జనాభా వృద్ధికి జాగ్రత్తగా పగ్గం | Sakshi Editorial On India Population And Gender Ratio | Sakshi
Sakshi News home page

జనాభా వృద్ధికి జాగ్రత్తగా పగ్గం

Published Sat, Nov 27 2021 12:33 AM | Last Updated on Sat, Nov 27 2021 12:33 AM

Sakshi Editorial On India Population And Gender Ratio

దేశంలో జనాభా విస్ఫోటన భయం కొంత తగ్గినట్టే! జనాభా వృద్ధి నియంత్రణ చర్యలు ఫలితా లిస్తున్నాయి. దాదాపు దేశమంతటా ఆశించిన స్థాయిలోనే జనాభా వృద్ధిని కట్టడి చేయగలిగినట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌–5) తేల్చింది. మరో ఆరోగ్యకరమైన సంకేతం... దేశంలో మహిళా జనాభా పురుష జనాభాను దాటడం. ప్రతి వెయ్యి మంది పురుషులకు దేశంలో 1020 మంది మహిళలున్నట్టు తాజా సర్వే తెలిపింది. ఇలా మహిళల జనాభా పెరగడం, దాదాపు మూడు దశాబ్దాల ఈ సర్వే పర్వంలో తొలి నమోదు! అయితే ఈ లింగ నిష్పత్తి జననాల స్థాయిలో (ఎస్సార్బీ) ఇలా లేదు! అక్కడ పరిస్థితి భిన్నంగానే ఉంది.

ప్రతి వెయ్యిమంది పురుషులకు 929 మంది మహిళలే ఉంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్వో) సహజమని చెప్పే స్త్రీ–పురుష నిష్పత్తి 950–1000తో పోలిస్తే ఇది తక్కువే! కానీ, అయిదేళ్ల కిందటి 2015–16 సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌–4) చెప్పిన నిష్పత్తి (919–1000) కన్నా ప్రస్తుత పరిస్థితి మెరుగే! పరిమిత నమూనాలతో జరిపే ఈ సర్వే ఫలితాలను ప్రామాణికంగా భావించరు. పదేళ్లకోసారి వచ్చే సాధా రణ జనాభా లెక్కలే ప్రామాణికం. 2001, 2011 జనాభా లెక్కల్లో స్త్రీ–పురుష నిష్పత్తి సరళి కూడా ఇట్లాగే ఉంది. సాపేక్షంగా ఈ సర్వే నివేదికలూ వాస్తవికతకు దగ్గరగా ఉన్నట్టే! ఒకటి మాత్రం నిజం.

వివిధ సమాజాల్లో ఈ లింగవివక్ష, కాన్పుకు ముందే లింగ నిర్ధారణ దురదృష్టకరం, నేరం! ఆడ పిల్లలను అంతమొందించే బ్రూణహత్యలు జరుగుతూనే ఉన్నాయి. వెయ్యిమంది పురుషులకు హిమాచల్‌ప్రదేశ్‌(875), తమిళనాడు(878), హరియాణా(893), ఒడిశా(894) లాగే తెలంగాణ (894)లోనూ మహిళల సంఖ్య తక్కువగా నమోదయింది. ఆంధ్రప్రదేశ్‌లో కొంత మెరుగ్గా (934) ఉంది. కేరళలో అయిదేళ్ల కింద 1047గా ఉన్న మహిళల సంఖ్య తాజాగా 951కి పడిపోయింది. ఢిల్లీలో 812 నుంచి ఏకంగా 923కి పెరిగింది! ఒట్టి జననాల్లో కాకుండా మొత్తం జనాభాలో మహి ళల నిష్పత్తి పురుషుల కన్నా ప్రస్తుతం పెరగడానికి పలు కారణాలుంటాయి. మరణాల రేటులో వ్యత్యాసం, మహిళల్లో ఆయుఃకాలం పెరగటం వంటివీ ఈ అంశాన్ని ప్రభావితం చేస్తాయి.

కుటుంబ ఆరోగ్య సర్వేలో కొన్ని మంచి ఫలితాలు కనిపిస్తే, మరికొన్ని విషయాల్లో ఆందోళనకర సంకేతాలు వెలువడటాన్ని పాలకులు గుర్తించాలి. పిల్లలు, మహిళల్లో పౌష్టికాహార లోపం, ఇనుము కొరవడి రక్తహీనత (అనీమియా) ప్రబలడాన్ని తీవ్రంగా పరిగణించి, నివారణ చర్యల్ని ముమ్మరం చేయాలి. పిల్లల్లో రక్తహీనత కేసులు గత సర్వే కాలంలో 58.6 శాతం ఉంటే, ఇప్పుడది 67 శాతానికి పెరిగింది. గర్భిణీల్లో 50.4 శాతం నుంచి 52.2 శాతానికి, 15–49 మధ్య వయస్కులైన మహిళల్లో 53 నుంచి 57 శాతానికి పెరిగింది. అదే వయసు పురుషుల్లో 22.7 నుంచి 25 శాతానికి పెరగటం సమస్య తీవ్రతకు నిదర్శనం.

‘అనీమియా రహిత భారత్‌’ నినాదంతో, 2022 నాటికి కేసుల్ని తగ్గిం చాలని కేంద్ర ప్రభుత్వం నిర్దిష్ట లక్ష్యాలతో పనిచేస్తున్నా ఆశించిన ప్రగతి లేదని సర్వే తేల్చింది. పళ్లు, కూరగాయలు సరిగా తినకపోవడం, ఇతరత్రా పౌష్టికాహార లోపాలతోనే రక్తహీనత పెరిగి సమస్య జటిలమౌతోంది. కరోనా కాలంలో ఆదాయాలు రమారమి పడిపోయి, నిత్యావసరాల ధరలు పెరగ టం కూడా ఈ సమస్యను తీవ్రతరం చేసింది. రోజువారీ భోజనంలో, తమ ఆర్థిక స్థాయిలోనూ సమ కూర్చుకోగలిగిన నిర్దిష్ట ఆహార పదార్థాలపైన జనాలకి స్పష్టమైన అవగాహన ముఖ్యం. జాతీయ పౌష్టికాహార సంస్థ ప్రచారం కల్పిస్తున్నప్పటికీ, సరిపోవడం లేదు. ప్రజలింకా చైతన్యం కావాలి.

దేశవ్యాప్తంగా మొత్తం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను గ్రూపులు చేసి రెండు విడతల్లో నిర్వహించిన ఈ సర్వే ఏపీ, తెలంగాణల్లో తొలివిడతలోనే జరిగింది. వైద్యారోగ్యపరంగా కొన్ని మంచి సంకేతాలీ రాష్ట్రాల్లో వెలువడ్డాయి. పౌరులకు ఆరోగ్య భీమా వర్తింపజేయడంలో దేశంలోనే రెండు తెలుగు రాష్ట్రాలు అగ్రభాగాన ఉన్నాయి. ఏపీలో పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చించి ‘నాడు– నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వాసుపత్రుల రూపురేఖల్ని మారుస్తున్న చర్య సత్ఫలితాలిస్తోంది. ఆస్పత్రుల్లో కాన్పులు పెరిగాయి. కాన్పువేళ, తదనంతరం మాతా–శిశు మరణాలు తగ్గాయి. కొన్ని విషయాల్లో దేశవ్యాప్తంగానూ ఆశావహ సంకేతాలున్నాయి.

దేశంలో నాల్గింట మూడొంతుల మంది మహిళలు బ్యాంకుల్లో అకౌంట్లు తెరిచారు. స్త్రీ–పురుషుల్లోనూ ఇంటర్నెట్‌ వాడకం బాగా పెరిగింది. గృహ హింస, అదీ జీవిత భాగస్వామి నుంచి తగ్గినట్టు నమోదైంది. కుటుంబ నియంత్రణ పట్ల అవ గాహన పెరగటమే కాక సురక్షిత పద్ధతులు వారికి తెలిసి వచ్చాయి. జననాల రేటు తగ్గించడంలో ఇదెంతో ఉపయోగపడ్డట్టు గణాంకాలున్నాయి. జనాభా వృద్ధి కట్టడిలో చాలా రాష్ట్రాలు గణనీయ ఫలితాలే సాధిస్తున్నాయి. మొత్తం సంతానోత్పత్తి రేటు(టీఎఫ్పార్‌)ను 2.1 కన్నా తక్కువకి నియం త్రిస్తే జనన–మరణాల ప్రక్రియ కొనసాగుతూనే, ఇప్పుడున్న జనసంఖ్య స్థిరపడుతుందనేది ఓ లెక్క!

బిహార్, మేఘాలయ, మణిపూర్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌ తప్ప దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలూ టీఎఫ్పార్‌ని 2 కన్నా కిందే నిలిపేయడం మంచి పరిణామం. అయినా, 2040–50 సంవత్సరాల మధ్య భారత్‌ అత్యధిక (160 నుంచి 180 కోట్ల మందితో) జనాభా దేశంగా ఆవిర్భవించనుంది. 2031 నాటికే చైనాను అధిగమిస్తామని మరో అధ్యయనం! 2022కే అధిగమి స్తామన్న ఐక్యరాజ్యసమితి (యూఎన్‌) అంచనాను తప్పించామంటే, జన విస్ఫోటన తేదీని మనం ముందుకు, మరింత ముందుకు జరుపుతున్నట్టే లెక్క! ఇది ఆశావహ సంకేతం!! 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement