కాలుష్య భారతం | Sriramana satirical writing on Pollution | Sakshi
Sakshi News home page

కాలుష్య భారతం

Published Sat, Nov 11 2017 1:42 AM | Last Updated on Sat, Nov 11 2017 1:42 AM

Sriramana satirical writing on Pollution - Sakshi

దేశం ఆనందించింది దేనికంటే– మన్మోహన్‌ సింగ్‌ పదేళ్లు ప్రధానమంత్రిగా ఉన్నా పెదవి విప్పి మాట్లాడలేదు. మొన్న మాత్రం విజృంభించారు.

కాలుష్యం... కాలుష్యం... ఎక్కడవిన్నా ఇదే మాట. ఢిల్లీలో కేజ్రీవాల్‌కి అత్యధికంగా 500కి 480 మార్కులొచ్చాయ్‌. అక్కడ స్కూల్స్‌కి సెలవులిచ్చారు. ఆ గాలి మానవమాత్రులు పీల్చలేరు. అందునా దేశ రాజధాని పరిస్థితి ఇంత అధ్వాన్నంగా ఉండడంతో దేశమంతా భయపడుతోంది. దీనికి బాధ్యత ఎవరు వహించాలి? కేజ్రీయా, మోదీనా? కర్మాగారాల పొగ, వ్యర్థాలు తగలపెట్టగా వచ్చిన పొగ, వాహనాలు వదిలే పొగ వీటికి తోడు మంచు పొగ మమేకమై కాలుష్య ఎమర్జెన్సీ విధించే పరిస్థితి ఏర్పడింది. ఎమర్జెన్సీ పదం పదే పదే వినిపిస్తుంటే, కాంగ్రెస్‌ గుండెల్లో బుల్‌డోజర్లు తిరుగుతున్నాయ్‌. అసలామాటని నిఘంటువుల్లోంచి చెరిపెయ్యాలని కాంగ్రెస్‌ వాళ్లకి ఉంటుంది.

కాలుష్యాలు పలు విధాలు. దృశ్య, శబ్ద కాలుష్యాలున్నాయి. ఇవి ఏకకాలంలో టీవీ చానల్స్‌లోంచి నిరంతరం విడుదలవుతూ ఉంటాయ్‌. సెల్‌ఫోన్ల కాలుష్యం కూడా గణనీయమైంది. దాన్లోంచి వాట్సప్, యాప్, చాట్, సెల్ఫీ లాంటి శాఖలు, ఉప శాఖలు యథాశక్తి వాతావరణాన్ని కలుషితం చేస్తుంటాయ్‌. ఇవిగాక ట్విట్టర్‌లు, ఫేస్‌బుక్కులు అదనం. వాక్కాలుష్యం తక్కువ మోతాదులో ఆవరించడం లేదు. రాజకీయరంగంలో వృత్తి కళాకారులుగా రాణిస్తున్నవారు నిత్యం రెండు మూడు ధాటి ప్రసంగాలు, నాలుగైదు సాధారణాలు చేయకపోతే కంటికి నిదుర రాదు. వీరుగాక సేవా దురంధరులు, సాంఘిక నైతిక ధర్మాచారులు, ప్రవక్తలు, ప్రవచనకారులు హితబోధ చేస్తుంటారు. అది అడవికాచిన వెన్నెలని తెలిసినా వారు ఉపేక్షించరు. ఈ వృథా ప్రయాసలోంచి రవ్వంత కాలుష్యం పుడుతుంది. కార్ల నుంచి పుకార్ల నుంచి పుట్టే కాలుష్యం అధికం. నిత్యకృత్యంలో అవినీతి కాలుష్యం, అధర్మ కాలుష్యం, కల్తీల కాలుష్యం టన్నులకొద్దీ ఉత్పత్తి అవుతూనే ఉంది. లేనిపోని అతిశయోక్తులతో కనిపించి వినిపించే వ్యాపార ప్రకటనల్లో కాలుష్య సాంద్రత ఎక్కువ. మందంగా ఉంటుంది. ఫోర్త్‌ ఎస్టేట్‌ నుంచి కూడా కాలుష్యాలు రిలీజ్‌ అవుతూనే ఉంటాయ్‌. ప్రధాని మోదీ చెన్నైలో కరుణానిధిని పరామర్శించటం కొంచెం ఎక్స్‌ట్రా అని పించింది. అయినా భరించాం. ఆయనని విశ్రాంతి కోసం ఢిల్లీ ఆహ్వానించటం మాత్రం ఈ నేపథ్యంలో కుట్ర అనిపించింది. స్వచ్ఛ భారత్‌లో గాంధీగారి కళ్లద్దాలు ఈ కాలుష్యానికి చిలుం పట్టాయని ఓ విద్యార్థి చమత్కరించాడు.

మొన్నటికి మొన్న పెద్దనోట్ల రద్దుకి తొలి వార్షికోత్సవం జరిపారు. రద్దయి ఏడాది గడచినా దానివల్ల ఒనగూడిన ఫాయిదా ఏమిటో ఏలినవారూ విడమర్చి చెప్పలేకపోయారు. ఏలుబడిలో ఉన్నవారికీ తెలియలేదు. అపోజిషన్‌ వారు బ్లాక్‌ డే పాటించారు. దేశం ఆనందించింది దేనికంటే– మన్మోహన్‌ సింగ్‌ పదేళ్లు ప్రధానిగా ఉన్నా పెదవి విప్పి మాట్లాడలేదు. మొన్న మాత్రం విజృంభించారు. ఇవే చిన్న చిన్న గుళికలై, ఆవిరి బుడగలై తేలికపడి పై పొరలోకెళ్లి దట్టమైన మంచుపొగతో మిళితమై వాతావరణాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయ్‌. స్కూల్స్‌కి సెలవులిచ్చారంటే, పర్యాటకులేం వస్తారు. ఇతర దేశాధినేతలు ఫోన్‌లో మాట్లాడటానికి కూడా భయపడతారు. కరెంటు, నీళ్లు, మురుగు, గ్యాస్‌ లైన్లతోపాటు ఇంటింటికీ ఆక్సిజన్‌ లైను వేయించండి. బహుశా కొత్త క్యాపిటల్‌లో ఆక్సిజన్‌ లైన్‌ ఉండొచ్చు.


- శ్రీరమణ

(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement