India population
-
మంచి పనిని కించపరుస్తారా?
జనాభా సమీకరణాల్లో వస్తున్నంత పరివర్తన సామాజికార్థిక పరిస్థితుల్లో రాకపోవడం దేశంలో ఏకరీతి ప్రగతికి సవాల్ విసురుతోంది. అసమగ్ర అభివృద్ధికి ప్రభుత్వాలే కారణమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ‘జనాభా ఆధారంగా చట్టసభలకు ప్రాతినిధ్య’ పద్ధతి సమాఖ్య స్ఫూర్తికే విఘాతం కలిగించేలా పరిణమించింది. నియోజకవర్గ పునర్విభజనతో జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య పెరుగనుండగా, దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గనున్నాయి. జనాభా నియంత్రిస్తే తప్పయినట్టు, ఎక్కువ మంది పిల్లల్ని కనడమే గొప్పయినట్టు అధికారిక ప్రచారాలు, అమలు చర్యలు మొదలయ్యే ప్రమాదముంది. ఈ పరిస్థితులపై లోతైన సమగ్ర అధ్యయనం, దిద్దుబాటు చర్యలు తక్షణావసరం.మనమిపుడు 140 కోట్ల మందితో ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా ఉన్నాం. వనరులు, సదుపాయాలు, జనాభా నిష్పత్తిలో చూసినపుడు ఇదొక సంక్లిష్ట నమూనా! ఇటీవలి వరకు అధిక జనాభా దేశంగా ఉన్న చైనా కొన్నేళ్లుగా కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలతో జనాభా వృద్ధిని నిలువరించింది. మనం కూడా నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ, ఆశించిన లక్ష్యాలు అందుకోలేకపోయాం. అయితే, దేశంలోని కొన్ని, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు ఈ విషయంలో మంచి విజయాలు సాధించాయి. అర్థవంతమైన సంతానోత్పత్తి రేటు తరుగుదలను నమోదు చేశాయి. ఇది ప్రగతి సంకేతమే! కానీ, అదే తమ పాలిట శాపంగా పరిణమించిందని ఇప్పుడా రాష్ట్రాలు నెత్తి బాదుకుంటు న్నాయి. ప్రధానంగా రెండు సమస్యల్ని ఎదుర్కొంటున్నామని ఆ యా రాష్ట్రాల అధినేతలు భావిస్తున్నారు. ఒకటి, సంతానోత్పత్తి రేటు నియంత్రణ వల్ల పిల్లలు, యువ జనాభా తగ్గుతూ, వృద్ధుల జనాభా నిష్పత్తి పెరుగుతోంది. రెండోది, జనాభా నిలువరింపు కారణంగా, జాతీయ సగటు జనాభా ఆధారంగా జరిగే లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనతో ఆ యా రాష్ట్రాల్లో ఎంపీ స్థానాల సంఖ్య తగ్గనుంది. ఇది దేశంలోని అత్యున్నత విధాన నిర్ణాయక సభలో ప్రాతినిధ్యం కోతగా భావిస్తూ వారు కలత చెందుతున్నారు. ఇంకోవైపు, జనాభాను అదుపు చేయక, సంతానోత్పత్తి రేటును అధికంగానే చూపుతున్న రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాల సంఖ్య పెరుగనుండటం దేనికి సంకేతం? అనే ప్రశ్న పుట్టుకొస్తోంది.తగ్గిన సంతానోత్పత్తి రేటుదక్షిణాది రాష్ట్రాలు, ఈశాన్య భారతంలోని చిన్న రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటులో రమారమి తరుగుదల నమోదైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోనూ ఈ రేటు తక్కువగానే ఉంది. 2019–21 కాలంలో, దేశంలోనే అత్యల్పంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో సంతానోత్పత్తి రేటు 1.4గా ఉంటే... తెలంగాణ, ఏపీ, కేరళ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్లలో ఇది 1.5గా నమోదయినట్టు ‘భారత రిజిస్ట్రార్ జనరల్’ నివేదిక చెబుతోంది. ‘పిల్లలు కనే వయసు’ కాలంలో మహిళలకు పుట్టిన పిల్లల సంఖ్య సగటును, ఆ ప్రాంతపు లేదా ఆ రాష్ట్రపు సంతా నోత్పత్తి రేటుగా పరిగణిస్తారు. అదే సమయంలో బిహార్ (3), ఉత్తర ప్రదేశ్ (2.7), మధ్యప్రదేశ్ (2.6) రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు అధి కంగా నమోదవుతోంది. ఎక్కువ సంతానోత్పత్తి రేటున్న రాష్ట్రాల్లో అభివృద్ధి మందగించడం సహజం.సంతానోత్పత్తి పరిమితుల్లో ఉండటం ప్రగతి సంకేతమే అయినా, మరో సమస్యకు అది కారణమవుతోంది. ఒక వంక పుట్టే పిల్లల సంఖ్య తగ్గుతుంటే, మరోవంక శాస్త్ర సాంకేతికత పురోగతి పుణ్యమా అని మనిషి సగటు జీవనకాలం పెరగటం వల్ల వృద్ధుల సంఖ్య అధిక మవుతోంది. అభివృద్ధి చెందిన దేశాల్లోలాగా ఒక నిర్దిష్ట వయసు దాటినవారికి ప్రభుత్వమే కల్పించే సామాజిక భద్రత పథకాలు, కార్యక్రమాలు మనవద్ద లేకపోవడంతో వారి పోషణ, ఆరోగ్య నిర్వహణ కుటుంబాలకు అదనపు ఆర్థిక భారంగా పరిణమిస్తు న్నాయి. జనాభా ఆధారంగానే వివిధ కేంద్ర పథకాలు, సంక్షేమ కార్య క్రమాల నిధుల కేటాయింపులు, చివరకు చట్టసభల్లో ఆయా రాష్ట్రాల ప్రాతినిధ్య సంఖ్య ఖరారు కూడా జరగటం తమకు నష్టం కలిగిస్తోందని ఏపీ, తమిళనాడు ముఖ్యమంత్రులు వ్యాఖ్యానించారు.ఆధారపడే జనాభా రేటులో వృద్ధిప్రపంచంలోనే అత్యధిక యువజనాభా కలిగిన దేశంగా భారత్ రికార్డులకెక్కింది. కానీ, ఇటీవలి కాలంలో వృద్ధుల జనాభా శాతం క్రమంగా పెరుగుతున్నట్టు, మున్ముందు అది మరింత పెరుగనున్నట్టు ఐక్యరాజ్యసమితి విభాగమొకటి (యూఎన్‌ఎఫ్‌పీయే) తన నివేదికలో చెప్పింది. భారత వైద్య, కుటుంబ ఆరోగ్య విభాగం అందించిన సమాచారం ఆధారంగా అంచనాలు లెక్కగట్టిన ఈ విభాగం 2021లో 10.1 శాతంగా ఉన్న వృద్ధుల జనాభా 2036 నాటికి 15 శాతానికి చేరవచ్చని చెప్పింది.అయితే, వృద్ధుల జనాభా పెరుగుదల రేటు సమస్య కాదు... సదరు జనాభా పనిచేసే వయస్కుల మీద ఆధారపడే స్థితి అధిక మవడం ఇబ్బంది. అంటే, వంద మంది పనిచేసే (18–59 ఏళ్లు) వయస్కులున్నపుడు, వారిపై ఆధారపడే వృద్ధుల జనాభా అధికంగా ఉండటం కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై నేరుగా ప్రభావం చూపుతుందనేది అంతర్జాతీయ ప్రమాణాల లెక్క. ఆ నిష్పత్తి పెరుగుతోంది. అది 15 శాతాన్ని దాటితే సమస్యను ‘వృద్ధుల సంక్షోభం’గా లెక్కిస్తారు. భారత జాతీయ జనాభా కమిషన్ (ఎన్సీపీ) 2021 లెక్కల ప్రకారం, కేరళలో ఇది ఇప్పటికే 26.1 శాతంగా ఉంది. తమిళనాడు (20.5), హిమాచల్ ప్రదేశ్ (19.6), ఏపీ (18.5) శాతాలు కూడా అధికంగానే ఉన్నాయి. 2036 నాటికి అవి మరింత గణనీయంగా పెరగటం ఖాయంగా కనిపిస్తోంది. సంతానన్పోత్తి రేటును, తద్వారా జనాభాను నియంత్రించినందుకు, సదరు కుటుంబాల్లో లభించే ఆ ప్రయోజనం... వృద్ధుల పోషణ, వారి ఆరోగ్య పరిరక్షణలోనే కరిగిపోతోందనే వాదన బలంగా వినిపిస్తోంది.కట్టడి చేసినందుకు కనీస స్థానాలా?2026 తర్వాతి జనాభా లెక్కల ఆధారంగా దేశంలో నియోజక వర్గాల పునర్విభజన జరగాల్సి ఉంది. రాష్ట్ర విభజన చట్ట నిర్దేశ్యం ప్రకారం ఏపీ, తెలంగాణల్లోనూ సంఖ్య పెంపుతో పునర్విభజన జరగాల్సి ఉంది. దేశవ్యాప్తంగా గడువు లోపల జనాభా తాజా లెక్కలు అందించడానికి వీలుగా జనగణన ప్రక్రియ సత్వరం చేపట్టనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే ప్రకటించింది. దశాబ్దానికి ఒకసారి జరిపే జనగణన, పాత సంప్రదాయం ప్రకారం 2020లో మొదలు కావాల్సింది. కోవిడ్ మహమ్మారి వల్ల అది వాయిదా పడింది. ఇప్పుడు 2025లో చేపట్టి, పదేళ్ల సైకిల్ని (ఇదివరకటిలా 2021 –2031 కాకుండా 2025 –2035గా) మారుస్తున్నారు. జనాభా వృద్ధి రేటు తీరుతెన్నుల్ని బట్టి కె.ఎస్. జేమ్స్, శుభ్ర కృతి జరిపిన అధ్యయనం ప్రకారం, వచ్చే పునర్విభజనతో ఉత్తరాది రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య పెరు గనుండగా దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గనుంది. ఉత్తరప్రదేశ్ (12), బిహార్ (10), రాజస్థాన్ (7) లలో లోక్‌సభ నియోజకవర్గాలు పెరుగ నున్నాయి. తమిళనాడు (9), కేరళ (6), ఏపీ (5) లలో తగ్గనున్నాయి. జాతీయ జనాభాలో వాటా పెరుగుదల, తరుగుదలను బట్టి ఈ సంఖ్య మారనుంది. ‘ఎక్కువ పిల్లలు కలిగిన తలిదండ్రులకు ప్రోత్సాహకాలివ్వాలి, ఆ మేరకు చట్టం తేవాలని నేను ఆలోచిస్తున్నాను’ అంటూ ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల అన్నారు. ఇటువంటి పంథా మంచిది కాదనీ, దాని వల్ల ఏ మంచీ జరుగదనేది ప్రపంచ వ్యాప్తంగా రుజువైన అంశమనీ సామాజికవేత్తలు అంటున్నారు. ప్రభుత్వాలిచ్చే ప్రాత్సాహకాలు అదనంగా పుట్టే సంతాన పోషణ, వారి విద్య –వైద్య అవసరాలు తీర్చవనీ, అధిక సంతానం కుటుంబ జీవన ప్రమాణాల పతనానికే కారణమవుతుందనీ విశ్లేషణలున్నాయి.ఈ పరిణామాలను ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకొని ప్రత్యా మ్నాయ చర్యలు చేపట్టాలి. జానాభా వృద్ధిని నిలుపుదల చేసిన వారిని ప్రోత్సహించేలా నిర్ణయాలుండాలి. సరైన జనాభా నిష్పత్తి ఉండేలా చూడాలి. వయసు మళ్లినవారు ఆయా కుటంబాలకు భారం కాకుండా సార్వత్రిక సాంఘిక భద్రతా పథకాలు ఉండాలి. ‘పనిచేసే వయసు’ కాలం నిడివి పెరిగేట్టు జీవన ప్రమాణాల వృద్ధికి చర్యలు తీసుకోవాలి. జనాభా నియంత్రణ తప్పు కాదు. ముసలితనం శాపం కాకూడదు. మంచి పనులకు ప్రోత్సాహం ఉండాలే తప్ప, శిక్షలు ఉండకూడదు.దిలీప్ రెడ్డి వ్యాసకర్త ‘పీపుల్స్ పల్స్’ రిసెర్చ్ సంస్థ డైరెక్టర్ -
ఎట్టకేలకు కదలిక?!
నాలుగేళ్ళ జాప్యం తరువాత ఎట్టకేలకు రథం కదులుతున్నట్టుంది. దేశంలో పదేళ్ళకు ఒకసారి చేయాల్సిన జనగణన ఎలాగైతేనేం వచ్చే 2025లో ముందడుగేసే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్ర సర్కార్ అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్టు వినిపిస్తోంది. 2026 మార్చి నాటికి ఆ గణాంకాలు అందుబాటులోకి వస్తాయట. 2011 తర్వాత మళ్ళీ ఇన్నేళ్ళకు జరగనున్న ఈ జనగణన, అది అందించే సమాచారం విధానపరమైన నిర్ణయాలు తీసుకొనేందుకు కీలకం. అందుకే, ఇప్పటికైనా ఈ బృహత్ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టాలనుకోవడం ఆహ్వానించదగిన విషయం. ప్రజా సంక్షేమ పథకాల రూపకల్పనతో పాటు పలు రాజకీయ నిర్ణయాలకూ ఈ జనగణన భూమిక కానుంది. జనగణనతో పాటు పనిలో పనిగా కులగణన కూడా జరపాలనే డిమాండ్ ఊపందుకుంది. అలాగే, ఇకపై 2025ను ప్రాతిపదికగా తీసుకొని ప్రతి దశాబ్దం మొదట్లో జరపాల్సిన జనగణన తాలూకు కాలరేఖను 2035, ’45... అలా మారుస్తారనే మాటా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. అవసరమైతే అఖిలపక్ష భేటీ జరపాలనే వాదన వస్తున్నది అందుకే. 1881 నుంచి నిర్వహిస్తున్న ఈ జనాభా లెక్కల ప్రక్రియ అసలు 2021లోనే జరగాల్సింది. అయితే, రాజ్యాంగ రీత్యా కేంద్రం పరిధిలోని ఈ ప్రక్రియను కోవిడ్–19 కారణంగా సర్కారు వాయిదా వేసింది. ఆ పైన కరోనా పోయినా ఈ బృహత్తర బాధ్యత నెరవేర్చడానికి మోదీ సర్కార్ ఎందుకో ఉత్సాహం చూపలేదు. పాత కాలపు జనాభా లెక్కలతో ప్రస్తుత ప్రజా అవసరాలను ఎలా తెలుసుకుంటారన్న విమర్శలకూ గురైంది. ఎందుకంటే, కేవలం తలల లెక్కగా కాక జనాభా హెచ్చు తగ్గుల ధోరణులతో పాటు, సామాజిక, ఆర్థిక పరిస్థితులను సైతం అర్థం చేసుకోవడానికి జనగణన కీలకసూచిక. ప్రభుత్వ ప్రాధాన్యాల నిర్ణయం, వనరుల కేటాయింపు, సంక్షేమ పథకాల రూపకల్ప నకు ఉపకరించే సమగ్ర సమాచార సమాహారం. దేశంలోని సంక్లిష్టమైన సామాజిక సమస్యల పరిష్కారానికి ఓ కరదీపిక. కచ్చితమైన సమాచారం ద్వారానే విద్య, వైద్యం, గృహనిర్మాణం, ప్రాథమిక వసతుల్లో అన్ని ప్రాంతాల్లో సమానాభివృద్ధికి సర్కారు జోక్యం చేసుకొనే వీలుంటుంది. అదే సమయంలో రాజకీయ పర్యవసానాలూ అనేకం. నియోజకవర్గాల పునర్విభజనకూ, జనాభా లెక్కలకూ లింకుంది. ‘‘2026 తరువాత జరిగే తొలి జనగణన’’ ఆధారంగా చట్టసభలలో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని 2002లోనే అప్పటి వాజ్‌పేయి సర్కార్ నిర్ణయించింది. అందువల్ల రాజకీయాల రూపురేఖలను మార్చే జనగణన చర్చోపచర్చలకు కారణమవుతోంది. బీజేపీకి ఆది నుంచి దక్షిణాది కన్నా ఉత్తరాదిలోనే బలం, బలగం ఎక్కువ. జనగణన అనంతరం జనసంఖ్య ఆధారంగా పునర్విభజన జరిగితే... కట్టుదిట్టంగా జనాభా నియంత్రణ చర్యలు చేపట్టిన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయి. పార్లమెంట్ స్థానాల సంఖ్య దక్షిణాదిలో తగ్గి, ఉత్తరాదిలో పెరుగు తుంది. అది కాషాయపార్టీకి అనుకూలంగా మారుతుందనే అనుమానం ఉంది. ప్రజాస్వామ్యమంటే ప్రజాసంఖ్యకు సిసలైన రీతిలో ప్రాతినిధ్యం వహించాలన్నది నిజమే. అంత మాత్రాన కుటుంబ నియంత్రణ పాటించనందుకు గాను అధికారం ఉత్తరాది వైపు మొగ్గడమూ సమర్థనీయం కాదు. 1951 నుంచి మన జనగణనలో ఎస్సీ, ఎస్టీలు మినహా మిగతా కులాల లెక్కలు వేయడం లేదు. కానీ, కులాల వారీ జనాభా ఆధారంగా మెరుగైన ప్రాతినిధ్యం, వనరుల కేటాయింపు జరగాలన్నది దీర్ఘకాలిక డిమాండ్. ఈ న్యాయమైన ప్రజాకాంక్షను కేంద్రం ఇప్పటికైనా పట్టించుకొని తీరాలి. అలాగే, లెక్కల్లో ఆడవాళ్ళ సంఖ్య తేలడంతో చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ అమలుకు మెరుగైన ప్రాతిపదిక సిద్ధమవుతుంది. వీటి వల్ల సామాజిక న్యాయం, సమ్మిళిత ఆర్థిక పురోగతి, స్త్రీ – పురుష సమానత్వ స్పృహతో విధాన నిర్ణయానికీ వీలు చిక్కుతుంది. పైగా, ఈ పర్యాయం జనాభా లెక్కలు తొలిసారిగా డిజిటల్ విధానంలో జరగనున్నందున వివరాలు, విశేషాలు మరింత నిక్కచ్చిగా, వేగంగా అందవచ్చు. సాధారణంగా ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య ముందస్తు పరీక్షగా జనాభా లెక్కల సన్నాహక ప్రక్రియ జరుపుతారు. మరుసటేడు ఫిబ్రవరిలో అసలు లెక్కలు జరుపుతారు. 2021 జనాభా లెక్కల కోసం 2019లోనే ఆ ప్రీ–టెస్ట్ జరిపినా, జాప్యమైనందున మళ్ళీ ప్రీ–టెస్ట్ జరపవచ్చు. అధికారిక ప్రకటనతోనే ఈ సందేహాలకు సమాధానాలు దొరుకుతాయి. అత్యవసరం, అనివార్యమైనప్పటికీ, జనగణన అంశంలో దేశంలో చేపట్టాల్సిన చర్యలూ కొన్ని ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజనలో ఒకరికి మోదం, వేరొకరికి ఖేదం కలగరాదంటే... అమెరికా ఫక్కీలో మన వద్దా వివిధ రాష్ట్రాల మధ్య విద్య, ఉపాధి నిమిత్తం అంతర్గత వలసలను ప్రోత్సహించడం జనసంఖ్య సమతుల్య పంపిణీకి ఒక మార్గమని నిపుణుల మాట. అదే సమయంలో స్థానిక భాష, సంస్కృతుల్లో వలసదారులు కలగలసిపోయేలా ఇంగ్లీషు, హిందీ, స్థానిక భాష – అనే త్రిభాషా సూత్రాన్ని దేశవ్యాప్తంగా అనుసరించాలని మరో సూచన. హిందీ మాట్లాడే ఉత్తరాది రాష్ట్రాల వారు సైతం కచ్చితంగా మరో భారతీయ భాష నేర్చుకోవాలనే నియమం ద్వారా భాష, ప్రాంతాలకు అతీతంగా అందరినీ దగ్గర చేయవచ్చు. వెరసి, సమతుల్య జనాభా పంపిణీ, సాంస్కృతిక స్నేహవారధి సాయంతో ఆర్థికంగా, సామాజికంగా సంతులిత ప్రాంతీయాభివృద్ధికి బాటలు వేయవచ్చు. ఈసారికి 2025లో చేసినా, ఇకపై మునుపటిలానే ప్రతి దశాబ్ది ఆరంభంలోనే ఈ ప్రక్రియ చేపట్టడం మేలు. ఏమైనా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలి. ప్రాంతీయ ప్రయోజనాల్లో సమతూకం పాటించాలి. పరస్పర విశ్వాసంతో పాటు పూర్తి చిత్తశుద్ధి అందుకు అవసరం. -
ఆమెకు ఆహ్వానం
తరం మారుతోంది.. జనం అభిప్రాయం మారుతోంది... అబ్బాయే కావాలి.. వంశానికి వారసుడు ఉండాలనే ధోరణిలో మార్పు వస్తోంది. ఆడ, మగ.. ఎవరైనా చాలు అనే ఆలోచన పెరుగుతోంది.. లింగ నిష్పత్తి సమానత్వం దిశగా సమాజం వడివడిగా అడుగులు వేస్తోంది..మన దేశంలో ఆది నుంచి పురుషాధిక్యత ఎక్కువ. అబ్బాయి ఇంటిపేరు నిలబెడతాడు.. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూసుకుంటాడు.. పున్నామ నరకం నుంచి తప్పించాలంటే పుత్రుడు ఉండాలి.. అమ్మాయి అయితే కట్న, కానుకలిచ్చి పెళ్లి చేయాలి.. వివాహంతో తల్లి ఇంటితో రుణం తీరిపోతుంది.. లాంటి ఆలోచన చాలా మందిలో నాటుకుపోయింది. ఈ నేపథ్యంలో లింగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి వచి్చనప్పుటి నుంచి ఆడ శిశువుల హత్యలు పెరిగాయి. లక్షల మంది ఆడ శిశువులు అమ్మ కడుపులోనే కన్నుమూశారు. అయితే ఇప్పుడు ఈ ధోరణి మారుతోంది.. అమ్మాయి ఐనా.. అబ్బాయి ఐనా ఓకే అంటూ యువతరం స్వాగతం పలుకుతోంది. ఆడ శిశువుల కంటే మగ శిశువుల నిష్పత్తి ఎక్కువగా ఉండే పరిస్థితి క్రమేపీ మారుతోంది. దేశంలో లింగ సమానత్వం దిశగా అడుగులు పడుతున్నట్లు, మహిళా జనాభా పెరగనున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన అంచనా గణాంకాలు ధ్రువీకరిస్తున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి వెయ్యి మంది పురుషులకు 943 మహిళలు ఉండగా, 2036 వరకల్లా ఇది 952కు వృద్ధి చెందుతుందని గణాంకాలు చెబుతున్నాయి. కేంద్ర గణాంకాల ప్రకారం.. 2036 నాటికి దేశ జనాభా 152.2 కోట్లకు చేరుతుంది. మొత్తం జనాభాలో స్త్రీల శాతం 48.5 నుంచి 48.8కి పెరగనుంది. పదేళ్లలోపు చిన్నారుల సంఖ్య గణనీయంగా పడిపోవడంతో పాటు వృద్ధుల సంఖ్య పెరుగుతుందని స్పష్టం చేసింది. కాగా లింగ నిష్పత్తి, పని చేసే యువత, జననాల రేటుకు సంబంధించిన పలు ఆసక్తికర గణాంకాలను కేంద్రం వెల్లడించింది. -
ఎట్టకేలకు ఒక కదలిక
రథం కదులుతోంది. ఎప్పుడో జరగాల్సిన పనిలో ఇప్పటికైనా అడుగులు ముందుకు పడుతున్నాయి. దేశంలో జనాభా లెక్కల పని ఎట్టకేలకు మరికొద్ది రోజుల్లోనే సెప్టెంబర్‌లో ఆరంభ మవుతోంది. ఆ మేరకు ఇటీవల వెలువడ్డ సమాచారం పెద్ద ఊరట. ప్రతి పదేళ్ళకు ఒకసారి జరగాల్సిన ఈ జనగణన యజ్ఞం నిజానికి 2021లోనే జరగాల్సి ఉంది. కోవిడ్ సహా అనేక సాకులతో ప్రభుత్వం సాచివేత ధోరణి ప్రదర్శిస్తూ వచ్చింది. అయితే, భారత్ లాంటి వర్ధమాన దేశానికి జనగణన మినహా ప్రత్యామ్నాయ మార్గాలలో ఆ స్థాయి సమాచారం అందుబాటులో లేదు. ఉన్నా అది అంత నమ్మదగినదీ కాదు. అందుకే జనాభా పరంగా, సామాజిక – ఆర్థికపరంగా దేశ సమగ్ర స్వరూపాన్ని ఆవిష్కరించడానికి కొన్ని దశాబ్దాలుగా జనగణన అత్యంత కీలకమైనది.అలాంటి జనగణన ప్రక్రియ ఇప్పుడు మళ్ళీ పట్టాలెక్కుతోంది. వచ్చే నెల (సెప్టెంబర్)లో ఆరంభ మయ్యే ఈ ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు ఏణ్ణర్ధ కాలం పడుతుందని ప్రభుత్వం మాట. జనగణన అనేది పలువురు పొరబడుతున్నట్టు కేవలం గణాంకాల సేకరణ కాదు. అది సుపరి పాలనకు మూలస్తంభం. దేశం ఎదుర్కొనే సామాజిక, ఆర్థిక సవాళ్ళకు పరిష్కారాలు కనుగొనేందుకు మార్గదర్శి. పట్టణీకరణ, ప్రాథమిక వసతుల అభివృద్ధి మొదలు సాంఘిక సంక్షేమం, ఆర్థిక ప్రణాళిక వరకు ప్రతి అంశం పైనా సరైన విధాన నిర్ణయాలకు ఈ సమాచారమే కీలకం. నిజానికి, జనాభా లెక్కల సేకరణలో కేంద్ర సర్కార్ చేసిన సుదీర్ఘ జాప్యం చాలాకాలంగా విమర్శలకు గురవుతోంది. ప్రైవేట్వారే కాదు... సర్కారీ ఆర్థిక నిపుణులు సైతం విమర్శకుల్లో ఉండడం గమనార్హం. పాత జనాభా లెక్కల ఆధారంగానే ఇప్పటికీ ఆరోగ్యం, ఆర్థిక అంశాలు, చివరకు ద్రవ్యోల్బణం రేటు, ఉపాధి లెక్కల లాంటివన్నీ గణిస్తూ ఉండడం వల్ల కచ్చితత్వం లోపిస్తోంది. డేటా లోపంతో కనీసం 15 కీలక అంశాలపై దుష్ప్రభావం పడింది. అదే ఈ నిపుణులందరి బాధ. పుష్కర కాలం క్రితపు లెక్కలపై ఆధారపడే సరికి అంతా లోపభూయిష్టమైంది. దాదాపు 10 కోట్ల మంది పౌర సరఫరా వ్యవస్థకు వెలుపలే ఆహారభద్రత లేకుండా మిగిలిపోయారు. ఇళ్ళు, శ్రామికుల సంఖ్య ఆధారంగా రాష్ట్రాలకు కేంద్రం కేటాయించే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులపైనా దెబ్బ పడింది. చివరకు నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ వారి సర్వేల నాణ్యత కూడా దెబ్బతింది. అంతెందుకు... జనాభాలో చైనాను భారత్ దాటేసి, ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా అవతరించినట్టు ఐరాస నివేదిక గత ఏడాది ప్రకటించింది. దాన్ని ఖరారు చేయడానికో, కాదనడానికో, ఆ జనాభా లెక్కకు అనుగణంగా అవసరమైన చర్యలు చేపట్టాడానికో కూడా మన వద్ద నిర్దుష్టమైన గణాంకాలు లేని పరిస్థితి. అలాంటి లోపాలన్నీ సరిదిద్దుకోవడానికి ఇప్పుడిది సదవకాశం. అదే సమయంలో జనగణనలో భాగంగా మన జనాభా తాలూకు కులగణన కూడా చేయడం అత్యవసరం. దేశంలోని ప్రధాన పార్టీలన్నీ కోరుతున్నది అదే. తద్వారా జనసంఖ్యలో ఏ సామాజిక వర్గం వంతు ఎంత, ఏయే వర్గాల స్థితిగతులు ఏమిటి, ఏ వర్గాలు ఎంతగా వెనకబడి ఉన్నాయి తదితర భోగట్టా తేటతెల్లమవుతుంది. కులాలు, ఉపకులాలతో పాటు వర్తమానంలో కనుమరుగైపోతున్న ఆశ్రిత కులాల లెక్కలూ వెలికివస్తాయి. వెనుకబడిన వర్గాలకు చేయూతనిచ్చేలా పాలకులు పాలసీలు చేయడానికీ వీలవుతుంది. ప్రణాళిక, పాలన, చట్టాల రూపకల్పన సహా అనేక ప్రభుత్వ కార్యక్రమాలపై సమీక్షకూ, నిర్వహణకూ ఈ సమాచారమంతా ఉపకరిస్తుంది. తాజా జనగణన రాజకీయంగానూ ప్రధానమే. దేశంలోని అన్ని స్థాయుల చట్టసభలలో నియో జక వర్గాల పునర్విభజన, రిజర్వేషన్‌కు ఈ కొత్త లెక్కలే ఆధారమవుతాయి. అంటే, అసెంబ్లీ, పార్ల మెంట్ స్థానాల సంఖ్య మారిపోనుంది. ఈ లెక్కన దక్షిణాదితో పోలిస్తే జనాభా నియంత్రణ అంతగా లేని ఉత్తరాదిలో మరిన్ని చట్టసభా స్థానాలు వస్తాయి. ఫలితంగా అధికార సమీకరణాలూ మారి పోతాయి. ఇంతటి ముఖ్యమైనది కాబట్టే... ఇలాంటి అధికారిక గణాంక వ్యవస్థను ప్రభుత్వ, రాజ కీయ జోక్యాలకు వీలైనంత దూరంగా ఉంచడం శ్రేయస్కరం. మారిన కాలానికి అనుగుణంగా కొత్త జనగణన రూపురేఖలూ మారుతున్నాయట. ప్రధానంగా డిజిటల్ పద్ధతిలో, అదీ స్వీయ నమోదు పద్ధతిలో జనగణన సాగనుంది. గతంలో స్త్రీ, పురుషుల వివరాలనే దఖలు పరిస్తే, ఇప్పుడు తొలి సారిగా ట్రాన్స్జెండర్ల వివరాలనూ ప్రత్యేకంగా నమోదు చేయనున్నారు. అలాగే, ఎస్సీ, ఎస్టీలే కాక ‘ఇతర వెనుకబడిన వర్గాలు’ అంటూ వివరాలు విడిగా నింపనున్నారట. ఏమైతేనేం, ఇన్నేళ్ళ తరువాతైనా జనాభా లెక్కల ప్రక్రియను మళ్ళీ చేపట్టడం హర్షణీయం. అతి ముఖ్యమైన బృహత్ యజ్ఞాన్ని ఇక నుంచైనా ఎప్పటికప్పుడు నిర్ణీత సమయానికే నిర్వహించడం అత్యవసరం. తద్వారానే కచ్చితమైన డేటా దేశంలో పాలనా యంత్రాంగానికి అందుబాటులోకి వస్తుంది. 2026 మార్చి కల్లా ఈ జనగణన ఫలితాలను సమర్పించేందుకు కేంద్ర శాఖలు ఇప్పటికే నిర్ణీత కాలవ్యవధి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. దీంతో, 2011 నుంచి అప్పటి దాకా... అంటే 15 ఏళ్ళ కాలవ్యవధిలోని సమాచారం చేతిలోకి వస్తుంది. అయితే, ఈసారి జరిగిన జాప్యం నుంచి పాఠాలు నేర్చుకోవాలి. దేశం ముందుకు సాగడానికి దాని సమూహ స్వరూప స్వభావాలు దానికైనా తెలిసి ఉండడం ముఖ్యం. అలాంటి సమాచార సేకరణ, వినియోగంలో అంతరాయాలు రాకుండా జాగ్రత్తపడాలి. ఊహించని ఆటంకాలు ఎదురైనా ఇబ్బంది పడకుండా ఉండేలా జనాభాపై సమగ్ర సమాచారం అందించే కట్టుదిట్టమైన వ్యవస్థలను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి ప్రయత్నాలు జరగడానికి ఇదే తరుణం. -
State of World Population- 2024: భారతదేశ జనాభా 144.17 కోట్లు!
న్యూఢిల్లీ: భారతదేశ జనాభా 144.17 కోట్లకు చేరినట్లు ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్(యూఎన్ఎఫ్పీఏ) అంచనా వేసింది. ఈ మేరకు స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్–2024 నివేదికను విడుదల చేసింది. ఇండియాలోని మొత్త జనాభాలో 24 శాతం మంది 14 ఏళ్లలోపువారే ఉన్నారని వెల్లడించింది. 10 నుంచి 19 ఏళ్లలోపు వారు 17 శాతం, 10 నుంచి 24 ఏళ్లలోపువారు 26 శాతం, 15 నుంచి 64 ఏళ్లలోపు వయసున్నవారు 68 శాతం మంది ఉన్నారని వివరించింది. 65 ఏళ్లు దాటినవారు దేశ జనాభాలో 7 శాతం ఉన్నట్లు తెలిపింది. ఇండియాలో పురుషుల్లో సగటు జీవన కాలం 71 ఏళ్లు కాగా, మహిళల్లో 74 ఏళ్లుగా ఉన్నట్లు పేర్కొంది. దేశంలో జనాభా మరో 77 సంవత్సరాల్లో రెట్టింపు కానుందని తెలియజేసింది. భారత్ పొరుగుదేశమైన చైనాలో జనాభా 142.5 కోట్లకు చేరినట్లు పేర్కొంది. -
భారత్, యూఎస్.. ఓటర్ల శక్తిని పెంచే కొత్త సంవత్సరం 2024
ప్రపంచంలో అతిపెద్ద జనతంత్ర రాజ్యం ఇండియాలో, అత్యంత ఉత్కృష్ట ప్రజాస్వామ్య దేశంగా పరిగణించే అమెరికాలో 2024లో కేంద్ర ప్రభుత్వాలను ఎన్నుకోవడానికి ఓటర్లు అప్పుడే సిద్ధమౌతున్నారు. ఈ జాతీయ ఎన్నికల్లో ఏయే అంశాల ఆధారంగా తాము ఓటేయాలో ఆలోచించడం మొదలుబెట్టారు. ఎన్నెన్నో వ్యత్యాసాలున్న ఈ రెండు విశాల దేశాలనూ కలిపే అంశం ఎన్నికల ద్వారా నడిచే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యమే. నిజానికి అమెరికా జనాభా 33 కోట్ల 49 లక్షలని, భారతదేశం జనసంఖ్య 142 కోట్లు దాటిందని ఈ ఏడాది తెలిసింది. ఇక భూభాగం విషయానికి వస్తే–ఇండియా కన్నా అమెరికా వైశాల్యం మూడు రెడ్లు ఎక్కువ. ఇతర దేశాల ప్రజలు లక్షల సంఖ్యలో వలసొచ్చి అమెరికాలో స్థిరపడడానికి అవసరమైన చోటు, టెక్నాలజీ, ఉపాధి అవకాశాలు, ఇతర వనరులు పుష్కలంగా ఉన్నాయి. ప్రపంచంలో ఓటర్ల సంఖ్య విషయంలో ఇండియా ప్రథమ స్థానంలో ఉంది. అన్ని పార్లమెంట్లకు మాతృక అని వర్ణించే బ్రిటిష్ పార్లమెంటు ఉన్న యునైటెడ్ కింగ్డమ్ తర్వాత ఆ దేశ సంపర్కంతో ప్రజాస్వామ్య వ్యవస్థ వేళ్లూనుకుంది అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో. ‘కొత్త ప్రపంచం’గా అభివర్ణించే అట్లాంటిక్ మహాసముద్రం ఆవల ఉన్న ఈ సువిశాల అమెరికాలో ఎన్నికల ప్రజాస్వామ్యం ఆ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 12 సంవత్సరాలకు ఆరంభమైంది. అక్కడ మొదటి అధ్యక్ష ఎన్నికలు 1788 డిసెంబర్ 15న మొదలై 1789 జనవరి 7న ముగిశాయి. ప్రథమ అధ్యక్షుడిగా స్వాతంత్య్ర సేనాని జార్జి వాషింగ్టన్ ఎన్నికయ్యారు. అప్పటి నుంచీ 2020 ఎన్నికల వరకూ ఈ అత్యంత సంపన్న దేశంలో (ప్రతి నాలుగేళ్లకూ) 59 సార్లు జరిగాయి. వచ్చే ఏడాది నవంబర్ 5న 60వ అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ జరుగుతుంది. ఇండియాతో పోల్చితే 163 ఏళ్ల ముందే ఎన్నికల ప్రజాస్వామ్యం అమల్లోకి వచ్చిన కారణంగా మనకు వింతగా కనిపించే ప్రజాస్వామ్య సాంప్రదాయాలు అమెరికాలో కనిపిస్తాయి. అధ్యక్ష ఎన్నికల పోలింగ్ తేదీ కూడా ఇలాంటిదే. 18వ శతాబ్దం చివరిలో అమెరికాలోని వ్యవసాయ పనులు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని నవంబర్ మాసంలో తొలి సోమవారం తర్వాత వచ్చే మొదటి మంగళవారంనాడు ఎన్నికల పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. అందుకే ప్రతిసారీ నవంబర్ 7 లోపే అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరగడం చూస్తున్నాం. ఇండియాలో రాజ్యాంగం అమలులోకి వచ్చిన రెండేళ్లకే ఎన్నిక ప్రజాస్వామ్యం.. అమెరికాలో రాజ్యాంగ రచన పూర్తయి, మొదటి సాధారణ ఎన్నికలు జరిపించడానికి పుష్కర కాలం పట్టింది. కానీ, ఇండియాలో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన (1950 జనవరి) నాటి నుంచి రెండేళ్లలోపే అంటే 1951 అక్టోబర్ 25న తొలి సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ మొదలైంది. 1952 ఫిబ్రవరి 21న ముగిసింది. నాటి పరిస్థితులు, విస్తృతమైన ఎన్నికల నిర్వహణ అనుభవం లేకపోవడంతో ప్రథమ సాధారణ ఎన్నికలకు దాదాపు నాలుగు నెలల కాలం అవసరమైంది. ఇప్పుడేమో ఎన్నికలు ప్రశాంతంగా, సాఫీగా జరగడం కోసం నెల రోజుల సమయం పడుతోంది. 2019 పార్లమెంటు ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయడానికి నెలపైన వారం రోజుల సమయం అవసరమైంది. ఈ రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాలకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం విషయం ఓటర్ల నమోదు ప్రక్రియ. ఇండియాతో పోల్చితే పోలింగ్ శాతం బాగా తక్కువ ఉండే అమెరికాలో పోలింగ్ రోజు కూడా పొద్దున్నే ఓటరుగా నమోదు చేయించుకుని, తర్వాత ఓటు వేసే వెసులుబాటు అక్కడి పౌరులకు కల్పించారు. భారత్‌లో నిర్ణీత గడువులోగా ఓటరుగా నమోదు చేయించుకోవాల్సిన పరిస్థితి. అలాగే, అమెరికాను దాదాపు 525 ఏళ్ల క్రితం క్రిస్టఫర్ కొలంబస్ కనిపెట్టినప్పటి నుంచీ అక్కడికి ఏటా లక్షలాది ప్రపంచదేశాల ప్రజలు వచ్చి స్థిరపడుతూనే ఉన్నారు. ఇలా ఉన్నత విద్య, ఉపాధి కోసం వచ్చిన వారందరికీ వెంటనే పౌరసత్వం రాదు. కోరుకోకపోతే కొందరికి ఎప్పటికీ రాకపోవచ్చు కూడా. ప్రధానంగా పని, నివాసం, ఇతర అంశాల వల్ల పౌరసత్వం వచ్చిన (నేచురలైజేషన్) వ్యక్తులు మొదట చేసే పని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయడం. ఎన్నికల్లో ఓటు వేయడాన్ని– తమ కృషిని గుర్తించి తమకు పౌరసత్వం ఇచ్చిన అమెరికా రుణం తీర్చుకోవడంలో భాగంగా ఈ పూర్వ వలసదారులు భావిస్తారు. ఇతర దేశాల నుంచి వలసవచ్చిన వారికి అత్యధిక సంఖ్యలో 2022లో అమెరికా పౌరసత్వం లభించిందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కిందటేడాది నేచురలైజేషన్ ప్రక్రియ ద్వారా రికార్డు స్థాయిలో దాదాపు పది లక్షల మంది అమెరికా పౌరసత్వం పొందారు. ఈ నూతన పౌరులందరికీ 2024 నవంబర్ 5 ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లభించింది. ఓటు వేయడాన్ని తమ శక్తిగా, దేశం రుణం తీర్చుకునే క్రియలో భాగంగా పరిగణించడం నిజంగా మంచి భావనే. ఈ సూత్రం ఇండియాకు కూడా వర్తిస్తుంది. వెస్సార్సీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి -
Insurance: బీమా కూడా లేకుండా కోట్ల మంది!
ముంబై: బీమా విస్తరణకు ప్రభుత్వం, బీమా రంగ అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) ఎంతో కృషి చేస్తున్నప్పటికీ, దేశ జనాభాలో 95 శాతం మందికి బీమా రక్షణ లేదని నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీ ఓ నివేదికలో తెలిపింది. ఈ నివేదికను ఐఆర్డీఏఐ చైర్మన్ దేవాశిష్ పాండా ఆవిష్కరించారు. యూపీఐ, బ్యాంక్ ఖాతాలు, మొబైల్ ఫోన్ల విస్తరణకు దోహదపడిన చర్యలను అనుసరించాలని బీమా పరిశ్రమకు ఆయన సూచించారు. ఈ నివేదికలో పేర్కొన్నట్టు అధిక రిస్క్ ఉన్న ప్రాంతాల్లో విపత్తుల ఇన్సూరెన్స్ తీసుకోవడాన్ని తప్పనిసరి చేయాలని అభిప్రాయపడ్డారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి నూరేళ్లు పూర్తి చేసుకునే నాటికి అందరికీ బీమా లక్ష్యాన్ని చేరువ చేసేందుకు ఇది అవసరమన్నారు. దేశ జనాభా 144 కోట్లలో 95 శాతం మందికి బీమా కవరేజీ లేని విషయాన్ని ఈ నివేదిక ప్రధానంగా ప్రస్తావించింది. ప్రకృతి విప్తతులు పెరిగిపోయిన క్రమంలో బీమా కవరేజీ ప్రాధాన్యాన్ని ఈ నివేదిక ఎత్తి చూపించింది. రుణానికి బీమా లింక్ దిగువ, మధ్యాదాయ వర్గాల్లో 84 శాతం మంది, తీర ప్రాంతాలు, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో 77 శాతం మందికి ప్రాపర్టీ ఇన్సూరెన్స్ లేదని ఈ నివేదిక తెలిపింది. బ్యాంకు రుణాలు తీసుకున్న రైతులు క్రాప్ ఇన్సూరెన్స్ తీసుకోవడాన్ని తప్పనిసరి చేయాలని తన నివేదికలో నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీ సూచించింది. నిజానికి బీమా తీసుకున్న వారిలోనూ కవరేజీ సమగ్రంగా లేని అంశాన్ని ప్రస్తావించింది. ఇదీ చదవండి: LIC Credit Card: ఎల్ఐసీ నుంచి క్రెడిట్ కార్డు.. భలే బెనిఫిట్స్! జీవిత బీమా రక్షణలో 87 శాతం అంతరం (వాస్తవ కవరేజీ–తీసుకున్న దానికి మధ్య) ఉందని, ఇది గణనీయమైన వ్యాపార అవకాశాలు వీలు కల్పిస్తుందని తెలిపింది. అలాగే, 73 శాతం మందికి హెల్త్ ఇన్సూరెన్స్ రక్షణ లేదని వెల్లడించింది. ప్రభుత్వం, ఎన్జీవోలు, పరిశ్రమ కలసి సూక్ష్మ ఆరోగ్య బీమా పథకాలను రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. యాన్యుటీ, పెన్షన్ ప్లాన్లలో కవరేజీ అంతరం 93 శాతంగా ఉందని తెలిపింది. -
జనాభా పెరుగుదల కలిసొచ్చేనా?
చైనాను అధిగమించి, ఇండియా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా నిలిచింది. చాలా దేశాల్లో జనాభా తగ్గిపోతున్న నేపథ్యంలో యువశక్తితో కూడిన భారత్ కొంత ఈర్ష్య పుట్టించేదే. ఇదంతా కూడా యువజనానికి సరైన వేతనాలున్న ఉద్యోగాలు, ఉత్పత్తి అవకాశాలు ఉన్నాయని అనుకున్నప్పుడే. సమస్య మొత్తం ఇక్కడే ఉంది. ఉద్యోగాల్లో వ్యవసాయ రంగ భాగస్వామ్యం ఏకంగా 43 శాతం. చైనాలో ఇది 25 శాతమే. యువజనం ఉత్పాదకత పెరగాలంటే వారు గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు రావాల్సి ఉంటుంది. భారత్ వ్యవసాయ సంబంధిత ఉద్యోగాలను 15 శాతం వరకూ తగ్గించాలనుకుంటే రాగల 25 ఏళ్లలో కనీసం 9.3 కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టించాల్సి ఉంటుంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించింది! ఈ క్రమంలో మనం చైనాను అధిగమించామని ఐక్యరాజ్యసమితి జనాభా డ్యాష్ బోర్డ్ అంచనా వేసింది. 2011 తరువాత దేశంలో జనాభా లెక్కల నిర్వ హణ జరగలేదు కాబట్టి ఐరాస అంచనాలపై మనం ఆధారపడాల్సి వచ్చింది. కోవిడ్ కారణంగా 2021లో నిర్వహించాల్సిన జనాభా లెక్క లను వాయిదా వేసిన విషయం తెలిసిందే. అధికారిక జన గణన ఎప్పుడు జరుగుతుందో ఇప్పటివరకూ ఎలాంటి సూచనా లేదు. జనాభా పెరిగిపోతోందంటే ఒకప్పుడు ఎంతో ఆందోళన వ్యక్తమ య్యేది. కానీ ప్రపంచంలోని చాలా దేశాల్లో జనాభా తగ్గిపోతున్న నేప థ్యంలో యువశక్తితో కూడిన భారత్‌ను కొంత ఈర‡్ష్యతో చూసే సందర్భం! ఐరాస లెక్కల ప్రకారం, దేశ జనాభా సగటు వయసు 28 ఏళ్లు. జనాభాలో సగం కంటే ఎక్కువ మంది వయసు ముప్ఫై ఏళ్ల లోపే. ఉద్యోగం లేదా పని చేసే వయసు 15 – 64 ఏళ్లనుకుంటే అలాంటివాళ్లు 92.5 కోట్ల మంది ఉన్నారు. వీళ్లు ఉత్పత్తి, వినియోగం, ఆదా కూడా బాగా చేయగలరు. అదే సమయంలో వయోవృద్ధుల సంక్షే మానికి పెట్టాల్సిన ఖర్చు తక్కువ. ఇక్కడ మనమో విషయం గుర్తుంచుకోవాలి. పైన చెప్పుకున్న అంచనాలన్నీ ఇతర అంశాలతో ముడిపడి ఉన్నవే. దేశంలోని యువ జనానికి సరైన వేతనాలున్న ఉద్యోగాలు, ఉత్పత్తి అవకాశాలు ఉన్నా యన్నది వీటిల్లో ఒకటి. ఉద్యోగాల ద్వారా వారికి తినేందుకు తగినంత ఆహారం, వినోదాలు అందుతున్నాయనీ, ఆరోగ్యం బాగుందనీ, పనికొచ్చే విద్యతో లాభాలు చేకూరాయనీ అనుకోవాలి. సమస్య మొత్తం ఇక్కడే ఉంది. ఉద్యోగాల్లో వ్యవసాయ రంగ భాగస్వామ్యం ఏకంగా 43 శాతం. చైనాలో ఇది 25 శాతమే. అమెరికాలో రెండు శాతం కంటే తక్కువ మంది ఉద్యోగాల కోసం వ్యవసాయంపై ఆధార పడుతున్నారు. ఒకవేళ భారత్ వ్యవసాయ సంబంధిత ఉద్యోగాలను 15 శాతం వరకూ తగ్గించాలనుకుంటే రాగల 25 ఏళ్లలో కనీసం 9.3 కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టించాల్సి ఉంటుంది. ఉద్యోగాల కల్పన జరగాలి యువజనం ఉత్పాదకత పెరగాలంటే వారు గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు రావాల్సి ఉంటుంది. నగరీకరణ ఫలితంగా నగరాల మౌలిక సదుపాయాలపై ఒత్తిడి పడుతుంది. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితిని గమనిస్తే తయారీ రంగం బలహీనతలు కొట్టొచ్చినట్టు కని పిస్తాయి. మేకిన్ ఇండియా, ఉత్పాదకతతో ముడిపడిన ప్రోత్సాహ కాలు (పీఎల్ఐ) వంటి పథకాలతో అధిగమించే ప్రయత్నం జరిగినా సాధించింది కొంతే. భారత ఆర్థిక వ్యవస్థ మొత్తమ్మీద తయారీ రంగం వాటా 14 శాతం మాత్రమే. చైనాలో ఇది దాదాపు 30 శాతం. ఉద్యోగాల విషయానికి వస్తే గత ఏడాది జూలైలో పార్లమెంటులో అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానమిస్తూ, 2014– 22 మధ్య కాలంలో ప్రభుత్వానికి 22.05 కోట్ల దరఖాస్తులు వచ్చాయనీ, వీటిల్లో నియామక ఉత్తర్వులు అందుకున్నది కేవలం 7.22 లక్షలు లేదా 0.3 శాతం మాత్రమేననీ తెలిపింది. ప్రస్తుతం దేశంలోని యువతకు ఉద్యోగాలు లేకపోవడమే కాదు... నిరాశా నిస్పృహలతో వాటి కోసం ఎదురు చూసే సహనాన్నీ కోల్పోయినట్లు కనిపిస్తోంది. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం, దేశ యువ జనాభాలో 30.7 శాతం అటు చదువుకోడం లేదు... ఇటు ఉద్యోగమూ చేయడం లేదు. అలా గని ఏదైనా శిక్షణ పొందుతున్నారా అంటే అదీ లేదు! గత ఏడాది అక్టోబరులో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం... దేశంలో మునుపటి కంటే ఎక్కువ మంది పిల్లలు బడుల్లోకి చేరుతున్నారు. వదిలిపోయేవారు తక్కువ య్యారు. బోధన నాణ్యత, ఉపాధ్యాయుల సంఖ్యలు గత దశాబ్ద కాలంలో పెరిగాయి. అయితే ప్రాథమిక విద్యా రంగం చాలా సవాళ్లను ఎదుర్కొంటోందనీ, గ్రామీణ ప్రాంతాల్లో సాక్షరతను వృద్ధి చేయడం, అంకెలకు సంబంధించిన నైపుణ్యాన్ని పెంచడం వీటిల్లో కొన్ని మాత్రమేననీ తెలిపింది. ప్రాథమిక విద్యాభ్యాసం సమస్యలు ఒకవైపు అలా ఉండగా... ఉన్నత విద్య పరిస్థితి ఏమంత బాగోలేదు. కొత్త కాలేజీలు బోలెడన్ని పుట్టుకొస్తున్నా, విద్యారంగం పరిశ్రమ స్థాయికి చేరుకున్నా చాలా మంది పట్టభద్రుల నైపుణ్యాల స్థాయి తక్కువగా, కొన్ని సందర్భాల్లో అస్సలు లేకుండా పోయినట్లు బ్లూమ్‌బెర్గ్ విడుదల చేసిన ఒక నివేదిక తెలిపింది. ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటకు ఇవి స్పీడ్ బ్రేకర్లే. దేశం ఎదుర్కొంటున్న ఇంకో ముఖ్యమైన సవాలు పనిచేసే వారిలో మహిళల సంఖ్యను పెంచడం. అంతర్జాతీయ కార్మిక సంస్థ లెక్కల ప్రకారం దేశంలో పని చేస్తున్న లేదా పనికోసం ఎదురు చూస్తున్న (లేబర్‌ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ లేదా ఎల్ఎఫ్పీఆర్) వారు 52 శాతం. మహిళలు అతితక్కువగా (22 శాతం) ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందుతూండటం ఇందుకు కారణం. ఎక్కువమంది భాగస్వాములయ్యే అమెరికాలో ఇది 73, చైనాలో ఇది 76 శాతం. వాస్తవానికి ఈ పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉండవచ్చుననీ, ఎల్ఎఫ్పీఆర్ 40 శాతానికి తగ్గిపోయిందనీ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ చెబుతోంది. మహిళల విషయానికి వస్తే అది కేవలం 19 శాతమేనని తేల్చింది. ఇది సౌదీ అరేబియా (31) కంటే తక్కువ కావడం గమనార్హం. సమస్యల జాబితా ఇక్కడితో ఆగిపోలేదు. ఆరోగ్యంపై దేశం పెడుతున్న ఖర్చు ప్రపంచంలోనే అత్యల్పం. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (2019– 21) చెబుతున్న దాని ప్రకారం, దేశంలో ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న వారిలో 35 శాతం మంది తమ సామర్థ్యానికి తగ్గట్టుగా ఎదగడం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం దేశంలో ప్రతి పదివేల మంది పౌరులకు కేవలం ఐదు ఆసుపత్రి బెడ్లు ఉన్నాయి. చైనాలో ఈ సంఖ్య 43. అలాగే 15–49 మధ్య వయస్కులైన మహిళల్లో సగం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు ప్రయత్నిస్తోందన్న దానికి నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, రోడ్లు, రైల్వే వ్యవస్థలు కొంతవరకూ నిదర్శనంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రజా సేవల విష యంలో మరింత ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరముంది. ఆరోగ్యం, విద్య వంటి రంగాలకు నిధుల కేటాయింపులు తక్కువగా ఉండటం మానవ వనరులపై దుష్ప్రభావం చూపుతుంది. ఇది కాస్తా ఉత్పాదకత తగ్గేందుకు, కార్మికులు, ఉద్యోగాలు చేసే వారిలో నైపుణ్యాల లేమికి దారి తీస్తుంది. జపాన్ , చైనా వంటి దేశాలు తమ జనాభాల కారణంగా ఎదిగేందుకు ఇవే కారణమన్నవి ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. భారత్ కూడా వీటి ఆధారంగానే వృద్ధి పథంలో అగ్రస్థానానికి చేరాలని ఆశిస్తోంది. అయితే జనాభా తీరు తెన్నుల వల్ల వచ్చే లాభాలు వాటంతటవే రావు. సుస్థిర ఆర్థికాభివృద్ధి కావాలంటే వినూత్నమైన విధానాలు, సమర్థమైన అమలు అత్యవ సరమవుతాయి. చైనా విషయాన్నే తీసుకుంటే... కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేయడమే కాకుండా, తయారీ రంగంలో సూపర్ పవర్‌గా ఎదుగుతోంది. అయితే ప్రస్తుతం చైనా జనాభా తగ్గుముఖం పడు తోంది. దీంతో ఆ దేశం ఎదుర్కొనే సవాళ్లూ కూడా మారిపోతాయి. ఈ సవాళ్లలో ప్రధానమైంది తగ్గిపోతున్న కార్మిక శక్తి ఉత్పాదకతను వేగంగా పెంచాల్సిన అవసరం ఉండటం. చైనాకు కొన్ని లాభాలూ ఉన్నాయి. జనాభా తక్కువగా ఉండటం వల్ల పర్యావరణంపై దుష్ప్ర భావం తక్కువగా ఉంటుంది. నిరుద్యోగిత తగ్గి వేతనాలు పెరిగేందుకు దోహదపడవచ్చు. మనోజ్ జోషి డిస్టింగ్విష్డ్ ఫెలో, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
జన ధన భారత్! 2023లో రికార్డు దిశగా.. 1950లో మన జనాభా ఎంతో తెలుసా?
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఈ ఏడాదే భారత్ అవతరించబోతోంది. 2011 తర్వాత మన దేశంలో జనాభా వివరాల సేకరణ జరగలేదు. 2021లో జరగాల్సిన జనాభా లెక్కల సేకరణ కోవిడ్ కారణంగా వాయిదా పడింది. అయితే ఐక్యరాజ్యసమితి (యూఎన్వో) జనాభా లెక్కల కోసం పాటించే సూత్రాన్ని అనుసరించి ప్యూ రీసెర్చ్ సెంటర్ ఈ ఏడాది ఏప్రిల్ నెల నాటికి భారత జనాభా చైనాను అధిగమించనుందని అంచనా వేసింది. ఐక్యరాజ్యసమితి 1950లో ప్రపంచ జనగణన మొదలు పెట్టినప్పటి నుంచీ అధిక జనాభాగల దేశంగా పేరుపడిన చైనా ఇంకో రెండు నెలల్లో ఆ హోదాను కోల్పోబోతోందని ప్యూ రీసెర్చ్ ఇటీవల విడుదల చేసిన రిపోర్ట్‌లో పేర్కొంది. –దొడ్డ శ్రీనివాస్‌రెడ్డి 72 ఏళ్లలో 100 కోట్లు.. ఐక్యరాజ్యసమితి ప్రపంచ జనగణన చేసిన తొలి సంవత్సరం 1950లో భారత జనాభా 35.3 కోట్లు. ఇప్పుడది 140 కోట్లకు చేరినట్లు ‘ప్యూ’అంచనా. అంటే గత 72 ఏళ్లలో దేశ జనాభా 100 కోట్లకుపైగా పెరిగింది. ఇది మొత్తం యూరప్ దేశాల జనాభా (74.4 కోట్లు) కంటే అధికం. ఉత్తర, దక్షిణ, అమెరికా ఖండాల కంటే (100 కోట్లు) కూడా ఎక్కువే. చైనాలో ప్రస్తుత జనాభా 140 కోట్లుగా ఉన్నా.. అక్కడ కొన్నేళ్లుగా జనాభా పెరుగుదల మందగించింది. కానీ భారత్‌లో మాత్రం ఎప్పటి మాదిరిగానే పెరుగుతోంది. యూఎన్వో అంచనా ప్రకారం.. భారత దేశ జనాభా ఈ దశాబ్ధం చివరికి 150 కోట్లకు, 2064 నాటికి 170 కోట్లకు చేరుకుంటుంది. అక్కడి నుంచి జనాభా పెరుగుదల మందగిస్తుంది. యంగ్ ఇండియా ►భారత జనాభాలో 25 ఏళ్ల కన్నా తక్కువ వయసున్నవారు 40 శాతంపైగా ఉన్నారు. జనాభా సగటు వయసు 28 ఏళ్లు. అదే అమెరికాలో 38, చైనాలో 39 ఏళ్లు. అంటే ఇండియాలో ప్రతి పది మందిలో నలుగురికిపైగా పాతిక సంవత్సరాలలోపు వయసువారే. ►మరోవైపు అధిక జనాభా ఉన్న చైనా, అమెరికా దేశాల్లో వయసుపై బడిన వారి సంఖ్య బాగా పెరిగిపోతోంది. 65 ఏళ్లు దాటిన వారు భారత జనాభాలో కేవలం 7.1 శాతం మాత్రమే. వీరి సంఖ్య భారత జనాభాలో 2063 నాటికి 20 శాతం, 2100 నాటికి 30 శాతానికి మాత్రమే పెరుగుతుంది. అంటే ఈ శతాబ్దం చివరి వరకు భారత్ యువ భారతంగానే ఉంటుందన్న మాట. ఇంకా భారతదేశంలో పాతికేళ్లలోపు వారి సంఖ్య 2078 నాటికి కానీ 65 ఏళ్ల పైబడిన వారి సంఖ్యను దాటే అవకాశం లేదన్నది యూఎన్ అంచనా. జననాల్లోనూ వేగమే.. చైనా, అమెరికాలతో పోలిస్తే భారత్‌లో జననాల రేటు కూడా అధికమే. ప్రస్తుతం సగటున భారత మహిళ తన జీవితకాలంలో 2.0 పిల్లలకు జన్మనిస్తోంది. అదే చైనాలో 1.2, అమెరికాలో 1.6గా ఉంది. అయితే గతంతో పోలిస్తే భారత దేశంలో జననాల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది. 1992లో జననాల రేటు 3.4, 1950లో ఏకంగా 5.9 ఉండేది. భారత్‌లో అన్ని మతస్తుల్లోనూ జననాల రేటు తగ్గుతూనే ఉంది. ముస్లింలలో జననాల రేటు 1992లో 4.4గా ఉంటే.. 2019 కల్లా అది 2.4కి తగ్గింది. హిందువుల్లో 3.3 నుంచి 1.9కు, క్రిస్టియన్లలో 2.9 నుంచి 1.9కు, సిక్కుల్లో 2.4 నుంచి 1.6కు తగ్గింది. అయితే పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో శిశు జననాల రేటులో తేడాలు ఉన్నాయి. పట్టణాల్లో ప్రతి మహిళకు సగటున 1.6 శిశువులు జన్మిస్తే.. గ్రామాల్లో 2.1 మంది జన్మిస్తున్నారు. అదే 20 ఏళ్ల క్రితం సగటు పట్టణాల్లో 2.7, గ్రామాల్లో 3.7 మందిగా ఉండేది. ఇక జనాభా పెరుగుదల విషయంలోనూ ప్రాంతాల మధ్య వ్యత్యాసం ఉంది. 2001–2011 మధ్య మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్‌లలో జనాభా పెరుగుదల 25 శాతం ఉంటే.. గోవా, కేరళలో 10 శాతం మాత్రమే ఉందని భారత జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గణాంకాలు చెప్తున్నాయి. అదే నాగాలాండ్‌లో అయితే 0.6 శాతం జనాభా తగ్గింది. తగ్గుతున్న లింగభేదం 70వ దశకంలో లింగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి వచ్చిన తరువాత బాల బాలికల సంఖ్యలో వ్యత్యాసం పెరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి 111 మంది బాలురకి 100 మంది మాత్రమే బాలికలు ఉన్నట్లు తేలింది. తర్వాత వ్యత్యాసం తగ్గుతూ వస్తోంది. కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 2015 నాటికి బాల బాలికల వ్యత్యాసం 109–100కి తగ్గింది. 2019 నాటికి 108 మంది అబ్బాయిలకు 100 మంది అమ్మాయిలు ఉన్నట్టు వెల్లడైంది. లింగభేదంతో పాటు శిశు మరణాలు కూడా బాగా తగ్గుతూ వస్తున్నాయి. 1990లో ప్రతి వెయ్యిమంది శిశువులకు 89 మంది మరణించేవారు. అదే 2020 వచ్చే నాటికి 27 మందికి తగ్గింది. ఐరాస ఆధ్యర్యంలో పనిచేస్తున్న గ్రూప్ యూఎన్ఐజీ 1960 నుంచి ప్రపంచవ్యాప్తంగా శిశు మరణాల సమాచారాన్ని సేకరిస్తోంది. అయితే శిశుమరణాల విషయంలో భారత్ పొరుగు దేశాలతో పోలిస్తే వెనుకబడే ఉంది. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం ప్రతి వెయ్యిమంది శిశువులకు 24 మంది, నేపాల్‌లో 24, భూటాన్‌లో 23, శ్రీలంకలో ఆరుగురు మరణిస్తున్నారు. చైనాలో 6, అమెరికాలో ఐదుగురు శిశువులు పుట్టుక సమయంలోనే అసువులుబాస్తున్నారు. వెళ్లేవారే ఎక్కువ.. వలసలు కూడా దేశ జనాభాను ప్రభావితం చేస్తాయి. జనాభాను పెంచుకోవడం కోసం అనేక దేశాలు వలసదారుల్ని, శరణార్థులను ఆహ్వానిస్తున్నాయి. జనాభాను సంపదగా భావిస్తున్నాయి. పనిచేయగల సత్తా ఉన్న వారికి ఆశ్రయం కల్పిస్తున్నాయి. అయితే భారతదేశానికి ఇతర దేశాల నుంచి వలస వస్తున్న వారి కంటే ఇక్కడి నుంచి బయట దేశాలకు వెళుతున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. ఒక్క 2021లోనే భారత్ నుంచి ఇతర దేశాలకు వలస వెళ్లిన వారు మూడు లక్షల మంది ఉన్నారు. అనేక సందర్భాల్లో భారత్‌కు వలస వచ్చిన వారి సంఖ్య అనూహ్యంగా పెరిగిన దాఖలాలు ఉన్నాయి. 2016లో దాదాపు 68,000 మంది భారత్‌కు శరణుకోరి వచ్చారు. వీరిలో అధిక శాతం మయన్మార్ నుంచి వచ్చిన రోహింగ్యాలే. ఏదేమైనా ఈ శతాబ్దం చివరి వరకు భారత్ నుంచి వెళ్లే వారి సంఖ్య అధికంగానే ఉంటుందని ఐక్యరాజ్యసమితి జనాభా వివరాల విభాగం అంచనా వేసింది. -
జనాభాలో చైనాను దాటేశాం
న్యూఢిల్లీ: మరో మూడు నెలల తర్వాత జరుగుతుందనుకున్నది కొన్నాళ్ల క్రితమే జరిగిపోయిందా? జనాభాలో మనం చైనాను దాటేశామా? ప్రపంచంలోకెల్లా అత్యంత ఎక్కువ జనాభా ఉన్న దేశంగా అవతరించామా!! అవుననే అంటోంది వరల్డ్ పాపులేషన్ రివ్యూ (డబ్ల్యూపీఆర్) నివేదిక. గతేడాది చివరి నాటికే భారత జనాభా చైనా కంటే కనీసం 50 లక్షలు ఎక్కువని చెబుతోంది. 2022 డిసెంబర్ 31 నాటికి తమ జనాభా 141.2 కోట్లని చైనా మంగళవారం అధికారికంగా ప్రకటించడం తెలిసిందే. అదే రోజున భారత్ జనాభా 141.7 కోట్లకు చేరిందని డబ్ల్యూపీఆర్ అంచనా వేసింది. తాజాగా బుధవారం నాటికి 142.3 కోట్లకు ఎగబాకిందని చెప్పుకొచ్చింది. మాక్రోట్రెండ్స్ అనే మరో సంస్థ అంచనాల ప్రకారం బుధవారం నాటికి భారత జనాభా 142.8 కోట్లు. మన జనాభాలో 50 శాతానికి పైగా 30 ఏళ్లో లోపు వయసువారే. కనుక దేశ జనాభా పెరుగుదల 2050 దాకా కొనసాగుతూనే ఉంటుందని భావిస్తున్నారు. 1961 తర్వాత తొలిసారిగా 2022లో తమ జనాభాలో తొలిసారిగా 8.5 లక్షల మేరకు తగ్గుదల నమోదైనట్టు చైనా మంగళవారం ప్రకటించడం తెలిసిందే. ఈ ధోరణి ఇలాగే కొనసాగి 2050 కల్లా ఆ దేశ జనాభా 131 కోట్లకు పరిమితం అవుతుందని అంచనా. ఆ సమయానికి భారత జనాభా 166 కోట్లకు పెరుగుతుందని భావిస్తున్నారు. పదేళ్లకోసారి జరిగే ఆనవాయితీ మేరకు మన దేశంలో 2020లో జరగాల్సిన జనాభా గణన కరోనా కారణంగా వాయిదా పడటం తెలిసిందే. దాంతో మన జనాభాపై అధికారికంగా తాజా గణాంకాలు అందుబాటులో లేవు. -
Population Growth: సవాళ్ళు... సదవకాశాలు
ప్రతి అవకాశాన్నీ సంక్షోభంగా మార్చుకోవడం పలువురు చేసే తప్పు. అందరూ సంక్షోభం అనుకొనేదాన్ని కూడా సదవకాశంగా మార్చుకోవడమే తెలివైన పని. ఈ నవంబర్ 15న పుట్టిన శిశువుల్లో ఒకరితో పుడమిపై జనాభా 800 కోట్లకు చేరిందన్న ఐక్యరాజ్య సమితి (ఐరాస) అంచనాను ఆ దృష్టితో చూస్తే కర్తవ్యం బోధపడుతుంది. ఇవాళ ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశాలుగా మొదట చైనా, తర్వాత భారత్ నిలిచినా, వచ్చే ఏడాదిలో మనం చైనాను అధిగమిస్తామట. ఈ మైలు రాయి సవాళ్ళు విసురుతూనే, అవకాశాలూ అందిస్తోంది. ఎందుకంటే, జనాభా పెరుగుదలైనా, తగ్గుదలైనా పూర్తి మంచీ కాదు, చెడూ కాదు. ఆ జనాభాను ఎలా వినియోగిస్తున్నామన్నదే ముఖ్యం. సవాళ్ళను అధిగమించే జనసామర్థ్యమే సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనను నిర్ణయిస్తుంది. చారిత్రకంగా చూస్తే – మానవ జాతి ఆవిర్భావం మొదలు క్రీ.శ. 1800వ సంవత్సరం నాటికి కానీ జనాభా వంద కోట్లకు చేరలేదు. కానీ, ఆ తర్వాత కేవలం రెండొందల పైచిలుకు ఏళ్ళలో మన సంఖ్యలో మరో 700 కోట్లు చేరాయన్నమాట. మెరుగైన ఆరోగ్యసంరక్షణ, ఒకప్పటితో పోలిస్తే తగ్గిన ప్రపంచ దారిద్య్రం, మాతా శిశు ఆరోగ్యంలో వచ్చిన మెరుగుదల, ఆయుఃప్రమాణం పెరగడం ఇలాంటివి అనేకం దీనికి కారణం. తాజా 800 కోట్ల మార్కును ‘‘మానవాళి సాధించిన విజయాలకు ఇది మైలురాయి’’ అని ఐరాస జనాభా నిధి (యూఎన్ఎఫ్పీఏ) అన్నది అందుకే. వర్తమాన ధోరణులే గనక కొనసాగితే, 2080ల నాటికి జనాభా 1040 కోట్ల గరిష్ఠానికి చేరుతుందనీ, దాదాపు 1050 కోట్ల దగ్గర ప్రపంచ జనాభా స్థిరపడవచ్చనీ అంచనా. వర్ధమాన దేశాల్లో అధిక భాగం జనాభా నియంత్రణపై దృష్టి పెట్టినా, గత ఆరు దశాబ్దాల్లో ప్రపంచ జనాభా రెట్టింపైన మాట నిజమే. అలాగని ఈ లెక్కల్నే చూసి, సంపూర్ణ చిత్రాన్ని విస్మరిస్తే కష్టం. ప్రపంచ జనాభా 2011లో 700 కోట్లుండేది. ఆ పైన పట్టుమని పన్నెండేళ్ళకే మరో వంద కోట్లు పెరిగి, ఇప్పుడు 800 కోట్లయింది.అయితే, ఈ సంఖ్య 900 కోట్లవడానికి కాస్తంత ఎక్కువ సమయమే పట్టనుంది. మరో పధ్నాలుగున్నర ఏళ్ళకు, అంటే 2037 నాటికి గానీ అక్కడకు చేరుకోమని అంచనా. అంటే, జనాభా రేటు పెరుగుతున్న మాట నిజమే కానీ, ఆ పెరుగుదల వేగం తగ్గుతోందన్న మాట. 1950తో పోలిస్తే ఇప్పుడు జనాభా పెరుగుదల చాలా నిదానించి, 2020లో 1 శాతం కన్నా తక్కువకు పడిపోయిందని ఐరాస జనాభా నివేదికే వెల్లడించింది. ఒక్కమాటలో... నిదానంగానైనా జనాభా తగ్గుదల మార్గంలోనే పయనిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్న సంతాన సాఫల్య రేటూ దీనికి నిదర్శనం. దాని ప్రభావం స్పష్టంగా తెలియడానికి కొంతకాలం పట్టవచ్చు. వెరసి వయసు పెరిగిన జనాభా ఎక్కువవడం ఈ శతాబ్దిలో ప్రధాన ధోరణి కానుంది. వచ్చే 2023లో ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా అవతరించనున్న భారత్ ముంగిట సువర్ణావకాశం ఉంది. చైనా (38.4 ఏళ్ళు), జపాన్ (48.6) దేశాల్లోని సగటు వయస్కుల కన్నా చాలా తక్కువగా భారతీయుల సగటు వయసు 28.7 ఏళ్ళే కానుంది. చివరకు ప్రపంచ జనాభా సగటు వయసు 30.3 ఏళ్ళ కన్నా మన దేశంలోనే పిన్న వయస్కులుంటారు. అలాగే, మన జనాభాలో 27 శాతానికి పైగా 15 నుంచి 29 ఏళ్ళ వయసువాళ్ళయితే, 25.3 కోట్ల మంది 10–19 ఏళ్ళ మధ్యవయస్కులు. వచ్చే 2030 వరకు ప్రపంచంలోనే పిన్న వయస్కులున్న దేశం మనదే కావడం కలిసొచ్చే అంశం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. జనాభాను సమస్యగా భావించి ఆందోళన చెందే కన్నా ఆయుధంగా అనుకోవాలి. ఉత్పాదకత పెంచే శ్రామికశక్తిగా మలుచుకుంటే మంచి ఫలితాలుంటాయి. గతంలో చైనా చేసినది అదే! ప్రస్తుతం చైనా జనాభాలో పెద్ద వయస్కుల సంఖ్య పెరుగుతోంది. పడిపోతున్న జననాల రేటు వల్ల జనాభా తగ్గుతోంది. అంటే, ఇప్పటిదాకా ఆ దేశ ఆర్థిక పురోగతికి ప్రధాన కారణమైన శ్రామిక శక్తి ఇక ఏ మేరకు అందుబాటులో ఉంటుందనేది ప్రశ్నార్థకం. ఒక బిడ్డే ఉండాలంటూ అనేక దశాబ్దాలు కఠిన విధానం అనుసరించిన చైనా గత ఏడాది నుంచి ముగ్గురు పిల్లలకు అనుమతిం చింది. మరింతమందిని కంటే ప్రోత్సాహకాలిస్తామనీ ప్రకటించే పరిస్థితికి వచ్చింది. ఈ నేపథ్యంలో మన 141 కోట్ల పైచిలుకు జనాభాను సానుకూలతగా మలుచుకోవాలి. అయితే, భారత్‌లో పట్టణ జనాభా అంతకంతకూ అధికమవుతున్నందున సవాళ్ళూ ఎక్కువే. పట్టణ ప్రజావసరాలు తీర్చా లంటే రాగల 15 ఏళ్ళలో భారత్ కనీసం 84 వేల కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టాలని ప్రపంచ బ్యాంక్ తాజా నివేదిక. అంటే సగటున ఏటా 5500 కోట్ల డాలర్లు. అందుకు సిద్ధం కావాలి. పట్టణాల్లో అలా వసతుల కల్పన నాణ్యమైన జీవనంతో పాటు ఉత్పాదక శక్తి పెంపునకూ దోహదం చేస్తుంది. అయితే, జనాభాతో పాటు ధనిక, పేద తేడాలు పెరుగుతాయి. ఉద్రిక్తతలు హెచ్చే ముప్పుంది. ప్రపంచ ఆదాయంలో అయిదోవంతు కేవలం అగ్రశ్రేణి ఒక శాతం జనాభా గుప్పిట్లో ఉండడం పెను ప్రమాదఘంటిక. అత్యంత ధనిక దేశాల ప్రజలు, అతి నిరుపేద దేశాల వారి కన్నా 30 ఏళ్ళు ఎక్కువ జీవిస్తారట. పెరిగిన జనాభా కన్నా ఈ వ్యత్యాసాల పెరుగుదలే దుర్భరం. పెరిగిన జనసంఖ్య కోస మంటూ ప్రకృతి వనరుల విధ్వంసం ప్రపంచ సమస్య. అడవుల నరికివేత, భూగర్భ జలాల దుర్విని యోగం, చేజేతులా కాలుష్యాలు, వాతావరణ మార్పుపై అశ్రద్ధ లాంటివి అరికట్టాలి. 800 కోట్ల మంది కలసి బతుకుతూ, ఈ పుడమిని రాబోయే తరాలకూ నివాసయోగ్యంగా ఉంచడం కీలకం. -
ప్రపంచ జనాభా 800,00,00,000..
ఐక్యరాజ్యసమితి/బీజింగ్: భూగోళంపై జనా భా మరో మైలురాయికి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం జనాభా 800 కోట్ల మార్కును దాటేసింది. ‘800 కోట్ల’ శిశువు మంగళవారం భూమిపై కన్నుతెరిచింది. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జన్మించిన చిన్నారి పాపతో ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరినట్లు ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఇది వేడుక చేసుకోవాల్సిన సందర్భమేనని, అదే సమయంలో కోట్లాది మంది శాంతియుతంగా జీవించడానికి అనువైన ప్రపంచాన్ని ఎలా సృష్టించాలో అందరూ ఆలోచించాలని సూచించింది. ‘‘800 కోట్ల ఆశలు, 800 కోట్ల స్వప్నాలు, 800 కోట్ల అవకాశాలు. మన భూ గ్రహం ఇక 800 కోట్ల మంది ప్రజలకు ఆవాసం’’ అంటూ ఐక్యరాజ్యసమితి జనాభా నిధి(యూఎన్ఎఫ్పీఏ) ట్వీట్ చేసింది. పేదరిక నిర్మూలన, ఆరోగ్య రంగంలో పురోగతి, అందరికీ విద్య వంటి అంశాల్లో మానవ జాతి సాధిస్తున్న విజయాలు ప్రపంచ జనాభా వృద్ధికి కారణాలని పేర్కొంది. 1800 సంవత్సరం వరకూ 100 కోట్లలోపే ఉన్న ప్రపంచ జనాభా మరో వందేళ్లలోనే 200 కోట్లకు చేరిందని ప్రకటించింది. యూఎన్ఎఫ్పీఏ ఇంకా ఏం చెప్పిందంటే.. ► ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం చైనా. వచ్చే ఏడాదికల్లా.. అంటే 2023లో జనాభాలో భారత్ అగ్రస్థానానికి చేరుకుంటుంది. ► ప్రపంచవ్యాప్తంగా జనాభా గత 12 ఏళ్లలోనే 100 కోట్లు పెరిగింది. ► కొన్నేళ్లుగా జనాభా వృద్ధి నెమ్మదించింది. అయినప్పటికీ 2037 నాటికి 900 కోట్లకు, 2057 నాటికి 1,000 కోట్లకు చేరుకోనుంది. ► 2080 దశకం నాటికి జనాభా 1,040 కోట్లకు చేరుకుంటుంది. అదే గరిష్ట స్థాయి. 2100 సంవత్సరం దాకా పెద్దగా మార్పు ఉండదు. ► 2023లో భారత్‌లో జనాభా సగటు వయస్సు 28.7 సంవత్సరాలు. ఇది చైనాలో 38.4, జపాన్‌లో 48.6 ఏళ్లు. ప్రపంచ జనాభా సగటు వయస్సు 30.3 ఏళ్లు. భారత్ యువ జనాభాతో కళకళలాడనుంది. ► ప్రస్తుతం భారత్ జనాభా 141.2 కోట్లు. చైనా జనాభా 142.6 కోట్లు. 2050లో భారత్ జనాభా 166.8 కోట్లు, చైనా జనాభా 131.7 కోట్లు కానుంది. స్థిరంగా భారత్ జనాభా వృద్ధి! న్యూఢిల్లీ: భారత్ జనాభా వృద్ధిలో స్థిరత్వం ఏర్పడనుందని యూఎన్ఎఫ్పీఏ వెల్లడించింది. జనాభా పెరుగుదల ఎక్కువ, తక్కువ కాకుండా, స్థిరంగా కొనసాగే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. ప్రభుత్వ విధానాలు, మెరుగైన ఆరోగ్య వ్యవస్థలు, కుటుంబ నియంత్రణ వంటి చర్యలు ఫలితాలను ఇస్తున్నట్లు పేర్కొంది. టోటల్ ఫెర్టిలిటీ రేటు (సగటున ఒక్కో మహిళ జన్మినిచ్చే శిశువుల సంఖ్య) 2.2 కాగా, రాబోయే రోజుల్లో ఇది 2కు పడిపోతుందని అంచనా వేసింది. ఇదీ చదవండి: జీ20 సదస్సులో భారత ప్రధాని మోదీ కీలక ప్రసంగం, ఉక్రెయిన్ యుద్ధం ప్రధాన ప్రస్తావనగా.. -
తగ్గనున్న భారత్ జనాభా.. నివేదికలో షాకింగ్ విషయాలు
న్యూఢిల్లీ: భవిష్యత్‌లో భారత జనాభా భారీగా తగ్గుతుందని ఓ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం దాదాపు 141కోట్లుగా ఉన్న మన దేశ జనాభా.. 2100 నాటికి 100 కోట్లకు పడిపోతుందని తెలిపింది. జనాభా పెరుగుదల ఎంత ప్రతికూలమో.. క్రమంగా తగ్గినా అంతే ప్రమాదమని పేర్కొంది. జ్ఞానం, జీవన ప్రమాణాలు పడిపోయి క్రమంగా జనాభా అంతరించిపోయే ప్రమాదం ఏర్పడుతుందని స్టాండ్ఫోర్డ్ అధ్యయనం పేర్కొంది. రానున్న రోజుల్లో భారత జనసాంద్రత ఆందోళనకర స్థాయిలో పడిపోతుందని చెప్పింది. జనాభా విషయంలో భారత్, చైనా దాదాపు ఒకేలా కన్పిస్తున్నప్పటికీ.. జనసాంద్రతకు వచ్చేసరికి చాలా వ్యత్యాసం ఉంది. భారత్‌లో ప్రతి చదరపు కిలోమీటర్‌కు 476మంది నివసిస్తారు. చైనాలో మాత్రం ఆ సంఖ్య 148 మంది మాత్రమే. 2100 నాటికి భారత్‌లో జనసాంద్రత 335కి పడిపోతుందని, ఇది ప్రపంచం మొత్తంతో పోల్చితే చాలా ఎక్కువ అని అధ్యయనం అంచనా వేసింది. భారత్‌తో పాటు చైనా, అమెరికాలో వచ్చే 78 ఏళ్లలో జనాభా తగ్గిపోనుంది. ముఖ్యంగా చైనా జనాభా 2100 నాటికి 49 కోట్లకు పడిపోనుంది. సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గుతుండటమే ఇందుకు కారణం. 2050 నాటికే మొత్తం సంతానోత్పత్తి 0.5 శాతానికే పరిమితం అవుతుందని అంచనా. భారత్‌లో సంతానోత్పత్తి రేటు 2032నాటికి 1.76శాతం నుంచి 1.39శాతానికి తగ్గనుంది. 2052నాటికి 1.28శాతానికి, 2082 నాటికి 1.2శాతానికి, 2100 నాటికి 1.19శాతానికి పడిపోతుందనే అంచనాలున్నాయి. చదవండి: మొక్కజొన్న కంకులు బేరమాడిన మంత్రి.. షాకిచ్చిన యువకుడు -
సంఘటితమైతేనే రాజ్యాధికారం
దేశంలో ప్రతి దానికీ లెక్క ఉంటుంది. పశుపక్ష్యాదు లెన్ని, పులులు, సింహాలెన్ని అనే లెక్కలు కూడా తీస్తారు. అలాంటిది బీసీల లెక్క ఎందుకు తీయడం లేదు? గత నాలుగు దశాబ్దాలుగా ఎన్ని పోరాటాలు చేసినప్పటికీ బీసీ జనగణన చేయడం లేదు. బీసీ జనాభా ఎంతో తెలియకుండా బీసీల సమగ్రాభివృద్ధికి ఎలా ప్రణాళికలు రూపొందిస్తారు? చట్టసభల్లో ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలనీ, క్రీమీలేయర్ విధానాన్ని తొలగించాలనీ, విద్య, ఉద్యోగాల్లో ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలనీ దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న ఉద్యమ సంఘాలు దేశ రాజధాని ఢిల్లీ చేరుకొని ధర్నా చేస్తున్నాయి. ముఖ్యమైన నాయకులను కలిసి వినతి పత్రాలు సమర్పిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీలకున్న రాజ్యాంగపరమైన హక్కులు, ఆధిపత్య వర్గాలకున్న రాజ్యాధికారం బీసీలకు లేక పోవడం వల్ల వారు అభివృద్ధికి నోచుకోవడంలేదు. ప్రాచీన కాలం నుంచీ ఉత్పత్తి, సేవా రంగాల్లో తమ దైన నైపుణ్యంతో మానవాళి మనుగడకు కృషి చేస్తూ వచ్చిన బీసీలు ఇవ్వాళ దయనీయమైన స్థితికి చేరుకున్నారు. ఆధునిక పారిశ్రామిక విధానం వల్ల బీసీలకు జీవనాధారమైన సాంప్రదాయిక వృత్తులు విధ్వంసమై బీసీలు వలసల బాట పట్టారు. సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చిన మార్పులను గమనించిన ఆధి పత్య కులాల వాళ్లు బీసీ కులాల వృత్తులను లాక్కున్నారు. మెషినరీ (మిల్లు)తో చేనేత రంగాన్ని కొల్లగొట్టారు. ప్లాస్టిక్‌తో కుమ్మరుల వృత్తీ, బ్యాండ్ బాక్స్‌లతో చాకలి వృత్తీ, బ్యూటీ పార్లర్లతో మంగలి ఉపాధీ మాయమవుతోంది. దూదేకుల, నూరుబాషా, పింజారి, లద్ధాఫ్, మెహతర్, ఫకీర్, అత్తరు, కాశోల్లు, గారడోళ్ల లాంటి ఎన్నో చిన్న చిన్న ఒంటరి కులాల వారు... బహుళజాతి కంపెనీల ఉత్పత్తులు, ఆధిపత్య కులాల వారి వ్యాపారాలతో ఉపాధి కోల్పోయి రోడ్డున పడి తమ ఉనికి కోల్పోవాల్సిన దుస్థితిలో ఉన్నారు. దాదాపు అన్ని బీసీ కులాల వారూ ఇదే పరిస్థితుల్లో ఉన్నారు. వీరు సంఘటితమై రాజ్యాధికారాన్ని చేపడితే కానీ వారి దుస్థితి మారదు. మరి అందుకేం చేయాలి? బీసీలు రాజ్యాధికారం కోసం కొత్త ఎత్తుగడలతో ముందుకు సాగాలి. తమ జనాభాలో సగమైన మహిళ లను రాజకీయాలవైపు తీసుకురానంత కాలం విముక్తి సాధ్యం కాదని గుర్తించాలి. వందల కులాలుగా, వర్గాలుగా విడిపోయి జీవిస్తున్న బీసీ ప్రజలు బతుకు దెరువు కోసం వంద ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వారందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి రాజ్యాధికారం చేపట్టడం బీసీ నాయకత్వానికి, సంఘాలకు కత్తిమీద సాము లాంటిదే. బీసీ ప్రజలందరూ ఒకే జాతి ప్రజ లనే అవగాహన పెంపొందించాలి. వారి దైనందిన సమస్యలలో బీసీ నాయకత్వం పాల్పంచుకోవాలి. రాజ్యాధికారంతోనే సమగ్రాభివృద్ధి సాధ్యమని బోధించి వారిని సమీకరించిన నాడు తప్పక విజయం సాధించవచ్చు. బీసీలు నేడు తమ ఆత్మగౌరవం కోసం, బహుజన రాజ్యాధికారం కోసం ఐక్యం కావాల్సిన చారిత్రక సందర్భాన్ని గుర్తించి ముందుకు సాగాలి. బహుజనులకు రాజ్యాధికారం నినాదంతో ఉత్తరప్రదేశ్, బిహార్లలో బహుజనుల రాజ్యం ఏర్పడింది. పెరియార్ ఉద్యమ వారసత్వంగా ఆనాడు కరుణానిధి, నేడు స్టాలిన్ తమిళనాడులో రాజ్యాధికారం చేపట్టి బహుజన ప్రజల సమగ్రాభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. బీసీ సమాజం నుండి ఎదిగిన బీసీ నాయకులు, మేధావులు, విద్యావంతులు, విద్య, ఉద్యోగాలతోనే అభివృద్ది జరగదని గుర్తించాలి. (క్లిక్: వినదగిన ‘తక్కెళ్ల జగ్గడి’ వాదన) రాష్ట్రాల్లో విడివిడిగా ఉద్యమాలు జరుపుతున్న నాయకులు ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమి టీగా ఏర్పడి దేశవ్యాప్త ఉద్యమ నిర్మాణానికి నడుంబిగించారు. ఈ కృషిలోప్రతి బీసీ భాగస్వామి కావాలి. (GO 111 Hyderabad: పర్యావరణాన్నే పణంగా పెడదామా?) - సాయిని నరేందర్ బీసీ స్టడీ ఫోరం వ్యవస్థాపక చైర్మన్ -
కుల గణనపై కుటిల రాజకీయాలు
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అవుతున్నా ఓబీసీల పరిస్థితి దారుణంగా ఉందని చెప్పకతప్పదు. ఓబీసీలు అన్ని విధాలుగా ముందుకు వచ్చేందుకు కేంద్రం అడ్డుపడుతోంది. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం, తెలంగాణ సర్కారు కుల గణన చేయాలని అసెంబ్లీ తీర్మానం చేయడం ఒక సాహసోపేతమైన చర్యే నని చెప్పవచ్చు. కానీ, బీజేపీ మాత్రం దేశవ్యాప్తంగా కుల గణనపై కుటీల రాజకీయాలు చేస్తోంది. ఈ విషయంలో కాంగ్రెస్ కూడా ఏమి తక్కువ తినలేదు. జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లకు బీసీల హక్కులు, సామాజిక న్యాయం పట్ల సోయే లేదు. అణగారిన ప్రజలు అప్పుడూ ఇప్పుడూ అధికారానికి దూరంగా ఉన్నా, కనీసం సామాజిక న్యాయానికి కూడా దూరమేనా అనే ఆందోళన యావత్ బీసీ సమాజాన్ని ఆవహించింది. కొత్తగా కులాల గణనను చేపడితే, గతంలో మండల్ కమిషన్ చెప్పిన 52 శాతం కంటే ఎక్కువగానే ఓబీసీ జనాభా ఉండొచ్చన్నది సర్వత్రా వినిపిస్తున్న టాక్. దీంతో కోటా కోసం మరిన్ని ఉద్యమాలు జరిగే అవకాశం ఉంటుందని అగ్రకుల అధికారవర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇది బీజేపీ, కాంగ్రెస్‌కు రాజకీయంగా నష్టం కల్గించవచ్చని అనధికారిక విశ్లేషణలు, వ్యాఖ్యానాలు చేస్తున్నారు. (చదవండి: ‘ఆఖరి మైలు’ జనహృదయానికి దగ్గరయితే...) దేశంలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితిని నిశితంగా గమనిస్తే 2017 అసెంబ్లీ, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ప్రత్యే కించి యూపీలో బీజేపీ ఓబీసీల కారణంగా బాగా లాభపడి నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మిగతా ప్రాంతాల్లో ఓబీసీలను అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఉపయో గించుకుంటున్నాయి. కానీ వారికి ఏ విధమైన లబ్ధి చేకూర్చడం లేదు. ఏపీ, తెలంగాణల్లో వైసీపీ, టీఆర్ఎస్ సాధ్యమైనంత మేరకు అవకాశం కల్పిస్తున్నాయి. జనాభా సేకరణ–2021లో కులగణనను చేర్చడం సాధ్యంకాదని కేంద్ర ప్రభుత్వం భారత సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించిన అఫిడవిట్లో పేర్కొనడం నిజంగా బాధాకరం. ఈ నిర్ణయం అనేక తర్జనభర్జనల తర్వాత తీసుకున్నదని నరేంద్ర మోదీ సర్కారు సమర్థించుకుంటోంది. సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో వెనుకబడిన వర్గాల కులగణన చెయ్యడం పరిపాలనాపరంగా చాలా కష్టమైనదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కష్టపడి చేసినా నమ్మదగిన, సరియైన సమాచారం రాదని, ఆ సమాచారాన్ని అధికారిక అవసరాలకు వాడు కోలేమని ప్రభుత్వం చెబుతోంది. కుల గణన డిమాండ్‌ను తిరస్కరించడానికి చెప్పిన ఈ వాదనలు పక్కా అబద్ధాలే. (చదవండి: ఆర్థికమే కాదు... సామాజికం కూడా!) భారత దేశానికి స్వాతంత్య్రానికి ముందు బ్రిటీష్ పాలనలో 1881 నుంచి 1941 వరకు ప్రతి దశాబ్దానికొకసారి జరిగిన జనగణనలో కుల వివరాలు సేకరించారు. ఇప్పుడు అందరూ వాడుతున్న కులగణన లెక్కలు 1931 జనగణన లోనివే అన్న విషయం ఎంతమందికి తెలుసు. అప్పటి నుంచి ఇప్పటివరకు అసలు కులగణన జరగడం లేదు. మనమెంతో మనకే తెలియని పరిస్థితి ఉంది. దీనిపై పోరాడాల్సిన అవసరం, ఆవశ్యకత యావత్ బహుజన సమాజంపై ఉంది. బీపీ మండల్ కమిషన్ ఈ గణాంకాలపై ఆధారపడే వెనక బడిన కులాల జనాభాను 52 శాతంగా అంచనా వేసిందని సామాజిక రంగ నిపుణులు చెబుతుంటారు. ప్రస్తుతం రాజకీయ పార్టీలు సోషల్ ఇంజనీరింగ్, సామాజికీకరణలు అంటూ పద బంధాలు వాడేది ఆ కమిషన్ సిఫార్సుల ఆధారంగానే. మరి తాజా వివరాలు వస్తే... మనకు మరింత న్యాయం జరుగుతుంది కదా. 2011లో యూపీఏ–2 ప్రభుత్వ హయాంలో దేశ వ్యాపితంగా కుల గణన జరిగింది. అందులో 98.87 శాతం సమాచారం సక్రమంగా ఉందని 2016లో భారత సెన్సెస్ కమిషనర్ గ్రామీణాభివృద్ధి పార్లమెంటరీ కమిటీ ముందు ప్రకటించినట్టు వార్తలు వచ్చాయి. 2011 కులగణనలో జరిగిన కొన్ని సాంకేతిక లోపాలు దిద్దుబాటు చేసుకోగలిగినవే అయినా, వాటిని కేంద్ర ప్రభుత్వం భూతద్దంలో చూపి కులగణన అవసరాన్ని తిరస్కరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆరోపించినట్టు కులగణన వృథా అనుకోరాదు. దాని ద్వారా లభించే శాస్త్రీయమైన, సరైన సమాచారం వివిధ తరగతుల పరిస్థితిని అర్థం చేసుకోవడానికి సామాజిక న్యాయాన్ని అందించేందుకు ఉపయోగపడుతుంది. దీని కోసం జరిగే సమరంలో కులగణన ద్వారా అందే వాస్తవ సమాచారం ఒక ఆయుధంగా వినియోగపడుతుంది. అందుకే కులగణన జరగాలని కోరుతున్నాం. (చదవండి: ఈ వెనుకడుగు వ్యూహాత్మక ముందడుగు) తెలంగాణ బీజేపీ నేతల ద్వంద్వ వైఖరి అటు కేంద్రంలోనూ... ఇటు రాష్ట్రంలోనూ ఓబీసీ కుల గణనపై బీజేపీ వైఖరిలోని కపటత్వం అందరికీ తెలుస్తున్నది. ఇటీవల బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్ ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ తొలుత రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ గణన చేపట్టాలని ఒక కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు. ఆయన మాటల తీరు నిజంగా హాస్యాస్పదం. ఆయన సొంత ప్రభుత్వానికి ఓబీసీ ప్రెసిడెంట్‌గా కనీసం లేఖ కూడా రాయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. పైగా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించాలట. మరి బీజేపీ ప్రభుత్వాలకు ఎందుకు ఆయన ప్రత్యేకంగా లేఖలు రాయడం లేదో వివరణ చెప్పాల్సి ఉంది. రాష్ట్రంలో ఆ పార్టీ బీసీ నేతలకు కీలక పదవులు ఇస్తూ... సమూహ లబ్ధి జరిగే కుల గణన అంశాన్ని విస్మరించడం నిజంగా దుర్మార్గం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా బీసీ కుల గణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కుల గణన, రిజర్వేషన్లపై జాతీయ స్థాయిలో రాజకీయ పక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి కేంద్రంపై పోరాటం చేస్తామని కేసీఆర్ ప్రకటించటం బీసీల పట్ల కేసీఆర్‌కు ఉన్న చిత్తశుద్ధిని ప్రతిబింబిస్తుంది. (చదవండి: మహిళలు... కొంచెం ఎక్కువ సమానం) గ్రామ పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంటు ఎన్ని కల వరకు భారతదేశంలో కులానికి ఎంత ప్రాధా న్యముందో అందరికీ తెలిసిందే. కులాలవారీగా జనాభా లెక్కల సేకరణ చేపడితే హిందూ ఓట్లలో చీలిక వస్తుందన్న భయం బీజేపీకి ఏర్పడుతోంది. కులాలను పక్కనబెట్టి మతపరంగా ఎక్కువ జనాభాను తనవైపు తిప్పుకున్న బీజేపీ, ఇప్పుడు తన ఓటు బ్యాంకును చీల్చుకోవడానికి ఇష్టపడటం లేదు. కులాలవారీ జనగణన వల్ల కుల అస్తిత్వం, గుర్తింపు శాశ్వతమైపోతుందని ఆ పార్టీ భయపడుతోంది. సమాజంలో మార్పు రాదని ప్రభుత్వం వాదిస్తోంది. అయితే, కుల గుర్తింపు అనేది తమకు అవసరమని మిగతా వర్గాలు వాదిస్తున్నాయి. ఓబీసీలకు సమూల మార్పు కావాలంటే... కేంద్రంలో అధికారం వెలగబెట్టే జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలకు రాబోయే ప్రతి ఎన్నికలో బుద్ధి చెప్పడం అవశ్యం. - మన్నారం నాగరాజు వ్యాసకర్త రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ లోక్‌సత్తా పార్టీ -
జనాభా వృద్ధికి జాగ్రత్తగా పగ్గం
దేశంలో జనాభా విస్ఫోటన భయం కొంత తగ్గినట్టే! జనాభా వృద్ధి నియంత్రణ చర్యలు ఫలితా లిస్తున్నాయి. దాదాపు దేశమంతటా ఆశించిన స్థాయిలోనే జనాభా వృద్ధిని కట్టడి చేయగలిగినట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్–5) తేల్చింది. మరో ఆరోగ్యకరమైన సంకేతం... దేశంలో మహిళా జనాభా పురుష జనాభాను దాటడం. ప్రతి వెయ్యి మంది పురుషులకు దేశంలో 1020 మంది మహిళలున్నట్టు తాజా సర్వే తెలిపింది. ఇలా మహిళల జనాభా పెరగడం, దాదాపు మూడు దశాబ్దాల ఈ సర్వే పర్వంలో తొలి నమోదు! అయితే ఈ లింగ నిష్పత్తి జననాల స్థాయిలో (ఎస్సార్బీ) ఇలా లేదు! అక్కడ పరిస్థితి భిన్నంగానే ఉంది. ప్రతి వెయ్యిమంది పురుషులకు 929 మంది మహిళలే ఉంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌వో) సహజమని చెప్పే స్త్రీ–పురుష నిష్పత్తి 950–1000తో పోలిస్తే ఇది తక్కువే! కానీ, అయిదేళ్ల కిందటి 2015–16 సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్–4) చెప్పిన నిష్పత్తి (919–1000) కన్నా ప్రస్తుత పరిస్థితి మెరుగే! పరిమిత నమూనాలతో జరిపే ఈ సర్వే ఫలితాలను ప్రామాణికంగా భావించరు. పదేళ్లకోసారి వచ్చే సాధా రణ జనాభా లెక్కలే ప్రామాణికం. 2001, 2011 జనాభా లెక్కల్లో స్త్రీ–పురుష నిష్పత్తి సరళి కూడా ఇట్లాగే ఉంది. సాపేక్షంగా ఈ సర్వే నివేదికలూ వాస్తవికతకు దగ్గరగా ఉన్నట్టే! ఒకటి మాత్రం నిజం. వివిధ సమాజాల్లో ఈ లింగవివక్ష, కాన్పుకు ముందే లింగ నిర్ధారణ దురదృష్టకరం, నేరం! ఆడ పిల్లలను అంతమొందించే బ్రూణహత్యలు జరుగుతూనే ఉన్నాయి. వెయ్యిమంది పురుషులకు హిమాచల్‌ప్రదేశ్(875), తమిళనాడు(878), హరియాణా(893), ఒడిశా(894) లాగే తెలంగాణ (894)లోనూ మహిళల సంఖ్య తక్కువగా నమోదయింది. ఆంధ్రప్రదేశ్‌లో కొంత మెరుగ్గా (934) ఉంది. కేరళలో అయిదేళ్ల కింద 1047గా ఉన్న మహిళల సంఖ్య తాజాగా 951కి పడిపోయింది. ఢిల్లీలో 812 నుంచి ఏకంగా 923కి పెరిగింది! ఒట్టి జననాల్లో కాకుండా మొత్తం జనాభాలో మహి ళల నిష్పత్తి పురుషుల కన్నా ప్రస్తుతం పెరగడానికి పలు కారణాలుంటాయి. మరణాల రేటులో వ్యత్యాసం, మహిళల్లో ఆయుఃకాలం పెరగటం వంటివీ ఈ అంశాన్ని ప్రభావితం చేస్తాయి. కుటుంబ ఆరోగ్య సర్వేలో కొన్ని మంచి ఫలితాలు కనిపిస్తే, మరికొన్ని విషయాల్లో ఆందోళనకర సంకేతాలు వెలువడటాన్ని పాలకులు గుర్తించాలి. పిల్లలు, మహిళల్లో పౌష్టికాహార లోపం, ఇనుము కొరవడి రక్తహీనత (అనీమియా) ప్రబలడాన్ని తీవ్రంగా పరిగణించి, నివారణ చర్యల్ని ముమ్మరం చేయాలి. పిల్లల్లో రక్తహీనత కేసులు గత సర్వే కాలంలో 58.6 శాతం ఉంటే, ఇప్పుడది 67 శాతానికి పెరిగింది. గర్భిణీల్లో 50.4 శాతం నుంచి 52.2 శాతానికి, 15–49 మధ్య వయస్కులైన మహిళల్లో 53 నుంచి 57 శాతానికి పెరిగింది. అదే వయసు పురుషుల్లో 22.7 నుంచి 25 శాతానికి పెరగటం సమస్య తీవ్రతకు నిదర్శనం. ‘అనీమియా రహిత భారత్’ నినాదంతో, 2022 నాటికి కేసుల్ని తగ్గిం చాలని కేంద్ర ప్రభుత్వం నిర్దిష్ట లక్ష్యాలతో పనిచేస్తున్నా ఆశించిన ప్రగతి లేదని సర్వే తేల్చింది. పళ్లు, కూరగాయలు సరిగా తినకపోవడం, ఇతరత్రా పౌష్టికాహార లోపాలతోనే రక్తహీనత పెరిగి సమస్య జటిలమౌతోంది. కరోనా కాలంలో ఆదాయాలు రమారమి పడిపోయి, నిత్యావసరాల ధరలు పెరగ టం కూడా ఈ సమస్యను తీవ్రతరం చేసింది. రోజువారీ భోజనంలో, తమ ఆర్థిక స్థాయిలోనూ సమ కూర్చుకోగలిగిన నిర్దిష్ట ఆహార పదార్థాలపైన జనాలకి స్పష్టమైన అవగాహన ముఖ్యం. జాతీయ పౌష్టికాహార సంస్థ ప్రచారం కల్పిస్తున్నప్పటికీ, సరిపోవడం లేదు. ప్రజలింకా చైతన్యం కావాలి. దేశవ్యాప్తంగా మొత్తం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను గ్రూపులు చేసి రెండు విడతల్లో నిర్వహించిన ఈ సర్వే ఏపీ, తెలంగాణల్లో తొలివిడతలోనే జరిగింది. వైద్యారోగ్యపరంగా కొన్ని మంచి సంకేతాలీ రాష్ట్రాల్లో వెలువడ్డాయి. పౌరులకు ఆరోగ్య భీమా వర్తింపజేయడంలో దేశంలోనే రెండు తెలుగు రాష్ట్రాలు అగ్రభాగాన ఉన్నాయి. ఏపీలో పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చించి ‘నాడు– నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వాసుపత్రుల రూపురేఖల్ని మారుస్తున్న చర్య సత్ఫలితాలిస్తోంది. ఆస్పత్రుల్లో కాన్పులు పెరిగాయి. కాన్పువేళ, తదనంతరం మాతా–శిశు మరణాలు తగ్గాయి. కొన్ని విషయాల్లో దేశవ్యాప్తంగానూ ఆశావహ సంకేతాలున్నాయి. దేశంలో నాల్గింట మూడొంతుల మంది మహిళలు బ్యాంకుల్లో అకౌంట్లు తెరిచారు. స్త్రీ–పురుషుల్లోనూ ఇంటర్నెట్ వాడకం బాగా పెరిగింది. గృహ హింస, అదీ జీవిత భాగస్వామి నుంచి తగ్గినట్టు నమోదైంది. కుటుంబ నియంత్రణ పట్ల అవ గాహన పెరగటమే కాక సురక్షిత పద్ధతులు వారికి తెలిసి వచ్చాయి. జననాల రేటు తగ్గించడంలో ఇదెంతో ఉపయోగపడ్డట్టు గణాంకాలున్నాయి. జనాభా వృద్ధి కట్టడిలో చాలా రాష్ట్రాలు గణనీయ ఫలితాలే సాధిస్తున్నాయి. మొత్తం సంతానోత్పత్తి రేటు(టీఎఫ్పార్)ను 2.1 కన్నా తక్కువకి నియం త్రిస్తే జనన–మరణాల ప్రక్రియ కొనసాగుతూనే, ఇప్పుడున్న జనసంఖ్య స్థిరపడుతుందనేది ఓ లెక్క! బిహార్, మేఘాలయ, మణిపూర్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ తప్ప దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలూ టీఎఫ్పార్ని 2 కన్నా కిందే నిలిపేయడం మంచి పరిణామం. అయినా, 2040–50 సంవత్సరాల మధ్య భారత్ అత్యధిక (160 నుంచి 180 కోట్ల మందితో) జనాభా దేశంగా ఆవిర్భవించనుంది. 2031 నాటికే చైనాను అధిగమిస్తామని మరో అధ్యయనం! 2022కే అధిగమి స్తామన్న ఐక్యరాజ్యసమితి (యూఎన్) అంచనాను తప్పించామంటే, జన విస్ఫోటన తేదీని మనం ముందుకు, మరింత ముందుకు జరుపుతున్నట్టే లెక్క! ఇది ఆశావహ సంకేతం!! -
జనాభాలో మనమే నంబర్ వన్!
మరో ఎనిమిదేళ్లు పూర్తయ్యే సరికి జనాభాలో అతిపెద్దదేశంగా భారత్ అవతరించనుంది. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి ఇటీవలే ప్రకటించింది. ప్రస్తుతానికి ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా చైనా కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతోంది. త్వరలోనే భారత జనాభా చైనాను అధిగమించనుంది. ప్రస్తుతం చైనా జనాభా: 138.6 కోట్లు భారత జనాభా: 125.6 కోట్లు రెండు దేశాల్లోనూ జననాల వృద్ధి రేటు అంచనాల ప్రకారం 2028 నాటికి రెండు దేశాల జనాభా చెరో 145 కోట్ల మేరకు చేరుకుంటుందని, జననాల వృద్ధి రేటు చైనాలో తక్కువగా ఉన్నందున జనాభాలో భారత్ అగ్రస్థానానికి చేరుకుంటుందని ఐక్యరాజ్య సమితి అంచనా. గడచిన కొన్ని దశాబ్దాలుగా చైనా, భారత్‌లలో జనాభా పెరుగుదల గణనీయంగా నమోదైంది. జనాభా నియంత్రణ కోసం చైనా కఠినమైన నిబంధనలను అమలు చేయడంతో, కొన్నేళ్లుగా చైనాలో జననాల వృద్ధిరేటు నెమ్మదించింది. 1950లో... చైనా జనాభా: 54.4 కోట్లు భారత జనాభా:37.6 కోట్లు 1950 నాటితో పోలిస్తే, చైనా జనాభా రెండున్నర రెట్లకు పైగా పెరిగింది. భారత జనాభా మూడు రెట్లకు పైగానే పెరిగింది. ఈ లెక్కల ప్రకారం చైనా కంటే భారత్‌లోనే జననాల వృద్ధిరేటు ఎక్కువగా నమోదవుతున్నట్లు స్పష్టమవుతోంది. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం 2013 నాటికి ప్రపంచ జనాభా 720 కోట్లకు చేరుకుంది. 2025 నాటికి ఈ సంఖ్య 810 కోట్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని, 2050 నాటికి 960 కోట్లకు, 2100 నాటికి ప్రపంచ జనాభా 1090 కోట్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని ఐక్యరాజ్య సమితి అంచనా. -
జనాభా వరమా? శాపమా?
ప్రపంచ జనాభా మొత్తంగా అదుపూ అడ్డూ లేకుండా పెరిగిపోతోంది. అవసరాలు తీర్చే వన రులు ఆ స్థాయిని అందుకోలేకపోతున్నాయి. ఆశలు, ఆకాంక్షలు అపరిమితం అయిపోతు న్నాయి. తీర్చగలిగే సంపద, సేవలు, సరుకులు అంతరించి పోతున్నాయి. పర్యవసానం జన విస్ఫోటనం. ప్రజలు భూమికి భారమై, శాపమై పోతున్నారు. కనుకనే దేశాల మధ్య జల, జన యుద్ధాలు, ఆధిపత్య పోరాటాలు, భూమి, సహజ సంపదలను దోచుకోవడాలు, దాచుకోవ డాలు జరుగుతున్నాయి. పెరుగుతున్న జనాభాకు ఆవాసం కల్పించాలంటే మరో గ్రహాన్ని వెతుక్కో వాల్సిందే అని ఇటీవల వినిపిస్తున్న ఘోష. జనాభా ఎందుకు పెరుగుతోంది? దీనివలన లాభ నష్టాలేమిటి? అసలు జనాభా అనేది దానికి అదే ఒక శాపమా? లేక వరమయ్యే అవకాశాలు న్నాయా? దానిని అదుపు చేయడమా? స్థిరీకరించడమా? పెరుగుదల వేగాన్ని తగ్గించడమా? వంటి అంశాలను ప్రపంచానికి తెలియజేయడా నికే ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపు కుంటున్నాము. 1987 జూలై 11 నాటికి ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరిందని జన గణన సంస్థలు ప్రక టించాయి. చరిత్రలో ఈ తేదీ గుర్తుగా ప్రపంచ జనాభా దినోత్సవంగా నిర్ణయించాయి కూడా. ఆపై కొద్ది కాలంలోనే ప్రపంచ జనాభా 2011 అక్టోబర్ 11 నాటికి 700 కోట్లకు చేరింది. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక యువ ప్రభంజనంగా మారనుంది. అత్యధిక శ్రామిక శక్తిగా, ఉత్పాదక శక్తిగా అవతరించబోనుంది. ప్రపంచ జనాభాను పరిశీలిస్తే 700 కోట్ల సంఖ్య మన దేశానికే దక్కడం మరో విశేషం. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఒక ఆడ శిశువు జన్మించింది. ఆ ఆడ శిశువు ‘బేబీ సెవెన్ బిలియన్’గా పేరు కెక్కింది. ప్రపంచ జనాభాలో 17.5 శాతం వాటా మనదే. ప్రస్తుతం జనాభా విషయంలో చైనా (సుమారు 134.4 కోట్లు) తరువాత 121 కోట్ల పైచిలుకు జనాభాతో 2వ స్థానంలో ఉన్నాము. 2050 నాటికి భారత్.. చైనాను దాటి అత్యధిక జనాభాగల దేశంగా అవతరిస్తుందని నిపుణుల అంచనా. ప్రస్తుతం మన జనాభాలో 50 శాతం 25 ఏళ్లలోపు వాళ్లు కాగా, 35 ఏళ్లలోపు వాళ్లు 65 శాతంగా ఉన్నారు. 2030 నాటికి అత్యధిక యువ శక్తిగల దేశం భారతదేశమే అవుతుంది. మన మనుగడకు ఐక్యరాజ్య సమితి చేపట్టిన సెవెన్ బిలియన్ క్యాంపెయిన్ కొన్ని సూచనలు చేస్తోంది. అవి 1. దారిద్య్రాన్ని, అసమానతలను తగ్గించడం, జనాభా పెరుగుదల వేగాన్ని అదుపు చేయడం. 2. చిన్న, బలమైన కుటుంబాలకు ప్రోత్సాహకాలు ఇచ్చి ఆరోగ్యకర మైన కుటుం బాలకు దారి సుగమం చేయడం. 3 తక్కువ సంతానం, దీర్ఘాయుష్షుల వలన వృద్ధుల సంఖ్య పెరగడంపై జాగరూకతతో ఉండటం. జూలై 11, 2018న ప్రత్యేకించి ఐక్యరాజ్యసమితి కుటుంబ ప్రణాళికను ప్రపంచ మానవాళి హక్కుగా నిర్ణ యించింది. దీంతో తొలిసారిగా ప్రపంచ వ్యాప్తంగా తల్లిదండ్రులు వారి పిల్లల సంఖ్య, ఇంకా వారి మధ్య అంతరాన్ని గుర్తించడాన్ని ఒక ప్రాథమిక మానవ హక్కుగా వెలుగులోకి తెచ్చినట్లైంది. భారతదేశం అతి త్వరలో అతిపెద్ద శ్రామిక శక్తిగా అవతరించబో తోంది అని ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆనాడే అన్నారు. ఆయన మానస పుత్రిక అయిన ‘గ్రామ స్వరాజ్యం’ కోసం పలు ప్రణాళికలను రూపొందించారు. ప్రభుత్వాలు కూడా వాటిని కొద్ది మార్పులతో ఆచరణలోకి తెచ్చాయి. తన సొంత ఖర్చుతో జాతీయ పాఠశాలలు, వినియో గదారులు, ఉత్పత్తిదారుల సంఘాలు, గ్రామ పంచాయతీలు వంటి వాటిని ఏర్పర్చి ప్రకాశం గారు చేసిన కృషిని మహాత్మాగాంధీ ప్రశంసిస్తూ అవి దేశప్రగతికి నిదర్శనాలని కితాబు ఇచ్చారు. ఈ ప్రపంచ జనాభా దినోత్సవం ప్రత్యేకించి యువతరాన్ని ఉత్తేజపరచనుంది. తమ ఆరోగ్యం, శరీర పుష్టి, లైంగిక సమస్యలు వంటివాటిపై యువత సరైన నిర్ణయాలను తీసుకోగలిగేలా ప్రేరే పించడమే నేటి జనాభా దినోత్సవం లక్ష్యం. వ్యాసకర్త: టంగుటూరి శ్రీరాం, ప్రధాన కార్యదర్శి, ప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్థ మొబైల్ : 99514 17344 -
వారిలో హిందువులే ఎక్కువ!
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని హిందువుల్లో అధిక శాతం మంది వ్యవసాయాన్ని నమ్ముకోగా, ఎక్కువ శాతం ముస్లిం జనాభా వ్యవసాయేతర వృత్తుల వైపు మొగ్గు చూపుతున్నారని 2011 జనాభా లెక్కల రిపోర్టు వెల్లడించింది. మతాల ప్రాతికపదికన హిందూ, ముస్లిం జనాభా ఉద్యోగ, వ్యవసాయ వివరాలను శుక్రవారం ప్రకటించింది. మొత్తం హిందువుల్లో 45.40 శాతం మంది వ్యవసాయ రంగంలో పనిచేస్తుండగా.. ఈ మొత్తంలో 28 శాతం మంది భూమిని సాగు చేయడం ద్వారా ఉపాధి పొందుతున్నారని తెలిపింది. 60 శాతం ముస్లిం జనాభా పారిశ్రామిక రంగంలో పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారని పేర్కొంది. అయితే, అక్షరాస్యతలో వారు హిందువుల కన్నా వెనకబడి ఉండడంతో ఉన్నతోద్యోగాలు పొందలేక పోతున్నారని తెలిపింది. పారిశ్రామిక రంగంలో దిగువ స్థాయి ఉద్యోగాలైన చేనేత, కుండల తయారీ, వడ్రంగి పని, హస్తకళలు వంటి కళాత్మక పనుల్లో ముస్లింలు ఎక్కువగా పని చేస్తున్నారని రిపోర్టు వెల్లడించింది. దేశంలో చాలా మంది ముస్లింలు భూములు లేని కారణంగానే పారిశ్రామిక రంగంలో ఉపాధి కోరుకుంటున్నారని విశ్లేషించింది. కాగా, దక్షిణ భారతంలో కంటే ఉత్తరం భారతంలో ముస్లిం జనాభా పెరిగిందని రిపోర్టు పేర్కొంది. సచార్ కమిటీ ప్రకారం.. 2005లో ఏర్పాటైన రాజేంద్ర సచార్ కమిటీ దేశంలో భూమి కల్గివున్న జనాభాలో హిందూ, ముస్లింలకు గణనీయమైన తేడా ఉందని నివేదించింది. గ్రామీణుల్లో 94 శాతం కుటుంబాలు సొంత భూమిని కలిగి ఉన్నాయని స్పష్టం చేసింది. వారిలో కూడా అగ్రవర్ణ హిందూ జనాభా చేతిలోనే అధిక భూమి ఉందని తెలిపింది. దాదాపు 87 శాతం జనాభా కనీసం ఒక ఎకరా భూమిని కలిగి ఉన్నారని తెలిపింది. కాగా, అన్ని మతస్తుల కంటే తక్కువగా (83 శాతం) ముస్లింలు భూమిని కలిగి ఉన్నారని వెల్లడించింది. అయితే, పట్టణ, నగర ప్రాంతాల్లో సొంత ఇళ్లు కలిగి ఉన్న వారిలో ముస్లింలే అధికంగా ఉన్నారని వెల్లడించింది. కాగా, 2001 నుంచి 2011 వరకు జనాభాలో 0.8 శాతం పెరుగుదల నమోదు కావడంతో ముస్లిం జనాభా 13.8 కోట్ల నుంచి 17.22 కోట్లకు ఎగబాకింది. అదే సమయంలో హిందూ జనాభా 0.7 శాతం తగ్గుదల నమోదు చేసింది. 2001లో 82.75 కోట్లుగా ఉన్న హిందూ జనాభా 96.63 కోట్లకు చేరింది. -
పారదర్శకతతో అభివృద్ధి పథంలోకి!
భారత జనాభాను భారంగా కాకుండా, వరంగా మార్చడం ఎన్డీఏ ఆశయం. అంటే నైపుణ్యాల అభివృద్ధి మీద దృష్టి సారించాలి. ఇందుకోసం కేంద్రం ఒక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేసింది. నరేంద్ర మోదీ నాయకత్వం లోని ఎన్డీఏ ప్రభుత్వ తొలి ఏడాది పాలన దేశాన్ని పురోగ మన పథంలో నడిపించింది. అభివృద్ధి, సంక్షేమాలకు సమ ప్రాధాన్యం ఇవ్వడమే ఇందు కు కారణం. ఇంతకు ముందు పదేళ్ల పాటు సాగిన కుంభకో ణాల ప్రభుత్వం నుంచి సంక్ర మించిన వృద్ధిరేటు పతనం (నాలుగు శాతానికి), దిశా నిర్దేశం లేని పాలన, ప్రపంచ మాంద్యం వంటి విపరిణా మాలను అధిగమించిన మోదీ సర్కారు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నది. ప్రభుత్వం తీసుకున్న చర్యల కార ణంగా 2014-15 సంవత్సరంలో 7.3 శాతం ఆర్థిక వృద్ధి రేటుతో మన దేశం చైనాను మించి దూసుకువెళుతు న్నది. రెండంకెల వృద్ధిరేటును సాధించాలన్న ఆర్థికమం త్రి అరుణ్‌జైట్లీ సంకల్పం కచ్చితంగా నెరవేరుతుంది. దేశంలో మౌలిక సదుపాయాలను మెరుగు పరచ డం మీదనే ఎన్డీఏ దృష్టిని కేంద్రీకరించింది. ఇందు కోసం 2015-16 ఆర్థిక సంవత్సరానికి రూ.70,000 కోట్లు కేటాయించింది. నాలుగు వేల మెగావాట్ల సామ ర్థ్యం కలిగిన ఐదు నూతన విద్యుత్ ప్రాజెక్టులను ఈ ఏడాది బడ్జెట్లో ప్రతిపాదించింది. ప్లగ్ అండ్ ప్లే విధా నంలో పారదర్శకమైన వేలం పద్ధతిని ప్రభుత్వం అను సరిస్తున్నది. అలాగే గ్రామీణ మౌలిక సదుపాయాల అభి వృద్ధి, సాగునీటి రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నది. కేవ లం ప్రభుత్వ కేటాయింపులపైననే ఆధారపడకుండా, ప్రైవేట్ పెట్టుబడులను రాబట్టే విధానానికి కూడా ప్రభు త్వం రూపకల్పన చేసింది. బొగ్గు, టెలికం విధానం అమలులో పాటించిన పారదర్శకత వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా నిధులు జమ కూడాయి. యూపీఏ కాలం నాటి బొగ్గు కుంభకో ణం కారణంగా ఖజానాకు రూ. 1.86 లక్షల కోట్లు నష్టం వాటిల్లింది. మరోపక్క టెలికం కుంభకోణంతో రూ.1. 76 లక్షల కోట్లు లూటీ అయినాయి. ఈ దోపిడీని నిలువ రించేందుకే ఎన్డీఏ ఈ-వేలం నిర్వహించి బొగ్గు గను లను కేటాయించింది. దీనితో ప్రభుత్వ ఖజానాకు రూ.2 లక్షల కోట్ల మేర ఆదాయం సమకూరబోతున్నది. టెలి కం వేలం ద్వారా కూడా ఇలాంటి లబ్ధే చేకూరబోతు న్నది. యూపీఏ హయాంలో బొగ్గు గనులపై రాయితీ మాత్రమే సర్కారుకు దక్కేది. కలసి కట్టుగా ‘టీం ఇండియా’ స్ఫూర్తితో పనిచేస్తేనే పురోగతి సాధ్యమని నరేంద్ర మోదీ విశ్వాసం. అందుకే 14వ ఆర్థిక సంఘం సిఫారసులను ప్రభుత్వం ఆమోదిం చింది. పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో రాష్ట్రాల వాటాను 32 నుంచి 42 శాతానికి పెంచింది. సంపద పంపిణీలో ఇదొక కొత్త చరిత్ర. సమ్మిళిత ఆర్థిక వృద్ధిలో పేదలను భాగస్వాములను చేయడానికి మోదీ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ‘ఈ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుంది. వారి కోసం ఆలోచిస్తుంది. వారి కోసమే ఉంది. వారికే అంకితమైంది. కోట్లాది మంది యువత, మాతృమూర్తులు, బిడ్డలు ఆత్మగౌరవంతో జీవించాలని కోరుతున్నారు. రైతులది, దళితులది, అణచివేయబడిన వారిది, వీరందరి ఆశలను నెరవేర్చడమే మా అందరి బాధ్యత’ అని ప్రధాని తన తొలి ఉపన్యాసంలో పేర్కొ న్నారు. పౌరులందరికీ బీమా, పింఛన్ వంటి సామాజిక భద్రతా పథకాలు కూడా ఇటీవల అమలులోకి వచ్చా యి. ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన కింద 15 కోట్ల బ్యాంక్ ఖాతాలను తెరిచారు. ఆర్థిక సమ్మిళిత వృద్ధిలో ఇదొక కీలకమైన అడుగు. అలాగే ముద్ర బ్యాంకుల స్థాపన పౌరుల ఆర్థిక స్వావలంబన దిశగా పడిన మరో అడుగు. 5.7 కోట్ల మంది సూక్ష్మ పారిశ్రామికవేత్తలకు ఇదొక గొప్ప ఆలంబన. వ్యవసాయేతర రంగంలోని 90 శాతం మందికి ఉపాధిని ఇస్తూ, 40 శాతం వ్యవసాయే తర జీడీపీని ఈ రంగం సాధిస్తున్నది. నల్లధనం నియంత్రణకు ఎన్డీఏ, బీజేపీ పట్టుద లతో ఉన్నాయి. నల్లధనం కారణంగా వనరుల సమీక రణ వ్యవస్థ నీరుగారిపోతోంది. అంతర్జాతీయ పరిస్థితు లతో రాజీ పడక తప్పని పరిస్థితులు తలెత్తుతున్నాయి. నల్లధనం నియంత్రణ కృషిలో ప్రధాని ప్రపంచ నేత లను, ప్రత్యేకించి బ్రిక్స్ దేశాధిపతులను ఒప్పించడంలో విజయం సాధించారు. నల్లధనం ప్రభావాన్ని తగ్గించడా నికి గత పార్లమెంటు సమావేశాలలోనే రెండు కొత్త చట్టా లను తీసుకురావడం కూడా జరిగింది. భారత జనాభాను భారంగా కాకుండా, వరంగా మార్చడం ఎన్డీఏ ఆశయం. అంటే నైపుణ్యాల అభి వృద్ధి మీద దృష్టి సారించాలి. ఇందుకోసమే కేంద్రం ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. 2020 సంవత్సరా నికల్లా 500 మిలియన్ల యువకులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని ఈ శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. మన దేశం లో ఏటా కోటీ యాభయ్ లక్షల మంది ఉద్యోగాల కోసం జాబ్ మార్కెట్లోకి వస్తున్నారు. ఇందులో వృత్తిపరమైన శిక్షణ లభిస్తున్నది మాత్రం కొందరికే. అలాగే 45 శాతం జనాభా యువత కావడం దేశానికి పెద్ద ఆస్తి. ఈ అవకా శాన్ని దేశాభివృద్ధి కోసం మలిచే నాయకత్వం కావాలి. లోక్‌సభలో బీజేపీ స్పష్టమైన మెజారిటీ సాధించ డం వల్ల కొన్ని మంచి చట్టాలను తీసుకువచ్చింది. గత పదిహేనేళ్ల బడ్జెట్ సమావేశాలను పరిశీలిస్తే, ఈ ఏడాది (2015) బడ్జెట్ సమావేశాలు ఎంతో ఫలప్రదంగా జరిగాయి. సుపరిపాలన కోసం, భవిష్యత్తు మీద ఆశతో ఇచ్చిన తీర్పు. ప్రజల ఆశలను వమ్ము చేయకుండా ఎన్డీఏ ఒక్కొక్క వాగ్దానాన్ని అమలు చేస్తూ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నది. (వ్యాసకర్త బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి) మొబైల్: 98685 00747 - పి.మురళీధర్‌రావు -
భారతదేశం గురించి పది వాస్తవాలు
భారతదేశంలో ఏ అంశాన్ని పరిశీలించినా సాధారణంగా ఒకేలా, సర్వసాధారణంగా ఉన్నట్లుగా అనిపిస్తుంటుంది. వేరుగా, భిన్నంగా అనిపించడం చాలా అరుదు. ఈ దేశంలో భిన్నప్రాంతాలు, భిన్న సంస్కృతుల మేళవింపు, భిన్న భాషలు, వృత్తులు, మాండలికాలు వంటివి కనిపిస్తాయి. ఇటువంటివి సాధారణంగా ఖండాలలో కనిపిస్తాయి. కాని ఒక దేశంలో ఇంతటి భిన్నత్వం కనిపించడం చాలా అరుదు. బిబిసి ఢిల్లీ కరస్పాండెంట్‌గా పనిచేసిన శామ్ మిల్లర్, తన జీవితంలో సగభాగం భారతదేశంలోనే గడిపారు. ఆయన భారతదేశం గురించి పది వాస్తవాలు తన అనుభవంతో వివరించారు. * అధికజనాభా... ఫొటో (2060 నాటికి భారతదేశ జనాభా ఊహించనంతగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు) 2028 నాటికి భారతదేశ జనాభా చైనా జనాభాను మించుతుందని అంచనా. రానున్న 14 సంవత్సరాలలో భారతదేశం ప్రపంచంలో జనాభాలో మొదటి స్థానం ఆక్రమిస్తుందని ఐక్యరాజ్యసమితిచెబుతోంది. అంటే సుమారు 1.4 బిలియన్ల మంది ఉంటారని ఊహిస్తున్నారు. అధిక జనాభాగా గుర్తింపు పొందడం ఒక విజయమే అయినప్పటికీ, శత్రు దేశమైన చైనా మిగిలిన విషయాలలో అభివృద్ధి చెందుతోంది. జనాభాను నియంత్రించడంలో భారతదేశం ఇంకా వెనుకబడే ఉంది. 1970 ప్రాంతంలో... కుటుంబ నియంత్రణ అమలు జరిపిన సమయంలో, కొన్నికొన్ని చోట్ల అది వివాదాస్పదంగాను, ఉత్పత్తి నిరోధకంగాను భావించి నిరోధించారు. అయితే స్త్రీ విద్య వల్ల జనాభా పెరుగుదల బాగా తగ్గింది. 2060 నాటికి భారతదేశ జనాభా 1.6 బిలియన్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం నైజీరియా, చైనాను అధిగమించి, జనాభా విషయంలో ద్వితీయస్థానంలో ఉంటుందని భావిస్తున్నారు. * భారతదేశం ఒకప్పుడు ద్వీపం... (ప్రపంచంలోకెల్లా హిమాలయాలు వయసులో అతి చిన్నవి) భారతదేశం ఒకప్పుడు ఖండం. 100 మిలియన్ల సంవత్సరాల క్రితం డైనసార్లు భూమి మీద సంచరిస్తున్న కాలంలో భారతదేశం ఒక ద్వీపంలా ఉండేదట. ప్రాచీనలిపి ఆధారంగా గోండ్వానాల్యాండ్ (గోండ్వానా అనే వ్యక్తి కారణంగా ఆ పేరు వచ్చింది. ఇది మధ్య భారతదేశంలో ఉన్న అటవీప్రాంతం) నెమ్మదిగా ఉత్తరదిక్కుగా ప్రయాణించిందని తెలుస్తోంది. 50 మిలియన్ల సంవత్సరాల క్రితం, డైనసార్లు... తీరప్రాంతం నుండి ఉత్తరదిక్కుగా ప్రయాణించిన కారణంగా అక్కడ హిమాలయాలు ఏర్పడ్డాయని, అందువల్ల అవి ప్రపంచంలోనే అతి చిన్నవయసుగల పర్వతశ్రేణులని, ఎత్తులో మాత్రం పెద్దవని తెలుస్తోంది. సముద్రాలలోని శిలాజాల ఆధారంగా హిమాలయాల వయసును లెక్కకట్టారు. * బహుభాషలు... భారతదేశం విభిన్న భాషల సమాహారం. సుమారు 1000 భాషలు ఇక్కడ మాట్లాడతారు. అయితే ఒక భాషను మొదటిదని, మరో భాష చివరిదని మాత్రం చెప్పలేం. 1961 లెక్కల ప్రకారం, భారతదేశంలో 1652 భాషలు (ఇందులో చాలావరకు మాండలికాలు ఉన్నప్పటికీ) ఉన్నాయి. కాలక్రమేణా కొన్ని భాషలు పూర్తిగా కాలగర్భంలో కలసిపోయాయి. అతి ఎక్కువగా మాట్లాడే భాషలైన హిందీ, బెంగాలీ, తెలుగు, మరాఠీ, తమిళం, ఉర్దూ వంటి ఆరు భాషలలో ప్రతి భాషను 50 మిలియన్ల మంది మాట్లాడుతున్నారు. 122 భాషలను 10,000 మంది కంటె ఎక్కువమంది మాట్లాడుతున్నారు. భారతదేశానికి జాతీయ భాష లేదు. హిందీ, ఇంగ్లీషు... రెండు భాషలూ అధికార భాషలే. హిందీ ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. ముఖ్యంగా తమిళులు హిందీ భాష విషయంలో తమ వ్యతిరేకతను తెలియచేస్తున్నారు. అందువల్ల ఇంగ్లీషు అధికారభాషగా నిలబడిపోయింది. భారతీయ భాషలు ప్రపంచంలోని నాలుగు భాషా కుటుంబాలకు చెంది ఉన్నాయి. ఇండో యూరోపియన్, ద్రవిడియన్, ఆస్ట్రో ఆసియాటిక్, టిబెటో బర్మన్. 20 శతాబ్దపు మధ్యభాగం వరకు ఆఫ్రికాలో పుట్టిన బంటు భాషా కుటుంబం, తూర్పు ఆఫ్రికా నుంచి వలస వచ్చినవారు, పశ్చిమభారతదేశంలో నివసించేవారు ఉపయోగించే సిది భాష మాట్లాడేవారికి ప్రాతినిథ్యం వహించింది. కాలక్రమేణా ఆ భాష ప్రస్తుతం కాలగర్భంలో కలిసిపోయింది. సిది జాతివారు బంటూ పదాలను కొద్దికొద్దిగా ఉపయోగిస్తున్నారు. * మెగా సిటీస్ (నగరాలలోని స్లమ్స్‌లో నీరు దొరకటం దుర్భరం) ప్రపంచంలోని పది మహానగరాలలో మూడు భారతదేశంలోనే ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి ప్రకారం ప్రపంచంలోనే అధిక జనాభా ఉన్న అతి పెద్దనగరాలలో ఢిల్లీ రెండవది, ముంబై ఏడవది, కలకత్తాది పదవస్థానం. ఢిల్లీ జనాభా 22.65 మిలియన్లు. అంటే టోక్యోను అధిగమించినట్లు. 17 వ శతాబ్దంలో ఢిల్లీ ప్రపంచంలోకెల్లా అత్యధిక జనాభా కలిగిన నగరం. కాని 1960 నాటికి, ఢిల్లీ కనీసం 30 వ స్థానంలో కూడా లేదు. నాటి నుంచి ఈ నగర పెరుగుదల ఏడాదికి కేవలం 4 శాతం మాత్రమే. ఆ పెరుగుదల రానురాను తగ్గుతున్నప్పటికీ ఇప్పటికి ఆ పెరుగుదల 3 శాతానికి పడిపోయింది. అంటే యేటా జనాభా రేటు పెరుగుతున్నప్పటికీ, శిశుజననాలు, వలసలు 700000కి పెరిగి, భారత రాజధాని మీద వనరుల కోసం ఒత్తిడి పెరిగింది. నీరు ప్రధాన సమస్యగా పరిణమించింది. నగరంలో నాలుగోవంతు భాగంలో ప్రతిరోజూ నీటి సరఫరా ఉండదు. భారతదేశంలోని చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, పూణె, సూరత్... ఈ నగరాలు అత్యధిక జనాభా ఉన్న 100 నగరాలలో నిలబడ్డాయి. * ఓటర్లు (417,037,606) (ఓటర్ల చేతి వేలి మీద ఇంకు మార్కు వేసి, ఒక వ్యక్తి ఒకే ఓటు అని సూచిస్తున్నారు) ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. (చైనీయులు వారి పాలకులను నేరుగా ఎన్నుకోరు). 417,037,606 మంది ఓటర్లు అంటే సుమారు 60 శాతం మంది, 2009 ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 830,866 పోలింగ్ స్టేషన్లు పెట్టారు. గుజరాత్ పశ్చిమభాగంలో ఒక ప్రాంతంలో కేవలం ఒకే ఒక్క ఓటరు ఉన్నాడు. ఆయన కూడా అక్కడి స్థానిక గుడికి సంరక్షకుడిగా ఉన్నారు. ఏ ఒక్క ఓటరూ ఓటు వేయడం కోసం రెండు కిలోమీటర్ల కంటె ప్రయాణించకూడదని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. అవసరమనుకుంటే కుష్ఠురోగులకు, నడవలేనివారి కోసం ప్రత్యేకంగా ఒక పోలింగ్ స్టేషన్‌ను ఉంచాలని ప్రకటించింది. 1996 ఎన్నికలలో తమిళనాడులోని మోదుకుర్చి అసెంబ్లీ నియోజకవర్గానికి రికార్డుస్థాయిలో 1032 మంది అభ్యర్థులు పోటీలో నిలబడ్డారు. అందులో ఇద్దరు అభ్యర్థులకు మాత్రమే ధరావత్తు వచ్చింది. 88 మంది అభ్యర్థులు కనీసం ఒక్క ఓటు కూడా పొందలేదు. * భారతదేశం ముస్లిం సామ్రాజ్యం... (ఇండియన్ బోహ్రా ముస్లింలు ముంబైలో సమావేశమయ్యారు) ప్రపంచంలో ముస్లిములు అధికంగా ఉన్న దేశాలలో భారతదేశం రెండవస్థానంలో ఉంది. 15 శాతం భారతీయులు ముస్లిములు అయినప్పటికీ, ఇండోనేషియా, పాకిస్థాన్ దేశాలను మినహాయిస్తే, భారతదేశం రెండవస్థానంలో ఉంది. భారతదేశంలో ముస్లిముల సంఖ్య పాకిస్థాన్‌లో ముస్లిముల సంఖ్యతో సమానం. మొట్టమొదటగా ముస్లిములు ముహమ్మద్ ప్రవక్త జీవించిన కాలంలో కేరళకు వచ్చారు. స్వాతంత్య్రం సమయంలో తూర్పు, పశ్చిమ పాకిస్థాన్ నుంచి మిలియన్ల కొలదీ ముస్లిములుభారతదేశానికి వలస వచ్చారు. అలా వచ్చినవారిలో చాలామంది ఇక్కడే ఉండిపోయారు. ఈరోజు భారతదేశంలోని కాశ్మీర్, లక్షద్వీపాలలో ముస్లిముల సంఖ్య అధికంగా ఉంది. వీరు నెమ్మదిగా దేశమంతా వ్యాపిస్తున్నారు. * భయంకరమైన రోడ్లు (ప్రపంచంలోనే అతి భయంకరమైన రోడ్లు భారతదేశంలో ఉన్నాయి) ప్రపంచంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నది భారతదేశంలోనే. భారతదేశంలోని రోడ్లను సందర్శించినవారెవ్వరూ ఈ విషయంలో ఆశ్చర్యపోరు. ఈ మధ్యే బ్రిటిష్ మెడికల్ స్టడీ ఇచ్చిన లెక్కల ప్రకారం 115, 000 మంది భారతీయులు రోడ్డు ప్రమాదంలో మరణించారని, అయితే వాస్తవానికి ఈ సంఖ్య 200,000 ఉంటుందని పేర్కొంది. ఈ రిపోర్టు ప్రకారం చనిపోయినవారిలో 37 శాతం మంది పాదచారులు, 28 శాతం మంది సైకిల్, మోటారుసైకిళ్లపై వెళ్లేవారు, వారిలో 55 శాతం మంది ప్రమాదం జరిగిన ఐదు నిముషాలలోనే మరణించారని తెలిపింది. ఎక్కువ స్పీడ్ బ్రేకర్లు వేయడం, హెల్మెట్ల వాడకం తప్పనిసరి చేయడం, ట్రాఫిక్ నియమాలను డ్రైవర్లు ఉల్లంఘించకుండా చేయడం... వంటివి పాటిస్తే ఈ ప్రమాదాలను నిర్మూలించవచ్చని పేర్కొంది. * భారతదేశ చలనచిత్రాలన్నీ బాలీవుడ్‌కి చెందినవి కావు... ప్రపంచంలోకెల్లా అతి పెద్ద చలనచిత్ర పరిశ్రమ భారతదేశంలోనే ఉంది. 1100 చలనచిత్రాలు యేటా విడుదలవుతున్నాయి. ఇది నైజీరియా కంటె కొద్దిగా ఎక్కువ, అమెరికా కంటె రెట్టింపు, బ్రిటన్ కంటె పదిరెట్లు ఎక్కువ. యేటా 200 చలనచిత్రాలను తీసే ముంబైకి ఉన్న బాలీవుడ్ అనే ముద్దుపేరు భారతదేశం మొత్తానికి వర్తించదు. అన్ని సినిమాలు ఆ పేరు మీద విడుదల కావు. తమిళం, తెలుగు భాషలలో అత్యధిక చిత్రాలు విడుదలవుతున్నాయి. అయినప్పటికీ ప్రపంచంలో భారతదేశం బాక్సాఫీస్ విషయంలో ఆరవస్థానంలో ఉంది. అమెరికా, చైనా, జపాన్, బ్రిటన్, ఫ్రాన్స్ మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. * మామిడికాయల గుట్టలు (ప్రపంచంలోనే అత్యధికంగా 40 శాతం మామిడిపంట భారతదేశంలో పండుతుంది) ప్రపంచంలోకెల్లా మామిడిపండ్ల అత్యధిక ఉత్పత్తి, అత్యధిక వినియోగం భారతదేశంలోనే. వేసవికాలంలో మామిడిపండ్లను తినడానికి అందరూ ఆసక్తి చూపుతారు. ఇది భారతదేశ జాతీయఫలం. భారతదేశంలో ఎన్నోరకాల మామిడిపండ్లు ఉత్పత్తి అవుతాయి. అందులో 30 రకాలు వాణిజ్యపంటగా ఉన్నాయి. ఇది ప్రతిఒక్కరికీ అత్యంత ప్రీతిపాత్రమైన పండు. చాలామంది ఏ రకం మామిడి మంచిగా, రుచిగా ఉంటుందనే విషయంపై చర్చించుకుంటుంటారు. ముంబైలో స్థానికంగా దొరికే అల్ఫాన్సా పండు రుచి గురించి, ‘అంత గొప్పది ఉండదు’ అంటే వారికి చాలా కోపం వస్తుంది. చైనా, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్‌ల కంటె అత్యధికంగా 40 శాతం మామిడి పంట భారతదేశంలో పండుతుంది. * రికార్డు బ్రేకర్... (భారతీయ విద్యార్థులు అధికసంఖ్యలో మహాత్మాగాంధీ వేషం ధరించారు) భారతదేశంలో మరే ఇతర దేశాలలోనూ లేని విధంగా రికార్డులు బ్రేక్ చేయడం ఎక్కువ. ఇది ముమ్మాటికీ సత్యం. గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రకారం, యేటా రికార్డులు సాధించేవారిలో అమెరికా, బ్రిటన్ తరువాతి స్థానం భారతదేశానిదే. అత్యధిక సంఖ్యలో 891 మంది విద్యార్థులు మహాత్మాగాంధీ వేషం ధరించి ఈ మధ్యనే ఒక రికార్డు నెలకొల్పారు.రికార్డు నెలకొల్పారు. ఈ రికార్డులలో పశువుల పేడతో తయారుచేసిన అతి పెద్ద దండ, గుర్రం వీపు మీద 10 గంటలపాటు కూర్చుని యోగా చేయడం, ఒకరి ముక్కులో నుంచి మరొకరి నోటి దాకా కరెంట్ వైర్ ఉంచి, దీపాలు వెలిగించడం (36 వాట్ల బల్బు) వంటివి. 2007లో తమిళనాడులోని ఒక ఆసుపత్రిలో 15 ఏళ్ల వయసున్న బాలుడు, డాక్టర్ పర్యవేక్షణలో సిజేరియన్ చేశాడు. ప్రపంచంలోనే ఇటువంటి సర్జరీ చేసిన అతి పిన్నవయస్కుడు ఈ బాలుడు. చిత్రమేమిటంటే అక్కడి పోలీసులు, మెడికల్ అధికారులు దీనిని ప్రపంచ రికార్డుగా పంపడానికి ముందుకు రాలేదు. - డా.వైజయంతి