సామాన్యుడి భూహక్కుల పరిరక్షణకే భూభారతి | Telangana introduces landmark Bhubharati 2024 ROR Act to resolve land issues in Telangana Assembly: Ponguleti Srinivasa Reddy | Sakshi
Sakshi News home page

సామాన్యుడి భూహక్కుల పరిరక్షణకే భూభారతి

Published Thu, Dec 19 2024 4:11 AM | Last Updated on Thu, Dec 19 2024 4:11 AM

Telangana introduces landmark Bhubharati 2024 ROR Act to resolve land issues in Telangana Assembly: Ponguleti Srinivasa Reddy

అన్ని వర్గాల సూచనలతో కొత్త చట్టం రూపకల్పన

శాసనసభలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి 

లక్షల మందిని ఇబ్బందిపెట్టిన ధరణిని బంగాళాఖాతంలో కలిపాం 

భవిష్యత్తులో భూవివాదాలకు తావు లేకుండా ఏర్పాటు 

ధరణి తప్పులను భూభారతితో సరిదిద్దేలా ఏర్పాట్లు 

2014 తర్వాత అన్యాక్రాంతంఅయిన ప్రభుత్వ భూములు స్వా«దీనం చేసుకుంటాం 

వాటిని తిరిగి పేదలకు పంచే అంశాన్ని పరిశీలిస్తున్నాం 

ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించిన అధికారులు, ఉద్యోగులపై కఠిన చర్యలు 

భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టి, ముఖ్యాంశాలు వివరించిన మంత్రి

భూభారతి చట్టాన్ని పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌లోకి తెచ్చిన తర్వాత 2014కు ముందు సబ్‌ రిజ్రిస్టార్ల వద్ద ఉన్న రికార్డులను అప్‌డేట్‌ చేస్తాం. 2014కు ముందు ప్రభుత్వ భూములుగా రికార్డుల్లో ఉండి తర్వాత అన్యాక్రాంతమైన భూములను తిరిగి స్వాధీనం చేసుకొని పేదలకు పంచే విషయాన్ని పరిశీలిస్తున్నాం. ధరణి లోపాలను పూర్తిగా సవరించి, ప్రతి అంశాన్ని క్షుణ్నంగా చర్చించి కొత్త చట్టాన్ని రూపొందించాం..’’  

సాక్షి, హైదరాబాద్‌: సామాన్యుల భూహక్కుల పరిరక్షణే ధ్యేయంగా ‘ఆర్వోఆర్‌ –భూభారతి’ చట్టాన్ని రూపొందించామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో 49 ఏళ్ల క్రితం నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్‌ఓఆర్‌ చట్టం అద్భుతంగా పనిచేసిందని.. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏడేళ్ల పాటు కొనసాగిందని చెప్పారు. కానీ నాలుగు గోడల మధ్య అసంబద్ధంగా రూపొందించిన ‘ధరణి’తో కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టుగా పరిస్థితి తయారైందని విమర్శించారు.

లక్షల మందిని నానా తిప్పలు పెట్టిన ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామన్న హామీని అమల్లోకి తెచ్చి... దాని స్థానంలో ప్రజల భూమి హక్కులను సంరక్షించే సరికొత్త భూభారతి చట్టాన్ని తెస్తున్నామని ప్రకటించారు. బుధవారం శాసనసభలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూభారతి బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రసంగించారు. వివరాలు పొంగులేటి మాటల్లోనే... 

‘‘కొత్త చట్టంపై ఆగస్టు 2న ముసాయిదా ప్రవేశపెట్టాం. 40 రోజుల పాటు వెబ్‌సైట్‌లో ఉంచి, చర్చావేదికలు నిర్వహించి ప్రజాప్రతినిధులు, కవులు, మేధావులు, విశ్రాంత అధికారులు, సాధారణ ప్రజల సలహాలు, సూచనలు స్వీకరించి కొత్త చట్టాన్ని రూపొందించాం. మాజీ మంత్రి హరీశ్‌రావు వంటి వారు ఇచ్చిన సూచనలను కూడా పరిగణనలోకి తీసుకున్నాం. 18 రాష్ట్రాల్లోని ఆర్వోఆర్‌ చట్టాలను అధ్యయనం చేసి, ఉత్తమ విధానాలను కొత్త చట్టంలో పొందుపరిచాం. 

ధరణి తప్పులను భూభారతితో సరిదిద్దుతాం 
గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్‌ వల్ల లక్షలాది మంది మానసిక క్షోభకు గురయ్యారు. రవి అనే బీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీటీసీ సభ్యుడు నా వద్దకు వచ్చి.. 1,398 ఎకరాల భూములపై గిరిజనులు హక్కులు కోల్పోవాల్సి వచ్చిందని, ధరణిలో వాటిని అటవీ భూములుగా చూపారని వాపోయారు. వేలాది పుస్తకాలు చదివిన మేధావి తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో లక్షలాది కొత్త సమస్యలు తలెత్తాయి. మానవ సంబంధాలను సైతం ధరణి దెబ్బతీసింది.

భూయజమానికి తెలియకుండానే భూమి చేతులు మారిపోయేలా చేసింది. గత చట్టంలోని తప్పులను అధ్యయనం చేసి భూ–భారతి ద్వారా సరిదిద్దేలా ఏర్పాట్లు చేశాం. ధరణి పోర్టల్‌ పార్టు–బీలో ఉన్న 18 లక్షల ఎకరాలకు పరిష్కారం లభిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ఆబాదీ/గ్రామకంఠం సమస్యలకు తెరపడుతుంది. భవిష్యత్తులో భూవివాదాలకు తావు లేకుండా ప్రత్యేక సర్వే ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుంది. రిజ్రిస్టేషన్‌ దస్తావేజుల ద్వారా మ్యుటేషన్‌ జరిగేప్పుడు ఏవైనా తప్పులు జరిగితే అప్పీల్‌ చేసుకునే వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నాం. రిజ్రిస్టేషన్, ఆ వెంటనే మ్యుటేషన్‌ జరిగే వెసులుబాటు కలి్పంచటం ధరణిలో మెరుగైన అంశం. ఆ సమయంలో పొరపాట్లు జరిగితే కూడా సరిదిద్దే కొత్త ఏర్పాటుతో దాన్ని కొత్త చట్టంలో పొందుపరిచాం. 

ఆధార్‌ తరహాలో భూదార్‌.. 
ఆధార్‌ నంబర్‌ తరహాలో ‘భూదార్‌’ నంబర్‌ తీసుకొస్తాం. ప్రతి రైతుకు ఒక కోడ్‌ ఇస్తాం. గతంలో రెవెన్యూ గ్రామాల్లో ఒక ఏడాదిలో జరిగిన భూలావాదేవీలను పొందుపరిచేందుకు నిర్వహించే జమాబందీని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తొలగించింది. దానిని తిరిగి తీసుకొస్తున్నాం. రైతుల భూములకు సంబంధించిన ఫిర్యాదులపై అప్పీల్‌ చేసుకునేందుకు ప్రస్తుతం ఎలాంటి వ్యవస్థ లేదు. దీనికోసం గతంలో కొనసాగిన ల్యాండ్‌ ట్రిబ్యునల్స్‌ను పునరుద్ధరించనున్నాం. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తుల ఆక్రమణల నుంచి రక్షించేందుకు సీసీఎల్‌ఏ ద్వారా చర్యలు తీసుకోనున్నాం. గతంలో పట్టదారు పాస్‌బుక్‌లలో ఉన్న అనుభవదారులు, కాస్తుదారుల కాలం (నిలువు వరుస)ను పునరుద్ధరించాలని నిర్ణయించాం. 

అక్రమాలకు పాల్పడే అధికారులపై కఠిన చర్యలు 
ఆన్‌లైన్‌లో ధరణి తీసుకొచ్చిన తర్వాత భూములకు సంబంధించిన పాత రికార్డులు లేకుండా చేశారు. ఇకపై ఆన్‌లైన్‌తోపాటు మాన్యువల్‌ పహాణీలను నమోదుచేయాలని కొత్త చట్టంలో పొందుపరిచాం. ప్రభుత్వ భూములను ఉద్దేశపూర్వకంగానో, ప్రలోభాలకు లోనైగానీ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించిన అధికారులు, ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోనున్నాం. 

సులువుగా తెలుసుకునేలా భూముల వివరాలు 
గత ప్రభుత్వం ధరణిని 3 మాడ్యూల్స్‌తో ప్రారంభించి 33 మాడ్యూల్స్‌కు తీసుకొచ్చింది. తద్వారా పేద, చిన్నకారు రైతుల భూములు కనిపించని పరిస్థితి ఏర్పడింది. మేం భూభారతి ద్వారా 33 మాడ్యుల్స్‌ బదులు 6 మాడ్యుల్స్‌ తెస్తున్నాం. అలాగే గతంలో 32 కాలమ్స్‌ (నిలువు వరుసలు)లో ఉన్న పహాణీలను ఒకే కాలమ్‌లోకి తెచ్చారు. దీనిని భూభారతిలో 11 కాలమ్స్‌కు పెంచాం. ధరణి పోర్టల్‌లో సొంత భూమిని కూడా చూసుకునే వీలు లేకుండా దాచేవారు. భూభారతి ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సర్వే నంబర్ల ఆధారంగా భూమి వివరాలు తెలుసుకోవచ్చు..’’ అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement