
సాక్షి, హైదరాబాద్: జాతీయ జనాభా గణన–2021 లో భాగంగా వచ్చే ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య 45 రోజులు రాష్ట్రంలో తొలి విడత జనాభా లెక్కల సేకరణ నిర్వహించనున్నామని సీఎస్ ఎస్‌కే జోషి వెల్లడించారు. 2021 ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు రెండో విడత నిర్వహిస్తామని చెప్పారు. 71,136 మంది ఎన్యూమరేటర్లు ఇందులో పాల్గొంటారని పేర్కొన్నారు. జనాభా గణన–2021 కార్యక్రమం ఏర్పాట్లపై సోమవారం ఆయన బీఆర్‌కేఆర్ భవన్‌లో సమీక్ష నిర్వహించారు. 65 మంది మాస్టర్ ట్రైనర్లకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ కేంద్రంలో తొలి విడత శిక్షణ ముగిసిందని, రెండో విడత సోమవారం నుంచి 7 వరకు జరుగుతుందని చెప్పారు.
జనాభా లెక్కల సేకరణలో భాగంగా గృహాల జాబితాల తయారీ, జనగణనతో పాటు జాతీయ జనాభా రిజిస్ట్రర్‌ను నవీకరిస్తారని వెల్లడించారు. వ్యక్తుల వివరాలతో పాటు సాంఘిక, సాంస్కృతిక, భౌగోళిక, ఆర్థికపర వివరాలను సేకరిస్తారని చెప్పారు. ఎన్యూమరేటర్లు తమ మొబైల్ ఫోన్ యాప్‌తో పాటు కాగితపు దరఖాస్తులను నింపడం ద్వారా జనాభా వివరాలను సేకరిస్తారన్నారు. జనాభా గణన వ్యవహారాల డైరెక్టర్ కె.ఇలంబర్తి ఇప్పటివరకు చేపట్టిన చర్యలను వివరించారు.