
రథం కదులుతోంది. ఎప్పుడో జరగాల్సిన పనిలో ఇప్పటికైనా అడుగులు ముందుకు పడుతున్నాయి. దేశంలో జనాభా లెక్కల పని ఎట్టకేలకు మరికొద్ది రోజుల్లోనే సెప్టెంబర్‌లో ఆరంభ మవుతోంది. ఆ మేరకు ఇటీవల వెలువడ్డ సమాచారం పెద్ద ఊరట. ప్రతి పదేళ్ళకు ఒకసారి జరగాల్సిన ఈ జనగణన యజ్ఞం నిజానికి 2021లోనే జరగాల్సి ఉంది. కోవిడ్ సహా అనేక సాకులతో ప్రభుత్వం సాచివేత ధోరణి ప్రదర్శిస్తూ వచ్చింది.
అయితే, భారత్ లాంటి వర్ధమాన దేశానికి జనగణన మినహా ప్రత్యామ్నాయ మార్గాలలో ఆ స్థాయి సమాచారం అందుబాటులో లేదు. ఉన్నా అది అంత నమ్మదగినదీ కాదు. అందుకే జనాభా పరంగా, సామాజిక – ఆర్థికపరంగా దేశ సమగ్ర స్వరూపాన్ని ఆవిష్కరించడానికి కొన్ని దశాబ్దాలుగా జనగణన అత్యంత కీలకమైనది.
అలాంటి జనగణన ప్రక్రియ ఇప్పుడు మళ్ళీ పట్టాలెక్కుతోంది. వచ్చే నెల (సెప్టెంబర్)లో ఆరంభ మయ్యే ఈ ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు ఏణ్ణర్ధ కాలం పడుతుందని ప్రభుత్వం మాట.
జనగణన అనేది పలువురు పొరబడుతున్నట్టు కేవలం గణాంకాల సేకరణ కాదు. అది సుపరి పాలనకు మూలస్తంభం. దేశం ఎదుర్కొనే సామాజిక, ఆర్థిక సవాళ్ళకు పరిష్కారాలు కనుగొనేందుకు మార్గదర్శి. పట్టణీకరణ, ప్రాథమిక వసతుల అభివృద్ధి మొదలు సాంఘిక సంక్షేమం, ఆర్థిక ప్రణాళిక వరకు ప్రతి అంశం పైనా సరైన విధాన నిర్ణయాలకు ఈ సమాచారమే కీలకం.
నిజానికి, జనాభా లెక్కల సేకరణలో కేంద్ర సర్కార్ చేసిన సుదీర్ఘ జాప్యం చాలాకాలంగా విమర్శలకు గురవుతోంది. ప్రైవేట్‌వారే కాదు... సర్కారీ ఆర్థిక నిపుణులు సైతం విమర్శకుల్లో ఉండడం గమనార్హం. పాత జనాభా లెక్కల ఆధారంగానే ఇప్పటికీ ఆరోగ్యం, ఆర్థిక అంశాలు, చివరకు ద్రవ్యోల్బణం రేటు, ఉపాధి లెక్కల లాంటివన్నీ గణిస్తూ ఉండడం వల్ల కచ్చితత్వం లోపిస్తోంది. డేటా లోపంతో కనీసం 15 కీలక అంశాలపై దుష్ప్రభావం పడింది. అదే ఈ నిపుణులందరి బాధ.
పుష్కర కాలం క్రితపు లెక్కలపై ఆధారపడే సరికి అంతా లోపభూయిష్టమైంది. దాదాపు 10 కోట్ల మంది పౌర సరఫరా వ్యవస్థకు వెలుపలే ఆహారభద్రత లేకుండా మిగిలిపోయారు. ఇళ్ళు, శ్రామికుల సంఖ్య ఆధారంగా రాష్ట్రాలకు కేంద్రం కేటాయించే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులపైనా దెబ్బ పడింది. చివరకు నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ వారి సర్వేల నాణ్యత కూడా దెబ్బతింది.
అంతెందుకు... జనాభాలో చైనాను భారత్ దాటేసి, ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా అవతరించినట్టు ఐరాస నివేదిక గత ఏడాది ప్రకటించింది. దాన్ని ఖరారు చేయడానికో, కాదనడానికో, ఆ జనాభా లెక్కకు అనుగణంగా అవసరమైన చర్యలు చేపట్టాడానికో కూడా మన వద్ద నిర్దుష్టమైన గణాంకాలు లేని పరిస్థితి. అలాంటి లోపాలన్నీ సరిదిద్దుకోవడానికి ఇప్పుడిది సదవకాశం. అదే సమయంలో జనగణనలో భాగంగా మన జనాభా తాలూకు కులగణన కూడా చేయడం అత్యవసరం. దేశంలోని ప్రధాన పార్టీలన్నీ కోరుతున్నది అదే.
తద్వారా జనసంఖ్యలో ఏ సామాజిక వర్గం వంతు ఎంత, ఏయే వర్గాల స్థితిగతులు ఏమిటి, ఏ వర్గాలు ఎంతగా వెనకబడి ఉన్నాయి తదితర భోగట్టా తేటతెల్లమవుతుంది. కులాలు, ఉపకులాలతో పాటు వర్తమానంలో కనుమరుగైపోతున్న ఆశ్రిత కులాల లెక్కలూ వెలికివస్తాయి. వెనుకబడిన వర్గాలకు చేయూతనిచ్చేలా పాలకులు పాలసీలు చేయడానికీ వీలవుతుంది. ప్రణాళిక, పాలన, చట్టాల రూపకల్పన సహా అనేక ప్రభుత్వ కార్యక్రమాలపై సమీక్షకూ, నిర్వహణకూ ఈ సమాచారమంతా ఉపకరిస్తుంది.
తాజా జనగణన రాజకీయంగానూ ప్రధానమే. దేశంలోని అన్ని స్థాయుల చట్టసభలలో నియో జక వర్గాల పునర్విభజన, రిజర్వేషన్‌కు ఈ కొత్త లెక్కలే ఆధారమవుతాయి. అంటే, అసెంబ్లీ, పార్ల మెంట్ స్థానాల సంఖ్య మారిపోనుంది. ఈ లెక్కన దక్షిణాదితో పోలిస్తే జనాభా నియంత్రణ అంతగా లేని ఉత్తరాదిలో మరిన్ని చట్టసభా స్థానాలు వస్తాయి. ఫలితంగా అధికార సమీకరణాలూ మారి పోతాయి.
ఇంతటి ముఖ్యమైనది కాబట్టే... ఇలాంటి అధికారిక గణాంక వ్యవస్థను ప్రభుత్వ, రాజ కీయ జోక్యాలకు వీలైనంత దూరంగా ఉంచడం శ్రేయస్కరం. మారిన కాలానికి అనుగుణంగా కొత్త జనగణన రూపురేఖలూ మారుతున్నాయట. ప్రధానంగా డిజిటల్ పద్ధతిలో, అదీ స్వీయ నమోదు పద్ధతిలో జనగణన సాగనుంది. గతంలో స్త్రీ, పురుషుల వివరాలనే దఖలు పరిస్తే, ఇప్పుడు తొలి సారిగా ట్రాన్స్‌జెండర్ల వివరాలనూ ప్రత్యేకంగా నమోదు చేయనున్నారు. అలాగే, ఎస్సీ, ఎస్టీలే కాక ‘ఇతర వెనుకబడిన వర్గాలు’ అంటూ వివరాలు విడిగా నింపనున్నారట.
ఏమైతేనేం, ఇన్నేళ్ళ తరువాతైనా జనాభా లెక్కల ప్రక్రియను మళ్ళీ చేపట్టడం హర్షణీయం. అతి ముఖ్యమైన బృహత్ యజ్ఞాన్ని ఇక నుంచైనా ఎప్పటికప్పుడు నిర్ణీత సమయానికే నిర్వహించడం అత్యవసరం. తద్వారానే కచ్చితమైన డేటా దేశంలో పాలనా యంత్రాంగానికి అందుబాటులోకి వస్తుంది. 2026 మార్చి కల్లా ఈ జనగణన ఫలితాలను సమర్పించేందుకు కేంద్ర శాఖలు ఇప్పటికే నిర్ణీత కాలవ్యవధి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. దీంతో, 2011 నుంచి అప్పటి దాకా... అంటే 15 ఏళ్ళ కాలవ్యవధిలోని సమాచారం చేతిలోకి వస్తుంది.
అయితే, ఈసారి జరిగిన జాప్యం నుంచి పాఠాలు నేర్చుకోవాలి. దేశం ముందుకు సాగడానికి దాని సమూహ స్వరూప స్వభావాలు దానికైనా తెలిసి ఉండడం ముఖ్యం. అలాంటి సమాచార సేకరణ, వినియోగంలో అంతరాయాలు రాకుండా జాగ్రత్తపడాలి. ఊహించని ఆటంకాలు ఎదురైనా ఇబ్బంది పడకుండా ఉండేలా జనాభాపై సమగ్ర సమాచారం అందించే కట్టుదిట్టమైన వ్యవస్థలను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి ప్రయత్నాలు జరగడానికి ఇదే తరుణం.
Comments
Please login to add a commentAdd a comment