సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంపై విచారణ ప్రక్రియ కొనసాగుతోంది. మాజీ ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావుకు నోటీసులు ఇచ్చేందుకు కాళేశ్వరం కమిషన్ కసరత్తు చేస్తోంది. హరీశ్‌ను జూలై రెండో వారం లేదా ఆ తరువాత విచారణకు కాళేశ్వరం కమిషన్ పిలవనున్నట్లు సమాచారం.
అఫిడవిట్ విచారణ పూర్తయిన తర్వాత ప్రజా ప్రతినిధులను, ముందు ఇరిగేషన్ మంత్రిని, తరువాత మాజీ ముఖ్యమంత్రిని కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్ పిలువనున్నారు. టెక్నికల్ అంశాలు పూర్తిగా సిద్ధమైన తర్వాతే ప్రజా ప్రతినిధులకు కమిషన్ నోటీసులు ఇవ్వనుంది.
జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ గురువారం నీటిపారుదల శాఖలోని హైడ్రాలజీ విభాగం ఇంజనీర్లతోపాటు కమిషన్‌కు సహకరించేందుకు ఏర్పాటైన నిపుణుల కమిటీ సభ్యులను విచారించింది. నిపుణుల కమిటీ ఇప్పటికే బరాజ్‌లకు చేసిన తనిఖీ నివేదికను కమిషన్‌కు సమర్పించింది.
కాగా, కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్ ల నిర్మాణ పనులను నిర్ణీత గడువు (టైమ్ బౌండ్)లోగా పూర్తి చేయాలని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒత్తిడి చేసిందని జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని విచారణ కమిషన్‌కు బరాజ్‌ల నిర్మాణ సంస్థలు తెలిపాయి. పనులు సత్వరంగా పూర్తి చేయాలంటూ పరుగులు పెట్టించిందని పేర్కొన్నా యి. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసి బరాజ్‌లను అప్పగించామని వివరించాయి. ఈ అంశాలను నెలాఖరు లోగా అఫిడవిట్ రూపంలో సమర్పించాలని నిర్మాణ సంస్థలను జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆదేశించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంపై న్యాయవిచారణలో భాగంగా బుధవారం బీఆర్‌కేఆర్ భవన్‌లోని కార్యాలయంలో నిర్మాణ సంస్థల ఉన్నతాధికారులను ఆయన ప్రశ్నించారు. మేడిగడ్డ బరాజ్ నిర్మాణ సంస్థ ‘ఎల్‌అండ్‌టీ’ తరఫున ఉపాధ్యక్షులు ఎంవీ కృష్ణరాజు, సురేశ్‌కుమార్, సీనియర్ డీజీఎం రంజీష్ చౌహాన్, అన్నారం బరాజ్ నిర్మాణ సంస్థ ‘అఫ్కాన్స్–విజేత జేవీ’ తరఫున హైడ్రో ప్రాజెక్టుల విభాగాధిపతి కె.మల్లికార్జునరావు, జీఎం శేఖర్‌దాస్, సుందిళ్ల బరాజ్ నిర్మాణ సంస్థ ‘నవయుగ’ తరఫున డైరెక్టర్ రామేశ్ యెద్దూరి, ప్రాజెక్టు మేనేజర్ కె.ఈశ్వర్‌రావు, జీఎం సి.మాధవ్ తదితరులు కమిషన్ ఎదుట హాజరై సమాధానాలు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment