సాక్షి, హైదరాబాద్: సైలెంట్ కిల్లర్‌గా పిలిచే కేన్సర్ వ్యాధి రాష్ట్రంలో వయెలెంట్‌గా విస్తరిస్తోంది. పొగాకు, మద్యం వినియోగం, ఆహారపు అలవాట్లు, వ్యవసాయంలో పెరిగిపోతున్న రసాయన ఎరువులు, శీతల పానీయాల వినియోగం, ఆధునిక జీవన శైలి పోకడల వంటి పరిణామాలతోనే కేన్సర్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. కేన్సర్‌ను ప్రారంభదశలోనే గుర్తించి చికిత్స మొదలుపెట్టగలిగితే వ్యాధిని నయం చేయవచ్చని వైద్యనిపుణులు చెబుతుండగా...శరీరంలో తెలియకుండానే మొదలైన ఈ వ్యాధిని ముదిరిపోయేంతవరకూ పసిగట్టలేకే మరణాలవరకూ తెచ్చుకుంటున్నాం.
జాతీయ వైద్య పరిశోధక మండలి (ఐసీఎంఆర్) వెల్లడించిన తాజా నివేదికలోని కేన్సర్ కేసుల, మరణాల గణాంకాలు ఇప్పుడు ప్రమాద ఘంటికల్ని మోగిస్తు న్నాయి. 2022లో దేశవ్యాప్తంగా 8.08లక్షల మంది కేన్సర్‌తో మరణించగా...అందులో ఒక్క తెలంగాణలోనే 27,339 మంది ఉన్నట్లు ఐసీఎంఆర్ నివేదికలో పేర్కొంది.
రెండేళ్లతో పోలిస్తే పెరిగిన మరణాల సంఖ్య
అంతకుముందు రెండేళ్లతో పోల్చుకుంటే దేశంతో పాటు రాష్ట్రంలోనూ కేన్సర్ రోగులు, మరణాల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఐసీఎంఆర్ నివేదిక ప్రకారం కేన్సర్ మరణాల్లో తెలంగాణ దేశంలో 13వ స్థానంలో ఉంది. 1.16లక్షల మరణాలతో ఉత్తరప్రదేశ్ తొలి స్థానంలో ఉండగా 66,879 మరణాలతో మహారాష్ట్ర దాని తర్వాతి స్థానంలో నిలిచింది.
దేశంలోని ప్రతి లక్ష మందిలో ఒకరికి కేన్సర్ ఉన్నట్లు నివేదికలో పేర్కొంది. 2022లో దేశంలో కేన్సర్ రోగులు 14.61 లక్షలుండగా అందులో తెలంగాణలోనే కొత్తగా 49,983 కేన్సర్ కేసులు నమోదయ్యాయి. ఇక భవిష్యత్తులో దేశంలో ప్రతి తొమ్మిది మందిలో ఒకరికి కేన్సర్ వచ్చే అవకాశం ఉందని, 2025 నాటికి ఆ సంఖ్య 15.7 లక్షలకు చేరుకోనుందని ఐసీఎంఆర్ తాజా నివేదికలో హెచ్చరించింది.
అధికంగా ఆ వయసువారే..
60–64 వయస్సు గలవారు అత్యధికంగా కేన్సర్ బారిన పడుతున్నారు. పురుషుల్లో నమోదయ్యే కేన్సర్ కేసుల్లో ఊపిరితిత్తుల కేన్సర్ కేసులు 10.6%, నోటి కేన్సర్ 8.4%, ప్రొస్టేట్ కేన్సర్ కేసులు 6.1%, నాలుక కేన్సర్ కేసులు 5.9%, కడుపు కేన్సర్ కేసులు 4.8% నమోదవుతున్నాయి. మహిళల్లో నమోదయ్యే కేన్సర్ కేసుల్లో రొమ్ము కేన్సర్ 28.8%, గర్భాశయ కేన్సర్ 10.6%, అండాశయ కేన్సర్ 6.2%, ఊపిరితిత్తుల కేన్సర్ 3.7% నమోదవుతున్నాయి.
35 ఏళ్లు దాటితే పరీక్షలు తప్పనిసరి...
ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం 35ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారి లేదా రెండేళ్లకోసారైనా కేన్సర్ స్క్రీనింగ్ పరీ క్షలు చేయించుకోవాలి. దంత వైద్యుల వద్దకు వెళితే వారు చేసే పరీక్షలు నోటి కేన్సర్ నిర్ధారణకూ ఉపయోగపడతాయి. 8 నుంచి 18 ఏళ్లలోపు ఆడ పిల్లలకు సర్వైకల్ కేన్సర్ రాకుండా టీకాను వేయించి వ్యాధి రాకుండా అడ్డుకోవచ్చు. యాభై ఏళ్లు దాటినవారికి మలంలో రక్తం పడితే కొలనోగ్రఫీ ద్వారా వ్యాధిని గుర్తించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
ఆలస్యంగా రావడం వల్లే అధిక మరణాలు
ప్రస్తుతం రాష్ట్రంలో 70 శాతం మంది కేన్సర్ చివరి దశలో ఉండగా మాత్రమే ఆస్పత్రులకు వస్తున్నారు. దీంతో అధిక మరణాలు నమోదవుతున్నాయి. ఇక విదే శాల్లో 70 నుంచి 80 శాతం మంది మొదటి దశలోనే ఆస్పత్రులకు వచ్చి వైద్యులను సంప్రదిస్తున్నారు. సర్వైకల్, రొమ్ము కేన్సర్లను సులువుగా నయం చేయవచ్చు. రొమ్ము కేన్సర్‌ను మూడో దశలోనూ, థైరాయిడ్ కేన్సర్ వస్తే 100% నయం చేయవచ్చని వైద్యులు భరోసా ఇస్తున్నారు.
పిల్లల్లో రక్త సంబంధిత కేన్సర్లే అధికం..
జన్యుమార్పిడి వల్లే పిల్లల్లో కేన్సర్ వస్తుంటుందని, ఎక్కువగా వారి లో రక్త సంబంధిత కేన్సర్లు అధికంగా వస్తుంటాయని వైద్యులు చెబుతు న్నారు. పిల్లల్లో వైద్యానికి స్పందించే లక్షణం ఎక్కువ వారికి వచ్చే కేన్స ర్లలో 80% వరకు నయం చేయడానికి వీలుంటుందని ఆంకాలజిస్టులు చెబుతున్నారు. మూడో దశ కేన్సర్లతో వచ్చే పిల్లల్ని సగం మందిని, నాలుగోదశలో వస్తే 25% మందిని బతికించవచ్చని అదే తొలి రెండు దశల్లో వస్తే 90%మందికి నయం చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు.
దేశంలో 2035 నాటికి 13లక్షల కేసులు..
పొగాకు, మద్యం, చెడు ఆహారపు అలవాట్ల వల్ల 66 శాతం, ఇన్ఫెక్షన్లతో 20% కేన్సర్లు వస్తున్నాయి. హార్మోన్లు, జన్యుమార్పుల వల్ల 10% పైగా, కాలుష్యం వల్ల ఒక శాతం కేన్సర్ రిస్క్‌లున్నాయి. 2035 నాటికి దేశంలో కేన్సర్ మరణాలు 13 లక్షలకు చేరుకుంటాయని అంచనా.
–డాక్టర్ కిరణ్ మాదల, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ
Comments
Please login to add a commentAdd a comment