Climate summit
-
సంపన్న రాజ్యాల కపటత్వం
‘పర్యావరణ పరిరక్షణ విషయంలో నిర్లిప్తంగా ఉండటం ద్వారా మానవాళి నరకానికి ద్వారాలు తెరుస్తోంది సుమా...’ అని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ హెచ్చరించిన మర్నాడే 2015 ప్యారిస్ వాతావరణ శిఖరాగ్ర సదస్సుకు పూచీపడిన లక్ష్యాలను నీరుగారుస్తూ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ నిర్ణయాలు తీసుకున్నారు. సహజంగానే పర్యావరణ ఉద్యమకారులను ఈ ప్రకటన దిగ్భ్రాంతిపరిచింది. గతంలో డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక గత ప్రభుత్వ నిర్ణయాలను తాము ఆమోదించబోమని ప్యారిస్ ఒడంబడిక నుంచి వైదొలగారు. తిరిగి జో బైడెన్ వచ్చాకే అమెరికా పాత విధానానికి మళ్లింది. సునాక్ అంత మాట అనకపోయినా ఆయన తాజా చర్యలు మాత్రం అలానే ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ కార్ల విక్రయాన్ని 2030 నుంచి నిలిపేస్తామని ప్యారిస్ శిఖరాగ్ర సదస్సులో బ్రిటన్ వాగ్దానం చేయగా, దీన్ని ఆయన మరో అయిదేళ్లు పొడిగించారు. అలాగే 2035 నాటికి కొత్త గ్యాస్ బాయిలర్ల ఏర్పాటును ఆపేస్తామన్న వాగ్దానాన్ని కూడా పక్కన బెట్టారు. 2050 నాటికల్లా కర్బన ఉద్గారాలను సంపూర్ణంగా తొలగించటమే లక్ష్యమని చెబుతూనే ఆ దిశగా తీసుకోవాల్సిన చర్యలను వాయిదా వేయటం సంపన్న రాజ్యాల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. హరిత లక్ష్యాల సాధనకు చర్యలు తీసుకుంటే ఉపాధి దెబ్బతింటుందని, జనాగ్రహం వెల్లువెత్తుతుందని ఆయన చెబుతున్న మాటలు కేవలం సాకు మాత్రమే. కర్బన ఉద్గారాలకు కారణమయ్యే పరిశ్రమలు మూతబడినా, హరిత ఇంధనంతో పనిచేసే పరిశ్రమల్లో ఉపాధి లభిస్తుంది. భిన్నరూపాల్లో సబ్సిడీలు, ఆర్థిక సాయం అందిస్తే ప్రజలకు అంత కష్టం అనిపించదు. అందుకు భిన్నంగా ఆ లక్ష్యాల నుంచే తప్పుకోవటం అన్యాయం. వచ్చే ఎన్నికల్లో మధ్యతరగతి మద్దతు కోసం వారికి నొప్పి కలిగించే నిర్ణయాలు తీసుకోరాదని సునాక్ భావిస్తున్నారు. ఇందుకు పర్యావరణం బలయ్యే ప్రమాదం ఉన్నా ఆయనకు పట్టడం లేదు. అసలు సంపన్న రాజ్యాల తీరుతెన్నులను ఐక్యరాజ్యసమితి సదస్సే పట్టిచూపింది. ఆ సదస్సుకు 34 దేశాల ప్రతినిధులు హాజరుకావాల్సివుండగా ప్రధాన కాలుష్యకారక దేశాలైన అమెరికా, చైనా లతో సహా ఎవరూ రాలేదు. నిజానికి బ్రిటన్ ప్రధాని హోదాలో పాల్గొనే అవకాశం తొలిసారి వచ్చినందున రిషి సునాక్ తప్పక హాజరవుతారని అందరూ అనుకున్నారు. కానీ ఆయన గైర్హాజరు కావటమే కాదు... పర్యావరణానికి ముప్పు తెచ్చే నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సదస్సులో పాల్గొనే ప్రతినిధులు లక్ష్యసాధన దిశగా తీసుకున్న చర్యలేమిటో, వైఫల్యాలుంటే కారణాలేమిటో చెప్పాలని సమితి అన్ని దేశాలనూ కోరింది. సరైన చర్యలు తీసుకుంటున్న దేశాలు ఇతర దేశాలకు స్ఫూర్తిదాయ కంగా నిలుస్తాయన్నది ఐక్యరాజ్యసమితి ఉద్దేశం. కానీ హోంవర్క్ చేయని పిల్లలు ఆ మర్నాడు బడి ఎగ్గొట్టినట్టు పర్యావరణ హిత నిర్ణయాల అమలులో అలసత్వం ప్రదర్శిస్తున్న దేశాలన్నీ ఈ సదస్సుకు గైర్హాజరయ్యాయి. చిత్తశుద్ధి ఉంటే స్వచ్ఛమైన గాలి, నిరపాయకరమైన ఇంధనం అందు బాటులోకి రావటం పెద్ద కష్టం కాదని...ఈ రంగాల్లో ఉపాధి కల్పన అవకాశాలు కూడా పెరుగు తాయని గుటెరస్ చెబుతున్న మాట అరణ్యరోదనే అయింది. 2030 నాటికి బొగ్గు వినియోగం నుంచి ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) దేశాలు పూర్తిగా వైదొలగితే, మరో పదేళ్లకు ఇతర దేశాలు దాన్ని సాధించగలుగుతాయని పారిస్ సదస్సు నిర్దేశించింది. కానీ సంపన్న రాజ్యాలు సభ్యులుగా ఉన్న ఓఈసీడీలో ఏ ఒక్క దేశమూ ఆ దిశగా చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. సరి గదా కెనడా, అమెరికా, బ్రిటన్ తదితర సంపన్న దేశాలు మూతబడిన పాత ఫ్యాక్టరీలను సైతం తెరుస్తూ బొగ్గు వినియోగాన్ని మరింత పెంచాయి. ఈ ఏడాది జూన్–ఆగస్టు మధ్య ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్నిచోట్లా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పారిశ్రామికీకరణకు ముందున్న వాతావరణంతో పోలిస్తే కనీసం 1.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పెరగటం ఎంతో దూరంలో లేదని పర్యావరణ శాస్త్రవేత్తలు చెప్పిన మాట అక్షరసత్యమని ఈ పరిణామం వెల్లడిస్తోంది. గుటెరస్ చేస్తున్న హెచ్చరిక మరింత గుబులు పుట్టిస్తుంది. మరో 2.8 డిగ్రీల సెల్సి యస్ ఉష్ణోగ్రత పెరిగే క్రమంలో ఉన్నామని ఆయన ప్రకటించారు. ప్యారిస్ ఒడంబడిక కుదిరిన సమ యంలో ప్రపంచ దేశాలన్నీ 2020నాటికే ఇంతకు మూడింతల క్రియాశీల కార్యాచరణకు పూనుకోవా లని సదస్సు నిర్దేశించింది. అలాగైతే తప్ప లక్ష్యసాధనను చేరుకోలేమని చెప్పింది. కానీ మరో నాలుగేళ్లకే సంపన్న రాజ్యాల నిర్వాకం బయటపడింది. 2019లో జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సులో దాదాపు 60 దేశాలు తాము పూచీపడిన లక్ష్యాలకు మించి కర్బన ఉద్గారాలను తగ్గించు కున్నామని ప్రకటించగా...అందులో అత్యధిక దేశాలు చిన్నవే, తక్కువస్థాయి కాలుష్య కారక దేశాలే. మరి సంపన్న దేశాలు ఏం చేసినట్టు? ఇచ్చిన వాగ్దానాలను గాలికొదిలేసి, పర్యావరణానికి తూట్లు పొడిచాయి. ఈ విషయంలో కాస్తయినా సిగ్గుపడటం మానేశాయి. వాతావరణ సదస్సుకు ముందురోజే జరిగిన సమితి సర్వసభ్య సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భూగోళాన్ని వడగాడ్పులు చుట్టుముట్టడం, అడవులు తగలబడటం, కరువుకాటకాలు, వరదలు వగైరాల గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. శిలాజ ఇంధనాల వాడకం ఆపకపోతే ఈ ముప్పు మరింత పెరుగుతుందని హెచ్చరించారు. కానీ గత అయిదేళ్లలో సాధించిందేమిటో చెప్పాలి గనక ఆ మర్నాడు జరిగిన సదస్సుకు మాత్రం గైర్హాజరయ్యారు. ఇలాంటి ధోరణులు సరి కాదు. ఇప్పటికైనా సంపన్న రాజ్యాల తీరు మారాలి. భూగోళం ఉనికికి ముప్పు తెచ్చే చర్యలకు స్వస్తి పలకాలి. ఇది కూడా చదవండి: నారీలోకానికి నీరాజనం! -
పీఎంగా రిషి సునాక్ బిగ్ ‘యూ-టర్న్’.. ఆ నిర్ణయంలో మార్పు
లండన్: బ్రిటన్ రాజకీయ చరిత్రను తిరగరాస్తూ భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ ప్రధాని పదవి చేపట్టిన విషయం తెలిసిందే. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు కఠిన నిర్ణయాలు తప్పవంటూ తన మార్క్‌ను చూపిస్తున్నారు. అయితే, ప్రధాని పీఠంపై కూర్చున్న మొట్టమొదటి సారి బిగ్ యూటర్న్ తీసుకుని తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. దేశీయ బాధ్యతల నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి క్లైమేట్ సమ్మిట్‌కు వెళ్లకూడదని ముందుగా నిర్ణయించుకున్న రిషి సునాక్.. తాజాగా ఆ నిర్ణయాన్ని మార్చుకుని వెళ్లాలని నిశ్చయించుకున్నారు. తాను పర్యావరణ సదస్సుకు హాజరవుతున్నట్లు ట్వీట్ చేశారు. ‘పర్యావరణ మార్పులపై చర్యలు తీసుకోకుండా బంగారు భవిష్యత్తు లేదు. పునరుత్పాదక ఇంధనాలపై పెట్టుబడులు పెట్టకుంటే విద్యుత్తు సంక్షోభం దిశగా అడుగులు వేస్తున్నట్లే. అందుకే.. వచ్చే వారం జరగనున్న కాప్27 క్లేమేట్ సదస్సుకు హాజరవబోతున్నా. సురక్షితమైన, స్థిరమైన భవిష్యత్తును నిర్మించే గ్లాస్గో వారసత్వాన్ని కొనసాగించాలనుకుంటున్నా.’ అని ట్వీట్ చేశారు రిషి సునాక్. ఈజిప్ట్‌లోని షర్మ్ ఎల్-షేక్ రెడ్ సీ రిసార్ట్‌లో జరిగే సమావేశానికి హాజరు కాకూడదని సునాక్ తీసుకున్న నిర్ణయం పర్యావరణ ప్రచారకుల ఆగ్రహానికి కారణమైంది. ఈ కారణంగానే ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. రిషి సునాక్ ట్వీట్ చేయకముందే యూ-టర్న్‌పై హింట్ ఇచ్చారు ఆయన అధికార ప్రతినిధి. నిర్ణయంపై పునఃసమీక్షిస్తున్నట్లు చెప్పారు. దానికన్నా ముందు మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ హాజరుకాబోతున్నట్లు ప్రకటించారు. గత ఏడాది కాప్ 26 సమావేశానికి ఆయన ప్రధాని హోదాలో హాజరయ్యారు. There is no long-term prosperity without action on climate change. There is no energy security without investing in renewables. That is why I will attend @COP27P next week: to deliver on Glasgow's legacy of building a secure and sustainable future. — Rishi Sunak (@RishiSunak) November 2, 2022 ఇదీ చదవండి: ఈ నిర్ణయం ఘోర తప్పిదం...రిషి సునాక్‌పై విమర్శలు! -
పడవ మునిగితే... ఎవరం మిగలం!
వచ్చే ఆదివారం నుంచి 13 రోజులపాటు జరుగనున్న ఐక్యరాజ్యసమితి 26వ వాతావరణ మార్పు సదస్సు (కాప్–26) కీలక ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంది. వాతావరణంలోకి విడుదలవుతున్న అసాధారణ కర్బన ఉద్గారాలను నియంత్రించడం ద్వారా మాత్రమే వేడిని తగ్గించగలుగుతామని శాస్త్రవేత్తలు ఎప్పట్నుంచో చెబుతున్నా రాజకీయ వ్యవస్థే కదలటంలేదు! ప్రభుత్వాలు కార్పొరేట్లకు దన్నుగా ఉండేకన్నా పర్యావరణ పరిరక్షణకే కట్టు బడాలనే ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. భూమి మునిగిపోయే పడవ అనుకుంటే, మనం ఏ మూలన కూర్చున్నా... ఆ పడవే మునిగితే... ఎవరం మిగలం! లక్ష్యం పెద్దదిగా ఉంటే... ఫలితం ఆశించిన దానికి దగ్గరగా ఉండొచ్చు. లక్ష్యమే చిన్నదైతే సాధించేదీ పరిమితమే! పెద్ద లక్ష్యం వల్ల మహా అంటే, ఎక్కువ కష్టపడాల్సి రావొచ్చేమో? కానీ, ఆశించింది సాధిస్తే అంతకన్నా మేలేముంటుంది? ఈ సూత్రం, గ్లాస్గో (స్కాట్లాండ్)లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి (యూఎన్) 26వ వాతావరణ మార్పు సదస్సు (కాప్–26)కు వర్తించదా? వర్తింపజేస్తే, అందుకు ప్రపంచ దేశాలు, అదే భాగస్వాములు (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్–కాప్) సిద్ధమేనా? నిజానికి... ఆ సదస్సు ఏమి ఆశిస్తోంది? ఏమి సాధించనుంది? వచ్చే ఆదివారం నుంచి 13 రోజులు జరుగ నున్న సదస్సు ముందర ఇలాంటి ప్రశ్నలు చాలానే తలెత్తుతున్నాయి. కాలుష్యాల వల్ల పెరుగుతున్న భూతాపోన్నతిని నియంత్రించడం, తద్వారా వాతావరణ మార్పు దుష్ప్రభావాల్ని కట్టడి చేయడం సదస్సు ముందున్న ప్రధాన లక్ష్యం! వాతావరణ మార్పు విపరిణామాలు శాస్త్రీయ నివేదికలు, పరిశోధనా పత్రాల్లో కనిపించడమే కాకుండా... ప్రతి మనిషిని తాకుతున్నాయి. కొత్త రోగాలు, అడవుల దగ్ధం, తుఫాన్లు, అకాలవర్షాలు, వరదలు–కరువులు, ధ్రువమంచు కరగటం, సముద్రమట్టాలు పెరగటం వంటివన్నీ వాతావరణ మార్పువల్లే! దాంతో, మునుపెన్నడూ లేనంతగా మానవాళి చూపు ‘కాప్’ వైపు మళ్లింది. వాతావరణంలోకి విడుదలవుతున్న అసాధారణ కర్బన ఉద్గారాల (జిహెచ్జి)ను నియంత్రించడం ద్వారా మాత్రమే వేడిని తగ్గించగలుగుతామని ధ్రువపడింది. శాస్త్రవేత్తలు ఎప్పట్నుంచో చెబు తున్నా రాజకీయ వ్యవస్థే కదలలేదు! హామీలివ్వడం, ప్రమాణాలు చేయడం కాదు, చర్యలు కావాలనే ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. శతాబ్దాం తానికి (2100) ఉష్ణోగ్రత పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్‌ను మించనీకుండా కట్టడి చేయాలని, 1.5 డిగ్రీలకన్నా తక్కువకే నిలువ రిస్తే మంచిదని ఆరేళ్ల కింద పారిస్‌లో (2015) భాగస్వామ్య దేశాలన్నీ ఒప్పందానికి వచ్చాయి. ఇది కూడా గొప్ప లక్ష్యమేం కాదని, కర్బన ఉద్గారాల తీవ్రత, భూమి వేడెక్కుతున్న వేగాన్ని బట్టి చూస్తే లక్ష్యాలే అరకొరగా ఉన్నాయి, వాటి సాధన కృషి మరింత నిస్సారమని ‘వాతావరణ మార్పుపై యూఎన్ ఏర్పరచిన అంతర్ప్రభుత్వాల బృందం’ (ఐపీసీసీ) తాజా నివేదిక చెప్పింది. దాంతో లక్ష్యాల్నే ఇంకాస్త పెద్దవిగా పెట్టుకొని, ఎక్కువ కష్టపడితే మేలనే అభిప్రాయం వ్యక్తమౌ తోంది. పారిశ్రామికీకరణ (1850–60) నాటి భూతాపం కన్నా పెరుగు దలను 2 డిగ్రీల దాకా అనుమతించే ఉదారవాదమో, 1.5 డిగ్రీలలోపే కట్టడి చేద్దామనే పరిమిత వాదమో ఎందుకు? పెరుగుదలను 1 డిగ్రీ మించనీకుండా కట్టడి చేద్దామనే కొత్త లక్ష్యాల ప్రతిపాదన వస్తోంది. ఆ మేర ఉద్గారాలను నియంత్రించాలని, సంపన్న దేశాలతో పాటు భాగ స్వాములంతా ముందుకు వచ్చి కార్యాచరణను వేగవంతం చేయాలని పౌరసమాజం కోరుతోంది. తాపోన్నతి కట్టడి సాధ్యమా? సగటు భూతాపోన్నతి ఇప్పటికే 1.12 డిగ్రీలు పెరిగింది. ఇదే పంథా సాగితే 2050 నాటికి 1.5 డిగ్రీలు దాటే ప్రమాదాన్ని శాస్త్రరంగం శంకిస్తోంది. ‘మా దేశం కట్టుబడ్డట్టు, మేమిది చేస్తాం’ (ఎన్డీసీ) అంటూ, భాగస్వాములు పారిస్‌లో పెద్ద హామీలే ఇచ్చారు. కానీ, కార్యాచరణకు మనస్ఫూర్తిగా పూనుకోలేదు. పెట్రోలియం, బొగ్గు వంటి శిలాజ ఇంధనాల వినియోగం నుంచి సౌర–పవన విద్యుత్తు వంటి పునర్వినియోగ ఇంధనాల (ఆర్ఈ) వైపు దారి మళ్లాలి. ఎలక్ట్రిక్ వాహనాలకు మారాలి. ఎక్కడా అది ఆశించిన స్థాయిలో జరగటం లేదు. 194లో 113 దేశాలు, యూఎన్‌కు ఇచ్చిన ఎన్డీసీ నివేదికల సార మేమంటే, 2010 స్థాయిపై 2030 నాటికి కర్బన ఉద్గారాలు తగ్గకపోగా 16.3 శాతం పెరిగే ఆస్కారముంది. ఐపీసీసీ నివేదిక ప్రకారం 2010 నాటి స్థాయిపైన 2030 నాటికి, ఉద్గారాలను 45 శాతం తగ్గించగలిగి తేనే... భూతాపోన్నతి పెరుగుదలను 1.5 డిగ్రీలకు నిలువరించగలం. హామీలకు–ఆచరణకు ఇంత వ్యత్యాసం ఉన్నపుడు, పెరుగుదల 2 డిగ్రీలకు కట్టడిచేస్తే చాలనే చిన్న లక్ష్యం వల్ల ప్రయోజనం లేదని, 1 డిగ్రీకి మించనీయవద్దనే పెద్ద లక్ష్యంతోనే ఎంతో కొంత సాధించగల మనేది తాజా ఒత్తిడి! ప్రపంచవ్యాప్తంగా సగటున ఏటా 3400 కోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్ (సీవో2)ను వాతావరణంలోకి వదులు తున్నాం. 2030ని మైలురాయిగా పెట్టుకొని, ఉద్గారాలను తగ్గించే చర్యలు చేపడితేనే కట్టడి సాధ్యం. గాలిలోకి వదిలే సీవో2ను, 2005 స్థాయి నుంచి 2030 నాటికి, 33–35 శాతం తగ్గిస్తామన్నది పారిస్‌లో మన హామీ! వీటిని మార్చుకొని, విడుదలను అంతకన్నా ఎక్కువ శాతాల్లోనే నియంత్రిస్తామని కొత్త లక్ష్యాలు పెట్టుకోవాలి. ఉద్గారాల ‘శూన్య స్థితి’కి సిద్ధపడని భారత్! సీవో2 వంటి వాయువుల్ని మానవ ప్రమేయం తర్వాత కూడా, వాతా వరణంలో సహజ స్థాయికి పరిమితం చేయడాన్ని ఉద్గారాల ‘శూన్య స్థితి’ అంటారు. శిలాజ ఇంధనాల నుంచి ఆర్ఈ వెపు మళ్లడం ద్వారా ఎప్పటి వరకు ఆ శూన్యస్థితిని సాధిస్తారో ఆయా దేశాలు నిర్దిష్టంగా హామీ ఇస్తున్నాయి. 2050 నాటికని అమెరికా, ఐరోపా సంఘం హామీ ఇస్తే, 2060 నాటికి అని చైనా చెప్పింది. ఆస్ట్రేలియా ఇటీవలే తన గడువు ప్రకటించడంతో ఇక భారత్‌పై ఒత్తిడి పెరుగుతోంది. ప్రపంచ సగటు (6.5 టన్నుల) కన్నా భారత్ తలసరి సీవో2 విడుదల (2.5 టన్నులు) చాలా తక్కువ! భారత్ తలసరి విడుదల కన్నా అమెరికా ఏడున్నర రెట్లు, చైనా మూడున్నర రెట్లు, ఐరోపా సంఘం మూడు రెట్లు అధిక తలసరి విడుదల నమోదు చేస్తున్నాయి. అయినా, భారత్ శూన్యస్థితికి హామీ ఇవ్వటం లేదు. ఎప్పట్నుంచో సహజ వనరుల్ని మితిమీరి వాడుకుంటూ, వాతావరణ కాలుష్యానికి కారకులైన అభి వృద్ధి చెందిన దేశాలు (కాలుష్య కారకులే!) మూల్యం చెల్లించాలని, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక సహాయం, సాంకేతిక బద లాయింపు చేయాలని కోరుతోంది. 2009 (కొపెన్ హెగెన్)లో హామీ ఇచ్చినట్టు, ఏటా పదివేల కోట్ల డాలర్ల సహాయం ద్వారా ‘వాతావరణ ఆర్థికాంశా’ నికి కట్టుబడాలని ఒత్తిడి తెస్తోంది. ఈ ‘పర్యావరణ న్యాయం’ జరిగే వరకు కర్బన ఉద్గారాల ‘శూన్యస్థితి’పై ప్రకటనకు భారత్ సిద్ధంగా లేదు. శిలాజ ఇంధనాల నుంచి ఆర్ఈ వైపు క్రమంగా మళ్లుతున్నట్టు మనమొక చిత్రం చూపిస్తున్నాం. సౌర, పవన, చిన్న పాటి జల విద్యు దుత్పత్తి ద్వారా 2030 నాటికి 450 గిగావాట్ల హరిత ఇంధనోత్పత్తి లక్ష్యమని చెబుతున్నాం. కానీ, బొగ్గు వినియోగం కథ భిన్నంగా ఉంది. మనం వాడే విద్యుత్తులో థర్మల్ వాటా కొన్ని సంవ త్సరాల కింద 75 శాతం కాగా ఇప్పుడది 67 శాతం. 2030 నాటికి 50 శాతంగా ఉండొచ్చు! కానీ, అప్పుడు వినియోగమయ్యే మొత్తం విద్యు త్తుతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ! 2030–40 మధ్య మన బొగ్గు విని యోగం ఉచ్ఛస్థితికి వస్తుందని ఒక అంచనా! సర్కార్లు–కార్పొరేట్లు మారితేనే! భూతాపోన్నతి పెరుగుదల 2 డిగ్రీలకు కట్టడి, ఉద్గారాల శూన్యస్థితి ఇప్పట్లో దుస్సాధ్యమనే వాదన తరచూ తెరపైకి వస్తోంది. దీని వెనుక బొగ్గు లాబీ, చమురులాబీ, వాహనోత్పత్తి వంటి బలమైన లాబీలే కారణమని తెలుస్తోంది. యూఎన్ నివేదికనే మార్చే ఎత్తుగడలు వేసిన కార్పొరేట్ దళారీలు ఏమైనా చేయగలరనే విమర్శ వ్యక్తమౌతోంది. ప్రభుత్వాలు కార్పొరేట్లకు దన్నుగా ఉండేకన్నా పర్యావరణ పరిరక్షణకే కట్టుబడాలనే ఒత్తిళ్లు సామాజికవేత్తలు, కార్యకర్తల నుంచి పెరుగు తున్నాయి. కార్పొరేట్లు తమ సామాజిక బాధ్యత (సీఎస్సార్) కింద స్వచ్ఛ, హరిత ఇంధనాలవైపు మొగ్గడం వారికే ఉపయోగం! యువ తరం, షేర్హోల్డర్లు కూడా కార్పొరేట్లపై ఒత్తిడి పెంచితే సానుకూల ఫలితాలుంటాయి. రేపు యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలన్నీ హరితంలోనే! ఈ పర్యావరణ సంక్షోభంలో... అందరం బాగుంటేనే, ఎవరమైనా బాగుండేది. జీవమున్న ఏకైక గ్రహం భూమి మునిగి పోయే పడవ అనుకుంటే, మనం ఏ మూలన, ఎంత పద్ధతిగా కూర్చున్నా... ఆ పడవే మునిగితే.... ఎవరం మిగలం! -దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
అది కేజ్రివాల్‌ను అవమానించడమే!
సాక్షి, న్యూఢిల్లీ : క్లైమేట్ చేంజ్‌పై ‘సీ 40’ పేరిట డెన్మార్క్‌లో జరుగుతున్న అంతర్జాతీయ మెగా నగరాల మేయర్ల సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌కి కేంద్రం అనుమతి నిరాకరించడం దారుణం. అయనకు అర్హత ఎక్కువైనందున అనుమతి నిరాకరించామని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిథి సమర్థించుకోవడం అర్థరహితం. ఏ వ్యక్తినైనా అర్హత తక్కువుందని నిరాకరించడంలో అర్థం ఉంది. అర్హత ఎక్కువుందని నిరాకరించడం అన్యాయం. అదీ ఓ మంచి కార్యక్రమం కోసం వెళ్లాలనుకున్నప్పుడు. ఢిల్లీ నగరంలో రోజు రోజుకు వాయు కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో, దాని గురించి సమగ్రంగా అంతర్జాతీయ సదస్సులో చర్చించాలని, వీలయితే సరైన పరిష్కారం కనుగొనాలని కేజ్రివాల్ భావించారు. ముఖ్యమంత్రులు, రాష్ట్రాల మంత్రులు అధికార హోదాలో విదేశాల్లో పర్యటించాలనుకున్నప్పుడు కేంద్ర విదేశాంగ శాఖ అనుమతి తప్పనిసరి. భారత విదేశాంగ విధానం అంతా ఒక్కటేనని చెప్పడానికి చట్టంలో ఈ నిబంధనను చేర్చారు. భారత్ సమాఖ్య ప్రభుత్వ స్ఫూర్తిని చాటు కోవాలంటే ఇలాంటి సంబంధాల్లో సానుకూలంగా స్పందించాల్సి ఉంటుంది. నిజంగా చెప్పాలంటే పలు అంతర్జాతీయ నగరాల మేయర్ల కన్నా కేజ్రివాల్‌కు అధికారాలు తక్కువ. ఆయన లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఆదేశాలకు లోబడి పనిచేయాల్సి వస్తోంది. ఈ దుస్థితి నుంచి తప్పుకునేందుకు ఢిల్లీకి రాష్ట్ర హోదాను కల్పించాల్సిందిగా కేజ్రివాల్ ఎన్నిసార్లు డిమాండ్ చేసినా, ఆందోళనలు చేసిన కేంద్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. కేంద్ర ప్రభుత్వ నేతలు కూడా ఢిల్లీలో ఉంటున్నందున ఆ నగర సమస్యకు ఓ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించడం పట్ల అభ్యంతరాలు ఉన్నట్లయితే ఆ విషయాన్ని ఆయనకు స్పష్టంగా వివరించాలి. తుది నిర్ణయం కేజ్రివాల్‌కే వదిలేయాలి. ఏమీ చెప్పకుండా నిర్ద్వంద్వంగా ఆయన వినతిని తిరస్కరించడమంటే ఉద్దేశ పూర్వకంగా ఆయన్నే అవమానించడమే అవుతుంది. కేజ్రివాల్ మంగళవారం మధ్యాహ్నం బయల్దేరి డెన్మార్క్ వెళ్లాల్సి ఉండింది. -
కేజ్రీవాల్ విదేశీ పర్యటనకు అనుమతి నిరాకరణ
న్యూఢిల్లీ: వాతావరణ మార్పుపై డెన్మార్క్‌లో జరుగుతున్న సీ –40 క్లైమేట్ సదస్సులో పాల్గొనాలనుకున్న ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ కేజ్రీవాల్‌కు చుక్కెదురైంది. ఆయన పర్యటనకు విదేశాంగ శాఖ రాజకీయ అనుమతి నిరాకరించిందని అధికార వర్గాలు మంగళవారం తెలిపాయి. దాంతో మంగళవారం కోపెన్‌హెగన్‌కు బయల్దేరాల్సిన ఆయన తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ట దెబ్బతింటుందని, ఆప్ అంటే కేంద్రానికి ఎందుకు అంత కోపమని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఈ విషయమై కేంద్రప్రభుత్వం స్పందించింది. క్లైమేట్ సదస్సు మేయర్ స్థాయి ప్రతినిధులు పాల్గొంటున్న కార్యక్రమం కాబట్టే అనుమతి ఇవ్వలేదని కేంద్రం వివరణ ఇచ్చింది. -
మాటల్లేవ్... చేతలే..
ఐక్యరాజ్యసమితి: వాతావరణ మార్పు ప్రతికూల ప్రభావాలను అరికట్టేందుకు ఇప్పటివరకు చాలా మాటలు చెప్పామని, ఇక మాటలు కట్టిపెట్టి, చేతలు ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైందని భారత ప్రధాని మోదీ ప్రపంచదేశాలకు పిలుపునిచ్చారు. ఐక్యరాజ్యసమితి వేదికగా సంస్థ ప్రధాన కార్యదర్శి ఆంటొనియొ గ్యుటెరస్ నేతృత్వంలో వాతావరణ మార్పుపై సోమవారం జరిగిన శిఖరాగ్ర సదస్సులో మోదీ ప్రసంగించారు. పారిస్ ఒప్పంద అమలుపై కార్యాచరణను వేగవంతం చేసే లక్ష్యంతో ఈ సదస్సును ఏర్పాటు చేశారు. వివిధ దేశాలు వాతావరణ మార్పు ప్రమాదాన్ని అరికట్టే దిశగా కృషి చేస్తున్నాయిగానీ ఇప్పుడు ఒక సమగ్ర కార్యాచరణ, అంతర్జాతీయ స్థాయి ఉద్యమం అవసరమని తన ప్రసంగంలో మోదీ పేర్కొన్నారు. ‘మనల్ని ముందుకు నడిపించాల్సింది అవసరమే కానీ అత్యాశ కాదు’ అని ప్రపంచదేశాలకు హితవు పలికారు. ఇందుకు విద్య నుంచి విలువల వరకు వ్యక్తిగత స్థాయిలో మార్పునకు అంతా శ్రీకారం చుట్టాలన్నారు. ఈ సదస్సులో భారత్ తరఫున ప్రధాని మోదీ ఒక కీలక ప్రకటన చేశారు. భారతదేశ శిలాజేతర ఇంధన ఉత్పత్తి లక్ష్యాన్ని 2022 నాటికి భారీగా 450 గిగావాట్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. నెల క్రితమే స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో పారిస్ ఒప్పందంలో భాగంగా.. ఆ లక్ష్యాన్ని 150 గిగావాట్లుగా ప్రధాని పేర్కొన్న విషయం విదితమే. ‘ప్రకృతిని గౌరవించడం, వనరులను జాగ్రత్తగా వాడుకోవడం, మన అవసరాలను కుదించుకోవడం..మొదలైన చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. ఆచరణ సాధ్యమైన ఒక ప్రణాళిక అవసరాన్ని నొక్కి చెప్పేందుకే భారత్ ఈ సదస్సులో పాల్గొంటోందని స్పష్టం చేశారు. భారత్‌లో బయో ఫ్యూయల్‌ను పెట్రోల్, డీజిల్‌లలో కలిపే కార్యక్రమం ప్రారంభించామన్నారు. నీటి సంరక్షణ, వర్షం నీటిని సంరక్షించుకోవడం లక్ష్యంగా ప్రారంభించిన ‘జల్ జీవన్ మిషన్’ పథకంపై రానున్న కొన్ని ఏళ్లలో 50 బిలియన్ డాలర్లు(రూ. 3.5 లక్షల కోట్లు) ఖర్చు పెట్టనున్నామన్నారు. నిర్ణయాత్మక సమయం: ఐరాస వాతావరణ మార్పును ప్రతికూలతపై యుద్ధం ప్రకటించేందుకు నిర్ణయాత్మక సమయం ఆసన్నమైందని ఐరాస పేర్కొంది. ఐరాస సోమవారం నిర్వహించిన ‘క్లైమేట్ ఎమర్జెన్సీ సమిట్’లో దాదాపు 60 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా గ్రీన్ హౌజ్ వాయువులు వాతావరణంలోకి విడుదల అవుతున్న నేపథ్యంలో.. బలహీనపడుతున్న పారిస్ ఒప్పంద అమలు లక్ష్యాలను పునరుజ్జీవింపజేసేందుకు ఈ సదస్సును ఏర్పాటు చేశారు. ‘వాతావరణ అత్యవసర స్థితి అనే పరుగుపందంలో మనం వెనకబడి పోతున్నాం. కానీ అది మనం గెలిచి తీరాల్సిన పరుగుపందెం’ అని ఐరాస ప్రధాన కార్యదర్శి గ్యుటెరస్ అన్నారు. ట్రంప్ కూడా వచ్చారు పారిస్ ఒప్పందం విషయంలో భారత్ అమెరికాల మధ్య విభేదా లున్నాయి. అమెరికాకు నష్టదాయకమంటూ 2017లో ఈ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగింది. మోదీ ప్రసంగిస్తున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అక్కడే ఉన్నారు. అనూహ్యంగా, ముందే చెప్పకుండా ఈ సదస్సుకు ట్రంప్ హాజరుకావడం విశేషం. మోదీ, జర్మనీ చాన్సెలర్ మెర్కెల్ ప్రసంగాల అనంతరం ఏమీ మాట్లాడకుండానే అక్కడి నుంచి ట్రంప్ వెళ్లిపోయారు. సెనెటర్ భార్యకు మోదీ సారీ! హ్యూస్టన్: అమెరికా సెనెటర్ జాన్ కార్నిన్ భార్య సాండీకి మోదీ క్షమాపణలు చెప్పారు. ఆదివారం సాండీ పుట్టిన రోజు. అయితే భార్యతో సరదాగా గడపకుండా భర్త.. ‘హౌడీ మోదీ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విషయం తెలుసుకున్న మోదీ ఆమెకు సారీతో పాటు బర్త్‌డే విషెస్ చెప్పారు. ‘మీ పుట్టిన రోజు మీ జీవిత భాగస్వామి మీతో ఉండకుండా.. నాతో ఉన్నారు. అందుకు మీకు కోపం ఉండొచ్చు. సారీ’ అని ఆమెతో చెప్పారు. అప్పుడు మోదీని చూడాలి హౌడీ మోదీ కార్యక్రమంలో మోదీకి స్వాగతం పలుకుతూ భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పేరును ప్రస్తావించిన డెమొక్రాట్ పార్టీ నేత స్టెనీ హోయర్పై కాంగ్రెస్ పార్టీ ప్రశంసలు కురిపించింది. ‘మహాత్మాగాంధీ బోధనలు, నెహ్రూ దార్శనికతతో భారత్ మానవహక్కులకు, బహుళత్వానికి పట్టం కట్టే లౌకిక ప్రజాస్వామ్య దేశంగా రూపుదిద్దుకుంది’ అని మోదీని స్వాగతిస్తూ స్టెనీ పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేతలు స్పందించారు. నెహ్రూ సేవలను మోదీకి అమెరికా నేతలు గుర్తు చేయడం బావుంది అని మరోనేత జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. ‘అద్వానీ సైతం నెహ్రూను ప్రశంసిస్తూ గతంలో ప్రసంగించారు. ఆ రోజులేమయ్యాయి?’ అంటూ జైరాం ట్వీట్ చేశారు. ‘నెహ్రూ పేరును స్టెనీ ప్రస్తావించినపుడు మోదీ ముఖ కవళికలు చూడాల్సిందే’ అని సింఘ్వీ వ్యాఖ్యానించారు. -
వాతావరణ న్యాయం గెలిచింది: మోదీ
-
వాతావరణ న్యాయం గెలిచింది: మోదీ
పారిస్/న్యూఢిల్లీ: భూతాపోన్నతిని రెండు డిగ్రీల కంటే తక్కువ స్థాయికి పరిమితం చేయాలని పారిస్ వాతావరణ సదస్సులో నిర్ణయం తీసుకోవడాన్ని ప్రపంచ దేశాల నాయకులు స్వాగతించారు. వాతావరణ న్యాయం సాధించిన విజయంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ వర్ణించారు. పర్యావరణవేత్తలు నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. భూమిని కాపాడుకోవడానికి పారిస్ ఒప్పందం మంచి అవకాశం, ప్రపంచానికి ఇది టర్నింగ్ పాయింట్ అని వైట్ హౌస్ నుంచి జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. 'పారిస్ ఒప్పందంలో గెలిచినవారు, ఓడినవారు లేరు. వాతావరణ న్యాయం గెలిచింది. పచ్చని భవిష్యత్ కోసం మనమంతా కలిసి పనిచేయాలి. భూతాపోన్నతిని 2 డిగ్రీల కంటే తక్కువకు పరిమితం చేయడానికి అభివృద్ధి చెందిన దేశాలు 2020 నుంచి వర్ధమాన దేశాలకు 100 బిలియన్ డాలర్లు సహాయం చేయాలి' అని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఫ్రాన్స్, బ్రిటన్ ప్రధానులు కూడా పారిస్ ఒప్పందాన్ని కొనియాడారు. అయితే ఈ ఒప్పందం బలహీనంగా, సాదాసీదాగా ఉందని ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్(సీఎస్ఈ) పేర్కొంది. Outcome of #ParisAgreement has no winners or losers. Climate justice has won & we are all working towards a greener future. @COP21 @COP21en — Narendra Modi (@narendramodi) December 13, 2015 -
‘లిమా’ విషాదం!
విపత్తు వెన్నాడుతున్నదని శాస్త్రవేత్తలూ, పర్యావరణ ఉద్యమకారులూ ఎప్పటికప్పుడు చేస్తున్న హెచ్చరికలన్నీ షరా మామూలుగా వృథా అయ్యాయని పెరూ రాజధాని లిమాలో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో రెండు వారాలపాటు కొనసాగి ఆదివారం ముగిసిన వాతావరణ సదస్సు(సీఓపీ-20) తేటతెల్లం చేసింది. రెండు దశాబ్దాలనాటి విధానాల నుంచి సంపన్న దేశాలు అంగుళం కూడా ముందుకు కదల్లేదని, తమ మొండి వైఖరిని విడనాడలేదని సదస్సు ఆమోదించిన ముసాయిదా చూస్తే అర్థమవుతుంది. ‘వాతావరణ కార్యాచరణకు లిమా పిలుపు’ పేరిట విడుదలైన ఆ ముసాయిదా నిండా బడాయి కబుర్లు, మాయ మాటలే తప్ప అందులో నిర్దిష్టమైన కార్యాచరణకు చోటే లేదు. పారిస్ సదస్సులో కుదరబోయే ఒప్పందం అమల్లోకి రావాల్సిన 2020లోగా తమ వంతు కర్బన ఉద్గారాలను ఏ స్థాయిలో తగ్గించుకుంటామన్న విషయంలో వాగ్దానం ఇవ్వడానికి సంపన్న దేశాలకు నోరు రాలేదు! అలాగే వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి అవసరమైన ఆర్థిక సాయాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని వర్థమాన దేశాలకు అందించే విషయంలో కూడా అవి స్పష్టమైన హామీ ఇవ్వలేకపోయాయి. వచ్చే ఏడాది వాతావరణంపై పారిస్‌లో జరగబోయే సదస్సుకు కాస్త ముందు అందుకు సంబంధించిన హామీలేమిటో చెబుతామని వాయిదా వేశాయి. మొత్తంమీద పారిస్‌లో కుదరవలసిన ఒడంబడిక కు ప్రాతిపదికను నిర్దేశించగలదనుకున్న లిమా సదస్సు అనుకున్నకంటే ఒక రోజు అదనంగా కొనసాగినా తగిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. లిమాలో ఏమీ సాధించలేదన్న ముద్ర పడకుండా తప్పించుకోవడానికి ఏదో కంటి తుడుపు రాజీ ముసాయిదాను అయిందనిపించి ఎక్కడివారక్కడికి నిష్ర్కమించారు! అందుకోసం ముసాయిదాలోని వాక్యాలు పదే పదే మారుతూ వచ్చాయి. ముసాయిదా ప్రకారం ప్రతి దేశమూ తన ఉద్గారాలను తగ్గించుకోవడానికి ఏం చేయాలో తానే నిర్ణయించుకుంటుంది. ఆ నిర్ణయాల్లోని సహేతుకత ఏపాటో, అందుకు అనుసరిస్తామని చెబుతున్న కార్యాచరణ ఎలాటిదో ఎవరూ అడిగేవారుండరు. ఆ దేశాలూ చెప్పవు. ఉద్గారాల తగ్గింపు విషయంలో చేస్తామని చెప్పినదెంతో, చేసినదెంతో పారిస్ సదస్సుకు ముందు మదింపు వేసే ప్రక్రియపైనా ఎలాంటి నిర్ణయం లేదు. వాతావరణంలో చోటుచేసుకుంటున్న ప్రమాదకర మార్పులు ఎలాంటివో వివరించి, వాటి నివారణకు తక్షణం చేపట్టాల్సిన కార్యాచరణ అవసరాన్ని నొక్కిచెప్పడంలో దాదాపు అన్ని దేశాలూ విఫలమయ్యాయి. ఏ దేశానికి ఆ దేశం ‘నొప్పింపక తానొవ్వక’ అన్న రీతిలో తప్పించుకు తిరిగే వైఖరినే ప్రదర్శించింది. గాంబియా పర్యావరణ మంత్రి మాత్రం విపరీత వాతావరణం పోకడలెలా ఉంటాయో, అందులో తమ అనుభవాలేమిటో ఏకరువు పెట్టారు. తమవంటి పేద దేశాల్లో భూగర్భ జలాలు ఉప్పుదేరడం, తరచుగా కరువు వాతబడటం, సముద్ర మట్టాలు పెరగడంవంటివి చోటు చేసుకుంటున్నాయని వాపోయారు. ఈ విషయంలో సంపన్న దేశాల సహకారం కొరవడితే వలసలు అధికమవుతాయని, అవి పెను సంక్షోభానికి దారితీస్తాయని హెచ్చరించారు. పారిశ్రామిక దేశాలు కేవల లాభాపేక్షతో వెనకా ముందూ చూడకుండా కర్బన ఉద్గారాలను భారీయెత్తున విడిచిపెడుతున్నాయి. ఆ దేశాలు లాభాలు పోగేసుకుని మురుస్తుంటే పర్యవసానాలను మాత్రం ప్రపంచ దేశాలన్నీ అనుభవిస్తున్నాయి. గత రెండేళ్లలో మన దేశంలోనే సంభవించిన ఉత్తరాఖండ్, జమ్మూ-కశ్మీర్, మేఘాలయ వరదలు భూతాపోన్నతి దుష్పరిణామాలెలా ఉంటాయో వెల్లడించాయి. ఇప్పుడున్న స్థాయిలోనే కర్బన ఉద్గారాలు వెలువడుతుంటే ఉష్ణోగ్రతలు మరో 3 డిగ్రీలు పెరుగుతాయి. పర్యవసానంగా అకాల వర్షాలు సంభవించి వ్యవసాయ ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ప్రపంచంలో కోట్లాదిమంది జీవిక దెబ్బతింటుంది. ఇది ఆర్థిక సంక్షోభానికీ, ఆపై సామాజిక సంక్షోభానికీ దారి తీస్తుంది. ఇంతటి విపత్తును తెచ్చిపెడుతున్న తమ చర్యలను నియంత్రించుకోవ డానికి ఈ క్షణంలో కూడా సంపన్న దేశాలు ముందుకు రాకపోవడం... లిమా సదస్సు అచేతనంగా ఉండిపోవడం అత్యంత విచారకరం. పెపైచ్చు వాతావరణ కార్యాచరణకు సంబంధించి పేద, ధనిక దేశాలను ఒకే గాటన కట్టకుండా చూసే నిబంధనను కాస్తా లిమా సదస్సు నీరుగార్చింది. ఉద్గారాల విషయంలో ఇప్పటి వరకూ వర్థమాన దేశాలకిచ్చే వెసులుబాటు సంపన్న దేశాలకు సైతం వర్తించేందుకు వీలు కల్పిస్తున్న వాక్యం ఈ ముసాయిదాలో వచ్చిచేరింది. అమెరికా-చైనాల మధ్య ఇటీవల ఉద్గారాల తగ్గింపు విషయంలో కుదిరిన ఒప్పందంలోనుంచి దీన్ని తీసుకున్నారు. క్యోటో ప్రోటోకాల్‌కు దారితీసిన చర్చల నాటినుంచీ సంపన్న దేశాలకూ, ఇతర దేశాలకూ మధ్య వివాదంగా మారి చివరకు అంగీకరించిన అంశం కూడా లిమా సదస్సు ముసాయిదావల్ల దెబ్బతిందని పర్యావరణ ఉద్యమకారులు అంటున్నారు. మన దేశంతోసహా పలు దేశాలు లిమా సదస్సు సాధించిన విజయం ఎన్నదగినదని అంటున్నా ఇంత బలహీనమైన, అన్యాయమైన ఒప్పందం ఇంతకు ముందెన్నడూ కుదరలేదన్నది వారి ఆవేదన. కర్బన ఉద్గారాల్లో ఎవరి వాటా ఎంతని చిట్టా విప్పితే సంపన్న దేశాల పాపాలన్నీ బయటపడతాయి. ప్రపంచాన్ని ఆవరించిన కర్బన మేఘాల్లో పారిశ్రామిక దేశాల వాటా 70 శాతంపైగా ఉంటుందన్నది ఒక అంచనా. ఇప్పుడు లిమా సదస్సు మాత్రం అందరినీ సమాన బాధ్యుల్ని చేస్తున్నది. ఇందువల్ల వర్థమాన దేశాల్లో పేదరిక నిర్మూలన , సుస్థిర అభివృద్ధి చర్యలపై తీవ్ర ప్రభావం పడుతుంది. పర్యావరణ విధ్వంసంలో తమ పాత్రను గుర్తించి సరిచేసుకోవాల్సిన సంపన్న దేశాలు దబాయించి, మొండికేసి మానవాళి సురక్షిత భవిష్యత్తుకు మోకాలడ్డాయి. భావితరాలు దీన్ని క్షమించవు.