ఒకే వ్యక్తిలో స్త్రీ, పురుష జననాంగాలు! | Hyderabad: Female and male genitalia in one person | Sakshi
Sakshi News home page

ఒకే వ్యక్తిలో స్త్రీ, పురుష జననాంగాలు!

Aug 23 2023 2:18 AM | Updated on Aug 23 2023 2:18 AM

Hyderabad: Female and male genitalia in one person - Sakshi

రాంగోపాల్‌పేట్‌ (హైదరాబాద్‌): మంచిర్యాలకు చెందిన ఓ వ్యక్తి వృషణాలు లేకుండా పుట్టాడు. 40 ఏళ్లుగా అలాగే ఉన్నాడు. పెళ్లి చేసుకున్నా.. ఎంతకు పిల్లలు పుట్టకపోవడం, పొత్తి కడుపు కింద నొప్పితో సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రికి వచ్చాడు. అల్ట్రాసౌండ్, స్కానింగ్, ఎంఆర్‌ఐ వంటి పరీక్షలు చేయగా.. ఆ వ్యక్తిలో స్త్రీ, పురుష జననాంగాలు రెండూ ఉన్న­ట్టు గుర్తించారు.

జన్యు ఉత్పరివర్తనం (మ్యుటేషన్‌) కారణంగా ఈ పరిస్థితి తలెత్తినట్టు తేల్చారు.ఆస్ప­త్రిలో ఆయనకు ఆండ్రాలజిస్టు, రోబోటిక్‌ సర్జన్‌ వైఎం ప్రశాంత్‌ చికిత్స చేశారు. దీనికి సంబంధించి వైద్యుడు వెల్లడించిన వివరాల మేరకు.. సాధార­ణంగా పిండం ఏర్పడిన సమయంలోనే హార్మోన్ల ప్రభావంతో ఆడ, మగ అన్నది నిర్ణయ­మైపోతుంది. అయితే మంచిర్యాల వ్యక్తి కేసులో జన్యు మ్యు­టేషన్‌ కారణంగా.. హార్మోన్ల అసమ­త్యుల్యత ఏర్ప­డి ఆడ, మగ రెండు రకాల జననాంగాలు ఏర్ప­డ్డాయి.

అందులో గర్భ సంచి, ఫాలో­పియన్‌ ట్యూ­బ్స్‌­తోపాటు వృషణాలు ఉదర భాగంలోనే ఉండిపో­యాయి. ఇలాంటి వారు అన్ని అంశాల్లో మామూ­లుగానే ఉంటారు. హార్మోన్లు, పురు­షాంగం, మీ­­సాలు, గడ్డాలు అన్ని సాధారణంగానే ఉంటాయి. అయితే వృషణాలు లోపలే ఉండి, వీర్య కణాలు ఉత్పత్తిగాక పిల్లలు పుట్టే అవకాశం ఉండదు.

లాప్రో స్కోపిక్‌ శస్త్రచికిత్సతో..
ఈ వ్యక్తికి వైద్యులు చిన్న­పాటి కోతతో కూడిన ల్యాప్రోస్కోపిక్‌ శస్త్రచికిత్స చేసి.. గర్భసంచి, ఫాలో­పి­యన్‌ ట్యూబ్స్‌తోపాటు వృషణాలను కూడా తొలగించారు. సాధారణంగా 18 ఏళ్ల వయసు దాటిన తర్వా­త కూడా వృషణాలు లోపలే ఉండిపోతే కేన్సర్‌గా మారే ప్రమాదం ఉంటుందని.. అందువల్ల వాటినీ తొలగించాల్సి వచ్చిందని డాక్టర్‌ ప్రశాంత్‌ తెలి­పారు.

ఇన్నేళ్లుగా ఆ వ్యక్తి పడుతున్న ఇబ్బందులు తొలగిపోయాయని.. కానీ పిల్లలు పుట్టే అవకాశం లేదని తెలిపారు. 18 ఏళ్ల వయసుకు ముందే ఈ సమస్యను గుర్తించి శస్త్రచికిత్స చేస్తే వృషణాలను సాధారణ స్థితికి తెచ్చే అవకాశం ఉండేదని.. కానీ పేదరికం, నిరక్షరాస్యత కారణంగా ఇన్నేళ్లుగా సమస్యను గుర్తించలేకపోయారని వివరించారు. ఇలాంటి కేసులు అరుదని, ప్రపంచంలో ఇప్పటివరకు 300 కేసులు, దేశంలో 20 కేసులు మాత్రమే బయటికి వచ్చాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement