విశ్లేషణ
జనాభా సమీకరణాల్లో వస్తున్నంత పరివర్తన సామాజికార్థిక పరిస్థితుల్లో రాకపోవడం దేశంలో ఏకరీతి ప్రగతికి సవాల్ విసురుతోంది. అసమగ్ర అభివృద్ధికి ప్రభుత్వాలే కారణమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ‘జనాభా ఆధారంగా చట్టసభలకు ప్రాతినిధ్య’ పద్ధతి సమాఖ్య స్ఫూర్తికే విఘాతం కలిగించేలా పరిణమించింది. నియోజకవర్గ పునర్విభజనతో జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య పెరుగనుండగా, దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గనున్నాయి. జనాభా నియంత్రిస్తే తప్పయినట్టు, ఎక్కువ మంది పిల్లల్ని కనడమే గొప్పయినట్టు అధికారిక ప్రచారాలు, అమలు చర్యలు మొదలయ్యే ప్రమాదముంది. ఈ పరిస్థితులపై లోతైన సమగ్ర అధ్యయనం, దిద్దుబాటు చర్యలు తక్షణావసరం.
మనమిపుడు 140 కోట్ల మందితో ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా ఉన్నాం. వనరులు, సదుపాయాలు, జనాభా నిష్పత్తిలో చూసినపుడు ఇదొక సంక్లిష్ట నమూనా! ఇటీవలి వరకు అధిక జనాభా దేశంగా ఉన్న చైనా కొన్నేళ్లుగా కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలతో జనాభా వృద్ధిని నిలువరించింది. మనం కూడా నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ, ఆశించిన లక్ష్యాలు అందుకోలేకపోయాం. అయితే, దేశంలోని కొన్ని, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు ఈ విషయంలో మంచి విజయాలు సాధించాయి. అర్థవంతమైన సంతానోత్పత్తి రేటు తరుగుదలను నమోదు చేశాయి. ఇది ప్రగతి సంకేతమే! కానీ, అదే తమ పాలిట శాపంగా పరిణమించిందని ఇప్పుడా రాష్ట్రాలు నెత్తి బాదుకుంటు న్నాయి.
ప్రధానంగా రెండు సమస్యల్ని ఎదుర్కొంటున్నామని ఆ యా రాష్ట్రాల అధినేతలు భావిస్తున్నారు. ఒకటి, సంతానోత్పత్తి రేటు నియంత్రణ వల్ల పిల్లలు, యువ జనాభా తగ్గుతూ, వృద్ధుల జనాభా నిష్పత్తి పెరుగుతోంది. రెండోది, జనాభా నిలువరింపు కారణంగా, జాతీయ సగటు జనాభా ఆధారంగా జరిగే లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనతో ఆ యా రాష్ట్రాల్లో ఎంపీ స్థానాల సంఖ్య తగ్గనుంది. ఇది దేశంలోని అత్యున్నత విధాన నిర్ణాయక సభలో ప్రాతినిధ్యం కోతగా భావిస్తూ వారు కలత చెందుతున్నారు. ఇంకోవైపు, జనాభాను అదుపు చేయక, సంతానోత్పత్తి రేటును అధికంగానే చూపుతున్న రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాల సంఖ్య పెరుగనుండటం దేనికి సంకేతం? అనే ప్రశ్న పుట్టుకొస్తోంది.
తగ్గిన సంతానోత్పత్తి రేటు
దక్షిణాది రాష్ట్రాలు, ఈశాన్య భారతంలోని చిన్న రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటులో రమారమి తరుగుదల నమోదైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోనూ ఈ రేటు తక్కువగానే ఉంది. 2019–21 కాలంలో, దేశంలోనే అత్యల్పంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో సంతానోత్పత్తి రేటు 1.4గా ఉంటే... తెలంగాణ, ఏపీ, కేరళ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌లలో ఇది 1.5గా నమోదయినట్టు ‘భారత రిజిస్ట్రార్ జనరల్’ నివేదిక చెబుతోంది. ‘పిల్లలు కనే వయసు’ కాలంలో మహిళలకు పుట్టిన పిల్లల సంఖ్య సగటును, ఆ ప్రాంతపు లేదా ఆ రాష్ట్రపు సంతా నోత్పత్తి రేటుగా పరిగణిస్తారు. అదే సమయంలో బిహార్ (3), ఉత్తర ప్రదేశ్ (2.7), మధ్యప్రదేశ్ (2.6) రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు అధి కంగా నమోదవుతోంది. ఎక్కువ సంతానోత్పత్తి రేటున్న రాష్ట్రాల్లో అభివృద్ధి మందగించడం సహజం.
సంతానోత్పత్తి పరిమితుల్లో ఉండటం ప్రగతి సంకేతమే అయినా, మరో సమస్యకు అది కారణమవుతోంది. ఒక వంక పుట్టే పిల్లల సంఖ్య తగ్గుతుంటే, మరోవంక శాస్త్ర సాంకేతికత పురోగతి పుణ్యమా అని మనిషి సగటు జీవనకాలం పెరగటం వల్ల వృద్ధుల సంఖ్య అధిక మవుతోంది. అభివృద్ధి చెందిన దేశాల్లోలాగా ఒక నిర్దిష్ట వయసు దాటినవారికి ప్రభుత్వమే కల్పించే సామాజిక భద్రత పథకాలు, కార్యక్రమాలు మనవద్ద లేకపోవడంతో వారి పోషణ, ఆరోగ్య నిర్వహణ కుటుంబాలకు అదనపు ఆర్థిక భారంగా పరిణమిస్తు న్నాయి. జనాభా ఆధారంగానే వివిధ కేంద్ర పథకాలు, సంక్షేమ కార్య క్రమాల నిధుల కేటాయింపులు, చివరకు చట్టసభల్లో ఆయా రాష్ట్రాల ప్రాతినిధ్య సంఖ్య ఖరారు కూడా జరగటం తమకు నష్టం కలిగిస్తోందని ఏపీ, తమిళనాడు ముఖ్యమంత్రులు వ్యాఖ్యానించారు.
ఆధారపడే జనాభా రేటులో వృద్ధి
ప్రపంచంలోనే అత్యధిక యువజనాభా కలిగిన దేశంగా భారత్ రికార్డులకెక్కింది. కానీ, ఇటీవలి కాలంలో వృద్ధుల జనాభా శాతం క్రమంగా పెరుగుతున్నట్టు, మున్ముందు అది మరింత పెరుగనున్నట్టు ఐక్యరాజ్యసమితి విభాగమొకటి (యూఎన్‌ఎఫ్పీయే) తన నివేదికలో చెప్పింది. భారత వైద్య, కుటుంబ ఆరోగ్య విభాగం అందించిన సమాచారం ఆధారంగా అంచనాలు లెక్కగట్టిన ఈ విభాగం 2021లో 10.1 శాతంగా ఉన్న వృద్ధుల జనాభా 2036 నాటికి 15 శాతానికి చేరవచ్చని చెప్పింది.
అయితే, వృద్ధుల జనాభా పెరుగుదల రేటు సమస్య కాదు... సదరు జనాభా పనిచేసే వయస్కుల మీద ఆధారపడే స్థితి అధిక మవడం ఇబ్బంది. అంటే, వంద మంది పనిచేసే (18–59 ఏళ్లు) వయస్కులున్నపుడు, వారిపై ఆధారపడే వృద్ధుల జనాభా అధికంగా ఉండటం కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై నేరుగా ప్రభావం చూపుతుందనేది అంతర్జాతీయ ప్రమాణాల లెక్క. ఆ నిష్పత్తి పెరుగుతోంది. అది 15 శాతాన్ని దాటితే సమస్యను ‘వృద్ధుల సంక్షోభం’గా లెక్కిస్తారు.
భారత జాతీయ జనాభా కమిషన్ (ఎన్సీపీ) 2021 లెక్కల ప్రకారం, కేరళలో ఇది ఇప్పటికే 26.1 శాతంగా ఉంది. తమిళనాడు (20.5), హిమాచల్ ప్రదేశ్ (19.6), ఏపీ (18.5) శాతాలు కూడా అధికంగానే ఉన్నాయి. 2036 నాటికి అవి మరింత గణనీయంగా పెరగటం ఖాయంగా కనిపిస్తోంది. సంతానన్పోత్తి రేటును, తద్వారా జనాభాను నియంత్రించినందుకు, సదరు కుటుంబాల్లో లభించే ఆ ప్రయోజనం... వృద్ధుల పోషణ, వారి ఆరోగ్య పరిరక్షణలోనే కరిగిపోతోందనే వాదన బలంగా వినిపిస్తోంది.
కట్టడి చేసినందుకు కనీస స్థానాలా?
2026 తర్వాతి జనాభా లెక్కల ఆధారంగా దేశంలో నియోజక వర్గాల పునర్విభజన జరగాల్సి ఉంది. రాష్ట్ర విభజన చట్ట నిర్దేశ్యం ప్రకారం ఏపీ, తెలంగాణల్లోనూ సంఖ్య పెంపుతో పునర్విభజన జరగాల్సి ఉంది. దేశవ్యాప్తంగా గడువు లోపల జనాభా తాజా లెక్కలు అందించడానికి వీలుగా జనగణన ప్రక్రియ సత్వరం చేపట్టనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే ప్రకటించింది. దశాబ్దానికి ఒకసారి జరిపే జనగణన, పాత సంప్రదాయం ప్రకారం 2020లో మొదలు కావాల్సింది. కోవిడ్ మహమ్మారి వల్ల అది వాయిదా పడింది.
ఇప్పుడు 2025లో చేపట్టి, పదేళ్ల సైకిల్ని (ఇదివరకటిలా 2021 –2031 కాకుండా 2025 –2035గా) మారుస్తున్నారు. జనాభా వృద్ధి రేటు తీరుతెన్నుల్ని బట్టి కె.ఎస్. జేమ్స్, శుభ్ర కృతి జరిపిన అధ్యయనం ప్రకారం, వచ్చే పునర్విభజనతో ఉత్తరాది రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య పెరు గనుండగా దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గనుంది. ఉత్తరప్రదేశ్ (12), బిహార్ (10), రాజస్థాన్ (7) లలో లోక్‌సభ నియోజకవర్గాలు పెరుగ నున్నాయి. తమిళనాడు (9), కేరళ (6), ఏపీ (5) లలో తగ్గనున్నాయి. జాతీయ జనాభాలో వాటా పెరుగుదల, తరుగుదలను బట్టి ఈ సంఖ్య మారనుంది.
‘ఎక్కువ పిల్లలు కలిగిన తలిదండ్రులకు ప్రోత్సాహకాలివ్వాలి, ఆ మేరకు చట్టం తేవాలని నేను ఆలోచిస్తున్నాను’ అంటూ ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల అన్నారు. ఇటువంటి పంథా మంచిది కాదనీ, దాని వల్ల ఏ మంచీ జరుగదనేది ప్రపంచ వ్యాప్తంగా రుజువైన అంశమనీ సామాజికవేత్తలు అంటున్నారు. ప్రభుత్వాలిచ్చే ప్రాత్సాహకాలు అదనంగా పుట్టే సంతాన పోషణ, వారి విద్య –వైద్య అవసరాలు తీర్చవనీ, అధిక సంతానం కుటుంబ జీవన ప్రమాణాల పతనానికే కారణమవుతుందనీ విశ్లేషణలున్నాయి.
ఈ పరిణామాలను ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకొని ప్రత్యా మ్నాయ చర్యలు చేపట్టాలి. జానాభా వృద్ధిని నిలుపుదల చేసిన వారిని ప్రోత్సహించేలా నిర్ణయాలుండాలి. సరైన జనాభా నిష్పత్తి ఉండేలా చూడాలి. వయసు మళ్లినవారు ఆయా కుటంబాలకు భారం కాకుండా సార్వత్రిక సాంఘిక భద్రతా పథకాలు ఉండాలి. ‘పనిచేసే వయసు’ కాలం నిడివి పెరిగేట్టు జీవన ప్రమాణాల వృద్ధికి చర్యలు తీసుకోవాలి. జనాభా నియంత్రణ తప్పు కాదు. ముసలితనం శాపం కాకూడదు. మంచి పనులకు ప్రోత్సాహం ఉండాలే తప్ప, శిక్షలు ఉండకూడదు.
దిలీప్ రెడ్డి
వ్యాసకర్త ‘పీపుల్స్ పల్స్’ రిసెర్చ్ సంస్థ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment