కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కాంగ్రెస్ తీర్మానం
కులగణనపై గాంధీ భవన్‌లో కీలక భేటీ.. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ముఖ్య నేతలు
నవంబర్ 2న అన్ని జిల్లాల్లో అభిప్రాయ సేకరణకు సమావేశాలు
మేధావులు, సామాజికవేత్తల సలహాలు, సూచనలు తీసుకోవాలని నిర్ణయం
5 లేదా 6వ తేదీన రాహుల్‌గాం«దీని ఆహ్వానించి సభ నిర్వహణకు యోచన
కులగణన ఎక్స్‌రే మాత్రమే కాదు.. మెగా హెల్త్ చెకప్ లాంటిది: సీఎం
పార్టీ నాకు అన్నీ చేసింది.. నేను పార్టీకి, ప్రజలకు సేవ చేయడమే మిగిలింది
ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపు
కులగణన పార్టీకి ఎలా ఉపయోగపడుతుందో వివరించిన కొప్పుల రాజు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది నిర్వహించనున్న జనగణనలోనే కులగణన కూడా చేపట్టాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ టీపీసీసీ ఆధ్వర్యంలో బుధవారం తీర్మానం చేసింది. రాష్ట్రంలో వచ్చే నెల ఆరోతేదీ నుంచి నిర్వహించ తలపెట్టిన కులగణనపై చర్చించేందుకు గాం«దీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో దీనిని ఆమోదించారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ నేత కొప్పుల రాజుతోపాటు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, రాష్ట్ర కార్పొరేషన్ల చైర్‌పర్సన్లు, పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో కులగణన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీకి ఎలా ఉపయోగపడుతుందన్న అంశాన్ని ఏఐసీసీ నేత కొప్పుల రాజు వివరించారు. ఆ కార్యక్రమంలో పార్టీ శ్రేణులను భాగస్వాములను చేయాలని సూచించారు. ఇక వచ్చే నెల 2న కులగణన అంశంపై జిల్లా స్థాయిలో డీసీసీల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించాలని.. భాగస్వామ్య పక్షాలను ఆహ్వానించి విస్తృతస్థాయి చర్చ జరపాలని సమావేశంలో నిర్ణయించారు. వచ్చే నెల 5న లేదా 6న రాష్ట్రస్థాయిలో మేధావులు, సామాజికవేత్తలు, ముఖ్యులతో భేటీ జరపాలని.. వారిచ్చే సలహాలు, సూచనలకు అనుగుణంగా కులగణన ప్రక్రియపై ముందుకెళ్లాలని ఆలోచనకు వచ్చారు. కులగణనపై రాష్ట్రంలో సభ నిర్వహించాలని, దీనికి రాహుల్‌గాం«దీని ఆహ్వానించాలని నిర్ణయించారు.
రాహుల్ గాంధీ మాట మేరకు..: రేవంత్‌రెడ్డి
సమావేశంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటైన తర్వాత సామాజిక, ఆర్థిక, రాజకీయ, కులగణన చేస్తామని గత ఎన్నికల సందర్భంగా రాహుల్‌గాంధీ ఇచ్చిన మాట మేరకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. గాంధీ కుటుంబం ఒకమాట ఇస్తే ఎవరు అడ్డువచ్చినా నెరవేర్చి తీరుతుంది. అప్పుడు తెలంగాణ ఏర్పాటు ద్వారా, ఇప్పుడు కులగణన ద్వారా ఇది నిరూపితమైంది..’’ అని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ విధానాలను అమలు చేయడమే రాష్ట్ర ప్రభుత్వ విధానమని.. ఈ క్రమంలో ప్రతిక్షణం సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులు, నాయకులపై ఉందని చెప్పారు. కులగణనలో భాగస్వాములను చేసేందుకు 33 జిల్లాలకు 33 మంది పరిశీలకులను నియమించాలని పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్‌కు రేవంత్ సూచించారు. కులగణన విషయంలో దేశానికే తెలంగాణ రోల్ మోడల్ కావాలని, ఈ మోడల్ రాహుల్‌గాంధీని ప్రధాన మంత్రిని చేయాలని వ్యాఖ్యానించారు.
రాహుల్‌గాంధీ ఇచ్చిన మాటను అమలు చేసే క్రమంలో ఎవరు అడ్డు వచ్చినా, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కులగణన కేవలం ఎక్స్‌రే మాత్రమే కాదని.. మెగా హెల్త్ చెకప్ వంటిదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదాయాన్ని సామాజిక న్యాయం ప్రకారం పంచడమే కాంగ్రెస్ విధానమన్నారు. నవంబర్ 31లోగా రాష్ట్రంలో కులగణన పూర్తి చేసి తెలంగాణ నుంచే నరేంద్ర మోదీపై యుద్ధం ప్రకటించాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా జనగణనలో భాగంగా ఓబీసీల కులగణన చేపట్టడం కోసం.. రాష్ట్రంలో జరిగే కులగణన డాక్యుమెంట్‌ను పంపుతామన్నారు.
మీరు 52 శాతమే అడిగారు.. 57శాతం ఎంపికయ్యారు!
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 52 శాతం రిజర్వేషన్లు కావాలన్నది కాంగ్రెస్ పార్టీలోని బీసీల నినాదమని.. అయితే గ్రూప్–1 మెయిన్స్‌కు 57 శాతం మంది బీసీలు ఎంపికయ్యారని సీఎం రేవంత్ పేర్కొన్నారు. అగ్రవర్ణాలతోపాటు బీసీలు, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ కోటాల కింద ఎంత మంది గ్రూప్–1 మెయిన్స్‌కు ఎంపికయ్యారన్న విషయాన్ని వివరించారు.
నవంబర్ ఆరో తేదీ నుంచి చేపట్టనున్న కులగణన కార్యక్రమాన్ని 30వ తేదీలోగా పూర్తి చేస్తామని.. తర్వాత ఈ వివరాలన్నింటినీ హైకోర్టుకు సమర్పిస్తామని చెప్పారు. డిసెంబర్ 7న రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. ఆ రోజుకల్లా స్థానిక రిజర్వేషన్లపై కోర్టు తీర్పు వస్తే, డిసెంబర్ 9న సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా సంబురాలు జరుపుకోవాలని పేర్కొన్నారు.
నాకు పార్టీ అన్నీ చేసింది..
కాంగ్రెస్ పార్టీ తనకు అన్నీ చేసిందని, ముఖ్యమంత్రిని చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇప్పుడు మిగిలింది తాను పార్టీకి, ప్రజలకు సేవ చేయడమేనని చెప్పారు. ఈ క్రమంలోనే పార్టీ విధానాన్ని పాటించేందుకు కులగణన చేపడుతున్నామన్నారు. పార్టీ అధికారంలోకి రాకముందు అనుబంధ సంఘాల అధ్యక్ష పదవులు తీసుకోవాలని కోరితే కొందరు ముందుకు రాలేదని.. ఇప్పుడు వారే తాము పెద్ద నాయకులమని, పదవులు ఇవ్వాలని కోరుతున్నారని చెప్పారు.
అందరూ పార్టీ కోసం కష్టపడి చేయాలని, తప్పకుండా ఫలితం ఉంటుందని పేర్కొన్నారు. ఒక సీఎంగా రేవంత్‌రెడ్డి చట్టాలను అమలు చేస్తాడే తప్ప వ్యక్తిగత ఎజెండాతో కాదని.. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలను పార్టీ నాయకత్వం తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ, కుల సర్వే..!
సమావేశంలో పీసీసీ మాజీ చీఫ్ వి.హనుమంతరావు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఆ సర్వే కాగితాలు కూడా లేకుండా చేశారని, దానిపై విచారణ జరిపించాలని సీఎంను కోరారు.
ఇక ఈనెల 6 నుంచి చేపట్టే కులగణనలో కూడా కుటుంబ వివరాలతోపాటు కులం, ఉప కులం తెలుసుకుంటే సరిపోతుందని.. మిగతా వివరాలు అడగడం ద్వారా ప్రతిపక్షాలకు విమర్శించే అవకాశం ఇచ్చిన వాళ్లమవుతామని వీహెచ్ సూచించారు. దీనిపై సీఎం రేవంత్ స్పందిస్తూ.. కేవలం కులం వివరాలను సేకరిస్తే న్యాయపరంగా ఇబ్బంది వస్తుందని, అందుకే సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ, కుల సర్వే చేపడుతున్నామని చెప్పినట్టు తెలిసింది.
పకడ్బందీగా కులగణన: మహేశ్‌గౌడ్
వచ్చేనెల ఆరో తేదీ నుంచి జరగనున్న కులగణనను పకడ్బందీగా నిర్వహిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పారు. గాం«దీభవన్‌లో సమావేశం అనంతరం ఆయన పార్టీ నేతలు షబ్బీర్‌అలీ, మధుయాష్కీ, ఆది శ్రీనివాస్, తీన్మార్ మల్లన్న, అనిల్‌కుమార్ యాదవ్, శంకర్‌నాయక్, మెట్టు సాయికుమార్‌లతో కలిసి మాట్లాడారు.
కులగణనపై నవంబర్ 2న జిల్లా స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని, తర్వాత రాష్ట్రస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామని మహేశ్‌గౌడ్ తెలిపారు. ప్రతిపక్షాల అపోహలను ప్రజలు నమ్మడం లేదని.. గత ప్రభుత్వ అరాచకాల మీద చర్యల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment