పీసీ ఘోష్ కమిషన్ ముందు మాజీ సీఎస్ ఎస్‌కే జోషి
మేడిగడ్డ వద్ద భూమిపూజ చేసిన రోజే ప్రాజెక్టు పేరు మార్చారు
మొత్తం 200కు పైగా పరిపాలనపరమైన అనుమతుల జారీ
మేడిగడ్డ వైఫల్యానికి కచ్చితమైన కారణాలు చెప్పలేను
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణం విషయంలో విధానపరమైన నిర్ణయం తీసుకున్నది నాటి సీఎం కేసీఆర్, నాటి నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావులేనని మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి చెప్పారు. నాటి సీఎం కేసీఆర్ అధ్యక్షతన వ్యాప్కోస్, సీఈ–సీడీఓ, ఇంజనీర్లతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. 2016 మే 2న మేడిగడ్డ వద్ద భూమిపూజ చేసి బరాజ్‌ల నిర్మాణాన్ని కేసీఆర్ ప్రారంభించారని వివరించారు. అదే రోజు ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పేరును కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చినట్టు వెల్లడించారు. కాళేశ్వరం బరాజ్‌ల నిర్మాణంపై విచారణలో భాగంగా జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ బుధవారం నిర్వహించిన క్రాస్ ఎగ్జామినేషన్‌లో ఆయన పాల్గొన్నారు.
సీఎం నిర్ణయాన్ని సాధారణంగా వ్యతిరేకించరు
బరాజ్‌ల నిర్మాణంపై విధానపర నిర్ణయం ఎవరిది? అని కమిషన్ ప్రశ్నించగా, నాటి సీఎం నేతృత్వంలో మంత్రివర్గం, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. అని తొలుత బదులిచ్చారు. నిర్ణయం మంత్రివర్గందా? సీఎందా? ప్రభుత్వం అంటే ఎవరు? అని కమిషన్ గుచి్చగుచ్చి ప్రశ్నించగా, నిర్ణయం సీఎందేనని, మంత్రివర్గం బలపరిచిందని తెలిపారు. మంత్రివర్గ భేటీలో ఎవరైనా మంత్రి అసమ్మతి వ్యక్తం చేయలేదా? అని ప్రశ్నించగా, అలాంటి విషయం తన దృష్టికి రాలేదన్నారు. సీఎం నిర్ణయంపై అసమ్మతి తెలిపితే మరుసటి రోజే మంత్రి పదవి కోల్పోవాల్సి వస్తుందనే భావనతో ఎవరూ అలా చేయరన్నారు.
‘మహా’ అభ్యంతరాలు, నీటి లభ్యత లేదనడంతోనే..
తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్‌కి మహారాష్ట్ర అభ్యంతరాలు, వణ్యప్రాణి సంరక్షణ కేంద్రం ప్రతిబంధకాలుగా మారడం, తగిన నీటి లభ్యత లేదని కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) లేఖ రాయడంతో బరాజ్‌ను మేడిగడ్డకు మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఎస్‌కే జోషి వివరణ ఇచ్చారు. మేడిగడ్డ బరాజ్ వైఫల్యానికి కచి్చతమైన కారణాలు చెప్పలేనని, డిజైన్లకు అనుగుణంగా నిర్మాణం జరగకపోవడం, నాణ్యతా లోపాలు, నిర్వహణ/పర్యవేక్షణ లోపాలు వంటి అనేక కారణాలు ఉండవచ్చని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేవలం ఒకే ఒక పరిపాలనపర అనుమతి జారీ చేయలేదని, సుమారు 200కి పైగా అనుమతులు జారీ చేశారని తెలిపారు.
సబ్ కాంట్రాక్టర్లపై సమాచారం లేదు
మేడిగడ్డ బరాజ్ నిర్మాణ సంస్థ ఇతర సంస్థలకు (సబ్ కాంట్రాక్టర్లకు) ఏమైనా పనులు అప్పగించిందా? వేరే సంస్థలు నిర్మించడంతోనే 7వ బ్లాక్ కుంగిందా? అని కమిషన్ ప్రశ్నించగా, దీనిపై తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని జోషి, క్రాస్ ఎగ్జామినేషన్‌కు హాజరైన నీటిపారుదల శాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌లు వేర్వేరుగా బదులిచ్చారు.
అప్పట్లో బరాజ్‌లలో లోపాలు కనబడలేదు: రజత్‌కుమార్
పునాదుల కింద ఇసుక కొట్టుకుపోవడంతోనే మేడిగడ్డ బరాజ్‌లోని 7వ బ్లాక్ కుంగిందని రజత్‌కుమార్ చెప్పారు. నీటి ప్రవాహాన్ని నియంత్రించడానికే మేడిగడ్డ వంటి బరాజ్‌లను నిర్మిస్తారని, నిల్వల కోసం నాగార్జునసాగర్ వంటి జలాశయాలు నిర్మిస్తారని చెప్పారు. ఓ స్థాయి వరకే బరాజ్‌లలో నిల్వలను కొనసాగించి, మిగిలిన ప్రవాహాన్ని విడుదల చేయాల్సిన బాధ్యత ప్రాజెక్టు సీఈదేనని అన్నారు.
ప్రభుత్వం రుణాలు తీసుకోక తప్పదు
డిఫెక్ట్ లయబిలిటీ కాలంలోనే బరాజ్‌లు దెబ్బతిన్నా మరమ్మతులు చేయకుండా నిర్మాణ సంస్థలకు డిపాజిట్లను ఎలా చెల్లిస్తారు? అని కమిషన్ ప్రశ్నించగా, 2020 ఫిబ్రవరిలో తాను శాఖ బాధ్యతలు చేపట్టే నాటికి పనులు పూర్తయ్యాయని రజత్‌కుమార్ వివరణ ఇచ్చారు. అప్పట్లో బరాజ్‌లలో ఎలాంటి లోపాలు కనబడలేదన్నారు. కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులను పూర్తిగా ప్రభుత్వ నిధులతో నిర్మించడం సాధ్యం కాదని, రుణాలు తీసుకోక తప్పదని పేర్కొన్నారు. నిపుణుల కమిటీ చైర్మన్ సీబీ కామేశ్వర్ రావు కూడా కమిషన్ ముందు హాజరయ్యారు. బరాజ్‌ల వైఫల్యాలపై తన నివేదికలో పేర్కొన్న అంశాలన్ని వాస్తవాలేనంటూ వాంగ్మూలం ఇచ్చారు. కాగా గురువారం మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్, మాజీ సీఎం కేసీఆర్ కార్యదర్శిగా వ్యవహరించిన స్మితా సబర్వాల్ క్రాస్ ఎగ్జామినేషన్ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment