Census of Population
-
జనగణనలోనే.. ఓబీసీ కులగణన
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది నిర్వహించనున్న జనగణనలోనే కులగణన కూడా చేపట్టాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ టీపీసీసీ ఆధ్వర్యంలో బుధవారం తీర్మానం చేసింది. రాష్ట్రంలో వచ్చే నెల ఆరోతేదీ నుంచి నిర్వహించ తలపెట్టిన కులగణనపై చర్చించేందుకు గాం«దీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో దీనిని ఆమోదించారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ నేత కొప్పుల రాజుతోపాటు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, రాష్ట్ర కార్పొరేషన్ల చైర్పర్సన్లు, పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కులగణన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీకి ఎలా ఉపయోగపడుతుందన్న అంశాన్ని ఏఐసీసీ నేత కొప్పుల రాజు వివరించారు. ఆ కార్యక్రమంలో పార్టీ శ్రేణులను భాగస్వాములను చేయాలని సూచించారు. ఇక వచ్చే నెల 2న కులగణన అంశంపై జిల్లా స్థాయిలో డీసీసీల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించాలని.. భాగస్వామ్య పక్షాలను ఆహ్వానించి విస్తృతస్థాయి చర్చ జరపాలని సమావేశంలో నిర్ణయించారు. వచ్చే నెల 5న లేదా 6న రాష్ట్రస్థాయిలో మేధావులు, సామాజికవేత్తలు, ముఖ్యులతో భేటీ జరపాలని.. వారిచ్చే సలహాలు, సూచనలకు అనుగుణంగా కులగణన ప్రక్రియపై ముందుకెళ్లాలని ఆలోచనకు వచ్చారు. కులగణనపై రాష్ట్రంలో సభ నిర్వహించాలని, దీనికి రాహుల్‌గాం«దీని ఆహ్వానించాలని నిర్ణయించారు. రాహుల్ గాంధీ మాట మేరకు..: రేవంత్‌రెడ్డి సమావేశంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటైన తర్వాత సామాజిక, ఆర్థిక, రాజకీయ, కులగణన చేస్తామని గత ఎన్నికల సందర్భంగా రాహుల్‌గాంధీ ఇచ్చిన మాట మేరకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. గాంధీ కుటుంబం ఒకమాట ఇస్తే ఎవరు అడ్డువచ్చినా నెరవేర్చి తీరుతుంది. అప్పుడు తెలంగాణ ఏర్పాటు ద్వారా, ఇప్పుడు కులగణన ద్వారా ఇది నిరూపితమైంది..’’ అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ విధానాలను అమలు చేయడమే రాష్ట్ర ప్రభుత్వ విధానమని.. ఈ క్రమంలో ప్రతిక్షణం సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులు, నాయకులపై ఉందని చెప్పారు. కులగణనలో భాగస్వాములను చేసేందుకు 33 జిల్లాలకు 33 మంది పరిశీలకులను నియమించాలని పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్‌కు రేవంత్ సూచించారు. కులగణన విషయంలో దేశానికే తెలంగాణ రోల్ మోడల్ కావాలని, ఈ మోడల్ రాహుల్‌గాంధీని ప్రధాన మంత్రిని చేయాలని వ్యాఖ్యానించారు. రాహుల్‌గాంధీ ఇచ్చిన మాటను అమలు చేసే క్రమంలో ఎవరు అడ్డు వచ్చినా, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కులగణన కేవలం ఎక్స్‌రే మాత్రమే కాదని.. మెగా హెల్త్ చెకప్ వంటిదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదాయాన్ని సామాజిక న్యాయం ప్రకారం పంచడమే కాంగ్రెస్ విధానమన్నారు. నవంబర్ 31లోగా రాష్ట్రంలో కులగణన పూర్తి చేసి తెలంగాణ నుంచే నరేంద్ర మోదీపై యుద్ధం ప్రకటించాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా జనగణనలో భాగంగా ఓబీసీల కులగణన చేపట్టడం కోసం.. రాష్ట్రంలో జరిగే కులగణన డాక్యుమెంట్‌ను పంపుతామన్నారు. మీరు 52 శాతమే అడిగారు.. 57శాతం ఎంపికయ్యారు! స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 52 శాతం రిజర్వేషన్లు కావాలన్నది కాంగ్రెస్ పార్టీలోని బీసీల నినాదమని.. అయితే గ్రూప్–1 మెయిన్స్‌కు 57 శాతం మంది బీసీలు ఎంపికయ్యారని సీఎం రేవంత్ పేర్కొన్నారు. అగ్రవర్ణాలతోపాటు బీసీలు, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ కోటాల కింద ఎంత మంది గ్రూప్–1 మెయిన్స్‌కు ఎంపికయ్యారన్న విషయాన్ని వివరించారు. నవంబర్ ఆరో తేదీ నుంచి చేపట్టనున్న కులగణన కార్యక్రమాన్ని 30వ తేదీలోగా పూర్తి చేస్తామని.. తర్వాత ఈ వివరాలన్నింటినీ హైకోర్టుకు సమర్పిస్తామని చెప్పారు. డిసెంబర్ 7న రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. ఆ రోజుకల్లా స్థానిక రిజర్వేషన్లపై కోర్టు తీర్పు వస్తే, డిసెంబర్ 9న సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా సంబురాలు జరుపుకోవాలని పేర్కొన్నారు. నాకు పార్టీ అన్నీ చేసింది.. కాంగ్రెస్ పార్టీ తనకు అన్నీ చేసిందని, ముఖ్యమంత్రిని చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇప్పుడు మిగిలింది తాను పార్టీకి, ప్రజలకు సేవ చేయడమేనని చెప్పారు. ఈ క్రమంలోనే పార్టీ విధానాన్ని పాటించేందుకు కులగణన చేపడుతున్నామన్నారు. పార్టీ అధికారంలోకి రాకముందు అనుబంధ సంఘాల అధ్యక్ష పదవులు తీసుకోవాలని కోరితే కొందరు ముందుకు రాలేదని.. ఇప్పుడు వారే తాము పెద్ద నాయకులమని, పదవులు ఇవ్వాలని కోరుతున్నారని చెప్పారు. అందరూ పార్టీ కోసం కష్టపడి చేయాలని, తప్పకుండా ఫలితం ఉంటుందని పేర్కొన్నారు. ఒక సీఎంగా రేవంత్‌రెడ్డి చట్టాలను అమలు చేస్తాడే తప్ప వ్యక్తిగత ఎజెండాతో కాదని.. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలను పార్టీ నాయకత్వం తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ, కుల సర్వే..! సమావేశంలో పీసీసీ మాజీ చీఫ్ వి.హనుమంతరావు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఆ సర్వే కాగితాలు కూడా లేకుండా చేశారని, దానిపై విచారణ జరిపించాలని సీఎంను కోరారు. ఇక ఈనెల 6 నుంచి చేపట్టే కులగణనలో కూడా కుటుంబ వివరాలతోపాటు కులం, ఉప కులం తెలుసుకుంటే సరిపోతుందని.. మిగతా వివరాలు అడగడం ద్వారా ప్రతిపక్షాలకు విమర్శించే అవకాశం ఇచ్చిన వాళ్లమవుతామని వీహెచ్ సూచించారు. దీనిపై సీఎం రేవంత్ స్పందిస్తూ.. కేవలం కులం వివరాలను సేకరిస్తే న్యాయపరంగా ఇబ్బంది వస్తుందని, అందుకే సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ, కుల సర్వే చేపడుతున్నామని చెప్పినట్టు తెలిసింది. పకడ్బందీగా కులగణన: మహేశ్‌గౌడ్ వచ్చేనెల ఆరో తేదీ నుంచి జరగనున్న కులగణనను పకడ్బందీగా నిర్వహిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పారు. గాం«దీభవన్‌లో సమావేశం అనంతరం ఆయన పార్టీ నేతలు షబ్బీర్‌అలీ, మధుయాష్కీ, ఆది శ్రీనివాస్, తీన్మార్ మల్లన్న, అనిల్‌కుమార్ యాదవ్, శంకర్‌నాయక్, మెట్టు సాయికుమార్‌లతో కలిసి మాట్లాడారు. కులగణనపై నవంబర్ 2న జిల్లా స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని, తర్వాత రాష్ట్రస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామని మహేశ్‌గౌడ్ తెలిపారు. ప్రతిపక్షాల అపోహలను ప్రజలు నమ్మడం లేదని.. గత ప్రభుత్వ అరాచకాల మీద చర్యల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. -
ఎట్టకేలకు ఒక కదలిక
రథం కదులుతోంది. ఎప్పుడో జరగాల్సిన పనిలో ఇప్పటికైనా అడుగులు ముందుకు పడుతున్నాయి. దేశంలో జనాభా లెక్కల పని ఎట్టకేలకు మరికొద్ది రోజుల్లోనే సెప్టెంబర్‌లో ఆరంభ మవుతోంది. ఆ మేరకు ఇటీవల వెలువడ్డ సమాచారం పెద్ద ఊరట. ప్రతి పదేళ్ళకు ఒకసారి జరగాల్సిన ఈ జనగణన యజ్ఞం నిజానికి 2021లోనే జరగాల్సి ఉంది. కోవిడ్ సహా అనేక సాకులతో ప్రభుత్వం సాచివేత ధోరణి ప్రదర్శిస్తూ వచ్చింది. అయితే, భారత్ లాంటి వర్ధమాన దేశానికి జనగణన మినహా ప్రత్యామ్నాయ మార్గాలలో ఆ స్థాయి సమాచారం అందుబాటులో లేదు. ఉన్నా అది అంత నమ్మదగినదీ కాదు. అందుకే జనాభా పరంగా, సామాజిక – ఆర్థికపరంగా దేశ సమగ్ర స్వరూపాన్ని ఆవిష్కరించడానికి కొన్ని దశాబ్దాలుగా జనగణన అత్యంత కీలకమైనది.అలాంటి జనగణన ప్రక్రియ ఇప్పుడు మళ్ళీ పట్టాలెక్కుతోంది. వచ్చే నెల (సెప్టెంబర్)లో ఆరంభ మయ్యే ఈ ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు ఏణ్ణర్ధ కాలం పడుతుందని ప్రభుత్వం మాట. జనగణన అనేది పలువురు పొరబడుతున్నట్టు కేవలం గణాంకాల సేకరణ కాదు. అది సుపరి పాలనకు మూలస్తంభం. దేశం ఎదుర్కొనే సామాజిక, ఆర్థిక సవాళ్ళకు పరిష్కారాలు కనుగొనేందుకు మార్గదర్శి. పట్టణీకరణ, ప్రాథమిక వసతుల అభివృద్ధి మొదలు సాంఘిక సంక్షేమం, ఆర్థిక ప్రణాళిక వరకు ప్రతి అంశం పైనా సరైన విధాన నిర్ణయాలకు ఈ సమాచారమే కీలకం. నిజానికి, జనాభా లెక్కల సేకరణలో కేంద్ర సర్కార్ చేసిన సుదీర్ఘ జాప్యం చాలాకాలంగా విమర్శలకు గురవుతోంది. ప్రైవేట్వారే కాదు... సర్కారీ ఆర్థిక నిపుణులు సైతం విమర్శకుల్లో ఉండడం గమనార్హం. పాత జనాభా లెక్కల ఆధారంగానే ఇప్పటికీ ఆరోగ్యం, ఆర్థిక అంశాలు, చివరకు ద్రవ్యోల్బణం రేటు, ఉపాధి లెక్కల లాంటివన్నీ గణిస్తూ ఉండడం వల్ల కచ్చితత్వం లోపిస్తోంది. డేటా లోపంతో కనీసం 15 కీలక అంశాలపై దుష్ప్రభావం పడింది. అదే ఈ నిపుణులందరి బాధ. పుష్కర కాలం క్రితపు లెక్కలపై ఆధారపడే సరికి అంతా లోపభూయిష్టమైంది. దాదాపు 10 కోట్ల మంది పౌర సరఫరా వ్యవస్థకు వెలుపలే ఆహారభద్రత లేకుండా మిగిలిపోయారు. ఇళ్ళు, శ్రామికుల సంఖ్య ఆధారంగా రాష్ట్రాలకు కేంద్రం కేటాయించే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులపైనా దెబ్బ పడింది. చివరకు నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ వారి సర్వేల నాణ్యత కూడా దెబ్బతింది. అంతెందుకు... జనాభాలో చైనాను భారత్ దాటేసి, ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా అవతరించినట్టు ఐరాస నివేదిక గత ఏడాది ప్రకటించింది. దాన్ని ఖరారు చేయడానికో, కాదనడానికో, ఆ జనాభా లెక్కకు అనుగణంగా అవసరమైన చర్యలు చేపట్టాడానికో కూడా మన వద్ద నిర్దుష్టమైన గణాంకాలు లేని పరిస్థితి. అలాంటి లోపాలన్నీ సరిదిద్దుకోవడానికి ఇప్పుడిది సదవకాశం. అదే సమయంలో జనగణనలో భాగంగా మన జనాభా తాలూకు కులగణన కూడా చేయడం అత్యవసరం. దేశంలోని ప్రధాన పార్టీలన్నీ కోరుతున్నది అదే. తద్వారా జనసంఖ్యలో ఏ సామాజిక వర్గం వంతు ఎంత, ఏయే వర్గాల స్థితిగతులు ఏమిటి, ఏ వర్గాలు ఎంతగా వెనకబడి ఉన్నాయి తదితర భోగట్టా తేటతెల్లమవుతుంది. కులాలు, ఉపకులాలతో పాటు వర్తమానంలో కనుమరుగైపోతున్న ఆశ్రిత కులాల లెక్కలూ వెలికివస్తాయి. వెనుకబడిన వర్గాలకు చేయూతనిచ్చేలా పాలకులు పాలసీలు చేయడానికీ వీలవుతుంది. ప్రణాళిక, పాలన, చట్టాల రూపకల్పన సహా అనేక ప్రభుత్వ కార్యక్రమాలపై సమీక్షకూ, నిర్వహణకూ ఈ సమాచారమంతా ఉపకరిస్తుంది. తాజా జనగణన రాజకీయంగానూ ప్రధానమే. దేశంలోని అన్ని స్థాయుల చట్టసభలలో నియో జక వర్గాల పునర్విభజన, రిజర్వేషన్‌కు ఈ కొత్త లెక్కలే ఆధారమవుతాయి. అంటే, అసెంబ్లీ, పార్ల మెంట్ స్థానాల సంఖ్య మారిపోనుంది. ఈ లెక్కన దక్షిణాదితో పోలిస్తే జనాభా నియంత్రణ అంతగా లేని ఉత్తరాదిలో మరిన్ని చట్టసభా స్థానాలు వస్తాయి. ఫలితంగా అధికార సమీకరణాలూ మారి పోతాయి. ఇంతటి ముఖ్యమైనది కాబట్టే... ఇలాంటి అధికారిక గణాంక వ్యవస్థను ప్రభుత్వ, రాజ కీయ జోక్యాలకు వీలైనంత దూరంగా ఉంచడం శ్రేయస్కరం. మారిన కాలానికి అనుగుణంగా కొత్త జనగణన రూపురేఖలూ మారుతున్నాయట. ప్రధానంగా డిజిటల్ పద్ధతిలో, అదీ స్వీయ నమోదు పద్ధతిలో జనగణన సాగనుంది. గతంలో స్త్రీ, పురుషుల వివరాలనే దఖలు పరిస్తే, ఇప్పుడు తొలి సారిగా ట్రాన్స్జెండర్ల వివరాలనూ ప్రత్యేకంగా నమోదు చేయనున్నారు. అలాగే, ఎస్సీ, ఎస్టీలే కాక ‘ఇతర వెనుకబడిన వర్గాలు’ అంటూ వివరాలు విడిగా నింపనున్నారట. ఏమైతేనేం, ఇన్నేళ్ళ తరువాతైనా జనాభా లెక్కల ప్రక్రియను మళ్ళీ చేపట్టడం హర్షణీయం. అతి ముఖ్యమైన బృహత్ యజ్ఞాన్ని ఇక నుంచైనా ఎప్పటికప్పుడు నిర్ణీత సమయానికే నిర్వహించడం అత్యవసరం. తద్వారానే కచ్చితమైన డేటా దేశంలో పాలనా యంత్రాంగానికి అందుబాటులోకి వస్తుంది. 2026 మార్చి కల్లా ఈ జనగణన ఫలితాలను సమర్పించేందుకు కేంద్ర శాఖలు ఇప్పటికే నిర్ణీత కాలవ్యవధి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. దీంతో, 2011 నుంచి అప్పటి దాకా... అంటే 15 ఏళ్ళ కాలవ్యవధిలోని సమాచారం చేతిలోకి వస్తుంది. అయితే, ఈసారి జరిగిన జాప్యం నుంచి పాఠాలు నేర్చుకోవాలి. దేశం ముందుకు సాగడానికి దాని సమూహ స్వరూప స్వభావాలు దానికైనా తెలిసి ఉండడం ముఖ్యం. అలాంటి సమాచార సేకరణ, వినియోగంలో అంతరాయాలు రాకుండా జాగ్రత్తపడాలి. ఊహించని ఆటంకాలు ఎదురైనా ఇబ్బంది పడకుండా ఉండేలా జనాభాపై సమగ్ర సమాచారం అందించే కట్టుదిట్టమైన వ్యవస్థలను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి ప్రయత్నాలు జరగడానికి ఇదే తరుణం. -
‘జన గణన ఎప్పుడు?.. 14 కోట్ల మంది నష్టపోయారు’
ఢిల్లీ: దేశవ్యాప్తంగా జనాభా లెక్కల కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ఎప్పుడు చేపడతారో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ నేత జైరాం రమేశ్ డిమాండ్ చేశారు. పూర్తిస్థాయిలో జన గణన చేయకపోవటం వల్ల ఇప్పటివరకు 14 కోట్లమంది నష్టపోయారని మండిప్డడారు. ఇప్పటికైనా జన గణన ఎప్పుడు చేపడతారో దేశానికి తెలియజేయాలన్నారు. జన గణన విషయంపై ఆయన సోమవారం ఎక్స్ వేదికగా స్పందించారు.A comprehensive Census essential for socioeconomic development is carried out by the Union Govt every ten years. The last one was to be completed in 2021. But Mr. Modi didnt get it done.One immediate consequence of not having Census 2021 conducted is that at least 14 crore…— Jairam Ramesh (@Jairam_Ramesh) June 10, 2024‘దేశ సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం జనాభా లెక్కల డేటా పదేళ్ళపాటు కేంద్ర ప్రభుత్వానికి ఎంతగానో ఉపయోగడుతంది. జనాభా లెక్కలు 2021లో నిర్వహించాల్సింది. కానీ, ప్రధాని మోదీ అప్పుడు నిర్వహించలేదు. 2021లో జనాభా లెక్కలు చేపట్టకపోవటం వల్ల సుమారు 14 కోట్ల మంది భారతీయులకు జాతీయ ఆహార భద్రత చట్టం (2013) కింద ప్రయోజనాలు కోల్పోతున్నారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అందకుండా పోతోంది...1/3 వంతు ప్రధాని మోదీ జనాభా లెక్కల కార్యక్రమాన్ని ఎప్పుడు చేపడతారో త్వరలో దేశానికి తెలియజేయాలి. 1951 నుంచి పదేళ్లకొకసారి నిర్వహించే జనాభా లెక్కల వల్ల ఎస్సీ, ఎస్టీల జనాభా డేటా తెలుస్తోంది. అయితే కొత్తగా నిర్వహించే జనాభా లెక్కల డేటాలో ఓబీసీలోని అన్ని కులాల జానాభా వివరాలు ఉండాలి. అప్పుడే రాజ్యాంగంలో పొందుపర్చిన సామాజిక న్యాయానికి నిజమైన అర్థం ఇచ్చినట్లు అవుతుంది’ అని జైరాం రమేశ్ అన్నారు. ఇక.. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ దేశవ్యాప్తంగా కుల గణన చేపడతామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. -
కుల జనగణనపై ఇంత వ్యతిరేకతా?
మెజారిటీ శూద్రులు కులాలవారీ జనగణనను కోరుకుంటుండగా, ద్విజులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఓబీసీలకు రిజర్వేషన్లు ఉన్నప్పటికీ, ఐఐటీ, ఐఐఎమ్, కేంద్రీయ విశ్వవిద్యాలయాల వంటి అత్యున్నత సంస్థలతోపాటు కేంద్రప్రభుత్వ పాలనావ్యవస్థ దాదాపుగా ద్విజుల అదుపులో ఉంటోంది. ఒకసారి కులాలవారీగా అధికారిక డేటా విడుదల చేశాక, దేశంలోని కీలకమైన పాలనా వ్యవస్థల్లో ఏ ఒక్కదానిలో కూడా తమకు ప్రాతినిధ్యం లేదని జాట్లు, గుజ్జర్లు, పటేళ్లు, ఉత్తర, దక్షిణ భారతదేశంలోని ఇతర కమ్యూనిటీలు కూడా గుర్తించే ప్రమాదముంది. జనాభా ప్రాతిపదికన అన్ని రంగాల్లో తమ ప్రాతినిధ్యం కోసం శూద్రకులాలు డిమాండ్ చేసే ప్రమాదం ఉంది కాబట్టే కులాలవారీగా జనగణనను అగ్రవర్ణాలు వ్యతిరేకిస్తున్నాయి. కులాలవారీ జనాభా గణన కోసం డిమాండ్ పుంజుకుంటోంది. దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీలూ దీనికి అంగీకరించాయి. కొన్ని ప్రాంతీయ పార్టీలు ఇప్పటికే అంతర్గత వినియోగం కోసం కులాల వారీ డేటాను సేకరించి ఉన్నాయి. ఉదాహరణకు, తెలంగాణ రాష్ట్ర సమితి 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే కులపరమైన డేటాను సేకరించింది. ‘సమగ్ర కుటుంబ సర్వే’ అని పేరుపెట్టినప్పటికీ కులాలవారీగా ప్రజల సమగ్ర వివరాలను సేకరించింది. తెలంగాణలో పుట్టి, ఆ తర్వాత దేశవిదేశాల్లోని వలస ప్రాంతాల్లో పెరిగిన అనేకమంది పిల్లలను తెలంగాణ గ్రామాలకు తిరిగివచ్చి తమతమ పేర్లను నమోదు చేసుకోవాలని వారి తల్లిదండ్రులు కోరి మరీ వెనక్కు పిలిపించారు. ‘తెలంగాణ ఆల్ ఫ్యామిలీ సెన్సెస్ 2014’ నాకు జీసస్ తల్లిదండ్రులైన జోసెఫ్, మేరీలు నజరత్ నుంచి బెతెల్హామ్ చేరుకుని స్వస్థలంలో తమ పేర్లు నమోదు చేయించుకున్న వైనాన్ని గుర్తు చేసింది. వ్యక్తులందరూ తమతమ పూర్వీకుల పట్టణాలకు రావాలన్న నాటి రాజాదేశాన్ని పాటించడానికి జోసెఫ్, మేరీలు బెతెల్హామ్కు ప్రయాణించి వచ్చారు. ఈ ఆదేశం జారీ చేసిన సమయంలో మేరీ... జీసస్‌కి జన్మ నివ్వడానికి గర్భధారణతో ఉండింది. కాబట్టి, బెతెల్హామ్లో ఒక గొర్రెల పాకలో జీసస్ జన్మించడానికి ఆనాడు నిర్వహించిన జనాభా గణనే కారణమైంది. మోజెస్ కాలం నుంచి వ్యక్తులను లెక్కించే చరిత్ర ఇజ్రాయెల్‌కి ఉండేది. హరప్పా వంటి మహత్తర నాగరికతను కలిగి ఉన్నప్పటికీ ప్రాచీన భారతదేశం వ్యక్తుల వారీగా జనాభాను లెక్కించే ఎలాంటి పద్ధతినీ కలిగి ఉండేది కాదు. మన చరిత్రలో తొలిసారిగా బ్రిటిష్ వలస ప్రభుత్వం తన సొంత పన్నుల వసూలు కోసం జనాభా లెక్కలను నిర్వహించింది. తొలి జనగణనను 1865 నుంచి 1872 మధ్య కాలంలో నిర్వహించారు. మొట్టమొదటి సమగ్ర జనగణన 1881లో జరిగింది. చాలావరకు బ్రాహ్మణులు జనగణనను, ప్రత్యేకించి కులాలవారీ జనగణన అనే భావనను తొలినుంచీ వ్యతిరేకిస్తూ వచ్చారు. అతి చిన్న మైనారిటీగా ఉండే ద్విజులు (బ్రాహ్మణులు, బనియాలు, క్షత్రియులు, కాయస్థులు, ఖాత్రీలు) సంస్కృతం, పర్షియన్, ఇంగ్లిష్ భాషలు నేర్చుకున్న విద్యావంతులుగా ఉండేవారు. దేశంలో తాము అతి చిన్న మైనారిటీ అనే వాస్తవం ప్రపంచానికి తెలీకూడదనే వారు కోరుకున్నారు. ఈ మేధావి వర్గమే మండల్ రిజర్వేషన్ల అమలును, కుల గణనను వ్యతిరేకించింది. భాను ప్రతాప్ మెహతా వంటి పలువురు ఉదారవాద మేధావులు కులాలవారీ జనగణనకు వ్యతిరేకంగా బలంగా వాదించారు. మండల్ ఉద్యమ కాలంలో కూడా వీరిలో చాలామంది కులం అనేది బ్రిటిష్ వారి సృష్టి అని వాదించేంతవరకు వెళ్లారు. వామపక్షం, ఉదారవాదులు, ఛాందసవాదులు... ఇలా భావజాలాలతో పనిలేకుండా, ఈ మేధావులందరూ కులవ్యవస్థను బ్రిటిష్ వలసవాదులు సృష్టించారని వాదించారు. వేదాలను సృష్టించిన క్రమంలో, కౌటిల్యుడి అర్థశాస్త్రం, మనుధర్మశాస్త్రం రచించిన క్రమంలో వర్ణ కుల విభజన ఉనికిలోకి వచ్చిన వైనాన్ని వీరు ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. అనేక జాతీయ వాద పండితులు మనుస్మృతిని గొప్ప ప్రాచీన న్యాయ స్మృతిగా ప్రశంసించేవరకు వెళ్లారు. భారతీయ కమ్యూనిస్టు చింతనాపరులు సైతం ఈ వాదంలో కొట్టుకుపోయారు. అంబేడ్కర్ అనేక రంగాల్లో ద్విజ మేధావులను సవాలు చేసేంతవరకు... కులంపై, భారతీయ నాగరికతపై వ్యతిరేక దృక్పథాన్ని ప్రతిపాదించేవారు శూద్ర, దళిత, ఆదివాసీ ప్రజలకు లేకుండా పోయారు. 1931 తర్వాత కులవారీ గణనను జనాభా లెక్కలనుంచి ఉపసంహరించారు. ప్రపంచ యుద్ధం, 1951 వరకు భారతదేశంలో దుర్భిక్ష పరిస్థితులే దీనికి కారణం. నెహ్రూ, ఆయన ఏర్పర్చుకున్న మేధావుల బృందం సైతం కులాలవారీ జన గణన చేపట్టాలని కోరుకోలేదు. కులసంబంధిత గాయాలను కులాలవారీ గణన కొత్తగా రేపుతుందనే అర్థరహితమైన సిద్ధాంతాలు వ్యాప్తిలోకి వచ్చాయి. కులాల వారీ జనగణన, ఓబీసీ రిజర్వేషన్ పై నెహ్రూ కూడా వీటి ప్రభావానికి లోనయ్యారని పిస్తుంది. నెహ్రూ స్వయంగా కులవారీ జనగణనను వ్యతిరేకించినప్పుడు, 1951లో నెహ్రూ మంత్రివర్గంలోని అంబేడ్కర్ సైతం ఏమీ చేయలేకపోయారు. పీసీ జోషి, శ్రీపాద్ డాంగే, బీటీ రణదివే వంటి కమ్యూనిస్టు ద్విజ మేధావులతోపాటు వామపక్షానికి చెందిన బెంగాలీ భద్రలోక్ నెహ్రూవియన్ల అభిప్రాయాలతో ఏకీభవించినట్లే కనిపించింది. ఏదేమైనా ఈ దృక్పథం హెగ్డేవార్, గోల్వాల్కర్ వంటి హిందుత్వ మేధావులకు ఆమోదనీయమైందని గ్రహించాలి. బ్రిటిష్ వారు దేశాన్ని వీడి వెళ్లిపోగానే, దేశంలోని మొత్తం మేధో, పాలనా, రాజకీయ నిర్మాణాలు ద్విజ మేధావుల చేతుల్లోకి వచ్చేశాయి. అత్యున్నత పాలనా వ్యవస్థలో శూద్ర, దళిత, ఆదివాసీ మేధావులు కానీ, చైతన్యవంతమైన రాజకీయ శక్తులు కానీ లేకుండా పోయారు. అదే సమయంలో తమను ప్రత్యేక వర్గాల కింద గణించే హక్కును దళితులు, ముస్లింలు పొందడంతో అంబేడ్కర్ పెద్దగా ఈ అంశంపై పోరాడలేకపోయారు. సూత్రరీత్యా దళిత రిజర్వేషన్లు 1947లోనే ఉనికిలోకి వచ్చాయి. దేశ విభజన సమస్యల కారణంగా నెహ్రూ పాలనా యంత్రాంగం ముస్లింలను మైనారిటీలుగా గణించడాన్ని కొనసాగించడం ద్వారా వారిని సంతృప్తి పరిచింది. దాంతోపాటు అగ్రశ్రేణి విద్యావంత ముస్లిం మేధావులను పాలనా యంత్రాంగంలో చేర్చుకున్నారు. కానీ శూద్ర ఓబీసీలకు కులవారీ జనగణన కోసం లేదా రిజర్వేషన్ల కోసం పోరాడేందుకు ఒక లాబీ అంటూ లేకుండా పోయింది. మెజారిటీ శూద్రులు కులవారీ జనగణనను కోరుకుంటుండగా, ద్విజులు దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఓబీసీలకు రిజర్వేషన్లు ఉన్నప్పటికీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, కేంద్రీయ విశ్వవిద్యాలయాల వంటి అత్యున్నత సంస్థలలోని పాలనా యంత్రాంగ నిర్మాణాలు మొత్తంగా తమ నియంత్రణలోనే ఉన్నాయని ద్విజులకు తెలుసు. మన రాయబార కార్యాలయాలతో సహా ఢిల్లీ పాలనాయంత్రాంగం కూడా వాస్తవంగా ద్విజుల అదుపులో ఉంటోంది. ఒకసారి కులాలవారీగా అధికారిక డేటా విడుదల చేశాక, ఢిల్లీ నుంచి దేశాన్ని పాలిస్తున్న కీలకమైన పాలనా వ్యవస్థల్లో ఏ ఒక్కదానిలో కూడా తమకూ ప్రాతినిధ్యం లేదని జాట్లు, గుజ్జర్లు, పటేళ్లు, మహిస్యాలు (పశ్చిమ బెంగాల్), ఉత్తర, దక్షిణ భారతదేశంలోని ఇతర కమ్యూనిటీలు కూడా గుర్తించే ప్రమాదముంది. కులాలవారీగా జనాభా గణన భారతదేశంలో ప్రజాస్వామ్య భావనను మౌలికంగానే మార్చివేస్తుంది. పార్టీ భేదాలకు అతీతంగా బిహార్ ప్రాంతీయ నేతలు ప్రధాని నరేంద్రమోదీని ఇటీవలే కలిసి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనే తలపెట్టిన కులప్రాతిపదిక డేటా సేకరణను నమూనాగా తీసుకుని కులాలవారీ జనగణన చేపట్టాలని కోరారు. తెలంగాణలో కేసీఆర్, కర్ణాటకలో సిద్ధరామయ్య కులాల ప్రాతిపదికన తమవైన సంక్షేమ పథకాల ఎజెండా కోసం ఆ డేటాను ఉపయోగించుకున్నారు. ఉదాహరణకు తెలంగాణలోనే ఒకటో, రెండవ అతిపెద్ద కమ్యూనిటీలైన గొల్ల–కురుమలు, ముదిరాజుల అసలు సంఖ్యను కేసీఆర్ గుర్తించి, సాంప్రదాయికంగా గొర్రెలకాపరులైన గొల్లకురుమల కోసం గొర్రెల పంపిణీ, చేపల వేటను వృత్తిగా కలగిన ముదిరాజుల కోసం మత్స్య పరిశ్రమాభివద్ధి పథకాన్ని ప్రారంభించారు. ప్రతిఫలంగా 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ వీరి ఓట్లను కొల్లగొట్టారు. ప్రాంతీయ పార్టీలకు ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి. ఇక ప్రజానీకం కులాలవారీగా జనాభా గణన వల్ల తమదైన ప్రయోజనాలను పొందుతోంది. మరోవైపున బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టుల వంటి జాతీయ పార్టీలు... తమను కులాలుగా గణించడాన్ని వ్యతిరేకిస్తున్న తమవైన ద్విజుల నెట్వర్క్పట్ల ఎంతో జాగరూకతతో ఉంటున్నాయి. ఇదే భవిష్యత్తులో అతిపెద్ద వైరుధ్యంగా మారబోతోంది. -ప్రొ. కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
కుల ఆధారిత జనగణన చేపట్టాలి: నితీశ్
పట్నా: దేశంలో ఎస్సీ, ఎస్టీలు తప్ప ఇతర కులాల జనాభాను లెక్కించే ప్రసక్తే లేదంటూ పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై బిహార్ ముఖ్యమంత్రి, ఎన్డీయే భాగస్వామిగా ఉన్న జేడీ(యూ) నేత నితీశ్ కుమార్ భిన్నస్వరం వినిపించారు. దేశవ్యాప్తంగా కుల ఆధారిత జనగణన చేపట్టాలని శనివారం డిమాండ్ చేశారు. సంక్షేమ ఫథకాలకు రూపకల్పన చేయడానికి ఈ గణాంకాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. దేశంలో దళితేతర పేదలు ఎంతమంది ఉన్నారో తేల్చడానికి కుల ఆధారిత జనగణనే మార్గమని పేర్కొన్నారు. 2010లో కులాలవారీగా జనాభా లెక్కింపు ప్రారంభించారని, 2013లో నివేదిక సిద్ధమయ్యిందని, దాన్ని విడుదల చేయలేదని ఆక్షేపించారు. ఒక్కసారైనా కులాలవారీగా జనాభాను లెక్కించాలని కోరారు. -
కోవిడ్ వల్ల జనగణన–2021 వాయిదా
సాక్షి, అమరావతి: కోవిడ్–19 వల్ల జనగణన–2021, సంబంధిత పనులు వాయిదా పడ్డాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం తెలిపింది. రాష్ట్రాలవారీగా జనగణన–2021 ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియజేయాలంటూ విజయవాడకు చెందిన ఇనగంటి రవికుమార్ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. దీనికి సమాధానమిచ్చిన రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం జనగణనకు సంబంధించి తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపింది. కొత్త తేదీలను నిర్ణయించలేదని వివరించింది. జనగణన–2021 కోసం 2010 జనవరి 1 నుంచి 2019 డిసెంబర్ 31 వరకు ఉన్న మ్యాపింగ్‌ను, సరిహద్దులను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని, అయితే కోవిడ్–19 వల్ల జనగణన వాయిదా పడిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో మార్చి 31, 2021 వరకు ఈ తేదీ ని పొడిగించామని జనగణన పూర్తయ్యే వరకు మ్యాపింగ్, సరిహద్దుల్లో మార్పులు చేయొద్దని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం ఆదేశించిందని తెలిపింది. -
జనగణనకు నాలుగంచెల వ్యవస్థ
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి చేపట్టనున్న జాతీయ 16వ జనగణనకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జనగణన చేపట్టే తేదీలను అధికారికంగా వెల్లడించనప్పటికీ ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించింది. జనగణనలో ప్రజల నుంచి తీసుకోవాల్సిన వివరాలతో కూడిన పట్టికను ఇప్పటికే జాతీయ జనగణన డైరెక్టరేట్ విడుదల చేయగా, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌లో పునర్ముద్రించింది. దీంతోపాటు జనగణన చేపట్టే విధానానికి సంబంధించిన కొన్ని మార్గదర్శకాలను కూడా రూపొందించింది. ఈసారి జనగణన కోసం నాలుగంచెల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. మొదటి అంచెలో జిల్లాకు ఒకరు లేదా ఇద్దరు మాస్టర్ ట్రైనర్లను నియమిస్తోంది. 2021 డిసెంబర్ వరకు రిటైర్మెంట్ లేని గ్రూప్–1 అధికారులను ఇందుకోసం ఎంచుకుని వీరికి శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాతి దశలో గెజిటెడ్ హెడ్మాస్టర్లు, గణాంక అధికారులు, జీహెచ్ఎంసీ సిబ్బందిని ఎంపిక చేసుకుంటోంది. వీరు జనగణన సూపర్వైజర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. వీరు ఎన్యూమరేటర్లను పర్యవేక్షించనున్నా రు. ఎన్యూమరేటర్లుగా మండల, జిల్లా స్థాయిలో పనిచేస్తున్న టీచర్లను నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది. వివరాల సేకరణకు పెన్ను, పేపర్‌ను ఉపయోగించకూడదని, మొబైల్ ఫోన్ యాప్‌తోనే వివరాలను నిక్షిప్తం చేయాలన్న జాతీయ జనగణన డైరెక్టరేట్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. -
ఎన్పీఆర్ అమలుకు రంగం సిద్ధం..
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్) నవీకరణ, జనాభా గణన, గృహ ఆస్తుల వివరాల సేకరణ (హౌస్ లిస్టింగ్)కు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ప్రభుత్వం శిక్షణ ఇచ్చి నియమించిన ఎన్యూమరేటర్లు ఇంటింటికీ తిరిగి ప్రజల నుంచి వివిధ వివరాలు సేకరించనున్నారు. ‘మీరు, మీ తల్లిదండ్రుల పుట్టిన తేదీ, పుట్టిన ప్రాంతం ఏమిటి?.. మీరు భారతీయులేనా? మీ ఆధార్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, మొబైల్ నంబర్ ఏమిటి?. మీకు చట్టబద్ధంగా, సంప్రదాయబద్ధంగా పెళ్లైందా లేక సహజీవనం చేస్తున్నారా? వంటి వివరాలను అడిగి తెలుసుకోనున్నారు. ఇందుకు సంబంధించిన రుజువులను ప్రజలు స్వచ్ఛందంగా ఇస్తే ఎన్యూమరేటర్లు తీసుకోనున్నారు. అయితే సర్వేకు వచ్చినప్పుడు ఈ పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని ఎన్యూమరేటర్లు కుటుంబ పెద్దను కోరనున్నట్లు ఎన్పీఆర్–2020 యూజర్ మాన్యువల్‌లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పౌరసత్వ చట్టం–1955, పౌరసత్వ నిబంధనలు–2013 కింద ఎన్పీఆర్కు కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించింది. దేశ పౌరులతోపాటు దేశంలో నివాసముంటున్న విదేశీయుల సమాచారాన్ని ఈ కార్యక్రమంలో భాగంగా సేకరించనుంది. ఎన్పీఆర్ కింద అడిగే ప్రశ్నలు.... 1. ఎన్పీఆర్ బుక్లెట్పై ముద్రించిన పేరు సరైనదేనా? (ఒకవేళ తప్పులుంటే పేరును బుక్‌లెట్‌లో సరిచేస్తారు. ప్రతి వ్యక్తి పేరును కరెక్టుగా నమోదు చేయడం కీలకమని ఎన్పీఆర్ నియమావళి పేర్కొంటోంది) 2. ఇంట్లో అందుబాటులో ఉన్న వ్యక్తులు ఎంత మంది? (కుటుంబ సభ్యులు ఎవరైనా వలస వెళ్లినా, చనిపోయినా నమోదు చేసుకుంటారు) 3. కుటుంబ పెద్దతో ఇతర సభ్యుల బంధుత్వం. 4. పురుషులా.. మహిళలా లేక ఇతరులా? 5. వివాహ స్థితిగతులు. (అవివాహితులు, వివాహితులు, వితంతువు/భార్య చనిపోయిన వ్యక్తి, విడిపోయిన వారు, విడాకులు పొందిన వారు వంటి వివరాలు సేకరిస్తారు. రెండోసారి పెళ్లి చేసుకున్నా లేక సహజీవనం చేస్తున్నా పెళ్లయిన వ్యక్తుల కిందే లెక్కగట్టనున్నారు) 6. కుటుంబ సభ్యుల పుట్టిన తేదీ ఏమిటి? (తప్పుగా ఉంటే సరిచేస్తారు. ఒకవేళ ఎవరైనా తమ పుట్టిన తేదీ, నెల వివరాలు అందించలేని స్థితిలో ఉంటే కేవలం పుట్టిన సంవత్సరాన్ని మాత్రమే నమోదు చేస్తారు. ఎన్పీఆర్ డేటాబేస్‌లో పుట్టిన తేదీ కీలకం. ఒకవేళ పుట్టిన తేదీ సమాచారం అందించలేని పరిస్థితిలో ఉంటే సంబంధిత వ్యక్తుల స్కూల్ సర్టిఫికెట్లు, ఇతర పత్రాలు, ఆధార్, ఓటర్ ఐడీ, పాన్‌కార్డు, పాస్‌పోర్టు, ఇతర పత్రాల ఆధారంగా పుట్టిన తేదీని సేకరిస్తారు. అవి కూడా లేకపోతే సభ్యుల జాతక చక్రాన్ని పరిగణలోకి తీసుకోనున్నారు. జాతకచక్రం కూడా లేకుంటే ఎన్యూమరేటర్లే వయసును అంచనా వేసి నమోదు చేసుకోనున్నారు) - కేవలం పుట్టిన సంవత్సరం మాత్రమే తెలిసి ఉంటే పుట్టిన తేదీని అంచనా వేసేందుకు ఎన్యూమరేటర్లు పలు ప్రశ్నలు అడగనున్నారు. వర్షాకాలంలో పుట్టారా లేదా తర్వాత? పుట్టిన నెలలో దసరా, దీపావళి, సంక్రాంతి, క్రిస్మస్ వంటి ఏమైనా పండుగలు వచ్చాయా? గాంధీ జయంతి, స్వాతంత్య్ర దినోత్సవం వంటి సెలవులు వచ్చాయా? వంటి ప్రశ్నలను సంధించడం ద్వారా పుట్టిన తేదీని అంచనా వేయనున్నారు. - పుట్టిన తేదీ, సంవత్సరం రెండూ తెలియని పక్షంలో ఎప్పుడు పుట్టారో తెలుసుకోవడానికి దేశ చరిత్రలో కీలక ఘట్టాలుగా నిలిచిన సంఘటనల ఆధారంగా వ్యక్తుల వయసును ఎన్యూమరేటర్లు అంచనా వేయనున్నారు. తొలి ప్రపంచ యుద్ధం (1914–18), దండి యాత్ర (1930), క్విట్ ఇండియా ఉద్యమం (1942), స్వాతంత్య్ర దినోత్సవం (1947), చైనాతో యుద్ధం (1962), పాకిస్తాన్‌తో యుద్ధం (1965), బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం (1971), ఏసియాడ్ క్రీడలు (1982), భారత్ తొలి క్రికెట్ ప్రపంచకప్ విజయం (1983) సాధించినప్పుడు పుట్టారా? అని అడిగి తెలుసుకోనున్నారు. 7. మీరు పుట్టిన ప్రాంతం ఏమిటి? (దేశంలో పుడితే రాష్ట్రం, జిల్లా వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది) 8. మీ జాతీయత ఏమిటి? భారతీయులేనా? (మీరు పాస్‌పోర్టు నంబర్ స్వచ్ఛందంగా ఇస్తే స్వీకరించనున్నారు) 9. మీ విద్యార్హతలు ఏమిటి? (ప్రీ ప్రైమరీ, ప్రాథమిక, 1–12 తరగతులు, ఐటీఐ, పాలిటెక్నిక్, నర్సింగ్ డిప్లొమా, టీటీసీ, ఇతర డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, పీజీ డిప్లొమా, పీజీ, ఎంఫిల్, పీజీ ఆపై, సరైన విద్య లేని, నిరక్షరాస్యులా? వంటి వివరాలను అడిగి తెలుసుకోనున్నారు) 10. మీ వృత్తి ఏమిటి? (వ్యవసాయం, రోజుకూలీ, స్వయం ఉపాధి, ప్రభుత్వ ఉద్యోగి, ఉద్యోగి యజమాని, ప్రైవేటు ఉద్యోగి, డొమెస్టిక్ హెల్పర్, నాన్ వర్కరా? అని అరా తీయనున్నారు) 11. తల్లి మాతృ భాష ఏమిటి? 12. మీ శాశ్వత చిరునామా చెప్పండి 13. ప్రస్తుత చిరునామాలో ఓ సభ్యుడు పుట్టినప్పటి నుంచి ఉంటున్నాడా? (ఒకవేళ లేకుంటే ఇప్పుడు ఎన్నేళ్ల నుంచి ఇక్కడ ఉన్నాడు? అంతకు ముందు ఎక్కడ ఉన్నాడో తెలపాలి) 14. తండ్రి, తల్లి, భాగస్వామి వివరాలు (తల్లిదండ్రుల గణన ఈ ఇంట్లో జరగని పక్షంలో వారి పేర్లు, పుట్టిన తేదీ వివరాలు సేకరిస్తారు. భాగస్వామి అయితే కేవలం పేరు మాత్రమే రాస్తారు. అదే ఇంట్లో తల్లిదండ్రులు, భాగస్వామి గణన నిర్వహిస్తే వారి పేర్లు, దేశం/విదేశంలో పుట్టిన ప్రాంతం, పుట్టిన తేదీ వివరాలు సేకరిస్తారు. తల్లిదండ్రుల పుట్టిన తేదీ వివరాలు రూఢీ కాకపోతే సంబంధిత కాలమ్‌లో ‘–’అని పెడతారు. 15. ఆధార్, మొబైల్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ నంబర్లు అందుబాటులో ఉంటే తీసుకుంటారు. జనాభా గణనకు అర్హులైన వారు.. - ఎన్యూమరేటర్ వచ్చిన సమయంలో ఇంట్లో అందుబాటులో ఉన్న వ్యక్తులు. - జనాభా గణన నిర్వహించే సమయంలో అక్కడ ప్రత్యక్షంగా ఉన్న ఇంటి సాధారణ నివాసితులు. - ఇంటి సాధారణ నివాసితులై ఉండి ఎన్యూమరేటర్ సందర్శనకు వచ్చిన సమయంలో ఇంట్లో లేని వ్యక్తులు జనాభా గణన ముగిసేలోగా తిరిగి వస్తే వారి వివరాలను సైతం సేకరించనున్నారు. - సందర్శకులు, పనిమనుషులు, అద్దెకు ఉండే వ్యక్తులు, డ్రైవర్లు లేదా అలాంటి వ్యక్తులు ఓ గృహ పరివారంతో కలసి ఉండటంతోపాటు పైన పేర్కొన్న మూడు అర్హతలను కలిగి ఉంటే వారి వివరాలను సైతం సేకరిస్తారు. ఎన్పీఆర్ డేటాబేస్–2010 ఆధారంగా... దేశంలో నివాసముంటున్న ప్రజలందరికీ సంబంధించిన ఎన్పీఆర్ డేటాబేస్‌ను తొలిసారిగా 2010లో తయారు చేశారు. జనగణన–2011 కార్యక్రమంలో భాగంగా 2010లో నిర్వహించిన సర్వేలో సేకరించిన సమాచారం ఆధారంగా ఎన్పీఆర్ డేటాను రూపొందించారు. ఆ వివరాలతో ‘ఎన్పీఆర్ డేటా బుక్లెట్’ను ముద్రించనున్నారు. ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి కుటుంబ పెద్ద నుంచి జనాభా గణనతోపాటు ఎన్పీఆర్కు సంబంధించి తాజా సమాచారాన్ని సేకరించనున్నారు. ఈ క్రమంలో ఎన్పీఆర్ బుక్‌లెట్స్‌లో సంబంధిత కుటుంబం/వ్యక్తులకు సంబంధించి ముద్రించి ఉన్న సమాచారాన్ని సరిపోల్చి చూడనున్నారు. ఇందుకు అవసరమైతే ఆధార్, ఓటర్ ఐడీ కార్డు వంటి రుజువులను చూపాలని కోరనున్నారు. పాత ఎన్పీఆర్ డేటాబేస్‌లో ఎవైనా తప్పులుంటే సరిచేయడంతోపాటు అవసరమైన కొత్త సమాచారాన్ని నమోదు చేసుకోనున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన సందర్భంగా పాత ఎన్పీఆర్ డేటాబేస్‌లో ఉన్న కుటుంబాల్లో కొత్త సభ్యులున్నట్లుగానీ, కొత్త కుటుంబాలున్నట్లుగానీ గుర్తిస్తే వారికి సంబంధించిన సమాచారాన్ని నమోదు చేసేందుకు ఎన్యూమరేటర్లకు ‘ఖాళీ ఎన్పీఆర్ ఫారాలను’కేంద్రం అందించనుంది. ఓ కుటుంబానికి సంబంధించిన ఎన్పీఆర్ బుక్‌లెట్‌లో ఆ కుటుంబానికి సంబంధించిన కొత్త సభ్యుల వివరాలను నమోదు చేసేందుకు అవసరమైన ఖాళీ పేజీలుంటే అదే బుక్‌లెట్‌లో నమోదు చేయనున్నారు. - కుటుంబలోని ప్రతి వ్యక్తికి సంబంధించిన ఎన్పీఆర్ డేటాబేస్‌ను నవీకరిస్తారు. - నవీకరించిన ఎన్పీఆర్ డేటాబేస్‌ను కుటుంబ పెద్దకు చూపించడంతోపాటు బుక్లెట్పై అతడి/ఆమె సంతకం/వేలిముద్రను సేకరించనున్నారు. - కుటుంబ సభ్యుల పేర్లు, సంఖ్య, ఇతర అంశాలకు సంబంధించిన సరైన సమాచారాన్ని అందించాల్సిన బాధ్యత కుటుంబ పెద్దది అని ఎన్పీఆర్ నిబంధనలు పేర్కొంటున్నాయి. - ఒకే గృహంలో నివాసముంటూ ఉమ్మడి కిచెన్‌పై ఆధారపడిన రక్తసంబంధికులతోపాటు ఏ సంబంధం లేని వ్యక్తుల ఎన్పీఆర్ డేటాను ‘సాధారణ గృహాల’విభాగం కింద స్వీకరించనున్నారు. - బోర్డింగ్ గృహాలు, మెస్‌లు, హాస్టళ్లు, హోటళ్లు, రెస్క్యూ గృహాలు, అబ్జర్వేషన్ హోంలు, బెగ్గర్ హోంలు, జైళ్లు, ఆశ్రమాలు, వద్ధాశ్రమాలు, బాల గృహాలు, అనాథాశ్రమాలు వంటి భవనాల్లో నివాసముండే ఏ బంధుత్వం లేని వ్యక్తుల ఎన్పీఆర్ డేటాను వ్యవస్థాగత గృహాల విభాగం కింద సమీకరించనున్నారు. - ఎన్పీఆర్ బుక్లెట్పై రాష్ట్రం/జిల్లా/తహసీల్/తాలుకా/పోలీస్ స్టేషన్/డివిజన్ బ్లాక్/సర్కిల్ బ్లాక్/మండలం/పట్టణం/గ్రామం పేర్లతో వాటికి సంబంధించిన కోడ్లు ముద్రించి ఉండనున్నాయి. వార్డు, హౌస్‌హోల్డ్ బ్లాక్ నంబర్, సబ్బ్లాక్ నంబర్, పిన్‌కోడ్ వంటి వివరాలు సైతం ఉండనున్నాయి. -
జనగణన 45 రోజులు
సాక్షి, హైదరాబాద్: జాతీయ జనాభా గణన–2021 లో భాగంగా వచ్చే ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య 45 రోజులు రాష్ట్రంలో తొలి విడత జనాభా లెక్కల సేకరణ నిర్వహించనున్నామని సీఎస్ ఎస్కే జోషి వెల్లడించారు. 2021 ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు రెండో విడత నిర్వహిస్తామని చెప్పారు. 71,136 మంది ఎన్యూమరేటర్లు ఇందులో పాల్గొంటారని పేర్కొన్నారు. జనాభా గణన–2021 కార్యక్రమం ఏర్పాట్లపై సోమవారం ఆయన బీఆర్కేఆర్ భవన్లో సమీక్ష నిర్వహించారు. 65 మంది మాస్టర్ ట్రైనర్లకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ కేంద్రంలో తొలి విడత శిక్షణ ముగిసిందని, రెండో విడత సోమవారం నుంచి 7 వరకు జరుగుతుందని చెప్పారు. జనాభా లెక్కల సేకరణలో భాగంగా గృహాల జాబితాల తయారీ, జనగణనతో పాటు జాతీయ జనాభా రిజిస్ట్రర్‌ను నవీకరిస్తారని వెల్లడించారు. వ్యక్తుల వివరాలతో పాటు సాంఘిక, సాంస్కృతిక, భౌగోళిక, ఆర్థికపర వివరాలను సేకరిస్తారని చెప్పారు. ఎన్యూమరేటర్లు తమ మొబైల్ ఫోన్ యాప్‌తో పాటు కాగితపు దరఖాస్తులను నింపడం ద్వారా జనాభా వివరాలను సేకరిస్తారన్నారు. జనాభా గణన వ్యవహారాల డైరెక్టర్ కె.ఇలంబర్తి ఇప్పటివరకు చేపట్టిన చర్యలను వివరించారు. -
ఆగస్టులో ప్రయోగాత్మక జనగణన
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ఏడాది ఆగస్టు 12–సెప్టెంబర్ 30 మధ్య ప్రయోగాత్మక జనగణన చేపట్టనున్నట్లు కేంద్రం తెలిపింది. దేశ జనగణన చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈసారి మొబైల్ యాప్ ద్వారా జనాభా లెక్కలను సేకరించనున్నట్లు రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనర్ వివేక్ జోషి తెలిపారు. ఇందుకు అనుగుణంగా ఎన్యుమరేటర్లు మొబైల్ ఫోన్‌ను వెంట తీసుకువెళతారని ఆయన వివరించారు. 2021 జనగణనకు మంచుకురిసే జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు రిఫరెన్స్ తేదీ అక్టోబర్ 1, 2020 కాగా ఇతర రాష్ట్రాలకు మార్చి 1, 2021గా పరిగణిస్తారన్నారు. 2021 జనగణన ప్రపంచంలోనే అతిపెద్దది కానుందన్నారు. 33 లక్షల మంది ఎన్యుమరేటర్లు ఇంటింటికీ తిరిగి వివరాలను సేకరిస్తారన్నారు. జన సంఖ్యతోపాటు పథకాలు రూపకల్పన, అమలుకు సాయపడే సామాజిక–ఆర్థిక స్థితిగతులు కూడా వెల్లడవుతాయన్నారు. కాగా, 2021 వాస్తవ జన గణన మొదటి విడత 2020 ఏప్రిల్ –సెప్టెంబర్ మధ్యలో చేపట్టే వెసులుబాటు రాష్ట్రాలకు ఉంది. రెండో విడత జనాభా లెక్కలను 2021 ఫిబ్రవరి 9–28 తేదీల మధ్య సేకరిస్తారు. సవరించిన లెక్కలను మార్చి 1–5 తేదీల మధ్య తీసుకుంటారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో జనాభా లెక్కలను వచ్చే ఏడాది సెప్టెంబర్ 11–30 తేదీల మధ్య చేపడతారు. మళ్లీ అక్టోబర్ 1–5 తేదీల్లో సవరించిన లెక్కలు తీసుకుంటారు. -
జనగణనలో ఇక ఓబీసీ డేటా
న్యూఢిల్లీ: స్వాతంత్య్రం తర్వాత దేశంలో జన గణనలో భాగంగా తొలిసారి ఇతర వెనుకబడిన వర్గాల(ఓబీసీ) జనాభా లెక్కలను సేకరించనున్నారు. ఈ మేరకు 2021లో చేపట్టే జనగణనలో ఓబీసీల లెక్కలను సేకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జనగణన తుది నివేదిక వెల్లడించే సమయాన్ని తగ్గించనుంది. ఏడేళ్లకు బదులుగా ఈసారి లెక్కల సేకరణ ప్రక్రియ పూర్తయిన మూడేళ్లకే తుది నివేదిక వెల్లడించనున్నారు. 2021లో చేపట్టనున్న జనగణన ప్రక్రియకు సంబంధించి జరుగుతున్న సన్నాహాలపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. దీనిలో భాగంగా జన గణన పూర్తయిన మూడేళ్లకే తుది నివేదిక వచ్చేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడాలని మంత్రి ఆదేశించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఈ ప్రక్రియను పక్కాగా నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు. అలాగే శిశు, ప్రసూతి మరణాల రేటు, సంతానోత్పత్తి రేట్లను సరిగ్గా నమోదు చేయాలని మంత్రి ఆదేశించినట్లు తెలిపారు. ఇళ్ల జాబితాను రూపొందించేందుకు మ్యాపులు, జియో రిఫరెన్సింగ్ వంటి సదుపాయాలను వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. గణన కోసం సుమారు 25 లక్షల మంది ఎన్యూమరేటర్లు శిక్షణలో నిమగ్నమై ఉన్నారు. 2006లో జాతీయ నమూనా సర్వే సంస్థ నివేదిక ప్రకారం దేశ జనాభాలో ఓబీసీలు సుమారు 41 శాతం వరకు ఉండవచ్చని పేర్కొంది. -
ప్రభం‘జన’ తొలి పది దేశాలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ జనాభా నానాటికీ పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 7.5 కోట్ల జనాభా పెరుగుతోంది. 2018 జూలై నాటికి ప్రపంచ జనాభా 760 కోట్లు ఉన్నట్లు అంచనా. ఇదేవిధంగా పెరుగుతూ పోతే భవిష్యత్తులో ప్రపంచ వ్యాప్తంగా 2030 నాటికి 840 కోట్లు, 2050 నాటికి 960 కోట్లకు జనాభా చేరుకుంటుంది. నేడు (జులై 11) ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా పాపులేషన్లో ముందున్న పది దేశాల గురించి తెలుసుకుందాం. చైనా 1,415,171,198తో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనా తొలి స్థానంలో నిలించింది. ప్రపంచ జనాభాలో అత్యధికంగా 18.54 శాతం జనాభా చైనాలోనే ఉంది. ఒక చదరపు కిలోమీటరులో 151 మంది ప్రజలు నివసిస్తున్నారు. చైనా జనాభాలో సగటు వయస్సు 37 ఏళ్లు. ఇండియా 1,354,464,444 జనాభాతో భారతదేశం ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. ప్రపంచ జనాభాలో 17.74 శాతం ప్రజలు భారత్‌లో నివశిస్తున్నారు. ఒక చదరపు కిలోమీటర్‌కు 455 మంది ప్రజలు జీవిస్తున్నారు. ఇది చైనా కంటే రెండింతులు ఎక్కువ. భారతీయ జనాభాలో సగటు వయసు 27 ఏళ్లు. ప్రపంచంలో అత్యధిక యువత ఉన్న దేశంగా భారత్ తొలి స్థానంలో ఉంది. అమెరికా 326,830,645 జనాభాతో అమెరికా ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. ప్రపంచ జనాభాలో అమెరికన్లు 4.28 శాతం మంది ఉన్నారు. ఒక చదరపు కిలోమీటర్‌కు కేవలం 36 మంది మాత్రమే నివశిస్తున్నారు. అమెరికన్ల జనాభాలో సగటు వయస్సు 37 ఏళ్లు. ఇండోనేషియా 266,872,775 జనాభాతో దీవుల దేశం ఇండోనేషియా నాలుగో స్థానంలో ఉంది. ప్రపంచ జనాభాలో వీరి శాతం 3.5 శాతం. ఒక చదరపు కిలోమీటర్‌కు 147 మంది ప్రజలు నివశిస్తున్నారు. వీరి సగటు వయసు 28 ఏళ్లు. బ్రెజిల్ 266,872,775 జనాభాతో ప్రపంచంలో బ్రెజిల్ ఐదో స్థానంలో ఉంది. ప్రపంచ జనాభాలో వీరి శాతం 2.76 శాతం. ఒక చదరపు కిలోమీటర్‌కు కేవలం 26 మంది మాత్రమే నివశిస్తున్నారు. వీరి సగటు వయసు 31 ఏళ్లు. పాకిస్తాన్ 200,919,769 జనాభాతో ఆరో స్థానంలో ఉంది. ప్రపంచంలో పాక్ జనాభా శాతం 2.63. ఒక చదరపు కిలోమీటర్‌కి 260 మంది ప్రజలు నివశిస్తున్నారు. వీరి జనాభా సగట వయసు 22 ఏళ్లు. నైజీరియా 196,041,916 జనాభాతో నైజీరియా ప్రపంచంలో ఏడో స్థానంలో ఉంది. ప్రపంచ జనాభాలో నైజీరియన్ల్ శాతం 2.57. ఒక చదరపు కిలోమీటర్‌కి 215 మంది నైజీరియన్లు నివశిస్తున్నారు. బంగ్లాదేశ్ 166,415,337 జనాభాతో భారత సరిహద్దు దేశం బంగ్లాదేశ్ ఎనిమిదో స్థానంలో ఉంది. ప్రపంచ జనాభాలో వీరి శాతం 2.18. ఒక చదరపు కిలోమీటర్‌కి అత్యధికంగా 1278 మంది నివశిస్తున్నారు. వీరి జనాభా సగటు వయసు 26 ఏళ్లు. రష్యా 143,964,017 జనాభాతో రష్యా ప్రపంచంలో తొమ్మిదో స్థానంలో ఉంది. ప్రపంచ జనాభాలో వీరి శాతం 1.89 శాతం. ఒక చదరపు కిలోమీటర్‌కు కేవలం 9 మంది మాత్రమే నివశిస్తున్నారు. వీరి సగటు వయసు 38 ఏళ్లు. మెక్సికో 130,803,510 జనాభాతో మెక్సికో ప్రపంచంలో పదో స్థానం ఆక్రమించింది. ప్రపంచంలో వీరి జనాభా 1.71 శాతం. -
అమెరికాలో జనగణనపై జగడం
వాషింగ్టన్: అమెరికాలో 2020లో చేపట్టనున్న తదుపరి జనాభా లెక్కలపై అప్పుడే వివాదం రేగింది. జనాభా లెక్కల సందర్భంగా అధికారులు.. పౌరసత్వానికి సంబంధించి ప్రశ్నించవచ్చని వస్తున్న వార్తలు వివాదాస్పదమవుతున్నాయి. ఈ ప్రశ్న వల్ల మైనారిటీలు సెన్సస్‌లో పాలుపంచుకోకపోవచ్చని, దీని వల్ల జనాభా గణాంకాల ప్రామాణికత తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెపుతున్నారు. సెప్టెంబర్‌లో జరిగిన తాజా సర్వేల్లో పాల్గొన్న ప్రజలు ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం గురించి తీవ్ర ఆందోళన చెందుతున్నట్టు వ్యక్తమైందని ఎన్ఏఎల్ఈఓ ఎడ్యుకేషనల్ ఫండ్ హెడ్ ఆర్టురో వర్గాస్ పేర్కొన్నారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారాన్ని చేపట్టిన తర్వాత వలసలను, విదేశీయులను.. ఉగ్రవాదం, నేరాలు, ఉద్యోగాలు కోల్పోవడానికి సంబంధం కల్పిస్తూ యాంటీ ఇమిగ్రేషన్ ఎజెండాను చేపట్టారు. గత నెలలో ట్రంప్ స్టేట్ ఆఫ్ యూనియన్ ప్రసంగంలో కూడా లీగల్ ఇమిగ్రేషన్‌ను తగ్గిస్తామని ప్రతిజ్ఞ చేసిన సంగతి తెలిసిందే. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో వలసదారులను, వారి కుటుంబాల నుంచి వేరు చేసి స్వదేశం పంపేస్తున్నారనే వార్తలు కలకలం రేపుతున్నాయి. దీంతో సెన్సస్ సమాచారాన్ని తమకు వ్యతిరేకంగా అధికారులు వినియోగించే అవకాశం ఉందనే ఆందోళనతో జనాభాలో ఎక్కువ శాతం మంది జన గణనలో పాల్గొనేందుకు అసక్తి చూపకపోవచ్చని నిçపుణులు పేర్కొం టున్నారు. డిసెంబర్లో జాతీయతకు సంబంధించిన ప్రశ్నను కూడా సర్వేలో చేర్చాలని న్యాయ శాఖ సెన్సస్ బ్యూరోకు సూచించడం వివాదం రేపింది. అయితే ఓటింగ్ హక్కుల చట్టాన్ని పరిరక్షించేందుకు పౌరుల సమాచారం ఉపయోగపడుతుందని న్యాయ శాఖ వాదించింది. కాగా, ప్రశ్నావళిపై తాము కసరత్తు చేస్తున్నామని, ప్రశ్నావళి తుది జాబితాను మార్చి 31 నాటికి కాంగ్రెస్‌కు సమర్పిస్తామని సెన్సస్ ప్రోగ్రామ్ డైరెక్టర్ అల్ ఫాంటెనాట్ స్పష్టం చేశారు. 32.7 కోట్లకు..! అమెరికా రాజ్యాంగం ప్రకారం.. ప్రతినిధుల సభలో ప్రతి రాష్ట్రానికి ఎన్ని సీట్లు కేటాయిస్తారనేది సెన్సస్ లెక్కలపైనే ఆధారపడి ఉంటుంది. అలాగే స్కూళ్లు, ఆస్పత్రులు, ప్రజాసేవకు సంబంధించి నిధుల పంపకానికి కూడా జనాభా లెక్కలే కీలకం. సెన్సస్‌కు కొన్ని వర్గాలు దూరంగా ఉండటం పాత సమస్యే. 2010 జనాభా లెక్కల్లో లాటినోస్ సంఖ్యను 7,75,000 తక్కువగా లెక్కించినట్టు అంచనా. అయితే ఈసారి ఈ సమస్య మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. 2010 గణనలో 30.88 కోట్ల అమెరికన్లు ఉన్నట్టు తేలగా, ప్రస్తుతం ఈ సంఖ్య 5.8% పెరుగుదలతో 32.7 కోట్లకు చేరుతుందని అంచనా. -
వీధుల్లో టీచర్లు.. గాల్లో చదువులు!
పరీక్షల ముందు అదనపు బాధ్యతలు ఆందోళనలో విద్యార్థులు అరకొరగా జనాభా లెక్కలు విశాఖపట్నం: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్టుగా తయారైంది విద్యార్థుల పరిస్థితి. తలాతోకా లేని నిర్ణయాలతో పిల్లల చదువులు గాలికొదిలేయాల్సిన దుస్థితి దాపురించింది. పరీక్షలు ముంచుకొస్తున్న సమయంలో ప్రభుత్వం టీచర్లను జనాభా లెక్కల సేకరణ బాధ్యతలను అప్పగించింది. గతంలో వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయులతో జనాభా లెక్కల సేకరణ జరిపించేది. దానివల్ల చదువులకు ఆటంకం ఏర్పడేది కాదు. కానీ మునుపెన్నడూ లేనివిధంగా ఈ సారి విద్యా సంవత్సరం మధ్యలో ఆ పనిని అంటగట్టింది. దీంతో దాదాపు నెల రోజుల నుంచి సగం మందికి పైగా టీచర్లు జనాభా సేకరణలో పడ్డారు. తొలుత డిసెంబర్ 15 వరకు ఈ బాధ్యతలు నిర్వహించాలని చెప్పింది. కానీ నాలుగో వంతు కూడా ఆ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో తాజాగా ఈ నెలాఖరు వరకు పొడిగించింది. జిల్లాలో ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు ఉదయం పూట చదువులు చెప్పడానికి, మధ్యాహ్నం నుంచి జనాభా లెక్కల సేకరణకు వెళ్లేందుకు విద్యాశాఖ అధికారులు అనుమతించారు. పదో తరగతికి బోధించే టీచర్లకు మాత్రం మినహాయింపునిచ్చారు. ప్రభుత్వం మెమో న ంబరు 88140/21-11-15 ప్రకారం టెన్త్ సబ్జక్టులు బోధించే టీచర్లకు జనాభా సేకరణ నుంచి మినహాయింపునిచ్చింది. కానీ జీవీఎంసీ పరిధిలో మాత్రం వీరికి మినహాయింపు ఇవ్వలేదు. దీంతో పలువురు ఎలిమెంటరీతోపాటు ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు జనాభా సేకరణ నిమిత్తం వీధుల్లోకి వెళ్లి ఇంటింటా తిరుగుతున్నారు. దీంతో ముఖ్యంగా పదో తరగతి పిల్లలు నష్టపోయే ప్రమాదంలో పడ్డారు. మూడు నెలలు టీచర్ల బదిలీల ప్రహసనం కొనసాగడంతో అరకొరగానే చదువులు సాగాయి. మళ్లీ ఇప్పుడు జనాభా లెక్కల బెడద వచ్చిపడింది.