వచ్చే ఆదివారం నుంచి 13 రోజులపాటు జరుగనున్న ఐక్యరాజ్యసమితి 26వ వాతావరణ మార్పు సదస్సు (కాప్–26) కీలక ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంది. వాతావరణంలోకి విడుదలవుతున్న అసాధారణ కర్బన ఉద్గారాలను నియంత్రించడం ద్వారా మాత్రమే వేడిని తగ్గించగలుగుతామని శాస్త్రవేత్తలు ఎప్పట్నుంచో చెబుతున్నా రాజకీయ వ్యవస్థే కదలటంలేదు! ప్రభుత్వాలు కార్పొరేట్లకు దన్నుగా ఉండేకన్నా పర్యావరణ పరిరక్షణకే కట్టు బడాలనే ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. భూమి మునిగిపోయే పడవ అనుకుంటే, మనం ఏ మూలన కూర్చున్నా... ఆ పడవే మునిగితే... ఎవరం మిగలం!
లక్ష్యం పెద్దదిగా ఉంటే... ఫలితం ఆశించిన దానికి దగ్గరగా ఉండొచ్చు. లక్ష్యమే చిన్నదైతే సాధించేదీ పరిమితమే! పెద్ద లక్ష్యం వల్ల మహా అంటే, ఎక్కువ కష్టపడాల్సి రావొచ్చేమో? కానీ, ఆశించింది సాధిస్తే అంతకన్నా మేలేముంటుంది? ఈ సూత్రం, గ్లాస్‌గో (స్కాట్లాండ్)లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి (యూఎన్) 26వ వాతావరణ మార్పు సదస్సు (కాప్–26)కు వర్తించదా? వర్తింపజేస్తే, అందుకు ప్రపంచ దేశాలు, అదే భాగస్వాములు (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్–కాప్) సిద్ధమేనా? నిజానికి... ఆ సదస్సు ఏమి ఆశిస్తోంది? ఏమి సాధించనుంది? వచ్చే ఆదివారం నుంచి 13 రోజులు జరుగ నున్న సదస్సు ముందర ఇలాంటి ప్రశ్నలు చాలానే తలెత్తుతున్నాయి. కాలుష్యాల వల్ల పెరుగుతున్న భూతాపోన్నతిని నియంత్రించడం, తద్వారా వాతావరణ మార్పు దుష్ప్రభావాల్ని కట్టడి చేయడం సదస్సు ముందున్న ప్రధాన లక్ష్యం! వాతావరణ మార్పు విపరిణామాలు శాస్త్రీయ నివేదికలు, పరిశోధనా పత్రాల్లో కనిపించడమే కాకుండా... ప్రతి మనిషిని తాకుతున్నాయి.
కొత్త రోగాలు, అడవుల దగ్ధం, తుఫాన్లు, అకాలవర్షాలు, వరదలు–కరువులు, ధ్రువమంచు కరగటం, సముద్రమట్టాలు పెరగటం వంటివన్నీ వాతావరణ మార్పువల్లే! దాంతో, మునుపెన్నడూ లేనంతగా మానవాళి చూపు ‘కాప్’ వైపు మళ్లింది. వాతావరణంలోకి విడుదలవుతున్న అసాధారణ కర్బన ఉద్గారాల (జిహెచ్‌జి)ను నియంత్రించడం ద్వారా మాత్రమే వేడిని తగ్గించగలుగుతామని ధ్రువపడింది. శాస్త్రవేత్తలు ఎప్పట్నుంచో చెబు తున్నా రాజకీయ వ్యవస్థే కదలలేదు! హామీలివ్వడం, ప్రమాణాలు చేయడం కాదు, చర్యలు కావాలనే ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. శతాబ్దాం తానికి (2100) ఉష్ణోగ్రత పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్‌ను మించనీకుండా కట్టడి చేయాలని, 1.5 డిగ్రీలకన్నా తక్కువకే నిలువ రిస్తే మంచిదని ఆరేళ్ల కింద పారిస్‌లో (2015) భాగస్వామ్య దేశాలన్నీ ఒప్పందానికి వచ్చాయి.
ఇది కూడా గొప్ప లక్ష్యమేం కాదని, కర్బన ఉద్గారాల తీవ్రత, భూమి వేడెక్కుతున్న వేగాన్ని బట్టి చూస్తే లక్ష్యాలే అరకొరగా ఉన్నాయి, వాటి సాధన కృషి మరింత నిస్సారమని ‘వాతావరణ మార్పుపై యూఎన్ ఏర్పరచిన అంతర్ప్రభుత్వాల బృందం’ (ఐపీసీసీ) తాజా నివేదిక చెప్పింది. దాంతో లక్ష్యాల్నే ఇంకాస్త పెద్దవిగా పెట్టుకొని, ఎక్కువ కష్టపడితే మేలనే అభిప్రాయం వ్యక్తమౌ తోంది. పారిశ్రామికీకరణ (1850–60) నాటి భూతాపం కన్నా పెరుగు దలను 2 డిగ్రీల దాకా అనుమతించే ఉదారవాదమో, 1.5 డిగ్రీలలోపే కట్టడి చేద్దామనే పరిమిత వాదమో ఎందుకు? పెరుగుదలను 1 డిగ్రీ మించనీకుండా కట్టడి చేద్దామనే కొత్త లక్ష్యాల ప్రతిపాదన వస్తోంది. ఆ మేర ఉద్గారాలను నియంత్రించాలని, సంపన్న దేశాలతో పాటు భాగ స్వాములంతా ముందుకు వచ్చి కార్యాచరణను వేగవంతం చేయాలని పౌరసమాజం కోరుతోంది.
తాపోన్నతి కట్టడి సాధ్యమా?
సగటు భూతాపోన్నతి ఇప్పటికే 1.12 డిగ్రీలు పెరిగింది. ఇదే పంథా సాగితే 2050 నాటికి 1.5 డిగ్రీలు దాటే ప్రమాదాన్ని శాస్త్రరంగం శంకిస్తోంది. ‘మా దేశం కట్టుబడ్డట్టు, మేమిది చేస్తాం’ (ఎన్డీసీ) అంటూ, భాగస్వాములు పారిస్‌లో పెద్ద హామీలే ఇచ్చారు. కానీ, కార్యాచరణకు మనస్ఫూర్తిగా పూనుకోలేదు. పెట్రోలియం, బొగ్గు వంటి శిలాజ ఇంధనాల వినియోగం నుంచి సౌర–పవన విద్యుత్తు వంటి పునర్వినియోగ ఇంధనాల (ఆర్‌ఈ) వైపు దారి మళ్లాలి. ఎలక్ట్రిక్ వాహనాలకు మారాలి. ఎక్కడా అది ఆశించిన స్థాయిలో జరగటం లేదు. 194లో 113 దేశాలు, యూఎన్‌కు ఇచ్చిన ఎన్డీసీ నివేదికల సార మేమంటే, 2010 స్థాయిపై 2030 నాటికి కర్బన ఉద్గారాలు తగ్గకపోగా 16.3 శాతం పెరిగే ఆస్కారముంది.
ఐపీసీసీ నివేదిక ప్రకారం 2010 నాటి స్థాయిపైన 2030 నాటికి, ఉద్గారాలను 45 శాతం తగ్గించగలిగి తేనే... భూతాపోన్నతి పెరుగుదలను 1.5 డిగ్రీలకు నిలువరించగలం. హామీలకు–ఆచరణకు ఇంత వ్యత్యాసం ఉన్నపుడు, పెరుగుదల 2 డిగ్రీలకు కట్టడిచేస్తే చాలనే చిన్న లక్ష్యం వల్ల ప్రయోజనం లేదని, 1 డిగ్రీకి మించనీయవద్దనే పెద్ద లక్ష్యంతోనే ఎంతో కొంత సాధించగల మనేది తాజా ఒత్తిడి! ప్రపంచవ్యాప్తంగా సగటున ఏటా 3400 కోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్ (సీవో2)ను వాతావరణంలోకి వదులు తున్నాం. 2030ని మైలురాయిగా పెట్టుకొని, ఉద్గారాలను తగ్గించే చర్యలు చేపడితేనే కట్టడి సాధ్యం. గాలిలోకి వదిలే సీవో2ను, 2005 స్థాయి నుంచి 2030 నాటికి, 33–35 శాతం తగ్గిస్తామన్నది పారిస్‌లో మన హామీ! వీటిని మార్చుకొని, విడుదలను అంతకన్నా ఎక్కువ శాతాల్లోనే నియంత్రిస్తామని కొత్త లక్ష్యాలు పెట్టుకోవాలి.
ఉద్గారాల ‘శూన్య స్థితి’కి సిద్ధపడని భారత్!
సీవో2 వంటి వాయువుల్ని మానవ ప్రమేయం తర్వాత కూడా, వాతా వరణంలో సహజ స్థాయికి పరిమితం చేయడాన్ని ఉద్గారాల ‘శూన్య స్థితి’ అంటారు. శిలాజ ఇంధనాల నుంచి ఆర్‌ఈ వెపు మళ్లడం ద్వారా ఎప్పటి వరకు ఆ శూన్యస్థితిని సాధిస్తారో ఆయా దేశాలు నిర్దిష్టంగా హామీ ఇస్తున్నాయి. 2050 నాటికని అమెరికా, ఐరోపా సంఘం హామీ ఇస్తే, 2060 నాటికి అని చైనా చెప్పింది. ఆస్ట్రేలియా ఇటీవలే తన గడువు ప్రకటించడంతో ఇక భారత్‌పై ఒత్తిడి పెరుగుతోంది. ప్రపంచ సగటు (6.5 టన్నుల) కన్నా భారత్ తలసరి సీవో2 విడుదల (2.5 టన్నులు) చాలా తక్కువ! భారత్ తలసరి విడుదల కన్నా అమెరికా ఏడున్నర రెట్లు, చైనా మూడున్నర రెట్లు, ఐరోపా సంఘం మూడు రెట్లు అధిక తలసరి విడుదల నమోదు చేస్తున్నాయి. అయినా, భారత్ శూన్యస్థితికి హామీ ఇవ్వటం లేదు.
ఎప్పట్నుంచో సహజ వనరుల్ని మితిమీరి వాడుకుంటూ, వాతావరణ కాలుష్యానికి కారకులైన అభి వృద్ధి చెందిన దేశాలు (కాలుష్య కారకులే!) మూల్యం చెల్లించాలని, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక సహాయం, సాంకేతిక బద లాయింపు చేయాలని కోరుతోంది. 2009 (కొపెన్ హెగెన్)లో హామీ ఇచ్చినట్టు, ఏటా పదివేల కోట్ల డాలర్ల సహాయం ద్వారా ‘వాతావరణ ఆర్థికాంశా’ నికి కట్టుబడాలని ఒత్తిడి తెస్తోంది. ఈ ‘పర్యావరణ న్యాయం’ జరిగే వరకు కర్బన ఉద్గారాల ‘శూన్యస్థితి’పై ప్రకటనకు భారత్ సిద్ధంగా లేదు.
శిలాజ ఇంధనాల నుంచి ఆర్‌ఈ వైపు క్రమంగా మళ్లుతున్నట్టు మనమొక చిత్రం చూపిస్తున్నాం. సౌర, పవన, చిన్న పాటి జల విద్యు దుత్పత్తి ద్వారా 2030 నాటికి 450 గిగావాట్ల హరిత ఇంధనోత్పత్తి లక్ష్యమని చెబుతున్నాం. కానీ, బొగ్గు వినియోగం కథ భిన్నంగా ఉంది. మనం వాడే విద్యుత్తులో థర్మల్ వాటా కొన్ని సంవ త్సరాల కింద 75 శాతం కాగా ఇప్పుడది 67 శాతం. 2030 నాటికి 50 శాతంగా ఉండొచ్చు! కానీ, అప్పుడు వినియోగమయ్యే మొత్తం విద్యు త్తుతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ! 2030–40 మధ్య మన బొగ్గు విని యోగం ఉచ్ఛస్థితికి వస్తుందని ఒక అంచనా!
సర్కార్లు–కార్పొరేట్లు మారితేనే!
భూతాపోన్నతి పెరుగుదల 2 డిగ్రీలకు కట్టడి, ఉద్గారాల శూన్యస్థితి ఇప్పట్లో దుస్సాధ్యమనే వాదన తరచూ తెరపైకి వస్తోంది. దీని వెనుక బొగ్గు లాబీ, చమురులాబీ, వాహనోత్పత్తి వంటి బలమైన లాబీలే కారణమని తెలుస్తోంది. యూఎన్ నివేదికనే మార్చే ఎత్తుగడలు వేసిన కార్పొరేట్ దళారీలు ఏమైనా చేయగలరనే విమర్శ వ్యక్తమౌతోంది. ప్రభుత్వాలు కార్పొరేట్లకు దన్నుగా ఉండేకన్నా పర్యావరణ పరిరక్షణకే కట్టుబడాలనే ఒత్తిళ్లు సామాజికవేత్తలు, కార్యకర్తల నుంచి పెరుగు తున్నాయి.
కార్పొరేట్లు తమ సామాజిక బాధ్యత (సీఎస్సార్) కింద స్వచ్ఛ, హరిత ఇంధనాలవైపు మొగ్గడం వారికే ఉపయోగం! యువ తరం, షేర్‌హోల్డర్లు కూడా కార్పొరేట్లపై ఒత్తిడి పెంచితే సానుకూల ఫలితాలుంటాయి. రేపు యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలన్నీ హరితంలోనే! ఈ పర్యావరణ సంక్షోభంలో... అందరం బాగుంటేనే, ఎవరమైనా బాగుండేది. జీవమున్న ఏకైక గ్రహం భూమి మునిగి పోయే పడవ అనుకుంటే, మనం ఏ మూలన, ఎంత పద్ధతిగా కూర్చున్నా... ఆ పడవే మునిగితే.... ఎవరం మిగలం!
-దిలీప్ రెడ్డి
ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment