకల్పంతో, ఏ సువర్ణ హస్తాలతో పునాది పడిందో కానీ ఏండ్లు పూండ్లు అవుతున్నా గుంటపూలు పూయడం తప్ప పైకి లేచింది లేదు. కొందరి సంకల్పాలు ధగధగలాడుతూ పైకి లేచి ఆకాశాన్నంటుతాయ్. మర్రి విత్తనంలా ఆలోచన ఎంత చిన్నది?! జరిగింది జరిగినట్టు చెబుతా వినండి. కరపత్రాలు రథంలా చేసిన కారులో చదువుతూ పంచుతున్నారు. ‘రమ్యమైనది... రమ్యమైనది రామనామం! రామ నామం శిలారూప ప్రతిష్ట! కోటి రామనామ క్షేత్రంగా అపర అయో ధ్యగా అవతరించనుంది! ఇతర నామాలు నమ్మి మోసపోవద్దు. మా రామనామ క్షేత్రాన్ని కృష్ణా తీరాన సందర్శించండి. పది నామాలు బుక్ చేసిన వారికి ఒక ఫ్రీ నామం ఇవ్వబడును. ఈ ఆఫర్ సంక్రాంతి పండుగ వరకే. ఈ ప్రచారంతో క్షేత్రజ్ఞులు, మేధావులు అప్పటికప్పుడు మేల్కొని తలుపులు తీసుకు వెళ్లిపోయారు. రామనామ శిలని సొంతం చేసుకుని, వారికి కేటాయించిన సీట్లో పెట్టుకున్నారు. ప్రతిష్ట సమయంలో మీరు గోదా నం ఇవ్వాలనుకుంటే సిద్ధపడండి. కేవలం వెయ్యి రూపాయలు. గోవుని, దాతని ముందుగా రిజర్వ్ చేసుకోవచ్చు. కృష్ణా ఒడ్డున ఒక అనువైన ఘాట్‌లో నామాలు చెక్కే పని మొదలైంది. కొండ తిరిగి, దుర్గమ్మ గుడి తిరిగి రామ్ నామమ్ ఉత్తరాది శ్లాంగ్‌లో కర్ణపుటాలను సోకుతుంది. రైల్వేస్టేషన్లో, బస్టాండ్‌లో, సినిమా హాల్ దగ్గర ఎక్కడ చూసినా రామనామ మహాగుడి గురించే చెప్పుకుంటున్నారు. చెక్కిన రామనామాలను, కృష్ణా్ణపై తేలాడే పంట్లమీద లేత ఆకులు విచ్చిన పూలు పరచి వాటిపై శయనింప చేస్తున్నారు. పొరుగూరి భక్తజనం రామనామ క్షేత్రానికి వెల్లువెత్తుతు న్నారు. పూలు, పండ్ల కొట్లు ఆ తీరాన వెలిసాయి. దైవభక్తితో కూడిన సందడి బాగా ముదిరింది. మహిళలు పూనకాల్లో పడిపోయి హేరామ్ అంటూ మూర్చిల్లుతున్నారు. కృష్ణా తీరం రామనామ క్షేత్ర ప్రచారానికి ఇతోధికంగా తోడ్పడింది. నదీ గర్భం నుంచి వెళ్లి ఎక్కడనుంచో తాబేళ్లు రామనామ శిలలు తెచ్చి శిల్పులకు అందిస్తున్నాయని ఓ మాట పొక్కింది. ఆంజనేయస్వామి హస్తం ఉందన్నారు కొందరు భక్తాగ్రేసరులు. చక్కెరపొంగలి, పులి హోర లాంటి అన్న ప్రసాదాలు వచ్చినవారికి అందిస్తున్నారు. మేం శిలల్ని జలావాసం చేయిస్తున్నాం. రెండు పుష్కరాలు దాటిందని అక్కడి వారంటే కాబోలని అంతా దణ్ణాలు పెట్టుకుంటూ లెంపలు వేసుకున్నారు. ఈ క్షేత్ర సంకల్పం వేళ అయోధ్య ఆలయం ముడిపడింది. రానున్న ఆ మందిరంలో మనదీ ఒక శిల అనుకుంటే రండి. తరలిరండి అని క్షేత్రం పిలుపు ఇచ్చింది. ఒక్క రాయి వెయ్యి. వాళ్లే సరఫరా చేసి పూజాధికాలు నివేదికలు చేసి సందర్భం వచ్చినప్పుడు ఆలయానికి చేరుస్తారు. శిలానామం వెయ్యి, గోదానం మరో వెయ్యి, రామాలయ శిల ఇంకో వెయ్యి, ప్రతిష్ట గోత్ర నామాల శిలా ఫలకం రెండున్నరవేలు, తర్వాత నిత్యం జరిగే ధూపదీప నైవేద్యాలకు వెరసీ సంవత్సరానికిగానూ మూడు వేలు. ఇంతింతై చాంతాడల్లే అంతా మొత్తానికి ఓ నామానికి పదివేలు దాటింది. ఆ క్షేత్రం అయిదెకరాల బంజరు భూమి. అందులో ఏమీ పండవ్, వూసర క్షేత్రమని నోరు పారేసుకునేవారు. అదే మరి. నవ్విన నాపచేను పండుతుందంటే అక్కడ జాగ్రత్తగా ఆచితూచి అమరిస్తే అయిదెకరాల్లో ముప్ఫైవేల నామాలు కూచున్నాయి. ఒక్కో నామం ఏటా హీనపక్షం పది నించి ఆపైన సంపాదిస్తుంది. నేను లెక్కలు వెయ్యబోతే ఆ క్షేత్ర యజమాని నన్ను వారించి, ‘అంకెలొద్దండీ... ఆ రాముడికే అంతగా ఓ వెయ్యికోట్లు మిగిల్తే మన వాళ్లందరి కోసం మంచి ఆసుపత్రి కడతా’నంటూ రామనామంతో పెద్దగా ఆవలించాడు. నాకు మెలకువ వచ్చింది. మనకి కావాల్సింది మంచి ఐడియా! అనుకుంటూ లేచాను. వ్యాసకర్త : శ్రీరమణ, ప్రముఖ కథకుడు -
ఏ దేశమేగినా...
పిల్లలచేత మమ్మీ డాడీ అని తొలి పలుకులుగా పలికించేటప్పుడు ఎవ్వరికీ మాతృభాష గుర్తుకు రాదు. తప్పటడుగులు వేసేటప్పుడు సోప్, షాంపూ, షవర్ అని పిల్లలు కేరింతలు కొడుతుంటే మహదానందపడుతుంటాం. అన్నప్రాసన అయ్యాక డైనింగ్ టేబుల్, ప్లేటు, గ్లాసు, వాటర్, రైస్, కర్రీ, చట్నీ, సాంబార్, రసం, సాల్ట్, కర్డ్ అని పిల్లలు మాట్లాడుతుంటే మురిసిపోతాం. ఏ తల్లిదండ్రులైనా ఇంగ్లిష్ మాటల్ని ఒకసారైనా సరిచేశారా? పొద్దున లేచి బ్రష్ పేస్ట్ నించీ అంతా ఇంగ్లిషే. బడికి బయలుదేరుతుంటే పెన్సిల్, పెన్, బుక్స్, బ్యాగ్, షూస్, హోంవర్క్, యూని ఫాం ఇలా అన్నీ ఆంగ్లపదాలే. స్కూలు ఆవరణలో అడుగుపెట్టాక తెలుగు నిషేధం. అక్కడ పిల్లల నోటెంట తెలుగు ముక్క దొర్లితే ఫైన్ చెల్లిం చాల్సి ఉంటుంది. వీటిని తల్లిదండ్రులు ఘనంగా గర్వంగా చెప్పుకుంటారుగానీ స్కూలుకి వెళ్లిపోట్లాడతారా అంటే లేదు. ఎందుకంటే ఖరీదైన స్కూల్స్‌లో అవన్నీ ఉండే నియమ నిబంధనలే. విచిత్రం ఏమిటంటే, ఏ పల్లెకైనా వెళ్లి ఫోన్ నంబరు అడగండి. పది సెల్ నెంబర్లూ స్పష్టంగా ఇంగ్లిష్‌లోనే చెబుతారు. ఇంగ్లిష్‌లో చెప్పారేమని అడిగితే, ‘ఏంటోనండీ ఈ నంబర్ తెలుగులో చెప్పడానికి రాదండీ’ అన్నదా యువతి. మన సీఎం తెలుగు కాదు, పదో ఏడు వచ్చేదాకా ఇంగ్లిష్ అనేసరికి ఇంటిమీద పెంకులు లేచిపోతున్నాయ్. అంతా ఒక్కసారి ఆలోచించాలి. మా తరం అంటే అరవై ఏళ్లు దాటిన వాళ్లం స్కూలు ఫైనల్ కాగానే పై చదువుకి దగ్గరి బస్తీకో, బస్తీలో ఉన్న సమీప బంధువులింటికో వెళ్లాల్సి వచ్చేది. పీయూసీలో చేరే వాళ్లం. నిక్కర్లు వదిలి ప్యాంటు వేసుకోవడమే చాలా తికమకగా ఉండేది. చాలా మందికి చెప్పులుండేవి కావు. వాచీలు చాలా కొందరికే. బస్తీల్లో పుట్టి బస్తీల్లో పెరిగినవాళ్లు చాలా స్టయిల్‌గా ఉండేవాళ్లు. వాళ్లకి ‘బినాకా గీత్‌మాలా’ తెలుసు. హిందీ సినిమాల గురించి తెలుసు. వాళ్లు ఇంగ్లిష్ పిల్లలు. మేమంతా పల్లెటూరి బైతు పిల్లలం. ఇంగ్లిష్‌లో అటెండెన్స్ పిలిచేవారు. వాళ్లు మాస్టర్లు కారు లెక్చరర్లు. వాళ్ల పేర్లు కూడా పొడి అక్షరాల్లో పొట్టిగా ఉండేవి. కొంతమంది లెక్చరర్లు ఇంగ్లిష్‌లో తప్ప మాట్లాడేవారు కాదు. అర్థం అయినా కాకపోయినా, పెద్దవాళ్లం అయిపోయాం అనే నమ్మకమైన భ్రమ మమ్మల్ని ఆవరించేది. ఇంగ్లిష్ రాకపోవడంవల్ల చుట్టుకునే చిన్న చిన్న అవమానాలు తరచూ బాధించేవి. తమాషా ఏమిటంటే మా తెలుగు మేస్టారు కూడా ఇంగ్లిష్‌లో మాకు వార్నింగ్లిచ్చేవారు. ఇంగ్లిష్ రాదనకుంటారనే బెంగ ఆయన్ని పీడిస్తూ ఉండేది. ఇప్పుడు కాదు ఎప్పట్నించో పల్లెల్లో కూడా బోలెడు ఇంగ్లిష్ వినిపిస్తూనే ఉంది. రేడియో కంటే టీవీ చాలా మాటలు నేర్పింది. రోజూ పొలాల్లో వేసే ఎరువులు, పురుగుమందులు అన్నీ ఇంగ్లిష్‌లోనే కదా ఉంటాయి. కానీ ఇదంతా వ్యవసాయ పరిభాష. ఇదొక జార్గాన్. దానికి తెలుగు ఉండదు. స్టేషన్, రైలు లాగానే. బ్రిటిష్ హయాంలో మనమంతా వాళ్ల మనుషులం కాబట్టి మన చదువుల్ని వారికి అనుకూలంగా ఉండేలా మనపై రుద్దారు. వాటినే ‘మెకాలే చదువులు’ అనుకుంటూనే చచ్చినట్టు చదువుకున్నాం. అదెందుకు, ఇదెందుకు అని అడగలేదు. అదేమిటి ఇదేమిటని ప్రశ్నించలేదు. తర్వాత ఆ శకం అంతరించింది. అయినా ఇంకా అవశేషాలు మిగిలే ఉన్నాయి. ఆ చదువులు పోయి అమెరికా చదువులు వచ్చాయి. ‘మొత్తం బతుకంతా ఆ డాలర్ రాజ్యంలోనే ఉంది నాయనా, మనోళ్లంతా ఆ నీళ్లే తాగి బతుకుతున్నా రయ్యా’ అంటూ ఆప్తులు పుట్టినప్పట్నించి ప్రోత్సహిస్తున్నారు. ఒకప్పటిలాగా మన ఊళ్లోనే, మన రాష్ట్రంలోనే, మన దేశంలోనే జీవితం గడిచిపోతుందనే గ్యారంటీ ఎవ్వడికీ లేదు. టీడీపీ వాళ్లకి లాజిక్‌తో పనిలేదు. జగన్ ఏది ప్రవేశపెట్టినా వారికి నచ్చదు. ఈ వ్యతిరేకుల సమీప కుటుంబ సభ్యులలో ఎందరికి తెలుగు చదవను, రాయను వచ్చునో కనుక్కోండి. మన దేశం లాంటి ప్రజా రాజ్యంలో అడుగడుగునా పేదవాడికి అన్యాయం జరుగుతూనే ఉంటుంది. అది విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, న్యాయం, చట్టం కావచ్చు, నీతి నియమాలు కావచ్చు. అందరూ సమానమే. కొందరు మరీ ఎక్కువ సమానం. మా చిన్నప్పటినించీ తెలుగు మేష్టారంటే అలుసే. అందుకని పాపం ఆయన అవసరం లేకపోయినా ఇంగ్లిష్‌లో మాకు వార్నింగ్‌లు ఇస్తూ ఉండేవారు. నిజంగానే ఇంగ్లిష్, సైన్సులు, లెక్కలకు ఉన్న డిమాండ్ తెలుగుకి అప్పట్నించీ లేదు. పెళ్లికొడుకుని వెదికేటప్పుడు కూడా, ‘పిల్లకి వయసు మీరుతోంది. పోనీ బడిపంతులుగానీ, ఆహరికి తెలుగు మేష్టారైనా పర్వాలేదు...’ అనే వారు. ఏదేశమేగినా ఎందుకాలిడినా ఇంగ్లిషే బెటరు! శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
కిరాయికి తెల్ల ఏనుగులు
పరువు, ప్రతిష్ట, పదవి సర్వం పోయాయ్. మరిప్పుడు ఏమి చేస్తున్నారంటే, అదృష్టపు తావీ దులు అమ్ముతున్నానన్నాడట వెనకటికో మాంత్రికుడు. చంద్ర బాబు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అతి దీనంగా ఓడిపోయారు. కేవలం పరిపాలనలో అవకతవకలు, అతి నమ్మకం దెబ్బతీశాయి. సొంతవర్గం చుట్టూ చేరి నిరంతరం పెద్ద శృతిలో భజనలు చేస్తూ ఉండటంవల్ల సామాన్య ప్రజల ఆర్తనాదాలు మూలవిరాట్ చెవిన పడలేదు. భజనపరులు ఎప్పటికప్పుడు కొత్తపాటలు సమకూర్చారు. వినసొంపుగా కొత్త బాణీలు కట్టారు. ఆ వరస, ఆ చిందు భక్త బృందా నికే కాక అసలాయనకే తన్మయత్వం, పూనకం కలిగేలా సాగాయి. చివరకవే కొంప ముంచాయి. ఎన్నికల ఫలితాలు చూశాక శ్రీవారు దిమ్మెరపోయారు. కలయో, నిజమో, ఈవీఎంల మాయో తెలియక తికమకపడ్డారు. ‘అవేమీ కాదు బాబూ, అంతా స్వయంకృతం. తమరు భజన మైకంలో పడ్డారు. చివరకు కిందపడ్డారు’ అని విశ్లేషకులు తేల్చి చెప్పారు. ‘నేను భజనలకు లొంగేవాణ్ణి కాదు. జనం పొరబడ్డారు. నెల తిరక్కుండా వారికి సత్యం బోధపడుతోంది. అప్పుడే గాలి తిరిగింది’ అని బోలెడు ధైర్యం పుంజుకున్నారు బాబు. ఆ ఉత్సాహంతో చంద్రబాబు రోజూ ప్రెస్మీట్లు పెడుతూ కొత్త ప్రభుత్వాన్ని అడుగడుగునా దుయ్యబట్టి వదులుతున్నారు. టీడీపీ హయాంలో పెద్ద పదవి వెలిగించిన ఒకాయన ఎక్కడా కనిపించడం మానేశారు. ఎంతకీ ఒక్క బాబుగారే దర్శనమిస్తున్నారు. ‘ఏవండీ బొత్తిగా నల్లపూస అయ్యారు. మీరు ప్రతిదానికీ తీవ్రంగా స్పందించేవారు కదా. అస్సలు కనిపించకపోతే జనం బెంగ పెట్టుకోరా’ అని అడిగాను. ఆయన నవ్వి జనం నాడి మాకు తెలిసినంత స్పష్టంగా ఎవరికి తెలుస్తుందండీ. వాళ్లు వూరికే ఫార్స్ చూస్తుంటారు. వాళ్లకి బ్రిటిష్ వాళ్లయినా, కాడి జోడెద్దులైనా, ఆవూ దూడ పార్టీ అయినా, కమలం అయినా, సైకిల్ గుర్తయినా ఒకటే! రాజకీయాల్ని మేమెంత లైట్‌గా తీసుకుంటామో, ఓటర్లు అంతకంటే లైట్‌గా తీసుకుంటారు’ అంటూ చాలాసేపు మాట్లాడాడు. చివరకి ‘పవర్లో ఉండగా అంతా హడావుడి గందరగోళంగా ఉంటాం. డొంకమీది గడ్డిలా అందింది అందినట్టు తింటాం. పైగా భయమొకటి. ఇదిగో ఇన్నాళ్లకి కొంచెం తీరికొచ్చింది. మీరు నమ్మదగినవారు, సరసులు కనుక ఉన్న సంగతి చెబుతున్నానంటూ గొంతు తగ్గించి, తిన్నది నెమరేసి ఒంటికి పట్టించుకోవడానికి ఇదే కదా సమయం. అందుకని ఆ పనిలో ఉన్నా’నని ముగించాడు. అంతకుముందు ఆయన ముఖాన నవ్వు చూసెరగం. ఓడిపోయాక చంద్రబాబు చాలా నవ్వులు కురిపిస్తున్నారని ఒకాయన చాలా సీరియస్‌గా అన్నాడు. జగన్‌మీద, జగన్ ప్రభుత్వంమీద వ్యంగ్యా్రస్తాలు విసురుతూ, ఆయన చమత్కారాలు శ్రోతలకు అర్థం కావేమోనని ఆయనే ముందస్తుగా నవ్వు అందిస్తున్నారని కొందరనుకుంటున్నారు. నిజానికి నెలదాటిన ఆర్టీసీ సమ్మె విషయంలో ఒక్క సారి కూడా చంద్రబాబు తలపెట్టలేదు. రేపెప్పుడో పన్నెండు గంటలపాటు ఇసుకలో తలపెట్టబోతున్నారు. దీన్నే ఉష్ట్రపక్షి తీరు అంటారు. ప్రస్తుతం చంద్రబాబుకి మనుషుల కొరత తీవ్రంగా ఉంది. నిన్న మొన్నటిదాకా కుడిచెయ్యి ఎడమచెయ్యిగా ఉన్నవారు కూడా కని్పంచడం లేదు. మళ్లీ ఎప్పటికి గెలిచేను, గెలిచినా..., అయినా... ఇలా సవాలక్ష ప్రశ్నలు. అందుకని రాజ పోషకులు, మహారాజ పోషకులు కూడా చేతులు ముడుచుకు కూర్చున్నారు. పైగా ఇప్పుడున్నవన్నీ కిరాయికి వచి్చన తెల్ల ఏనుగులు. భరించడం చాలా బరువు. అవి బాదం, పిస్తా, జీడిపప్పులు తప్ప ఇతరములు తినవు. యాపిల్ జ్యూస్‌లు, మాగిన ద్రాక్ష రసాలు తప్ప తాగవు. ఇంతా చేసి వాటివల్ల పెద్ద ప్రయోజనమూ ఉండదు. తెల్ల ఏనుగు కాబట్టి చూడాలని చాపల్యం. దాంతో జనం విరగబడతారు. అర్థం చేసుకున్నా ఆ ఖర్చు ఆపలేరు, పాపం. పార్టీని ఈవిధంగా ‘సాకడం’ కష్టతరం. ఇంతా చేసినా అట్నించి అమిత్ షా, మోదీ రాహు కేతువుల్లా చంద్రుణ్ణి మింగేసేట్టున్నారు. వ్యూహ రచనలో అమిత్ షా రాఘవేంద్రం లాంటి వాడు. అంటే– భయంకరమైన సముద్ర జీవి. మొసలిని మింగెయ్యగలదు తిమింగలం. తిమింగలాన్ని అవలీలగా కబళించగల జీవి ‘తిమింగల గిలం’, ఈ గిలాన్ని బుగ్గన పెట్టుకోగల సముద్ర జీవి రాఘవేంద్రం. చూస్తుండగా దేశాన్ని బాహువుల్లోకి తీసుకున్న సందర్భం చూశాం. రేపు ఆం.ప్ర.లోకి తొంగిచూస్తే మొదట తెలుగుదేశం కనుమరుగు అవుతుందని అనుభవజు్ఞలు అంటున్నారు. వ్యాసకర్త: శ్రీరమణ ,ప్రముఖ కథకుడు -
‘కొండగాలి తిరిగింది.. గుండె ఊసులాడింది'
చిత్రం : ఉయ్యాల జంపాల రచన : ఆరుద్ర గానం : ఘంటసాల, సుశీల సంగీతం : పెండ్యాల ‘ఉయ్యాల – జంపాల’ చిత్రంలో ఆరుద్ర సమకూర్చిన పాట ‘కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది’. అప్పటికీ (1965) ఇప్పటికీ మసకబారలేదు. ప్రతి పదం పూలరెక్కల కోమలం. కవితామయం. అన్ని వర్గాల తెలుగు శ్రోతలకి యీ పాట ఒక కలవరం. మాన్యులు ఆరుద్రని ఎప్పుడు కలిసినా ‘కొండగాలి తిరిగింది’ పల్లవిని మెచ్చుకునేవాణ్ని. ఆయన ఒకసారి ఆ పల్లవి రహస్యం చెప్పమంటారా అని మొదలుపెట్టారు. ‘‘కె. బి. తిలక్, నేను బాగా కావల్సినవాళ్లం. ‘ఉయ్యాల – జంపాల’ లొకేషన్స్ వేటలో తిలక్‌తో బాటు నేనూ వెళ్లాను. మద్రాసు దాటి ఆంధ్రా నడిబొడ్డుకు వచ్చాం. ఎక్కడ చూసినా రోడ్డు పక్క పశువులు, వాటి కాపర్లు. నిదానంగా కారులో వెళుతున్న మాకు గొడ్ల కాడి బుడ్డోడు గేదె మీద ఎక్కి వుల్లాసంగా పాడుకున్న పాట గూబలు అదిరేలా వినిపించింది. పరమ జానపదం. అది చెప్పలేనంత ముతక భాష, ముతక భావం. కారు వెంటనే రోడ్డు వార ఆపించాను. ఆ పిల్లలు అడిగితే మళ్లీ పాడరు. వాళ్లంత వాళ్లు పాడినపుడే దాని అందం, మళ్లీసారి శ్రద్ధగా విన్నా. ‘‘,,,,,.... కొండగాలి తిరిగింది..... కూతుర్ని పంపారో మామో’’ – యిదీ... మినహాయింపులతో మాతృక. ఆ జానపదంలోంచి కొండగాలి తిరిగింది పల్లవి పుట్టింది. స్వేచ్ఛగా, ఏ సెన్సారు జంకులూ లేకుండా వచ్చిన పల్లవి కదా... జీవశక్తి దానికి అధికం’’ అంటూ ఆరుద్ర గడ్డం సవరించుకున్నారు. పుట్ట మీద పాలపిట్ట పొంగిపోయి కులికింది.. అసలే పాలపిట్ట రంగులతో సొగసుగా వుంటుంది. ఇక అది కులికితే చెప్పాలా! పచ్చని గట్ల మీద చెంగుచెంగున వయసులో వున్న లేడి గంతులేసి ఆడుతుంటే చూడముచ్చట. పట్టపగలు సిరివెన్నెల భరతనాట్యమాడడం, పట్టరాని లేతవలపు పరవశించి పాడడం... కన వేడుకే. అన్నీ కవి సమయాలే! ఈ చక్కదనాల్ని ఆరుద్ర చరణాలలో సమకూర్చారు. నిలువెల్లా పాటకు నిండుదనం తెచ్చారు. తర్వాతి చరణంలో – మొగలిపూల వాసనతో జగతి మురిసిపోయింది/ నాగమల్లెపూలతో నల్లని జడ నవ్వింది పడుచుదనం అందానికి తాంబూలమిచ్చింది/ ప్రాప్తమున్న తీరానికి పడవ సాగిపోయింది అంటూ పాట ముగించారు. సినిమా పాటకు కొత్త ఆయతనం తెచ్చారు ఆరుద్ర. పడుచుదనానికి ఉద్దీపకం తాంబూలం. తాంబూలంతో పడుచుదనం మరింత అందగిస్తుంది. అన్ని ఆశలూ చూపించి చివరకు ప్రాప్తమున్న తీరానికి పడవ సాగిపోయింది అనే తాత్విక ధోరణిలో తీర్మానించారు. కవికి యీ పాట పల్లవి ఒక ముతక సాహిత్యం ప్రేరణ అయితే, మిగతా పాటని ఒక పూనకంలో తన్మయత్వంలో రాశారన్నది నిజం. ఈ పాటంటే తెలుగువారికే కాదు ఆరుద్రకి కూడా యిష్టం. ‘అది అలా కుదిరింది’ అని ఆరుద్ర గడ్డం సవరించుకునేవారు. – నిర్వహణ : వైజయంతి పురాణపండ -
తూర్పున వాలిన సూర్యుడు
తెలుగు సాహిత్య వీధుల్లో అర్ధ శతాబ్ది పాటు రంగురంగుల వెలుగుపూలు పూయించిన సిద్ధుడు, అసాధ్యుడు శ్రీకాంత శర్మ. 1944లో గోదావరి జిల్లా రామచంద్రాపురంలో పుట్టారు. సంస్కృతాంధ్రా లలోనే కాక ఆంగ్లంలో సైతం మంచి పట్టు సాధించారు. కొద్దికాలం బడిలో పాఠాలు చెప్పారు. ఆనక పత్రికా రంగానికి వచ్చి ఒక ప్రముఖ వార పత్రిక సంపాదక వర్గంలో కుదురుకున్నారు. 1976లో విజయవాడ ఆకాశవాణిలో స్క్రిప్ట్ రైటర్‌గా శర్మని తీసుకున్నారు. ఎలాగంటే– ఆ ఉద్యోగానికి అర్హత ఉన్నత విద్యతోబాటు గరిష్టంగా 30 ఏళ్ల వయస్సు. అప్పుడు స్టేషన్ డైరెక్టర్‌గా బాలాంత్రపు రజనీకాంతరావు ఏలుతున్నారు. ఎలాగైనా ఇంద్రగంటివారి అబ్బాయిని రేడియోలోకి లాగితే స్టేషన్ బాగుపడుతుందనుకున్నారు. అన్నిట్లో నెగ్గిన శ్రీకాంత శర్మ ఆకాశవాణిలో ఉద్యోగం సంపాయించారు. తీరా చేరాక, అన్నిరకాల రాత కోతల్లో శర్మ తల, చేతులు పెట్టాక, ఢిల్లీ నుంచి రజనీకి శ్రీముఖం వచ్చింది. మన విధి విధానాల్లో వయసు పరిమితి 30 కదా. శ్రీకాంత శర్మకి 32 కదా అంటూ తాఖీదిచ్చారు. రజనీ అంటే అప్పటికే అతడనేక యుద్ధముల నారితేరిన గడుసు పిండం. మంచిదనిపిస్తే ముందు చేయదలచిన పనులు పూర్తి చేసి తర్వాత సమర్థించుకోవడమే ఆయనకు తెలుసు. ‘అయ్యా, మన నిబంధనావళిలో ప్రిఫరబ్లీ 30 ఇయర్స్ అని ఉండటం చేతనూ, కుర్రవాడు చాకు అవడం చేతనూ రెండేళ్లని పక్కన పెట్టడం జరిగింది. అయినా, ఇకపై ఇలా హద్దు మీరడం ఉండదని మనవి’ అని జవాబిచ్చారు. చవగండాలు తప్పుకుని శ్రీకాంత శర్మ, ఏకు మేకై 1996 దాకా ఆకాశవాణిని సేవించారు. శర్మ పాడింది పాటగా విజయవాడ రేడియో నడిచింది. ఎన్ని పల్లవులు? ఎన్ని పాటలు? ఎమ్మెస్ శ్రీరాం అంటే ప్రఖ్యాత వైణికులు ఈమని శంకరశాస్త్రి మేనల్లుడు. ఆయన రేడియోలో సంగీత శాఖాధిపతిగా ఉన్నప్పుడు, శర్మకి ట్యూన్లు చెప్పి పాటలు ఇమ్మన్నాడు. ఆ ఒరవడిలో ఉరవడిలో వచ్చిన తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా.. పాట. అప్పటికీ ఇప్పటికీ ఎంతో ప్రాచుర్యం పొందిన శర్మ పాట. శర్మ మనసులో పాట అలవోకగా పల్లవిస్తుంది. పరిమళిస్తుంది. ‘శ్రావణాన మధురమైన వలపు తలపు తేనె సోన..., కనరే నీలి వెన్నెల..., తెరపు మరపు మనసులో విరజాజి వెన్నెల నీడలో...’ ఇలా తెంపు లేకుండా రసికుల జ్ఞాపకాల్లోంచి వస్తూనే ఉంటాయ్. దేవులపల్లి కృష్ణ శాస్త్రీయం బలంగా ఆవహించి ఉన్నా, చెట్టు ఇస్మాయిల్ ధోరణి ఆవరించి ఉన్నా, శేషేంద్ర మధ్య మధ్య పలకరిస్తున్నా సకాలంలో వైదొలగి తన సొంత కక్ష్యలో ఏ ఉల్కల బారినా పడకుండా హాయిగా పరిభ్రమిస్తూనే గడిపారు. ప్రోజు, పొయిట్రీ, పద్యం, నాటకం, పత్రి కారచన– ఇలా అన్ని ప్రక్రియల్ని వెలిగించి పూయించారు శ్రీకాంత శర్మ. మితంగానే అయినా మంచి పాటలు సినిమాలకి రాశారు. కృష్ణ శాస్త్రి, భుజంగరాయశర్మల తర్వాత వెంపటి చినసత్యం మేష్టారికి కూచిపూడి నృత్యరూపక కర్తగా ఆ స్థాయిని నిలబెట్టారు. నలభై పైబడిన మా స్నేహంలో ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు.చివరిదాకా హాస్యోక్తులతోనే మా మాటలు సాగాయి. శర్మ కాగితం మీదికి వస్తేనే సీరియస్గానీ లేదంటే హ్యూమరే! శర్మ చాలా తరచుగా మద్రాసు వచ్చేవారు. నాతోనే ఉండేవారు. ఒకసారి వచ్చినప్పుడు మా అబ్బాయ్ అక్షరాభ్యాసం నిర్ణయమైంది. సామగ్రిని పిల్లాణ్ణి తీసుకుని రమణ గారింటికి వెళ్లాం. వాళ్లిద్దరి చేతా చెరో అక్షరం దిద్దించాలని సంకల్పం. తీరా అక్క డికి వెళ్లాక ‘మేం కాదు. ఇక్కడీ సాహితీ శిఖరం ఉండగా మేమా, తప్పు’ అంటూ బాపురమణ మా అబ్బాయిని శర్మగారి ఒళ్లో కూర్చోబెట్టి అక్షరాభ్యాసం చేయించారు. ఆ సన్నివేశం అలా సుఖాంతమైంది. కొన్నాళ్లు గడిచాయ్. బళ్లో మావాడి ప్రోగ్రెస్ కార్డు ఎప్పుడొచ్చినా, కాపీ తీయించి శర్మకి పోస్ట్ చేసేవాణ్ణి. ‘ఇదేంటండీ, నన్నీ విధంగా హింస పెడుతున్నారు. నేను వద్దు మొర్రో అంటున్నా వినకుండా నాతో దిద్దబెట్టించారు. నేనెప్పుడూ లెక్కల్లో పూరే. వాడికి లెక్కల్లో తోకలేని తొమ్మిదులు, తలలేని ఆర్లు వస్తుంటే నాదా పూచీ’ అంటూ జవాబులు వస్తుండేవి. అయ్యా, లెక్కలు సరే. తెలుగూ అట్లాగే ఉంది. ‘స్నానం పోసు కోవడం’ లాంటి మాటలొస్తున్నాయ్ అనే వాడిని. ఆప్తమిత్రుని అనారోగ్యం మాటలు వింటూనే ఉన్నా, ఇప్పుడే ఇంతటి విషాద వార్త వింటానని అనుకోలేదు. ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రికి నేనంటే ఎంతో వాత్సల్యం. నాకో మంచి ముందుమాట రాశారు. శ్రీకాంత శర్మ సరేసరి. శ్రీమతి జానకి బాల, పిల్లలు మా స్నేహం నించి హితంగా సన్నిహితంగానే ఉన్నాం. ఇంద్రగంటి వారితో మూడు తరాల అనుబంధం. ఇంటిల్లి పాదీ మాటలకోర్లు. ఎప్పుడు కలిసినా ఎన్నాళ్లున్నా టైము మిగిలేది కాదు. శర్మ పార్థివ దేహాన్ని కడసారి దర్శించడానికి వెళ్లినపుడు దుఃఖం పెల్లుబికి వచ్చింది. మోహనకృష్ణ తన సినిమాకి తండ్రి రాసిన పాట గురించి ప్రస్తావించారు. కిరణ్మయి కూడా తనకు రాసిన పాట చెప్పింది. ప్రయోజకులై, బుద్ధిమంతులై, తల్లిదండ్రులను నడిపిస్తూ ఉండే పిల్లలున్న తండ్రి మా శ్రీకాంత శర్మ అన్పించింది. నా కళ్లలోంచి ఆనంద బాష్పాలు రాలాయి. స్నేహశీలికి అశ్రు తర్పణం. శ్రీరమణ వ్యాసకర్త ప్రముఖ కథకుడు -
ఎన్ని ఘనకార్యాలో...!
పెళ్లి కార్యక్రమం నిరాటంకంగా ముగు స్తుంది. ఎప్పట్నించో పెళ్లి ఆరాటంలో నలి గిపోతున్న మనసు కుదుట పడుతుంది. చివరి ఘట్టాలు ముగి శాక పెళ్లి పెద్దలు హాయిగా కొయ్య దుంగల్లా పడి నిద్రపోతారు. ‘సదశ్యం తీరినట్టు పడుకున్నారు’ అనేది సామె తలా వచ్చింది. నిజానికి ఎన్నికల మహాఘట్టం ముగిశాక చంద్రబాబు ఆ తీరున గుర్రుపెట్టి నిద్రించాలి. పోలింగ్ తర్వాత బాబులో అలజడి పెరిగింది. అదే పలు అనుమానాలకి దారి తీసింది. జారిపోతున్న ధైర్యాన్ని ఎగలాగి, గెలుపు మాదేనంటూ స్పీచ్‌లో ఓ వాక్యం కలిపారు. నేని ప్పుడు ఆరాట పడుతోంది నా గురించి, నా రాష్ట్రం గురించి కాదు. టోటల్‌గా నా దేశ ప్రజల గురించి వర్రీ అవుతున్నాను. అప్రజాస్వామిక ధోరణులు పెచ్చు పెరు గుతున్న ఈ మోదీ కబంద హస్తాల నించి భారతమాత ముద్దుబిడ్డల్ని, సవతి సంతతిని ఎలా రక్షించాలని ఆవేదన పడుతున్నానని మైకులు పగుల గొడుతున్నారు. బుద్ధుడికి బోధి చెట్టుకింద జ్ఞానోదయం అయినట్టు చంద్ర బాబుకి ‘సన్‌రైజ్ సమయంలో’ బాత్రూంలో స్వస్వరూప జ్ఞానం విచ్చుకుంది. ఎనిమిది చక్రాలు, నాలుగు హాండిల్సు, నాలుగు సీట్లు, రెండు చెయిన్లు, రెండు జతల పెడల్సు, ఒకే ఒక స్టాండు కలిగి పసుప్పచ్చ కాంతిలో సైకిల్ విశ్వరూప దర్శనం అయింది. అట్లా ఎక్స్ట్రా భాగాలతో కన్పించేసరికి అదొక పీడకలగా తోచింది. ఎందుకు చంద్రబాబు హాయిగా విశ్రమిం చక ఇట్లా పరిపరి విధాల వ్యాకులపడుతున్నారు? మా వూళ్లో ఒక వృద్ధ మాత చంద్రబాబు మనోస్థితిని పసిగట్టింది. చాలా ఫీల్ అయింది. బాబు ఇప్పుడు చేయాల్సింది ప్రసంగాలు కాదు. తన వారిని వెంటేసుకుని రాష్ట్ర పర్యటన చెయ్యాలి. ఇన్నేళ్లలో తను చేసిన ఘన కార్యాలను కళ్లారా చూసి తరించవచ్చు. బెజవాడ చుట్టుప క్కల కృష్ణానదిలో ఇసుక లేకుండా తను, తన వారు నిశ్శబ్దంగా జుర్రేయడం చూసుకోవచ్చు. కనకదుర్గమ్మకి అందుబాటులో వచ్చి ఆగిపో యిన ఫ్లైఓవర్‌ని కనులారా వీక్షించవచ్చు. క్యాపి టల్ తాలూకు సౌధాల బొమ్మరిళ్లతో తన వారంతా కలిసి కాసేపు ఆడుకోవచ్చు. అమరా వతి పరిసరాలలో బాబు రూపొందించిన విశ్వ విఖ్యాత టూరిస్ట్ స్పాట్స్‌లో తనివితీరా సెల్ఫీలు దిగవచ్చు. సింగపూర్ స్థాయి జెయింట్ వీల్లో చంద్రబాబు పరివారమంతా ఒక రౌండ్ తిరగ వచ్చు. ఇంకా ఉద్యానవనాలలో సేదతీరచ్చు. ఫౌంటెయిన్ల నీడలో జలకాలాడవచ్చు. ఇలా చెబుతూ ఆ పెద్దావిడ అలిసిపోయింది. ఒక్క నిమిషం విశ్రమించి, అప్పుడు ఎన్నికల ముందు తొంభై శాతం ఓటర్ల సంతృప్తి సాధించాలని బాబు చెప్పేవారు. ఒక దశలో 65 శాతం, 72 శాతం, 81 శాతం, 85 దాకా వచ్చిందని ప్రక టించారు కూడా. ‘సంతృప్తి’ అనే మానసిక స్థితిని తూకం వేసిన చంద్రబాబు, ఇప్పుడు జనంలోకి వెళ్లి తాజాగా తూకాలు వేసి ఇంతకీ ఆయన సంతృప్తి లెవెల్ తేల్చుకోవడం ముఖ్యం. ఆడపడుచులకు అన్నగారిచ్చిన కానుకలు, వాటి తాలూకు ప్రతిస్పందనలు బేరీజు వేసుకుని మురిసి పోవచ్చు. ఆయన హయాంలో విద్యా ర్హతలు హెచ్చుగా ఉన్న యువకులు ఎందరు తగిన ఉద్యోగాలు పొందారో విని, చూసి ముచ్చ టపడవచ్చు. ఎన్నికల ముందు ఆవూ–దూడని (అది ఇందిరా కాంగ్రెస్ పార్టీ గుర్తు) చంద్రన్న కానుకలుగా పెరళ్లలో కట్టేసి ప్రచారం చేశారు. వాటికి లేత పచ్చికలు మేతలు వేసి, సంతృప్తి మేరకు హీనపక్షం 90 శాతం కుడుతులు పట్టి బాబు రిలాక్స్ అవచ్చు– అంటూ వృద్ధమాత ఏక రువు పెడుతుంటే ఓ యువకుడు విలాసంగా నవ్వాడు. ‘అవ్వా! అది ఒకటే ఆవు, ఒకే దూడ. టీవీలో యథాశక్తి నటించాయ్. అంతే! ఆవు మనకి వినిపించిన ‘అంబా’ అరుపు దానిది కాదుట. డబ్బింగ్ చెప్పించారట.’ పెద్దావిడ బోసి నోటితో ‘హవ్వ.. హవ్వ’ అంటూ నవ్వింది. శ్రీరమణ , ప్రముఖ కథకుడు -
విజయయాత్ర
ఆ మధ్య విడుదలై విజయయాత్రగా నిలిచిన యదార్థ గాథా చిత్రం ప్రేక్షకులకు గుర్తుండి పోతుంది. వ్యక్తులకు ప్రచారం కల్పిస్తూ, బంగారు పూతలు పూసి తీసిన చిత్రం కాదు. వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితాన్ని క్లుప్తంగా స్పృశిస్తూ, ఆయన రాజకీయ జీవితంలోని కీలక ఘట్టమైన పాదయాత్రను ముఖ్యాంశంగా మలచిన చిత్రం యాత్ర. అపోజిషన్‌లో ఉన్నా, పొజిషన్లో ఉన్నా రాజశేఖరరెడ్డిది ఒక విస్పష్టమైన ముద్ర. ఆయన మాటతీరుని, మనసు తీరుని ఒడిసిపెట్టుకుని సినిమాలోకి దింపారు. ఎక్కడా అతి చెయ్యకుండా, ఆయనకు దైవాంశలు ఆపాదించి ప్రేక్షకులకు వెగటు పుట్టించకుండా కథని రక్తి కట్టించారు. ఆత్మస్తుతులు పరనిందలు లేవు. ఎక్కడా ఎవ్వరినీ సూటిగా గానీ, మాటుగా గానీ విమర్శించిందీ లేదు. అదే చూపరులకు నచ్చింది. ఎక్కడ రాజకీయాలుండాలో, ఎక్కడ మానవత్వం పరిమళించాలో వైఎస్‌కి సుస్పష్టంగా తెలుసు. దర్పం, రాజసం, పౌరుషం, ఔధార్యం లాంటి దినుసుల్ని ఎక్కడెక్కడ ఏ మోతాదులో వాడాలో వైఎస్‌కి తెలిసినట్టు మరెవ్వరికీ తెలియదు. ఏ పీఠమెక్కినా ఆయనది రాజమార్గం. వైఎస్ ఆప్త మిత్రులు, వైఎస్‌కి ప్రాణం ఉన్న నీడ, సచివుడు సారథి కేవీపీ రామచంద్రరావుని బహుతూకంగా మలచారు. ఒకరే రావాలని సూచన వచ్చినప్పుడు మేమిద్దరం ఒకరేనని వైఎస్ లిప్తపాటు కూడా ఆలోచించకుండా చెప్పడం, వారి స్నేహ గాఢతను చెబుతుంది. మితభాషిగా, హితాభిలాషిగా యాత్ర నిండా నిండుగా కనిపిస్తారు. అయినా, ఎక్కడా హద్దులు దాటక పోవడం ఆయన నైజం. కొన్నిసార్లు అపర చాణక్యుడు, కొన్నిసార్లు మహామంత్రి తిమ్మరుసు. ఎక్కడా సింహ గర్జనలు, పులి గాండ్రింపులు, నినాదాలు, లేనిపోని విమర్శలు, శుష్కప్రియాలు వినిపించవు. దానివల్ల చిత్రం భలే హాయిగా ఉంది. నటీనటులు పాత్రల్లో సంపూర్ణంగా ప్రతిఫలించారు. వైఎస్ ఠీవిలో ఒక సింప్లిసిటీ ఉంది. ఆయన దర్పంలో మానవత తొంగి చూస్తుంది. స్వతస్సిద్ధమైన ఆయన నవ్వులో కరుణ తొణుకుతుంది. ఈ గుణాలన్నీ యాత్రలో ద్యోతకమయ్యాయి.ఆత్మగౌరవ ఉనికి ‘యాత్ర’లో వైఎస్ ప్రతి అడుగులోనూ కనిపించింది. అడుగడుగునా అడ్డుపడే అధిష్టానాన్ని తనదైన ధోరణిలో పక్కనపెట్టి, తను అనుకున్నట్టే ముందుకు సాగడం చాలా సన్నివేశాలలో రక్తి కట్టింది. అధిష్టానంపట్ల గౌరవం ఉండటం వేరు, బానిసత్వం చేయడం వేరన్నది విడమరచి చెప్పారు. రెండోసారి వైఎస్ ముఖ్యమంత్రిగా ఎన్నికల బరిలోకి దిగినప్పుడు, కొన్నిసార్లు సన్నిహితులముందు అనేవారు. ‘ఒకసారి ముఖ్యమంత్రి అయి, మా నాయన కోరిక తీర్చా, ఇక ఇప్పుడు అంత తాపత్రయం లేదు’ అనేవారు. కచ్చితమైన లక్ష్యాలు, సంతృప్తి ఉన్న వ్యక్తి. జనామోదం పుష్కలంగా గడించిన జననేత. మొనగాడు, ఖలేజా ఉన్న మనిషి అనుకునేవారు గ్రామీణ ప్రజలు. ముఖ్యంగా రైతులు. ఎందుకు అనుకునేవారంటే– అప్పుడు వైఎస్ అపోజిషన్ లీడర్‌గా అసెంబ్లీలో ఉన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి. అప్పట్లో ఆంధ్రలో వానలు లేకపోవడం, దుర్భిక్షం, నివారణోపాయాలు లేకపోవడం ఉంది. రైతుల ఆత్మహత్యలు రోజూ వార్తల్లో విపరీతంగా వస్తున్నాయి. వైఎస్ నోరు చేసుకుని రైతుల పక్షాన వాదించారు. చంద్రబాబు జవాబు చెబుతూ, ప్రతి పురుగుమందు ఆత్మహత్యకి లక్ష రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నా అధ్యక్షా అన్నారు. ఆ జవాబుకి రెచ్చిపోయిన వైఎస్, ‘రైతుల ప్రాణాలకి విలువ కట్టొద్దు బాబూ, నువ్ తాగు నేను కోటి రూపాయలిస్తా’ అన్నారు ఆక్రోశంగా. సభలో గొడవ అయ్యింది. అయినా వైఎస్ వెనక్కి తగ్గలేదు. ఆ ఒక్కమాట రైతాంగానికి కొండంత ఓదార్పునిచ్చింది. తర్వాత సీఎంగా నిలబెట్టింది. నిజాయితీ, చిత్తశుద్ధితో పలికే మాటలు బీజాక్షరాలవుతాయ్. మంత్రాక్షరాలవుతాయ్. పనికిమాలిన ప్రసంగాలు పేలపు గింజలకు సాటికావు. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ఆత్రేయపురం కుర్రాడు
బ్రహ్మలోకంలో ఉన్నట్టుండి భీషణ ప్రతిజ్ఞ ముక్తకంఠంతో వినిపించింది. బ్రహ్మ నాలుగు ముఖాలూ నాలుగు దిక్కులూ పిక్కటిల్లేట్టు గర్జిస్తున్నాయ్. ‘ఒడ్డూ ఎత్తులూ, కండలు కావరాలూ లేకుండా బొమ్మని చేసి దానికి ప్రాణం పోస్తా. ఆ ప్రాణి తన విజ్ఞాన వైదుష్యాల ద్వారా సమున్నతుడై వర్ధిల్లగలడు... అస్తు’ అని నాలుగు నోళ్లు మూసేశాడు. విరించి శపథం ప్రాణదీపమై నేలకు దిగింది. ఆ దీపం అరవై ఏళ్లనాడు ఆత్రేయపురంలో భమిడిపల్లి వారింట్లో ఉగ్గులు పోసుకుంది. బ్రహ్మగారి మాట మేరకు ఏ ఆర్భాటాలూ లేకుండా ఆ బొమ్మ కూర్మంలా కది లింది. తర్వాత క్రమంగా ఎదిగి, బ్నిం అంటే ‘వీరా!’ అని తెలుగుజాతిని నివ్వెరపరుస్తున్న బ్రహ్మమానస పుత్రుడు, నేటి షష్ట్యబ్ది మిత్రుడు భమిడిపల్లి నరసింహమూర్తి అయ్యారు. ఆత్రేయపురంలో ఇంటి చదువుతోనే సంస్కృతాంధ్రాలు తగు మాత్రం వంట పట్టించుకున్నారు. బొమ్మలు గీయడంమీద ఆసక్తి చూపారు. అలాగ గీతలకి అడ్డంపడుతూ, అక్షరాల్ని గుచ్చుకుంటూ పాకుతూ దేకుతూ గుమ్మందాటి అరుగుమీదకు వచ్చారు. పిల్లాడికి ఈడొచ్చింది. నీలాటి రేవుకి వయసులు చిందిస్తూ బిందెలెత్తికెళ్లే పడుచుల్ని, పనీ పాటలకి వెళ్లే పిల్లల్ని ఆబగా తిలకించడం ఓ కళగా నేర్చాడు. అసింటా వెళ్లాక ఆ పల్లె పడతులు పమిటలు సద్దుకుంటూ ‘బెమ ఉందిగానీ జవ లేదు.. ప్చ్’ (భ్రమ ఉందిగానీ జవసత్వాల్లేవు) అనుకునేవారు. ఇప్పటికే భూమ్మీద పత్రి పూజ లేకుండా పోయిన పెనిమిటి చేసిన శపథంతో ఇంకేమవుతాడోనని పరిపరి విధాల వగచిన వాగ్దేవి అమరకోశం మొదలు కావ్య నిఘంటువుల్దాకా రంగరించి కూర్మానికి పోసేసి, నిశ్చింతగా వీణలో లీనమైంది. 1981లో ఆత్రేయపురం కుర్రాడు భాగ్యనగరానికి పయనమయ్యాడు. కార్యార్థి అయి వెళ్తున్న వామనుడికి ముంజి, భిక్షాపాత్ర, గొడుగు వగైరాలను తలొకరు తలోటి ఇచ్చి దీవించిన విధంగా, నవోదయ రామ్మోహనరావు, శంకు, శ్రీ సీతారావుడు, ఇంకొందరూ ఆ కుర్రాడిని చేతుల్లోకి తీసుకుని రైళ్లు, బస్సులు, మెట్లు ఎక్కించారు. ఒక వీక్లీలో ఆర్టిస్ట్‌గానూ, ఒకింట్లో పేయింగ్ గెస్ట్‌గానూ కుదురుకున్నాడు. మన బతుక్కిది చాల్లే అనుకుని ‘బ్నిం’ అనే అక్షరవన్నర సంత కం ఖాయం చేసుకున్నాడు. భాగ్యనగరం బ్నింని బహుముఖ ప్రజ్ఞాశాలిగా తీర్చిదిద్దింది. తెలంగాణ శ్లాంగ్వేజిని, బతుకుతెరువుని నేర్పింది. దూరదర్శన్ గ్రీన్‌రూంలో జొరబడి బుల్లితెరకి కావల్సిన ఛందో వ్యాకరణాలని ఆపోశన పట్టాడు. క్రమంగా స్వార్జననీ, ఇరానీ చాయ్‌నీ, జర్దాని మరిగారు. ఆ సరికే పాట, పద్యం మీద పట్టు సాధించారు. కథలు, టీవీ సీరియల్స్‌పై అధికారం వచ్చింది. కార్టూన్లు, కవర్ పేజీలు, సభ లేఖలు, శుభ లేఖలు, టుమ్రీలు అందించే నమ్మకపాత్రమైన చిరునామాగా తేలారు. రెక్క విదిల్చుకుని వేళాపాళల సంకెళ్లు తెంపేసుకుని ఫ్రీలాన్సర్‌గా నిలబడ్డారు. మైకంత ఎదిగారు. ఒకానొక శుభముహూర్తాన పలుకులమ్మతో మంతనాలు సాగించి నృత్య నాటికలకి శ్రీకారం చుట్టారు. ఇప్పటిదాకా రెండు సెంచరీలు పూర్తి చేసి మూడో శతకాన్ని ముగించే దారిలో ఉన్నారు. ప్రఖ్యాత నర్తకి స్వాతిసోమనాథ్ కోరగా ‘వాత్సా్య యన కామసూత్ర’ నృత్య నాటికని ప్రదర్శన యోగ్యంగా రచించారు. దాన్ని స్వాతిసోమనాథ్ ప్రదర్శించి రసజ్ఞుల మన్ననలందుకున్నారు. బ్నిం బాపు రమణలకు మూర్తి. వేలాదిమందికి స్ఫూర్తి. ఆత్రేయపురంలోనే అంకురించిన బాపు రమణలతో స్నేహం కడదాకా కొనసాగింది. నిరంతరం వారి మధ్య ఒక జీవతంతి ప్రవహిస్తూ ఉండేది. బ్నింగారు తెలుసని చెప్పుకోవడం నాలాంటి వాళ్లకి గర్వంగా ఉంటుంది. ఇప్పుడిప్పుడు చాలామంది ‘అర్జునుడంటే ఎవరో అనుకున్నా కిరీటి నాకెందుకు తెలీదన్నట్టు’ ప్రవర్తిస్తున్నారు. ఆయన విద్వత్తుకిది నీరాజనం. వారాసిగూడలో ఓ ఆశ్రమం స్థాపించి, ఆయన కాబోయిన నట నటీమణులకు, రైటర్లకు, దర్శకులకు, యాంకర్ భామలకు అభయాలిచ్చి ఆత్మవిశ్వాసం గోలీలుగా మింగిస్తున్నారు. బ్నిం దగ్గర వృత్తిపరమైన నిబద్ధత ఉంది. గీసి రాసి సకాలంలో ఇవ్వడం, ఇవ్వాల్టి సోషల్ మీడియాని త్రివిక్రమంగా ఆక్రమించుకుని విశ్వవ్యాప్తమయ్యారు. ఆయనది అవసరానికి మించిన ఆత్మవిశ్వాసం. ‘సెల్ఫ్‌పిటీని’ చావగొట్టి చెవులు మూసిన రౌడీషీటర్ ఆ కుర్రాడు. నా కాళ్లకి చెప్పుల్లేవని అఘోరించే వాళ్లని ఈ భూమ్మీద కాళ్లే లేని వారెందరున్నారో చూడమని కన్నీళ్లు తుడిచే బ్నింకి– శతమానం భవతి! (ఆదివారం ఇందిర ప్రియదర్శిని ఆడిటోరియం, పబ్లిక్ గార్డెన్స్‌లో జరుగనున్న బ్నిం షష్ట్యబ్ది సభ వేళ...) వ్యాసకర్త: శ్రీరమణ, ప్రముఖ కథకుడు -
ఇద్దరూ ఇష్టపడితే ఒప్పే!
ఇన్నాల్టికి దేశ అత్యున్నత న్యాయస్థానం మూలాల్ని తవ్వితీసింది. వివాహేతర బంధం నేరం కానే కాదని తీర్పు ఇచ్చింది. చట్టంలో 497 శక్తిని నిర్వీర్యం చేసింది. నిజమే, పురు షుడు పక్కకి వెళితే నేరం కాదు, స్త్రీ వెళితే తప్పా అని సూటిగా ప్రశ్నించింది. భారతీయ శిక్షాస్మృతి చాలా ప్రాచీనమైంది. కొన్ని కొన్ని సదాచారాలు అశాస్త్రీయ మార్గంలో వచ్చి చేరిపోయాయి. ఆయనెవరో ‘‘నస్త్రీ స్వాతంత్య్రమర్హతి’’ అని చెప్పాడని చాలా రోజులు మనువు చెప్పింది వేదం అన్నారు. ఆధునిక మహిళ ఎన్నడో మను సిద్ధాం తాలను పాతర వేసింది. నైతిక విలువలను ఒక స్త్రీపట్లే ఎక్కువగా అమలు చేయడానికి మన సమాజం అలవాటు పడింది. ఏ మాత్రం తేడా వచ్చినా, ఇంకేముంది మహిళ తెగించేసింది అనే విమర్శ మొదలవుతుంది. కట్టుకున్న భార్యని పూర్తి హక్కులుగల చరాస్తిగా భావించడం ఆది నుంచి మగ వాడికి సంక్రమించిన హక్కు. అదేవన్నా అంటే ఆలిని సత్యం కోసం విక్రయించిన హరిశ్చంద్రుని గొప్పగా ఉదహరిస్తారు. ఆయన శ్రీరామచంద్రుని పూర్వీ కుడు. ఈయన కూడా తన ధర్మ నిరతిని, భార్యని త్యజించి నిరూపించుకున్నాడు. 158 సంవత్సరాల క్రితం పుట్టిన 497ని నిన్నటి తీర్పులు జ్ఞాన సంపన్నులైన న్యాయమూర్తులు వివ రంగా సమీక్షించారు. చక్కని విజ్ఞతతో విశ్లేషించారు. ఇక్కడ మానసిక శారీరక సాంఘిక అంశాలు ముడి పడి ఉన్నాయి. వివాహేతర సంబంధాన్ని న్యాయ శాస్త్రం ‘అడల్ట్రీ’గా వ్యవహరిస్తుంది. అంటే ‘కల్తీ’ అని అర్థం. తప్పు, నేరం, అధర్మం, అనైతికం ఇవన్నీ ఒకటి కాదు. ఇక నుంచి వివాహేతర సంబంధం ఇష్టపడిన సందర్భాలలో అక్రమ సంబంధం కూడా కాదు. మన ప్రాచీనులు ఎక్కడ ఇతర సంబంధాలు తప్పుకాదో, ఎక్కడ సమర్థించవచ్చునో కూడా సూచించారు. శృంగార పురుషుల కోసం ‘నాచ్ సొసైటీ’ని హాయిగా తయారు చేసుకున్నారు. సమర్థించుకున్నారు. స్టేటస్ సింబల్ చేసుకుని ఊరేగారు. కానీ, స్త్రీకి కూడా ఇలాంటి అవకాశాలు ఉంటే బాగుండని వాళ్లకి అనిపించలేదు. ‘భార్యపై భర్త సర్వాధికారి కాదు. రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులను 497 ఐపీసీ స్పష్టంగా ఉల్లంఘిస్తోంది. దీన్ని కొన సాగించటంలో అర్థం లేదు’ అన్నారు తమ తీర్పులో జస్టిస్ ఇందూ మల్హోత్రా. ‘ఈ తీర్పు దారి తప్పి చరించడానికి లైసెన్సు ఇచ్చినట్టు అవుతుందే మో’నని కొందరు చదువుకున్న మహిళలే భయపడు తున్నారు. కొందరు భార్యాభర్తలు ఎవరి దారిన వారు తిరుగుతుంటే, కుటుంబం మాటేమిటని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ‘497 సెక్షన్‌కి బీజాలు 1860లోనే పడ్డాయి. అప్పటికి మహిళలకు ఎలాంటి హక్కులూ, అధికా రాలూ లేవు. ఓటు హక్కు కూడా లేదు. భార్యను భర్త సొంత ఆస్తిలా భావించేవాడు. అనుభవించినా, హింసించినా సంపూర్ణ హక్కు, అధికారాలుండేవి. ఆమెతో మరొకరు శారీరక సంబంధం పెట్టుకోవ డాన్ని క్రూరంగా, ఘోరంగా తన సొమ్ము పరహస్తం అయినట్టు భావించేవాడు’ అంటూ ధర్మాసనం ఒక చోట పేర్కొంది. అసలు మన రుషులు శారీరక కలయిక కంటే మానసిక పొందు మరీ పెద్ద పాప మని నిర్వచించారు. ఇవన్నీ అమలులో సాధ్యంకాని విషయాలు.త్రేతాయుగంలో జరిగిన అహల్య కథ ఉంది. అహల్య ఇంద్రుణ్ణి మనసారా వలచిన మాట నిజం. ఇంద్రుడు గౌతముని రూపంలో రావడం కథలో పిట్టకథ. నిజ రూపంలోనే వచ్చాడు. శక్తి సంపన్నుడు కాబట్టి, భర్త కాబట్టి స్తబ్దుగా పడి ఉండమని శాపంపెట్టి అహల్యని హత్య చేశాడు. ఈ లెక్కన అహల్యను శపించాల్సిన అవసరంగానీ, అగత్యం గానీ లేదు. మన పురాణ కథల్లో ఈ అవగుణాల అవశేషాలు కనిపిస్తాయి.పురాణ పురుషులు వారి చిత్తానికి తోచిన కోరి కలన్నీ తనివితీరా తీర్చుకున్నారు. శ్రీరామచంద్రుడు పురుషులలో పుంగవుడు. ఏకపత్నీ వ్రతుడు. అర్ధాంగి పాతివ్రత్యాన్ని కూడా అగ్నిప్రవేశం ద్వారా నిరూ పించి ధన్యుడైనాడు. తర్వాతి కృష్ణావతారంలో బహు పత్నీవ్రతుడై సేదతీరాడు స్వామి. అప్పుడు అనే కానేక రాసలీలల ద్వారా వివాహేతర సంబంధాలకు బీజాలు పడ్డాయ్. నా దేశం భగవద్గీత! అగ్నిపునీత, సీత! శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ఒకే కుదురు
ఏవిటి ఈసారి మీ ఎజెండా? అన్న ప్రశ్నకి, ‘పవర్లోకి మళ్లీ రావడం’ అని వెంటనే జవాబిచ్చాడు అగ్రనేత. ‘కిందటిసారి కూడా మీ మానిఫెస్టో సారాంశం అదే కదా’ అన్నాడా పత్రికా ప్రతినిధి. అందుకు నేత నవ్వి ‘‘లేదు... పవర్‌ని పార్టీ పెద్దలు పదిమందీ పంచుకుని పాలించాలని అప్పటి మాని ఫెస్టోలో చెప్పాం. కచ్చితంగా, అదే ఆచరించి చూపించాం’ అని స్పష్టం చేశాడు. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఉన్నట్టుండి మారిపోయింది. తెలం గాణలో ‘గరుడ వస్త్రం’ వేసినట్టే. వైష్ణవ సంప్ర దాయంలో ఉత్సవాలకు ముందు ధ్వజస్తంభానికి జెండాలాగా దీన్ని ఎగరేస్తారు. ఇది దేవతలకు ఆహ్వానం. దేవ తలు, దేవగణాలు ఆకాశంలో దీన్ని చూసుకుని, ఉత్సవాలకు తరలివస్తారు. కొందరేమం టారంటే– అబ్బే ఇదంతా వట్టి సందడి. ఎన్నికలు ముందస్తుగా రానేరావు అంటూ పందాలు కడుతు న్నారు. ‘ప్రజాస్వామ్యమంటే ప్రజలతో ఆడుకోడం’ అని ఓ నిర్వచనం ఉంది. నిన్నగాక మొన్న ఓటేసి వచ్చినట్టుంది. ఇంకా బూత్‌లో వేసిన పచ్చబొట్టు సాంతం చెరగనే లేదు. కొన్ని గోడలమీద రాసిన ‘.... కే మీ ఓటు’ రాతలు కనుమరుగు అవలేదు. నాయకులు చెప్పిన మాటలు, చేసిన వాగ్దానాలు ఇంకా చెవి గూట్లోనే ఉన్నాయ్. అప్పుడే మళ్లీ ఎన్నికలా?! ఆశ్చర్యంగా ఉంది కొందరికి. బహుశా చంద్రబాబు ముందస్తుకి మొగ్గుచూపక పోవచ్చు. మోదీ మీద కత్తులు పదును పెట్టడానికి కొంచెం వ్యవధి అవసరం. పనులన్నీ ‘బ్లూప్రింట్ల’ లోనే ఉన్నాయ్.పోలవరం గురించి పాజిటివ్‌గా చెప్పాలంటే సగం పూర్తయింది. నెగటివ్‌గా చెప్పాలంటే ఇంకా సగం మిగిలే ఉంది. కాపిటల్ నిర్మాణం శంకు స్థాపనల దశలోనే ఆగింది. నాలుగేళ్లుగా దేన్ని పట్టు కున్నా యెక్కి రాలేదు. ఢిల్లీ నుంచి బోలెడు వరద వస్తుందని, ఖజానా పొంగి పొర్లుతుందని ఆశిస్తే అది కూడా తేలిపోయింది. ఇక ఇప్పుడు చంద్ర బాబుకి మిగిలిన ఆఖరి గడి కాంగ్రెస్‌తో పొత్తు. ఈ పొత్తుని ఎట్లా సమర్థించుకుంటూ జనంలోకి వెళ్తారో తెలియదు. ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందన్నారెవరో. ఇంతకు ముందు పాపం అన్నగారి ఆత్మ ఎన్నోసార్లు క్షోభిం చింది. ఆత్మక్షోభ అలవాటు చేశాం కాబట్టి అదొక సమస్య కాదు. ఇప్పుడు మనముందున్న సమస్యల్లా పీఠాన్ని కైవసం చేసుకోవడం ఎలా అన్నది. అయినా వ్రతం చెడ్డా, ఫలం దక్కుతుందో లేదో అనుమానమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇంకా గ్రామీణ ప్రాంతంలోనే కాసినో కూసినో కాంగ్రెస్ ఓట్లు రెపరెపలాడుతున్నాయి. ఇంకా ఇందిరమ్మ పేరు గ్రామాల్లో వినిపిస్తుంది. చంద్రబాబుకి గ్రామాల్లో బొత్తిగా పలుకుబడి లేదు. ఒకప్పుడు బీసీ ఓట్లు టీడీపీకి పూర్తి అనుకూలంగా ఉండేవి. అవన్నీ ఎన్టీఆర్ పోవడంతో చెల్లాచెదురైనాయి. చంద్ర బాబు అన్నిదారులూ క్షుణ్ణంగా చూశాకనే చేత్తో చెయ్యి కలపాలనే నిర్ణయానికి వచ్చి ఉంటారు. ‘పవర్ పట్టు’ విషయంలో చంద్రబాబు నీతి నియ మాలను లెక్క చెయ్యరు. నాలుగు దశాబ్దాల ఆయన రాజకీయ జీవితంలో బోలెడు దార్లు తొక్కారు. దేనికీ అధిక ప్రాధాన్యత ఇవ్వక, ముక్కుసూటిగా నడుస్తూ, ఆ ముక్కుని అధికార పీఠం వైపు సారించి సాగుతూ వచ్చారు. ఇక హవా అంతా రీజనల్ పార్టీలదే అంటూ, తిరిగి కాంగ్రెస్‌తో కలవడం ఒక విడ్డూరం. మనం అంటే జనం ఒక్కమాట గుర్తుంచు కోవాలి. రాజకీయం అంతా ఒక్కటే. జాతీయం లేదు, స్థానికం లేదు. నేతలంతా ఈ గడ్డమీద పుట్టి, ఈ గాలి పీల్చి, ఈ నీళ్లు తాగి పెరిగిన వాళ్లే. కనుక రంగులు మారేదేమీ ఉండదు. ఎక్కడో దూరాన ఉన్నవాళ్లు అఖండ గోదావరి గురించి అనేక విధాలుగా అనుకుంటారు. ఆరాధించి కవిత్వాలు అల్లుతారు. ఇక్కడ ఉండేవాళ్లు అదే గోదావరిని మురుగు కాలువకంటే హీనంగా చూస్తారు. మన ఊరు పక్కగా వెళ్తోంది కాబట్టి మనకేమీ గొప్పగా అనిపించదు.కాంగ్రెస్ జాతీయ పార్టీ అయితే అవచ్చుగానీ, వందేళ్లకి పైబడి జనం మధ్య తెగ నలిగిపోయి ఉంది. స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ అనే పేరు ఎప్పుడో చెరిగిపోయింది. చంద్రబాబు పొత్తు పెట్టు కుంటే ఏమీ కొత్తదనం ఉండదు. చంద్రబాబు కాంగ్రెస్ కుదురులోంచి వచ్చినవారే కదా. తిరిగి రాజకీయం రాజకీయంలాగే కొనసాగుతుంది. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
వందేళ్ల కథ
’’తమిళ కట్టు’’ అనే పలుకుబడి వుంది. ఆ పలుకుబడికి చేవ తెచ్చిన రచయిత, సంస్కరణ వాది, ప్రజా నాయకుడు కరుణా నిధి. అసలు పేరు దక్షిణా మూర్తి. పూర్వీకులు గుండ్లకమ్మ ప్రాంతం నుంచి కావేరి తీరానికి వలస వెళ్లారు. రచయితగా జీవితాన్ని ప్రారంభించి, నాటకకర్తగా, సినిమా రైటర్‌గా, పాత్రికేయునిగా విశేష ఖ్యాతి గడించారు. రాజకీయ రంగంలో దశాబ్దాల పాటు రాణించారు. తమిళనాట కరుణానిధి ఒక శతాబ్దిని తనదిగా చేసుకున్నారంటే, అస్సలు అతిశయోక్తి కాదు. పెరియార్ ప్రభావంతో హేతువాదిగా తనని తాను మలుచుకున్నాడు. కడదాకా ఆ వాదంతోనే గడిపారు. అయితే కరుణానిధి జననేత. తన సొంత అభిప్రాయాలను జనసామాన్యంమీద రుద్దేవారు కాదు. ఆ సంవ త్సరం తమిళనాడులో వర్షాలు లేవు. నీళ్లకి కటకటగా వుంది. మద్రాస్ కపాలి ట్యాంకులో పాలకుడు మట్టితవ్వితే, వర్షాలు పడతాయని స్థానికుల నమ్మకం. సరే, అని ఒక సూర్యోదయాన నాడు ముఖ్యమంత్రిగా ఉన్న కరుణానిధి సంప్రదాయ సిద్ధంగా కపాలేశ్వరస్వామి ఆలయం దగ్గరకు మందీమార్బలంతో వచ్చారు. ఎండిపోయిన కపాలి కొలనులోకి దిగారు. తలకి పాగా చుట్టారు. పలుగు, పార పట్టి స్వయంగా మట్టి తవ్వి శ్రద్ధగా కరసేవ చేశారు. తమిళ, ఆంగ్ల, తెలుగు ప్రెస్ మొత్తం అక్కడికి కదిలి వచ్చింది. ఆ దృశ్యాన్ని కెమెరాల్లోకి ఎక్కించుకుని వెళ్లింది ప్రెస్. ప్రజల నమ్మకాలకు గౌరవం ఇస్తానని వినయంగా చెప్పారు కరుణ. మర్నాడు పత్రికలన్నీ ఆ ఫొటోల్ని, వార్తల్ని ప్రముఖంగా ప్రచురించాయి. ’’కళైజ్ఞర్ నల్ల జెంటి ల్మనప్పా’’ అని పెద్దలు ప్రస్తుతించారు. కరుణానిధి ఒకనాటి చక్రవర్తి రాజగోపాలాచారి తర్వాత, ఎన్న తగిన తమిళ మేధావిగా కరుణానిధిని చెబుతారు. తమిళ జననాడి ఆయనకు తెలిసినంత క్షుణ్ణంగా మరొకరికి తెలియదని చెప్పుకుంటారు. రాజాజీ పరమ ఆస్తిక భావాలతో జీవితం గడిపారు. కరుణ పరమ నాస్తిక భావాలతో గడిపారు. రచనలు కూడా భావాలకు తగ్గట్టే చేశారు. చాలా నాటకాలు రాశారు. చిత్ర రంగానికి వచ్చి ప దుల కొద్దీ స్క్రిప్ట్‌లు రాశారు. మదురై ప్రాచీన చరిత్రలో ప్రముఖంగా చెప్పుకునే ఒక సంఘటనని ’’శిలప్పదికారం’’ నాటకంగా రచించారు. ఆ నాటకంలో ’’కణ్ణగి’’ కథానాయిక, తనకు రాజువల్ల జరిగిన అన్యాయానికి ప్రతిగా ఆగ్ర హిస్తుంది. మదురై నగరం ఆమె ఆగ్రహా జ్వాలల్లో బూడిద అవుతుంది. మద్రాస్ మెరీనా బీచ్ దగ్గరో కణ్ణగి కాంస్య విగ్రహం ప్రతిషించారు. మహారాజు దౌష్ట్యాన్ని ధిక్కరించిన ఒక సామాన్య యువతిగా కణ్ణగి మంచి గుర్తింపు వుంది. ఆమె కుడిచేత బంగారు కడియం ఆగ్రహంతో ఎత్తిపట్టుకున్న ప్రతిమ మొదట మద్రాసు నగరం వైపు తిరిగి ఉండేది. అప్పట్లో సిటీలో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని, కణ్ణగిని సముద్రం వైపుకి తిప్పారు. ఇలాంటి నమ్మకాలకు ద్రవిడ నేలలో నమ్మకం, గౌరవం ఎప్పుడూ ఉంది. యస్సెస్ రాజేంద్రన్, శివాజీ గణేశన్, యమ్.జి.ఆర్–యీ ముగ్గురూ కరుణానిధి ఉధృ తంగా డైలాగులు రాసే రోజుల్లో అగ్రహీరోలు. కరు ణానిధి మాటల్లో ఒక విలక్షణమైన పలుకు వుండేది. సమకాలీన వ్యవస్థపై పదునైన విసుర్లు, అచ్చ తమిళ నానుడులు, జాతీయాలు, వళ్లువర్ లాంటి కవుల మాటలు వొదిగిపోయేవి. ఆయన సంభాషణల్లో ఒక బరువు, ఒక పరిమళం తప్పక వుండేది. రచనలు చేయడం ఆయనకు హాబీ కాదు, పిచ్చి. సమ తామూర్తి శ్రీ మద్రామానుజుల చరిత్రని టీవీకి ఎక్కిస్తున్నపుడు కరుణ కలంపట్టారు. ఆనందిస్తూ, అనుభవిస్తూ ఆ మానవతావాది సీరియల్లో పాలు పంచు కున్నానన్నారు. కరుణానిధి ప్రసంగం ని జంగా ఒక జలపాతం సభకి దిగుతున్నట్టే వుం టుంది. ఆగటం, తడబడటం, సరిదిద్దడం వుం డదు. ముఖ్య విష యంతో బాటు పిట్ట కథలు చమ త్కార బాణాలు, సామెతలు, సెటైర్లు వర్షించేవి. కరుణానిధి ప్రసంగం వినడం ఒక అనుభవం. ఆ మ హాప్రవాహంలో తమిళం తప్ప యింకో భాషా పదం దొర్లేది కాదు. తమిళ భక్తి, ద్రావిడ భావోద్వేగం, సంస్కరణాభిలాష ధ్వనించేవి. 13 సార్లు ఎమ్మెల్యేగా, 5 సార్లు ముఖ్యమంత్రిగా జన క్షేత్రంలో నిలవడం అసాధారణం. దేవుడికి మొక్కకపోయినా తమిళమ్మకి కారైకుడిలో గుడి కట్టారు.ప్రాచీన తమి ళకవులకు మండపాలు నిర్మించారు. ద్రవిడవాదానికి జెండాలెత్తినవాడు. కరుణ, యమ్జీఆర్ ఒక చెట్టు కొమ్మలే అయినా, వేరుగా ఎదిగారు. దూరం దూ రంగా జరిగారు. ద్రవిడ కట్టుకి మాత్రం తేడా రాలేదు. యమ్జీర్ తన గ్లామర్‌తో ఒక రాజ్యాన్ని పాలించారు. కరుణానిధి సొంతగ్రామర్లో ఒక రాజ్యాన్ని సృష్టించారు. శ్రీరమణ -
మానవ సంబంధాల రుచి
‘టెంకతో ఎంత సంభాషించినా తనివి తీరదు....’ శ్రీరమణ గారి ‘మానవ సంబంధాలు’ సంకలనంలోని వాక్యమిది. బరువైన పదబంధాలలోకెల్లా బరువైనది– మానవ సంబంధాలు. మనమే మేడ్ డిఫికల్ట్ చేసేసుకున్న పదబంధమేమోననిపిస్తుంది. అలాంటి మానవ సంబంధాల దండలో దారం రహస్యం విప్పారు శ్రీరమణ. అవి ఎలా అంటు కడతాయో కళ్లకు కట్టారు. ‘మామిడి–మానవ సంబంధాలు’ రచన చదివాక బాల్యంలో తగిలిన ఆ కాయ లేదా పండులోని పులుపు, తీపి, వగరు ఒక్కసారిగా నాలుక మీద నర్తిస్తాయి. వృద్ధాప్యం ‘పులి’లా దూసుకు వచ్చిన తరువాత ఇది మరింత నిజం. మామిడి కదా! ఈ ఒక్క రచనతోనే తనివి తీరలేదు. ‘మామిడిపళ్లు–మానవ సంబంధాలు’ పేరుతో ఇంకో మాగ ముగ్గిన రచననూ అందించారు. అందులో జయప్రకాశ్ నారాయణ్, గోయెంకాలతో ఎదురైన నూజివీడు రసం వంటి అనుభవాన్ని ఆవిష్కరించారు. ఈ రచనల నిండా వ్యంగ్యమే. చలోక్తులే. నానుడులు, న్యూనుడులు, సామెతలూను. అమాయకత్వం నుంచీ మేధో బరువెరుగని జీవనం నుంచీ వెల్లువెత్తిన హాస్యరసం ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఏ వ్యవస్థ శ్రీరమణగారి కలం పోటు నుంచి తప్పించుకోలేదు. అలా అని ఎవరినీ నొప్పించరు. ‘గుత్తి వంకాయకూర– మానవ సంబంధాలు’ పేరుతో వచ్చిన మొదటి రచనే పాఠకులను నోరూరించేసి, మారువడ్డన కోసం ఎదురు చూసేటట్టు చేసింది. ముక్కు, బంగారం, మామిడి, సైకిలు, మైకు, రైలు, రింగ్టోన్లు, దీపావళి, పుస్తకాలు, సినిమా, కవిత్వం, చదువు, లిఫ్టు, ఓట్లు, సెల్ఫోన్లు, క్రికెట్టు, వాస్తు– ఇలా 91 అంశాలను తీసుకుని మానవ సంబంధాలని పేనుకొచ్చారు. ముక్కు ప్రయోజనాలేమిటని ఒక కుర్రాడిని అడిగితే, ‘అది లేకపోతే కళ్లజోడు పెట్టుకోలేం!’ అన్నాడట. ఈ మోతాదు చాలని పాఠకులని మరోచోటికి తీసుకువెళతారు రచయిత– అది గద్దముక్కువారిల్లు. వారింట అందరివీ గద్ద ముక్కులేనట. ‘లిఫ్టూ – మానవ సంబంధాలు’ అనేది మరో రచన. లిఫ్ట్ మానవ సంబంధాలను ఎలా మార్చేసిందో వివరిస్తారిందులో. కానీ ఆ ఉచ్ఛనీచ చలన పేటికలలో అనగా లిఫ్టులలో మనుషులు అలా అతుక్కుపోయి పైకీ కిందకీ ప్రయాణిస్తే కొత్త చిక్కులు రావా? డాక్టర్‌ను అదే అడిగాడు ఒకడు, ‘లిఫ్ట్‌లో ఎయిడ్స్ రావడానికి అవకాశం ఉందా?’ అని. ఆ డాక్టర్ ‘అవకాశం అయితే ఉందికానీ, చాలా శ్రమతో కూడిన వ్యవహారం’ అని సెలవిచ్చాడట. ఇక పబ్లీకున జరిగే సెల్‌ఫోను వాడకం ఈ పాడు లోకాన ఏల పుట్టితిమి అనిపిస్తూ పరులను ఎంత వైరాగ్యం లోకి నెట్టివేస్తుందో చెబుతుంది– ‘సెల్‌ఫోనూ– మానవ సంబంధాలు’. కానీ అబద్ధాలాడ్డానికి సెల్‌తో ఉన్న సౌలభ్యమే వేరు. మానవ సంబంధాలకి బెడదగా మారగల వ్యవస్థల గురించీ ఉంది. ‘కవిత్వంతో మానవ సంబంధాలు విపరీతంగా దెబ్బ తింటాయి’అంటారు రచయిత. అయితే ఆ కళ ఉన్న కవులు వేరయా అని చెప్పడమే ఇక్కడ రచయిత కవి హృదయం. ఇది చూసి కవులు కక్షాకార్పణ్యాలు పెంచుకోనక్కరలేదు. ఎందుకంటే, నాస్తికులు ప్రపంచమంతటా ఉన్నా దేవుడికొచ్చిన ఫరవా ఏమైనా ఉందా? కవిత్వం కూడా అంతేనని మంగళవాక్యమే పలికారు. ‘ఇప్పుడు పళ్ల డాక్టర్ దగ్గ రికి వెళితే నిజానికి బంగారు పన్ను కట్టించుకోవడమే చౌక అనిపిస్తోంది’ (బంగారం–మా. సం.), ‘మోకాళ్లని చూసి వీడు ఈ మధ్యే సైకిల్ నేర్చాడని ఇట్టే పసిగట్టే వాళ్లు (సైకిలు–మా.సం.), ‘లిఫ్టు మనిషి అంతస్తుని క్షణంలో మారుస్తుంది’ (లిఫ్టూ–మా.సం.) వంటి న్యూనుడులు విరివిగానే కనిపిస్తాయి. శ్రీరమణ తెలుగునాట అపురూప రచయిత. ఆయన కలం నుంచి వచ్చిన అనేక అద్భుత రచనలలో ఇదొకటి. పేరడీ వంటి రసరమ్యమైన ప్రక్రియని కాపాడుతున్నవారాయన ఒక్కరే. ఆస్వాదించవద్దూ మరి! శ్రీరమణ మానవ సంబంధాలు, ప్రిజమ్, పే 312, ధర: రూ. 295. - గోపరాజు నారాయణరావు -
విషమ పరీక్షలు
అక్షర తూణీరం రెండు వారాలపాటు దేశ పార్లమెంటులో ఒక తీర్మానం బరిమీదకు రాకుండా చేశారే? మోదీ తెలుగు ప్రజల్ని అంచనా వేయడంలో పొరపాటు పడలేదు కదా? ఒక్కోసారి ఇలాగే దారుణంగా ఉంటుంది. నిన్న ఇస్రో సాధించిన ఘన విజయాన్ని ఆస్వాదించి ఆనందించి ఆ స్ఫూర్తిని సంపూర్తిగా మన యువతకు, బాలలకు అందించాల్సిన సందర్భంలో అవాకులు చెవాకులు అదే పనిగా వింటున్నాం. మిగతా అవినీతులు ఎట్లా ఉన్నా, కనీసం దిగువ స్థాయి నించి పై స్థాయి దాకా జరిగే పరీక్షల్ని లీకుల బారిన పడకుండా, సజావుగా నిర్వహించుకోలేక పోతున్నాం. పెద్దలంతా విద్యార్థి దశనించి వచ్చినవారే. ఒకసారి పరీక్షలు అయిపోయాక విద్యార్థులు ఒక దీక్షలోంచి లేదా ఒక ట్రాన్స్‌లోంచి దిగిపోతారు. మళ్లీ ఎక్కడో లీక్ అంటారు. ప్రశ్నపత్రాలు పునర్లిఖితమవుతాయి. హాయిగా ఊపిరి పీల్చుకున్న మెదళ్లు ఒక్కసారి ఉలిక్కిపడతాయి. అయితే జరిగిన పరీక్షలు ఒక కలా అనుకుంటారు. మళ్లీ కాడి భుజాన వేసుకుంటారు నిర్లిప్తంగా. ఏ మాత్రం ఉత్సాహం ఉండదు. ఉల్లాసం ఉండదు. యువత మనస్సుల్లో కసి, కార్పణ్యం తప్ప పాఠాలుండవ్. ఎవరో చేసిన తప్పుకి మాకేంటి ఈ శిక్ష అని వాపోతారు. అసహాయంగా తిట్టుకుంటారు. పాలనా యంత్రాంగాన్ని శపిస్తారు. దేశంమీద గౌరవం ఒక్కసారిగా సన్నగిల్లుతుంది. పరీక్షలు అయ్యాక నిజంగా అయిపోయాయని విద్యార్థులు అనుకుని కంటినిండా నిద్రపోయే శుభ ఘడియలు ఎప్పటికి వస్తాయో? ఎజెండాలో పెట్టండి. ఏ పార్టీ అయినా దీనిపై హామీ ఇవ్వండి. దీనికి వేరే శిక్షలుండాలి. ‘నరకంలో ఉంటాయని చెప్పుకునే శిక్షల్ని కారకులపై బహిరంగంగా అమలుచేసి మాకు కాస్తయినా ఊరట కల్పించాలని’ లీకులకు బలి అయిన విద్యార్థులు, వారితోపాటు శ్రమించిన వారి తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. లేదంటే పరీక్షల నిర్వహణ బరువు బాధ్యతల్ని డిఫెన్స్ శాఖకు అప్పగించండని సలహా ఇస్తున్నారు. నిజం. వీట న్నింటి గురించి కొంచెం ఆలోచించి మాట్లాడుకోవడానికి మనకి వ్యవధి లేదు. ఒక దేశ భక్తుడు. ఒక తెలుగువాడు దేశ ముఖ్యమైన మూడు కళ్లల్లో ఒకటైన న్యాయ వ్యవస్థలో తేనెపట్టులో ఉన్నన్ని రంధ్రాలున్నాయని ఎత్తిచూపుతుంటే– మన మేధావులకు గళం ఎత్తే తీరికలేదు. ధర్మపీఠం బీటలు వారుతోందని సాక్షాత్తూ ఒక న్యాయమూర్తి పదే పదే హెచ్చరిస్తుంటే– ఎవరూ పలకరేం? ఇంత ఉదాసీనత దేశ దౌర్బల్యమేమోనని భయంగా ఉంది. రెండు వారాలపాటు దేశ పార్లమెంటులో ఒక తీర్మానం బరిమీదకు రాకుండా చేశారే? చాలా ఘోరం! మన ప్రియతమ ప్రధాని తొలినాడు పార్లమెంటు భవన సోపానాలకు భయభక్తులతో శిరసువంచి నమస్కరించడం నిన్న మొన్నటి దృశ్యంలా ప్రజల కళ్లముందు కదుల్తోంది. అందుకే మోదీపట్ల ఒక విశ్వాసాన్ని అభిమానాన్ని జనం పెంచుకున్నారు. గొప్ప ప్రధాని మెజార్టీ చూసి పొంగిపోడు. బలవంతులు ఎందరున్నా, తల్లి బలహీనుడైన బిడ్డమీదే మమకారం చూపుతుంది. తప్పిపోయిన గొర్రె కోసమే కాపరి తపిస్తాడు. మోదీ తెలుగు ప్రజని అంచనా వేయడంలో పొరపాటు పడలేదు కదా? నాడు తెల్లదొరల గుండెల్లో నిద్రపోయిన అల్లూరి ఈ భూమి పుత్రుడే.భారత జాతిని సమైక్యం చేసి నడిపిస్తున్న మన త్రివర్ణ జాతీయ పతాకాన్ని రూపుదిద్దిన అమృతమూర్తి పింగళి వెంకయ్య ఇక్కడివాడే. ఇంకా వివరాలు తెలుసుకోండి– సకాలంలో సరైన నిర్ణయం తీసుకోండి. -శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
వారు వేరు–వీరు వేరు
అక్షర తూణీరం ఇంత నిరాశ నిస్పృహల్లోనూ అనిపిస్తుంది. ప్రజాస్వామ్యంలో ఓటు భూచక్రంలా పని చేస్తుందనీ, భూమిని క్షాళన చేస్తుందనీ. తప్పక చేస్తుంది. ఇప్పుడు చంద్రబాబు స్టెప్ ఏమిటి? కేసీఆర్‌కి జాతీయ నాయకత్వం మీద మోజు పుట్టిందా? ఈసారి నరేంద్ర మోదీ గెలిచేనా? – ఇవన్నీ ఒక అంతస్తులో వినిపించే మాటలు. ఇంకో అంతస్తులో ఈ గొడవలు వినరావు. అక్కడి వారికి పట్టనూ పట్టదు. మనది అతిపెద్ద ప్రజాస్వామ్యం. ప్రజల చేత ప్రజల వలన ప్రజల కొరకు ఏర్పడిన రాజ్యం. స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి మనమంతా గమనిస్తూనే ఉన్నాం. బాగా పెద్ద తరం వాళ్లు, మాకేం తేడా పడలేదు. తెల్లదొరలైనా నల్ల దొరలైనా అనే వాళ్లు. ‘‘ఎప్పుడైనా మన కష్టం మనకి కూడు పెడుతుంది గాని ప్రభుత్వాలు పెట్టవు’’ అనే మాట సామెతలా ప్రచారంలో ఉంది. మనం సూక్ష్మంగా పరిశీలిస్తే, ప్రభుత్వాలు జనంతో వ్యాపారం చేసుకుంటున్నాయ్. ‘‘రోడ్డు వేసుకోండి– టోల్ వసూలు చేసుకోండి’’ అన్నారు. ఇందులో దమ్మిడీ సేవ లేదు. ‘‘24 గంటలూ కరెంటు వాడుకోండి’’ అంటున్నారు. నేడు గృహస్తులు దివాలా తీస్తోంది కరెంటు బిల్లులతోనే. ప్రభుత్వం ఉచితంగా అందించాల్సిన సేవలేవీ అందడం లేదు.విద్య, వైద్యం లక్షల కోట్ల వ్యాపార దినుసు అయింది. అవన్నీ ప్రైవేట్. ఇక్కడ ప్రభుత్వం లేదు. మన గ్రామీణ వ్యవస్థలో ఎక్కడా ప్రభుత్వం కని పించదు. రోడ్లు, వంతెనలు లాంటి ప్రాథమిక అవసరాలు కూడా ఉండవు. కొన్ని వందల సంవత్సరాలుగా గ్రామాలు అట్లాగే ఉన్నాయి. మనం ఇట్లా ఎక్కడికక్కడ విశ్లేషించుకుంటూ వెళితే, ఈ ప్రభుత్వాలు రాజకీయాలు ఇవన్నీ కేవలం ఒక లేయర్‌కే పరిమితమని అర్థం అవుతుంది. ఇటీవల కాలంలో ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా వచ్చాక ఫోర్త్ ఎస్టేట్ ధాష్టీకం బాగా పెరిగింది. మన డెమోక్రసీలో అత్యంత ఆవశ్యకమైన ఎస్టేట్‌గా స్థిరపడింది. ఇవేవీ సామాన్య ప్రజకు పట్టవు. పట్టినా అర్థం కావు. ప్రత్యేక హోదా ఏమిటో, స్పెషల్ ప్యాకేజీ ఏమిటో పల్లెల్లో కూలీనాలీ చేసుకునే వారికి తెలియదు. అన్ని పార్టీలు, అందరు నాయకులు ప్రజా సేవకే కంకణాలు కట్టుకున్నారు. అయినా అస్తమానం ఒకరిమీద ఒకరు బురద ఎందుకు చల్లుకుంటారో తెలియదు. ఉవ్వెత్తున ఎగిసిపడ్డ కెరటంలా వచ్చిన మోదీ పాలన కూడా నిరాశాజనకంగానే సాగుతోంది. నాలుగేళ్లు అయిపోయింది. ఇది ఎన్నికల సంవత్సరం. ఇక సీట్లు కాపాడుకోవడం మీదే శక్తియుక్తుల్ని వినియోగిస్తారు. పార్లమెంటు ఉభయ సభలు ఆరు రోజులు ఏ పనీ చేయకుండా వాయిదాలు పడ్డాయంటే ఎంత బాధేస్తుంది. నిమిషానికి కొన్ని వేల రూపాయలు ఖర్చు అవుతుందని అందరికీ తెలుసు. అందరికీ అంటే పేపర్లు చదివి మాట్లాడుకొనే వాళ్లకి. ఇంత నిరాశ నిస్పృహల్లోనూ అప్పుడప్పుడూ అనిపిస్తుంది. ప్రజాస్వామ్యంలో ఓటు భూచక్రంలా పని చేస్తుందనీ, భూమిని క్షాళన చేస్తుందనీ. తప్పక చేస్తుంది. - రమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
కుట్ర కాదు వ్యూహం
అక్షర తూణీరం ‘ఇది తెలుగుదేశంపై కుట్ర. దీని వెనక పెద్దలున్నారు’ అని బాబు అంటున్నారు. కుట్ర అనుకుంటే కుట్ర, వ్యూహం అనుకుంటే వ్యూహం. చదరంగంలో చెక్ అన్నా, ఆటకట్టు అన్నా, షా అన్నా ఒక్కటే. పెద్దల్లో అగ్రనేత షా లేరు కదా? ఈ ఉగాది చంద్రబాబుని పూర్తిగా ఇరుకున పడేసేట్టు కనిపిస్తోంది. మొన్న సంక్రాంతి నాడు సూర్యుని ఏపీకి బ్రాండ్ అంబాసిడర్‌గా గుర్తించి గౌరవించారు. శివరాత్రి నాడు జటాజూటంలోని గంగని ఏపీ ప్రభుత్వ ఆడపడుచుగా మన్నించారు. మనది చాంద్రమానం కాబట్టి ఉగాది శుభవేళ చంద్రునికో నూలుపోగుగా ఆయనకో స్థానం కల్పి స్తారని ఎదురు చూస్తున్న వేళ ఎదురుదెబ్బ తగిలింది. మావూళ్లో ఒకాయన ఏమన్నాడంటే– ‘‘ఆమని వచ్చింది, మా చంద్రబాబు కోయిలలా కూస్తు న్నాడు. కుహూ కుహూ అని ఒకటే కూత’’ అన్నాడు. నిజమే, ఎన్నిసార్లు చెబుతాడు అదే మాట. ఎన్నికల సమయంలో సవాలక్ష అనుకుంటారు. ప్రేయసీప్రియులు పెళ్లికి ముందు బోలెడు బాసలు, ఊసులు చేసుకుంటారు. వాటినే ‘స్వీట్ నథింగ్’ అంటారు ఆంగ్లంలో. ప్రపంచ ప్రసిద్ధ స్టేట్ కాపిటల్ చంద్రబాబు కల. ఆ కలకి మోదీ ధారాళంగా నిధులు ఇవ్వాల్సిన పనిలేదు. రైతు రుణమాఫీ తెలుగుదేశం పార్టీ ఎన్నికల వాగ్దానం. దానికి కేంద్రం పైసలివ్వక్కర్లేదు. పోలవరం పూర్తి చేస్తారు. దాని సమయం దానికి పడుతుంది. తెలుగు దేశం ఎంపీలు, మంత్రులు ఢిల్లీలో కూచుని రాష్ట్రానికి ఏ చిన్నదీ సాధించలేకపోయారనే అపప్రథ సామాన్య ప్రజలో ఉంది. నాలుగేళ్ల సమయాన్ని వృథా చేశారనీ, ఈలోగా మోదీ స్థిమితపడ్డారనీ, ఇంకోరి మాట వినే స్థితిలో లేరని పరిశీలకులు అంటున్నారు. కొందరు అమాయకులు ఏమంటున్నారంటే– అందరికీ కావల్సింది రాష్ట్ర ప్రయో జనాలే అయినప్పుడు, అన్ని పార్టీలను మిళితం చేసి ఏకోన్ముఖంగా పోరాడవచ్చు గదా. వాళ్లు నిజంగా అమా యకులు. జనసేన మంగళగిరి సభలో పవన్‌కల్యాణ్ ఫిరంగి పేల్చాడు. ‘మా నాన్న ముఖ్యమంత్రి కాదని’ చిన్న తూటా విసిరాడు. తర్వాత లోకేష్‌బాబు అవినీతి మీ దృష్టికి రాలేదా అని సూటిగా చంద్రబాబుని ప్రశ్నిం చాడు మహాజన సభలో కిమిన్నాస్తి. సరితూగే జవాబు లేదు. ఖండన లేదు. ఛోటా మోటా నాయకులు మాత్రం, ఆయనెవరండీ.. పవన్‌కల్యాణ్ మాటల క్కూడా స్పందిస్తారా, గోంగూర అంటున్నారు. మొన్నటిదాకా పవన్‌కల్యాణ్ నోటెంట ఏమాట వచ్చినా, మంచి సూచన చేశారంటూ హాజరైన మాట నిజం కాదా. ఇప్పుడు తేలిగ్గా తీసేసి ‘గోంగూర’ అంటే బ్యాలెన్సవదు. పవర్లోకి రాకముందు నుంచే రాష్ట్ర వెల్ఫేర్ విషయాల్లో చినబాబే జోక్యం చేసుకుంటున్నాడని వినేవాళ్లం. ఇహ పవర్లోకి వచ్చాక ఇంకో పవర్ హబ్ ఆవిష్కృతమైందని టీడీపీ నాయకులే చెబుతున్నారు. రెండో పవర్ సెంటర్ పుట్టడం అసలు దానికి చేటని గత చరిత్ర చెబుతోంది. ‘కాకి పిల్లకేం తెలుసు ఉండేలు దెబ్బ’ అనే సామెత వేయి సంవత్సరాల నాడు పుట్టింది. ఇప్పుడు అర్జంటుగా ఇంటి ఆవరణలో స్వచ్ఛభారత్‌పై దృష్టి పెట్టాలి. ‘ఇది తెలుగుదేశంపై కుట్ర. దీని వెనక పెద్ద లున్నారు’ అని చంద్రబాబు అంటున్నారు. కుట్ర అను కుంటే కుట్ర, వ్యూహం అనుకుంటే వ్యూహం. అవి శ్వాసం వేళ మోదీకి అవకాశం వస్తుందనీ, అప్పుడు ఉతికి ఆరేస్తారని ఒకచోట విన్నా. చదరంగంలో చెక్ అన్నా, ఆటకట్టు అన్నా, షా అన్నా ఒక్కటే. పెద్దల్లో అగ్ర నేత షా లేరు కదా కొంపదీసి? - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
కళ్లు తెరవరా నరుడా!
రాజకీయ సమీకరణాలు మారుతున్న నేప«థ్యంలో బీజేపీని కాదని ఒంటరి పోరుకి దిగుదామంటే చంద్ర బాబుకు ధైర్యం బొత్తిగా చాలడం లేదు. మొన్న మోదీ పార్లమెంట్ ప్రసంగం దారితప్పిన చిరుతపులి పరుగులా సాగింది. మొదటి పానిపట్టు యుద్ధం గురించి, గజనీ మహమ్మద్ దండయాత్రల గురించి, పాకిస్తాన్ విభజన గురించి, ఆత్మప్రబోధం గురించి, యుగాలుగా తెలుగుజాతికి జరిగిన అన్యాయాల గురించి అనర్గళంగా మాట్లాడారు. అందరూ ముక్కున వేలేసుకున్నారు. పొడిగింపుగా ఇప్పుడు నేను సైతం తెలుగుజాతికి నావంతు అన్యాయం చేస్తాననే ధ్వని ఉంది ఆ ప్రసంగంలో. కిందటి ఎన్నికల్లో చంద్రబాబు, మోదీ కలసి నడిచారు. వస్తే చూద్దాంలే అన్నట్టు మోదీ బోలెడు వాగ్దానాలు చేశారు. ఢిల్లీకి దీటుగా కాపిటల్ కడదా మన్నారు. ఈ మాటకి నామాలవాడు సాక్షి. అందుకే నామం పెట్టారనే మాట వాడుకలో ఉంది. చంద్రబాబు మునుపటిలాగే, అంటే వాజ్‌పేయి హయాంలో లాగే ఇటు రాష్ట్రాన్ని అటు కేంద్రాన్ని దున్ని పడెయ్యవచ్చని ఊహించారని, మోదీ దగ్గర పప్పులుడకడం లేదని బీజేపీ వర్గాలు వ్యాఖ్యానిస్తుంటాయ్. గడచిన మూడేళ్లలో చంద్రబాబుకి ప్రధాని బొమ్మలు చూపించారు. మొన్న ఆఖరి బడ్జెట్ కూడా వచ్చాక బాబుకి అర్థమైంది. ఇన్నాళ్లూ ఎండమావి వెనకాల దాహం తీర్చుకోడానికి ఆ విధంగా ముందుకు పోతూ ఉన్నామని టీడీపీ నేతకి అర్థమైంది. ‘కళ్లు తెరవరా నరుడా’ అని వాళ్లు వీళ్లు ముందునించే హెచ్చ రిస్తుంటే, ‘‘మీకు తెలియదు. కేంద్రంలో సయోధ్యగా లేకపోతే పనులు సాగవ్. ప్రాజెక్టులు రావు. ఎయిమ్స్ నుంచి ‘జడ్’ డూమ్స్ దాకా ఏవీ రావు’’ అని సర్వజ్ఞుడిలా వాదించారు. తీరా ఇప్పుడు కథ అడ్డం తిరిగింది. చివరి బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్‌ని ఏ మాత్రం పట్టిం చుకోలేదు. మిత్రపక్షమన్న ఆధి క్యత అసలే లేదు. పోనీ మహా కాపిటల్ అంటే చంద్రబాబు సొంత సరదా అనుకుందాం. పోలవరం అందరిదీ కదా. రైల్వేజోన్‌కి ఏమొచ్చింది? చంద్రబాబు వచ్చే ఎన్నికలకి పోలవరం ట్రంప్‌కార్డ్‌గా వాడదామనుకుని కొండంత ఆశ పెట్టుకున్నారు. ఇప్పుడది పూర్తవడానికి ఇంకా మూడేళ్లు కనీసం పడుతుంది– అదీ కేంద్ర నిధులు వడివడిగా అందితే. అందుకని చంద్రబాబు లౌక్యం వీడకుండానే నిరసనగళం విప్పారు. అయినా కదలిక లేదు. మోదీ నాడి మన నేతకి అంతు చిక్కడం లేదు. ఈ సందర్భంలో సమీకరణాలు మారుతున్నాయి. అన్యాయం, అన్యాయం అంటూ అందరూ ఉద్యమానికి నడుం బిగిస్తున్నారు. ‘‘ఇది చినికి చినికి గాలివాన అయితే, వైఎస్సార్సీపీ లేదా ఇతర కూటములు పోరుకి నాయకత్వం వహిస్తే...’’ ఇంకా ఇలాంటి కొన్ని పీడ కలలు బాబుని వేధిస్తున్నాయ్. పోనీ బీజేపీని కాదని ఒంటరి పోరుకి దిగుదామంటే ధైర్యం బొత్తిగా చాలడం లేదు. ఎందుకంటే ఎన్నడూ స్వశక్తితో గెలిచిన వైనం ఆయనకు లేదు. మోదీ బుజ్జగింపుల బేరానికి రాకపోతే, చంద్రబాబు ‘‘మోదీ వ్యతిరేక కూటమికి’’ సారథ్యం వహిస్తారని విశ్లేషకులు అంటున్నారు. పవర్ లేమితో నకనకలాడుతున్నవారు, మోదీ హవా లేని దక్షిణాదివారు ఏకమైతే, కుర్చీ నాలుగు కోళ్లలో మూడు సాధ్యం. ఆ ఒక్క కోడు చంద్రబాబు ఏదో రకంగా సాధిస్తాడని నమ్మకం. వ్యతిరేక పరిస్థితుల్ని అనుకూలంగా మలచుకోవటంలో ఆయన దిట్ట! - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
మెడ తిరగని కణితి
అక్షర తూణీరం మోదీ మొండిచెయ్యిచ్చాడని అంతా వ్యాఖ్యానిస్తుంటే, చక్రం తిప్పగలనన్న గట్టి నమ్మకంతో ఉన్న చంద్రబాబుకి దిక్కులు కనిపిస్తున్నాయ్. ‘‘మొగుడు కొట్టినందుకు కాదు తోడుకోడలు నవ్వినం దుకు’’ అని సామెత. బడ్జెట్ వేళ మోదీ చేతి మొట్టికాయ తిన్న చంద్రబాబుకి పై సామెత చక్కగా అన్వయిస్తుంది. ప్రత్యేక హోదా కావాలని అందరూ ఘోషిస్తుంటే, కాదు ప్యాకేజీ లాభసాటి అంటూ వాదనకి దిగారు. ‘‘మనం ఢిల్లీలో అన్యోన్యంగా ఉంటే కదా పోలవరం పూర్తి చేసుకో గలం, ప్రపంచ ప్రసిద్ధ క్యాపిటల్ నిర్మించుకోగలం’’ అంటూ చంద్రబాబు పలుమార్లు సుదీర్ఘ సుత్తి వేస్తూ వచ్చారు. మన తలలు బొప్పెలు కట్టాయిగానీ ఏ మాత్రం పని జరగలేదు. ‘‘మోదీ నా జేబులో ఉన్నాడు. ఏదైనా నన్ను కలుపుకోందే చెయ్యరు’’ అని థిలాసా ప్రద ర్శిస్తున్న చంద్రబాబుకి గట్టి దెబ్బ ఎదురైంది. రైల్వే జోన్ పెద్ద విషయం కాదను కున్నారు. అది కూడా పీటముడి పడి కూర్చుంది. బీజేపీ వర్గాలేమంటున్నాయంటే, ఈ బడ్జెట్ పేదవాడికి, రైతుకి గొప్ప వరం. రైతుకి ఆశా కిరణం, కడుపేదకి ఆరోగ్యం. నిజమే, ఆర్థిక స్తోమతు లేక ఆప్తుల ప్రాణాల్ని చూస్తూ, చూస్తూ వదిలేసుకున్న సంఘటనలు కోకొల్లలు. ఇప్పుడు పదికోట్ల కుటుంబాలకు బతుకు భరోసా ఇచ్చారు. రైతుకి ఒకటిన్నర రెట్ల ఆదా యానికి గ్యారంటీ ఇచ్చారు. ఒక రైతుకు ఉన్న ఎకరంమీద నలభై వేలు ఖర్చు చేస్తే కనిష్టంగా అరవై వేలు ముడుతుంది. పంటలు, ధరలు బాగుండి అంతకు ఎక్కువ వస్తే మరీ సంతోషం. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా రైతన్నలు కునారిల్లిపోతున్నారు. అందరూ రైతుని దేశా నికి వెన్నెముక, అన్న దాత అంటూ భావో ద్వేగ బ్లాక్మెయిల్ చేయడం తప్ప వారికి గట్టి మేలు తలపెట్టిన నాథుడు లేడు. సింహ భాగం చెందాల్సిన వారికి బడ్జెట్లో కేటా యించారనిపించింది. పంచాయతీబోర్డు సర్పంచి తన గ్రామం గురించి ఆలోచిస్తాడు. ప్రధానమంత్రి దేశం మొత్తాన్ని కళ్లముందు నింపుకుంటాడు. వారి పార్లమెంట్ సభ్యులు ఎక్కడ చిక్కగా ఉన్నారో, ఎక్కడ పల్చగా ఉన్నారో చూస్తారు. ఆ నిష్పత్తిలో మొగ్గు చూపుతారు. ఇది రాజకీయ మూలసూత్రాలను బట్టి ధర్మమే కదా. ఇందుకు చిన్న ఉదాహరణ చెబుతాను. మా గ్రామం వేమూరుకు (రోశయ్యగారి ఊరు) రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వరహాపురం మూడు నాలుగు వేల జనాభా ఉన్న మంచి గ్రామం. ఆ ఊరికి రోడ్డు వేసి ఎనిమిదేళ్లు దాటింది. వేమూరు ఎమ్మెల్యే (ఇప్పుడు మంత్రి కూడా)ని అడిగితే, వరహాపురం వైఎస్సార్సీపీకి కంచు కోట. నాకు ఓటువేయని వారితో నాకేంటి అంటారు. కావచ్చు, కానీ ఒకసారి గెలిచాక అందర్నీ సమానంగా చూడాలి, కలుపుకుపోవాలి. ఒక చిన్న నియోజకవర్గ పరిధిలోనే ఇట్లా ఉంటే, ఆలిండియా స్థాయిలోకెల్లా ఉండాలో ఆలోచించండి. చంద్రబాబు క్యాపిటల్ డ్రీమ్‌తో ఢిల్లీకి సంబంధం ఉండాల్సిన పన్లేదు. పోలవరం నిదానంగా పూర్తి చేస్తారు. మళ్లీ ఎన్నికల ముందే జాతికి అంకితం చేసి ఓట్లు దండుకోవాలంటే కుదరకపోవచ్చు. మోదీ మొండిచెయ్యిచ్చాడని అంతా వ్యాఖ్యానిస్తుంటే, చక్రం తిప్పగలనన్న గట్టి నమ్మకంతో ఉన్న చంద్రబాబుకి దిక్కులు కనిపిస్తున్నాయ్. హస్తినలో మనకీ, మన బలగానికీ ఏ మాత్రం సీన్ లేదని తేటతెల్లమైంది. ఇది చంద్రబాబుకి మెడతిరగని కణితైంది. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ఇవాంకం
ప్రధాని మందులేని విందు ఇచ్చారు. మొరార్జీ విందు అన్నారు. దేశమంతా హాయిగా తూగే వేళ ఇలా అతిథులని ఎండగట్టడం అన్యాయమన్నారు కొందరు. ‘‘అన్ని వంటలా? తినడానికి ఎక్కువ–చూడ్డానికి తక్కువ’’ అన్నారు. నెలరోజుల్నించి సందడి.. సందడి, పండుగ.. పండుగ వాతావరణం భాగ్యనగరంలో. రెండు పెద్ద సందర్భాలు కలిసొచ్చాయ్–దసరా, దీపావళి లాగా. మెట్రో పట్టాలెక్కడం, ప్రపంచ పారిశ్రామికవేత్తల సమాలోచనలు– రెండూ కలసి నగరం రంగు మార్చాయి. ఇవాంకా ట్రంప్ రాక మొత్తం దృశ్యాన్ని ముంచెత్తింది. ఓ పక్కన మోదీకి, ఓ మూల కేసీఆర్‌కి చోటు దక్కింది. ఇవాంక కదిలే మార్గాలన్నీ రంగులు పులుముకున్నాయి. పాత చెట్లకి కొత్త రంగులు పడ్డాయ్. ఈతచెట్లు అసహజంగా కనిపిస్తూ కనువిందు చేశాయ్. గోడల మీది బొమ్మలు గాడీగా కనిపిస్తూ వచ్చేపోయే వారి దృష్టిని లాగేశాయి. ఇవాంక కోసం వచ్చిన అత్యాధునిక కార్ల టైర్లు కుదుపుకి లోనుకాకుండా రోడ్లని నునుపు చేశారు. దారికిరువైపులా పచ్చని తెరలు కట్టారు. గోల్కొండ శిథిలాల్లో ఎగిరే ఈగల్ని దోమల్ని వేటాడారు. ఇవాంక తిరిగే హద్దుల్లో వీధి కుక్కలు లేకుండా మోసేశారు. బిచ్చగాళ్లని ఏరేశారు. పనిలేని వారు వీధుల్లోకి రావద్దని పోలీసులు సలహాల్లాంటి హెచ్చరికలు జారీ చేశారు. ఇవాంక అంటే అమెరికా అధ్యక్షుని గారాల పట్టి. పైపెచ్చు సలహాదారు. అసలు రెండుమూడు వారాల పాటు మీడియాలో ఇవాంక ముచ్చట్లు తప్ప వేరే వార్తలు లేవు. కారాలు మిరియాలు కూడా వైట్‌హౌస్‌లోనే నూరుకు తెచ్చారట! వంటవారు, నీళ్లవారు, ముందస్తుగానే తినేవారు, తిని పించేవారు అంతా అక్కణ్ణించే దిగారట. ఆవిడ చార్మినార్ తిలకిస్తారట. అక్కడ రంగురంగుల గాజులు చూస్తారట... ఇలా ఇవాంక రాక నగర చరిత్రలో సువర్ణాంకమైపోయింది. ప్రధాని మోదీ విమానం దిగుతూనే పాలక వర్గానికి ఝలక్ ఇచ్చారు. హైదరాబాద్ పేరు చెబితే సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ గుర్తొస్తారని తొలి విసురు విసిరారు. ఆనాటి సాయుధ పోరాటంలో వీర మరణం చెందిన వారికి శ్రద్ధాంజలి ఘటించి, నాటి పీడకలని గుర్తుకు తెచ్చారు. కేసీఆర్ నిజాం గారికి నిత్య భజనలు చేస్తున్నారు. మెట్రోకి ‘నిజ్’ అన్నది ముద్దుపేరు. అక్కడి బీజేపీ శ్రేణులు తెగ సంబరపడి నేత ప్రసంగానికి చప్పట్లు కొట్టారు. తర్వాత మోదీ గబగబా పైలాన్‌ని, చకచకా రైలుని ఆవిష్కరించేశారు. ఇంతపెద్ద సందర్భమైనా ఒక్కమాట మాట్లాడలేదు. ఏ ఒక్కరినీ అభినందించలేదు. ఆఖరికి గొప్ప సౌకర్యం పొందిన నగరవాసులని కూడా. ప్రపంచ పారిశ్రామికవేత్తల సభలో మోదీ గళం విప్పారు. గార్గి నుంచి ఆధునికకాలం దాకా మహిళలని ప్రస్తుతించారు. తర్వాత తన పాలనలో తను చేపట్టిన అద్భుతాలను ఏకరువు పెట్టారు. ఇదే కొంచెం ఎక్స్ట్రా అయిందని విశ్లేషకులన్నారు. ఇవాంక స్పీచ్ ఒక ప్రదర్శనలా వీక్షకులని ఆకట్టుకుంది. ఫలక్‌నుమాలో ప్రధాని మందులేని విందు ఇచ్చారు. మొరార్జీ విందు అన్నారు. దేశమంతా హాయిగా తూగే వేళ ఇలా అతిథులని ఎండగట్టడం అన్యాయమన్నారు కొందరు. ‘‘అన్ని వంటలా? అన్ని వంటకాలా! తినడానికి ఎక్కువ–చూడ్డానికి తక్కువ’’ అన్నారు టీవీక్షకులు. క్షీరసాగర మథనం స్థాయిలో మేధో మథనం జరిగింది హైటెక్స్‌లో. ఇంతకీ కవ్వానికి వెన్న పడిందా? కుండలోనే కరిగిపోయిందా? ఈ నిజాలు మనదాకా రావు. ఈ ఇవాంకం నేపథ్యంలో ప్రజలొకటే కోరుకుంటున్నారు. ఇదే స్ఫూర్తితో దోమలు, వీధికుక్కల విషయంలో ఉండండి! తిరిగి జన జీవన స్రవంతిలోకి బిచ్చగాళ్లని ప్రవేశపెట్టండి, పాపం! ఏదో రకంగా అందరం బిచ్చగాళ్లమే కదా! - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
మెట్రో రైలుకి స్వాగతం
భాగ్యనగరానికి వొంకుల వడ్డాణమై మెట్రో రైల్వేట్రాక్ అమరింది. ఒక ఉక్కు సంకల్పం సాకారమైంది. చిత్తశుద్ధి, పథక రచన, కార్యదక్షత తగుపాళ్లలో ఉంటేనే ఇది సాధ్యం. చిన్నప్పుడు హైదరాబాదు రావడమంటే విదేశం వెళ్లి నట్టే. డబుల్ డెక్కర్ బస్సు అన్నిటికంటే మించిన ఆక ర్షణ. అసలు దాంట్లో ప్రయాణించడమే ఓ ఎడ్యుకేషన్ అనిపించేది. మా కోస్తా ప్రాంతం వాళ్లకి ఇరానీ చాయ్, సమోసా, డబుల్ కా మీఠా, షర్బత్ లాంటివన్నీ కొత్తే. ఇరానీ కేఫ్‌లో ఓ పక్కన గ్రాంఫోన్, పక్కన హిందీ పాటల ప్లేట్లు అమర్చి ఉండేవి. అక్కడ మనం పావలా కాయిన్ వేయగానే, చిన్న హ్యాండిల్ కదుల్తుంది. ఓ ప్లేటుని డిస్క్ మీద అమరుస్తుంది. ఆ వెంటనే సౌండ్‌పీస్ వొయ్యారంగా ప్లేటు మొదట ముల్లుమీద నిలబడేలోగా డిస్క్ తిరగడం మొదలవుతుంది. పావలాతో ఈ గారడీ చూడవచ్చు, పాట కూడా వినవచ్చు. సంగం సినిమాలో ‘‘బోల్ రాధా బోల్ సంగం హోగాకే నహీ’’ పాటమీద చాలా పావలాలు వదిలించుకున్న తీపి జ్ఞాపకం. అప్పటి గౌలిగూడ బస్టాండు నవాబుగారు విమానం పెట్టుకునే హ్యాంగరు పాపం! నౌబత్ పహాడ్ ఎక్కడం ఓ అడ్వెంచర్. యువతీ యువకులు, జంటలుకాని జంటలు అక్కడ కనిపించేవారు. తర్వాత అది బిర్లామందిర్‌గా మారింది. ఒకచోట గోపీ హోటల్ ఉండేది. అక్కడ ఇడ్లీమీద జీడిపప్పు అద్దేవారు. బర్కత్‌పురా నించి కాలినడకన వెళ్లి చార్మినార్ ఎక్కి, చుట్టాల పిల్లలతో కలిసి అక్కడ నించి నగరాన్ని చూశాం. అందరితోపాటు మేం కూడా అక్కడ పడి ఉన్న తుప్పట్టిన మేకుల్ని, రాళ్లని వాడి మా పేర్లు పొడి అక్షరాల్లో చెక్కు కున్నాం– చేసిన పాపం చెబితే పోతుంది. సాలార్జంగ్ మ్యూజియంలో స్వయంగా గంటలు కొట్టే మర మనిషి కోసం పన్నెండు అయ్యే దాకా నిరీక్షించేవాళ్లం. కరెక్ట్‌గా వేళకు వచ్చి సుత్తితో గంటలు కొట్టేసి వెళ్లిపోయేవాడు. హైకోర్టు మెట్లు, లోపల వరండాపై కప్పు చుట్టూ పెద్ద పెద్ద తేనెపట్లు ఇప్పటికీ గుర్తొస్తుంటాయ్. విగ్రహాలు లేని టాంక్బండ్, బుద్ధుడు లేని హుసేన్ సాగర్ నాకు తెలుసు. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో రన్ వేకి గేట్లుండేవి. విమానం వచ్చేటప్పుడు అడ్డంగా వెళ్లే ట్రాఫిక్ని నియంత్రించేవారు. మామిడిపళ్లు ఆ దేశంలో తూకానికి అమ్ముతారని మా ఊర్లో ఆశ్చర్యపోయేవారు. ఇక్కడ్నించి వెళ్లేటప్పుడు అక్కకి గాజులు, అమ్మకి అనాబ్ షాహిలు, నాన్నకి పుల్లారెడ్డి మిఠా యిలు తీసికెళ్లడం రివాజు. ఇప్పుడు చూస్తే మహానగరమై పోయింది. భాగ్యనగరానికి వొంకుల వడ్డా ణమై మెట్రో రైల్వేట్రాక్ అమరింది. ఒక ఉక్కు సంకల్పం సాకారమైంది. చిత్తశుద్ధి, పథక రచన, కార్యదక్షత తగుపాళ్లలో ఉంటేనే ఇది సాధ్యం. అసలీ మహా నిర్మా ణంలో పాలుపంచుకోని శాఖ లేదు. ఇది సమైక్య, సమష్టి కృషికి నిదర్శనం. ఇదొక మహత్తర సందేశం. నగరంలోని ప్రధాన వీధుల మధ్య స్తంభాలు నాటి, వాటి మీంచి ట్రాక్నే కాదు స్టేషన్లని, షాపింగ్ మాల్స్‌ని, కదిలే మెట్లని, కదలని మెట్లని సమకూర్చడం ఒక గొప్ప ఇంజనీరింగ్ ఫీట్. ఈ మహా నిర్మాణ క్రతువులో ఎన్ని జాగ్రత్తలు వహించినా కొన్ని అపశ్రుతులు తప్పవు. అపశ్రుతులకు బలైన వారిని ఇప్పుడు సంస్మరించుకోవాలి. ఈ మెట్రో ట్రాక్‌ని ఎక్కడ తట్టినా యన్వీఎస్ రెడ్డి పేరు ఖంగున వినిపిస్తుంది. శరవేగంతో పనులు సాగేందుకు నాయకుడై ముందు నిలిచిన కేసీఆర్‌కి ప్రజలు సదా రుణపడి ఉంటారు. ‘‘నిజ్’’ రైలు మార్గాన్ని జాతికి వరంగా అందిస్తున్న ప్రధాని మోదీకి హార్థికాభినందనలు. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ఒంటి చేతి చప్పట్లు
ఆ సభ్యుడు స్పీకర్ కాళ్ల మీద పడి లేచాడు. గౌరవ ముఖ్యమంత్రివర్యులకు మీ ద్వారా పాదాభివందనం సమర్పించుకుంటున్నానధ్యక్షా అనగానే సభ కుదుటపడింది. ఇప్పుడు అమరావతి శాసనసభ దేశ రికార్డ్‌ను బద్దలు కొట్టింది. ప్రతిపక్షం శాంపిల్‌గా కూడా లేకుండా అధికారపక్షం సభ నడిపిస్తోంది. తెరచాప వేసుకుని జాయ్‌గా వాలుకి సాగిపోతున్న పడవలా సభ నడుస్తోంది. దీన్నే ఆంగ్లంలో ‘కేక్వాక్’ అంటారు. తెలుగులో ‘నల్లేరు మీద బండి నడక’ అంటారు. సంసార పక్షంగా చెప్పాలంటే అత్తలేని కాపురంలా పోరు పొక్కు లేకుండా ఉంది. ప్రతి అనుకూల, ప్రతికూల సందర్భాలని తన దారికి తెచ్చుకునే నేర్పరి మన చంద్రబాబు. ‘‘.... మీరు నిర్మొహమాటంగా, నిర్భయంగా మాట్లాడండి! అవసరమైతే కడిగెయ్యండి. ప్రతిపక్ష పాత్ర పోషించండి. మనం చేసిన, చేస్తున్న పనులన్నింటినీ సమీక్షించుకుని ముందుకు పోవడానికిదొక మహదవకాశం....’’ అనగానే ఓ సభ్యుడు నిలబడి ‘‘అధ్యక్షా! నన్ను మూడు దేశాలు తిప్పుకొచ్చారు. మంచి ఫుడ్డు పెట్టించారు...’’ అంటుండగానే పక్క సభ్యుడు చొక్కా లాగి కూచోపెట్టాడు. ‘‘విశాఖలో హుద్‌హుద్ తుపాను వచ్చినప్పుడు అధ్యక్షా! మన ముఖ్యమంత్రి ఆ బీభత్సాన్ని మూడ్రోజుల్లో క్లీన్ అండ్ క్లియర్ చేసి పడేశారు. ఇది ఆయన ఘనత తప్ప మరొకటి కాదని తలబద్దలుకొట్టుకు చెబుతున్నా. దీనిని గౌరవ ముఖ్యమంత్రి బేషరతుగా అంగీకరించకపోతే, ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని సభాముఖంగా తెలియచేస్తున్నా!’’ అని మరో సభ్యుడు అనగానే చిరుదరహాసంతో ఆయన అంగీ కారం తెలిపి, ‘‘... నేను టెక్నాలజీని బాగా వినియోగింపచేశాను అధ్యక్షా! టెక్నాలజీతో కొండమీద కోతిని దింపవచ్చు అధ్యక్షా!’’ సభ దద్దరిల్లేటట్టు బల్లల మీద చరిచారు సభ్యులు. ‘‘దేశంలో అన్ని రాష్ట్రాలను పక్కకి నెడుతూ, మద్యం విక్రయాల్లో అగ్రస్థానంలో ఏపీ తూలకుండా నిలబడిందంటే దాని వెనకాల మన ప్రియతమ ముఖ్యమంత్రి ఉన్నారని చెప్పడానికి గర్విస్తున్నానధ్యక్షా!’– కొందరికి ఏదో డౌటొచ్చి బల్లలు చరచక తటస్థంగా ఉండిపోయారు. ఓ సభ్యుడు అత్యుత్సాహంగా నిలబడి, ‘‘కిందటి మిర్చి సీజన్లో అస్సలు ధర లేక రైతాంగం ఎండుమిర్చిని గుట్టలు పోసి యార్డ్‌లో తగలబెట్టినప్పుడు భరించరాని కోరు వచ్చింది. అప్పుడు అధికార యంత్రాంగాన్ని క్షణాల్లో రంగంలోకి దింపి మిర్చి కోరుని, రైతు హోరుని అదుపు చేసిన ఘనత మన ముఖ్యమంత్రిగారిదే అధ్యక్షా! వారికి మీ ద్వారా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెల్పుకుంటున్నానధ్యక్షా!’’ ఇవన్నీ వింటుంటే జానపద రామాయణంలో ఓ ఘట్టం గుర్తొచ్చింది. హనుమంతుడు రామ పట్టాభిషేక సమయంలో ఒక్కసారిగా ఆవేశపడి, ‘‘నీల మేఘశ్యామ, రామా! చెట్టు చాటు నుంచి వాలిని చంపిన రామా, కోతులతో సేతువు కట్టిన రామా!’’ అంటూ కీర్తించడం మొదలు పెడితే రాముడు అప్సెట్ అయి ఆపించాడట. రామాయణంలో పిడకల వేట అంటే ఇదే. ఇంతలో ఉన్నట్టుండి, ఓ సభ్యుడు లేచి, సభలో వెల్ వైపు నడిచాడు. అంతా నిశ్చేష్టులై చూస్తున్నారు. అధ్యక్షుల వారు కొంచెం కంగారు పడ్డారు. సన్నిటి సందులోంచి పెద్ద శబ్దంతో ఆ సభ్యుడు స్పీకర్ కాళ్ల మీద పడి లేచాడు. గౌరవ ముఖ్యమంత్రివర్యులకు మీ ద్వారా పాదాభివందనం సమర్పించుకుంటున్నానధ్యక్షా అనగానే సభ కుదుటపడింది. రెండు చేతులూ కలసినపుడే చప్పట్లు. ఒంటి చేత్తో మన వీపుల్ని మనం చరుచుకుంటే అవి చప్పట్లు కావు. ఆత్మస్తుతులు. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
కాలుష్య భారతం
దేశం ఆనందించింది దేనికంటే– మన్మోహన్ సింగ్ పదేళ్లు ప్రధానమంత్రిగా ఉన్నా పెదవి విప్పి మాట్లాడలేదు. మొన్న మాత్రం విజృంభించారు. కాలుష్యం... కాలుష్యం... ఎక్కడవిన్నా ఇదే మాట. ఢిల్లీలో కేజ్రీవాల్‌కి అత్యధికంగా 500కి 480 మార్కులొచ్చాయ్. అక్కడ స్కూల్స్‌కి సెలవులిచ్చారు. ఆ గాలి మానవమాత్రులు పీల్చలేరు. అందునా దేశ రాజధాని పరిస్థితి ఇంత అధ్వాన్నంగా ఉండడంతో దేశమంతా భయపడుతోంది. దీనికి బాధ్యత ఎవరు వహించాలి? కేజ్రీయా, మోదీనా? కర్మాగారాల పొగ, వ్యర్థాలు తగలపెట్టగా వచ్చిన పొగ, వాహనాలు వదిలే పొగ వీటికి తోడు మంచు పొగ మమేకమై కాలుష్య ఎమర్జెన్సీ విధించే పరిస్థితి ఏర్పడింది. ఎమర్జెన్సీ పదం పదే పదే వినిపిస్తుంటే, కాంగ్రెస్ గుండెల్లో బుల్డోజర్లు తిరుగుతున్నాయ్. అసలామాటని నిఘంటువుల్లోంచి చెరిపెయ్యాలని కాంగ్రెస్ వాళ్లకి ఉంటుంది. కాలుష్యాలు పలు విధాలు. దృశ్య, శబ్ద కాలుష్యాలున్నాయి. ఇవి ఏకకాలంలో టీవీ చానల్స్లోంచి నిరంతరం విడుదలవుతూ ఉంటాయ్. సెల్ఫోన్ల కాలుష్యం కూడా గణనీయమైంది. దాన్లోంచి వాట్సప్, యాప్, చాట్, సెల్ఫీ లాంటి శాఖలు, ఉప శాఖలు యథాశక్తి వాతావరణాన్ని కలుషితం చేస్తుంటాయ్. ఇవిగాక ట్విట్టర్లు, ఫేస్బుక్కులు అదనం. వాక్కాలుష్యం తక్కువ మోతాదులో ఆవరించడం లేదు. రాజకీయరంగంలో వృత్తి కళాకారులుగా రాణిస్తున్నవారు నిత్యం రెండు మూడు ధాటి ప్రసంగాలు, నాలుగైదు సాధారణాలు చేయకపోతే కంటికి నిదుర రాదు. వీరుగాక సేవా దురంధరులు, సాంఘిక నైతిక ధర్మాచారులు, ప్రవక్తలు, ప్రవచనకారులు హితబోధ చేస్తుంటారు. అది అడవికాచిన వెన్నెలని తెలిసినా వారు ఉపేక్షించరు. ఈ వృథా ప్రయాసలోంచి రవ్వంత కాలుష్యం పుడుతుంది. కార్ల నుంచి పుకార్ల నుంచి పుట్టే కాలుష్యం అధికం. నిత్యకృత్యంలో అవినీతి కాలుష్యం, అధర్మ కాలుష్యం, కల్తీల కాలుష్యం టన్నులకొద్దీ ఉత్పత్తి అవుతూనే ఉంది. లేనిపోని అతిశయోక్తులతో కనిపించి వినిపించే వ్యాపార ప్రకటనల్లో కాలుష్య సాంద్రత ఎక్కువ. మందంగా ఉంటుంది. ఫోర్త్ ఎస్టేట్ నుంచి కూడా కాలుష్యాలు రిలీజ్ అవుతూనే ఉంటాయ్. ప్రధాని మోదీ చెన్నైలో కరుణానిధిని పరామర్శించటం కొంచెం ఎక్స్ట్రా అని పించింది. అయినా భరించాం. ఆయనని విశ్రాంతి కోసం ఢిల్లీ ఆహ్వానించటం మాత్రం ఈ నేపథ్యంలో కుట్ర అనిపించింది. స్వచ్ఛ భారత్‌లో గాంధీగారి కళ్లద్దాలు ఈ కాలుష్యానికి చిలుం పట్టాయని ఓ విద్యార్థి చమత్కరించాడు. మొన్నటికి మొన్న పెద్దనోట్ల రద్దుకి తొలి వార్షికోత్సవం జరిపారు. రద్దయి ఏడాది గడచినా దానివల్ల ఒనగూడిన ఫాయిదా ఏమిటో ఏలినవారూ విడమర్చి చెప్పలేకపోయారు. ఏలుబడిలో ఉన్నవారికీ తెలియలేదు. అపోజిషన్ వారు బ్లాక్ డే పాటించారు. దేశం ఆనందించింది దేనికంటే– మన్మోహన్ సింగ్ పదేళ్లు ప్రధానిగా ఉన్నా పెదవి విప్పి మాట్లాడలేదు. మొన్న మాత్రం విజృంభించారు. ఇవే చిన్న చిన్న గుళికలై, ఆవిరి బుడగలై తేలికపడి పై పొరలోకెళ్లి దట్టమైన మంచుపొగతో మిళితమై వాతావరణాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయ్. స్కూల్స్‌కి సెలవులిచ్చారంటే, పర్యాటకులేం వస్తారు. ఇతర దేశాధినేతలు ఫోన్లో మాట్లాడటానికి కూడా భయపడతారు. కరెంటు, నీళ్లు, మురుగు, గ్యాస్ లైన్లతోపాటు ఇంటింటికీ ఆక్సిజన్ లైను వేయించండి. బహుశా కొత్త క్యాపిటల్‌లో ఆక్సిజన్ లైన్ ఉండొచ్చు. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
పారదర్శకత ఉండాలి
అక్షర తూణీరం ఒక కొత్త లోకం, అనూహ్యమైన ఆనందం ఎక్కడెక్కడో తేల్చి పారేసే చిటికెడు చిట్కాయే డ్రగ్స్. బంగారు భవిష్యత్తుని బలి తీసుకుంటున్నాయి. తెలిసి తెలిసి అత్యంత తెలివైన వారు, అద్భుతమైన సృజనశీలురు ఈ మాయలో పడటం బాధాకరం. సర్వత్రా పారదర్శకత మా ఏకైక లక్ష్యం అంటారు. అవసరమైతే పేగుల్ని బయటేస్తామంటారు. మా మెదళ్లను అద్దాల పెట్టెలో పెట్టి పారదర్శకంగా పని చేయిస్తామని పదే పదే చెబుతూ ఉంటారు. తీరా ఏదైనా సంచలనాత్మక సంఘటన వెలుగులోకి వస్తే పూర్తిగా కప్పెట్టే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడూ ప్రభుత్వపరంగా, మీడియాపరంగా ఈ ధోరణి కనిపిస్తూనే ఉంటుంది. ‘పేకాట ఆడుతూ నలుగురు ప్రముఖులు దొరికి పోయారు’ అంటూ వాళ్ల ఆనవాళ్లు మాత్రం చెబుతారు. బట్టతల, సిల్కు లాల్చీ ధరించిన వ్యాపారవేత్త, మాజీ రాజకీయ ప్రముఖుడు, ఇటీవల హత్యానేరంపై అరెస్టై విడుదలైన కాంట్రాక్టరు– ఇలాగా పొడుపు కథల్లా చెప్పి, విప్పుకోండని సవాల్ విసురుతారు. ఈ పజిల్స్ ఎందుకు సృష్టిస్తారో అర్థం కాదు. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికినప్పుడు వారి పూర్తి పేర్లు వాడుక పేర్లు చెప్పాలి. వీలుంటే అదే స్పాట్లో ఓ ఫొటో తీసి జనానికి అందించాలి. సాధారణంగా ఇలాంటి అధైర్యం వార్తలొచ్చినప్పుడు, ‘చూశారా, అందరూ కలిసి నొక్కేశారు. ఆ పేకాట దగ్గర బోలెడు క్యాష్ దొరికి ఉంటుంది. పంచేసుకుని ఉంటారు’ అని బాహాటంగానే వ్యాఖ్యానిస్తారు. ధనం, కీర్తితో మదించిన కొందరు ఇంకా కొత్త నిషాలకు పాకులాడటం సహజం. ఒక కొత్త లోకం, అనూహ్యమైన ఆనందం ఎక్కడెక్కడో తేల్చి పారేసే చిటికెడు చిట్కాయే డ్రగ్స్. బంగారు భవిష్యత్తుని బలి తీసుకుంటున్నాయి. తెలిసి తెలిసి అత్యంత తెలివైన వారు, అద్భుతమైన సృజనశీలురు ఈ మాయలో పడటం బాధాకరం. డ్రగ్స్‌ని అందకుండా నిరోధించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలా, వాడేవారే నిగ్రహించుకోవాలా? ఏది సబబో ఎవరికి వారు తేల్చుకోవాలి. మాదక ద్రవ్యాలు మన నగరానికి కొత్తేమీ కాదంటున్నారు కొందరు పెద్దవాళ్లు. ఫిలింనగర్ వార్తలకి రేటింగులో అధికమనేది అందరికీ తెలిసిందే. పోలీసు వర్గాలు పొడుపు కథలు వదిలి హాయిగా పేర్లు బయటపెట్టవచ్చు. గుట్టుగా ఉంచిన డొంకల గుట్టు కూడా విప్పొచ్చు. మన అర్ధబలం, కీర్తిబలం తిరుగులేని పలుకుబడి ఎలాంటి తప్పుడు వ్యవహారాలనైనా శుద్ధి చేయగలదనే నమ్మకాన్ని బద్ధలు కొట్టాలి. డ్రగ్స్ భయంకరమైన అంటువ్యాధి. సోకితే వదలడం చాలా కష్టం. మాదకాల వ్యాపారం చేసే వారికి ఖరీదైన కస్టమర్స్ కావాలి. అందుకు వారు నిరంతరం వలవేస్తూ ఉంటారు. చాలాసార్లు అన్యంపుణ్యం తెలి యని పిల్లలు వీరి వలల్లో పడుతుంటారు. ఆయా శాఖల్ని ట్రాన్స్పరెంట్గా ఉండేలా చూస్తే మంచిది. దయచేసి అన్ని కోటల్ని బద్ధలుకొట్టి డ్రగ్ బానిసలందర్నీ బయటపెట్టే స్వేచ్ఛ వారికివ్వండి. ఇంతకు మించిన స్వచ్ఛ భారత్ ఇంకోటి లేదు. స్వానుభవం దృష్ట్యా సినిమా పరిశ్రమ పెద్దలంతా పూనుకుని– డ్రగ్స్ అనర్థాలను కళ్లకు కట్టే డాక్యుమెం టరీలు తీసి ప్రచారం చెయ్యాలి. చానల్స్ నిత్యం కొద్ది నిమిషాలు డ్రగ్స్ దుష్ప్రభావాలను విప్పేందుకు కేటాయించాలి. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ఏలినవారి మూల ధాతువు
అక్షర తూణీరం రాష్ట్ర సీఎం పాలిట ఆబ్కారీ శమంతకమణి లాంటిది. నిత్యం పుట్లకొద్దీ బంగారం కురిపిస్తుంది. కానీ మహిళా లోకం హర్షించని, సహించని అంశం ఇది. అప్పుడప్పుడు రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో మందు ప్రస్తావన రాక తప్పదు. అవినీతి నిర్మూలన, ఆశ్రిత పక్షపాతం వహించకుండుట లాంటి అరిగిపోయిన వాగ్దానమే మద్యపాన నిషేధంపై పునరాలోచన. మన జీవి తాల్లో భాగమైంది. రాష్ట్ర ఖజానాకు ముఖ్యాధారమైంది. మద్యాన్ని పక్కనపెట్టి మనుగడ సాగించలేని దుస్థితిలో ఉన్నాం. కిందటి వారం, అంటే జూలై 1 నుంచి 4 దాకా నాలుగే నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో 200 కోట్ల రూపాయల మద్యాన్ని విక్రయించి ఆంధ్రప్రదేశ్ బ్రువరీస్ కార్పొరేషన్ ఒక్కసారి ఒళ్లు విరుచుకుంది. సుప్రీం కోర్టు ఆంక్షలు అమ్మకాలను ఏమాత్రం చెక్కు చెదరనీయలేదు. ఇది మన ఉక్కు సంకల్పానికి నిదర్శనం. ఒక్కసారి లిక్కర్ నిజాల్లోకి వెళదాం. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 4,170 మద్యం షాపులున్నాయి. తిరిగి ప్రతి షాపుకి తగినన్ని కొమ్మలు రెమ్మలు అనబడే బెల్ట్ షాపులు రేయింబవళ్లు ఆపన్నులకు సేవలందిస్తున్నాయి. వీటిలో సగానికి పైబడి సుమారు 2,118 విక్రయ శాలలు రాష్ట్ర రహదారులను సుసంపన్నం చేస్తుండగా, వెయ్యికి పైగా జాతీయ రహదారిని పండిస్తున్నాయి. ఏపీలో 746 పానశాలలు అర్ధరాత్రిదాకా మద్యకారుల్ని ఆదుకుంటున్నాయి. వీటికి అనుబంధంగా అనేక పానఘట్టాలు సందడి చేస్తున్నాయి. వీటిని టైరు షాపులంటారు. ఖాళీ ప్రదేశంలో పాత టైర్లే సుఖాసనాలుగా, సకల లాంఛనాలతో పాన ఘట్టాలు నడుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి ఏటా 15,000 కోట్లు ఈ విధంగా జమపడుతోంది. పెరుగుడే కానీ తరుగుడు లేదు. మద్యానికి యుగయుగాల చరిత్ర ఉంది. కృతయుగంలో క్షీర సాగర మథనంలో పుట్టింది. వారుణి దాని పేరు. నిషా దాని నైజం. అంతకుముందు నిషా, కైపు, మత్తు లాంటి మాటలూ లేవు, వాటి తాలూకు అనుభవాలు లేవు. అప్పట్లో వారుణి రాక్షసుల వాటాలోకి వెళ్లింది. అనంతర కాలంలో అందరికీ సంక్రమించింది. తెలుగునేత ఎన్టీఆర్ ‘వారుణి వాహిని’ పేరుతో ప్రభుత్వ సారాయిని తెలుగుగడ్డపై ప్రవహింప చేశారు. మర్యాదస్తులు వారుణిని రకరకాల పేర్లతో సంబోధిస్తుంటారు. ధాతువు, దివ్యధాతువు అని ముచ్చటించుకుంటారు కొందరు. ‘సబ్జెక్ట్’ అనీ ‘విషయం’ అనీ గుప్తనామంతో మరికొందరు పిలుస్తారు. నలుగురూ కూర్చుని చర్చించడానికి అనువైనది కనుక విషయం అని పేరు సార్థకమైంది. ఇంతకీ సంగతి ఎక్కడ, సరుకు వచ్చిందా అనుకోవడం ఆనవాయితీ. ఒక మేధావి దినుసునీ అనుపానాలనీ కలిపి ‘ద్రవాలు–ఉపద్రవాలు’ అన్నాడు. దీని ద్వారా తెలుగు భాష చిలవలు పలవలుగా, తామర తంపరగా వృద్ధి చెందింది. రాష్ట్ర ముఖ్యమంత్రి పాలిట ఆబ్కారీ శమంతకమణి లాంటిది. నిత్యం పుట్లకొద్దీ బంగారం కురిపిస్తుంది. కానీ మహిళా లోకం హర్షించని, సహించని అంశం ఇది. ఇప్పుడిప్పుడే తీగెలు కదుల్తున్నాయ్. ఎప్పుడో డొంక ఉద్యమిస్తుంది. ఎక్కడంటే అక్కడ, ఎడాపెడా ఈ దుర్మార్గం ద్వారా సొమ్ము చేసుకోవడం ఆరోగ్యకరం కాదు. కొంచెం ముందుచూపు వహించి, మద్యపాన నిషేధం విషయంలో మన మíß ళలకు చిన్న చిన్న ఆశలు కల్పించండి. ఎప్పటిలాగే మన అజెండాలో నిషేధం చేర్చండి. నందో రాజా భవిష్యతి! ఏరుదాటాక ఏంచెయ్యాలో మనకు కొట్టిన పిండే కదా! - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
అందులో సుఖం లేదు
అక్షర తూణీరం పాపాలకు రేపు నువ్ అనుభవించబోయే శిక్షలో సగం వాటా నీ అర్థాంగి స్వీకరిస్తుందేమో కనుక్కోమన్నాడు. ఆమె నిర్దాక్షిణ్యంగా నవ్వింది. కాపరానికి రాక ముందునించి క్రమం తప్పకుండా చూస్తున్న సీరియల్‌ని సైతం పక్కన పెట్టి, ఆబాల గోపాలం ఆసక్తిగా తిలకించే సందర్భం ఒకటుంది. అది– అవినీతి తిమింగలాలు, అక్రమాస్తుల అనకొండలు నిజరూపాలతో సహా వెలుగులోకి వచ్చినప్పుడు. మరీ పాతతరం ఇల్లాండ్రు ఎంత ఇష్టంగా చూస్తారో చెప్పలేం. క్రికెట్ చూస్తున్నంత ఉద్వేగంతో అరుపులు, కేకలు కూడా ఉంటాయి. ఆహా! ఆహా! బంగారు కంచాలండీ! ఏకంగా ఓ దొంతరండీ! అమ్మో! ఆ వఢ్రాణం చూడండి... మూడు చుట్ల వఢ్రాణమండీ! మా తాతమ్మకి ఉండేదని చెప్పుకునేవారు. ఆ ఉంగరాలేమిటండీ.. మరచెంబెడున్నాయి. అమో! అది రెండు పేటల కాసులపేరు. ఏవండీ... చూస్తున్నారా ఎంతబరువుందో! ‘‘ఔను, చాలా బరువుంది. మెళ్లో వేసుకోవాలంటే క్రేన్ కావాలి’’. ‘‘అంతేలెండి, అందని ద్రాక్షపళ్లు పుల్లన’’అంటూ ఆవిడ అసహనానికి గురి అవుతుంది. కూడబెట్టడం అందరూ చేస్తారు.కానీ మంచి అభిరుచితో నగానట్రా రూపంలో మదుపు చేయడం కొందరికే సాధ్యం. ఆనాడు భక్త రామదాసు రాములోరి ఫ్యామిలీకి వైనవైనాలుగా చేయించిన చందంగా పుట్టబోయే వారికి బంగారు ఉగ్గు గిన్నె లు సిద్ధం చేశారు దూరదృష్టి గల అవినీతి కోవిదులు. వాళ్లని చూ స్తే జాలేస్తుంది. రెండు చేతులా ఆర్జించి, తమ సుఖ సంతోషాలకు ఆట్టే వెచ్చించక కుటుంబ సంక్షేమం కోసం ధన కనక వస్తు వాహనాల రూపేణా తరు, జల, పాషాణ, నిధినిక్షేపాలతో సహా భూవసతి రూపేణా ఏర్పాటు చేసుకున్నారు. ఇదే వారికి శాపంగా మారింది. వారు సర్వత్రా వార్తలుగా వాసికెక్కారు. మొత్తం సర్వీస్ పొడుగునా ఆర్జించిన కష్టార్జితం, క్లిష్టార్జితం ఒక్కసారి వెలుగు చూస్తుంది. పాపం, ఎంతో రిస్క్ వహించి, నిత్యం ఎన్నో దుష్కర్మలకు పాల్పడతారు. జీవితమంతా నిత్య భయంతో గడచిపోతుంది. బినామీలకు రోజూ జోలాలి పాడాల్సిందే. టెక్నాలజీ పెరిగాక, ముఖ్యంగా అన్నిచోట్ల సీసీ కెమేరాలు వచ్చాక ఇబ్బందిగానే ఉంటోందని ఓ అనుభవశాలి వాపోయాడు. ఇచ్చి పుచ్చుకోవడాలు పోఖ్రాన్ ప్రయోగమంత కష్టంగా మారిందని మరొకాయన వ్యాఖ్యానించాడు. ఈ కథనాలను విన్నప్పుడల్లా ఆ పురుష లక్షణం గారి మీద జాలేస్తుంది. ‘‘నీకొచ్చే జీతానికి, నువ్ తెస్తున్న సొమ్ములకు పొంతన లేదు. ఇవన్నీ ఎక్కడివి మొగడా!’’అని ఏ ధర్మపత్నీ అడగదు. హాయిగా అనుభవించడంలో భాగస్వామి అవుతుంది. మూడొందల డ్రెస్‌లు, నాలుగొందల జతల పాదరక్షలు, బైక్‌లు, విలాసవంతమైన కార్లు సొంతం అయినప్పుడు పిల్లలు– పాపం! నాన్నారెక్కడనించి కొట్టుకొస్తున్నారోనని ఆలోచించరు. చచ్చేంత భయంతో, టెన్షన్‌తో, దినదిన గండంగా బతుకు వెళ్లదీసేది ఆ త్యాగ పురుషుడొక్కడే! ఒకనాడు అంగుళీమాలుడు దారిదొంగ. ఎందర్నో కొట్టి చంపి తన వారందరినీ పోషించేవాడు. ఓ మహాత్ముడు తారసపడి, పాపాలకు రేపు నువ్ అనుభవించబోయే శిక్షలో సగం వాటా నీ అర్థాంగి స్వీకరిస్తుందేమో కనుక్కోమన్నాడు. ఆమె నిర్దాక్షిణ్యంగా నవ్వింది. అంగుళీమాలుడి తలతిరిగింది. అందుకని ఎవరింటి జవాబైనా ఇలాగే ఉంటుంది. ప్రశాంతంగా జీవించడం మేలు. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
పద్మాసనం ఓ కుట్ర
అక్షర తూణీరం టెక్నాలజీ ప్రియుడైన చంద్రబాబు ‘‘మద్యం యాప్‌లు’’, ‘‘తలచుకోగానే తలుపు తడతా’’ లాంటి స్కీములు ఆవిష్కరించకుండా ఉంటే అదే చాలు. ఇంకా నా చేతులు బారలు చాపి ఉన్నట్లే అనిపిస్తోంది. ఇంకా నా కాళ్లు పద్మాసనంలో ముడిపడి ఉన్నట్లే అనిపిస్తోంది. మోదీ దేశ ప్రధానిగా పగ్గాలు పట్టగానే, ఓంకారాలతో యోగాసనాలు ఒక్కసారిగా మేల్కొన్నాయ్. సర్వ రోగాలకు విరుగుడు ఇదేనన్నారు. ఎక్కడెక్కడివాళ్లూ కాళ్లూ చేతులూ విదిలించారు. శ్వాసమీద దృష్టి పెంచారు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొరవా? యోగా స్పృహని విశ్వవ్యాప్తం చేయడమే ప్రధాని ప్రధాన లక్ష్యం అన్నారు. ఓంకారం కొంచెం బాగా కాంట్రవర్సీ అయితే, పోన్లెమ్మని దాన్ని పక్కన పెట్టేశారు. ఆసనం ద్వారా పద్మం గుర్తుని జనంలో ముద్ర వేస్తున్నారని, ఇది భాజపా పన్నిన కుట్రగా గిట్టనివారు ఆరోపిస్తున్నారు. రాబోయే రోజుల్లో, వంగి తమ పాదాలను తాము ముట్టుకోలేని వారిని అన్‌ఫిట్ చేస్తారనీ, సంఘ్ వారంతా అలవోకగా పాదాలు తాకి ఫిట్ అయిపోతారనీ చెప్పుకుంటున్నారు. మోదీ, ఆయన సహచరులు మన దేశ పౌరుల శరీరాలను యోగాతో వజ్రకాయాలు చేసే మహా సంకల్పంతో జటిలమైన మత్స్య, కూర్మ, వరాహ, వామనాది ఆసనాలను సైతం జనం మీదికి తెస్తున్నారు. మనోవాక్కాయ కర్మలను యోగాతో ఒకే తాటికి తెమ్మంటున్నారు–జీఎస్టీ విధానం లాగా. దేశ పౌరుల ఆరోగ్యం కోసం ఇంతగా ఆయాసపడే బడా నేతలు– జనాన్ని చిన్న చిన్న వ్యసనాలకు దూరంగా ఉంచే ప్రయత్నం ఎందుకు చెయ్యరో పాపం! బీడీ కట్లమీద పుర్రెబొమ్మ వేసి అనారోగ్య హెచ్చరిక చేయడానికి జంకుతారు. స్వతంత్ర సమరంలో సంపూర్ణ మద్యపాన నిషేధం వద్దనుకున్నా, కనీసం వారంలో రెండు రోజులు ఆరోగ్య దినాలుగా ప్రకటించి దేశాన్ని పొడిగా ఉంచగలరా? ఉంచలేరు. ఎందుకంటే మందుపై వచ్చే ఆదాయం ప్రభుత్వాలకు ఒక వ్యసనంగా మారింది. మద్యపాన నిషేధం ప్రతి ఎన్నికలకి పనికొచ్చే గొప్ప అస్త్రం. పాపం మహిళలు ప్రతిసారీ ఆశపడి మోసపోతూ ఉంటారు. ఆరుగాలం కష్టించే రైతులకు, రైతు కూలీలకు, పరుగులతో బతుకు గడిపే చిరుద్యోగులకు యోగాసనాలతో పనిలేదు. తాగుడుకీ, పొగకీ దూరంగా ఉంచితే చాలు. రాష్ట్ర ఖజానా కోసం వారితో చీప్ లిక్కర్ తాగించకుండా ఉంటే అదే పదివేలు. సమాజంలో పోలీసులు, ఎలిమెంటరీ టీచర్లు, గుడి పూజారులు మందుకి దూరంగా ఉంటే దేశం క్రమంగా ఆరోగ్యవంతమవుతుందని ఒక అనుభవశాలి చెప్పాడు. టెక్నాలజీ ప్రియుడైన చంద్రబాబు ‘‘మద్యం యాప్‌లు’’, ‘‘తలచుకోగానే తలుపు తడతా’’ లాంటి స్కీములు ఆవిష్కరించకుండా ఉంటే చాలు. షోడశకర్మల్లో ‘‘మందు ముట్టించడం’’ (దర్భపుల్లతో) చేర్చకుందురు గాక! శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ది గ్రేట్ సర్కార్ సర్కస్
అక్షర తూణీరం పెద్దవాణ్ణయ్యాను. దేశమనే డేరాలో పెద్ద సర్కారు, రాష్ట్రాల గుడారాల్లో చిన్న సర్కార్లు రంగ ప్రవేశం చేయడం చూశాను. చిన్నప్పుడు పి.సి. సర్కార్ ఇంద్రజాల ప్రదర్శనకి నాన్న తీసుకువెళ్లారు. ఇప్పటికీ ఆ స్టేజీ, సర్కార్ డ్రెస్సు, ఆయన టోపీ, చేతిలో మంత్రదండం, చుట్టూ మెరిసే దుస్తుల్లో అమ్మాయిలు, అబ్బాయిలు, పూర్తిస్థాయిలో పాశ్చాత్య సంగీత రొద బాగా జ్ఞాపకం. ప్రతి ఐంద్రజాలికుడు తప్పక చేసే ఐటమ్ టోపీలోంచి చెవులపిల్లిని తీసి బయట పడెయ్యడం. సర్కార్ అంటే ఆ రోజుల్లో పెద్ద పేరు. మిగతావారు ఒక కుందేలుని తీస్తే, ఈయన వరసగా చెవులు పట్టి టోపీలోంచి తీస్తూనే ఉండేవాడు. ఇక చప్పట్లు ఆగేవికావు. ‘‘నిజంగానే కుందేళ్లు వచ్చాయా?’’అని నాన్నని అడిగితే; చూశావుగా, వచ్చాయిగా అన్నారు నవ్వుతూ. ‘నాకేదో అనుమానంగా ఉంది... నీకు?’ అని ప్రశ్నించా. ‘‘అదొక విద్య. మనమంతా వినోదించేదీ, చప్పట్లు కొట్టేదీ ఆ విద్యని అద్భుతంగా ప్రదర్శించినందుకు.’’నాన్న జవాబుకి మరింత తికమకలో పడ్డా. ‘ఇంతకీ ఆ కుందేళ్లు ఎక్కడికి వెళ్లాయ్?’అన్నాను. ‘వెనకాల వాళ్ల పెట్టెల్లోకి.. మళ్లీ షోకి కావాలి కదా!’’అన్నారు. ఇంకా చాలా అద్భుతాలు, ఆశ్చర్యాలు చూసి ఇంటికి వచ్చాం. తర్వాత వారం పాటు నాన్నని సందేహాలతో పీడించి వదిలి పెట్టాను. కొన్ని డౌట్స్ తీర్చారు. కొన్ని పెద్దయితే నీకే అర్థం అవుతాయని చెప్పి వదిలేశారు. పెద్దవాణ్ణయ్యాను. దేశమనే డేరాలో పెద్ద సర్కారు, రాష్ట్రాల గుడారాల్లో చిన్న సర్కార్లు రంగ ప్రవేశం చేయడం చూశాను. అదే లైటింగు, అదేలాగ హోరెత్తించే సంగీతం, చుట్టూతా ఆర్భాటంగా అనుచరులు– ఇప్పుడు ఏ అద్భుతాన్ని ఆవిష్కరించబోతున్నారనే ఉత్కంఠ ప్రేక్షక ప్రజల్లో, అద్భుతాన్ని ప్రకటించగానే కరతాళ ధ్వనులు. నాన్న చెప్పినట్టే కొంచెం కొంచెం యెరుక కాసాగింది. ఆ సర్కార్ లాగే ఈ సర్కార్లన్నీ టోపీలోంచి, జేబుల్లోంచి చెవులపిల్లుల్ని వేదికల మీదికి వదలడం చూస్తున్నా. మాటల్లోంచి పండ్లు, ఫలాలు రాలిపడడం గమనిస్తున్నా. ఆనాడు లేని ఒక కొత్త సంగతి మీడియా. సర్కార్లు కురిపించిన ఫలాలను పదే పదే మన నట్టింట్లో చూపిస్తూ అదే అదేగా ఆనందింప చేస్తున్నారు. సర్కార్లన్నింటికీ రంగు కండువాలుంటాయ్. పెద్దాయన కాషాయ కండువా కప్పి ధాన్యపు రాశుల్ని దర్శింపచేస్తాడు. గులాబీ కండువాలోంచి ఆదర్శాలను దోసిళ్లతో పంచుతాడు మరొకాయన. పచ్చకండువాలోంచి భూతల స్వర్గాన్ని జిగేల్మనిపిస్తాడు ఇంకొకాయన. ఇవన్నీ చూసి ఆనందించాల్సిందే గానీ అనుభవించాలని ఆశపడకూడదు. అప్పటి మ్యాజిక్ షోలో ఒక ఏనుగుని మాయం చేయడం కళ్లారా చూశాను. ‘‘అదంతా మ్యాజిక్. ఏనుగు ఎక్కడికీ పోదు’’ అని చెప్పాడు నాన్న. ఇప్పుడు ఇక్కడ మాత్రం ఏనుగులు నిజంగానే మాయం అవుతున్నాయ్! శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
గోకులంలో కృష్ణుడే తెలుపు
అక్షర తూణీరం ప్రపంచంలో మహానగరాలు అద్దాల్లా ఉంటాయంటే దాని ముఖ్యకారణం ‘సివిక్సెన్స్’. మనకి ఇక్కడి ప్రభుత్వాలు క్రెడిట్స్ తీసుకుంటూ ఉంటాయి. బంగాళాఖాతం విశాఖ బీచ్ పక్కగా ప్రవహించడం నా ఘనతే అనడానికి వెనుకాడరు. వారం రోజుల నించి ర్యాంకుల నంబర్ల పొలికేకలు వినీవినీ చెవులు హోరెత్తిపోతున్నాయ్. ఇదే తరుణంలో మన ప్రియతమనేత వెంకయ్యనాయుడి నోటి వెంట మరోసారి ర్యాంకులు వినిపించేసరికి అంతా ఉలిక్కిపడ్డారు. స్వచ్ఛభారత్ పేరిట సాగుతున్న మహాయజ్ఞంలో నగరాలకు, పట్టణాలకు స్వచ్ఛతని బట్టి శ్రీ సర్కారు వారిచ్చిన ర్యాంకులివి. అంతా దిగ్భ్రమ చెందారు. ఔరా! అని నోళ్లు తెరిచారు. మన నగరానికి, మన టౌనుకి ఇంత మంచి స్థానం వచ్చిందా అని మూర్ఛపోయారు. వెనకటికో సంఘటన– భమిడిపాటి రాధాకృష్ణ మంచి రచయిత. ప్రముఖ రచయిత, హాస్యబ్రహ్మ భమిడిపాటి కామేశ్వరరావుగారి అబ్బాయి. రాధాకృష్ణ రచిం చిన నాటకానికి నాటక అకాడమి వారు ఆ సంవత్సరపు ఉత్తమ నాటక బహుమతిని ప్రకటించారు. చాలా సంతోషంగా తండ్రి దగ్గరకు వెళ్లి సంగతి చెప్పాడు. వయోభారంతో మంచంలో ఉన్న హాస్యబ్రహ్మ వినగానే చిరునవ్వు నవ్వి ‘‘మన నాటకరంగం అలా అఘోరించిందన్నమాట’’అని నిట్టూర్చారట. గోకులంలో కృష్ణుడే తెల్ల టివాడు. అంటే మిగిలిన వారి రంగుల్ని ఊహించుకోవచ్చు. గడచిన సంవత్సరం సర్వేక్షణ ప్రకారం దేశంలో అన్ని పట్టణాలకి, బస్తీలకి మార్కులు, ర్యాంకులు ప్రదానం చేశారు. అందులో విశాఖకి, తిరుపతికి మంచి స్థానాలు లభించాయి. తిరుపతికి పదిలోపు ర్యాంకు రావడం విశేషమే. అక్కడ జనాభా ఎంతనేది ప్రశ్న కాదు. నిత్యం హీనపక్షం దేశం నలుమూలల నించి లక్షకు పైగా యాత్రికులు ఆ టెంపుల్‌టౌన్‌లోకి దిగుతారు. మళ్లీ అంతమంది నిలవ భక్తులుంటారు. అదనంగా రెండు లక్షలమందిని ఆ ఊరు నిత్యం భరిస్తుంది. వారంతా పరదేశీయులు కాబట్టి, స్వచ్ఛత పాటించడంలో సమస్యలుంటాయ్. తిరుపతిని స్వామివారి నిధులు ఆదుకుంటాయి కాబట్టి, ఇంకా శుభ్రంగా, స్వచ్ఛంగా ఉంచవచ్చు. విజయవాడకి, తెనాలికి కూడా ర్యాంకులొచ్చే సరికి మార్కులా, లాటరీ తీశారా అని సందేహం వస్తోంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో సర్వే చేస్తే విజయవాడ, తెనాలిలో ఉన్నన్ని ఊరపందులు మరెక్కడా కానరావు. పైగా ‘‘పందులు గుంపులుగా వస్తాయ్’’. తెనాలి మూడు కాలువలు, బెజవాడ కాలువలు–సద్వినియోగం చేసుకుంటే ఒక వరం. ఇప్పటికీ తెనాలి కాలువల్ని డంపింగ్‌కి వాడుతూ సద్వినియోగం చేసుకుంటున్నారు. భాగ్యనగరం ర్యాంకుల విషయంలో కొంచెం కిందకి జారింది. అది కూడా ఎక్కువే అన్నారు స్థానికులు. చాలా కాలనీల్లో ఎక్కడ ఖాళీస్థలం కన్పిస్తే అక్కడ చెత్త వేసేసి చేతులు దులిపేసుకుంటున్నారు. ప్రపంచంలో మహానగరాలు అద్దాల్లా ఉంటాయంటే దాని ముఖ్యకారణం ‘సివిక్సెన్స్’. మనకి ఇక్కడి ప్రభుత్వాలు క్రెడిట్స్ తీసుకుంటూ ఉంటాయి. బంగాళాఖాతం విశాఖ బీచ్ పక్కగా ప్రవహించడం నా ఘనతే అనడానికి వెనుకాడరు. పెద్ద ప్రభుత్వ ఆసుపత్రులను చూస్తే చాలు మన పరిశుభ్రత స్థాయి తెలుస్తుంది. ఏదో చిరుదీపం వెలిగించడం ఆనందదాయకమే. స్వచ్ఛంద సంస్థలు, రికామీగా ఉన్న సీనియర్ సిటిజన్లు గట్టి సంకల్పం చేయాలి. వారికి తగినంత స్వేచ్ఛ ఇవ్వాలి. అప్పుడే సాధ్యం. శ్రీరమణ ప్రముఖ కథకుడు -
నమో విశ్వనాథా!
అక్షర తూణీరం తెలుగు పాటలు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌లో వినిపించసాగాయి. ఓంకార నాదాలు సంధానమై సప్తసముద్రాలు ప్రతిధ్వనించాయి. అది శంకరాభరణంతోనే మొదలైంది. జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకి నూత్న మర్యాద కల్పించిన దర్శకులు విశ్వనాథ్. సినిమాలు ఇంతటి రసరమ్యంగా కూడా ‘తీయనగును’ అంటూ తీసి చూపిం చిన చిత్రశిల్పి ఆయన. ఆ కళాతపస్విని ఏనాడో గుర్తించి, దేశప్రజలు తల మీద పెట్టుకున్నారు. గంగాధరునికి జలాభిషేకం చేసిన చందంగా, ఇప్పుడు ప్రభుత్వం రాజ ముద్ర వేసింది. ఆ సందర్భంగా శుభాభివందనాలు. మనకి జానపదబ్రహ్మలు, పౌరాణిక రుద్రులు ఉంటే ఉండవచ్చు గాక– ఈ ఫాల్కే గ్రహీత కథ వేరు. ఆయన కథలు వేరు. తనదై ఉండాలి, తనలోంచి రావాలి, జనానికి చేరాలన్నది ఆయన సిద్ధాంతం. ‘‘నేనేం పెద్దగా చదవను, సినిమాలు అంతగా చూడను. ఏవో ఆలోచనలొస్తాయ్.. అంతా దైవదత్తం’’ అంటూ క్రెడిట్సన్నీ దేవుడికిస్తారు. నిజం, దైవదత్తం కాబట్టే ప్రతి ఆలోచనా ఓ తొలకరి మెరుపై అందగించింది. లేకుంటే, ఓ గంగిరెద్దుల నాడించే జానపద కళాకారుల గురించి ఎవరాలోచిస్తారు? ఎవరు వెండితెరకెక్కిస్తారు!? వందనాలు... వంద వందనాలు. అనుభవంలో చేవలు తేలిన నటుల్ని తగినట్టు శిల్పించడం కొంచెం బాగా కష్టం. కానీ వారిని లేతగా తాజాగా ప్రజంట్ చేయడం విశ్వంకి వెన్నతో పెట్టిన విద్య. ఆయన ట్రాక్ రికార్డ్‌లో తొంభై శాతం విజ యాలే కనిపిస్తాయ్. కాకపోతే ఘన విజయాలు! దర్శకుడిగా విశ్వనాథ్ గొప్ప ప్రయోగశీలి. ఆది నుంచీ ప్రయోగాలే, కాదంటే దైవలీలే! మొట్టమొదటగా తెలుగు పాటలు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌లో వినిపించసాగాయి. ఓంకార నాదాలు సంధానమై సప్తసముద్రాలు ప్రతిధ్వనించాయి. అది శంకరాభరణంతోనే మొదలైంది. విశ్వనాథ్ కెరియర్ రెండు పక్షాలైంది. శంకరాభరణం పూర్వపక్షాన్ని మరిపించింది. దేశం పట్టనంత కీర్తి... విశ్వమంతా పొంగి పొర్లింది. ఆ తర్వాత ఆయనకు ఏ బిరుదు ఇచ్చినా వెలవెలబోవడం మొదలైంది. దరిమిలా తంబురా శ్రుతి మీద దేశం శ్వాసించడం మొదలు పెట్టింది. ఎందరికో కీర్తికిరీటాలు దక్కాయి. అప్పటికే మంచి నోరు పేరు తెచ్చుకున్న యస్పీ (విశ్వనాథ్ బాలుని ‘మణి’ అని పిలుస్తారు) శంకరాభరణంతో బంగారు మెట్టు మీద కూర్చున్నాడు. ‘బాలు మెచ్యూరయ్యాడన్నారు’ సినీ పండితులు. అప్పటికి పరిశ్రమలో ఆయన వయసు పదమూడు. ఆదుర్తి దగ్గర పనిచేసిన రోజుల్లో, మూగమనసులతో ప్లటానిక్ ప్రేమ సిద్ధాంతం గట్టిగా విశ్వాన్ని పట్టుకున్నట్టుంది. అక్కడ నుంచి ఆ పాట ఈ నోట పలకడం మొదలైంది. గోపి, అమ్మాయి గారు; చి కాదు, సి అంటూ సవరింపులతో పాట నేర్పించడం కొనసాగుతున్న కథాంశాలు. విశ్వనాథ్ తనకి స్వేచ్ఛనిచ్చే నిర్మాతలతోనే ప్రయాణం సాగించారు. కనుకనే అద్భుతాలు సాధించారు. తెలుగు సినిమా పరిశ్రమకి ఈయన అందించిన సేవలు అసామాన్యమైనవి. అన్నీ ఒక ఎత్తు– ఓ సీతకథతో కాళిదాసుని, సిరివెన్నెల ద్వారా భవభూతిని పట్టుకొచ్చి మనకి అంకితం చేయడం మరో ఎత్తు. వారి దయవల్ల వెండితెర బంగారమైంది. చినుకులన్నీ కలిసి చిత్రకావేరి అయినట్టు. (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) శ్రీరమణ -
మట్టిమనిషి
అక్షర తూణీరం దేశానికి రైతే వెన్నెముక అంటూ మమ్మల్ని ఈ రాజకీయం బ్లాక్మెయిల్ చేసి పబ్బం గడుపుకుంటోందని మట్టి మనుషులు గ్రహించారు. ఒకనాడు రైతు ఈ సృష్టిని పోషించాడు. శాసించాడు. నాడు రాజుల ఖజానాలు రైతులు చెల్లించే భూమి శిస్తు లతోనే నిండేవి. గ్రామాలలో కులవృత్తుల వారందరికీ మిరాశీలుగా చెల్లింపులుండేవి. భూవసతి లేని వారు పొలం పనులు చేసిపెడుతూ రైతుకి ఆదరువుగా ఉండే వారు. కూలి నాలి ధాన్యాల రూపంలో ముట్టేవి. కొను గోళ్లు తక్కువగా ఉండి, నిత్యావసరాలు పరటా పద్ధతిలో (బార్టర్ సిస్టమ్‌లో) లభించేవి. నాడు నిత్యావసరాలు ‘ఉప్పుతో పదహారు మాత్రమే’ ఉండేవి. వస్తుమార్పిడే తప్ప రొక్కంతో కొనుగోళ్లు లేవు. అందుకని గిట్టుబాటు ధరల ప్రసక్తే లేదు. నాగరికత ముదరడంతో దాని ప్రభావం గ్రామాలపై పడింది. ఈస్టిండియా కంపెనీ వ్యాపార నెపంతోనే మన దేశం వచ్చింది. వచ్చాకా వ్యాపారమే చేసింది. ఇదిగో ఈ ఆనకట్ట కడితే, ఇన్ని లక్షల ఎకరాలు సాగవుతుంది. దాని వల్ల కంపెనీ వారికి ఇంత అధిక రాబడి వస్తుందని మాత్రమే లెక్కించేవారు. ఒక రైల్వే లైను వేసినా, ఒక వంతెన కట్టినా ఒక పరిశ్రమ స్థాపించినా మనకెంత ప్రయోజనం అని మాత్రమే చూసుకునేవారు. స్వాతంత్య్రం వచ్చింది. కంపెనీ దొరలు వెళ్లిపోయారు. మనవాళ్లొచ్చి దేశ పగ్గాలు ధరించారు. అర్ధ శతాబ్ది కాలంలో, అంటే 1950 నుంచి నూతన సహస్రాబ్ది దాకా జరి గిందేమిటి? ఎవరు లబ్ధి పొందారు? అధికారాన్ని అనుభ వించిందెవరు? న్యాయమైపోయిం దెవరు? అంతరించిపోయిందె వరు? భూస్వాములంతా దుర్మార్గు లనే అభిప్రాయం వచ్చేసింది. బ్రిటిష్ హయాంలో చిన్న చిన్న రాజ్యాలన్నీ ఏకమై దేశం ఏకాం డిగా తయారైంది. తర్వాత రాజ్యా లన్నీ పోయి చిన్న చిన్న ఆస్థా నాలు, జమిందారీలు మిగిలాయి. ఈ క్రమంలోనే జనం ‘టౌను బాట’ పట్టడం మొదలైంది. ఏ విధమైన ఇతర ఆస్తుల మీదా పరిమితి విధించని ప్రభుత్వం భూములపై సీలింగ్ పెట్టింది. దీంతో పై తరగతి, మధ్య తరగతి రైతులకి బెదురు పట్టుకుంది. వ్యవసాయంపై ఆసక్తి తగ్గింది. అదే సమయంలో దూరపు కొండలు పచ్చగా కనిపించాయి. ఎండని, వానని సమంగా ఆస్వాదించిన రైతు పూర్తిగా నిరాశకి గురయ్యాడు. నేటి ప్రభుత్వ నీళ్ల కంటే నాటి ప్రకృతి ఇచ్చిన నీళ్లే బంగారం పండించాయ్. రైతు, రాజ్యం, దేశానికి రైతే వెన్నెముక అంటూ మమ్మల్ని ఈ రాజకీయం బ్లాక్మెయిల్ చేసి పబ్బం గడుపుకుంటోందని మట్టి మనుషులు గ్రహించారు. అయినా నేతలు వారిని వదలడం లేదు. బ్యాంకులు జాతీయం చేశాక రైతులకు అప్పులు మప్పారు. దాన్నొక వ్యసనంగా మార్చారు. ఎన్నికల ముందు రుణమాఫీ ఎరగా చూపి నెగ్గేస్తున్నారు. గెలిచాక మిగతా ఎన్నికల వాగ్దానాల్ని ఎంతవరకు నిలబెట్టుకుంటారో ఇదీ అంతే అవుతుంది. రాష్ట్ర ప్రభు త్వాలు, కేంద్ర ప్రభుత్వం రైతు, రైతు కూలీ ఓట్ల కోసం రకరకాల వాగ్దానాల గడ్డి కరుస్తూనే ఉన్నాయి. ‘‘ఓ తండ్రీ! వారలేమి చేయుచున్నారో వారికి తెలియదు. వారిని రక్షింపుము!’’ శుభ శుక్రవారం. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ఆత్మస్తుతి–పరనింద
అక్షర తూణీరం చంద్రబాబుకి ‘ఆత్మస్తుతి పరనింద‘ అనేది జాడ్యమై పట్టుకుంది. దీనివల్ల ప్రత్యర్థి సదా జనం మనసులో మెదుల్తుంటాడు. ఇదొక సర్వే రిపోర్ట్! ‘‘మీరు గమనించారా... మొన్నంటే మొన్న చంద్రబాబు జగజీవన్‌రామ్‌కి ఘనంగా నివాళులర్పించారు’’ ‘‘ఔను, అర్పించారు. అయితే...’’ అన్నాను. ‘అదే మరి, మీకూ నాకూ తేడా’’ అన్నాడు పెద్దాయన. అయోమయంగా చూశాను. చంద్రబాబు ‘‘జగ’’ అన్న రెండక్షరాలు పలగ్గానే ఆయనకు ప్రతిపక్షనేత ‘‘జగన్’’ మనసులోకి వచ్చారు. జగన్ చేసిన, చేస్తున్న, చేయబోయే అకృత్యాలను ఏకరువు పెట్టి, ఆ పూటకి బరువు దించుకున్నారు– అంటూ పెద్దాయన తను గమనించిన సత్యాన్ని చెప్పాడు. నే చెబుతున్న ఈ పెద్దాయన తెలుగుదేశం అభిమాని. ఎన్టీఆర్‌కి వీరాభిమాని. పార్టీని ముందుకు తీసుకెళ్తున్న చంద్రబాబుపై ఆయనకి పిచ్చి నమ్మకం. కాకపోతే ప్రత్యర్థిని క్షణక్షణం తలుచుకుంటూ ఉలికిపాట్లు పడడం పెద్దాయనకు సుతరామూ గిట్టదు. వెనకటికి హిరణ్యాక్ష హిరణ్యకశిపులు ఇదే చేసి దెబ్బతిన్నారు. హరి ప్రస్తావన ఎక్కడ వచ్చినా అగ్గిమీద గుగ్గిలం అయ్యేవారు. నారదుడు లాంటి వారు అప్పుడప్పుడు అగ్నిలో ఆజ్యం పోస్తుండేవారు. నీ రాజ్యంలో తుమ్మెదలు అదే పనిగా హరి నామ స్మరణ చేస్తూ పూల మీద వాలి మధువు సేకరిస్తున్నాయి. ఏ పూల తోటకి వెళ్లినా నీ శత్రు నామ స్మరణే వినిపిస్తోంది రాక్షసాగ్రణీ! అంటూ హిరణ్యకశిపునికి విన్నవించాడు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా! రాక్షస సైన్యాన్ని పిలిపించి, రాజ్యంలో తుమ్మెదలు ఎక్కడ కనిపిస్తే అక్కడ నరికి పోగులు పెట్టండని ఆజ్ఞాపించాడు. రాక్షస గణాలు విజృంభించాయి. వారం తిరిగే సరికి రాజ్యంలో ఎక్కడా పచ్చని మొక్కగానీ, పూలుగానీ లేకుండా పోయాయి. తుమ్మెదలు పూల కోసం వెదుకుతూ, ఝంకారం చేస్తూ, ఎగురుతూ తిరుగుతూనే ఉన్నాయి. చట్టం ఎటూ తన పని తాను చేసుకు వెళుతుంది. ఇంటా బయటా ఎక్కడంటే అక్కడ ప్రత్యర్థి ప్రస్తావన తేవడం అంత వినసొంపు కానేకాదు. ఎమర్జెన్సీ తర్వాత జనం ఇష్టపడి జనతా ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగించారు. వారు ఇందిరాగాంధీ స్మరణతో గడుపుతూ, నాలుగువేల కేసులు పెట్టి నిత్యం ఆమెను వార్తల్లో ఉంచారు. తిరిగి ఆవిడ అత్యధిక మెజార్టీతో పవర్లోకి రానే వచ్చింది. ఆ పెద్దాయన పాపం పదే పదే అదే అంటుంటాడు. ఆ మాటకొస్తే మోదీ తెలివైనవాడు. వారి హయాంలో కాంగ్రెస్ నేతలు కూడా దేశానికి బోలెడు చేశారని వదిలేశాడు. నిత్యం దైవ ప్రార్థనలా కాంగ్రెస్‌ని విమర్శించడం అవసరమా? పెద్దాయన అన్నట్టు, చంద్రబాబుకి ‘ఆత్మస్తుతి పరనింద‘ అనేది జాడ్యమై పట్టుకుంది. దీనివల్ల ప్రత్యర్థి సదా జనం మనసులో మెదుల్తుంటాడు. ఇదొక సర్వే రిపోర్ట్! (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) శ్రీరమణ -
ఉచితంగా మల్లెపూలు
అక్షర తూణీరం ఇలా ఒక్కసారిగా ఎండలు విజృంభించడం వెనకాల అపోజిషన్ వర్గం కుట్ర కూడా ఉంది. వాళ్ల పత్రికలో, చానల్స్‌లో నాలుగు డిగ్రీలు ఎక్కువ చేసి చెబుతున్నారు. వేసవికాలం వచ్చిందంటే ప్రభుత్వాలకి బోలెడు వెసులు బాటు కల్పిస్తుంది. చూడండి! అప్పుడే నాలుగు రోజు ల్నుంచి పాలకుల అకృత్యాలను కాస్త పక్కన పెట్టి, ఎండలు మండిపోవడం మీద జనం మాట్లాడుకుంటు న్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉభయ సభలనూ వీక్షిస్తున్నా, ఉభయ వర్గాల అవాకులు చెవాకులు వింటున్నా ప్రజలు అంతగా స్పందించడం లేదు. ఎందుకంటే సూర్యతాపం సరిగ్గా సభా సమయంలోనే బుర్ర పనిచేయకుండా చేస్తోంది. ఏప్రిల్ రాకుండానే, రామనవమి వెళ్లకుండానే ఇంత ఘోరమా ఈ సంవత్సరం...! ఇష్షో...! అంటూ వొగర్చడం మొదలైపోయింది. ఇలాంటి వ్యతిరేక పరిస్థితులు ఏమొచ్చినా వాటిని అనుకూలంగా మార్చుకునే సత్తా చంద్రబాబుకి ఉగ్గుపాలతో అబ్బింది. ‘‘రాబోయే కాలంలో అమరావతి వీధుల్లో ఏసీ డ్రోన్లు శీతల పవనాలు వెదజల్లుతూ చక్కర్లు కొడతాయ్! కాపిటల్‌కి భూములిచ్చిన రైతులందరికీ రెండు టన్నుల ఏసీ యూనిట్లు ఉచితంగా పంపిణీ చేస్తాం. అవసరమైతే ఈ సీజన్ మొత్తం వారికి ఉచిత విద్యుత్తు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. మీరు ఎండకి ఏమాత్రం భయపడద్దు. ఇలా ఒక్కసారిగా ఎండలు విజృంభించడం వెనకాల అపోజిషన్ వర్గం కుట్ర కూడా ఉంది. వాళ్ల పత్రికలో, చాన ల్స్‌లో నాలుగు డిగ్రీలు ఎక్కువ చేసి చెబుతున్నారు. జనం అంతా గమనిస్తూనే ఉన్నారు. అవసరమైతే మన పత్రికల్లో, మన మీడియాలో అయిదారు డిగ్రీలు తగ్గిం చుకుని, ఆ విధంగా ముందుకు పోదాం!’’– ఇట్లాంటి మాటలు నాకు కునుకు తీసినప్పుడు విని పిస్తున్నాయ్. ‘‘అవసరమైతే ఈ సూర్యతాపాన్ని జయిం చడానికి రెయిన్‌గన్స్ బయ టకు తీస్తాం! ఎండకు ఏమాత్రం భయపడద్దు.’’ ఎండలు కాస్తే కాయచ్చుగాని చైత్రవైశాఖాలు బాగుంటాయి. ఒకప్పుడు పిల్లలకి మహా సరదా సీజన్ ఇది. హాయిగా బడికి సెలవలు వచ్చేవి. అమ్మమ్మ గారింటికి చుట్టాలై వెళ్లిపోవడం ఉండేది. పుచ్చకాయలు, తాటిముంజలు, మామిడి పళ్లు, ఐస్‌ఫ్రూట్లు తిన్నన్ని దొరికేవి. హోమ్వర్కులుండవ్. పాపం! ఇప్పుడలా లేదు. సెలవల్లో కూడా పిల్లల్ని చదువు గానుగలో వేసి నలక్కొడుతున్నారు. వేసవి సెలవల మీద బోలెడంత చదువు వ్యాపారం సాగుతోంది. బాల్యం బలైపోతోంది. వేసవిలో మిగతా సంవ త్సరానికి సరిపడా పచ్చళ్లు, ఒరుగులు, వడియాలు, తయారుచేసుకునే సంప్ర దాయం ఉండేది. ప్రతి ఇల్లూ కారపు కోరుతో ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉండేది. ఇప్పుడన్నింటికీ ప్యాకెట్లలో అందించే కంపెనీలు వచ్చేశాయి. తినే వారెవ్వరూ లేకపోయినా ఓ పాతిక ఆవకాయ, ఓ పాతిక మాగాయ, ఓ పరక మెంతికాయ పడెయ్యకపోతే తోచనివారు ఇంకా తగుల్తున్నారు. పాపం వారిని చూస్తే జాలే స్తుంది. వేసవిలో మల్లెపూలు ప్రకృతి పంపే వరాలు. ముఖ్యంగా యువజంటలకి... ఇప్పుడు పెద్దగా అనకండి. ‘‘మల్లెపూలు, మంచిగంధం, సింహాచలం సంపెంగలు ఉత్సాహవంతులకి ఉచితంగా అందిస్తాం. అవసరమైతే డ్వాక్రా గ్రూప్స్ ద్వారా...’’ చాలు మహాప్రభో! - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ఫలశృతులేగానీ ప్రతిఫలాల్లేవ్!
అక్షర తూణీరం నాలుగు దశాబ్దాల క్రితం శ్రీ రాజగోపురం నిర్మాణానికి కంచి పరమాచార్య ఆదేశించారని లక్షలు సమర్పించారు స్వర చక్రవర్తి ఇళయరాజా. పుంభావ సరస్వతి. ఆయనకా ఈ ‘‘కాపీనం’’! అంతా కాలమహిమ! ‘‘సర్వమ్ బాణోచ్చిష్టమ్’’ అన్నారు పెద్దలు. ఏదీ మాతృక కాదు. ఎవరిదీ సొంతం కాదు. జన హితం కోరి అన్ని మంచి మాటలు ఎన్నడో బాణుడు అనేశాడంటారు. వ్యాస మహర్షి కూడా ఆ కోవలో వాడే. ఒకే కొండగా పడి ఉన్న వేద వాఙ్మ యాన్ని నాలుగు విభాగాలుగా వర్గీకరించాడు. మహా భారతాన్ని పంచమ వేదంగా సృజించాడు. దీన్ని పది మందీ చదివి బాగుపడండని ఫలశృతి చెప్పాడు గానీ ప్రతిఫలం ఆశించలేదు. వ్రేపల్లెలో యశోదమ్మ కడవ లలో పాలు తోడేసి, పెరుగు చేయడం నేర్పింది. ఆ వాడ ఇల్లాండ్రు నిలువు కవ్వాలతో పెరుగుమీది మీగడలు చిలికి, వెన్నలు తీయడం నేర్పారు. ఫలితంగా అక్కడ ఓ వెన్నదొంగ పెరిగి పెద్దవాడై, పెద్ద మనిషై, జగద్గురువై భగవద్గీత చెప్పాడు. ఆ గీత మానవాళికి వెలుగు వెన్నెల అయింది. బృందావనంలో గోపికలు కోలాటంలో కోపు లో ఆడిపాడిన భక్తి కావ్యాలెన్నో! వాటన్నింటినీ ఆప ళంగా, అప్పనంగా జాతికిచ్చేశారుగానీ, ‘‘మాకేంటి నభా’’ అని క్లెయిమ్ చెయ్యలేదు. ఆలయాలలో, అక్కడ ఇక్కడా జీవకళ ఉట్టిపడే శిల్పాలెన్నింటినో దర్శిస్తుంటాం. దణ్ణం పెట్టుకుంటాం. మొక్కుతాం. ఎక్కడైనా, ఏ శాసనంలో అయినా గుడి కట్టిన రాజు పేరు ఉంటుందిగానీ, దేవుడికి ప్రాణం పోసిన శిల్పి పేరు చూశారా? అయినా, తను శిల్పించిన తావున చిరంజీవిగా ఆ శిల్పి ఉంటాడు. నిజానికి విగ్రహానికి వచ్చే కీర్తి ప్రతిష్టలు, అందే పూజలు సగం శిల్పికే చెందుతాయి. నాలుకను చిత్రంగా బుగ్గలమధ్య కదిలిస్తూ అమ్మ ‘‘ఉళుతూ’’ అంటూ జోల పాటని అందుకుంటుంది. ఆ తరువాత ‘‘హాయి హాయి హాయీ ఆపదలు గాయి’’ అని పాట మొదలవుతుంది. ఏ తల్లి ఈ ఉళుళూలకు ఫణితి కూర్చిందో ఎరుక లేదుగానీ, కోట్లాదిమంది అమ్మ తల్లులు తరాలుగా అచ్చం ఒక్కలాగే జోలపాట పాడుతున్నారు. ఏ తల్లీ ఇంతవరకు ఈ బాణీపై హక్కులు కోరిన దాఖలా లేదు. మన ప్రాచీన మునులు, రుషులు తమ విద్వత్తును, అనుభవాలను ఉదారంగా జాతికి పంచారు. ఆయుర్వేదం మరో వేదమై జాతికి సేవ చేస్తోంది. దీనిపై క్లెయిములు లేవు. పాటలు నేర్పిన కోయిలకు మనం బంగారు గూళ్లు కట్టాలి. ఆటలు నేర్పిన నెమలికి వజ్రాల హారం వెయ్యాలి. జానపద సాహిత్యం వరుసలతో సహా, అనూచానంగా మనకు అందింది. త్యాగరాజస్వామి సంగీత స్వరాలను మేకు బందీ చేయడానికే కృతులు రచించారు. ట్యూనుకి పాటలు రాసిన తొట్టతొలి పాటకారి. ఉంఛ వృత్తితో రామ భక్తి సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలారు. ఎన్ని నాటకాలు, పాటలు, ఎన్ని పద్యాలు? నేటికీ జనం నాల్కల మీద నర్తిస్తున్నాయి. ఆ బాణీ లెవరివి? వెన్నెల అనుభవించడానికి హరివిల్లుని ఆనందించడానికి రుసుమా? వెయ్యేళ్ల క్రితం ఉపదేశించిన గురువు మాటని పెడ చెవిన పెట్టి, మహా నారాయణ మంత్రాన్ని శ్రీరంగం ఆలయ గోపురం మీంచి రంకె వేసి వినిపించి, అందరికీ పంచిన శ్రీమద్రామానుజుడు దైవాంశ సంభూతుడు. నాలుగు దశాబ్దాల క్రితం శ్రీ రాజగోపురం నిర్మాణానికి కంచి పరమాచార్య ఆదేశించారని లక్షలు సమర్పించారు స్వర చక్రవర్తి ఇళయరాజా. పుంభావ సరస్వతి. ఆయ నకా ఈ ‘‘కాపీనం’’! అంతా కాలమహిమ! - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ఇదొక పంచాంగ శ్రవణం
అక్షర తూణీరం మన రైతు గొప్ప నష్ట జాతకుడు. రైతుని నిర్లక్ష్యం చేయ బట్టే గ్రామాలు పాడుబడ్డాయ్. ఆవుని, ఎద్దునీ మన పిల్లలు ఇక జంతు ప్రదర్శనశాలలో చూడాల్సిందే. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ వార్షిక బడ్జెట్ సమర్పించే మహత్తర కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. అసలీ బడ్జెట్ సమర్పణకి ఇంత దృశ్యం ఎందుకు క్రియేట్ చేస్తారో తెలియదు. ఆర్థికమంత్రి ఆరోజు అభ్యంగన స్నానం చేసి, లెఖ్ఖా జమల బుల్లిపెట్టెతో సభకి రావడం ఒక ఆచారం. ఏదో పరమ రహస్యాలు ఆ ‘కవిలెకట్టలో’ ఉన్నట్టు దృశ్య నిర్మాణం జరుగుతుంది. అప్పుడప్పుడు బడ్జెట్ లీక్ అయ్యిందని గొడవ పడుతుంటారు కూడా! అసలందులో లీకవడానికి ఏమి రహస్యం ఉందని? ‘‘గడచిన యాభై ఏళ్ల బడ్జెట్ పద్దులో చూస్తే, వచ్చే ఏడాదికి మనం కూడా ఆ మాత్రం లెక్కలు సమర్పించగలం’’ అన్నాడొక యువ పాత్రికేయుడు. పైగా చెప్పిన పద్దుల ప్రకారం పనులు జరుగుతా యని నమ్మకం లేదు. చాలాసార్లు కేటాయించిన నిధులు ఖర్చుకాక మురిగిపోతూ ఉంటాయి. ప్రత్యేక శాఖలు, వాటికి మంత్రులు, బోలెడుమంది సెక్రటరీలు, కింది సెక్రటరీలు, కార్యాలయాలు– ఇవన్నీ ప్రజాధనంతో నడుస్తూ ఉంటాయి. నిధులు సద్వినియోగం చేయడానికి ప్రభుత్వానికి ఏమి అడ్డుపడతాయో తెలియదు. బడ్జెట్ రాగానే, పరమాద్భుతం.. ఇది పేదల బడ్జెట్, స్వాతంత్య్రం వచ్చాక ఇంత గొప్ప బడ్జెట్ రాలేదని ముఖ్యమంత్రి తెగ మురిసిపోతూ స్టేట్మెంట్ ఇస్తారు. బడ్జెట్ పద్దులు వినిపించేవేళ, ముఖ్యమంత్రి ఏమీ ఎరగ నట్టు, కొత్తగా వింటున్నట్టూ నటిస్తూ ఆర్థికమంత్రి పనిత నానికి ఆశ్చర్యపోవడం చూడముచ్చటగా ఉంటుంది. నిజానికి అందరూ కలిసే కదా ఈ అంకెల గారడీని చేసేది. అపోజీషన్ బెంచీలు అనాదిగా వినిపిస్తున్న పాత పాటే వినిపిస్తాయి. అసలు అందుకే తలపండిన వారేమంటారంటే– ఉగాది పంచాంగ శ్రవణానికి దీనికీ ఏం తేడా లేదు. పంచాంగంలో సంవత్సర ఫలితాలు ఉన్నట్టుగా జరగాలని ఎక్కడా లేదు. కందాయ ఫలాలు చీకట్లో రాళ్ల వంటివి. గురితప్పి ఒకటో అరో తగిల్తే, అది గణికుని దివ్యదృష్టిగా భావిస్తారు. ఈ మధ్యనే మన అత్యున్నత న్యాయస్థానం రైతుల ఆత్మహత్యలపై తీవ్రంగా స్పందించింది. వ్యవసాయ రంగంపై ఏ ప్రభుత్వాలకూ శ్రద్ధ లేదు. ‘మేక్ ఇన్ ఇండియా’ అంటూ స్లో–గన్స్ పేల్చే మోదీ సైతం గడచిన మూడు ఏరువాకల్లో రైతుకి చేసిందేమీ లేదు. చంద్రబాబుకి మొదట్నుంచీ వ్యవసాయంపై నిశ్చితాభిప్రా యాలున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం తీవ్రంగా శ్రమి స్తోంది భూసేకరణ కోసమే. క్యాపిటల్‌కి అరలక్ష ఎకరాలను ఎడారిగా మార్చారు. సముద్ర తీరాలన్నింటినీ కైంకర్యం చేసే ప్రయత్నంలో ఉన్నారు. నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు కొన్ని లక్షల ఎకరాలను స్వాధీనం చేసుకోనున్నాయి. ప్రభుత్వా నికి హుటాహుటి ఫలించే పథకాలు కావాలి. సద్యోగర్భాలు మాత్రమే కావాలి. మన రైతు గొప్ప నష్ట జాతకుడు. పండితే ధర ఉండదు. లేదా ప్రకృతి తిరగబడు తుంది. నకిలీ విత్తనాలను ప్రభుత్వం అరికట్టలేకపోతోంది. రైతుని నిర్లక్ష్యం చేయ బట్టే గ్రామాలు పాడుబడ్డాయ్. ఆవుని, ఎద్దునీ మన పిల్లలు ఇక జంతు ప్రదర్శనశా లలో చూడాల్సిందే. గతంలో చంద్రబాబు ఏలికలో, రైతుల ఆత్మహత్యలని ‘మాస్ హిస్టీరియా’గా అభివర్ణించి అభాసుపాలైనారు. రైతు రుణమాఫీ వాగ్దానం ఎండ మావిలా చిక్కకుండా పరుగులు పెడుతోంది. సేద్యం చేస్తే ఏడాదికిగానీ ఫలితం తెలియదు. అసలు తెలుగుదేశం పుటకే కిలో రెండు రూపాయల బ్రహ్మాస్త్రంతో పుట్టింది. తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం సారాయి అంగళ్ల మీద బతుకుతోంది. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
థాంక్యూ డాడీ!
అక్షర తూణీరం రాజకీయ రంగంలో, ముఖ్యంగా తెలుగుదేశంలో అంచె లంచెలుగా ఎదిగి, క్యాబినెట్ గడపలో ఉన్న లోకేశ్‌ని చూస్తున్నప్పుడు చిట్టిబాబు విజయగాథ గుర్తుకొచ్చింది. అదొక పెద్ద కర్మాగారం. మిట్ట మధ్యాహ్నం వేళ దాని ప్రాంగణమంతా కోలాహలంగా ఉంది. కార్మికులంతా ఆదరాబాదరా అన్నం తిని సమావేశ మందిరంలో చేరారు. ఫ్యాక్టరీ యజమాని మైకు ముందుకు రాగానే మందిరం నిశ్శబ్దమైపోయింది. ‘‘సోదరులారా! నేడు మనందరికీ సుదినం. కష్టించి పనిచేస్తే ఫలితం దక్కి తీరుతుందని రుజువు అవుతున్న సందర్భమిది. మన ఫ్యాక్టరీలో మూడు నెలల నాడు సాధారణ కార్మికుడిగా చేరాడు చిట్టిబాబు. అతని పనితనం, నిజాయితీ, సేవా తత్పరత మనందరినీ ముగ్ధుల్ని చేయగా రెండు నెలల క్రితం వర్క్స్ ఇన్చార్జ్గా ఎదిగాడు. మళ్లీ అక్కడ కూడా చిట్టిబాబుది అదే వరస. ఆ చొరవ, ఆ పనివాడితనం తట్టుకోలేకపోయాం. ఇంకో మెట్టుపైన కూచోపెట్టక తప్పింది కాదు. మళ్లీ పది రోజులు గిర్రున తిరి గాయి. చిట్టిబాబు దీక్షా దక్షతల వల్ల మన ఫ్యాక్టరీ చక్రాలు మహా వేగాన్ని పుంజు కున్నాయి. ఇక్కడ కష్టానికి గుర్తింపు ఉందనే నమ్మకం మన కార్మికులందరికీ కలిగించడమే నా ఉద్దేశం. అందుకే మన ఆదర్శ కార్మికుడు చిట్టిబాబుని సంస్థకి మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమిస్తున్నాను.’’ యజమాని ప్రసంగం పూర్తికాకుండానే చప్పట్లతో హాలు దద్దరిల్లింది. చప్పట్ల మధ్య నించి వేదిక ఎక్కిన చిట్టిబాబు, యజ మానికి నమస్కరించి ‘థాంక్యూ డాడీ!’అన్నాడు. ఆ తండ్రి మురిసిపోయాడు. రాజకీయ రంగంలో, మరీ ముఖ్యంగా తెలుగు దేశంలో అంచెలంచెలుగా ఎదిగి, క్యాబినెట్ గడపలో ఉన్న లోకేశ్‌బాబుని చూస్తు న్నప్పుడు చిట్టిబాబు విజ యగాథ గుర్తుకొచ్చింది. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని పేరేగానీ, ముఖ్యమంత్రి గాని, ప్రధానమంత్రి గాని ‘‘నా ప్రభుత్వం’’ అనే మాట వాడరు. చాలా స్వేచ్ఛగా, షాజహాన్ చక్రవర్తిలా ‘‘నేను చేస్తా, నేనిస్తా, నేనుంటా’’ అనే మాట్లాడుతుంటారు. మంత్రులంతా సామంతుల్లా మాటకి ముందు నాయకుడి పేరు స్మరిస్తూ మాట్లాడుకుంటారు. దీనికి మనం బాగా అల వాటు పడిపోయాం. ఎప్పుడైతే పార్టీ పగ్గాలు, అధికార పగ్గాలు ఒకే చేతిలోకి వచ్చే సంప్రదాయం తెచ్చారో అప్పుడే ‘‘రాజరికం’’ ప్రవేశించింది. వంశపారంపర్య రాజకీయాలకు స్వస్తి చెప్పాలని మోదీ ఎంత ఘోషించినా ఈ వ్యవస్థ పట్టిం చుకోదు. పైగా మానవహక్కులను హరించడం కూడా అవుతుంది. ఐఏఎస్ గారి అబ్బాయి ఐఏఎస్ అవడం లేదా? కూలివాడి బిడ్డ కూలివాడవడం లేదా? పిల్లలు వెదురు మోసుల్లా పొడుచుకు వస్తుంటే దాన్ని ఆపడం ఎవరితరం. యువరాజు క్రియాశీల రాజకీయాల్లో అడుగుపెడుతూనే ఆస్తులు డిక్లేర్ చేసి, ‘ఔరా!’ అనిపించుకున్నారు. కాకపోతే ఆస్తులు మరీ ఇబ్బడిముబ్బడిగా పెరిగా యని కొందరి ఆక్షేపణ. భర్తృహరి చెప్పినట్టు నీటిబొట్టు పడే చోటుని బట్టి దాని సౌభాగ్యం ఉంటుంది. పెనం మీద పడితే ఆవిరైపోతుంది. ఎడారిలో ఇంకిపో తుంది. సముద్రంలో కలసిపోతుంది. ముత్యపుచిప్పలో మంచి ముత్యమై మెరు స్తుంది. కొందరిళ్లలో డబ్బులు దుబ్బుల్లా పెరుగుతాయి. డబ్బు మూటలు కుందేలు సంతానంలా వర్థిల్లుతాయి. అది వారి వారి అదృష్టాలను బట్టి ఉంటుంది. పైగా లోకేశ్‌బాబు ‘‘దేవుడి దయ వల్ల’’ షేర్ విలువ అనూహ్యంగా పెరిగిందని లెక్క చెప్పారు. నిజమే దేవుడి దయవుంటే పట్టిందల్లా బంగారమైతే ఎంతసేపు కావాలి, నాలుగొందల కోట్లు జమ పడడానికి! సత్యనారాయణస్వామి వ్రతం చేసి, కథలు విని, ప్రసాదం స్వీకరించినా చాలు. చిత్తశుద్ధి ముఖ్యం. ఆస్తి పోగెయ్యడానికి కాదు, వ్రతమాచరించడానికి. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
స్వర్ణరథం సాగాలంటే..?
అక్షర తూణీరం ఆపత్కర, విపత్కర పరిస్థితులలో సభ లోపలి వీడియో కెమెరాల కళ్లని, చెవుల్ని లిప్తపాటులో మూసెయ్యగల బిసలు ఏర్పాటు చేసే ఉంటారు. ఆంధ్రప్రదేశ్‌కి నూతన శాసనసభా ప్రాంగణం సిద్ధ మైంది. చక్కని సభాభవనం ఉంది. రకరకాలుగా పండిన శాసన సభ్యులున్నారు. ఇక వారంతా విడివిడిగా, కలి విడిగా కొత్త బెంచీల్లో కూర్చుని ఆలోచనలు, చర్చలు, తీర్మానాలు చేయడమే తరువాయి. తాత్కాలికమైందే కావచ్చు గానీ అద్భుతంగా నిర్మించారు. మయసభలా ఉందని ఒక పెద్దాయన మురిసిపోయాడు కూడా. రాష్ట్ర అభ్యున్నతి గురించి పెద్దలు, సభ్యులు ఒకే కప్పు కింద తీవ్రంగా ఆలోచించేవేళ మైకుల్ని విరిచి విసిరి అసహనాన్ని వ్యక్తం చేసే అవకాశం ఇప్పుడు లేదు. స్పీకర్ పోడియమ్ని శత్రుదుర్భేద్యంగా కట్టుదిట్టం చేశారు. ఇంకా కానరాని సౌలభ్యాలు, సౌకర్యాలు ఏమి కల్పించారో వాడకంలోకి వస్తేగాని తెలి యదు. ఆపత్కర, విపత్కర పరిస్థితులలో సభ లోపలి వీడియో కెమెరాల కళ్లని, చెవుల్ని లిప్తపాటులో మూసెయ్యగల బిసలు ఏర్పాటు చేసే ఉంటారు. ఒక అనుభవజ్ఞుడేమన్నాడంటే–ఇదేమన్నా మన సొంత ఇల్లా? రేప్పొద్దున్న బళ్లు ఓడలు, ఓడలు బళ్లు అయితే, జనహితం కోరి స్పీకర్‌పై దండెత్తాల్సి వస్తే అప్పుడు చాలా ఇబ్బంది కదా, ఇది మన గొయ్యి మనమే తవ్వుకోవడం కాదా? స్పీకర్‌కి రక్షణ కల్పించాలనుకుంటే శరీరానికి ఉక్కు కవచాలు, శిరస్త్రాణం ఏర్పాటు చెయ్యాలన్నది సూచన. అంతేగాని సభా పతికి, సభికులకు నడుమ అడ్డుగోడ ఉండరాదన్నది కొందరి అభిమతం. కొందరు బొత్తిగా సానుకూల ఆలోచనలు లేని వారుంటారు. వాళ్లని నెగ టివ్ థింకర్స్ అంటారు. వాళ్లు చంద్రబాబుని, ఆయన తలపెట్టిన అద్భుతా లను అస్సలు అర్థం చేసు కోరు. రాళ్లు, సిమెంట్, కుర్చీలు, కుషన్లు, ఆధునిక యంత్రాలు బిగించి నిర్మిం చారు. బావుంది. అయితే అక్కడ కొలువు తీరేవారి ఆలోచనా సరళిని మార్చ గలరా? అరుపుల్ని, అబద్ధాలని అరికట్టే టెక్నాలజీని తీసుకొచ్చారా? వేసవి వేళ హాయిగా చల్లగా నిద్రకు ఒడిగట్టే మన ప్రజా ప్రతినిధులను జాగృతం చేసే మెకానిజం సభలో ఉందా? చిత్తశుద్ధి, సేవాభావం, నిజాయితీ ఉండాలే గానీ సభని పచ్చని చెట్ల నీడన నడిపినా ఫలితం బ్రహ్మాండంగా ఉంటుంది. పాలకులు పచ్చల సింహాసనాలపై కాదు. పచ్చికబీళ్లపై కూచుని కూడా ప్రజాహితానికి పాటుపడవచ్చు. ఇవన్నీ ప్రతికూల ఆలోచనలు. ఒకరోజు సుయోధనుడు, కూరిమి చెలికాడు కర్ణుడు కలసి సరికొత్త స్వర్ణ రథంలో కొలువుకి వచ్చారు. రథయాత్ర అంత సుఖంగా, సౌమ్యంగా లేదని రారాజు ఆరోపించాడు. రథశిల్పి వినయంగా చేతులు కట్టుకుని, ‘‘సార్వభౌమా! రథ నిర్మాణంలో నా లోపం లేదు. శాస్త్ర ప్రకారమే ప్రతి భాగాన్ని కూర్చాను. వాహనం సుఖంగా ముందుకు వెళ్లాలంటే, కుదురైన వీధులు కావాలి. వడి కలిగి, సారథిని గమనించుకోగల అశ్వాలుండాలి. రథాన్ని తమరికి అప్పగించే ముందు రథంలో నాలుగు దీపాలను ఉంచి నడిపించాను. ప్రమిదల్లో తైలాలు చిందలేదని మీ అధికారులు నిర్ధారించాకే రథాన్నిచ్చాను.’’ అన్నాడు. రాజు మారు మాట్లాడలేదు. అదీ కథ. ఇప్పుడు అమరావతికి కావలసింది స్వర్ణరథంతో బాటు మిగిలిన విశేషాంశాలు. అంతేగాని పొద్దస్తమానం స్తోత్రపాఠాలు వల్లించే సాఫ్ట్వేర్ కాదు. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
మహాశివరాత్రి మర్నాడు
అక్షర తూణీరం వందడుగుల ఎత్తుండి, విద్యుద్దీపాలతో శోభాయమా నంగా అలరారుతూ, మహాదేవుణ్ణి సేవించే శివరాత్రి ప్రభలు గొప్ప సాంస్కృతిక వేదికలు కూడా. శివరాత్రి కోసం ఏడాది పొడుగునా ఎదురు చూస్తారు. భక్తితో కొందరు, ముక్తికోసం మరికొందరు, రక్తికై ఇంకొందరు. ఇదో పెద్ద కోలాహలం. అందుకే జన్మకో శివరాత్రి అంటారు. మిగతా రోజుల్లో ఏమాత్రం పట్టిం చుకోని శివలింగాలు సైతం శివరాత్రి రోజు వెలిగి పోతాయి. మన కోటప్పకొండ ప్రభలతో వచ్చే భక్తు లతో, శివనామంతో దద్దరిల్లుతుంది. అమరావతి సరే సరి. సింగరకొండ, మంగళగిరి, గోలాడలో జరిగే తిరు నాళ్లు ముక్తికి, రక్తికి సోపానాలు. శివరాత్రి ప్రభలు మన సొంత సంప్రదాయం. వందడుగుల ఎత్తుండి, విద్యుద్దీపాలతో శోభాయమానంగా అలరారుతూ, మహాదేవుణ్ణి సేవించే ఈ ప్రభలు కేవలం అలంకారానికే కాదు, గౌప్ప సాంస్కృతిక వేదికలు కూడా. శివరాత్రి ప్రభలపై పౌరాణిక నాటకాల్ని, విలువైన సంగీత గోష్టులను, శాస్త్రీయ నృత్య ప్రదర్శనల్ని, యువతని ఉర్రూతలూగించే రికార్డ్ డ్యాన్సుల్ని తెల్లవార్లూ ఆస్వాదించి ఆనందించవచ్చు. శివరాత్రికి వచ్చే ప్రభల వైభవాలని బట్టి ఆ యేడు పాడిపంటలు ఎలా ఉన్నాయో అంచనా వేయవచ్చు. ప్రభలు కట్టి, కోడె దూడల్నిచ్చి మహాశివునికి భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. శివుడు బోళా శంకరుడు. పిలవగానే పలుకుతాడని ప్రజల విశ్వాసం. అందుకనే ఆయ నకు ఫాలోయింగ్ ఎక్కువ. తిరునాళ్లు ఒక గొప్ప సందర్భం. దేవుడి వంకన మహాజనం ఒక చోట చేర తారు. జనం చేరతారు కాబట్టి బోలెడు ఆకర్షణలు చేరతాయి. చిరువ్యాపారాలు పుట్టగొడు గుల్లా పుట్టుకొస్తాయ్. ఇది ఒక్కరోజు వేడుక. కొన్ని చోట్ల దీన్ని తీర్థం అంటారు. నదీ తీరాల్లో జరిగే తిరునాళ్లు మరింత చోద్యంగా ఉం టాయి. కోలాటాలు, చెక్క భజనలు, చిన్న చిన్న మోసాలు, కలిసొచ్చే చిరు ఆనందాలు ఇక్కడ తటస్థపడతాయ్. అర్ధరాత్రి లింగోద్భవం అయిందని ప్రకటిస్తారు. కొంత సేపు ఆలయ ప్రాంగణాలు శివ నామంతో హోరెత్తుతాయి. క్రమేపీ భక్తుల ఉత్సాహం సన్నగిల్లుతుంది. తెల తెలవారుతుండగా తీర్థప్రజని ఆకలి, నిద్ర ఆవహిస్తుంది. కాళ్లీడ్చుకుంటూ ఖాళీ జేబులతో ఇంటిదారి పడతారు. వచ్చేటప్పుడున్న మిత్ర బృందం చెల్లాచెదురై తలోదారి పడతారు. తీర్థంలో కొన్న చిన్న వస్తువేదో చేతిలో బరువుగా తోస్తుంది. ఎక్కడ చూసినా చెత్తా చెదారం. మూగపోయిన మైకులు, కొండెక్కిన రంగు రంగుల బల్బులు. ఎన్నికల మహాసభలు విడిసినప్పుడు సరిగ్గా ఇలాగే ఉంటుంది. చిరిగిన జెండాలు, తినిపారేసిన బిర్యానీ పొట్లాల కాగితాలు, ఖాళీ సీసాలు దీనంగా కనిపిస్తాయ్. ‘తిరునాళ్లప్పుడు కూడా అదే అలసట, అదే హాంగోవరూ..’ అనగానే పాపం! అలా అనకండి, హాంగోవర్ సందర్భం వేరండీ, మీరు సోడా గోలీని దర్భపుల్లని ముడేస్తున్నారన్నాను. ‘సింగినాదం, శివరాత్రికి సెంట్రల్ ఎక్సైజ్ వారికి టార్గెట్స్ ఫిక్స్ అవుతాయండీ. ఇదొక అద్భుతమైన అవకాశం. తెల్లవార్లూ జాగారం చెయ్యాలి. రాత్రికి మందుకి ఓ బంధం ఉంది. పైగా తిరునాళ్లలో తాగరాదనే నియమం లేనేలేదు. జన్మకో శివరాత్రిగా అమ్మకాలు సాగించమన్నార్ట! - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ఇదొక ధర్మ మీమాంస
అక్షర తూణీరం సువర్ణాక్షరాలతో రాయతగిన ఘట్టం. ప్రపంచమంతా విస్తు పోయి చూసింది. అయినా మన పత్రికలకి అది పక్కవార్తే అయింది. ఆ రోజు కూడా శశికళే పతాక శీర్షిక అయింది. దాదాపు వందరోజుల నించి తమిళనాడులో ఉన్నట్టుంది. వార్తాపత్రికల పతాకశీర్షికలు, వార్తా చానళ్ల బ్రేకింగ్ న్యూస్‌లూ సమస్తం తమిళనాడు సమాచారంతోనే మార్మోగుతున్నాయి. జయలలిత అనారోగ్యం, అమ్మ ఆసుపత్రిలో ఉండడం, బడా నేతలంతా రావడం పోవడం, లోపలేంచూశారో చెప్పకుండా అమ్మ కోలుకుంటోందని టీవీ గొట్టాల్లో చెప్పడం, మొత్తం ఆ ఫార్స్ని ‘చిదంబర రహస్యం’గా తీర్చిదిద్దడం, ఆనక అందరూ కూడబలుక్కుని ఆమెని సాగనంపడం– ఒక రోజువారీ టీవీ సీరియల్లా నడిచింది. తెలుగు వార్తా చానళ్లు జనాన్ని తెరలకి కట్టి పడేశాయి. తర్వాత సాగిన జయ అంతిమయాత్ర, ఆ తర్వాత నడిచిన పొలిటికల్ హైడ్రామా ఇవ్వాళ్టి దాకా మాంఛి టెంపోలో నడిపిస్తున్నారు. జనం చూస్తున్నారు, కళ్లల్లో ఒత్తులేసుకు చదివేస్తు న్నారు. మన సంగతులు కాని ఈ సంగతులు ఇంత సమగ్రంగా మనకి అవసరమా అని తెలుగు వాళ్లెవరూ అనుకోరు. హాయిగా చదివేస్తూ, చూసేస్తూ, మనిషి దొరికితే తమిళ రాజకీయాన్ని నూరిపోస్తున్నారు. ఇటీవలి కాలంలో వార్తల్ని కూడా సీరియల్స్ స్థాయికి తీసుకొచ్చారు. అందునా మన తెలుగువారిది విశాల హృదయం. ఆనందం ఎవరిదైనా, విషాదం ఎవరిదైనా తమదిగా భావించి స్పందించే గుణం మనవారికుంది. ‘‘తప్పేముంది.. దాన్ని మేం క్యాష్ చేసు కుంటాం’’ అని మీడియాలో కొందరు హాయిగా చెప్పేస్తుం టారు. ఏది వార్తో, ఏది వార్త కాదో జర్నలిజం నిర్వచించింది గానీ, ఏది ఎవరికి వార్తో చెప్పనే లేదు. ఈ వందరోజుల్లో తమిళ నేతల పేర్లన్నీ మనకి కంఠతా వచ్చాయి. కనీసం వందమంది ముఖాల్ని చటుక్కున గుర్తించ గలం. ఇక చిన్నమ్మ ఆనవాళ్ల సంగతి చెప్పనే అక్కర్లేదు. ప్రస్తుతం బోలెడంత న్యాయ చర్చ జరుగుతోంది. దోషిగా మరణిం చిన అమ్మ చెల్లించాల్సిన వంద కోట్ల జరిమానా ఎవరు చెల్లి స్తారు? పార్టీనా, అభిమానులా, ప్రభుత్వమా? ఆమెకు పడిన జైలు శిక్షని ఎవరు భరి స్తారు? అతి ముఖ్యులంతా తలొక నెలా శిక్ష అనుభవించి అమ్మ ఆత్మకి శాంతి కలిగి స్తారా? భవిష్యత్తులో పురుచ్చితలైవిని బిరుదావళితో సంభావించవచ్చునా? ఆమెను తిరిగి కడిగిన ముత్యంగా తీర్చిదిద్దడం ఎలా? ఎంత తలపట్టుకున్నా ఎవరికీ అర్థం కావడం లేదు. ఇందులో తలపెట్టి ఎంతో కొంత లబ్ధి పొందాలన్న బీజేపీకి ఎక్కడా పట్టు చిక్కలేదు. జయ సమాధిపై చిన్నమ్మ చేసిన శపథం ఏమిటో ఎవరికీ వినిపించలేదు. అందుకని ఎవరికి తోచిన విధంగా వారు ఊహించుకుంటున్నారు. అసలీ వందరోజులూ మనం ఈ వార్తల్ని ఫాలో కాకున్నా పెద్ద తేడా ఏమీ పడదనేది నిర్వివాదాంశం. శ్రీహరికోటలో ఒక మహాద్భుతం జరిగింది. ఇంకా నింగిలో ఆ చారికలు కూడా చెరగలేదు. దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయ తగిన ఘట్టం. ప్రపంచమంతా విస్తు పోయి చూసింది. అయినా మన పత్రికలకి అది పక్కవార్తే అయింది. ఆ రోజు కూడా శశికళే పతాక శీర్షిక అయింది. నిజానికి మన మీడియా ఇస్రో సంరంభాన్ని ముందు నుంచే వార్తల్లోకి తేవాలి. అత్యధికంగా ఆ విజయ ఘట్టాన్ని అప్పుడే వీక్షించేలా చెయ్యాలి. మరీ ముఖ్యంగా విద్యార్థినీ విద్యార్థులకు దాన్ని చూసే అవకాశం వైడ్ స్క్రీన్ మీద కల్పించి ఉండాల్సింది. వారందరికీ స్ఫూర్తిదాయకం అయ్యే విధంగా ఆనాటి కార్యక్రమాన్ని డిజైన్ చేసి ఉండాల్సింది. వేరే రాష్ట్రపు అవినీతి బాగోతం ముఖ్యమా, మన దేశ విజయ గాథ ముఖ్యమా అనేది తేల్చుకుంటే బాగుండేది. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
అందరూ నిశానీదారులే!
అక్షర తూణీరం మనిషిని సృష్టించినవాడు దేవుడే అయితే, ఆయన నిజంగా గొప్పవాడు. మనిషిలో ఏ చిన్న పార్ట్‌నీ డూప్లికేట్ చేసే అవకాశం లేకుండా డిజైన్ చేశాడు. వేళ్ల కొసల్లో శంఖుచక్రాలు అమర్చాడు. దాన్నొక శాస్త్రంగా చేసుకుని బతకడానికి కొందరికి అవకాశం కల్పించాడు. ప్రస్తుతం దేశం వేలిముద్రల మీద నడు స్తోంది. ఒక ప్పుడు నిరక్షరా శ్యుణ్ని వేలి ముద్రగాడు, నిశాని పద్దు అని పిలిచేవారు. ఇప్పుడు వేలిముద్ర లేకుండా తెల్లారదు, పొద్దుగూకదు. ఎన్ని కోట్ల మంది జనం ఉన్నా, ఏ ఇద్దరి ఫింగర్ ప్రింట్సూ ఒక్కలాగా ఉండవని అందరికీ తెలుసు. ఈ సత్యాన్ని మనిషి ఎన్నడో కనిపెట్టాడు. చేవ్రాలుని ఎవరైనా ఫోర్జరీ చెయ్యచ్చుగాని వేలిముద్రని చేయడం బ్రహ్మతరం కూడా కాదు. అందుకని ముఖ్యమైన పత్రాల మీద సంతకందార్లయినా, వేలిముద్రలు వేసి తీరాల్సిందే. క్రయవిక్రయ దస్తావేజుల మీద, పాస్‌పోర్ట్ వ్యవహారంలో వేళ్లకు సిరా రాసుకోక తప్పదు. పూర్వం ప్రొ నోటు మీద మగవారైతే ఎడమ చేతి బొటనవేలుని, ఆడవారైతే కుడిచేతి బొట నవేలుని తిప్పి తీరాల్సిందే. ఇప్పుడు అదే ఆచారం అందర్నీ శాసిస్తోంది. వేలి ముద్రకున్న నిజాయితీ సంతకానికి లేకుండా పోయింది. పనిచేసేచోట్లలో బయోమెట్రిక్ విధానం వచ్చి చాలా కాలమైంది. సొంత వేలైతే తప్ప వేళలు అతిక్రమించే పప్పు లుడకవ్. అసలెందుకు, సమస్త క్రిమినల్ వ్యవహారాల్ని పట్టిచ్చేది ఫింగర్ ప్రింట్సే. అదొక పెద్ద శాస్త్రం. ఆధార్ కార్డ్‌కి మూలాధారం వేలిముద్రే. సెల్‌ఫోన్‌ని, ఐపాడ్‌ని, టాబ్లెట్‌ని వేలిముద్రతోనే లాక్ మరియు అన్‌లాక్ చేసుకుంటారు. లాక ర్స్‌కి కూడా ఇలాంటి ‘నిశాని తాళం’ సదుపాయం ఉంది. అసలీ బయోమె ట్రిక్ విధానంతో దొంగ ఓట్లని నిరోధిం చవచ్చు. వేళ్లన్నీ గొప్పవేగానీ బొటనవేలు మరింత గొప్పది. పురుషసూక్తంలో బొట నవేలు ఒక కొలమానంగా ప్రస్తావనకు వస్తుంది. ‘అంగుష్టమాత్రం’ అనే వాడుక అక్కడనించే వచ్చింది. రాజగురువు ద్రోణాచార్యుడు ఏకలవ్యుణ్ని కుడిచేతి బొటనవేలుని గురుదక్షిణగా కోరి స్వీక రించాడు. శిష్యుణ్ని ఆ విధంగా అశక్తుణ్ని చేసి పుణ్యం కట్టుకున్నాడు. ఇది వేరే కథ. ఇప్పుడీ నగదు రహిత లావాదేవీలు వచ్చాక, చేవ్రాలు మరీ అపురూపమై పోయింది. ఇక్కడో విషయం చెప్పాలి. పెద్ద వాళ్లంతా పదే పదే న.ర. లావా దేవీలంటున్నారు. న.ర. ఆర్థిక లావా దేవీలు అనకపోతే కొంచెం అపార్థం ధ్వనిస్తోంది. ఆ విషయం అలా ఉంచితే, ప్రస్తుతం బ్యాంకి చెక్కుల మీద కూడా వేలిముద్ర ప్రవేశపెడితే బెటరనిపి స్తోంది. కార్డ్ స్వైపింగ్ వచ్చాక చీటికీ మాటికీ సంతకాలు పెట్టే పని తగ్గింది. దాంతో సంతకం టాలీ కాలేదని చెక్కులు తిరిగి రావడం, దాంతో అపార్థాలు ఎక్కు వైనాయి. అదే నిశాని అయితే పేచీపూచీ ఉండదు. మనిషిని సృష్టించినవాడు దేవుడే అయితే, ఆయన నిజంగా గొప్పవాడు. మనిషిలో ఏ చిన్న పార్ట్‌నీ డూప్లికేట్ చేసే అవకాశం లేకుండా డిజైన్ చేశాడు. వేళ్ల కొసల్లో శంఖుచక్రాలు అమర్చాడు. దాన్నొక శాస్త్రంగా చేసుకుని బతకడానికి కొందరికి అవకాశం కల్పించాడు. వేలి కొసలే కలవనప్పుడు రెండు మెదళ్లు ఎలా కలుస్తాయ్? అందుకే ట్రంప్ బ్రెయి న్లా మరో బ్రెయిన్ ఉండదు. ఇది వేలి ముద్రంత నిజం. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
నలుపు లేక తెలుపు లేదు!
అక్షర తూణీరం పెద్ద నోట్ల రద్దు బావిలో పూడిక తీయడం లాంటిది. ఇక కొత్తనీరు బుగ్గలు బుగ్గలుగా ఊరుతుంది. ఆ వూరే నీరంతా నల్లదే అవుతుందనీ.. బ్లాక్ లేకుండా వైట్ లేదంటున్నారు. ఇద్దరు పరిచయస్తులు రైల్లో ప్రయాణం చేస్తున్నారు. వారిలో ఒకాయన రెండో ఆసామికి అప్పున్నాడు. దొరక్క దొరక్క దొరికాడని బాకీ తీర్చనందుకు సాధిస్తున్నాడు. రైలు దిగి ఎటూ పోవడానికి లేదు. పాపం అందుకని ఓపిగ్గా భరిస్తు న్నాడు. ఇంతలో ఒకచోట ఉన్నట్టుండి రైలు ఆగింది. గబగబా పది మంది ముసుగు దొంగలు రైలెక్కారు. ఆ చివర్నించి కత్తులు చూపించి వరుసగా నగా నట్రా నుంచి జేబులు వొలి చేస్తున్నారు. రెండో ఆసామి ఒక్కసారిగా జాగృతమయ్యాడు. జేబులో ఉన్న పైకం, మెడలో ఉన్న బంగారు గొలుసు, చేతికున్న రెండు పెళ్లి ఉంగరాలు తీసి రుణదాత చేతిలో పెట్టాడు. ఆలస్యానికి క్షమించమన్నాడు. నష్టం జరగలేదు సరికదా బాకీ తీరిపోయింది. ఈ నోట్ల రద్దు వేళ ఇలాంటివి, ఇంకా చిత్ర విచిత్ర సన్నివేశాలు ఎదు రవుతున్నాయి. ప్రధాని మోదీ పుణ్యమా అని రెడ్‌లైట్ కేంద్రాలు కళకళలాడుతున్నాయి. నిల్వ డబ్బుని, నిల్వ కోరికల్ని వదిలించుకుంటున్నారు. అక్కడ కూడా పెద్ద నోట్ల అర్హత గలవారికే గిరాకీ ఉందిట. మరీ చిల్లర వారికి బోణీలు కావడం లేదుట. ఇది ఇలా ఉంచితే దానధర్మాలు పెరిగాయి. చాలాచోట్ల దేవాలయ జీర్ణోద్ధరణలు సాగుతున్నాయి. యాభై ఏళ్లు గడచినా ఒక్క వాహనమైనా లేని దేవుళ్లకి అవి అమరుతున్నాయి. మా ఊళ్లో ఒకాయన మంచి హైక్లాస్ రికార్డింగ్ డ్యాన్సులు వరుసగా స్పాన్సర్ చేస్తున్నాడు. మా ఊరంతా ఆ నిషాలో జోగు తోంది. పన్నులతో సహా జగమొండి బాకీలు వద్దంటే రాలుతున్నాయి. ఒక సంపన్నుడు ఉత్తి పుణ్యానికి కవి సమ్మేళనం పెట్టించాడు. అంతేనా, ఒక్కో కవిని రెండేసి ఐదొందల నోట్లతో సత్కరిం చాడు. అంతేనా, శ్రోతలకి కూడా ఒక్కో నోటిస్తానని కబురంపాడు. అయినా, కవులకు భయపడి శ్రోతలంతగా స్పందించలేదు. నోట్ల రద్దుతో సర్వే సర్వత్రా విచిత్రమైన వాతావరణం నెలకొన్నది. కొందరు నిమ్మకు నీరెత్తినట్టు కనిపిస్తున్నారు. మరికొందరు కొంచెం బాగానే నిల్వలున్నట్టు చిన్న మొహాలతో తిరుగుతున్నారు. బయటపడి బావురుమనలేదు. అట్లాగని దిగమింగనూ లేరు. దీనివల్ల చాలా నష్టం అని కేకలు పెడుతున్నారు గానీ ఎవరికి నష్టమో చెప్పడం లేదు. కొందరు సమన్యాయం జరగలేదని, డెమోక్రసీలో ఇది అన్యాయమనీ అరుస్తు న్నారు. కొందరికి ముందే ఉప్పందిందని వారి వాదన. కావచ్చు. మోదీ దేవుడేం కాదు. క్యాబినెట్ సహచరులు అంతకంటే కాదు. ఢిల్లీకి ఇక్కడీ ఆసులో గొట్టంలా తిరిగే వారె వరో ఒక్క చెవిలో పడేశారనీ, అది ఒక వర్గం చెవుల్లో కాంతి వేగంతో ప్రసరించిందనీ అంటున్నారు. పాపం పుణ్యం పైనున్న వాడికి తెలియాలి. ఇక్కడేమైందంటే, ఈ చర్యని సమర్థించే వారంతా నీతిపరులని, వ్యతిరేకిస్తున్న వారంతా నల్లధనవంతులని ఓ ముద్ర పడుతోంది. కాస్త ముందుగా మాక్కూడా చెప్పకూడదా మేమూ ఒడ్డున పడేవాళ్లమని పరోక్షంగా కష్టపడుతున్నారు. ఒక లాయరు కేసు ఓడిపోతే క్లయింట్‌కి ‘న్యాయం గెలి చింది’ అని టెలిగ్రామ్ కొట్టాడు. వెంటనే క్లయింట్, ‘పై కోర్టుకి అప్పీల్ చేయండి’ అని జవాబు కొట్టాడు. ఇప్పుడు కూడా వాదోపవాదాలు బయటపడకుండా ధ్వని ప్రధానంగా జరుగుతున్నాయి. కొందరేమంటున్నారంటే, ఇది బావిలో పూడిక తీయడం లాంటిది. ఇక కొత్తనీరు బుగ్గలు బుగ్గలుగా ఊరుతుంది. ఆ వూరే నీరంతా నల్లదే అవుతుందంటున్నారు. బ్లాక్ లేకుండా వైట్ లేదంటున్నారు. ఒక పెద్దాయన దీనికి సింపుల్ సొల్యూషన్ చెప్పాడు. ‘‘రద్దు నోట్లని భద్రంగా ఉంచండి మేం వస్తాం! వాటిని తిరిగి చెలామణిలోకి తెస్తాం ఇదే ఈసారి మా ఎన్నికల ఎజెండా’’ అని కాంగ్రెస్ పార్టీ ఓ స్టేట్మెంట్ ఇస్తే ఢిల్లీకి కళ్లు తిరుగుతాయి. నల్లవారంతా ఏకమై గెలిపించుకోరా? చూడండి కావలిస్తే. (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) శ్రీరమణ -
ఆస్తులూ-సెంటిమెంట్లూ
అక్షర తూణీరం ఆ రోజుల్లో ఫియట్ కారంటే గొప్ప. పీఎస్ చారి అని మా ఆఫీసు పెద్ద సారువాడుండే వాడు. చాలా రూల్స్ మనిషి. ఈయన పెద్ద వట్టివేళ్ల తడి కండీ అని పనులమీద వచ్చి వెళ్లేవారు వ్యాఖ్యానించేవారు. గీరు నామంతో, ఖద్దరు కట్టుతో చారి చాలా నిరాడంబరంగా కనిపించేవారు. ఎప్పుడూ తడుపుతూ ఉంటే గానీ వట్టివేళ్ల తడిక సుఖంగా పనిచెయ్యదు, చారి కూడా అదే బాపతని ఒకాయన వివరించాక మర్మం నాకు బోధపడింది. ఇట్లాంటి వారికి గొప్ప చిక్కు ఏంటంటే, గడ్డితిని సంపా యిస్తారు గాని సుఖంగా ఏ భోగమూ అనుభవించలేరు. సర్వీస్ ఉండగా భయం. దిగిపోయాక్కూడా భయమే. ఎవడైనా ఓ ఆకాశరామన్న ఉత్తరం రాస్తాడేమోనని. ఉన్నట్టుండి చారి ఫియట్ కారులో ఆఫీసుకు వచ్చాడు. అంతా నివ్వెరపోయారు. ఎవరూ విస్తుపూర్వక ప్రశ్నలు సంధించకముందే, చారి ఫియట్ వృత్తాంతాన్ని వివ రించాడు. డీలర్ దగ్గర ఖాళీగా పడి ఉందిట. టైర్లు, సీట్లు ఎలుకలవల్ల హరించాయిట. ఉద్యమ వేళ అద్దాలు వడ గళ్లుగా నేలపై రాలాయిట. డీలర్‌ని అడిగితే, మీరు అడి గారని చెబుతున్నా నాలుగువేలిచ్చి తీసికెళ్తారా అని అడిగాట్ట! ఫియట్ కారు ఆయన జీవితాశయమని లోగడే చారి పలుమార్లు చెప్పారు. సరేనని తెగించి వాయిదాల పద్ధతిలో తీసుకున్నాట్ట. సీట్లు మిసెస్ చారి కుట్టిందిట. కొడుకు పాత టైర్లు సేకరించి, స్వయంగా ఫియట్‌కి రంగులు, హంగులు కూర్చాడట. మొత్తం ఐదువేల ఆరువందల పన్నెండు రూపాయలు అయిం దని చెప్పి నమ్మించే ప్రయత్నం చేశాడు చారి. చారి చెప్పిన తీరులో ఒక నిజాయితీ ధ్వనించింది. అయినా నమ్మశక్యం కాలేదు. మొన్న మన ప్రియతమ నేత స్థిర చరాస్తులు ప్రకటించగానే నాటి మా చారి గుర్తొచ్చారు. విశాలంగా, సర్వ సదుపాయాలతో ఇల్లు కట్టుకోవడం సంతోషమేగానీ మరీ మూడుకోట్లు అప్పు చేయడమేమిటని మావూరి రచ్చబండ జాలిపడింది. దాదాపు అర్ధ శతాబ్ది రాజకీయ జీవితం, పెళ్లినాటికే మంత్రిపదవి, ఆ తర్వాత సరేసరి. అందరికీ తెలిసిందే. ప్రజల కోసం జీవితం ధారపోస్తున్న నాయకుడు, పైగా వయసు మీద పడింది కూడా. ‘ఇప్పుడు రుణభారం పెట్టుకోవడమా పాపం’ అంటూ ఒకరిద్దరు పెద్ద మను షులు బాధపడ్డారు. ఏముంది మనమంతా తలా పావలా వేసుకున్నా బిల్డింగ్ లేచిపోతుందని ఒకాయన లెక్క తేల్చాడు. ఉన్నట్టుండి మావూరి సర్పంచ్‌కి ఆవేశం వచ్చింది. నేను కూడా ప్రజా జీవితంలో ఉన్నానుగందా. నే కూడా నా ఆస్తులు డిక్లేర్ చేస్తున్నా రాసుకోండ్రా అంటూ లేచి నిలబడ్డాడు. పాత పెంకుటింటితో మొదలుపెట్టి, చింకి చాపలు, విరిగిన ఎడ్లబండి, తుప్పట్టిన బోరింగు గొట్టాలు, ఒట్టిపోయిన గేదె దూడతో సహా చెప్పు కుంటూ వెళ్లాడు. రచ్చబండ మీది నలుగురూ వాటి వాటి ధరలు నిర్ణయించి చెబుతుంటే, ఓ కుర్రాడు అంకెలు కూడుకున్నాడు. పదివేల చిల్లరకు వచ్చింది మొత్తం. సర్పంచ్ ఒక్కసారి తేలుకుట్టినట్టు అరిచాడు. మా మాంగారు అలకల్లో ఇచ్చిన సైకిల్రోయ్ అనగానే, వేసుకో పన్నెండు రూపాయలన్నారు పెద్దలు. సర్పంచ్ ససేమిరా అన్నాడు. ఆ సైకిల్లో బోలెడు సెంటిమెంట్లు న్నాయి. కనీసం ఒక లక్షన్నా పడాల్సిందే అంటూ వాదించాడు. మొత్తానికి మా సర్పంచ్ ఆస్తుల ప్రకటనైతే అయి పోయింది. శ్రీరమణ -
ఉత్తమ పురుష
అక్షర తూణీరం సూర్యుడీరోజు ఉత్తరాన ఉదయించాడని ప్రావ్దా పత్రిక రాస్తే, సోవియట్ యూనియన్ మొత్తం కాబోలనుకునేదిట. ఆధునిక సాంకేతిక యుగంలో విశ్వవ్యాప్త సమాచారాన్ని అర నిమిషంలో సేకరించగల సామర్థ్యం వచ్చింది. కానీ రెండేళ్ల సమయం ఇచ్చినా నిజాన్ని నిజంగా బయట పెట్టగల వ్యవస్థ మాత్రం రాలేదు. అభద్రతా భావం వెన్నాడు తున్నప్పుడు, ‘నేను’ అనేది అప్రయత్నంగా వచ్చేస్తుందని మానసిక నిపుణులు విశ్లేషిస్తూ ఉంటారు. మన ప్రియతమ నాయకుడు ఇటీవల కాలంలో నేనుని తెగ ఆరాధిస్తున్నారు. నేనుకి స్వాగతం, నేనుకి నమ స్కారం, నేను కే అభినందనలు - ఈ ధోరణిలో సభలు సాగుతున్నాయని జనాభిప్రాయం. కొన్ని నిజాలే అయినా, సొంతం చేసుకుని ప్రకటిస్తే అది స్వోత్కర్ష అని పించుకుంటుంది. గాంధీజీ నిండు సభలో ‘‘ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది నేనే’’ అని ప్రకటిస్తే వినడానికి శ్రావ్యంగా ఉంటుందా? జనసామాన్యం అనుకోవాలి - ఈ మహనీయుడే బానిసత్వం వదిలించాడని. అది మర్యాదగా ఉంటుంది. అసలు మనలాంటి ప్రజారాజ్యంలో ‘నేను’ ప్రయో గించాల్సిన అవసరమే లేదు. నేను పింఛను పెంచాను. నేను రేషన్ ఇచ్చాను. వంతెన నిర్మించింది నేనే. ఒలింపిక్స్‌లో నావల్లే పతకం వచ్చింది. ఇంకా ఇలాంటి నిర్మొహమాటమైన ప్రకటనలు నిత్యం వింటూనే ఉన్నాం. తిరుమలకి ఇంతటి దివ్యకళ వచ్చిందంటే దానికి కారణం నేను. శ్రీహరికోట నుంచి గురితప్పక ఉపగ్రహాలు కక్ష్యల్లో కూచుంటున్నాయంటే నా సంకల్ప శుద్ధిగాక మరొకటి కాదు. ప్రభుత్వంలో ఉన్నవారంతా అక్షరాలా మహానేతకు అనుచరులు. అందుకని పాపం వారంతా నేను మేము మరిచి, వారు అనే వాడతారు. అధికార వర్గమైతే అసలు మాట్లాడే పనే లేదు. ‘‘ఫోర్త్ ఎస్టేట్‌గా స్థానం సంపా దించుకున్న మీడియా హాయిగా చుట్టలు చుట్టుకు పడు కుంది. శ్రీవారికి వెన్నుదన్నుగా పడగ పడుతోంది’’ అంటూ ఒకాయన తీవ్ర స్వరంలో బాధపడ్డాడు. ‘‘రాష్ట్రా నికి ప్రత్యేక హోదా లాభమా, ప్యాకేజి లాభమా అనే అంశంమీద మేధావుల అభిప్రాయాల్ని వెల్లడించరేంటి? జనానికి నిజం చెప్పాలి కదా’’ అంటూ ఒక సీనియర్ సిటిజన్ ఆందోళన పడ్డాడు. ప్రస్తుతం మీడియా రంగు రుచి వాసన మారిపోయాయని ఎవరైనా అరిస్తే, ‘‘ఆయన్ని పట్టించుకోకండి. విభేదించడమే ఆయన నైజం. అందుకే ఆయన షైన్ అవలేదు’’ అంటూ ముద్ర వేసి వదిలేస్తారు. వెనకటికి ప్రావ్దా పత్రిక గురించి బోలెడు వార్తలు ప్రచారంలో ఉండేవి. సూర్యుడీరోజు ఉత్తరాన ఉదయిం చాడని ప్రావ్దా రాస్తే, యుఎస్ఎస్ఆర్ మొత్తం కాబోలను కునేదిట. మాస్కోలో తీవ్రంగా ఎండకాస్తుంటే, మంచు కురుస్తోందని ఆ పత్రిక చెబితే అక్కడి వారంతా చలి కోట్లు, మఫ్లర్లు ధరించి తిరిగేవారట. ఆధునిక సాంకేతిక యుగంలో విశ్వవ్యాప్త సమాచారాన్ని అర నిమిషంలో సేకరించగల సామర్థ్యం వచ్చింది. కానీ రెండేళ్ల సమ యం ఇచ్చినా నిజాన్ని నిజంగా బయట పెట్టగల వ్యవస్థ మాత్రం రాలేదు. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ఇదొక మహానాటకం
అక్షర తూణీరం రాష్ట్ర విభజన నాటి నుంచి ప్రత్యేకహోదా మహానాటకం నడుస్తూనే ఉంది. నేతలంతా ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ నాటకం తుది మొదలు లేకుండా, పరిష్కారంలేని దిశగా ఏళ్ల తరబడి నడుస్తూనే ఉంటుంది. ఇంత పెద్ద నాటకాన్ని నెలల తరబడి నడిపిస్తూ, బోలెడన్ని అంతర్నాటకాలను జనం దృష్టికి రాకుండా కళ్లు కప్పుతున్నారని కొందరి ఆరోపణ. ‘‘ప్రత్యేక హోదా’’ అంటే కల్పతరువు. స్పెషల్ స్టేటస్ అంటే కామధేనువు. మీరు ఏమి అడిగితే అవి బంగరు పళ్లాలలో వచ్చేస్తాయి - అని కదా అప్పుడు చెప్పుకున్నాం. ఇప్పుడు ఉన్నట్టుండి అట్టు తిరగబడింది. ప్రత్యేక హోదా ఒక మిథ్య! అందువల్ల రాష్ట్రానికి ఒనగూడే ప్రయోజ నాలు శూన్యం. అంతకంటే పరమాద్భుతమైన ప్యాకేజీ ఇస్తాం. అందుకని ధన్యులవండని ఇప్పుడంటున్నారు. కల్పతరువు ఏటా మూడు కాపులే కాస్తుంది. మేమిచ్చే ప్యాకేజీ ఆరు కాపులిస్తుంది. అది కామధేనువైతే, ఇది కామధేనువు గ్రాండ్ మదర్! రాష్ట్ర విభజన నాటి నుంచి ఒక మహానాటకం నడుస్తూనే ఉంది. అందులో నేతలంతా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఉన్నట్టుండి ఒక దృశ్యంలో ఒక నాయ కుడు అలుగుతాడు. ఢిల్లీ వారంతా ముందే చదువుకుని బట్టీ పట్టిన డైలాగుల్ని సానుభూతి రసం ఒలికిస్తూ వల్లిస్తారు. రేపో ఎల్లుండో ఢిల్లీ ఖజానా తాళాలు వెంకయ్యనాయుడుకిచ్చి చంద్రబాబు నాయుడికి పంపించే అవకాశం ఉందని ఊహాగానాలు చెలరేగు తాయి. నాలుగో రోజున కేంద్ర ఆర్థికమంత్రి అరిగి పోయిన ప్లేటుని మరోసారి వినిపిస్తారు. ఈ మహానాటకానికి తుది మొదలు లేదు. పరిష్కారంలేని దిశగా ఇది రోజుల తరబడి, ఏళ్ల తరబడి నడుస్తూనే ఉంటుంది. ఈ మహావేదిక మీంచి ఎవరూ నిష్ర్కమించరు. అట్లాగని క్రియాశీలక పాత్ర పోషించరు. ఒకటో అరో అరిగిపోయిన డైలాగ్ వారి అధీనంలో ఉంటుంది. సైడ్ వింగ్లోంచి సైగ అందగానే ఆ సంభాషణని వదిలి హాయిగా గాలి పీల్చుకుంటారు. వీళ్లంతా ఢిల్లీలో రాష్ట్ర ప్రతినిధులు. మీడియాకి నాట కీయ దృశ్యాలు ఎప్పుడూ ఆకర్షణలే. రాజకీయాలను, ప్రభుత్వాలను విస్పష్టంగా నిగ్గదీసే అలవాటుని మీడియా ఈ మధ్యకాలంలో బొత్తిగా విస్మరించిందనే ప్రథ ప్రజల్లో వినిపిస్తోంది. ప్రత్యేక హోదా లాంటి పెద్ద నాటకాన్ని నెలల తరబడి నడిపిస్తూ, బోలెడన్ని అంత ర్నాటకాలను జనం దృష్టికి రాకుండా కళ్లు కప్పు తున్నారని కొందరి ఆరోపణ. ఒకవైపు కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం పూర్తి చేశారు. మరోవైపు కృష్ణా పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇంకోవైపు విశ్వ విఖ్యాత మహానగరం అంచెలంచెలుగా రూపుదిద్దుకుంటోంది. నిన్నగాక మొన్న రెండు జిల్లాల్లో పంటలు ఎండిపోతున్న సమయంలో, మన రాష్ట్ర ముఖ్యమంత్రి మందీ మార్బ లంతో క్షేత్రాలను స్వయంగా చేరి లక్షలాది ఎకరాల్లో పంటలకు కొత్త చిగుళ్లు తొడిగారు. ఇదొక వినూత్న చరిత్రగా స్వయంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి కాకపోతే, మా నేతకైనా ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. (వ్యాసకర్త: శ్రీరమణ, ప్రముఖ కథకుడు) -
లీటర్లు లీటర్లుగా...!
అక్షర తూణీరం పుష్కర కృష్ణాతీర్థమే కాదు.. ముందు ముందు ఢిల్లీలో కొత్త ఆలోచనలు మొలకలెత్తితే పోస్టాఫీసులు మల్టీపర్పస్ మాల్స్ కావచ్చు. ఎన్నికల సంరంభమంత ఆర్భాటంగా పుష్కర కోలాహలం మొదలైంది. ఇట్లాంటి సందర్భాన్ని చంద్రబాబు పేటెంట్ చేసేశారు. మూడు పుష్కరాల నుంచీ ఈ తర్పణ సంప్రదాయానికి యమ ప్రచారం కల్పిస్తూ వస్తున్నారు. ‘‘రేవుల్లోకి మునగండి! మునగండి!’’ అనే నినాదంతో పెద్ద సైజు ఇమేజీతో హోర్డిం గులు దిగిపోతాయి. అవి పుష్కర స్నానాలాచరించవు. కానీ, లక్ష లాది మందిని ముంచి స్నానాలు చేయిస్తాయి. ఇప్పటికే వాటికి టెండర్లు పూర్తయి, కళాకారుల కుంచెలు కదుల్తున్నాయి. లక్షల సంఖ్యలో రకరకాల కరపత్రాలు మూడు నాలుగు భాషల్లో పచ్చ రంగులో అచ్చవుతున్నాయి. వీటిలో రెండువైపుల మన అభివృద్ధి పథకాల గురించి, మూడోవైపు పుష్కరాల్లో జాగ్రత్తల గురించీ వివ రించడం జరుగుతుంది. మరోపక్క ఢిల్లీ సర్కారు పుష్కర తీర్థం ద్వారా పుణ్యాన్ని లీటర్ల లెక్కన అమ్మ డానికి కంకణం కట్టుకుంది. గతంలో గంగాజలం, గోదా వరి నీళ్లు పోస్టాఫీసుల ద్వారా అమ్మిన ఘనచరిత్ర మోదీకి ఉంది. ఇప్పుడు ‘పుష్కర కృష్ణా తీర్థం’ అమ్మకానికి వస్తోంది. అసలు ఆగస్టు మొదటి వారం లోనే అన్ని పోస్టాఫీసులకు పుష్కర తీర్థం సీసాలు పంపేసి, ముందస్తుగానే గ్రామీణ ప్రజలను పునీతుల్ని చేయ్యాలను కున్నారు. ఉన్నట్లుండి ఒకాయన పుష్కరుడు ప్రవేశించకుండా పుణ్య జలమెలా అవుతుంది? ఆగస్టు 12 తర్వాత వచ్చేట్టు చూడాలి అని గుర్తు చేశాట్ట. అప్పుడందరూ నాలికలు కరుచుకుని, ఆ విధంగా వాయిదా వేశారు. మనలో కూడా ఇంతటి మేధావులున్నారని మురిసిపోయారట! ఎంకిపెళ్లి సుబ్బిచావుకని మాకేంటి ఈ దండగ అంటూ చిన్న పోస్టుమాస్టర్లు గొడవ పెడుతున్నారు. కృష్ణాతీరంలో ఉండేవారెవ్వ రైనా ఇవి కొంటారా? ఏలిన వారికి తెలియదేమో గాని కృష్ణా పరీవాహక ప్రాంతంలో ఊరూరికీ కృష్ణా కాలువలుంటాయి. కృష్ణా డెల్టాలో సాగునీరు అవే. వాటిని సీసాల్లో పోసి ఆ ఊళ్లోనే అమ్మిం చడం - హిమాలయాల్లో ఐస్ అమ్మడం, ఎడారిలో ఇసుక అమ్మడం లాంటివి. పాపం ఆ గ్రామీణ పోస్టు మాస్టర్లకు ప్రత్యక్షంగా పుష్కర పన్ను పడింది. పై వారి కోటా ప్రకారం తీర్థజలం వస్తుంది. అమ్మినా, వారే సేవించినా, స్నానమాడినా పై వారికి అనవసరం. డబ్బు మాత్రం జమ చేసెయ్యాలి. లేదంటే జీతంలో కోత పడు తుంది. పాపం, వాళ్లు గతంలో భద్రాచలం రామ కల్యాణం అక్షిం తలు విక్రయించారు. అన్నవరం సత్యనారాయణ దేవుని ప్రసాదాలు అంటగట్టారు. ఇంకా భవిష్యత్తులో ఏమేమి అమ్మిస్తారో భయపడి పోతున్నారు. మరీ అంతకు ముందు చలిజ్వరం టాబ్లెట్లు క్వినైన్ అమ్మేశారు. ఇందిరమ్మ హయాంలో సరసమైన ధరకు నిరోధ్‌లు అమ్మించారు. ముందు ముందు ఢిల్లీలో కొత్త ఆలోచనలు మొల కలెత్తితే పోస్టాఫీసులు మల్టీపర్పస్ మాళ్లు అయిపోవడం ఖాయం. కమిషన్ మీద సినిమా టిక్కెట్లు అమ్మించవచ్చు. మన దేశానికి కల్పతరువు, కామధేనువు అయిన మద్యాన్ని వీటి ద్వారా అందిం చవచ్చు. మన సంప్రదాయసిద్ధమైన రుద్రాక్షలు, గంధపు చెక్కలు, విభూది, మహత్తు గల తావీదులు అమ్మకానికి పెట్టచ్చు. ఇంకా బోలెడు ఆలోచనలు నాకే వస్తుంటే, వారికి కొదవా?! - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
పాత్రికేయులకు పెద్దబాలశిక్ష
అక్షర తూణీరం ఆవటపల్లి నారాయణరావు పేరు చాలా తక్కువమంది విని ఉంటారు. 1878 ప్రాంతంలో ఏలూరులో పుట్టారు. బందరులో పెరిగారు. చాలా చిన్న వయసులోనే పత్రికా రంగంలో అడుగుపెట్టి నిగ్గుతేలారు. కృష్ణా పత్రిక, ఆంధ్రపత్రిక, భారతి వంటి ఆనాటి ఐరావతాలను నడిపించిన మావటీ అవట పల్లి. ఆనాడు సాహితీ పరిమళాలకు కునేగా మరికొళుందు జోడించుకుని తెలుగు లోగిళ్లను ఘుమఘుమలాడించిన ఆంధ్రపత్రిక ఉగాది సంచికలకు ఒరవడి పెట్టిన మంచి హస్తవాసి ఆయనది. పేరు ప్రఖ్యాతి ఆశించక అంతర్యామిగానే ఉన్నారు. పెళ్లి పేరంటాలు ఇతర జంజాటనలు పెట్టుకోకుండా, తన శక్తి సామర్థ్యా లన్నిటినీ అక్షరసేవకే వినియోగించారు. 1923లో బర్మా వెళ్లి, అక్కడ ఆంధ్ర కార్మిక ఉద్యమానికి దన్నుగా నిలిచారు. నారాయణరావు కార్య దక్షత ఆయనను బర్మా శాసన సభ్యుని చేసింది. 1942 దాకా బర్మాలోనే ఉండి కార్మిక సంఘాలను ఏకంచేసి, పోరాటం సాగించి గెలిచారు. బందరులో ఉన్నా బర్మాలో ఉన్నా ఆయన పోరు తెల్ల దొరతనంమీద. 30 డిసెంబరు 1946న గుడివాడలో ఆవటపల్లి నారాయణరావు కన్ను మూశారు. జీవితమంతా పత్రికా రంగానికి, బర్మా ఆంధ్ర కార్మిక ఉద్య మానికి ధారపోశారు. ఈ ప్రస్థా నంలో ఆనాటి రాజాలు, జమీందా రులు, వృత్తి వ్యాపారాలవారు, రాజ కీయ నాయకులు, సంస్కర్తలు, రచ యితలు - పార్టీలకు, కులవర్గాలకు అతీతంగా ఆయనకు సన్నిహి తులు. వారిలో 88 మంది జీవిత విశేషాలను, వ్యక్తిత్వాలను ఏర్చి కూర్చి ‘‘విశాలాంధ్రము’’ సంపుటిని 1940లో ప్రచురించారు. పేరు ప్రతిష్ట లున్న వారిపై నిర్మొహమాట ధోరణిలో వచ్చిన తొలి తెలుగు సంపుటి విశాలాంధ్రము. ఈ కర్మయోగి కూర్చిన వ్యాసాలలో పిఠాపురం రాజా, ముక్త్యాల రాజా, కాశీనాథుని నాగేశ్వరరావు, ఆంధ్ర భీష్మ న్యాపతి సుబ్బారావు, కట్టమంచి, వైఎస్ చింతామణి, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, ముట్నూరి, జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి, కె. కోటిరెడ్డి, ముళ్లపూడి తిమ్మరాజు మొదలైన మహనీయులెందరో మనకు దర్శన మిస్తారు. హాయిగా చది వించే రీతిలో వ్యాసం రాయడం చిన్న విషయం కాదు. స్తోత్రాలు, దండ కాలు, భజనపాళీలు లేకుండా, మెరుపుల్ని మర కల్ని సమాన స్థాయిలో ఎత్తిచూపుతూ రచన సాగించడానికి ధైర్య సాహసాలుండాలి. ఇవి రాసే నాటికి వీరంతా రచయిత సమకాలికులు. నిజాయితీ నిక్కచ్చితనం ఉన్న పాత్రికేయునికి మాత్రమే ఆ గుండెదిటవు ఉంటుంది. వాటికి తోడు విలక్షణమైన శైలి జతపడి వ్యాసాలు నూతన ఒరవళ్లయినాయి. అప్పుడప్పుడే మారాకులు తొడుగుతున్న మొక్కల్ని ముందుగానే గుర్తించి, ఇవి కాబోయే వట వృక్షాలని ఆవటపల్లి సూచించారు. కథ నంలో నాటకీయత, శైలిలో తూగుతోపాటు ఉరవడి, ఆయా వ్యక్తులతో సాన్నిహిత్యం - ఇవన్నీ ఏకకాలంలో, ఏక స్థానంలో కలిసిరావాలి. అలా కల్పించుకున్న సిద్ధుడు నారాయణరావు. ఆనాటి త్యాగమూర్తులను, ధర్మవర్తనులను, దేశభక్తులను స్మరించుకోవడానికి ఇది అనువు. ఆవట పల్లి రచనా శైలి వర్ధిష్ణులైన పాత్రికేయులకు పాఠాలు నేర్పుతుంది. క్లుప్తత, ఆప్తత, గుప్తత ముప్పేట సాగే వ్యాసాలివి. మరల 76 ఏళ్లకు ‘‘విశాలాంధ్రము’’ను బొమ్మిడాల శ్రీ కృష్ణమూర్తి ఫౌండేషన్, గుంటూరు వారు ముద్రించారు. అదీ సర్వాంగ సుంద రంగా. అపురూపమైన కొత్త భోగట్టాతో కొత్త చిగుళ్లు తొడిగారు మోదు గుల రవికృష్ణ. సంపాదక బాధ్యతలు తీసుకుని ఏడాదిపాటు శ్రమిం చారు. మొన్నంటే మొన్ననే (జూలై 7) గుంటూరులో ఆవిష్కరణ సభ పెళ్లి సంబరంలా జరిగింది. సభకి ఆనాటి ఆస్థానాల, జమీన్ల, వదా న్యుల వారసులను ఆహ్వానించారు. కొందరు వచ్చారు. సభకి నిండు దనం చేకూరింది. ప్రభుత్వం చేయాల్సిన పని బొమ్మిడాల ఫౌండేషన్ చేసింది. మండలి బుద్ధప్రసాద్ ఆవిష్కరించి, భాగం పంచుకెళ్లారు. చాలదూ? - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ఆరెస్సెస్ రాముడు
అక్షర తూణీరం భక్తి ఆసరా కూడా డెమోక్రసీ లాంటిదే. కొందరు దేవుణ్ణి ఆసరా చేసుకుని అందర్నీ నియంత్రిస్తుంటే, చాలామంది గతిలేక దేవుణ్ణి నమ్మి జీవితం వెళ్లదీస్తుంటారు. ఆరెస్సెస్ డ్రెస్‌ని రాములోరి అడ్రస్‌గా మార్చారని విన్నాక, మనిషి ఎంతకైనా తెగిస్తాడని మరోసారి రుజువైంది. ఆరెస్సెస్ ఒఖ్ఖ రాముణ్ణే దేవుడిగా కొలు స్తుంది. రాముడు అవతార పురుషుడు. రామకథకి ఆయన ఎలాంటి విశేషాలూ లేని వట్టి మానవుడై ఉండాలి. లేకపోతే వచ్చిన పని నేరవేరదు. అందుకని నీతినియమాలున్న సంపూర్ణ మానవుడిగా రాముడు నమోదయాడు. ఎటొచ్చీ వాలి వెన్నుపోటు, రామ బాణాన్ని పక్షికి గురిపెట్టడం లాంటి లొసుగులు అతి కొద్దిగా ఉన్నాయి. సీతని అగ్నిప్రవేశం చేయించడం లాంటి ఓవర్ యాక్షన్లూ లేకపోలేదు. ‘మరి మనిషంటే అంతేమరి! తప్పొప్పులు పడుతూ పడుగూ పేకాగా నేసిన వస్త్రం మనిషి’ అంటూ పెద్దలు సమర్థించి క్లీన్ చిట్ ఇచ్చారు. చాలా మంది ప్రపంచ మేధా వులు శంభూక వధ జాబాలి వృత్తాంతం స్టడీ చేసి రాముణ్ణి చీల్చి చెండాడే ప్రయ త్నం చేశారు. ప్రజా రాజ్యంలో మెజారిటీ వాదమే సత్యమై నిత్యమై నిలుస్తుంది. ‘లోపములున్నను రాముడు దేవుడు’ అని ముక్తకంఠంతో అరిచి కొలిచారు. రేపు వినాయక ఉత్సవాలు వస్తాయ్. విఘ్నరాజుని నానా రకాలుగా అలం కరించి వినోదిస్తారు. ఆయన్ని క్రికెట్ ప్లేయర్‌గా, కంప్యూటర్ ఇంజనీర్‌గా సెల్ఫీలు తీసుకుంటున్న భంగిమలో చూస్తూనే ఉన్నాం. ఆలోచనే వస్తే– ఓ కొత్త రూపం రానే వస్తుంది. వినాయకుడి విషయంలో ఎవరూ తప్పు పట్టరు. అదే శివుడి జోలికో, విష్ణువు జోలికో వెళితే మాత్రం సహించరు. త్రిమూర్తుల్లో బ్రహ్మదేవుణ్ణి పెద్దగా స్మరించరు. ‘నాలుగు తలలతో విరాజిల్లే బ్రహ్మ మన సిటీ ట్రాఫిక్ నియంత్రణకి అద్భుతంగా వినియోగపడతారండీ’ అని ఓ ఆధునికుడు చమ త్కరించాడు. కలియుగంలో భూమ్మీద ఆయనకు స్థానం లేదని చెప్పాడు. మనిషి దేవాంతకుడు. దేవుణ్ణి కూడా రెండు చేతులు, రెండు కాళ్లతో అచ్చం తన కొలతలతోనే తయారు చేసి ఆ బొమ్మలకే ప్రాచుర్యం తెచ్చాడు. గుళ్లో పెట్టి, పూజలు పునస్కారాలు డిజైన్ చేశాడు. టెంకాయలు, కర్పూరం, అగరుబత్తీలకు కోట్లాది రూపాయల మార్కెట్ తెచ్చాడు. తనకు లాగే పెళ్లిళ్లు, పేరంటాలు, పవళింపు సేవలు సమస్తం దేవుళ్లకి మప్పాడు. భక్తి ఆసరా కూడా డెమోక్రసీ లాంటిదే. కొందరు దేవుణ్ణి ఆసరా చేసుకుని మిగతా అందర్నీ నియంత్రిస్తూ, నిమంత్రిస్తూ ఉంటారు. చాలామంది గతిలేక దేవుణ్ణి మితంగానో, అమితంగానో నమ్మి జీవితం వెళ్లదీస్తుంటారు. త్రిమూర్తులు ఒకచోట కూడి, విశ్వసృష్టిపై చర్చాగోష్టి పెట్టుకున్నారు. ‘బ్రహ్మదేవా! తమరి తెలివి తెల్లారినట్లే ఉంది. మానవుడికి అంత తెలివా’ అని శివుడు వాపోయాడు. ఔనన్నట్లు విష్ణుమూర్తి తల పంకించాడు. చిరునవ్వుతో, ‘నేను ఏదైనను జీర్ణించుకోగలను. దురద మందు వ్యాపార ప్రకటనకి రామ బాణం వాడితే ఏమన్నాను? సంజీవని పర్వతం తెస్తున్న హనుమ ట్రాన్స్పోర్ట్ కంపెనీకి గుర్తు అయితే కాదన్నానా? భాజపా వారు రామనామాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో వాడితే ఉదాసీనంగా ఉండిపోలేదా? ఏరుదాటాక తెప్ప తగలేసి చలికాచుకోమన్నారు కదా. రాబోయే రోజుల్లో ముఖ్యనేత దుస్తులతో రామ విగ్రహాలను అలంకరించి, రామరాజ్యాన్ని జనం కళ్లముందు చూపినా ఆశ్చర్యంపోను. అయినా, వగపేటికి చల్ల చిందినన్’ అంటూ విష్ణుమూర్తి ముగించాడు. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ఋష్యశృంగా ఇంపోర్టెడ్ వాటర్!
అక్షర తూణీరం ముందు ముందు పెట్రోల్ పుట్టదు కనుక. అది లేకుండా భూమి తిరగదు కనుక.... నీళ్లు కూడా అంతే. ముందు చూపుగా ఈ ఆలోచన చేశా. మళ్లీ ఎక్కడా అనకండి! పొద్దున్నే కాలిఫోర్నియా నించి ఫోను. శేషు నామాల చేశాడు. నాకు చిరకాల మిత్రుడు. ముప్పయ్ ఏళ్లకు పైగా అక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకుని అమెరికాని సొంతం చేసుకున్నాడు. చాలా మంచి ఉద్యోగం, తగిన సంపాదన. పైగా మ్యాన్ ఆఫ్ అయిడియాస్. శేషు ఎప్పుడు ఫోన్ చేసినా కొత్త ఆలోచనలు దట్టిస్తాడు. ‘‘మీ ఇండియాలో వాటర్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా. మళ్లీ ఎక్కడా అనకండి!’’ అంటూ ప్రారం భించాడు. ‘‘దేనికండీ! ఇప్పటికే సవాలక్ష బ్రాండ్లు అయిదు ఎమ్మెల్ నించి అయిదువేల దాకా ఉన్నాయ్ కదా!’’ అన్నాను. శేషు అమెరికన్ నవ్వుకి భారతీయత జోడించి ఘాటుగా, క్లుప్తంగా నవ్వాడు. ‘‘మనవాళ్లకి మెదడు ఉంది గాని మెథడ్ లేదు’’ అంటూ ఒక సొంత కొటేషన్ విసిరాడు, దాచుకోమన్నట్టు. ‘‘ఎక్కడా అనకండి... ఫ్యూచర్లో ఉండబోయే ఒకే ఒక్క సమస్య వాటర్ సమస్య. అందుకని మన రాష్ర్టంలో అక్కడక్కడ కొన్ని కొండలు కొంటున్నా...’’ అని మొదలుపెట్టాడు. ‘‘కొండలు తొలిచి భయంకరమైన స్టోరేజీ ట్యాంకులు తయారుచేస్తాం. వాటిలో నీళ్లని స్టోర్ చేస్తాం.’’ ఈసారి అచ్చతెలుగు నవ్వు నవ్వడం నా వంతయింది. ‘‘నవ్వు జ్ఞానాన్ని ఇంకనివ్వదు’’ మరో కోట్ విసి రాడు. చూడు, ప్రపంచమంతా పెట్రోల్‌ని దాచేస్తోంది. భూమిలో, సముద్రంలో, ఇంకా రహస్య ప్రదేశాల్లో... మళ్లీ ఎక్కడా అనకండి. దేనికంటే, ముందు ముందు పెట్రోల్ పుట్టదు కనుక. అది లేకుండా భూమి తిరగదు కనుక.... నీళ్లు కూడా అంతే. ముందుచూపుగా ఈ ఆలోచన చేశా. నీళ్లు ఆవిరి కాకుండా కాపాడే ఒక రకం నాచుని ఇప్పటికే సిద్ధం చేశా. పూర్వం సంపదని బంగారం, వజ్ర వైఢూర్యాల రూపంలో దాచుకునేవారు. భూసంపద కూడా అపురూపమై పోయింది. ఎందుకంటే భూమి తయారీ ఆగిపోయి యుగాలైంది కదా! మళ్లీ ఎక్కడా అనకండి. ఎప్పుడూ శేషు నామాల కొత్త సంగతులతో మాట్లాడతాడు. ‘‘భవిష్యత్తులో నీటిని మించిన నిధి లేదు. ఇప్పుడు నీటి నిల్వల సెక్యూరిటీ గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నా. ఎందుకంటే, ఎంతకైనా తెగిస్తారు. ధర మనం చెప్పినంత! వెయ్యి మందికి పది బిందెల నీళ్లు మాత్రమే ఉన్నప్పుడు ఇహ ధర ఏమిటి చెప్పండి! అప్పుడు నీళ్లు అమ్మడమంటే ప్రాణాలు అమ్మడమే కదా! అని మళ్లీ నవ్వాడు. ఈసారి నాకు భయం వేసింది. ఇంకా ఈ వాటర్ బిజినెస్ గురించి బోలెడు పాయింట్లు చెప్పాడు. మరీ నాది ఇండియన్ బ్రెయిన్ అనుకుంటాడని నేనో అయిడియా జోడించా. ‘‘పై దేశాల నుంచి వచ్చే విమానాలకి తగిలించి వాన మబ్బుల్ని తరలించుకు రావచ్చు. ఇక్కడ ఒక గరాటు లాంటి ప్లాట్‌ఫాం మీద వాటిని నీళ్లుగా డౌన్లోడ్ చేసుకోవడమే. పెద్ద ఖర్చు కూడా ఉండదు. పైలట్ గారికి పది రూపాయలు చేతిలో పెడితే దారిలో ఓ కరిమబ్బుని తగిలించుకు వస్తాడు. ఇంకో సంగతి ఏంటంటే, అప్పుడు పాతిక దేశాల నీళ్ల పేర్లు చెప్పి మరీ నువ్వు అమ్మవచ్చు. మంచి పేరున్న మన రుషిగారి పేరు మీద మహత్తరంగా మార్కెట్ చేయవచ్చు’’ అన్నాను. మనకేంటి ఋష్యశృంగుడున్నాడు కదా.. ఎక్కడా అనకండి- అంటూ ఫోన్ పెట్టేశాడు శేషు. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
పురస్కారాలూ - ప్రతిస్పందనలూ
అక్షర తూణీరం పొగడ్త సుగంధ ద్రవ్యం లాంటిది. అది మితంగా ఉంటే ఆరోగ్యానికి మంచిది. దాని వాడకం వ్యసనంగా మారితే చాలా ప్రమాదం - అంటూ ఒక పెద్దాయన హెచ్చరిస్తూ ఉండేవాడు. సర్వసాధారణంగా సన్మానవేళ పంచాంగాలు ప్రధానంగా ఉంటాయి. పత్రం, పుష్పం, పచ్చడం, ఫొటో, పొగడ్త - ఇవీ ఆ ఐదు ప్రధానాంగాలు. ఇందులో ఏ ఒక్కటి తగ్గినా సన్మానం అందగించక పోగా మందగిస్తుంది. నేనీమాట స్వానుభవంతో చెబుతున్నా. మొన్నంటే మొన్న తెలుగు విశ్వ విద్యాలయం వివిధ సాహిత్య సాంస్కృతిక కళా రంగాలలో విశేష కృషి చేసి, చేస్తున్న కొందరిని గుర్తించి సత్క రించింది. వారందరికీ ఒకే వేదికపై పురస్కారా లందించి, తనని తాను సన్మానించుకుంది. నిజంగా నాకెంత ఆనందం కలిగిందో మాటల్లో చెప్పలేను. పైగా నా కాళ్లతో నేను వేదిక ఎక్కకలిగిన స్థితిలో, మనుషులు మనుషుల్లా కని పిస్తున్న దశలో నా గురించిన గొప్ప గొప్ప పొగడ్తలను స్వయంగా నా చెవులతో నేను వినగలిగిన వేళ - ఇలాంటి సదవ కాశం రావడం అదృష్టం. పంచేం ద్రియాలలో ఎనిమిది ఇంద్రియాలు పనిచేయని తరుణంలో ఇలాంటివి అడవిగాచిన వెన్నెలలవు తాయి. నా సంతోషానికి మరో కారణం, ఏకకాలంలో ఎక్కువమందిని సన్మానించడం. బాగా స్టేజిఫియర్ ఉన్న నాలాంటి వారికి చాలా ధైర్యంగా ఉంటుంది. ఎవరు ఏ రంగం నుంచి వచ్చినా, అక్కడ అందరం పురస్కార గ్రహీతలమే కదా. అదొక వెర్రి ధైర్యాన్ని స్తుంది. పైగా చూసి చూసి అక్కడి తంతు అర్థమ వుతుంది. మన వంతు వచ్చినపుడు తడబాటుకి ఆస్కారం ఉండదు. మీడియాకి ఎక్స్పోజు కావల్సిన పోజు కూడా నేర్చు కునే అవకాశం ఉంటుంది. ఇలాంటి వ్యవహారాల్లో పండిపోయిన వారు, మిగల ముగ్గిన వారు కొంద రుంటారు. వారిని గమనిస్తే నాలాంటి కసుగాయలకు చాలా మెలకువలు తెలు స్తాయి. అనంతరం, దండని తీసి ఆ నిర్మాల్యాన్ని ఎక్కడ పెట్టుకోవాలి, విప్పి కప్పిన శాలువాని మడతలు ఎలా మడుచుకోవాలి లాంటి పలు సున్నిత అంశాలు అవగతం అవుతాయి. భావి జీవితానికవి రాచబాటలవుతాయి. ఇలాంటి పురస్కారాలు ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపచేస్తాయని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. కాని నా అనుభవం వేరుగా ఉంది. మొన్న బస్సు దిగి, సభా ప్రాంగణంవైపు వెళ్తుండగా ఒక పెద్దాయన అడ్డుకున్నాడు. ఏమి టిక్కడ విశేషం అన్నాడు. చెప్పాను. మరి మరేమిటనగా, నేనిట్టా హాస్యం, నా పేరు ఫలానా అన్నాను. ఆయనొ క్కసారి ఆశ్చర్యంగా చూశాడు. ‘‘అయ్యో! మీరా సంతోషం... ఎన్నాళ్లకు మీ దర్శనం’’ అంటూ కరచాలనం చేశాడు. మా ఇంటి ల్ల్లిపాదికీ మీ రాతలంటే చచ్చే ఇష్టం... ఈ యూనివర్సిటీలు అప్పుడప్పుడు మంచి పనులు కూడా చేస్తాయండోయ్ అంటూ విరగబడి నవ్వాడు. మీరు... చాలా హిలేరియస్ అబ్బో! మరీ ఆ బుడుగు... అప్పారావ్... బారిష్టర్ పార్వతీశం... ‘‘అది నేను కాదండీ’’ అనేశాను అప్రయత్నంగా. బుడుగు అవీ ముళ్లపూడి రమణ గారు రాసింది నేను కాదండీ’’ అన్నాను ధైర్యంగా. సర్లెండి, మీరు ఆ రమణేమో.. లోపలికి వద్దామనుకున్నా. మా అబ్బాయి సెలూన్‌కి వెళుతూ ఇక్కడ ఉండమన్నాడు. ఓకే.. వస్తాడు పికప్ చేసుకుంటాడు’’ ఈ మాటలు నా ఆత్మవిశ్వాసాన్ని కుంగతీశాయ్. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ఇంకుడు గుంతలు అను మేధోబిలాలు
అక్షర తూణీరం చంద్రబాబు సదా మెదడు గుంతల్ని మెయిన్‌టెయిన్ చేసుకోవాలి. పిచ్చి పిచ్చి ఆలోచనల ఆకులు అలమలు పడినప్పుడు పూడిక తీసుకోవాలి. ఉదాహరణకి వారసత్వంగా పవర్ సంక్రమింపచేద్దామనే ఆలోచన ఇంకుడు గుంతలో పడి, గుంటని పూడ్చేస్తుంది. ఇక ఆపైన ఏవీ కిందికి దిగవు. అప్పుడు ఇందిరాగాంధీ, సంజయ్‌గాంధీలను స్మరించుకోవాలి. పెద్దగా పనిలేనివాడు, బొత్తిగా బాధ్యత లేని వాడు నోటికి ఏదొస్తే అది మాట్లాడతాడు. ‘‘తవ్వు కోండి... ఎవరి గొయ్యి వాళ్లు తవ్వుకోండి!’’ అని వ్యాఖ్యానించడంలో బోలెడు అనుభవరాహిత్యం కనిపిస్తుంది. ఏ మాటకామాట చెప్పుకోవాలి, దేనికదే ఒప్పుకోవాలి - చంద్రబాబు ఇంకుడు గుంతల మీద ఎప్పటి నుంచో కృషి చేస్తున్నారు. కిందటిసారి పవర్లో ఉన్నప్పుడు ‘ఇం.తల’ ప్రచారానికి కోట్లాది రూపాయలు వెచ్చించారు. లక్షలాది కరపత్రాలు, ప్రచార సామగ్రి తయారు చేసిన మిత్రుడు అప్పట్లో మంచి ఇల్లు ఏర్పాటు చేసుకుని, అందులో ఇంకుడు గుంత తవ్వించుకున్నాడు. వెంకయ్య లాంటి జాతీయ నాయకులు మొదలు మన ప్రాంతీయ నాయకుల దాకా రాబోయే నీటిచుక్కల్ని ఒడిసి పట్టేందుకు శ్రమదానం చేస్తున్నారు. చెమటోడుస్తున్నారు. ఇప్పుడు మనం పై చినుకుల్ని ఒడిసి పట్టడంతో పాటు, మునుపటి తరాల వారు అందించిన ఆదర్శాలను, త్యాగాలను కూడా ఇంకించుకోవలసిన చారిత్రక అవసరం ఉంది. అందుకోసం మన నేతలు, వివిధ వ్యాపార దిగ్గజాలు, శాస్త్రవేత్తలు, లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఆచార్య దేవుళ్లు, న్యాయమూర్తులు తమ తమ మెదళ్లలో తగు పరిమాణంలో ఇంకుడు గుంతలు తవ్వుకోవలసిన అవసరం ఉంది. దీనికి పలుగులు, పారలతో పనిలేదు. మానసికంగా ఈ మేధోబిలాన్ని తవ్వుకోవచ్చు. మోదీ లాంటి అగ్రనేతలు ధర్మ, న్యాయ విచక్షణలను ఇంకింపచేసుకుంటే తరచు ఎదురు దెబ్బలు తగలకుండా ఉంటాయి. చంద్రబాబు సదా మెదడు గుంతల్ని మెయిన్‌టెయిన్ చేసుకోవాలి. పిచ్చి పిచ్చి ఆలోచనల ఆకులు అలమలు పడినప్పుడు పూడిక తీసుకోవాలి. ఉదాహరణకి వారసత్వంగా పవర్ సంక్రమింప చేద్దామనే ఆలోచన ఇంకుడు గుంతలో పడి, గుంటని పూడ్చేస్తుంది. ఇక ఆపైన ఏవీ కిందికి దిగవు. అప్పుడు ఇందిరాగాంధీ, సంజయ్‌గాంధీలను స్మరించు కోవాలి. వెంటనే పూడిక కరిగి మేధోబిలం ప్రతి అనుభవసారాన్ని ఒడిసి పట్టడానికి సిద్ధంగా ఉంటుంది. కాంగ్రెస్ నేతలు సామూహికంగా ఇంకుడు గుంతలు తవ్వుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే నూటనలభయ్ సంవత్సరాల ఊట ఇంకిపోయింది. పార్టీ పెద్ద చవిటిపర్రగా మిగిలింది. తక్షణం బిలాల మీద దృష్టి సారించండి. మంచి ఆలోచనలను ఒడిసి పట్టి, ఇంకింప చేసి పార్టీ జెండాని చిగురింప చేయండి. డాక్టర్లకిప్పుడు ఈ గుంతలు అత్యవసరం. బిలాలు కరెన్సీతో కవర్ కాకుండా చూసుకోవాలి. విద్య గరిపేవారు, వైద్యులు, నీతికోవిదులు వీరిని దైవసమానులుగా మనం భావిస్తాం. న్యాయ, నీతి, ధర్మశాస్త్రాలు ఎలాంటి అమృతవాక్కులు కురిపించాయో తెలుసు. వాటిని ఒడిసిపట్టి వారి వృత్తుల్ని పండించుకుంటే ఎంత బావుంటుంది! స్వామీజీలు, బాబాలు, మాతృశ్రీలు, అవధూతలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. మేము... మేము అని తమని తాము సంబోధించుకుంటూ ప్రసార మాధ్యమాలు సొంత ప్రచార మాధ్యమాలుగా మారిపోతున్నాయి. వీరంతా మేధోమథనం చేసుకోవాలి. తక్షణం వారంతా వారికి తగిన పరిమాణంలో ఇంకుడు గుంతలు తవ్వుకోవాలి. పై కొలతలు ఎలా ఉన్నా వీరంతా లోతు పెంచుకోవడం శ్రేయస్కరం. వ్యాసకర్త: శ్రీరమణ (ప్రముఖ కథకుడు) -
రంగులు వెలిసిపోతున్నాయ్!
అక్షర తూణీరం రాను రాను రాజకీయాలలో కలనేతలు ఎక్కువైపోయాయి. కలసి వస్తుందనుకుంటే అన్నిటినీ వదిలేసి కలసిపోవడమే. పవర్ పగ్గాల కోసం ప్రాణాన్ని తప్ప దేన్నైనా వదిలేయడానికి సిద్ధం అంటున్నారు. ఏరు దాటడానికి ఇద్దరు వ్యక్తులు ఒకే నావలో కూచుంటారు. అంత మాత్రం చేత వాళ్లు మిత్రులు కారు. ఏరుదాటాక ఎవరిదారి వారిదే! చూసుకోండి, రంగులు వెలిసిపోతు న్నాయ్! నిన్నగాక మొన్న పూసుకున్న ‘హోలీరంగులు వెల వెలపోతున్నాయి. పూసుకున్న రంగులు ఇలాగే అఘోరిస్తాయ్. అభిమానాలు, స్నేహాలు, బాంధవ్యాలు మాసి పోయి పేలవంగా కనిపిస్తున్నాయి. మానవ సంబంధాలేకాదు, మానవుడికి సమస్త చరాచర ప్రకృతితో ఉండాల్సిన సంబంధాలు సైతం శిథిలమై, చీలికలై, పీలికలై దరిద్రంగా వేలాడు తున్నాయి. గురు, శిష్యుల మధ్య ఉండాల్సిన శ్రావ్యమైన తీగె తెగిపోయి రెండు తరాలు దాటింది. చదువుని కేజీలుగా, అరకేజీలుగా, పీజీలుగా అంగళ్లలో అమ్ముతున్నారు. చదువుకి డబ్బు చేసింది. దాని రంగు మారింది. కాంక్రీట్ టవర్స్‌ని, శరీరాల్ని కాచి వడపోసే యంత్రసామాగ్రిని ఎరవేసి, రోగుల్ని లాగేస్తున్న ఆసుపత్రులు మునులేటి రంగుల్ని మార్చుకున్నాయి. డాక్టర్లు పచ్చనోట్ల రంగుల్లో పెళపెళలాడుతున్నారు. సహజమైన పండ్ల రంగులు లేవిప్పుడు. అసలుకంటే గమకంగా కనిపిస్తూ పండ్లూ కూరలూ జనసామాన్యాన్ని ఆకర్షిస్తున్నాయి. పరోక్షంగా పై చెప్పిన ఆస్పత్రులకు కావాల్సినంత సేవ చేస్తున్నాయి. మన చట్టాలు పూర్తిగా వెలిసిపోయి, చవుడు వాసన కొడుతున్నాయి. వ్యాపారమంటే పబ్లీకున చెప్పి మరీ దగా చేయడమనే నిర్వచనం ఖరారైంది. కుక్కతోలుకి రంగులేసి పులిచర్మంగా అంటకడుతున్నారు. రంగు రుచి వాసన లేని నీళ్లకి ఆ మూడూ కల్పించి, కోట్లు దండుకుంటున్నారు. ఆకుని చూసి చెట్టు పేరు చెబుతాం. జండాని చూసి దేశాన్ని గుర్తిస్తాం. ఆ నాడెప్పుడో పింగళి వెంకయ్య మూడు నిండు రంగులతో మువ్వెన్నెల జెండాని మనకోసం సమకూర్చారు. కాషాయవర్ణం పరిత్యాగుల పేటెంటు కలరు. దాన్ని ఆ రోజుల్లో జనసంఘ్ పార్టీ జెండాకి వేసుకుంది. కొన్నాళ్లు రెపరెపలాడింది. దీపం కొండెక్కింది. ఆ రంగులద్దుకుని భాజాపా రంగు ప్రవేశం చేసింది. రాను రాను రాజకీయాలలో కలనేతలు ఎక్కువైపోయాయి. కలసి వస్తుందనుకుంటే అన్నిటినీ వదిలేసి కలసిపోవడమే. పవర్ పగ్గాల కోసం ప్రాణాన్ని తప్ప దేన్నైనా వదిలేయడానికి సిద్ధం అంటున్నారు. ఏరు దాటడానికి ఇద్దరు వ్యక్తులు ఒకే నావలో కూచుంటారు. అంత మాత్రం చేత వాళ్లు మిత్రులు కారు. ఏకాభిప్రాయం ఉండాల్సిన పనిలేదు. ఏరుదాటాక ఎవరిదారి వారిదే! రాజకీయ లబ్ధికోసం కాషాయంలో పసుపు కలిసింది. ఏదో ఒక కొత్తరంగు వచ్చింది. ఏ రంగు సాంద్రత ఎక్కువగా ఉంటే అందులోకి మిగిలినవన్నీ చేరతాయి. సొంత ఉనికిని కోల్పోతాయన్నది కెమిస్ట్రీ సిద్ధాంతం. ఆపద్ధర్మంగా ఎండ్రకాయని, గోధురు కప్పని కాడికి కడితే, నడక అస్సలు బాగుండదు. ఎండ్రకాయ అడ్డదిడ్డంగా నడుస్తుంది. కప్పకి గెంతడం తప్ప ఏమీ తెలియదు. స్వచ్ఛమైన మాతృవర్ణాలు ఏ జెండాలోనూ కనిపించడంలేదు. గులాబి జెండాలో ఆకుపచ్చని డాగులు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ జెండాలో బోలెడన్ని రంగులు, కావాల్సినన్ని షేడ్స్ - కలిసి కలవక కనిపిస్తాయి. కాంగ్రెస్ జెండా అత్యాధునిక నైరూప్య చిత్రంలా తయారైంది. ఇక్కడ ఎర్రజెండాలు ఎగరడం మానేసి చాలా కాలమైంది. ఎగరని జెండాల రంగులు ఎంచడం కష్టం. ప్రపంచంలో ఏ రెండు గడియారాలు ఒక్కలా కదలవు. ఏ రెండు జెండాలు ఒక్కలా ఎగరవు. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ఇదియొక చమత్కారం
అక్షర తూణీరం చాలా ఏళ్ల క్రితం పరిచయం ఉన్న ఒక ఎమ్మెల్యేగారిని అభినందిస్తూ ‘‘మీరు సభాపతి అవుతారనిపిస్తోందండీ!’’ అన్నాను. ఆయన వెంటనే, ‘‘వద్దండీ! సభలో హాయిగా కునుకు తీయడానికి ఉండదు’’ అంటూ కంగారు పడ్డారు. సెమినార్లలో, పునశ్చరణ తరగతులలో అధికారులు నిద్ర ముద్రతో దర్శనమిస్తూ ఉంటారు. గడచిన రోజు ప్రపంచ నిద్రా దినోత్సవం. నిద్రాప్రియులు ఇప్పుడు జాగృతమై ఉంటారు. వారందరికీ శుభాకాంక్షలు. నిద్ర ఒక యోగం. ఒక భోగం. కొందరికి నిద్ర పట్టదు. కొందరు నిద్రని పట్టించుకోరు. జపాన్‌లో ఒక వృద్ధ బౌద్ధ భిక్షువు అందర్నీ ‘సుఖ నిద్రా ప్రాప్తిరస్తు’ అని దీవిస్తాడు. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం ఉండి వాటికి తోడు చీకూ చింతా లేకుండా ఉండేవాడే సుఖ నిద్రపోగలడు. ఆ దీవెన వెనుక ఇంతటి అంతరార్థం ఉంది. ‘‘నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను’’ అనే చంద్రబాబు నినాదం చాలా ఫేమస్. అందరూ నిద్రలో ఉండగా మనకు అర్ధరాత్రి స్వాతంత్య్రం వచ్చింది. అప్పట్నించీ దేశం అలాగే మగత నిద్రట్లో ఉండిపోయిందని కొందరు మేధావులు అంటూంటారు. నిద్ర ఒక మానసిక స్థితి- కాదు ఇదొక శారీరక అవసరం. కాదు, ఇదొక దినచర్య. కాదు, ఇదొక చమత్కారం. నిద్రలో సుఖం ఉంది. నిద్రలో బంగారు కలలున్నాయి. కలల్లో అనేక తీరని కోరికలు తీరతాయి. ‘‘నిజానికి జీవితం యావత్తూ ఒక కలే!’’ అంటూ శంకరాచార్యులు మిధ్యావాదాన్ని ప్రతిపాదించారు. ఇది పెట్టుబడిదారుల కుట్ర అన్నాడు కారల్‌మార్క్స్. ‘‘వైకుంఠంలో విష్ణుమూర్తి కూడా నిద్రకు ఉపక్రమిస్తాడు. కానీ అయ్యది యోగనిద్ర’’ అంటారు విశ్వనాథ. త్రేతాయుగంలోనే రెండు మహానిద్రలు గుర్తించారు. సంవత్సరంలో సగకాలం ఏకధాటిగా నిద్రపోయే కుంభకర్ణుడు, భర్త వనవాస సమయం మొత్తాన్ని నిద్రలో సద్వినియోగం చేసుకున్న ఊర్మిళాదేవి ప్రత్యేకంగా పేరు తెచ్చుకున్నారు. దీంతో నిద్రకి పురాణ గౌరవం దక్కింది. జంతువులు, పక్షులు, చెట్లు సైతం హాయిగా నిద్రపోతాయి. చెట్లకొమ్మలకు వేలాడుతూ గబ్బిలం నిద్రలో రిలాక్స్ అవుతుంది. గుర్రం నిలబడే నిద్రపోగలదు. ‘‘ఏనుగు నిద్రపోదు. సింహం కల్లోకి వస్తుందని భయం’’ అంటారు. అంతా వట్టిది. ఇదొక అతిశయోక్తి. దీన్ని కవిసమయం అంటారు. చాలా ఏళ్ల క్రితం పరిచయం ఉన్న ఒక ఎమ్మెల్యేగారిని అభినందిస్తూ ‘‘మీరు సభాపతి అవుతారనిపిస్తోందండీ!’’ అన్నాను. ఆయన వెంటనే, ‘‘వద్దండీ! సభలో హాయిగా కునుకు తీయడానికి ఉండదు’’ అంటూ కంగారు పడ్డారు. సెమినార్లలో, పునశ్చరణ తరగతులలో అధికారులు నిద్ర ముద్రతో దర్శనమిస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో వీడియో కవరేజీలు ఇబ్బంది పెడుతున్నాయి. కొందరు కోడికునుకులు తీస్తూనే సంగతులను ఆకళింపు చేసుకోగలరు. ఎన్టీఆర్ కునుకుల రాముడిగా ప్రసిద్ధి గానీ, కొంచెం జోగుతూనే సినిమా కథలు విని తీర్పులిచ్చేవారు. ఒకసారి కథంతా విని ‘‘బావుంది బ్రదర్! వెరీఫైన్. కానీ అక్కడక్కడ జంప్‌లు ఉన్నాయి. చెక్ చేసుకోండి!’’ అని సూచించారు. వెంటనే కవిగారు, ‘‘చిత్తం, తవరి కునుకులన్నీ జంపులే కదండీ’’ అన్నారు, వినయంగా. ‘‘మంచి అబ్జర్వేషన్ బ్రదర్’’ అంటూ మెచ్చుకున్నారు. నిద్ర విషయంలో మహర్జాతకుడాయన. నాకు నాలుగు వేల ఆరొందల యాభయ్రూపాయల అప్పుంటేనే నిద్ర పట్టడం లేదు. ఆ విజయ్ మాల్యాకి ఎలా పడుతోందండీ అని అడిగాడొక బక్కరైతు. ఎందుకు పట్టదు? ఆయనకి అప్పులిచ్చిన వాళ్లు తలొక వాయిద్యం వాయిస్తూ, లోగొంతులో జోల పాటలు పాడుతూ ఉంటే మహా బాగా పడుతుంది అన్నాడు సందేహం విన్న పెద్ద మనిషి. మనది వేదాలు వెలసిన నేల. హాయిగా నిద్రపోవడం మన జన్మహక్కు. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
మద్యమే మనకు రక్ష!
ఇది బడ్జెట్ సీజన్. ఒక నెలరోజుల పాటు ఏ నోట విన్నా అంకెలే తప్ప అక్షరాలు వినిపిం చవు. ‘‘ఇదంతా ఒక పెద్ద మాయాజాలం. ఏదో అందరికీ మేలు చేసినట్టే బడ్జెట్ చిట్టాని సమర్పి స్తారు. ఎవరికీ ప్రయోజనం ఉండదు. అట్లాగని ప్రభుత్వానికీ మేలు జరగదు’’ అని ఒక ఆర్థిక మేధావి అన్నారు. మళ్లీ ఇందులో రైల్వే బడ్జెట్ ఒక ప్రత్యేక విశేషం. ఆసక్తికర అంశంగా నిలుస్తుంది. టికెట్ల ధర పెంచడం తప్ప తగ్గించడం ఉండదు. రవాణా అంటే సరుకు రవాణా చార్జీలు కూడా తగ్గవు. కొత్త రైళ్లు, కొత్త రైలు పట్టాలు కూడా బడ్జెట్లోకే వస్తాయి. ఇక్కడ ఆయా మంత్రుల పలుకుబళ్లు బాగా పనిచేస్తాయి. రెండు నెలలు ముందు నుంచే రాష్ట్ర మంత్రులు ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అన్నీ వింటారు. కేంద్ర మంత్రులు సమస్త ప్రతిపాదనలకూ సానుకూలంగా స్పందించినట్టే కనిపిస్తారు. ఆ తర్వాత జరిగేది జరుగుతుంది. ‘బ డ్జెట్ సమర్పణ’ మన దేశానికో పెద్ద సందర్భం. ఎందుకో తెలియదు. అనాదిగా పెద్దలు, పత్రికలు కలసి దానికి విపరీతమైన ప్రాముఖ్యం కల్పించారు. బడ్జెట్ ప్రతిపాదనలు శిలాశాసనాలేమీ కాదు. ఏదో గురికి బెత్తెడుగా నడిచిపోతూ ఉంటాయి. అధికార వర్గం ‘‘ఇదొక అద్భుతం! ఇది పేదోడి బడ్జెట్’’ అంటూ ఆకాశానికెత్తేస్తుంది. ‘‘ఇది అంకెల గారడీ. పెట్టుబడిదారుల బడ్జెట్’’ అంటూ అపోజిషన్ అరుస్తుంది. పత్రికలు అవే శీర్షికలు, ఉప శీర్షికలతో బడ్జెట్ వార్తలు ప్రచురిస్తాయి. సామాన్యుడికి ఏమాత్రం తేడా పడదు. గడిచిన యాభై ఏళ్లుగా కథ ఇలాగే నడుస్తోంది. ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్లు, నాయకుల గౌరవ వేతనాలు, వారింటి ఖర్చులు, విదేశీ ప్రయాణ బరువులు ఇవే చాలావరకు దేశ ఆదాయాన్ని హరించివే స్తాయి. పావలో, బేడో మిగిలితే దానికి కావల్సినన్ని అవసరాలు. ‘‘అంతా మన ఫ్యామిలీలాగానే. అనుకోని ఖర్చులు బోలెడు. ఇల్లు రిపేర్లు, పెళ్లిళ్లు పేరంటాలు, రాకపోకలు మనకు ఉన్నట్టే పాపం, మోదీగారికీ ఉంటాయ్’’ అన్నాడొక కుటుంబరావు. ఏముందండీ... ఏదో ఫిగర్స్ చదువుతారు. అవన్నీ లెక్క ప్రకారం జరగాలని ఎక్కడుంది. కొత్త పంచాంగంలో కందాయ ఫలాల్లాగే. ఏదో ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేస్తాం’’ అన్నాడొక మధ్య తరగతి నిరాశాజీవి. ఇప్పటికే రాష్ట్రాల్లో, కేంద్రంలో ఈ కసరత్తులతో పెద్దలకి చెమటలు పడుతున్నాయి. చివరకు హళ్లికి హళ్లికి సున్నకు సున్న. తెలుగు రాష్ట్రాలలో మద్యం మీద ఆదాయమే మిక్కిలి ఆశావహంగా ఉంది. ఏటికే డాది ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోంది. ప్రభుత్వం టార్గెట్లు పెంచినా తేలిగ్గా వాటిని పూర్తి చేస్తున్నారు. చివరికి అబ్కారీదే పెద్ద ఆదాయం అయింది. మద్యాదాయాన్ని పెంచుకోవడానికి ఉభయ రాష్ట్రాలు పగలూ రాత్రీ శ్రమిస్తున్నాయి. ఇందుకు ఆనందించాలా? గర్వించాలా? గాంధీని తలుచుకుని తలదించుకోవాలా? శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
పచ్చబొట్ల పండగ వచ్చేసింది!
అక్షర తూణీరం ‘‘విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం. మమ్మల్ని గద్దె ఎక్కించండి’’ అని ఒకరంటున్నారు. ‘‘మేం మా రోజుల్లో తీర్చి దిద్ది ప్రపంచ స్థాయి నగరానికి కావలసిన హంగులన్నీ సమకూర్చాం. అవసరమైతే పారిస్ నగరానికి పోటీగా నిలబెడతాం’’ అంటూ ముందుకు వెళుతున్నారు ఇంకొకరు. కమలానికి చెప్పుకోవడానికి చరిత్రేమీ కనిపించడం లేదు. వినిపించడానికి వీరగాథలేమీ లేవు. పైగా తెదేపా, భాజపా పాలూనీళ్లలా కలసిపోవడం వల్ల, ఎవరు పాలో ఎవరు నీళ్లో విడమర్చి చెప్పలేం. ‘‘ప్రజాసేవకి ఇంత డిమాండా?’’ అని ఒక విదే శీయుడు ఆశ్చర్యపోయాడు. ‘‘ఔను! మాది కర్మభూమి!’’ అని నేను గర్వంగా బదులి చ్చాను. ఎందరో అంకిత భావమూ, సేవా స్వభా వమూ గల ఆదర్శ స్త్రీ పురుషులు ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్నారు ఈ బల్దియా ఎన్నికల కోసం. ఎన్నికలు లేకపోతే నిలబడే అవకాశం ఉండదు. నిలబడితే గాని పోటీలో గెలిచే అవకాశం రాదు. గెలిస్తే కానీ ప్రజాసేవకి దారి దొరకదు. ఈ అంతస్సూత్రాన్ని ఆధారం చేసుకుని ఒక్కో పార్టీకి ఒక స్థానానికి హీనపక్షం పదిమంది ఉత్సాహవంతులు బీఫారాలకై చకోర పక్షుల్లా నిరీక్షించడం చూశాం. దాని తర్వాత ఆత్మాహుతుల పర్వం. టిక్కెట్ రాని వారు జనసేవకు అవకాశం రానందుకు తీవ్ర అసంతృప్తికి లోనవుతారు. అలాంటి కొందరు రకరకాల మెథడ్స్‌లో అందరూ చూస్తుండగా ప్రాణ త్యాగాలకు పాల్పడతారు. ‘‘అంతా యాక్షన్. బ్లాక్మెయిల్ రాజకీయం. నిజంగా ఆ ఉద్దేశం ఉంటే ఇంట్లో తలుపులేసుకుని ఉరి వేసుకోవచ్చు. లేదా... వచ్చు. కాదంటే... వచ్చు’’ అంటూ పదహారు మేలైన సూచనలు చేస్తూ గిట్టనివాళ్లు మాట్లాడతారు. ఇది అమానుషమైన వ్యాఖ్య. మనకి ఫైనల్‌గా అర్థులు, ప్రత్యర్థులు, రెబెల్స్, స్వతంత్రులు, అస్వతంత్రులు ఇలా ఐదారు రకాలుగా ఈ అభ్యర్థులు తేలతారు. ఇందులోంచి వారికి తోచిన అర్హుల్ని ఓటర్లు ఎంపిక చేసుకుంటారు. అర్హులంతా కలసి ఒక మొనగాడిని లేదా మొనగత్తెను ఎన్నుకుంటారు. నగరాన్ని వారికి అప్పగిస్తారు. ప్రజా ప్రతినిధికి సేవలందించడానికి ఒక అధికార ప్రతినిధి ఉంటాడు. ఆయనని అంతా మేయరు... మేయరు అంటుంటారు. కానీ అవకాశం వస్తే బానే మేస్తారని కొందరు చమత్కరిస్తుంటారు. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో బల్దియా బస్తీలు, కాలనీలు బెజవాడ ప్లాట్‌ఫారమ్‌ని తలపిస్తున్నాయి. ఉన్న నాలుగు గల్లీల్లో ఏడెనిమిది మంది అభ్యర్థులు ప్రచారానికి తిరగడమంటే ఇబ్బందిగానే ఉంటుంది. కాండిడేట్ అంటే ఒంటరి కాదు కదా! కనీసం పదిమంది అండగాళ్లు, పది మంది ఉప్మా కార్యకర్తలు, ఒకరిద్దరు జెండాధారులు, అయిదారుగురు మేళాల వాళ్లు ఉంటారు. అందుకని కొన్ని కాలనీలలోని వారంతా ఒక మాటనుకుని, వేళల్ని ఫిక్స్ చేసుకున్నారు. నిర్ణీత సమయంలో ఆయా గల్లీలకు ఆయా అభ్యర్థులు ప్రచారానికి వెళ తారు. దీనివల్ల ఎలాంటి ఉద్రిక్తతలకూ తావుండదు. ఎన్నికల వాగ్దానాలు ఎటూ పైనించి వినిపిస్తాయి కాబట్టి, విడివిడిగా కార్పొరేటర్ అభ్యర్థులు చేసే దానాలేవీ ఉండవు. ఇప్పటికీ బడా నాయకులు గళాలు సరి చేసుకున్నారు. ‘‘విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం. మమ్మల్ని గద్దె ఎక్కించండి’’ అని ఒకరంటున్నారు. ‘‘మేం మారోజుల్లో తీర్చి దిద్ది ప్రపంచ స్థాయి నగరానికి కావలసిన హంగులన్నీ సమకూర్చాం. అవసరమైతే పారిస్ నగరానికి పోటీగా నిల బెడతాం’’ అంటూ ముందుకు వెళుతున్నారు ఇంకొ కరు. కమలానికి చెప్పుకోవడానికి చరిత్రేమీ కనిపిం చడం లేదు. వినిపించడానికి వీరగాథలేమీ లేవు. పైగా తెదేపా, భాజపా పాలూనీళ్లలా కలసిపోవడం వల్ల, ఎవరు పాలో ఎవరు నీళ్లో విడమర్చి చెప్పలేం. ఏకాభిప్రాయం లేక పోయినా కలసి పోటీకి దిగారం టేనే పదవీ వ్యామోహం కదా! అసలీ రాజ్యం మాది. కనీసం జంట నగరాలు మాకివ్వండంటున్నారు మరొకరు. నగరానికి పచ్చబొట్టు పొడిపించుకునే అదృష్టం పట్టింది. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
చంద్రశేఖర సోమయాజి!
అక్షర తూణీరం కేసీఆర్ తలపెట్టిన యజ్ఞం తాలూకు వార్తలే రెండు రాష్ట్రాలను ముంచెత్తుతున్నాయి. విశ్వశాంతిని కాంక్షిస్తూ సంకల్పించిన మహాయజ్ఞమిది. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం మహాయాగశాలగా మారిపోయింది. యాభై ఎకరాల సువిశాల ప్రాంగ ణంలో నూటారు హోమగుండాలు స్థాపితమ య్యాయి. పదిహేను వందల మంది రుత్విక్కులు వేదమంత్రాలను నాలిక చివర నిక్షిప్తం చేసుకుని అయుత చండీ మహాయాగానికి హాజరవుతున్నారు. పూటా ఐదు వేల మందికి మడి భోజనాలుంటాయి. యాభై వేల మందికి పొడి భోజనాలుంటాయి. వండి వార్చి వడ్డించడానికి నలభీమ సములైన పాకశాస్త్ర ప్రవీణులు గరిటెలతో ప్రాంగణానికి రానున్నారు. నాలుగు వేదాలు పుక్కిట పట్టిన వేదకోవిదులు వేదనాదంతో ఎర్రవెల్లిని పునీతం చేయనున్నారు. మంత్రశాస్త్రాన్ని ఆపోశన పట్టేసిన పండితవర్గం హోమగుండాలను సభిక్షం చేయనుంది. మహా యజ్ఞానికి కావాల్సిన ద్రవ్యాలు ఈసరికు యజ్ఞస్థలికి చేరాయి. మేడి, రావి మొదలైన అర్హత గల సమిధలు ఎండుగా మెండుగా అక్కడ సిద్ధంగా ఉన్నాయి. దర్భలు మేటలుగా నిలిచి, ఎప్పుడెప్పుడు యజ్ఞగుండాలకు ఆహుతవుదామా అని ఎదురు చూస్తున్నాయి. ప్రశస్థమైన ఆవు నెయ్యి పీపాలలో ఘుమఘుమలా డుతోంది. దాదాపు రెండునెలల నుంచి కేసీఆర్ తలపెట్టిన యజ్ఞం తాలూకు వార్తలే రెండు రాష్ట్రాలను ముంచెత్తుతున్నాయి. విశ్వశాంతిని కాంక్షిస్తూ సంకల్పించిన మహాయజ్ఞమిది. యాభై కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా. అయితే విశ్వశాంతి, దేశ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా సాగే సత్కార్యానికి ఇదేమీ పెద్ద బడ్జెట్ కాదు. ఎటొచ్చీ సక్సెస్ రేటుని పరిశీలించాల్సి ఉంది. కేసీఆర్‌కి మొదటి నుంచీ ఆధ్యాత్మిక వాసనలంటే ఇష్టం. నమ్మకం కూడా. ప్రత్యేక తెలంగాణ యాగా లతోనే సాధ్యపడిందని ఆయన నమ్మకం. ఈ మహా క్రతువుని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిష్టాత్మకంగా చేయ సంకల్పించారు. దేశంలో ప్రముఖులను ఆహ్వా నించడమే ఒక యజ్ఞంలా సాగించారు. భారత రాష్ట్రపతి ఇప్పటికే పొలిమేరల్లో విడిది చేసి ఉన్నారు. ప్రధాని మోదీ ఒక ముఖ్యఘట్టానికి హాజరు కానున్నారు. దైవభక్తి, పాపభీతి మెండుగా గల రాష్ట్ర గవర్నరు అరణితో అగ్ని రగల్చడం నుంచి పూర్ణాహుతి దాకా ఉండి, మోయగలిగినంత పుణ్యాన్ని రాజ్‌భవన్‌కు మోసుకువెళితే అది వార్తకాదు. హేతువాదులు ఇలాంటి క్రతువులను గొప్పవేస్టుగా భావిస్తారు. అసలీ ఖర్చు ఏ ఖాతాలోదని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఒక మంచి పనికి, పైగా పుణ్యకార్యానికి ఆ మాత్రం ఖర్చు చేసే స్వేచ్ఛ ఒక ముఖ్యమంత్రికి లేకపోతే రాజ్యాంగాన్ని తిరగరాయాల్సిన అవసరం ఉంటుంది. అసలు పిలుపులతోనే కేసీఆర్ ఒక సుహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పారని పరిశీలకులు వాపోతున్నారు. మరీ ముఖ్యంగా కృష్ణాతీరానికి హెలికాప్టర్లో సకుటుంబంగా వెళ్లి పొరుగు రాష్ట్రాధినేతను ఆహ్వానించడం అందరినీ ఆకర్షించింది. చంద్రబాబు తన పాతమిత్రునికిచ్చిన ఎదురుకోలు కూడా ముచ్చటగా ఉంది. ఆ సందర్భంగా ఆయన ఇచ్చిన చండీమహాయజ్ఞ పిలుపు విందు కమ్మగా నోరూరించేలా ఉంది. నాటు కోడికూర, చేపల పులుసు, ఇంకా ఇతర భూచర, భేచర, జలచర వంటకాలను కొసరి కొసరి వడ్డించి కేసీఆర్‌తో తినిపించడం భలేగా ఉంది. మొత్తానికి మహాయజ్ఞం మసాలా వాసనతో ఆరంభమైనట్టుంది. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
అమరావతిలో పండగనెల పట్టారు!
అక్షర తూణీరం ప్రతి వాకిట్లోనూ ‘‘కృష్ణార్పణం’’ అంటూ, ఏదో పోతోంది జాగ్రత్త అని హెచ్చరిస్తూ సాతాని జియ్యరు సాగిపోతున్నాడు. కనికట్టు, హస్తలాఘవం విద్యలు ప్రదర్శిస్తూ, కళ్లెదురు వాటిని మాయం చేస్తూ విప్రవినోదులు తమాషాలు చేస్తున్నారు. పిల్లిమొగ్గలు వేయిస్తూ, కర్రసాము చేయిస్తూ కోతుల్ని ఆడిస్తున్నాడు. కోతి ఆటలు మనిషికెప్పుడూ ఆహ్లాదంగానే ఉంటాయి. నిన్నటిదాకా ముక్కారు పంటలు పండిన సుక్షేత్రాలు. ఇప్పుడు నవ్యాంధ్ర క్యాపిటల్ కోసం, రాబోయే ఆకాశ హార్మ్యాలను భరించడానికి విధిలేక సిద్ధపడుతున్నాయి. ఇప్పుడు అమరావతికి తొలి సారిగా పండుగ నెల ఆవరి స్తోంది. మనదంతా పూర్తి తెలుగు సంప్రదాయం. కాని అన్నీ హైటెక్ పోకడలు. అదిగో సంక్రాంతి నెలకి ఆనవాలుగా పొగమంచు వ్యాపించింది. పంట చేల మీద పరిగె పిట్టలు గుంపులు గుంపులుగా చేరి మేతలు ఏరుతున్నాయి. లేగదూడలు మంచులో చెంగనాలు వేస్తున్నాయి. మేలిరకం పగడాలు కుప్పలు పోసినట్టు మిరప్పళ్ల కళ్లాలు. ఎక్కడ చూసినా ముగ్గులు! కళాత్మకంగా, తెల్లగా మెరిసిపోతూ వీధులను అలంకరిస్తూ ముగ్గులు! వాటిలో తీరుగా గొబ్బెమ్మలు. వాటిపై గన్నేరు, గుమ్మడిపూలు. ఇక బంతిపూల సందడి అయితే చెప్పనలవి కాదు. అప్పుడప్పుడు కోడిపుంజుల కూతలు వినిపిస్తున్నాయి. కనులకు, చెవులకు, మనసుకు హాయిగా తోచింది. ఒక పెద్ద ముగ్గులో గంగిరెద్దుల ఆటకు తెరలేచింది. రంగురంగుల బొంతలతో, మూపురాలకు, కొమ్ములకు నగలతో గంగిరెద్దులు కైలాసం నుంచి దిగి వచ్చినట్లున్నాయి. డూడూ బసవన్నా అంటే సవినయంగా తలలూపుతూ గంగిరెద్దు నైజాన్ని ప్రదర్శిస్తున్నాయి. ‘‘అయ్యగారు దేశాన్ని ఏలాల, చినబాబు రాష్ట్రాన్ని ఏలాల’’ అంటే, ఔనౌనంటూ తలలూపి దీవిస్తున్నాయి. తెలుగు నేలకు పూర్వ వైభవం వచ్చిందనిపించింది. అలాంటి కండ పుష్టిగల గంగిరెద్దుల్ని ఈ మధ్య కాలంలో చూడలేదు. చక్కగా చిరుగంటలు, సన్నాయితో, మంచి పాగా, కోటుతో ఠీవిగా వాటిని ఆడించిన స్వాములు కూడా నిండుగా ఉన్నారు. ఎందుకుండరు? మొత్తం బృందమంతా మైక్రోసాఫ్ట్‌ది. ఈ ప్రదర్శనకి సంబంధించి ఎనిమిది రోబోలను వారే రూపొందించారు. తెలుగుతనంపై అభిమానం, పట్టు ఉందని సత్య నాదెళ్ల ద్వారా ఈ ఏర్పాటు చేయించారట. మొదట్లో చెప్పిన పొగమంచు, పరిగె పిట్టలు వగైరాలన్నీ జపాన్ కంపెనీ ప్రయోగాత్మకంగా చేసి పెట్టిందట. ప్రతి వాకిట్లోనూ ‘‘కృష్ణార్పణం’’ అంటూ, ఏదో పోతోంది జాగ్రత్త అని హెచ్చరిస్తూ సాతాని జియ్యరు సాగిపోతున్నాడు. కనికట్టు, హస్తలాఘవం విద్యలు ప్రదర్శిస్తూ, కళ్లెదురు వాటిని మాయం చేస్తూ విప్రవినోదులు తమాషాలు చేస్తున్నారు. పిల్లిమొగ్గలు వేయిస్తూ, కర్రసాము చేయిస్తూ కోతుల్ని ఆడిస్తున్నాడు. కోతి ఆటలు మనిషికెప్పుడూ ఆహ్లాదంగానే ఉంటాయి. తత్త్వాలు పాడుతూ బైరాగి తలకు మించిన ఊర్ధ్వపుండ్రాల భారంతో తిరుగుతున్నాడు. తత్త్వంలో సవీసారం లేదు. అరిగో పగటి భాగవతులు. శివ, విష్ణు, వినాయక, బ్రహ్మ వేషాలతో బిచ్చమెత్తుతూ కనిపిస్తున్నారు. మనకిదో పెద్ద దరిద్రం. మన దేవుళ్ల వేషాలు వేసుకుని మన దగ్గరకు ముష్టికి రావడం. మనం ఏ మాత్రం భయం భక్తి లేదా దయ చూపకుండా పొమ్మనడం ఒక విషాదం. మొత్తం మీద బాగా రక్తికట్టించిన కళాకారులు పిట్టల దొరలు. ఎన్ని కబుర్లు, ఎన్నెన్ని గొప్పలు, ఎన్నో కోతలు. కట్టె తుపాకీ, ఖాకీదుస్తులు ధరించి గొప్ప వినోదాన్ని అందిస్తారు పిట్టల దొరలు. నేచెప్పిన వీరంతా నిజం వాళ్లే, టెక్నాలజీ మాయలేదు. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
నాస్తికుడి మెదడులో తిరునామం తిష్టవేస్తే?!
అక్షర తూణీరం ఆనాడు గాంధీజీ మెదడులో నెహ్రూ నిలువెత్తు కాలుష్యం. పటేల్ తొలి ప్రధాని అయితే మన కథ వేరేలా ఉండేదని మేధావులు అంటూ ఉంటారు. ధృతరాష్ర్టుడికి దుర్యో ధనుడు, ద్రోణుడికి అర్జునుడు, కృష్ణుడికి శకుని అబ్సెషన్స్ అయి, అవే కాలుష్యాలై ఇతిహాసాన్ని కొత్త మలుపు తిప్పాయి. చివరగా మన రాష్ట్రపతికున్న కాంగిరేసుపై వీరాభిమానం వదిలించాల్సిన కాలుష్యం కాదా? భారత రాష్ట్రపతి, ఔను! మన రాష్ట్రపతి ఇటీవల ఒక మంచి మాట అన్నారు. స్వచ్ఛ భారత్ కార్య క్రమంలో మన చుట్టూ చేరిన చెత్తాచెదారం తోపాటు, మన మెదళ్లలో పేరుకుపోయిన మాలిన్యాలను తక్షణం తొలగించుకోవాల న్నారు. ఇది నిజంగా గొప్ప సందేశమే. బుద్ధుడికి బోధి వృక్షం నీడలో జ్ఞానోదయం కాగానే దాదాపు ఇలాంటి ప్రకటనే చేశాడు. నువ్వు నిర్మలంగా ఉంటే లోకమంతా నిర్మలంగా ఉంటుందని పాళీ భాషలో అన్నాడు. మెదడులో మట్టి చేరడం వేరు. కాలుష్యాలు చేరడం వేరు. మట్టిబుర్ర పనిచేతలో మంద కొడిగా ఉంటుంది. కాలు ష్యాలు పేరుకుపోయిన బుర్ర లోపలి రసాయనిక చర్యలను బట్టి అక్రమంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అసలు కల్తీ, కాలుష్యం, వ్యర్థం అనేవి సాపేక్షకాలు. బొగ్గు పులుసు వాయువు మనకు వ్యర్థం. చెట్లకు అదే బతుకు. ప్రధాని నరేంద్ర మోదీ మెదడులో హిందూత్వ మహాలింగం తిష్టవేయడం, మతాతీత లౌకిక రాజ్యాధినేతకది కాలుష్యమే. శివసేనరులకు, తొగాడియాలకు రుద్రాక్షలు మెదళ్లలో కొలువై ఉంటాయి. రుద్రాక్ష పవిత్రమైనదే గాని, ఇక్కడ కాలుష్యం హానికరం. బ్రెయిన్లో కూడా రెండు మూడు హానికరం. వెంకయ్య బ్రెయిన్లో కూడా రెండు మూడు చెంచాల కాలుష్యాలు లేకుండా ఉండవు. అందులో ఒక చెంచా లాల్ కృష్ణ అద్వాణీ. లోహ్ పురుష్‌గా కీర్తించి మరీ నెత్తిన పెట్టుకున్నారు వెంకయ్య. తలమీంచి తలలోకి దూరారాయన. సుష్మాస్వరాజ్ మెదడుని కూడా సంపూర్ణంగా క్షాళన చెయ్యాల్సి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. లోపల ఏమేమి పేరుకుపోయి ఉన్నాయో తెలియదు. అద్వాణీ బుర్రంతా వ్యర్థాలతో నిండిపోయి ఉందట. అయితే, ఆయన ప్రస్తుతం రాజకీయ రాజవీధిలో లేరు కాబట్టి ఏమీ పర్వాలేదం టున్నారు. కొందరి మెదళ్లలో బొగ్గునుసి చేరిపోయిం దట. మరికొందరిలో సెల్‌టవర్స్ విస్తరించే ధ్వని తరంగాల రజను చేరిందట. ఆంధ్ర పెద్దల బ్రెయిన్స్‌ని స్కాన్ చేస్తే, ఇసుక కుప్పలు తెప్పలుగా కనిపిస్తోందట. లాలూజీ తలమీదికి ‘‘గామా కిరణాలు’’ పంపితే, చిట్టు తవుడు మాత్రమే కనిపిస్తాయి. గొప్పదే అయినా తేనెలో విస్కీ కలవడం కాలుష్యమే. బియ్యంలో గోధుమలు కలిసినా, నీళ్లలో పాలు కలిసినా కాలుష్యమే. ఇదొక పెద్ద సాపేక్ష సిద్ధాంతం. అసలు ఐన్‌స్టీన్ బ్రెయిన్లో పుట్టిన థియరీ ఆఫ్ రెలిటివిటీ ఒక కాలుష్యం. అది ఏ జాతికి చెందిన కాలుష్యమో ఎవ్వరూ నిర్వచించలేకపోతున్నారు. నాస్తికుడి మెదడులో తిరునామం తిష్టవేస్తే అది కొంపలు మునిగేంత కాలుష్యం. ఆస్తికుడు హేతువాదిలా ఆలోచించడం మొదలుపెడితే ఆ బుర్రకి పుచ్చుపట్టినట్టు లెక్క. మనిషి బుర్రకి చెదపడుతుంది. పుచ్చుపడుతుంది. కొన్నిసార్లు బుర్రకి బొజ్జ వస్తుంది. అప్పుడు ఆలోచనలు మందగిస్తాయి. ఈ స్వచ్ఛ విశ్వాసానికి నాంది పలికినవాడు మహాశివుడు. హాలాహలాన్ని గొంతులో పెట్టుకున్నాడు. ఆనాడు గాంధీజీ మెదడులో నెహ్రూ నిలువెత్తు కాలుష్యం. పటేల్ తొలి ప్రధాని అయితే మన కథ వేరేలా ఉండేదని మేధావులు అంటూ ఉంటారు. ధృతరాష్ర్టుడికి దుర్యో ధనుడు, ద్రోణుడికి అర్జునుడు, కృష్ణుడికి శకుని అబ్సెషన్స్ అయి, అవే కాలుష్యాలై ఇతిహాసాన్ని కొత్త మలుపు తిప్పాయి. చివరగా మన రాష్ట్రపతికున్న కాంగిరేసుపై వీరాభిమానం వదిలించాల్సిన కాలుష్యం కాదా? - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ప్రధాని మోదీ ఉద్బోధ
అక్షర తూణీరం ప్రధాని మాటని మన్నించి అందరూ రుషుల్లా మారిపోతే ఏమవుతుంది? కనిపించినదల్లా తిని, దొరికినవన్నీ తాగి మహాకాయులుగా తయారవుతారు. అప్పుడసలు ‘‘సూపర్ స్పెషాలిటీ’’ మాటే పుట్టదు. ‘‘అవినీతికి దూరంగా ఉండండి. ఆరోగ్యాన్ని పెంచుకోండి. అహాన్ని వీడండి. సాటి వారికి సాయ పడండి’’ - యిలాంటి సందేశాన్ని అందించారు మోదీ. ‘‘నరుడు నరుడౌటె దుష్కరము సుమ్ము’’ అన్నాడు ప్రవక్త గాలిబ్. మనిషి మనిషిలా బతకడం కంటె గొప్ప మరేదీ లేదు. దీన్ని విజయవంతంగా సాధించడానికి జీవిత కాలం సరిపోదని పెద్దలంటారు. ఒక వేళ నిజంగానే ప్రధాని మాటని మన్నించి అందరూ రుషుల్లా మారిపోతే?! భూమి తలకిందులైపోతుంది. సమతుల్యం సర్వనాశనం అయిపోతుంది. ఎక్కడ చూసినా ఉత్తములే. అంతటా ఆరోగ్యవంతులే. దీనివల్ల వచ్చే పరిణామాలను ఒక్కసారి పరిశీలిద్దాం. నూట ఇరవై కోట్ల ఉత్తములు సంచరించే యీనేలని ఒక్కసారి ఊహించండి. రామాయణ కాలంలో మాట వాల్మీకి రాశాడు. భరద్వాజ మహర్షి నదీ స్నానానికి వెళుతుంటే, కూడా అడవి మృగాలు అనుసరించేవట. అది కూడా, ‘‘దాత వెంట యాచకుల వలె’’ అని వుపమానం వాడాడు. ఇక యిలాంటి దృశ్యాలు సర్వసామాన్యమైపోతాయి. ఛాపమానమగు కేసరి కూడా జీర్ణతృణం తినడానికి అలవాటు పడిపోతుంది. పులులు పంజాలు విసరడం మర్చిపోతాయి. రోజూ జంతువులు ఇళ్ల ముందుకు వచ్చి పనిపాటల్లో సాయపడుతూ వుంటాయి. సింహాలు, కుందేళ్లు ఏరా అంటే ఏరా అని పిలుచుకుంటూ కనిపించి వీనుల విందు చేస్తాయి. గాడిద, గుర్రం తారతమ్యాలు లేక భుజం భుజం రాసుకుంటూ కనిపిస్తాయి. పిల్లులు.. గద్దలు, ఎలుకలకు కాపలా కాస్తుంటాయి. ఈ విధంగా మంచితనం అనేది భరించలేనంత దుర్భరంగా మారిపోతుంది. ఇక అందరూ ఆరోగ్యవంతులే. వజ్రకాయులే. వైద్యులు గోళ్లు గిల్లుకుంటూ, అది తప్పని గుర్తొచ్చి నాలిక కరుచుకుంటూ కాలక్షేపం చేస్తూ వుంటారు. మనుషులు పరిపూర్ణ ఆరోగ్యవంతులు కనుక కనిపించినదల్లా తిని, దొరికినవన్నీ తాగి మహాకాయులుగా తయారవుతారు. అప్పుడసలు ‘‘సూపర్ స్పెషాలిటీ’’ మాటే పుట్టదు. ఆఖరికి డెంటిస్ట్లకి కూడా పని వుండదు. దానివల్ల మెడికల్ కాలేజీలుండవు. డొనేషన్లు, స్టెతస్కోపులు కనుమరుగవుతాయి. నర్సులుండరు. యాంటీ బయాటిక్స్, ఇన్సులిన్‌లతో పన్లేదు. దేహానికి వ్యాధి సంక్రమించదు కాబట్టి మరణం సంభవించే అవకాశం వుండదు. వందల సంవత్సరాలు అవలీలగా మనుషులు బతికేస్తూ వుంటారు. నాలుగైదు తరాల వారు కలసి బతుకుతూ వుంటారు. జీవితం బుడగ కాదు బండరాయి అనే సిద్ధాంతం వస్తుంది. శంకరుని మాయావాదం పని చెయ్యదు. మిగిలిన అంశాలను మీ వూహకే వదిలేస్తున్నా. సాటివారికి సాయపడే పనిలో అందరూ బిజీ బిజీ అయిపోతారు. ఎవరి పనులు వారు చేసుకోవడం మానేసి, పక్క అపార్ట్మెంట్ వారికి స్నానాలు చేయించడం, వస్త్రాలు వాష్ చేయడం, వారి కుక్కల్ని షికారు తీసికెళ్లడంలో నిమగ్నమైపోతారు. ఇరుగు పొరుగుల సాయం భరించలేక కొందరు ఆత్మహత్యలకు పాల్పడతారు. ఇక చివరగా అహాన్ని వీడడం - అందరి సూచనలు విని చక్కగా పాటించడం, అందరూ అహాన్ని కాశీలో వదిలి పెడితే -? ఇక మనకు మోదీలు దొరకరు. దేశాన్ని పాలించే నేత కరువైపోతాడు. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
జ్వరం తగిలిన పులి
అక్షర తూణీరం బిహార్ ఫలితాల తర్వాత చంద్రబాబు మొహం కొంచెం తేటగా కనిపిస్తోందని ఒక పెద్దమనిషి అంటే ఆశ్చర్య పోయాను. ‘ఆయన’ మరీ బలం పుంజుకుంటే కష్టం కదండీ. అంతరం పెరిగిపోదూ! ఇప్పటికే ఇంటర్వ్యూలు దొరకడం లేదు. బిహార్ దెబ్బతో పెద్దాయన జ్వరం తగిలిన పులిలా ఉన్నాడు. కాస్త దగ్గరకి వెళ్లొచ్చు. ఒక్కోసారి అపజయం కూడా అవసరం అనిపి స్తుంది. జీవితంలో, సిని మాల్లో, క్రికెట్లో, రాజ కీయాల్లో మధ్య మధ్య మొట్టి కాయలు మంచిదే నని అనుభవజ్ఞులు చెబుతూ ఉంటారు. విజ యం ఉత్సాహాన్నిచ్చి ముందుకు నడిపిస్తుంది. అతి విజయాలు అనర్థాలను కలిగిస్తాయి. సినిమా రంగంలో ఇది కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. ఆ రోజుల్లో చాలా సక్సెస్ఫుల్ నిర్మాత ఉండేవారు. ‘‘ఏమిటి, ఇంకా ఘంటసాల రాలేదా? ఆయన కోసం వెయిటింగా? అక్కర్లేదు. ఆ డోలక్ వాయించే చిదంబరంతో పాడించండి... నే చెబు తున్నాగా!’’ అని ఆజ్ఞాపించే స్థాయికి ఆ నిర్మాత వెళ్లారు. దాని ఫలితంగా మళ్లీ జీవితంలో విజయం రాలేదు. ‘నే చెబుతున్నాగా’ అనేది ఆయన ఊత పదం. ఆత్మవిశ్వాసం వేరు అతిశయించిన అహంకారం వేరు. మోదీని ప్రజలు గమనిస్తున్నారు. ఎన్నికల వేళ అభ్యర్థిగా మోదీ ప్రసంగాలను ఆసక్తిగా విన్నారు. కొంత మేర విశ్వసించారు. ప్రధానిగా సింహాసనం ఎక్కాక ఆయన ధోరణిని గమనిస్తున్నారు. తనని గ్లోరిఫై చేసుకోగల పలుకుబడి మోదీకి మీడియా ప్రపంచంలో ఉన్నట్టు లేదనేది నిజం. మీడియా తన శక్తియుక్తులను ఎంతగా ప్రయోగించినా, నాయకులకు గెలుపు ఓటములను ప్రసాదించలేదు. కాకపోతే ఒక సానుకూల వాతావరణాన్ని సృష్టించి పెట్టగలదు. ఈనాటి సామాన్య ప్రజ రాజకీయ నాయకులను ఎంతగా నమ్ముతున్నారో, మీడియాని కూడా అంతే నమ్ముతున్నారు. దానివల్ల వార్తలు వార్తలుగా, విశ్లేషణలు విశ్లేషణలుగా, ఊకదంపుళ్లు దంపుళ్లుగా జనం జల్లెడ పట్టుకుని ఆస్వాదిస్తున్నారు. మోదీ చెప్పిన ‘స్వచ్ఛ భారత్’ బావుందన్నారు. రేడియోల దుమ్ముదులిపిన ‘మనసులో మాట’ ఆలోచన ఫర్వాలేదన్నారు. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక ఢిల్లీ పరాజయం లెక్కకి రాలేదు గానీ, బిహార్ లెక్కకు వచ్చింది. ప్రభుత్వంపై రెఫరెండం కాకపోవచ్చుగాని, ఒక్క గట్టి మొట్టికాయగా భావించాలని అనుభవజ్ఞులు అంటున్నారు. నెగెటివ్ ఓటు కూడా మోదీకి గెలుపుని ఇవ్వలేక పోయిందంటున్నారు. ఓటరు నాడిని పట్టుకోవడం ఎంత సులభమో అంత కష్టం కూడా. మహోపన్యాసాలు ఓట్లని కురిపించవని మరోసారి రుజువైంది. బీజేపీకి కొంచెం చాలా ఓవర్కాన్ఫిడెన్స్ ఎక్కువని కొందరు అంటారు. కావచ్చు. వారంతా శ్రీరాముని అనుచరులు. రాముడిది కూడా మించిన ఆత్మ విశ్వాసం. అందుకే వనవాసంలో అంతమంది రాక్షసులతో అకారణ శత్రుత్వం పెంచుకున్నాడు. శ్రీరాముడి ఓవర్కాన్ఫిడెన్స్ లక్ష్మణుడు. దాంతోనే సీతని అడవిలో వదిలి వెళ్లాడు. బంటు అయినా హనుమంతుడి సిద్ధాంతం గొప్పది. తన శక్తి తనకు తెలియదు. అశక్తుడనని అనుకుంటూనే సర్వం సాధించాడు. మోదీ మరోసారి ఫ్రెష్ మైండ్‌తో రామాయణం చదవాలి. రాముణ్ణి పూజించండి కానీ, హనుమంతుణ్ణి అనుసరించండి. ఆత్మ విమర్శ చేసుకోండి. లోకాన్ని అర్థం చేసుకోండి. బిహార్ ఫలితాల తర్వాత చంద్రబాబు మొహం కొంచెం తేటగా కనిపిస్తోందని ఒక పెద్దమనిషి అంటే ఆశ్చర్యపోయాను. ‘ఆయన’ మరీ బలం పుంజుకుంటే కష్టం కదండీ. అంతరం పెరిగిపోదూ! ఇప్పటికే ఇంటర్వ్యూలు దొరకడం లేదు. బిహార్ దెబ్బతో పెద్దాయన జ్వరం తగిలిన పులిలా ఉన్నాడు. కాస్త దగ్గరకి వెళ్లొచ్చు. పెద్దాయన మాటలు నాకు సరిగ్గా అర్థం కాలేదు. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
అసహనం విశ్వామిత్ర సృష్టి
అక్షర తూణీరం ఉన్నట్టుండి ‘అసహనం’ తెరమీదకు వచ్చి హల్చల్ చేస్తోంది. మూలాల్లోకి వెళితే సహనం బ్రహ్మ సృష్టి, అసహనం విశ్వామిత్ర సృష్టి. అసహనం రోషానికి పమిటలాం టిది. కోపానికి అంచులాంటిది. అసలు ఎప్పుడు పుట్టిందీ సహనం? అమీబాతో పాటే పుట్టిందని ప్రాచీనులు సంస్కృత శ్లోకంలో చెప్పారు. అసహనంలోంచే కల్పాంతం సంభవిస్తుందనీ, దరిమిలా అసహనం పొటమరిస్తుందనీ గ్రీకు వేదాంతంలో చెప్పబడి ఉందని మనవాళ్లంటారు. దుర్వాసుడు మూర్తీభవించిన అసహనంగా పురాణాలకెక్కాడు. ఆయనకు పిచ్చి అసహనం. అందుకే సుదర్శన చక్రం తరిమితరిమి కొట్టి, అంబరీషో పాఖ్యానాన్ని ఆవిష్కరించింది. విశ్వామిత్రుడు అసహనం వల్లనే తపః ఫలాలను గంగపాలు చేసుకుని, పరమ కోపిష్టి సన్నాసిగా మిగిలాడు. దుర్వాసుడు ఎండిన డొక్కలతో బక్కగా ఉండేవాడు. ఆకలి వల్ల, పౌష్టి కాహార లోపం వల్ల అసహన మూర్తిగా మిగిలాడని కొందరు మేధా వుల అంచనా. ఆకలిలోంచి అసహనం, అందులోంచి విప్లవం చీల్చుకు వస్తుందని మన స్థానిక విప్లవ వాదులు అంటూ ఉంటారు. కృతయుగమంతా అసహనాలతోనే గడిచింది. త్రేతాయుగంలో అనేక సహనాలు, కొన్ని అస హనాలు కలసి, రామాయణ మనే గొప్ప ఇతిహాసాన్ని తీర్చి దిద్దాయి. కైక అసహనంతో రామకథ శ్రీకారం చుట్టుకుం ది. రాముడు చాలాసార్లు అస హనాన్ని ఆశ్రయించాడు. చెట్టు చాటు నుంచి వాలిని చంపడం అసహనం కాదా అని ప్రశ్నిస్తు న్నాను. శూర్పనఖ ముక్కు చెవులు కోయించడం మాత్రం కాదా అసహనం? చివరికి సముద్రుడి మీద కోపించి రామబాణం ఎక్కుపెట్టడం అసహనానికి పరాకాష్ట. ఏమాటకామాట చెప్పుకోవాలి. ఒక లింకు తక్కువైనా హను మంతుడికి అసహనం మీద గట్టి పట్టుంది. సముద్రం మీద గానీ, లంకలో గానీ చాలా నీట్‌గా బిహేవ్ చేశాడు. శక్తి సామర్థ్యాలున్నా గౌర వంగా బ్రహ్మాస్త్రానికి లొంగిపోయాడు. సుందరకాండలో ఆనందమే గానీ అసహనం లేదు. ఇక ద్వాపరయుగమే అసహన యుగం. కంసుడి అసహనం అంతా ఇంతా కాదు. ధృతరాష్ట్రుడికి చూపులేనందువల్ల శంకించే నైజం అలవడింది. మనక్కూడా టీవీలో బొమ్మ సరిగ్గా రాకపోయినా, ఫోన్లో సిగ్నల్ కట్ అవుతున్నా అసహనం పూనేస్తుంది. ద్రౌపదికి నిలువెల్లా అసహనమే. ‘నన్నోడి తానోడెనా, తానోడి నన్నోడెనా’ అన్న ఒకే ఒక్క ప్రశ్న భారతానికి కేంద్ర బిందువైంది. స్వర్గారోహణ పర్వం దాకా ధర్మ రాజుని ఈ ప్రశ్న తాలూకు అసహనం వెంటాడింది. కృష్ణుడంతటి పర బ్రహ్మ స్వరూపం ఎన్నోసార్లు సహనం కోల్పోయాడు. కురుక్షేత్రంలో భీష్ముడి మీదికి లంఘించబోలేదా! అక్కడ భీష్ముడు ఆనందంగా శిర సొగ్గడం ఒక గొప్ప టచ్. అదీ అసహనమే. ఎన్నాల్టికీ మరణం రాని జన్మ. పాత కట్టెతో విసిగి వేసారి పోయి ఉన్నాడు. మరణం రాకపోడం కన్నా మరణం లేదన్నారు పెద్దలు. కలియుగం అంతా సహనలోపమే. చరిత్రకెక్కిన మహాయుద్ధాలన్నీ అసహన స్పందనలే. హిరోషిమాపై ఆటంబాంబు, జలియన్ వాలాబాగ్, గాంధీ హత్య, లాహోర్ గొడవలు, చైనా దురాక్రమణ, ఎమర్జెన్సీ- ఇవన్నీ అసహనానికి సంకేతాలే. నాస్తికోద్యమం ఒక అస హన ఉద్యమం. భిన్నత్వంలో ఏకత్వమంటూ ఒక గొడుగులో ఉన్నట్టు అరవడం అసహనమే. అసహనంలోంచే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారు. తెలంగాణ ఉద్యమానికి బీజం అసహనం. ధర్మాగ్రహం లాగే కొన్ని అసహనాలు జాతికి మంచి చేస్తాయి. సహనం మన సంస్కృతి అన్నారు సర్వేపల్లి రాధాకృష్ణ. అది మాత్రం సత్యం. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
నేల మీద సాము
అక్షర తూణీరం క్యాపిటల్ నిర్మాణానికి ముఫ్పై మూడువేల ఎకరాలు ఆక్రమించాం. నిర్మాణ వ్యయం తట్టుకోడానికి రెండు జిల్లాలను అమ్మేస్తే తప్పేముంది. భార్య నగలమ్మి స్కూటర్ కొనుక్కున్న వారెందరో వున్నారు. కనుక ఏలిన వారు ఈ దిశగా ఆలోచించగలరు. మంచిదే! నేల విడిచి సాము చెయ్యకూడదంటారు. ఏడాది నుంచి రాష్ట్రంలో ‘‘నేల మీద సాము’’ జరుగుతోంది. మొత్తానికి సాము అయిపోయి స్వాధీ నానికి వచ్చింది. ఒకప్పుడు రెండే రకాల సంపదలుండేవి. భూమి, బంగారం. గోసంపద కూడా సంపదే గాని మళ్లీ అవి తిరగడానికి తినడానికి నేల కావాలి. వారి ఆవులు వారి నేలనే ఉండాలి. భూప్రపంచంలో భూమికి ఉన్న గిరాకీ దేనికీ లేదు. అలెగ్జాండర్ నించి కృష్ణరాయల దాకా భూమి కోసమే పరితపించారు. పోరాడారు. జయించారు. విస్తరించారు. తర్వాత అందరి లాగే మరణించారు. అసలు భూమి పుట్టీ పుట్టగానే నేలకున్న డిమాండ్‌ని తొలుత రాక్షసులు కనుగొన్నారు. హిరణ్యాక్షుడు భూగోళాన్ని భుజాన వేసుకువెళ్లిపోయాడు. అప్పుడు విష్ణుమూర్తుల వారు వరాహావతారుడై వెళ్లి, రాక్షసుని వధించి భూమిని ఉద్ధరించారు. అసలానాడు దేవుడు ఆ పని చెయ్యకపోతే, భూమి యింకెక్కడో రాక్షసుల అధీనంలో ఉండి ఉండేది. ‘‘ఇప్పుడు మాత్రం...’’ అన్నాడొక విచిత్రవాది నన్ను ముందుకు పోనీయకుండా. సన్మార్గులకి రాక్షసులకీ సన్నగీత మాత్రమే వ్యత్యాసం. ఎందుకంటే సన్మార్గుడు రాక్షసంగా ఉండకపోతే ఆ మార్గంలో ముందుకు పోలేడు. నా సొంత ఫిలాసఫీని పక్కన పెట్టి మళ్లీ కథలోకి వస్తే - వేంకటేశ్వరస్వామికి కలియుగంలో నేల అర్జంటుగా కావల్సివచ్చింది. ‘‘భూమి యిస్తావా’’ అని సంస్కృతంలో దిగివచ్చిన స్వామి వరాహస్వామిని అడిగాడు. ఇస్తానన్నాడాయన. ఏరియా, రేట్లు సంస్కృ తంలో మాట్లాడుకున్నారు. బేరం సెటిలై స్వామి కొండ మీద స్థిరపడ్డాడు. తొట్ట తొలి రియల్ ఎస్టేట్ వ్యాపారిగా వరాహస్వామి గణనకెక్కారు. బ్రిటిష్ టైంలో దత్తమండలాల చరిత్ర మనకు తెలుసు. అసలెందుకో ఆలోచన రాలేదు గాని సరిహద్దు జిల్లాల్ని ఎక్కువ కాకుండా ఒకదాన్నో రెంటినో బేరం పెడితే...?! ఖమ్మం జిల్లా ఆంధ్రప్రదేశ్‌కి వచ్చి ఉంటే, మంచి ధర పలికేది. ఇప్పుడైనా మించిపోయింది లేదు. పక్క రాష్ట్రాల వారిని పలకరించి చూడొచ్చు. క్యాపిటల్ నిర్మాణానికి ముప్పై మూడువేల ఎకరాలు (మనకి మొత్తం ముప్పైమూడు వేల దేవతలున్నారని ప్రతీతి. ‘‘ముప్పది మూడు వేల దేవతలెగబడ్డ దేశమున క్షుధార్తుల క్షుత్తులారునే’’ అన్నారు మహాకవి జాషువా) ఆక్రమించాం. అంటే సేకరించాం. నిర్మాణ వ్యయం తట్టుకోడానికి రెండు జిల్లాలను సరసమైన ధరకు అమ్మేస్తే తప్పేముంది. భార్య నగలమ్మి స్కూటర్ కొనుక్కున్న వారెందరో వున్నారు. కనుక ఏలిన వారు యీ దిశగా ఆలో చించగలరు. కొన్ని వేల లక్షల రకాల మట్టి వచ్చి పడుతోంది. ఈ మట్టిలో ఏ శక్తి ఉందో తెలి యదు. అవినీతి, బంధుప్రీతి, ఆశ్రీత పక్షపాతం, అసత్య సంధతలేని దివ్యమట్టి వచ్చి చేరొచ్చు. మొన్నటికి మొన్న మహా దాతలుగా అభివర్ణింపబడిన అమరావతి భేనష్ట రైతులకు సగౌరవంగా సమర్పించిన నూతన వస్త్రాలు ‘‘వార్ క్వాలిటీ’’ అని తేలిపోయింది. పాపం, అసలు వాళ్లు అడిగారా పెట్టారా. ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదొక శాంపిల్. ఒక అనుభవజ్ఞుడైన పెద్దాయన, ‘‘వద్దండీ, మహత్తులున్న మట్టి మనకి వద్దులెండి. మహా ప్రమాదం. తెల్లారి లేస్తే, అందునా క్యాపిటల్ కూడా. బోలెడు అడ్డగోలు యవ్వారా లుంటాయ్. అవన్నీ ఆగిపోతే చాలా ఇబ్బంది’’ అంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. బుద్ధిగా వింటున్న కుర్రాడు అందుకుని, ‘‘తాతా, నువ్వు కంగారు పడొద్దు. యవ్వారాలు మాట్లాడుకోడానికి యీ నేలతో ఏం పని. గవర్నమెంట్ కంట్రోల్లో పది హెలికాప్టర్లు రెడీగా వుంటాయి. పాత పద్ధతిలో బుద్ధి చెడకుండా గాలిలోనే సెటిల్ చేసుకుని, దస్కత్తులు అయ్యాకే నేలకి దిగుతాం’’ అంటూ విజయగర్వంతో ముగించాడు. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
అభయహస్తం తప్పుడు సంకేతం!
అక్షర తూణీరం ‘‘ఏ పుట్టలో ఏ పాముందో, ఏ మట్టిలో ఏ మహిమ ఉందో! అన్ని చోట్ల నించి మట్టి తేవడం మంచిదే కాని, ప్రధాని మోదీ ఇంతా చేసి ముంతెడు మట్టి తెచ్చాడంటే మాత్రం బాలేదురా’’ అన్నాడొకడు. ఒకవైపు సర్వత్రా దసరా ఉత్స వాలు, ఒక దిక్కు బ్రహ్మాండ నాయ కుని బ్రహ్మోత్స వాలు, మరోవైపు అమరావతి మహానగర శిలా న్యాస సంరంభం - ఆంధ్రప్రదేశ్ ప్రజని బూరెలగంపలో కూచో పెట్టినట్టయింది. చాలా కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశారు. అప శ్రుతులు దొర్లకుండా కార్యక్రమాన్ని జరిపిం చారు. ప్రజల్లో ఉత్సాహం నింపారు. ‘‘ప్రధానమంత్రి ఏమీ అభయహస్తం ఇవ్వ లేదే’’ అని ఒకాయన చప్పరించారు. ఎలా ఇస్తాడండీ, అభయహస్తం? అపోజిషన్ సిం బల్ కదా! అని పక్కాయన సమర్థించాడు. ఏమీ ఎరగనట్టు, ఏమీ పట్టనట్టు ఆ మహా జనం మధ్య తిరుగుతూ ఉంటే రకరకాల మాటలు, విసుర్లు, చెణుకులు, ఆశలు, నిరాశలు, నిట్టూర్పులు వినిపించాయి. ఎంతైనా కె.సి.ఆర్. రావడం వల్ల సభ నిండుగా ఉందన్నారు చాలా మంది. ‘‘అం తేగా, మనం పెళ్లి ఎంత గ్రాండ్‌గా చేసినా తోబుట్టువు రాలేదనుకో శుభకార్యం వెలా తెలా పోదూ’’ అని వత్తాసు పలికారు ఇం కొందరు. ‘‘ఈసారి ఇక్కడెందుకో అన్నగారి జోక్యం తగ్గించినట్టు కనబడుతోంది’’ అన్నా డొక రైతు. ‘‘నీది మరీ చోద్యం. ఇదేమన్నా మహానాడా... అన్నగారి బొమ్మలు పెట్టడా నికి’’ ఖండించాడు ఇంకో పెద్ద రైతు. ‘‘ఎన్నై నా చెప్పండ్రా, మన చంద్రబాబు మంచి పనివాడురా’’ అని ఒకాయన కాంప్లిమెం టు. ‘‘పనోడు కాపోతేనే అంతపని చేస్తాడం ట్రా’’ మరొకాయన రివర్స్ సప్లిమెంటు. ఏ పుట్టలో ఏ పాముందో, ఏ మట్టిలో ఏ మహిమ ఉందో! అన్ని చోట్ల నించి మట్టి తేవడం మంచిదే కాని, ప్రధాని మోదీ ఇం తా చేసి ముంతెడు మట్టి తెచ్చాడంటే మాత్రం బాలేదురా’’ అన్నాడొక వయసు మళ్లిన స్థానికుడు. ‘‘ఏంటి బాబాయ్, కొత్త పట్టుపంచెలు కట్టుకురాలేదే’’ ఒక ప్రశ్న. దాచిందిరా మీ పిన్ని. ఇప్పుడెందుకులే, గృహప్రవేశానికి కట్టుకుంటే పద్ధతిగా ఉం టుందని చెప్పింది. ‘‘ఏంటి! అమరావతి గృహప్రవేశానికా... అబ్బో అయినట్టే’’ అన్నాడో గొంతు వెటకారంగా. ‘‘నవ్విన నాపచేనే పండుద్దిరా’’ అన్నాడు తిరిగి రోషంగా. ‘‘అది సామెతలే బాబాయ్... నాపచేను పండటం చూశావా’’ అంటూ తిరగబడ్డాడు. ‘‘నాకు బాస రాదుగాని, ఆయన చెప్పిందే మన వెంకయ్య చెప్పాడా, వేరే ఏమన్నా సొంతంగా చెప్పాడా’’ అని పక్క వాడి చెవి కొరికాడొకాయన. ‘‘ఆయన మాటలే ఈయన మాటలు’’. ‘‘ఎవరే బాసలో, ఎవరేం మాట్టాడినా వెంకయ్య తన ఆలోచనలో వినిపిస్తాడని డౌటేసి అడి గాలే’’ అని వివరణ ఇచ్చాడు. ‘‘ఔను గాని ఒరే, బాలకృష్ణ స్పీచి దేనికిరా అక్కడ. బాగా కామెడీగానే ఉందనుకో...’’ అని ఒకాయన సందేహం వెలిబుచ్చాడు. ‘‘చంద్రబాబుకి బాగా వాస్తు పిచ్చంట గదరా’’ అని ఒక పెద్దాయన సందేహం వెలిబుచ్చాడు. ‘‘పిచ్చేంటి, నమ్మకం. అప్పట్లో, ఇల్లు నిన్ను దెబ్బతీస్తుంది. రెండు గుమ్మాల్ని అర్జం టుగా మార్పించమని మామగారి చెవిలో ఇల్లు కట్టుకు చెబితే ఎన్టీఆర్ పెడచెవిన పెట్టాట్ట. ఏమైంది చివరికి... అందుకే బాబుకి పిచ్చి నమ్మకం’’ అని క్లారిఫై చేశా డొక టీడీపీ కార్యకర్త. ఔన్లేరా, ఇక్కడే తెలు స్తోందిగా. కేసీఆర్‌తో భుజం మీద చేతులు వేసుకు తిరుగుతున్నాడంటే, మరి ఈ నేలపై ఏదో పవరున్నట్టేగా? ‘‘ఇవన్నీ సరేగాని, మన సీయమ్ చెబు తున్న నవ నగర నగరం వస్తుందం టావా...’’ అని ఒక పెద్దాయన నీరసంగా అడగడం వినిపించింది. అవతల భోజనాల సందడి మొదలైంది. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
అశోకుడు-షాజహాను
అక్షర తూణీరం ఇది గత పాలకుల కుట్ర. నగరం చుట్టూతా రింగ్ రోడ్డు వేశారు. మేం తరిమికొడుతుంటే, అవినీతి రింగ్ రోడ్డులో తిరిగి వస్తోందని చెబుతున్నారు. వానాకాలం సమా వేశాలన్నప్పుడల్లా నాకు వానాకాలం చదువులు గుర్తుకొ స్తాయి. ఏ మాత్రం సాగని చదువుని వా నాకాలం చదువం టారు. ఏమాత్రం సాగని సమావేశాలు కాబట్టి వానాకాలం విశేష ణం సరిపోయింది. చెట్లకింద బడులు నడిచే రోజుల్లో ఈ సామెత పుట్టింది. పొరుగూరు పోయి చదువుకోవాలి కదా! వాగులు వంకలు అడ్డం వచ్చేవి. అయ్యవారు డొంకదారిలో రాలేకపోయేవారు. ఇలాంటి అనేకానేక అడ్డం కుల వల్ల బడి నడిచేది కాదు. ఏమాత్రం చదు వు అబ్బేది కాదు. ఇప్పుడు కూడా అంతే. వానాకాలం అసెంబ్లీ సెషన్లో ఊకదంపు, చెరిగిపోసుకోవడం, మాటల కంపు తప్ప ప్రజకి ఒక్క మంచి కూడా జరగలేదు. ప్రత్యక్ష ప్రసారాలు పుణ్యమా అని వినోదాన్ని మాత్రం ఉచితంగా పంచారు. అది మాత్రం ప్రజాసేవ కాదా అంటే, సరే అంటాం. ధన్య వాదాలు. సీజన్ కదిలిపోతున్నా వానచినుకు లేదు. ఎందుకో కృత్రిమ వర్షాలకు, మబ్బు లు విత్తేందుకు ప్రయత్నం చేయడం లేదు. మామూలు గా అయితే చేస్తారు. ఈ ప్రక్రియ వల్ల వాన కురవక పోయినా, కొన్నిచోట్ల కనక వర్షం కురుస్తుందని చెప్పు కోగా విన్నాను. ‘‘చూడండి! వర్షాలు లేకపోతే ఎంత అనర్థమో...’’ అన్నా డొక పెద్ద ప్రభుత్వాధికారి. నేను అయోమ యంగా చూశా. ‘‘వానలు లేకపోబట్టి కదా, పంటపొల్లాల్లో ఉండాల్సిన ఎలుకలు ప్రభుత్వ ఆస్పత్రులకు చేరింది...’’ అంటూ నిట్టూర్చా డు. వినాయక నిమజ్జనానికి కూడా ఆంధ్రాలో నీళ్లు లేవండీ అని ఒక పెద్దాయన వాపోయా డు. ‘‘మీకేం ఫర్వాలేదు. మనకు బంగాళాఖా తం ఉంది. అవసరమైతే విగ్రహాల తరలింపు బాధ్యత మేం తీసుకుంటాం. రాష్ట్రంలోని అన్ని విగ్రహాల నిమజ్జనం అయ్యేదాకా నేను నిద్ర పోనివ్వను’’ అంటూ నాయకుడు హామీ ఇచ్చే స్తాడని శ్రోత సముదాయించాడు. ఆంధ్రా నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డ ఒక పెద్దాయన తెగ బాధపడిపోతూ బాధకు కారణాలు చెప్పాడు. ఇంతకు ముం దు రాష్ట్రంలో ఏం జరిగినా ఒక్కటిగా సంతో షించడమో బాధపడడమో చేసేవాణ్ణి. రాష్ట్రం ముక్కలైంది గాని నా బుర్ర ముక్కలు కాలేదు. ఒకరు అశోక చక్రవర్తిలా చెరువులు తవ్విం చుట, చెట్లు నాటించుట చేసేస్తున్నారు. ప్రజల శ్రేయస్సుకై చీప్‌లిక్కర్ ప్రవేశపెడతానన్నారు. ప్రజలు ససేమిరా వద్దన్నారు. సరే, మీ శ్రేయ స్సు కోసం ప్రవేశ పెట్టను గాక పెట్టనన్నారు. ‘‘అవినీతిని తరిమికొట్టాం’’ అన్నారు. మరి ఎక్కడ చూసినా అదే కనిపిస్తోందేమని ప్రశ్ని స్తే-ఇది గతపాలకుల కుట్ర. నగరం చుట్టూతా రింగ్‌రోడ్డు వేశారు. మేం తరిమికొడుతుంటే, అవినీతి రింగ్‌రోడ్డులో తిరిగి వస్తోందని చెబు తున్నారు. ఇంకొకరు షాజహాన్ చక్రవర్తి తాజ్ మహల్‌ని నిర్మించినట్టు అమరావతిని నిర్మిస్తా నని తెరపై బొమ్మలు చూపిస్తున్నారు. తాజ్మ హల్ ప్రజల కడుపులు నింపలేదు. అమరా వతి కూడా సేమ్ టు సేమ్. ఇవన్నీ తలుచు కుంటూ ఆ పెద్దాయన రెండు బరువులు మో స్తున్న ఫీలింగ్‌తో తల పగిలిపోతోందంటాడు. కావచ్చు. మద్రాసు నుంచి విడిపోయినప్పుడు ఈ గొడవలేదు. అది తమిళం, మనం తెలుగు. ఇప్పుడేమో రెండూ తెలుగు రాష్ట్రాలైనాయి. చాలామంది విజయనగర్ కాలనీలో కూచుని విజయనగరం గురించి, విజయవాడ, విశాఖ గురించి ఆలోచిస్తుంటారు. ప్రస్తుతం ఒక ప్రభుత్వానికి మూడు నాలుగు అపోజిషన్లు తగులుతున్నాయి. ఇవిగాక బీజేపీకి రాష్ట్రంలో ఎలాంటి పాత్ర పోషించాలో తెలియడం లేదు. చెప్పులోని రాయిలా, చెవిలోని జోరీగలా, ఇంటిలోని పోరులా.. కొన్నిసార్లు తయారవు తోంది. తెలుగు పెద్దాయనకు తలభారం తగ్గా లంటే అన్ని విధాల వార్తలకూ దూరంగా ఉం డడమే మందు. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
వడ్లగింజలో బియ్యపుగింజ
అక్షర తూణీరం ‘‘స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు కావ స్తోంది. అయినా మనలో దేశభక్తి మొలకెత్తలేదు. ఇది ఎప్పటికి పెరిగి పెద్దదై ఫలించేను?’’ అం టూ ఒక పెద్దాయన వాపోయాడు. ఇలాంటి నిట్టూర్పులు విన్నప్పుడు నిస్పృహ కలుగుతుం ది. జరుగుతున్న వాటిని ప్రత్యక్షంగా కంటున్నపు డూ, వింటు న్నపుడూ మరీ దిగులేస్తుంది. నిన్న మొన్న ముగిసిన పార్లమెంటు సమావేశాలు చూశాం. నిర్వహణకి నిమిషానికి పదివేలకు పైగా ఖర్చవుతుందంటారు. నిమిషం కాదు కదా, ఒక్కక్షణం కూడా సద్వినియోగం కాలే దు. భారతరత్న అబ్దుల్ కలాం మరణానికి సంతాప సూచకంగా సభ వాయిదా పడింది. ఆ ఒక్కరోజు మాత్రమే సద్వినియోగమయిం దనిపించింది. నిండు సభలో పెద్దలుగా పేరు బడ్డవారు అలా ఎందుకు అరుచుకుంటున్నా రో, కరుచుకుం టున్నారో ప్రజలకు అర్థం కాదు. చాలా రికామిగా ఉన్న సీనియర్ సిటిజ నులు పార్లమెంటు ప్రత్యక్ష ప్రసారాలు చూ స్తూ బీపీలు పెంచుకుంటున్నారు. మధ్యత రం, యువతరం ఇలాంటి ప్రసారాలు చూడడం, ఇలాంటివి చదవడం ఎన్నడో మానేశారు. ప్రశాంతంగా ఉన్నారు. ఒకప్పుడు ఎన్.టి.ఆర్. ఉన్నట్టుండి ‘కేంద్రం మిథ్య’ అని ఒక మాట లోకం మీదకు విసిరితే అందరూ కలవరపడ్డారు. అలా అనకూడదన్నారు. అపరాధమన్నారు. ఇప్పుడు సామాన్యుడికెలా అనిపిస్తోంది? అందరూ కలసి అల్లరి చేస్తున్నారు. ఆడుకుంటున్నారు. అసలు సమస్యల్ని కలసిక ట్టుగా కూడబలుక్కుని మరీ దాటవేస్తున్నారన్నది సామాన్యుడి అభిప్రా యం. ‘‘మనకి డిక్టేటరే తగు’’ అని కోట్లాది మంది తమలో తాము నిత్యం తీర్మానించుకుంటున్నారు. ఇది శుభసూచకం కాదు. సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకోవడానికి మాత్రమే పార్లమెంటు క్షేత్రంగా మిగిలింది. ప్రజాస భలు అవతరించి ఇన్నేళ్లు గడిచినా ఇప్పటి వరకూ ‘స్పీకర్’కి సరైన అధికార స్వరం రాలేదు. సందర్భం వచ్చినపుడు ఒక రోజో, పది రోజులో సభ నుం చి సస్పెండ్ చేయడం కాదు, శాశ్వతంగా సభ్యత్వాన్ని రద్దు చేయగల అధి కారం స్పీకర్‌కి ఉండాలి. సభా నిర్వహణకి సంబంధించి అనేక సవరణలు చేసుకోవాలి. అడ్డుకున్న వారిని సభలోంచి బయటకు పంపడం కాదు, వారిని సభలోనే ఉంచి వారి సీట్లల్లో సమున్నతంగా నిలబెట్టా లి. వారు దేశప్రజలకు ఎత్తుగా కనిపించాలి. సభను ఎలాంటి లావాదేవీలు జరగకుండా చేసినందుకుగాను, సభ్యులందరికీ మూడు నెలల గౌరవ వేతనాన్ని కత్తిరించి, నిర్వహణ ఖర్చుని కొంతైనా పూడ్చాలి. ఇలాంటి సంస్క రణలను చేస్తే సరే, లేదంటే మరో మంచి మా ర్గం ఉంది. అది పార్లమెంటు ప్రత్యక్ష ప్రసారా లను నిలిపివేయడం. అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. మర్నాడు కావలసినవారు చక్కని పార్లమెంటరీ భాషలో సమాచారాన్ని పత్రికల ద్వారా తెలుసుకుంటారు. ఇది ఆసేతు హిమాచలం జెండా పండుగ జరుపుకునే మహోజ్వల ఘట్టం. గౌరవ సభ్యులు దేశమాత సాక్షిగా ఒక్కక్షణం ఆలోచించండి. ఆశ తో నమ్మకంతో ఎన్నుకున్న ప్రజల కోసం ఏమి చేశాం, ఏమి సాధించాం, ఏమి శోధించామని ఒక్కసారి ప్రశ్నించుకోండి. అప్పటికీ మీకు నిద్ర, ఆకలి మామూలుగానే ఉంటే మీరు మీ ఓటర్ల రుణం తీర్చుకున్నట్టే. సమున్నతంగా ఎగిరే జెండా మన జాతి గౌరవాన్ని సదా కాపాడు గాక! దేశాభిమానాన్ని రగుల్చు గాక! భారతదేశం వర్థిల్లు గాక! జైహింద్. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
కర్పూరం పూజాద్రవ్యమే
అక్షర తూణీరం దేవుడు నిజంగానే నీరాజనాలకు ఆనందించి అనుగ్రహిస్తాడా? అదే నిజమైతే కె.సి.ఆర్ యాదాద్రి నరసింహస్వామికి ముప్పొద్దులా మూడు టన్నుల ముద్ద కర్పూరమర్పించుకోడా? చంద్రబాబు తిరప్తికి అచ్చంగా కర్పూర గూడ్స్ రైలు నడపరా? కర్పూరం మీద అయిదు శాతం ఆధార పన్ను తగి లించారు. పైగా కర్పూరం పూజా ద్రవ్యం కాదు, ఔషధ దినుసని తేల్చారు. మనసు వికలమైంది. ఈ సృష్టిలో హరించే గుణం వున్న వాటిలో పవిత్రమైనవీ, ప్రాచుర్యం గలవీ రెండే రెండు వున్నాయి. ఒకటి కర్పూ రం, రెండోది ప్రజాధనం. కర్పూరం గొప్ప దినుసు. పచ్చకర్పూరం మరీ విశేషమైంది. ఔషధ గుణాలుండి ‘అరుగుదల’కి సహకరి స్తుంది. అలాగని అక్రమంగానూ దారుణం గాను తిని పచ్చకర్పూరం బొక్కితే, అరగక పోగా అనర్థం జరుగుతుంది. ప్రభుత్వం బామ్‌లు, ఇన్హేలర్లు, వక్కపొడి, సుపారి, మిఠాయిల్లో వాడుతున్న కర్పూరంపై పన్ను పడాల్సిందే అంటున్నది. శ్రీవారి తిరునామం మొత్తం కర్పూరమే. లడ్డు ప్రసాదంలో చక్ర పొంగలిలో పరిమళించే దినుసు పచ్చకర్పూ రమే కదా. తిరుమల అంటే నిత్యకల్యాణం పచ్చకర్పూరం! అది సుగంధ పూజా ద్రవ్యం. అయ్యప్పస్వామి దీక్ష మొత్తం కర్పూరం మీదనే సాగుతుంది. జ్యోతి దర్శనం కూడా కర్పూర మహత్యమేనని కొన్నేళ్ల క్రితం హేత వాదులు రుజువులతో సహా వచ్చారు. అదిగో అక్కడి కొండరాయి మీద లారీడు ముద్ద కర్పూరాన్ని మకరజ్యోతికి ముహూర్తం నిర్ణ యించి, అర్చక స్వాములు వెలిగిస్తున్నారం టూ హడావుడి చేశారు. ఇవన్నీ నమ్మకానికి సంబంధించిన అంశాలుగాని హేతువులకు సంబంధించింది కాదని కొట్టిపారేశారు. రాతి లోపలికి కప్ప వెళ్లి కూచోడం మహత్తుగా నాలాంటి వారు భావిస్తారు. ‘‘అది అజ్ఞానం, మామిడి టెంకలోకి పురుగు వెళ్లి పెరగడం లేదా’’ అంటూ ఏ జనవిజ్ఞాన వేదిక వారో యీ మూఢమతి కళ్లు తెరిపించే ప్రయత్నం చేస్తారు. మా బోరులో నీళ్లొస్తే మహత్యంగా తెగకుండా కరెంటు వస్తుంటే మహత్యంగా, యింకా సర్కారు అందించే సేవలు గుమ్మం లో అందినపుడు మహత్యంగా భావించే అల్పజ్ఞుణ్ణి. అసలు మనమిప్పుడు మూలాల్లోకి వెళ్లాలి. కర్పూర హారతికి అసలు శక్తి వుందా? దేవుడు నిజంగానే నీరాజనాలకు ఆనందించి అనుగ్రహిస్తాడా? అదే నిజమైతే కె.సి.ఆర్ యాదాద్రి నరసింహస్వామికి ముప్పొద్దులా మూడు టన్నుల ముద్ద కర్పూరమర్పించు కోడా? చంద్రబాబు తిరప్తికి అచ్చంగా కర్పూర గూడ్స్ రైలు నడపరా? తమిళనా డులో ‘అమ్మ కర్పూరం’ వుచితంగానే గుమ్మా ల్లోకి రాదా? కర్పూరం మందే కాదు మాకు కూడా. భక్తినే కాదు సెంటిమెంటుని కూడా దీంట్లోంచి పిండచ్చు. కళాతపస్వి విశ్వనాథ్ సినిమాల్లో ఆడ పిల్లలు అరచేతిలో కర్పూరం వెలిగించుకుని అఘాయిత్యాలు చేస్తారు. తర్వాత అందుకు కారణమైన ఆ యొక్క తండ్రి బొబ్బలకు నవనీతం రాస్తూ, ‘దొర కునా యిటువంటి సేవ...’ అంటూ శాస్త్రీయ బాణీలో పాటొకటి అందుకుంటాడు. అప్పు డు ప్రేక్షకులు కన్నీళ్లు కురిపిస్తారు గాని అవి తెరమీద పడవు. ఆ మాటకొస్తే కొబ్బరికాయ తినే ఆహా రమా, పూజా ద్రవ్యమా అని డౌటు వచ్చింది. టెంకాయ పూజా ద్రవ్యం, కొబ్బరి కాయ తినే తిండి అని ఒక మేధావి వివరణ యిచ్చాడు. ఒక గొప్ప సుగంధ ద్రవ్యం మీద పన్నేమిటి? అష్టదిగ్గజ కవి అల్లసాని పెద్దన, రమణీ ప్రియదూతిక తెచ్చియిచ్చు కర్పూరపు విడెము కావాల న్నాడు గొప్ప అక్షరం రాయ డానికి. అందాకా దేనికి, ప్రధాని మోది ఏడాది పాలనకుగాను ఆయనకు కర్పూర నీరాజనాలు సెగ తగలకుండా యిస్తున్నాం కదా. అందుకని కర్పూరం పూజా ద్రవ్యమే. (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) శ్రీరమణ -
‘జ్యేష్టంలో భూమి పూజా? హవ్వ!'
అక్షర తూణీరం వేర్లు పడ్డాం. ఇల్లూ వాకిలీ లేదు. కుండా చట్టీ లేదు. చేట జల్లెడ, మంచం కుంచం లేవు. పాడీ పశువూ లేదు. ఆఖరికి చెట్టూ చేమా కూడా ఆ వాటా లోకే వెళ్లాయి. విడిపోయినా పదేళ్లపాటు సాధన సంపత్తిని ఉమ్మడిగా వాడుకోండని విడ గొట్టిన పెద్దలు చెప్పారు. ఏడాది తిరక్కుండా రాజకీయాలు మొదలైనాయి. ఆ గోడ మీది బల్లి ఈ గోడ మీద పాకకూడదన్నారు. అసలే రోష స్వభావి. దానికి తోడు దాయాది పోటీ. చంద్ర బాబు అర్జంటుగా కృష్ణాతీరానికి స్పాట్ పెట్టి, పాతికవేల ఎకరాలు పట్టేశారు. అలనాటి అమరావతికి గొప్ప వైభవం ఉంది. ఘన చరిత్ర ఉంది. వాస్తుబ్రహ్మలు అక్కడ ప్రతి అంగుళాన్ని తడిమి చూసి, బాగు బాగు అన్నారు. ఇప్పుడక్కడ ఒక మహాద్భుత మహానగరం రాబోతోంది. ఇహ అన్ని హంగులూ ఉన్న తెలంగాణలో కూడా నిర్మాణాత్మక మాటలు, అంటే కాంక్రీట్ కబుర్లు విరివిగా వినిపిస్తున్నాయి. ఎక్కడ ఖాళీ జాగా ఉంటే అక్కడ భవనాలు నిర్మిస్తామంటున్నారు. ఒకవైపు మిషన్ కాక తీయ కింద మట్టిపనులు, మరోపక్క స్వచ్ఛభారత్ కింద చెత్తపనులు జోరుగా సాగుతున్నాయి. నేల దొరికితే తాపీపనులు మొదలవుతాయి. అసలు సగం ఆఫీసులు, సగం ఉద్యోగులు, సగం కాపురాలు వెళ్లిపోయాయి కదా, ఇప్పుడీ కరువులో కొత్త నిర్మాణాలు అవసరమా అన్నాడు మా రామలింగేశ్వర్రావ్. దేవాలయాలకీ, విద్యా లయాలకీ, వైద్యాలయాలకీ సువిశాల ప్రాంగణాలు ఉండాలన్నాడు. ఐఐటీలన్నీ వేల ఎకరాల్లో ఎందుకుం టాయో తెలుసుకోవాలన్నాడు. ఇంతకీ ఎవడా రామలిం గేశ్వర్రావ్ అన్నాను. వాడొక ఓటరు. అయితేనేం, వాడు సలహా ఇవ్వకూడదా? ఇవ్వచ్చు. ‘పొయ్యి మీదకూ పొయ్యి కిందకూ ఉంటే; చెట్టు కిందైనా వండుకు తినొచ్చు’ అనేది మా అవ్వ. ఇప్పుడు ప్రపంచ స్థాయి కలల రాజధాని మనకి అవసరమా? ‘మన బతుక్కి మీసాలే దండగ, దానికి తోడు సంపెంగ నూనె కూడానా!’ అంటోంది మా అవ్వ. చంద్రబాబు వేదాంతాన్ని, ఇలాంటి నిర్వేదాంతాన్ని భరించడు. అసలు సహించడు. పైగా దైవజ్ఞులు నిర్ణయించిన శంకు స్థాపన ముహూర్తం మీద దుమారం రేగి, చెలరేగి సాగు తోంది. ‘జ్యేష్టంలో భూమి పూజా? హవ్వ!’ అంటూ అపోజిషన్ జ్యోతిష్కులు బుగ్గలు నొక్కుకుంటున్నారు. మోదీ రాయి వెయ్యడానికి స్వయంగా వస్తున్నారు కాబట్టి, హస్తినలో ఉన్న కేంద్ర పంచాంగ వేత్తలు కూడా ముహూర్తంపై దృష్టి సారిస్తారు. భూమి పూజకు జ్యేష్ట మాసం ప్రశస్తం. ఏరువాక వచ్చేదీ, భూమి దున్నడం ఆరంభించేదీ జ్యేష్టమాసంలోనే. కనుక ఆక్షేపణ లేదని కొందరి వాదన. జనన మరణాలకు, మంచి పనులు ఆరంభించడానికి ముహూర్తాలుండవని మరో వాదన. చంద్రబాబు గతంలో ఎన్నో ఘనకార్యాలు చేశారు. వాటికి ముహూర్తాలు ఎవరైనా పెట్టారా? కార్యసాధ కులు పరిస్థితులు డిమాండ్ చేసినపుడు దిగిపోతారంతే. ఆమాటకొస్తే అంతా ఘటన. ఏదీ మన చేతుల్లో లేదు. విజయనగర సామ్రాజ్యానికి పునాది వేస్తూ, విద్యారణ్యస్వామి ముహూర్తం నిర్ణయించారు. నక్షత్ర కదలికలను బట్టి నేను శంఖం పూరిస్తా, అప్పుడు శంకు స్థాపన జరగాలని ఆదేశించి ఆయన కొండెక్కి కూర్చు న్నారు. కాసేపటికి శంఖనాదం వినిపించింది. స్థాపన జరిగింది. అసలు ముహూర్తానికి స్వామి శంఖం విని పించింది. ముందు వినిపించింది ఓ జంగందేవర భిక్షా టనలో ఊదిందట. అందువల్ల కలకాలం ఉండాల్సిన విజయనగర సామ్రాజ్యం ఉండలేదని చెబుతారు. ముహూర్తబలం ఉంటుంది. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
శ్రీకారాలు - శ్రీమిరియాలు
సుభాషితం పండితరాయలు మన ముంగండ అగ్రహారీకుడు. దిల్లీలో కొలువుదీరి ఆసేతు హిమాచలం తన పలుకు వెదజల్లినవాడు. సందర్భానికి తగిన సామ్యం చెప్పి, ఊరడించడం ఆయనకి రివాజు. ఒకానొక సందర్భంలో - ‘‘ఆఘ్రాతం పరివీఢముగ్ర నఖరైః క్షుణ్ణంచ యచ్చర్వితం ......’’ ఇలా సాగే శ్లోకానికి అర్థం ఇది. ఒక కోతికి జాతిరత్నమొకటి దొరికింది. అది కాయో పండో తినడానికి అనువో కాదోనని మొదట వాసన చూసింది. ఏమీ అంతుపట్టలేదు. తరువాత రుచికోసం నాలుకతో నాకింది. రుచీ పచీ తగల్లేదు. తన వాడిగోళ్లతో రక్కింది. కనీసం రక్తం కూడా రాలేదు. ఆశ నిరాశ కాగా చివరికి కోపం వచ్చి రత్నాన్ని విసిరిపారేసింది. అలాంటి రత్నాన్ని సంబోధించి పండితరాజు ఇలా ఊరడిస్తున్నాడు. కోతి చేత అవమానం పొందానని బాధపడకు. దానివల్ల నీకు కొంత మేలే జరిగింది. అసలే కోతి గదా. అన్ని పరీక్షలు అయినాక పగలగొట్టే ప్రయత్నం చేసివుంటే ఏమయ్యేది? అందుకు సంతోషించు. అన్ని అర్హతలూ గల ఒక విద్వాంసుణ్ని కమిటీ సభ్యునిగా అక్కడొకరు తిరస్కరించారు. ఆ సందర్భంగా కవిసామ్రాట్ విశ్వనాథ ఈ సుభాషితంతో మంచి గంధం రాశారు. బ్రెయిన్ ఈటర్ మనం తరచూ వింటూ ఉంటాం -మేధోమథనం అని. అన్ని పార్టీలవారు గుమిగూడి చిలుకుతూ ఉంటారు. అందులోంచి ఏమేమి వచ్చాయో బయటకు తెలియదు. వచ్చినవి ఎవరెవరికిచ్చారో, హాలాహలమెవరు మింగారో ఎవరికీ చెప్పరు. కొన్నిసార్లు నేత తనవారిని మానసికంగా హింసిస్తూ ఉంటాడు. దాన్ని ‘మేధోహననం’ అంటారు. తెలుగులో బుర్ర తినడం. బాబా స్పేస్ ఇవ్వాళ ‘సైబర్ స్పేస్’ అనేది అమేయం అనంతం అసాధ్యమైపోయింది. దీనికి మూలం ‘సాయిబాబా స్పేస్’. ఫ్రెంచ్ జర్మన్ భాషల్లో నోరు తిరగక సాయిబా, సైబర్గా మారి స్థిరపడింది. సాయి లాగానే ఇది కూడా సర్వాంతర్యామి. నమ్మడం, నమ్మకపోవడం మీ ఇష్టం. నేడు వైద్యం చేస్తున్నవారిలో ఎక్కువమంది ధనవంతుర్లే గాని ధన్వంతర్లు కారు. రాజకీయంలో ఏమాత్రం కొత్తదనం లేదు. వాగ్బాణాలతో ప్రజల్ని నమ్మించే ప్రయత్నమే తరతరాలుగా సాగుతోంది. సంగీతం అర్థం కానక్కర్లేదు, వినసొంపుగా ఉంటే చాలు. అలా లేనప్పుడు కనీసం అర్థం కావాలి. ఇప్పుడే అందిన ఎస్.ఎం.ఎస్. మేము పవర్లోకి వచ్చినట్టే పన్నెండేళ్లకి మళ్లీ గోదావరి పుష్కరాలొస్తున్నాయ్. - తె.దే.పా. శ్రీరమణ