ఎట్టకేలకు కదలిక?! | Sakshi Editorial On India Census | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు కదలిక?!

Published Thu, Oct 31 2024 12:03 AM | Last Updated on Thu, Oct 31 2024 12:03 AM

Sakshi Editorial On India Census

నాలుగేళ్ళ జాప్యం తరువాత ఎట్టకేలకు రథం కదులుతున్నట్టుంది. దేశంలో పదేళ్ళకు ఒకసారి చేయాల్సిన జనగణన ఎలాగైతేనేం వచ్చే 2025లో ముందడుగేసే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్ర సర్కార్‌ అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్టు వినిపిస్తోంది. 2026 మార్చి నాటికి ఆ గణాంకాలు అందుబాటులోకి వస్తాయట. 2011 తర్వాత మళ్ళీ ఇన్నేళ్ళకు జరగనున్న ఈ జనగణన, అది అందించే సమాచారం విధానపరమైన నిర్ణయాలు తీసుకొనేందుకు కీలకం. 

అందుకే, ఇప్పటికైనా ఈ బృహత్‌ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టాలనుకోవడం ఆహ్వానించదగిన విషయం. ప్రజా సంక్షేమ పథకాల రూపకల్పనతో పాటు పలు రాజకీయ నిర్ణయాలకూ ఈ జనగణన భూమిక కానుంది. జనగణనతో పాటు పనిలో పనిగా కులగణన కూడా జరపాలనే డిమాండ్‌ ఊపందుకుంది. అలాగే, ఇకపై 2025ను ప్రాతిపదికగా తీసుకొని ప్రతి దశాబ్దం మొదట్లో జరపాల్సిన జనగణన తాలూకు కాలరేఖను 2035, ’45... అలా మారుస్తారనే మాటా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. అవసరమైతే అఖిలపక్ష భేటీ జరపాలనే వాదన వస్తున్నది అందుకే. 

1881 నుంచి నిర్వహిస్తున్న ఈ జనాభా లెక్కల ప్రక్రియ అసలు 2021లోనే జరగాల్సింది. అయితే, రాజ్యాంగ రీత్యా కేంద్రం పరిధిలోని ఈ ప్రక్రియను కోవిడ్‌–19 కారణంగా సర్కారు వాయిదా వేసింది. ఆ పైన కరోనా పోయినా ఈ బృహత్తర బాధ్యత నెరవేర్చడానికి మోదీ సర్కార్‌ ఎందుకో ఉత్సాహం చూపలేదు. పాత కాలపు జనాభా లెక్కలతో ప్రస్తుత ప్రజా అవసరాలను ఎలా తెలుసుకుంటారన్న విమర్శలకూ గురైంది. 

ఎందుకంటే, కేవలం తలల లెక్కగా కాక జనాభా హెచ్చు తగ్గుల ధోరణులతో పాటు, సామాజిక, ఆర్థిక పరిస్థితులను సైతం అర్థం చేసుకోవడానికి జనగణన కీలకసూచిక. ప్రభుత్వ ప్రాధాన్యాల నిర్ణయం, వనరుల కేటాయింపు, సంక్షేమ పథకాల రూపకల్ప నకు ఉపకరించే సమగ్ర సమాచార సమాహారం. దేశంలోని సంక్లిష్టమైన సామాజిక సమస్యల పరిష్కారానికి ఓ కరదీపిక. కచ్చితమైన సమాచారం ద్వారానే విద్య, వైద్యం, గృహనిర్మాణం, ప్రాథమిక వసతుల్లో అన్ని ప్రాంతాల్లో సమానాభివృద్ధికి సర్కారు జోక్యం చేసుకొనే వీలుంటుంది. 

అదే సమయంలో రాజకీయ పర్యవసానాలూ అనేకం. నియోజకవర్గాల పునర్విభజనకూ, జనాభా లెక్కలకూ లింకుంది. ‘‘2026 తరువాత జరిగే తొలి జనగణన’’ ఆధారంగా చట్టసభలలో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని 2002లోనే అప్పటి వాజ్‌పేయి సర్కార్‌ నిర్ణయించింది. అందువల్ల రాజకీయాల రూపురేఖలను మార్చే జనగణన చర్చోపచర్చలకు కారణమవుతోంది. బీజేపీకి ఆది నుంచి దక్షిణాది కన్నా ఉత్తరాదిలోనే బలం, బలగం ఎక్కువ. 

జనగణన అనంతరం జనసంఖ్య ఆధారంగా పునర్విభజన జరిగితే... కట్టుదిట్టంగా జనాభా నియంత్రణ చర్యలు చేపట్టిన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయి. పార్లమెంట్‌ స్థానాల సంఖ్య దక్షిణాదిలో తగ్గి, ఉత్తరాదిలో పెరుగు తుంది. అది కాషాయపార్టీకి అనుకూలంగా మారుతుందనే అనుమానం ఉంది. ప్రజాస్వామ్యమంటే ప్రజాసంఖ్యకు సిసలైన రీతిలో ప్రాతినిధ్యం వహించాలన్నది నిజమే. అంత మాత్రాన కుటుంబ నియంత్రణ పాటించనందుకు గాను అధికారం ఉత్తరాది వైపు మొగ్గడమూ సమర్థనీయం కాదు. 

1951 నుంచి మన జనగణనలో ఎస్సీ, ఎస్టీలు మినహా మిగతా కులాల లెక్కలు వేయడం లేదు. కానీ, కులాల వారీ జనాభా ఆధారంగా మెరుగైన ప్రాతినిధ్యం, వనరుల కేటాయింపు జరగాలన్నది దీర్ఘకాలిక డిమాండ్‌. ఈ న్యాయమైన ప్రజాకాంక్షను కేంద్రం ఇప్పటికైనా పట్టించుకొని తీరాలి. అలాగే, లెక్కల్లో ఆడవాళ్ళ సంఖ్య తేలడంతో చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్‌ అమలుకు మెరుగైన ప్రాతిపదిక సిద్ధమవుతుంది. 

వీటి వల్ల సామాజిక న్యాయం, సమ్మిళిత ఆర్థిక పురోగతి, స్త్రీ – పురుష సమానత్వ స్పృహతో విధాన నిర్ణయానికీ వీలు చిక్కుతుంది. పైగా, ఈ పర్యాయం జనాభా లెక్కలు తొలిసారిగా డిజిటల్‌ విధానంలో జరగనున్నందున వివరాలు, విశేషాలు మరింత నిక్కచ్చిగా, వేగంగా అందవచ్చు. 

సాధారణంగా ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30 మధ్య ముందస్తు పరీక్షగా జనాభా లెక్కల సన్నాహక ప్రక్రియ జరుపుతారు. మరుసటేడు ఫిబ్రవరిలో అసలు లెక్కలు జరుపుతారు. 2021 జనాభా లెక్కల కోసం 2019లోనే ఆ ప్రీ–టెస్ట్‌ జరిపినా, జాప్యమైనందున మళ్ళీ ప్రీ–టెస్ట్‌ జరపవచ్చు. అధికారిక ప్రకటనతోనే ఈ సందేహాలకు సమాధానాలు దొరుకుతాయి. 

అత్యవసరం, అనివార్యమైనప్పటికీ, జనగణన అంశంలో దేశంలో చేపట్టాల్సిన చర్యలూ కొన్ని ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజనలో ఒకరికి మోదం, వేరొకరికి ఖేదం కలగరాదంటే... అమెరికా ఫక్కీలో మన వద్దా వివిధ రాష్ట్రాల మధ్య విద్య, ఉపాధి నిమిత్తం అంతర్గత వలసలను ప్రోత్సహించడం జనసంఖ్య సమతుల్య పంపిణీకి ఒక మార్గమని నిపుణుల మాట. 

అదే సమయంలో స్థానిక భాష, సంస్కృతుల్లో వలసదారులు కలగలసిపోయేలా ఇంగ్లీషు, హిందీ, స్థానిక భాష – అనే త్రిభాషా సూత్రాన్ని దేశవ్యాప్తంగా అనుసరించాలని మరో సూచన. హిందీ మాట్లాడే ఉత్తరాది రాష్ట్రాల వారు సైతం కచ్చితంగా మరో భారతీయ భాష నేర్చుకోవాలనే నియమం ద్వారా భాష, ప్రాంతాలకు అతీతంగా అందరినీ దగ్గర చేయవచ్చు. 

వెరసి, సమతుల్య జనాభా పంపిణీ, సాంస్కృతిక స్నేహవారధి సాయంతో ఆర్థికంగా, సామాజికంగా సంతులిత ప్రాంతీయాభివృద్ధికి బాటలు వేయవచ్చు. ఈసారికి 2025లో చేసినా, ఇకపై మునుపటిలానే ప్రతి దశాబ్ది ఆరంభంలోనే ఈ ప్రక్రియ చేపట్టడం మేలు. ఏమైనా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలి. ప్రాంతీయ ప్రయోజనాల్లో సమతూకం పాటించాలి. పరస్పర విశ్వాసంతో పాటు పూర్తి చిత్తశుద్ధి అందుకు అవసరం.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement