
సుప్రీంకోర్టు జడ్జి విక్రమ్‌నాథ్ ఆవేదన
న్యూఢిల్లీ: బహిరంగ ప్రదేశాల్లో చిన్నారులు ఆడుకోవాలంటే మాస్క్ ధరించాల్సిన దుస్థితి దాపురించొద్దని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్‌నాథ్ ఆవేదన వ్యక్తంచేశారు. కాలుష్య ఉద్గారాల ఉధృతికి అడ్డుకట్టవేయాలని, కాలుష్యం కట్టడి కోసం తగు ‘స్వచ్ఛ’సాంకేతికతలపై పెట్టుబడులు పెరగాలని ఆయన అభిలíÙంచారు. శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మొదలైన వాతావరణ జాతీయ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు.
‘‘దేశ రాజధాని గత కొంతకాలంగా కాలుష్య రాజధానిలా తయారైంది. కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. పిల్లలు ఆరుబయట ఆడుకోవాలంటే మాస్క్ ధరించాల్సిన దారుణ పరిస్థితులు రావడం శోచనీయం. ఇంత తక్కువ వయసులో కాలుష్యమయ గాలి పీల్చడం వల్ల ఎన్నో శ్వాససంబంధ వ్యాధులు చుట్టుముడతాయి. కాలుష్య ఉద్గారాల వెల్లువకు అడ్డుకట్టపడాల్సిందే. ఇందుకోసం మనందరం సమైక్యంగా నిలబడి తక్షణ కార్యాచరణతో రంగంలోకి దిగాలి.
ఆర్థికాభివృద్ధికి, పర్యావరణహిత విధానానికి సమతూకం సాధించాలి. శుద్ధ సాంకేతికతల అభివృద్ధిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు విధాన నిర్ణయాలు తీసుకోవాలి. పర్యావరణానికి హాని కల్గించని టెక్నాలజీలపై దృష్టిసారించాలి. తక్కువ ఉద్గారాలను వెదజల్లే రవాణా విధానాలను అవలంభించాలి. అలాంటప్పుడు మనం పీల్చే గాలి గరళంగా మారకుండా ఉంటుంది. నీటి కాలుష్యం సైతం మరో తీవ్ర సమస్యగా తయారైంది. శుద్ధికి నోచుకోని వ్యర్థాలు నేరుగా నదీజలాల్లో కలిసిపోతున్నాయి.
పారిశ్రామిక వ్యర్థాలు నదీజలాల్లో కలవకుండా అడ్డుకోవాలి. మురుగునీటిని శుద్ధిచేశాకే నదీజలాల్లోకి వదలాలి. నదీతీరాల్లోని స్థానిక ప్రజానీకం సైతం వ్యర్థాలను నేరుగా నదుల్లో పడేయకుండా తమ వంతు బాధ్యతగా మెలగాలి’’అని జడ్జి అన్నారు. కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఛైర్‌పర్సన్, అటార్నీ జనరల్, తదితరులు ఈ సదస్సుకు హాజరయ్యారు.