land issues
-
సామాన్యుడి భూహక్కుల పరిరక్షణకే భూభారతి
భూభారతి చట్టాన్ని పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌లోకి తెచ్చిన తర్వాత 2014కు ముందు సబ్ రిజ్రిస్టార్ల వద్ద ఉన్న రికార్డులను అప్డేట్ చేస్తాం. 2014కు ముందు ప్రభుత్వ భూములుగా రికార్డుల్లో ఉండి తర్వాత అన్యాక్రాంతమైన భూములను తిరిగి స్వాధీనం చేసుకొని పేదలకు పంచే విషయాన్ని పరిశీలిస్తున్నాం. ధరణి లోపాలను పూర్తిగా సవరించి, ప్రతి అంశాన్ని క్షుణ్నంగా చర్చించి కొత్త చట్టాన్ని రూపొందించాం..’’ సాక్షి, హైదరాబాద్: సామాన్యుల భూహక్కుల పరిరక్షణే ధ్యేయంగా ‘ఆర్వోఆర్ –భూభారతి’ చట్టాన్ని రూపొందించామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో 49 ఏళ్ల క్రితం నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్ఓఆర్ చట్టం అద్భుతంగా పనిచేసిందని.. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏడేళ్ల పాటు కొనసాగిందని చెప్పారు. కానీ నాలుగు గోడల మధ్య అసంబద్ధంగా రూపొందించిన ‘ధరణి’తో కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టుగా పరిస్థితి తయారైందని విమర్శించారు.లక్షల మందిని నానా తిప్పలు పెట్టిన ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామన్న హామీని అమల్లోకి తెచ్చి... దాని స్థానంలో ప్రజల భూమి హక్కులను సంరక్షించే సరికొత్త భూభారతి చట్టాన్ని తెస్తున్నామని ప్రకటించారు. బుధవారం శాసనసభలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూభారతి బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రసంగించారు. వివరాలు పొంగులేటి మాటల్లోనే... ‘‘కొత్త చట్టంపై ఆగస్టు 2న ముసాయిదా ప్రవేశపెట్టాం. 40 రోజుల పాటు వెబ్సైట్లో ఉంచి, చర్చావేదికలు నిర్వహించి ప్రజాప్రతినిధులు, కవులు, మేధావులు, విశ్రాంత అధికారులు, సాధారణ ప్రజల సలహాలు, సూచనలు స్వీకరించి కొత్త చట్టాన్ని రూపొందించాం. మాజీ మంత్రి హరీశ్‌రావు వంటి వారు ఇచ్చిన సూచనలను కూడా పరిగణనలోకి తీసుకున్నాం. 18 రాష్ట్రాల్లోని ఆర్వోఆర్ చట్టాలను అధ్యయనం చేసి, ఉత్తమ విధానాలను కొత్త చట్టంలో పొందుపరిచాం. ధరణి తప్పులను భూభారతితో సరిదిద్దుతాం గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ వల్ల లక్షలాది మంది మానసిక క్షోభకు గురయ్యారు. రవి అనే బీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ సభ్యుడు నా వద్దకు వచ్చి.. 1,398 ఎకరాల భూములపై గిరిజనులు హక్కులు కోల్పోవాల్సి వచ్చిందని, ధరణిలో వాటిని అటవీ భూములుగా చూపారని వాపోయారు. వేలాది పుస్తకాలు చదివిన మేధావి తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో లక్షలాది కొత్త సమస్యలు తలెత్తాయి. మానవ సంబంధాలను సైతం ధరణి దెబ్బతీసింది.భూయజమానికి తెలియకుండానే భూమి చేతులు మారిపోయేలా చేసింది. గత చట్టంలోని తప్పులను అధ్యయనం చేసి భూ–భారతి ద్వారా సరిదిద్దేలా ఏర్పాట్లు చేశాం. ధరణి పోర్టల్ పార్టు–బీలో ఉన్న 18 లక్షల ఎకరాలకు పరిష్కారం లభిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ఆబాదీ/గ్రామకంఠం సమస్యలకు తెరపడుతుంది. భవిష్యత్తులో భూవివాదాలకు తావు లేకుండా ప్రత్యేక సర్వే ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుంది. రిజ్రిస్టేషన్ దస్తావేజుల ద్వారా మ్యుటేషన్ జరిగేప్పుడు ఏవైనా తప్పులు జరిగితే అప్పీల్ చేసుకునే వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నాం. రిజ్రిస్టేషన్, ఆ వెంటనే మ్యుటేషన్ జరిగే వెసులుబాటు కలి్పంచటం ధరణిలో మెరుగైన అంశం. ఆ సమయంలో పొరపాట్లు జరిగితే కూడా సరిదిద్దే కొత్త ఏర్పాటుతో దాన్ని కొత్త చట్టంలో పొందుపరిచాం. ఆధార్ తరహాలో భూదార్.. ఆధార్ నంబర్ తరహాలో ‘భూదార్’ నంబర్ తీసుకొస్తాం. ప్రతి రైతుకు ఒక కోడ్ ఇస్తాం. గతంలో రెవెన్యూ గ్రామాల్లో ఒక ఏడాదిలో జరిగిన భూలావాదేవీలను పొందుపరిచేందుకు నిర్వహించే జమాబందీని బీఆర్ఎస్ ప్రభుత్వం తొలగించింది. దానిని తిరిగి తీసుకొస్తున్నాం. రైతుల భూములకు సంబంధించిన ఫిర్యాదులపై అప్పీల్ చేసుకునేందుకు ప్రస్తుతం ఎలాంటి వ్యవస్థ లేదు. దీనికోసం గతంలో కొనసాగిన ల్యాండ్ ట్రిబ్యునల్స్‌ను పునరుద్ధరించనున్నాం. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తుల ఆక్రమణల నుంచి రక్షించేందుకు సీసీఎల్ఏ ద్వారా చర్యలు తీసుకోనున్నాం. గతంలో పట్టదారు పాస్‌బుక్‌లలో ఉన్న అనుభవదారులు, కాస్తుదారుల కాలం (నిలువు వరుస)ను పునరుద్ధరించాలని నిర్ణయించాం. అక్రమాలకు పాల్పడే అధికారులపై కఠిన చర్యలు ఆన్లైన్లో ధరణి తీసుకొచ్చిన తర్వాత భూములకు సంబంధించిన పాత రికార్డులు లేకుండా చేశారు. ఇకపై ఆన్‌లైన్‌తోపాటు మాన్యువల్ పహాణీలను నమోదుచేయాలని కొత్త చట్టంలో పొందుపరిచాం. ప్రభుత్వ భూములను ఉద్దేశపూర్వకంగానో, ప్రలోభాలకు లోనైగానీ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించిన అధికారులు, ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోనున్నాం. సులువుగా తెలుసుకునేలా భూముల వివరాలు గత ప్రభుత్వం ధరణిని 3 మాడ్యూల్స్‌తో ప్రారంభించి 33 మాడ్యూల్స్‌కు తీసుకొచ్చింది. తద్వారా పేద, చిన్నకారు రైతుల భూములు కనిపించని పరిస్థితి ఏర్పడింది. మేం భూభారతి ద్వారా 33 మాడ్యుల్స్ బదులు 6 మాడ్యుల్స్ తెస్తున్నాం. అలాగే గతంలో 32 కాలమ్స్ (నిలువు వరుసలు)లో ఉన్న పహాణీలను ఒకే కాలమ్‌లోకి తెచ్చారు. దీనిని భూభారతిలో 11 కాలమ్స్‌కు పెంచాం. ధరణి పోర్టల్‌లో సొంత భూమిని కూడా చూసుకునే వీలు లేకుండా దాచేవారు. భూభారతి ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సర్వే నంబర్ల ఆధారంగా భూమి వివరాలు తెలుసుకోవచ్చు..’’ అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
చేతిలో సంచి.. అందులో కత్తి.. పుట్టపర్తి కలెక్టరేట్‌కు మహిళ!
పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా): అచ్చం ఫ్యాక్షన్ సినిమా మాదిరిగానే ఉంది తాజా ఘటన. చేతిలో సంచి.. అందులో కత్తి పెట్టుకుని ఒక మహిళ ప్రభుత్వ కార్యాలయానికి రావడం ఫ్యాక్షన్ సినిమాను తలపిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. పుట్టపర్తి కలెక్టరేట్‌కు ఓ మహిళ కత్తితో రావడం తీవ్ర కలకలం రేపింది. చేతిలో సంచి పట్టుకుని అందులో కొన్ని డాక్యుమెంట్స్‌తో పాటు కత్తిని తీసుకుని కలెక్టరేట్‌కు రావడం చర్చనీయాంశమైంది. గత కొంతకాలంగా తనకున్న భూ సమస్యతో ఆమె కలెక్టరేట్‌కు వచ్చారు. అయితే తన భూ సమస్యకు సంబంధించి డాక్యుమెంట్స్ ను సంచిలో తీసుకొచ్చింది ప్రేమలత అనే మహిళ.అయితే సంచిలో కత్తి కూడా ఉండటంతో పోలీసులు అవాక్కయ్యారు. కలెక్టరేట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కర్నీ తనిఖీలు చేసే క్రమంలో ఆమెను కూడా తనిఖీ చేయగా కత్తి బయటపడింది. దాంతో అక్కడున్న పోలీస్ సెక్యూరిటీ ఒక్కసారిగా అలెర్ట్ అయ్యింది. అసలు ఆమెను కత్తిని ఎందుకు తీసుకొచ్చావ్ అని ప్రశ్నించగా, ఆత్మరక్షణ కోసం అంటూ సమాధానమిచ్చింది. దాంట్లో ఎంత వరకూ వాస్తవం ఉందని పదే పదే ప్రశ్నించిన పోలీసులు.. ఆమెను విడిచిపెట్టి కత్తిని మాత్రం స్వాధీనం చేసుకున్నారు. -
భూమి లేదు.. ఉన్నా హక్కుల్లేవు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భూముల సమస్యలు పేరుకుపోతున్నాయని, వాటి పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని ధరణి పోర్టల్ పునర్నిర్మాణ కమిటీ స్పష్టం చేసింది. ఇందుకోసం కొత్త చట్టాలను, విధానాలను రూపొందించుకోవడంతోపాటు కొన్నిరకాల సంస్కరణలు, మరికొన్ని కొత్త పద్ధతులను అవలంబించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి 54 అంశాలతో కూడిన నివేదికను అందజేసింది. అందులో పలు ఆసక్తికర అంశాలను కూడా వెల్లడించింది.రాష్ట్రంలోని 56శాతం గ్రామీణ కుటుంబాలకు భూమి లేదని కమిటీ తమ నివేదికలో తెలిపింది. భూములున్న రైతాంగం కూడా హక్కుల కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోందని పేర్కొంది. రాష్ట్రంలోని 50శాతం మంది పట్టాదారులకు భూముల విషయంలో పలు సమస్యలు ఉన్నాయని.. వారికి సమగ్ర హక్కుల కల్పన ఇంకా పూర్తికాలేదని వెల్లడించింది. ఎప్పుడో నిజాం కాలంలో చేసిన భూముల సర్వే తర్వాత తెలంగాణలో సర్వేనే జరగలేదని, వెంటనే భూముల డిజిటల్ సర్వేకు పూనుకోవాలని సిఫార్సు చేసింది. కోర్టు కేసుల్లో భూములు నలిగిపోతున్నాయని, దశాబ్దాల తరబడి కోర్టుల చుట్టూ హక్కుల కోసం తిరగాల్సి వస్తోందని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలోని కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల్లో 66శాతం సివిల్ కేసులే ఉన్నాయని.. ఇందులో భూవివాదాలే ఎక్కువగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఇక రెవెన్యూ కోర్టులను రద్దు చేసే నాటికి వాటిలో 25వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, అవి ఇంతవరకు పరిష్కారానికి నోచుకోలేదని తెలిపింది. అటవీ, రెవెన్యూ శాఖల మధ్య 4 లక్షల ఎకరాల భూముల విషయంలో వివాదాలు ఉన్నాయని.. అటవీ శాఖ చెప్తున్న దానికి, ధరణిలో నమోదు చేసిన భూములకు 23.72 లక్షల ఎకరాల తేడా ఉందని వెల్లడించింది. వక్ఫ్, దేవాదాయ భూముల వివరాల్లో కూడా పొంతన లేదని తెలిపింది. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించి రాష్ట్రంలో టైటిల్ గ్యారంటీ చట్టాన్ని అమల్లోకి తేవాలని సిఫార్సు చేసింది. క్షేత్రస్థాయిలో గ్రీవెన్స్ వ్యవస్థ ఉండాలని.. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో రెవెన్యూ ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయాలని సూచించింది. పహాణీలను డిజిటలైజ్ చేయాలని, గ్రామానికో రెవెన్యూ నిర్వాహకుడిని ఏర్పాటు చేయాలని కోరింది. అయితే, తమ సిఫారసులన్నీ ఏకకాలంలో అమలు చేయడం సాధ్యం కాదని.. అందుకే మూడు విభాగాల్లో ప్రతిపాదిస్తున్నామని తెలిపింది. అందులో కొన్ని తక్షణమే చేపట్టాల్సి ఉండగా, మరికొన్ని స్వల్పకాలిక, ఇంకొన్ని దీర్ఘకాలిక వ్యూహాలు, ప్రణాళికలతో పరిష్కరించుకోవాల్సి ఉంటుందని నివేదికలో ధరణి కమిటీ స్పష్టం చేసింది. ధరణి పోర్టల్ పునర్నిర్మాణ కమిటీ ఇచ్చిన నివేదికలోని ముఖ్య సిఫారసులివీ.. గ్రామస్థాయిలోనే ల్యాండ్ గ్రీవెన్స్ వ్యవస్థ ఉండాలి. కమ్యూనిటీ పారాలీగల్ కార్యక్రమాన్ని పునరుద్ధరించాలి. రాష్ట్ర, జిల్లా స్థాయిలలో ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయాలి. కలెక్టరేట్లు, ఐటీడీఏలు, సీసీఎల్ఏలో లీగల్ సెల్స్ ఏర్పాటు చేయాలి. ఆర్వోఆర్ కొత్త చట్టం తీసుకురావాలి. సాదాబైనామాల సమస్యను పరిష్కరించాలి. గ్రామీణ నివాస ప్రాంతాల (ఆబాదీ)ను సర్వే చేయాలి. – రాష్ట్రంలోని అన్ని భూములను రీసర్వే చేసి శాశ్వత భూఆధార్ ఇవ్వాలి. టైటిల్ గ్యారంటీ చట్టాన్ని అమల్లోకి తేవాలి. – అసైన్డ్ భూములన్నింటికీ పట్టాదారు పాసుపుస్తకాలు, టైటిల్ డీడ్స్ మంజూరు చేసి యాజమాన్య హక్కులు కల్పించాలి. సీలింగ్ భూములకు కూడా హక్కులివ్వాలి. – ఇనాం భూములకు ఆక్యుపేషన్ రైట్స్ సర్టిఫికెట్ (ఓఆర్సీ) ఇవ్వాలి. ఆ ఓఆర్ఎసీ వివరాలను ధరణి పోర్టల్‌లో నమోదు చేయాలి. – అటవీ, రెవెన్యూ శాఖల మధ్య ఉన్న భూముల సమస్యల పరిష్కారానికి జాయింట్ సర్వే చేపట్టాలి. అటవీ భూముల వివరాలను ధరణి పోర్టల్‌లో మరోమారు నమోదు చేయాలి. – భూదాన బోర్డును ఏర్పాటు చేయాలి. భూదాన భూముల వివరాలను ధరణి పోర్టల్‌లో నమోదు చేయాలి. దేవాదాయ, వక్ఫ్ భూములను కూడా ధరణిలో పొందుపర్చాలి. – నిషేధిత భూముల జాబితా (22ఏ)ను సవరించాలి. అప్డేట్ చేయాలి. భూసేకరణ జరిగిన భూములను పట్టాదారు ఖాతాల నుంచి తొలగించాలి. – రాష్ట్రంలోని అన్ని భూచట్టాల స్థానంలో రెవెన్యూ కోడ్ (ఒకే చట్టం) అమల్లోకి తేవాలి. నల్సార్ న్యాయ వర్సిటీలోని ల్యాండ్ రైట్స్ సెంటర్‌ను అభివృద్ధి చేయాలి. – భూసంస్కరణల విషయంలో ప్రభుత్వానికి సహాయకారిగా ఉండేందుకు ‘ఇన్నోవేషన్స్ అండ్ లీగల్ సపోర్ట్ సెల్’ను ఏర్పాటు చేయాలి. – తహసీల్దార్ స్థాయిలో ల్యాండ్ సపోర్ట్ సెల్స్ ఏర్పాటు చేయాలి. గ్రామానికో భూమి నిర్వహణ అధికారిని నియమించాలి. – రెవెన్యూ సిబ్బంది సామర్థ్యాలు, పనితీరును మెరుగుపర్చేలా ఎప్పటికప్పుడు శిక్షణ ఇవ్వడం కోసం ల్యాండ్ అకాడమీని ఏర్పాటు చేయాలి. కొత్త ల్యాండ్ పాలసీ రూపొందించాలి. – కోనేరు రంగారావు, గిర్గ్లానీ కమిటీలతోపాటు ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, కేంద్ర ప్రభుత్వ’ సలహాలను పరిగణనలోకి తీసుకోవాలి. ల్యాండ్ గవర్నెన్స్ అసెస్మెంట్ రిపోర్టు తయారు చేయాలి. – ధరణి పోర్టల్‌ను ప్రభుత్వ ఏజెన్సీకి అప్పగించాలి. గతంలో జరిగిన ధరణి లావాదేవీలపై థర్డ్ పార్టీ ఆడిట్ చేయించాలి. – ధరణి పోర్టల్‌లో ఉన్న అన్ని మాడ్యూళ్ల స్థానంలో ఒక్కటే మాడ్యూల్ ఉంచాలి. పార్ట్–బీ భూముల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి. సేత్వార్, ఖాస్రా, సెస్లా, పాత పహాణీలను డిజిటలైజ్ చేయాలి. -
‘పార్ట్–బీ’పై ప్రత్యేక సదస్సులు!
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములను చిన్నచిన్న కారణాలు, కోర్టు కేసులు, ఆధార్‌కార్డు రికార్డుల ఆధారంగా పార్ట్–బీలో పెట్టారు. భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో పార్ట్–బీలో చేరిన ఈ భూములకు ఇప్పటివరకు మోక్షం కలగలేదు. తమ పట్టా భూములను అకారణంగా పార్ట్–బీలో చేర్చారని, ఆ కేటగిరీ నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ సదరు భూముల యజమానులు కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకుండా పోయింది. అసలు ధరణి పోర్టల్‌లోని ఏ మాడ్యూల్లో దరఖాస్తు చేసుకోవాలో చాలామందికి తెలియదు, తెలిసి కొందరు దరఖాస్తు చేసుకున్నా, సమస్య పరిష్కారం కాక, కొన్ని సందర్భాల్లో దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో పార్ట్–బీ భూములు రెవెన్యూ వర్గాలకు పెద్ద తలనొప్పిగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షలకు పైగా ఎకరాలు పార్ట్–బీలో ఉన్నాయని, వెంటనే సమస్యలను పరిష్కరించాలని ధరణి పోర్టల్ పునర్నిర్మాణ కమిటీ ఇచ్చిన నివేదికలో సిఫారసు చేసింది. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రివర్గ సభ్యులందరికీ ఇచ్చిన ఈ నివేదికలో ప్రత్యేక కార్యాచరణను ప్రతిపాదించింది. ధరణి కమిటీ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పార్ట్–బీ భూముల గురించి గణాంకాలతో సహా వివరించింది. ఏ కారణంతో ఎన్ని ఎకరాల భూమిని పార్ట్–బీలో చేర్చారో లెక్కలు వెల్లడించిన ధరణి కమిటీ ఎలాంటి కారణాలు లేకుండానే 5,07,091 ఎకరాల భూములను పార్ట్–బీలో పెట్టారని, ఈ భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేసింది. కమిటీ చేసిన సిఫారసులివే » పార్ట్–బీ భూముల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధరణి పోర్టల్‌లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు తహసీల్దార్ లేదా డిప్యూటీ తహసీల్దార్ లేదా రెవెన్యూ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో ప్రతి మండలానికి 2–3 బృందాలు ఏర్పాటు చేయాలి. ళీ ఈ బృందాల్లో రెవెన్యూ సిబ్బందితో పాటు డీఆర్డీఏల్లో పనిచేస్తున్న కమ్యూనిటీ సర్వేయర్లు, పారా లీగల్ కార్యకర్తలు, వ్యవసాయ విస్తరణాధికారులు, పంచాయతీ కార్యదర్శులను నియమించి శిక్షణ ఇవ్వాలి. » అవసరమైనప్పుడు అటవీ, దేవాదాయ, వక్ఫ్ శాఖల అధికారులను కూడా చేర్చాలి. ఈ బృందాలు క్షేత్రస్థాయికి వెళ్లి అన్ని వివరాలను పరిశీలించి నివేదికలు తయారు చేయాలి. ళీ ఈ నివేదికల ప్రకారం సర్వే నంబర్ లేదా ఖాతానంబర్ వారీగా రైతులకు నోటీసులివ్వాలి. సేత్వార్, ఖాస్రా పహాణీ, సెస్లా పహాణీ, పాత పహాణీలు, 1బీ రిజిస్టర్, ధరణి పోర్టల్‌లోని వివరాలను పరిశీలించాలి. ఆ భూములు అసైన్డ్, ఇనాం, భూ బదలాయింపు నిషేధ పట్టిక, భూదాన్, వక్ఫ్, దేవాదాయ, అటవీ భూముల జాబితాలో ఉన్నాయో లేవో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. ళీ గ్రామాల వారీగా పార్ట్–బీ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక రెవెన్యూ సదస్సులు నిర్వహించి, అక్కడే తుది నిర్ణయం తీసుకోవాలి. -
ప్రజావాణిలో పెట్రోల్ సీసాల కలకలం
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్)/ మంచిర్యాల అగ్రికల్చర్/ పెద్దకొడప్గల్ (జుక్కల్): భూ సమస్యలపై ప్రజావాణిలో ఫిర్యాదుల పరంపర కొనసాగుతూనే ఉంది. తమ సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ సోమవారం మహబూబ్‌నగర్, మంచిర్యాల, కలెక్టరేట్లకు కొందరు పెట్రోల్ సీసాలతో రావడం సంచలనం రేపింది. పెద్దకొడప్గల్ తహసీల్ కార్యాలయంలో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తనకున్న ఎకరం భూమి తనకు కాకుండా చేస్తున్నారంటూ మనస్తాపంతో ఓ రైతు మహబూబ్‌నగర్ కలెక్టరేట్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. హన్వాడ మండలం హనుమాన్ టెంపుల్ తండాకు చెందిన కేతావత్ రాములు సీసాలో వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై చల్లుకునే ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన ఏఎస్, పోలీసులు ఆయన చేతిలో ఉన్న సీసాను లాక్కున్నారు. రైతు మాట్లాడుతూ తన తండ్రి రేఖ్యానాయక్ పేరుతో సర్వే నం.108లో లావణి పట్టా ఎకరం వ్యవసాయ భూమి ఉందని, అయితే ఇటీవల తన చిన్నాన్న కుమారులు రమేశ్, లచ్యానాయక్, రవి, గోపాల్ తనతో గొడవ పెట్టుకుంటూ పొలంలోకి రానివ్వకుండా అడ్డుకుంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి సైతం తనపై దాడి చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. కలెక్టర్ స్పందించి తన భూమి ఇప్పించాలని కోరారు. అనంతరం కలెక్టర్ విజయేందిరకు ఫిర్యాదు చేయగా సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. మరోఘటనలో... కన్నెపల్లి మండలం జన్కాపూర్ గ్రామానికి చెందిన శీలం బానక్క, శీలం పోశయ్య, శీలం సత్తయ్య ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చేందుకు సోమవారం మంచిర్యాల కలెక్టరేట్‌కు వచ్చారు. టేకులపల్లి గ్రామ శివారులో తమకు ఉన్న భూమిని అక్రమంగా పట్టా చేసుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్‌కు అర్జీ సమర్పించారు. అనంతరం సమావేశ మందిరంలో కాసేపు కూర్చున్న వాళ్లు.. తర్వాత పెట్రోల్ బాటిల్ తీసేందుకు యత్నించారు.గమనించిన కలెక్టర్ గన్‌మెన్ పెట్రోల్ బాటిల్ లాక్కున్నాడు. ఈ సందర్భంగా బానక్క, పోశయ్య, సత్తయ్య మాట్లాడుతూ బానక్క పేరుమీద ఉన్న 12 ఎకరాల భూమి నలుగురు అన్నదమ్ములకు చెందాల్సి ఉండగా భూమిని శీలం కిష్టయ్య కొడుకు శీలం శ్రీనివాస్ పింఛన్ ఇప్పిస్తానని నమ్మబలికి కన్నెపల్లి తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లి అక్రమంగా భూమి పట్టా చేయించుకున్నాడని వివరించారు. ఈ విషయమై కలెక్టర్‌కు, ఆర్డీవోకు పలుమార్లు ఫిర్యాదు చేశామని, పట్టా రద్దు చేయాలని కోరినట్లు తెలిపారు. మా చావుతోనైనా అక్రమ పట్టాదారుపై చర్యలు తీసుకుంటారని పెట్రోల్ బాటిల్‌తో వచ్చామని పేర్కొన్నారు. వారిని నస్పూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ చేసినట్లు ఎస్సై తెలిపారు. లంచం ఇచ్చినా పనికాలేదంటూ... కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ తహసీల్ కార్యాలయంలో ప్రజావాణికి వచ్చిన రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పెద్దకొడప్గల్ మండలం వడ్లం గ్రామానికి చెందిన గైని అంజయ్య, అన్నదమ్ముల పేరిట గ్రామ శివారులో మూడెకరాల 14 గుంటల భూమి ఉంది. ఈ భూమిని తమ పేరిట రిజి్రస్టేషన్ చేయాలని కోరుతూ ఆర్ఐ పండరి వద్దకు ఆరు నెలల క్రితం వెళ్లారు. ఈ భూమి పార్ట్ ‘బి’లో ఉందని, రూ. 20 వేలు ఇస్తే పార్ట్ ‘బి’నుంచి తొలగించి పట్టా చేసి పాస్ బుక్ ఇస్తానని పండరి చెప్పినట్లు బాధితులు తెలిపారు. ఆర్ఐకి ఫిబ్రవరిలో రూ. 19 వేల నగదు, రూ. 1000 ఫోన్ పే ఇతరుల ఫోన్‌కు చెల్లించామన్నారు. అయితే ఆరు నెలల నుంచి తిరుగుతున్నా పనికాకపోవడంతో విసుగు చెందిన అంజయ్య తహసీల్దార్ చాంబర్లో ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుండగా తహసీల్దార్, ఎంపీడీవో, ఇతర మండల అధికారుల సమక్షంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అక్కడున్నవారు రైతును చికిత్స కోసం బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై తహసీల్దార్ దశరథ్ను సంప్రదించగా అంజయ్య ప్రజావాణిలో ఫిర్యాదు చేశారని, ఆర్ఐ పండరి డబ్బులు తీసుకున్న విషయం తన దృష్టికి రాలేదని అన్నారు. -
15 నుంచి రెవెన్యూ సదస్సులు
సాక్షి, అమరావతి: భూములకు సంబంధించిన అంశాలను పరిష్కరించేందుకు ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహించనుంది. 15న అన్ని జిల్లాలో ప్రారంభించి 16–30 వరకు సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఆదివారం మెమో ఇచ్చారు. గ్రామ స్థాయిలో భూముల సమస్యలు పరిష్కారానికి ప్రతి రెవెన్యూ గ్రామంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించాలని అందులో అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు. భూకబ్జాలు, 22ఏ జాబితా దురి్వనియోగంతో పాటు అన్ని భూ సంబంధిత విషయాలపై అర్జీలు తీసుకోవాలని ఆదేశించారు.ప్రతి జిల్లాకు సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించి జిల్లాల వారీగా సదస్సుల షెడ్యూల్ రూపొందిస్తామన్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో వినతులు స్వీకరించడం, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను ప్రత్యేక అధికారి సమీక్షిస్తారని, వచి్చన అన్ని పిటిషన్లను.. వినతుల పరిష్కారానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆన్లైన్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు.జేసీలు సదస్సులకు కో–ఆర్డినేటర్లుగా ఉంటారని, సబ్ కలెక్టర్లు/ఆర్డీవోలు, తహశీల్దార్లు తమ పరిధిలోని ప్రతి గ్రామంలో సదస్సు నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించాలన్నారు. ప్రతి సదస్సుకి తహశీల్దార్, ఆర్ఐ, వీఆర్వో, మండల సర్వేయర్ ఇతర అన్ని శాఖలకు చెందిన వారు వెళ్లాలని, జిల్లా కలెక్టర్ జిల్లా నుంచి మండల నోడల్ అధికారులను నియమించాలని సూచించారు. సెపె్టంబర్ నెలాఖరుకి సదస్సులన్నీ పూర్తి కావాలని, ఆ తర్వాత వాటికి సంబంధించిన పరిష్కారాల ఆదేశాలను 45 రోజుల్లో ఇవ్వాలని సూచించారు. -
భూ కబ్జాకు రైతు బలి
ఖమ్మం రూరల్: భూమి కబ్జా చేశారనే ఆవేదన కు తోడు పోలీసులు సైతం కబ్జాదారులకే కొ మ్ము కాస్తున్నారనే ఆక్రందనతో ఓ రైతు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాలిలా.. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం జాన్బాద్ తండాకు చెందిన ఏలేటి వెంకటరెడ్డి(50)కి అర ఎకరం, ఆయన సోదరుడు భూపాల్‌రెడ్డికి రెండున్నర ఎకరాల పొలం ఉంది. ఇందులో 25 గుంటలకు సంబంధించి వివాదం నెలకొనగా.. అదే గ్రామానికి చెందిన జాటోతు వీరన్న ఆక్రమించాడని వెంకటరెడ్డి కుటుంబం ఆరోపిస్తోంది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతూ వెంకటరెడ్డి ఈనెల 4న పురుగు మందు తాగాడు. దీంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవా రుజామున మృతి చెందాడు. సెల్ఫీ వీడియోలో ఏముందంటే... వెంకటరెడ్డి ఆత్మహత్యకు ముందు తన ఆవేదనను సెల్ఫీ వీడియోలో రికార్డు చేశాడు. ‘మా భూమి ఆక్రమించుకుని జాటోతు వీరన్న సాగు చేస్తుండగా పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. పోలీసులు ఆయన వద్ద లంచం తీసుకుని మమ్మల్నే ఇబ్బందిపెడుతున్నారు. మాజీ ఎంపీటీసీ కళింగరెడ్డి ప్రోద్బలంతో జాటోతు వీరన్నతోపాటు సురేష్, దేవిక, చిన్ని, ఉపేందర్ మమ్మల్ని వేధిస్తున్నారు. వారం క్రితం ప్రైవేట్ కేసు వేయించినా మాకు న్యాయం జరగ లేదు’అని వీడియోలో వెల్లడించారు. ఇదిలా ఉండగా ఇదే భూవివాదంలో వెంకటరెడ్డి సోదరుడు ఏలేటి భూపాల్‌రెడ్డి కూడా గతంలో ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబీకులు తెలిపారు. కాగా, వెంకటరెడ్డి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు జాటోతు వీరన్న, మాజీ ఎంపీటీసీ కళింగరెడ్డి, సురే‹Ù, దేవిక, చిన్ని, ఉపేందర్‌పై కేసు నమోదు చేశామని ఎస్ఐ రామారావు తెలిపారు. -
ధరణికి ‘యాచారం’ దారి!
మేకల కల్యాణ్ చక్రవర్తి రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మంథన్ గౌరెల్లి గ్రామానికి చెందిన రమావత్ జగ్నాకు మూడెకరాల 26 గుంటల భూమి ఉంది. భూరికార్డుల ప్రక్షాళన తర్వాత వచ్చిన కొత్త పాస్‌బుక్‌లో రెండెకరాల 29 గుంటల విస్తీర్ణమే నమోదైంది. అంటే నికరంగా 37 గుంటలు తగ్గింది. కరెంటోతు జకాలి అనే మహిళకు ఎకరం 23 గుంటల భూమి ఉంటే.. కొత్త పాస్‌బుక్‌లో 20 గుంటలే నమోదైంది. ఇదే గ్రామానికి చెందిన నేనావత్ రాముకు చెందిన రెండెకరాల 3 గుంటల పొలాన్ని వివాదాస్పద భూమి అంటూ పార్ట్–బీలో పెట్టారు. కొత్త పాస్‌బుక్ ఇవ్వలేదు. ఇక గనమోని మల్లయ్యకు ఉన్న రెండెకరాల 14 గుంటల పట్టా భూమికి ఎమ్మార్వో ప్రొసీడింగ్స్ నంబర్ కూడా ఇచ్చారు. కానీ కొత్త పాస్‌బుక్ రాలేదు...‘లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ (లీఫ్స్)’ స్వచ్ఛంద సంస్థ మంథన్ గౌరెల్లి గ్రామంలో నిర్వహించిన భూన్యాయ శిబిరానికి వచ్చిన రైతుల్లో ఓ నలుగురి సమస్యలివి. వారు తమ భూములకు సంబంధించిన ఆధారాలతో సహా వచ్చి మరీ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ నలుగురనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 22 లక్షల మంది రైతులు ధరణి పోర్టల్‌తో తిప్పలు పడుతున్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా.. ఎప్పుడూ లక్షన్నర నుంచి 2 లక్షల వరకు దరఖాస్తులు ధరణి పోర్టల్‌లో పెండింగ్‌లో కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా డ్రైవ్‌లు చేపట్టినా, అధికార వికేంద్రీకరణ జరిగినా ఈ దరఖాస్తులకు సంతృప్తస్థాయిలో పరిష్కారం లభించే అవకాశం కనిపించట్లేదు. ఈ నేపథ్యంలోనే ‘లీఫ్స్’ అనే స్వచ్ఛంద సంస్థ యాచారం మండలంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన భూన్యాయ శిబిరాలు.. ధరణి సమస్యల గుర్తింపు, పరిష్కారానికి మార్గం చూపిస్తున్నాయి. సమస్యలెలా తెలుసుకున్నారంటే..? ఆయా గ్రామాల్లో భూన్యాయ శిబిరం ఏర్పాటుకు ముందే ప్రజలకు చాటింపు వేయించారు. శిబిరానికి వచ్చి భూసంబంధిత సమస్యలపై దరఖాస్తులు ఇవ్వా లని సూచించారు. శిబిరం జరిగిన రోజు న ‘భూమి సమస్యల వివరాలు’ పేరిట ప్రత్యేక ఫార్మాట్లో రూపొందించిన దరఖాస్తుల ద్వారా వివరాలు తీసుకున్నారు. భూయజమాని వ్యక్తిగత వివరాలు, భూమి ఖాతా నంబర్, పాసుపుస్తకం ఉందా లేదా? సర్వే నంబర్, సబ్ డివిజన్ నంబర్, విస్తీర్ణం, భూమి స్వభావం, భూమి సంక్రమించిన విధానం, ఏ విధమైన భూసమస్య ఉందనే వివరాలు అందులో ఉన్నాయి. ప్రతి సమస్యకు ఒక కోడ్ ఇచ్చి ఆ కోడ్ ప్రకారం దరఖాస్తులను పూర్తి చేయించి.. సంబంధిత డాక్యుమెంట్ల జిరాక్స్‌లు తీసుకుని ఫైల్ చేశారు. రెండో దశలో.. ఆ దరఖాస్తులను పరిశీలించి, ఏ సమస్యలు ఎన్ని వచ్చాయి? పరిష్కారానికి అవసరమైన ఇతర డాక్యుమెంట్లు ఏవి అనే స్పష్టతకు వచ్చారు. ఈ వివరాలను రైతులకు చెప్పి అవసరమైన అన్ని డాక్యుమెంట్లు తీసుకున్నారు. ఈ ఏడాది జనవరి 14న యాచారం మండలంలోని మంథన్ గౌరెల్లి గ్రామంలో ప్రారంభమైన భూన్యాయ శిబిరాలు.. ఈ నెల 8న అదే గ్రామంలో ముగిశాయి. మొత్తం 10 గ్రామాల్లో కలిపి 2,200 దరఖాస్తులు వచ్చాయి. ఎక్కువగా ఏ సమస్యలు వచ్చాయంటే! భూన్యాయ శిబిరాల్లో వచ్చిన దరఖాస్తులను బట్టి చూస్తే.. యాచారం మండలంలోని 10 గ్రామాల్లో ఎక్కువగా అసైన్డ్ భూముల సమస్యలు ఉన్నాయి. అసైన్డ్ భూములు మ్యుటేషన్ కావడం లేదని, కొత్త పాస్‌పుస్తకాలు రాలేదని, వచ్చిన పుస్తకాల్లో విస్తీర్ణం తగ్గిందని దరఖాస్తులు వచ్చాయి. తర్వాత అత్యధికంగా నిషేధిత జాబితాలో పట్టా భూములను చేర్చిన సమస్య కనిపించింది. ఇక సర్వే నంబర్లు మిస్సింగ్, సేత్వార్ సరిపోలకపోవడం వంటివాటితోపాటు పార్ట్–బీ కింద (కొత్త పాస్‌పుస్తకాలు రాని పట్టా భూములు) సమస్యల దరఖాస్తులు వచ్చాయి. నిజానికి రాష్ట్రవ్యాప్తంగా పార్ట్–బీలో చేర్చిన 18 లక్షల ఎకరాల భూముల్లో.. సుమారు 5 లక్షల ఎకరాలను ఎందుకు చేర్చారో కూడా తెలియదని రెవెన్యూ నిపుణులు చెప్తున్నారు. ఆధార్ నంబర్ ఇవ్వలేదని 4 లక్షల ఎకరాలను ఈ జాబితాలో చర్చగా.. మొత్తంగా ఆధార్ సంబంధిత అంశాల ప్రాతిపదికన 6 లక్షల ఎకరాల విషయంలో ఇబ్బందులు వచ్చాయి. తర్వాతి దశలో ఏం చేస్తారు? ‘లీఫ్స్’ సంస్థ ఆధ్వర్యంలో రెండు దశల్లో దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన పూర్తయిన నేపథ్యంలో.. మిగతా పని అంతా రెవెన్యూ అధికారులు చేయాల్సి ఉంటుంది. అధికారులు గ్రామాల వారీగా భూరికార్డులను (సేత్వార్, పహాణీ, 1–బీ, ఇతర రికార్డులు) పరిశీలించి ఎక్కడ పొరపాటు జరిగిందనే విషయాన్ని ప్రస్తావిస్తూ రిపోర్టు తయారు చేయాలి. తహసీల్దార్ స్థాయిలో జరిగే ఈ మూడో దశ పూర్తయ్యాక.. చివరిగా నాలుగో దశలో సమస్యకు పరిష్కారం చూపాల్సి ఉంటుందని లీఫ్స్ ప్రతినిధి ఎం.సునీల్‌కుమార్ వెల్లడించారు. ఈ పద్ధతిని రాష్ట్రమంతటా అమలు చేయడం ద్వారా భూసమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. రెవెన్యూ మంత్రికి నివేదిక! ఈ యాచారం పైలట్ ప్రాజెక్టు అధ్యయనం రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని సమాచారం. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా యాచారం మండలంలో జరిగిన భూన్యాయ శిబిరాల వివరాలను తెలుసుకున్నారని తెలిసింది. లీఫ్స్ సంస్థ ఈ అధ్యయనానికి సంబంధించిన నివేదికను త్వరలోనే రెవెన్యూ మంత్రికి అందజేయనున్నట్టు సమాచారం. ప్రభుత్వం ఏం చేయాలి? వాస్తవానికి, రాష్ట్రంలోని వ్యవసాయ భూసమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్‌కు గత నాలుగేళ్లలో వచ్చిన దరఖాస్తుల సంఖ్య 16 లక్షలు. అందులో 8లక్షలకు పైగా దరఖాస్తులను రెవెన్యూ వర్గాలు తిరస్కరించి ఉంటాయని అంచనా. ఇప్పుడు యాచారం మండలంలోని 10 గ్రామాల్లో వచ్చిన దరఖాస్తులను బట్టి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో సగటున 200 భూసమస్యలు ఉన్నాయని.. 11 వేల రెవెన్యూ గ్రామాల్లో కలిపి 22 లక్షల సమస్యలు ఉంటాయని అంచనా వేశారు. ఇప్పుడీ సమస్యలన్నింటినీ ధరణి పోర్టల్ ద్వారా పరిష్కరించడం ఎలా సాధ్యమనే ప్రశ్న తలెత్తుతోంది. పరిష్కరించడమంటే దరఖాస్తులను తిరస్కరించడం కాదని.. కచ్చితమైన రికార్డు, వివరణలతో తగిన పరిష్కారం చూపాలని రెవెన్యూ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ సదస్సులను నిర్వహించినప్పుడు భూసమస్యలపై 21 లక్షల దరఖాస్తులు వచ్చాయని.. అందులో 8లక్షలు పరిష్కారం అయ్యాయని చెప్తున్నారు. రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయిలో గ్రామాలకు వెళ్లినప్పుడే భూసమస్యల పరిష్కారానికి మార్గం ఏర్పడుతుందని.. ఇందుకు యాచారం మండలంలో చేపట్టిన అధ్యయనం దోహదపడుతుందని అంటున్నారు. గత 20 ఏళ్లుగా ప్రభుత్వాలు చేసిందేమిటి? భూసమస్యల పరిష్కారం కోసం గత 20 ఏళ్లుగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. 2006లో ఉమ్మడి రాష్ట్రంలోని వ్యవసాయ భూముల పాస్‌బుక్‌లకు యూనిక్ కోడ్ ఇచ్చారు. ఇందుకోసం ఏడాది వరకు సమయం పట్టింది. 2007–2011 మధ్య మండలానికి మూడు గ్రామాల చొప్పున దత్తత తీసుకుని... పారాలీగల్ కార్యకర్తల ద్వారా ప్రతి గ్రామంలో 15 రోజుల పాటు భూసమస్యల గుర్తింపు, పరిష్కరం ప్రక్రియ చేపట్టారు. 2009–10లో కేవలం ఎస్సీ, ఎస్టీలకు ఉన్న భూముల పరిశీలన జరిగింది. అప్పుడే 5 లక్షల వరకు భూసమస్యలు ఉన్నట్టు గుర్తించారు. 2011–12 మధ్య రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఆ సదస్సుల్లో మొత్తం 21 లక్షల దరఖాస్తులురాగా.. 8 లక్షల సమస్యలను పరిష్కరించారు. ఇక తెలంగాణ ఏర్పాటయ్యాక 2017 డిసెంబర్లో రాష్ట్రవ్యాప్తంగా భూరికార్డుల ప్రక్షాళన జరిగింది. రైతులకు తెలంగాణ ప్రభుత్వం పేరుతో కొత్త పాస్‌పుస్తకాలు ఇచ్చారు. అనంతరం ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం ఆ పోర్టల్ ద్వారానే భూసమస్యలపై ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం జరుగుతోంది. -
రూటు మారినా.. జర్నీ అదే!
సాక్షి, హైదరాబాద్: ధరణి దరఖాస్తుల పరిష్కార రూటు మారింది. గతంలో ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల సమస్యల పరిష్కారానికి ఏ దరఖాస్తు వచ్చినా, ఆ దరఖాస్తు కేవలం కలెక్టర్ లాగిన్‌లో మాత్రమే కనిపించేది. కలెక్టర్ వేలిముద్రతో తన లాగిన్‌ను ఓపెన్ చేసి సదరు దరఖాస్తును కిందిస్థాయికి పంపాల్సి వచ్చేది. కానీ తాజాగా ధరణి పోర్టల్‌లో ఓ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. ధరణి కింద ఏ దరఖాస్తు వచ్చినా అది తహసీల్దార్‌కు కనిపించేలా, తహసీల్దార్ ఆ దరఖాస్తును పరిశీలించి నిర్ణయం కోసం పైఅధికారులకు పంపేలా లాగిన్ లభించింది. ప్రయోజనం లేదంటున్న తహసీల్దార్లు దరఖాస్తు పరిష్కారం చేసే రూటు మారింది కానీ ఆ పరిష్కారం కోసం సదరు దరఖాస్తు చేయాల్సిన ప్రయాణం (జర్నీ) మాత్రం మారలేదని, అలాంటప్పుడు రూటు మార్చడం వల్ల ఒనగూరే ప్రయోజనం కూడా ఏమీ లేదని తహసీల్దార్లు చెబుతున్నారు. ⇒ ప్రస్తుతమున్న విధానంలో ధరణి దరఖాస్తులను తహసీల్దార్ ఓపెన్ చేసినా..ఆన్లైన్, ఆఫ్‌లైన్ రికార్డులను ఆర్డీఓ, జేసీ,కలెక్టర్లకు నాలుగు స్థాయిల్లో పంపాలని, ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి ఆన్లైన్లో, ప్రింట్లు తీసి ఆఫ్‌లైన్‌లో పంపాల్సి వస్తోందని వాపోతున్నారు. ⇒ఇలా కాకుండా ఆన్లైన్లో దరఖాస్తు పరిశీలించిన తర్వాత ఆన్లైన్లోనే రిమార్క్స్ పంపితే సరిపోతుందని, ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లతో కూడిన ఆఫ్‌లైన్ రికార్డును నిక్షిప్తం చేసి సదరు దరఖాస్తులకు పరిష్కారం చూపెడితే బాగుంటుందని వారంటున్నారు. ⇒నాలుగుసార్లు ఆన్లైన్లో, నాలుగుసార్లు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చక్కర్లు కొట్టిన తర్వాత పరిష్కారానికి ప్రత్యేక ఫైల్‌పెట్టి మళ్లీ ఆన్లైన్లో పరిష్కరించాల్సి వస్తుందని, ఈ పద్ధతిలో మార్పు తీసుకురావడంపై ఉన్నతస్థాయిలో సమీక్ష జరగాల్సి ఉందని వారంటున్నారు. ⇒ ఆ మార్పు జరిగినప్పుడే ధరణి దరఖాస్తులను వేగంగా పరిష్కరించే వెసులుబాటు ఉంటుందని చెబుతున్నారు. మూడు వారికి... రెండు వీరికి.. ధరణి దరఖాస్తుల పరిష్కారంలో భాగంగా క్షేత్రస్థాయిలో ఉండే తహసీల్దార్లు, ఆర్డీఓలకు ప్రస్తుతం చాలా తక్కువ అధికారాలున్నాయి. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ), గ్రీవెన్స్ ల్యాండ్మ్యాటర్స్ (కులం, ఆధార్‌కార్డుల్లో తప్పులు నమోదు, పేర్లలో అక్షర దోషాలు సవరించడం) లాంటి అధికారాలు తహసీల్దార్లకు ఉండగా, కోర్టు కేసుల సమాచారం, పాస్‌బుక్ లేకుండా నాలా, సంస్థాగత పాస్బుక్కులిచ్చే అధికారాలు మాత్రం ఆర్డీఓలకు ఉన్నాయి.ఈ అధికారాలు మినహా అన్ని అంశాల్లో నిర్ణయాలు తీసుకునే బాధ్యతలు ఇప్పటికీ కలెక్టర్లకు ఉన్నాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా వికేంద్రీకరణ వీలున్నంత త్వరగా జరగాలని, క్షేత్రస్థాయిలో పరిష్కారం కాగలిగిన దరఖాస్తులను అక్కడే పరిష్కరించే అధికారాలు సదరు సిబ్బందికి కలి్పంచినప్పుడే ధరణి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతుందని రెవెన్యూ వర్గాలంటున్నాయి. నేడు వీడియో కాన్ఫరెన్స్‌లు ధరణి దరఖాస్తుల పురోగతిపై రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్‌మిత్తల్ శనివారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. హైదరాబాద్ నుంచి నిర్వహించనున్న ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు సిరిసిల్ల, భూపాలపల్లి, జగిత్యాల, మహబూబ్‌నగర్, మంచిర్యాల, వికారాబాద్, వనపర్తి, వరంగల్, ములుగు, నిర్మల్ జిల్లాలు, 12 నుంచి ఒంటి గంట వరకు మిగిలిన జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ఉంటుందని సీఎంఆర్ఓ పీడీ వి. లచి్చరెడ్డి విడుదల చేసిన షెడ్యూల్లో పేర్కొన్నారు. -
కొత్త చట్టమే..! భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి సర్కారు చర్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రస్తుతమున్న ఆర్వోఆర్ చట్టం ఉపయోగ పడదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్–2020) చట్టాన్ని పూర్తిగా మార్చాలనే నిర్ణయానికి వచ్చింది. పాత చట్టం స్థానంలో కొత్త చట్టం తీసుకురానుంది. అనేక అంశాల్లో స్పష్టతనిస్తూ కొత్త చట్టాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో కొత్త రెవెన్యూ చట్టానికి రూపకల్పన చేస్తున్నట్టు సమాచారం. ముసాయిదా చట్టం సిద్ధమవుతోందని, వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో దీనికి ఆమోదం తెలిపే బిల్లును తీసుకువస్తారనే చర్చ రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది. కొత్త చట్టమే ఉత్తమం! గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్‌ను అమల్లోకి తెస్తున్న సందర్భంగా, ఇంతకుముందున్న చట్టం స్థానంలో ఆర్వోఆర్–2020 చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధరణి పోర్టల్ పునర్నిర్మాణం కోసం నియమించిన ప్రత్యేక కమిటీ ఈ చట్టాన్ని అధ్యయనం చేసింది. ఈ చట్టం ద్వారా భూసమస్యలకు శాశ్వత పరిష్కారం సాధ్యం కాదని, చాలా అంశాలపై ఇది స్పష్టత ఇవ్వడం లేదని, దీని ద్వారా భూ సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోగా, కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయని కమిటీలోని నిపుణులు అభిప్రాయపడ్డారు. పాత చట్టంలో చేయాల్సిన సవరణల గురించి పలు సిఫారసులు చేశారు. లేనిపక్షంలో పూర్తిగా కొత్త చట్టాన్నైనా తీసుకురావాలంటూ ప్రభుత్వానికి నివేదించారు. ఈ నేపథ్యంలోనే లోపభూయిష్టమైన పాత చట్టానికి మార్పులు చేయడం కన్నా తమ ముద్ర ఉండే విధంగా కొత్త చట్టాన్ని తీసుకురావడమే సమంజసమనే నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు వచి్చనట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే పాత చట్టంలోని కొన్ని అంశాలను తీసుకుంటూనే, అవసరమైన కీలక సవరణలు చేస్తూ రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్–2024) చట్టాన్ని రూపొందించే పనిలో అధికారులు ఉన్నారు. ముసాయిదా చట్టంపై న్యాయపరమైన అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత రాష్ట్ర కేబినెట్లో ఆమోదించి, ఆ తర్వాత జూలైలో నిర్వహించే బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీ ఆమోదం పొందేలా ప్రభుత్వం కసరత్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం. కీలకాంశాల్లో మార్పులతో.. రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఆర్వోఆర్ చట్టంలోని కీలకాంశాల్లో మార్పులు చేస్తూ కొత్త చట్టం తీసుకురావాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా భూసమస్యల పరిష్కారం కోసం పలు స్థాయిల్లోని అధికారులకు ఉండే అధికారాల వికేంద్రీకరణపై కొత్త చట్టంలో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. కలెక్టర్లు, ఆర్డీవోలు, తహశీల్దార్లకు ఎలాంటి అధికారాలు ఇవ్వాలి, ఆయా స్థాయిల్లోని అధికారులు ఎలాంటి నిర్ణయాలకు బాధ్యత వహిస్తారనే అంశాలపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పాటు భూ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా పాస్ పుస్తకాలు ఇవ్వకుండా పార్ట్–బీలో పెట్టిన 18 లక్షల ఎకరాలు, సాదాబైనామాల కింద లావాదేవీలు జరిగి పాస్ పుస్తకాలు రాని 9 లక్షల ఎకరాల భూములకు పరిష్కారం చూపించే దిశలో చట్టం రూపొందుతోందని తెలుస్తోంది. అసైన్డ్, భూదాన్ కంగాళీకీ చెక్!అసైన్డ్, భూదాన్, వక్ఫ్, దేవాదాయ భూములకు సంబంధించిన కంగాళీ కూడా లేకుండా అన్ని సమస్యలకు పరిష్కారం చూపే విధంగా పాత చట్టాన్ని మార్చి కొత్త చట్టాన్ని తయారుచేస్తున్నారని, రెవెన్యూ ట్రిబ్యునళ్ల పునరుద్ధరణ లాంటి కీలక అంశాలు కొత్త చట్టంలో ఉంటాయని తెలుస్తోంది. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ చేసే అధికారాలను జాయింట్ సబ్ రిజి్రస్టార్ హోదాలో తహసీల్దార్లకే ఉంచాలా లేక డిప్యూటీ తహసీల్దార్లకు అప్పజెప్పాలా అన్న దానిపై కూడా కొత్త చట్టంలో స్పష్టత ఇవ్వనున్నట్టు సమాచారం. కాగా ధరణి పోర్టల్ పునర్నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ త్వరలోనే ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదికను సమర్పించనున్నట్లు తెలిసింది. -
సింహాచలం భూ సమస్యలపై ప్రజలకు అవంతి హామీ
-
భూసమస్యలన్నీ పరిష్కారమయ్యేలా...
దాదాపు వందేళ్ళ క్రితం బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ సర్వేలో భూమిని అనుభవిస్తున్న వారి వివరాలతో వాటి వాస్తవ స్థితిని నిర్ధారించారు. అయితే రెవెన్యూ రికార్డులను సరిగ్గా అప్డేట్ చేయకపోవడం, వివిధ చట్టాల్లో తీసుకువచ్చిన మార్పుల కారణంగా క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులు, వ్యత్యాసాలు భూమి రికార్డుల్లో నమోదు కాలేదు.ఈ సమస్యలను పరిష్కరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘రికార్డ్ ఆఫ్ రైట్స్’ చట్టాన్ని (భూ యాజ మాన్య హక్కు చట్టం) తెచ్చింది. భూ యాజమాన్య హక్కులకు సంబంధించి ఎదురవుతున్న అనేక సమస్యలను పరిష్కరించడానికి డ్రోన్లు, విమానాల ద్వారా భూముల రీ సర్వే చేసే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రతి భూకమతంలో పట్టాదారు వాస్తవ స్థితిని ధ్రువీకరించేలా సర్వే జరుగుతోంది. భారతీయుల్లో భూమికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. సమాజంలోని అన్ని వర్గాల సంస్కృతులు భూ యాజమాన్యానికి అనుకూలంగా ఉండడం వల్ల అందరూ దాన్ని కోరుకుంటారు. దేశంలోని గ్రామీణ కుటుంబాల మొత్తం ఆస్తిలో భూమి 73 శాతం ఉండగా, పట్టణ గృహాల ఆస్తిలో భూమి, భవనాలు 90 శాతం ఉన్నట్లు 2013 ఎన్ఎస్ఎస్ఓ నివేదికలో తేలింది. అందుకే పెట్టుబడిదారులు, రుణదాతలు, బ్యాంకర్లు స్పష్టమైన టైటిల్, స్పష్టమైన ల్యాండ్ మ్యాపింగ్, రికార్డుల నిర్వహణ, స్పష్టమైన హక్కులు ఉండాలని కోరుకుంటారు. కానీ మెకెన్సీ సంస్థ నిర్వహించిన ఒక అధ్యయనంలో దేశంలోని ఎక్కువ భూముల యాజమాన్యానికి సంబంధించి చట్టపరమైన వివాదాలున్నాయని తేలింది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ తరహా భూముల వివాదాలు 5 శాతం కంటే తక్కువగా ఉన్నాయి. కానీ మన దేశంలో దాదాపు 70 శాతం సివిల్ వివాదాలున్నాయి. ప్రస్తుత రెవెన్యూ రికార్డులు ప్రాథమికంగా బ్రిటిష్ ప్రభుత్వం 100 ఏళ్ల క్రితం నిర్వహించిన సర్వే ఆధారంగా రూపుదిద్దుకున్నాయి. అవన్నీ ప్రభుత్వానికి భూముల ద్వారా ఎక్కువ ఆదాయాన్ని సేకరించే లక్ష్యంతో రూపొందించినవి. స్వాతంత్య్రం వచ్చాక కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు భూమిని సాగు చేసేవారికి సురక్షితమైన హక్కులు ఉండేలా ప్రోత్సహించడానికి అనేక భూ సంస్కరణలు ప్రవేశపెట్టాయి. ‘ఎస్టేట్లు – ఇనామ్ నిర్మూలన చట్టం’, ‘వ్యవసాయ భూముల సీలింగ్ చట్టం’, ‘పీఓటీ’ చట్టం, ‘ఆర్ఓఎఫ్ఆర్’ వంటి చట్టా లను వరుసగా వచ్చిన ప్రభుత్వాలు సాగుదారులకు అనుకూలంగా తీసుకువచ్చాయి. భూముల యాజమాన్యంలో జరిగిన ఈ మార్పు లన్నీ రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కినా... కోర్టు కేసులు, ఇతర కారణాల వల్ల క్రమం తప్పకుండా నవీకరణ (అప్డేట్) అవలేదు. దాదాపు 100 సంవత్సరాల క్రితం జరిగిన సర్వేలో భూమిని అను భవిస్తున్న వారి వివరాలతో వాటి వాస్తవ స్థితిని నిర్ధారించినా... రెవెన్యూ రికార్డులను సరిగ్గా అప్డేట్ చేయకపోవడం, వివిధ చట్టాల్లో తీసుకువచ్చిన మార్పుల కారణంగా క్షేత్ర స్థాయిలో నెలకొన్న పరిస్థి తులు, వ్యత్యాసాలు భూమి రికార్డుల్లో నమోదు కాలేదు. ఈ సమస్య లను పరిష్కరించడానికి ఏపీ ప్రభుత్వం ‘రికార్డ్ ఆఫ్ రైట్స్’ చట్టాన్ని ప్రవేశపెట్టింది. అలాగే ఆ చట్టాన్ని సవరించడం ద్వారా గ్రామాల వారీగా ప్రతి వ్యక్తి అధీనంలో ఉన్న భూమి వివరాలను రికార్డుల్లో అప్డేట్ చేసింది. ఇలా హక్కుల రికార్డును ప్రవేశపెట్టిన తర్వాత కూడా భూ వివాదాలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుత రెవెన్యూ రికార్డులు ఊహాజనిత హక్కును మాత్రమే కల్పిస్తాయి. కొన్ని కేసుల్లో రికార్డులు క్షేత్ర స్థాయి పరిస్థితికి విభిన్నంగా ఉంటాయి. కోర్టు కేసులు, వారసత్వాలు, తనఖా వంటి భూమికి సంబంధించిన వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించే ఎలాంటి ఒకే ఒక్క మూలాధారం ప్రస్తుత రికార్డుల్లో లేదు. దీనివల్ల భూ యజమానులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలన్నింటినీ ఒకేసారి పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం రాష్ట్రం మొత్తాన్ని డ్రోన్లు, విమానాల ద్వారా భూముల రీ సర్వే చేసే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రతి భూ కమతంలో పట్టాదారు వాస్తవ స్థితిని ధ్రువీకరించేలా సర్వే జరుగుతోంది. భూ యాజమాన్యంపై ఉన్న గందరగోళాన్ని తొలగించేలా రీ సర్వేలో ప్రతి భూభాగానికి జియో రిఫెరెన్స్ ఇస్తున్నారు. భూమి, దానికి సంబంధించిన రికార్డులను అనేక శాఖలు (రెవెన్యూ, పంచాయితీ రాజ్, పట్టణ స్థానిక సంస్థలు, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, రిజిస్ట్రేషన్ శాఖలు) నిర్వహిస్తుండడం వల్ల తీవ్ర జాప్యం జరుగుతోంది. అలాగే పౌరులు వాటికి సంబంధించిన అనుమతులు, సేవలు పొందేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ పరిస్థితి ఎందుకంటే? భూమి యాజమాన్యం సార్వభౌమాధికారంతో ఉంటుందని దేశంలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన విషయం. అనేక అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా నిశ్చయాత్మకమైన టైటిల్ విధా నానికి (కన్‌క్లూజివ్ టైటిల్ విధానం) మన దేశం వెళ్లలేదు. ఇప్పుడు ఉన్న ల్యాండ్ టైటిల్ విధానం... యాజమాన్యాన్ని ధ్రువీకరించే నిశ్చ యాత్మక టైటిల్‌కు విరుద్ధంగా ‘అనుకూల టైటిల్ కాన్సెప్ట్’ (ప్రిజెమ్టివ్ టైటిల్) ఆధారంగా రూపొందించబడింది. అంటే భూమి అధీనంలో ఉన్న వ్యక్తి సదరు భూమికి సంబంధించి రెవెన్యూ శాఖకు పన్ను చెల్లిస్తున్న వ్యక్తిగా భావించబడే అర్థంలో ఇచ్చిన టైటిల్ మాత్రమే. అది కూడా ‘1872 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్’ ప్రకారం చట్టపరమైన స్వాధీనమే. భూమిపై లావాదేవీ జరిగినప్పుడు కూడా టైటిల్ వెరిఫి కేషన్ అవసరం లేని వ్యవస్థ కారణంగా భూమి టైటిల్ విధానం పేల వంగా ఉంది. ‘1908 ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్’ కూడా పత్రాల నమోదుకు సంబంధించిన చట్టమే తప్ప భూమి లేదా టైటిల్ రిజి స్ట్రేషన్‌కి సంబంధించినది కాదు. 1982 ఆస్తి బదిలీ చట్టానికి యాజ మాన్యం యొక్క ధ్రువీకరణ అవసరం లేదు. భూమి లావాదేవీల విషయంలో ఆదాయాన్ని పెంచడానికి మాత్రమే ఈ చట్టాలు పరిమి తమయ్యాయి. ఆ భూముల యాజమాన్యానికి సంబంధించి ఏదైనా ప్రశ్న తలెత్తితే, అది తనదేనని నిరూపించుకోవాల్సి బాధ్యత యజమా నిపైనే ఉంటుంది. తక్షణ సంస్కరణలు అవసరం ఈ నేపథ్యంలో భూ సమస్యలన్నింటినీ అధిగమించేందుకు ఎలా ముందుకు వెళ్లాలో సూచించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక టాస్క్ ఫోర్స్‌ను నియమించింది. ఈ ‘టైటిల్ సర్టిఫికేషన్ టాస్క్‌ఫోర్స్’ ఒక సమగ్రమైన భూమి టైటిల్ వ్యవస్థను దేశంలో వీలైనంత త్వరగా తీసుకురావాల్సిన అవసరాన్ని గుర్తించింది. దాని ఆధారంగా కేంద్ర ప్రభుత్వం 2011లో ఒక ముసాయిదా ల్యాండ్ టైట్లింగ్ బిల్లును తీసు కువచ్చింది. నిశ్చయాత్మకమైన ఆస్తి హక్కుల (కన్‌క్లూజివ్ ప్రాపర్టీ టైటిల్స్) వ్యవస్థను ఏర్పాటు చేయడం, పాలన, నిర్వహించడం దీని ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగా అనుసరించే ‘టోరెన్స్’ వ్యవస్థ ఆధారంగా దీన్ని రూపొందించారు. టోరెన్స్ వ్యవస్థ 3 సూత్రాలతో ఉంటుంది. 1. మిర్రర్ సూత్రం. ఇది టైటిల్ రిజిస్ట్రేషన్‌ను సూచిస్తుంది. క్షేత్ర స్థాయి వాస్తవికత (గ్రౌండ్ రియాలిటీ)ను కచ్చితంగా ప్రతిబింబిస్తుంది. 2. కర్టెన్ సూత్రం. ఇది గతానికి అడ్డుగా ఒక తెర ఉన్నన్నట్లు సూచిస్తుంది. టైటిల్‌ను రిజిస్టర్లో టైటిల్ నమోదు కావడమే ప్రస్తుత టైటిల్ నిశ్చయాత్మక రుజువు అనీ, గతాన్ని పరిశోధించాల్సిన అవ సరం లేదనీ చెబుతోంది. 3. హామీ సూత్రం. ఇది టైటిల్‌ను రిజిస్టర్ చేసే క్రమంలోనూ, భూ యజమానులకు జారీ చేసే ధ్రువీకరణ పత్రాలలోనూ దొర్లే తప్పు లకు నష్టపరిహారానికి ప్రభుత్వ సంస్థల హామీని ఇస్తుంది. ఇది కోర్టుల్లో కూడా చెల్లుబాటయ్యే పూర్తి అజేయమైన యాజమాన్య ధ్రువీకరణ పత్రంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఏపీ శాసనసభ 2019లో ‘ఏపీ ల్యాండ్ టైట్లింగ్ చట్టా’న్ని ఆమోదించి దాన్ని భారత రాష్ట్రపతి అంగీకారం కోసం పంపింది. దాన్ని అందుకున్న కేంద్రం భూమి వ్యవహారాలు పర్యవేక్షించే కేంద్ర ఎల్ఓఆర్, ఐటీ, న్యాయ తదితర శాఖల పరిశీలనకు పంపింది. ఆ యా శాఖలు కొంత సమయం తీసుకుని ఈ చట్టంపై అభిప్రా యాలు, వ్యాఖ్యలు పంపారు. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ఏపీ ప్రభుత్వం అందుకనుగుణంగా టైట్లింగ్ బిల్లుకు పలు సవరణలు చేసి శాసనసభకు పంపింది. దీనిని 2023లో సభ ఆమోదించింది. ఆ బిల్లును మళ్లీ రాష్ట్రపతి ఆమోదం కోసం పంపగా ఇటీవలే దానికి ఆమోదం లభించింది. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం ఆ చట్టాన్ని నోటిఫై చేసి అమలు చేయడానికి కావల్సిన నియమాలు, మార్గదర్శకాలను రూపొందిస్తోంది. కానీ చర్చించకుండా హడావిడిగా చట్టం తెచ్చారని కొందరు బాధ్యతారహిత వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉంది. రెండు సార్లు పూర్తిగా చర్చించి సంతృప్తి చెందిన తర్వాతే అసెంబ్లీ ఈ బిల్లును ఆమోదించింది. మన దేశంలో చట్టాలు ఇదే విధానంలో రూపుదిద్దు కుంటాయి తప్ప వేరే విధానంలో కాదు. ప్రజాస్వామ్యంలో చట్ట సభలు ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. రాజ్యాంగ సవరణలు కూడా ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లవు. దీన్ని సమగ్రంగా పరిశీ లించడానికి, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు పలు దఫాలుగా పంపిన వివరణలు చూసి ఆమోదించడానికి కేంద ప్రభుత్వానికి నాలుగేళ్లు పట్టింది. భూముల వ్యవహారంలో రెవెన్యూ శాఖ సమర్థతను ప్రశ్నిస్తూ కొందరు వ్యక్తులు పత్రికలకు ఎక్కడం కూడా దురదృష్టకరం. బహుశా ఈ దేశంలో భూ యాజమాన్య వ్యవస్థల పరిణామం గురించి వారికి తెలియకపోవచ్చు. బ్రిటిష్‌వారు మొదటిసారిగా రైత్వారీ సెటిల్మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు, రెవెన్యూ సిబ్బంది అయిన సెటిల్మెంట్ అధికారులే భూమిని అనుభవిస్తున్న ప్రజలకు హక్కులు ఇచ్చారు తప్ప వేరే వారు కాదు. ఆర్ఓఆర్, ఎస్టేట్ల రద్దు, ఇనాం రద్దు, ల్యాండ్ సీలింగ్ వంటి భూమికి సంబంధించిన ప్రతి చట్టంలోనూ హక్కుదారులకు సంబంధించిన అంశాలను పరిష్కరించే అధికారం రెవెన్యూ అధికారులకే ఉంది. భూ సమస్యలను పరిష్కరించడంలో, పట్టా హక్కులు లేదా యాజమాన్య హక్కులు ఇవ్వడంలో రెవెన్యూ సిబ్బందికి మించిన జ్ఞానం ఎవరికీ ఉండదు. రెవెన్యూ సిబ్బందికి భూ చట్టాలు/సమస్యలను అర్థం చేసుకునే సామర్థ్యం లేదని చెప్పడం సరికాదు. అదే సందర్భంలో ఏ సీనియారిటీ ప్రకారం టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారులను నియమిస్తారనే విషయం రాష్ట్ర ప్రభు త్వానికే వదిలేయాలి. అన్ని వివరాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే ప్రభుత్వం టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారులను ఖరారు చేస్తుంది. చట్టం ప్రకారం అప్పీలేట్ అధికారులుగా సర్వీసులో ఉన్న లేదా రిటైర్ అయిన జాయింట్ కలెక్టర్ స్థాయి కంటే తక్కువ కాకుండా ఉన్న వారే నియమితులవుతారు. అప్పీలేట్ అధికారులుగా ఎవరిని నియ మించాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నిర్ణయించలేదు. ఈ దశలో ఎవరికి నచ్చినట్లు వారు ఊహించుకోవడం సరికాదు. టైటిల్ రిజిస్టర్లో నమోదైన ఎంట్రీలపై అప్పీల్ చేసుకునేందుకు రెండేళ్ల సమయం ఎలా సరిపోతుందని కొందరు ప్రశ్నించారు. ఇది చాలా విడ్డూరంగా కనిపిస్తోంది. మ్యుటేషన్ చట్టం, ఆర్ఓఆర్ వంటి ఏ ఇతర చట్టాల ప్రకారమైనా రికార్డింగ్ అధికారి నిర్ణయాన్ని సవాలు చేయడానికి చరిత్రలో ఎన్నడూ కొన్ని వారాల కంటే ఎక్కువ సమయం ఇవ్వలేదు. రికార్డింగ్ అధికారి నిర్ణయాన్ని సవాలు చేయడానికి కొన్ని వారాల సమయం మాత్రమే ఇస్తారు. కానీ ల్యాండ్ టైట్లింగ్ చట్టంలో రెండు సంవత్సరాల సమయం ఇచ్చారు. పైన చెప్పిన టోరెన్స్ వ్యవస్థ ప్రకారం పునఃసమీక్ష, పరిష్కారం తర్వాత, రికార్డింగ్ చేయబడుతుంది, ఇది తాత్కాలికంగా మాత్రమే పరిగణించబడుతుంది. ఈ ప్రక్రియలో పట్టాదారులకు నోటీసులు ఇవ్వబడతాయి. ఈ తాత్కా లికాన్ని సవాలు చేయడానికి ప్రజలకు 2 సంవత్సరాల సమయం ఇస్తారు. 2 సంవత్సరాలలోపు ఎటువంటి ఛాలెంజ్ లేకపోతే, తాత్కా లికమే ఫైనల్ అవుతుంది. ఈ విషయంలో పరిమితి చట్టంలోని నిబంధనలను కోట్ చేయడం అసంబద్ధం. అజేయ కల్లం వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ప్రధాన సలహాదారు -
ఓపిక పట్టండి అన్నీ పరిష్కరిస్తాం
లక్డీకాపూల్: ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం ప్రధానంగా ధరణి, భూ సమస్యలను పరిష్కరించాలంటూ ఎక్కువమంది రాగా, కొండ పోచమ్మ సాగర్ బాధితులు, టీఎస్పీఎస్సీ రద్దు చేయాలంటూ నిరుద్యోగులు, ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కాంట్రాక్ట్ ఉద్యోగులు విన్నవించారు. మంగళవారం నిర్వహించిన ప్రజావాణిలో 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణికి వచ్చిన వారితో మాట్లాడి సమస్యను తెలుసుకున్నారు. మంత్రితో పాటు ప్రజావాణి నోడల్ అధికారి హరిచందన ఉన్నారు. ఆటోవాలాలపై విధానపరమైన నిర్ణయం ప్రజావాణి అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. అందరి సమస్యలనూ ప్రభుత్వం పరిష్కరిస్తుందని, కాస్త ఓపిక పట్టాలని సూచించారు. మంగళవారం ప్రజా వాణి కార్యక్రమంలో 5,324 వినతి పత్రాలందాయని తెలిపారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల ఆటోవాలాలు ఇబ్బంది పడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, వారికి కచ్చితంగా న్యాయం చేస్తామని భరోసానిచ్చారు. ఈ విషయంలో ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఇళ్లు, రేషన్, భూసమస్యల వంటివన్నీ ఆరు గ్యారంటీల అమలుతో పరిష్కారమవుతాయని మంత్రి అన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాదీనం చేసుకోవాలి తెలంగాణలోని అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని డిపాజిట్‌దారులకు తక్షణమే డబ్బులు చెల్లించి న్యాయం చేయాలని తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. బాలమల్లేష్ ప్రజావాణిలో కోరారు. మాజీ హోంగార్డులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర అన్ని జిల్లాల మాజీ హోంగార్డుల ప్రతినిధులు ఇందిర, యూనస్ మహ్మద్ వ్రిజ్ఞప్తి చేశారు. తిరిగి విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికి న్యాయం జరగలేదన్నారు. ఇంకా పలు సమస్యలపై.. ప్రభుత్వ పాఠశాల్లోని స్వచ్ఛ కార్మికులకు న్యాయం చేయాలని కోరుతూ మహబూబ్‌నగర్ జిల్లా సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నెమ్మది వెంకటేశ్వర్లు, ప్రమీలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 28 వేల మంది కార్మికులకు నిధుల కొరత పేరిట గ్రా మ పంచాయతీలు వేతనాలు చెల్లించడం లేదన్నా రు. కాళేశ్వరం బాధితుల భూ సాధన కమిటీ ఆధ్వర్యంలో బాధితులు పాదయాత్రగా ప్రజాభవన్‌కు వచ్చి కొండపోచమ్మ సాగర్ నిలిపివేయాలంటూ నినాదాలు చేశారు. నిలిచిపోయిన 13 జిల్లాల స్పౌజ్ బదిలీలకు అనుమతించాలని స్పౌజ్ ఫోరం ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నుంచి 10గంటల్లోపు వచ్చిన వారికి మాత్రమే శుక్రవారం నుంచి ఉదయం 10 గంటలలోపు వచ్చిన వారికే ప్రజావాణిలో ఫిర్యాదు చేసుకునే అవకాశం కల్పించనున్నట్టు ప్రజా భవన్ అధికార వర్గాలు ప్రకటించాయి. ఈ మేరకు ప్రజాభవన్ వద్ద ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేశారు. -
10 రోజుల్లో నివేదిక ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని భూసంబంధిత సమస్యలు, ధరణి పోర్టల్ అంశాలపై పది రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ‘ధరణి పోర్టల్‌ను ఎలా డిజైన్ చేశారు? భూ రికార్డులు అందులో ఎలా భద్రపరిచారు? సదరు డేటా ఎక్కడ ఉంది? పోర్టల్ నిర్వహిస్తున్న కంపెనీ కాంట్రాక్టు ఎప్పటివరకు ఉంది? ఆ కంపెనీ మళ్లీ ఎందుకు వేరే కంపెనీలకు లీజుకిచ్చింది? ఈ పోర్టల్ నిర్వహిస్తున్న, నిర్వహించిన కంపెనీలకు ఉన్న చట్టబద్ధత ఏంటి? ఒకవేళ పోర్టల్‌లోని రికార్డులు కరప్ట్ అయి వివరాలన్నీ పోతే రాష్ట్రంలోని భూములకు మాన్యువల్ రికార్డులు అందుబాటులో ఉన్నాయా? ఈ పోర్టల్ ద్వారా వస్తున్న దరఖాస్తులు ఏడాదిన్నరగా ఎందుకు పెండింగ్‌లో ఉంటున్నాయి?’ అని ప్రశ్నించారు. అన్ని అంశాల తో నివేదిక రూపొందించిన తర్వాత మళ్లీ సమావేశమవుదామని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కోనేరు రంగారావు కమిటీ తరహాలో రాష్ట్రంలోని భూసమస్యల అధ్యయనానికి క మిటీ కూర్పుపై అధ్యయనం చేయాలని చెప్పారు. భూదాన్, అసైన్డ్ భూముల అంశాలపై ఇంకోసారి సమావేశమై సమగ్రంగా చర్చిద్దామని అన్నారు. బు ధవారం మధ్యాహ్నం సచివాలయంలో ధరణి పోర్ట ల్ నిర్వహణపై సీఎం సమీక్ష నిర్వహించారు. డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, సీఎస్ శాంతికుమారి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్ఏ నవీన్ మిత్తల్, అధికారులు, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, భూచట్టాల నిపుణుడు సునీల్‌కుమార్, రెవెన్యూ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అధికారులపై ప్రశ్నల వర్షం సమీక్ష సందర్భంగా సీఎంతో పాటు పలువురు మంత్రులు రెవెన్యూ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘నారాయణపేట జెడ్పీ చైర్మన్ ధరణి పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. తన దరఖాస్తు పరిష్కారం కాకపోగా ఆ డబ్బులు మీరు తిరిగి ఇవ్వలేదు. ఆయన కోర్టుకు వెళ్లి తన డబ్బులు తనకివ్వాలని ఆర్డర్ తెచ్చుకున్నా మీరు స్పందించలేదు. ధరణి పోర్టల్ కింద చేసుకునే ప్రతి దరఖాస్తుకు రైతుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు? ఎందుకు వసూలు చేస్తున్నారు? ఆ డబ్బులు నేరుగా ప్రభుత్వ ఖాతాకే వస్తున్నాయా? ప్రైవేటు కంపెనీకి వెళ్లి మళ్లీ ప్రభుత్వానికి వస్తున్నాయా? భూముల రికార్డులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండడం వల్ల భూ యజమానుల హక్కులకు భంగం కలుగుతుంది కదా? డేటాను దుర్వినియోగం చేయకుండా నియంత్రించే మెకానిజం ఏంటి? స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత రద్దు చేసుకుంటే ఆ డబ్బులు రైతులకు ఎందుకు ఇవ్వడం లేదు? నిషేధిత భూముల జాబితాలో ఉన్న భూములపై విచారణ సుమోటోగా ఎందుకు చేయొద్దు? నోషనల్ ఖాతా అంటే ఏంటి? ఆ ఖాతాలో భూములెందుకున్నాయి? 31 కాలమ్స్ ఉన్న పహాణీలో 16వది అయిన అనుభవదారు కాలమ్ ఎందుకు తీసేశారు?..’ అని రేవంత్ ప్రశ్నించారు. నివేదికపై సంతకం పెట్టి ఇవ్వండి ధరణి పోర్టల్‌కు, రైతుబంధుకు సంబంధమేంటని సీసీఎల్ఏ మిత్తల్‌ను సీఎం ప్రశ్నించారు. సంబంధమేమీ లేదని మిత్తల్ చెప్పగా, ఇదే విషయాన్ని ప్రభుత్వానికి ఇచ్చే నివేదికలో పొందుపర్చాలని రే వంత్ సూచించినట్టు తెలిసింది. నివేదికను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో కాకుండా అధికారికంగా సంతకం పెట్టి ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వైఎస్ జగన్ వేగం మీకెందుకు లేదు? కాంగ్రెస్ హయాంలో రెవెన్యూ సదస్సులు పెట్టిన తీరు, అనుసరించాల్సిన విధివిధానాలపై కాంగ్రెస్ నేత కోదండరెడ్డి నివేదికను సమర్పించారు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి ఉన్న వేగం మీకెందుకు లేకుండా పోయిందని ప్రశ్నించారు. భూముల సర్వే, టైటిల్ గ్యారంటీ, అసైన్డ్ భూముల చట్టం, కౌలు రైతుల చట్టం అమలు లాంటి విషయాల్లో జగన్ వేగంగా దూసుకుపోతుంటే మీరేం చేశారని ప్రశ్నించారు. కమిటీ ఏర్పాటు చేయండి: భూమి సునీల్ రాష్ట్రంలోని భూసమస్యలపై సమగ్రంగా ఆలోచించాల్సిన సమయం వచ్చిందని, ఈ సమస్యలపై అధ్యయనం చేయడానికి ఓ కమిటీని ఏర్పాటు చేయాలని భూమి సునీల్ కోరారు. భూ సంబంధిత అంశాలపై ఆయన ప్రెజెంటేషన్ ఇచ్చారు. సాదా బైనామాల చట్ట సవరణ చేయాలని, రెవెన్యూ సదస్సులు పెట్టి సుమోటోగా రైతుల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. పెండింగ్‌లో 2.30 లక్షల దరఖాస్తులు సమీక్షలో భాగంగా రెవెన్యూ శాఖ, సీసీఎల్ఏ అధికారులు ధరణిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ పోర్టల్ ద్వారా భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం రూపొందించిన మాడ్యూల్స్‌లో ఎన్ని దరఖాస్తులు వస్తే ఎన్ని పరిష్కారమయ్యాయో వివరించారు. టెక్నికల్ మాడ్యూల్ 1 నుంచి టీఎం 33 వరకు మొత్తం 2.30 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, 1.80 లక్షల ఎకరాలకు పాస్ పుస్తకాలు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. సమీక్షలో కాంగ్రెస్ నేతలు అన్వేష్ రెడ్డి, హర్కర వేణుగోపాల్, మన్నె నర్సింహారెడ్డి, మల్రెడ్డి రాంరెడ్డి, ఎన్నం శ్రీనివాస్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, రాజ్ ఠాకూర్లతో పాటు ట్రెసా ప్రతినిధులు వంగ రవీందర్‌రెడ్డి, కె.గౌతమ్‌కుమార్, డిప్యూటీ కలెక్టర్ల సంఘం తరఫున వి.లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేల మీదకు రండి!
ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ పార్టీలు ప్రజలకు ఎన్నెన్నో హామీలతో కూడిన మేనిఫెస్టోలను విడుదల చేస్తున్నా, వాటిలో ఎక్కడా కూడా భూమి ఎజెండా కావడం లేదు. ఇందుకు కారణాలేవైనా తెలంగాణలో భూమి చుట్టూ తిరగాల్సిన రాజకీయం డబ్బు చుట్టూ తిరుగుతోందని వర్తమాన పరిస్థితులను బట్టి అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాలు, రాజకీయ పార్టీలు దృష్టి సారించాల్సిన అంశాలపై తెలంగాణ ప్రజల భూమి మేనిఫెస్టో–2023 పేరుతో తెలంగాణ సమాఖ్య 15 కీలక అంశాలను తెరపైకి తెచ్చింది. లీఫ్స్ సంస్థ, గ్రామీణ న్యాయపీఠం, తెలంగాణ సోషల్ మీడియా ఫోరం నిర్వహించిన తెలంగాణ భూమి కారవాన్, భూన్యాయ శిబిరాలు, న్యాయగంట, చర్చా వేదికల ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది రైతుల అభిప్రాయాల ఆధారంగా ఈ డిమాండ్లను పార్టీల ముందుంచింది. మూడే కీలకం.. ఆ ఒకటే రికార్డు–ఒకటే పట్టా–ఒకటే చట్టం నినాదాన్ని ఎన్నికల ఎజెండా చేయాలని భూచట్టాల నిపుణులు చెబుతున్నారు. ఇది సాధ్యమైతే 90 శాతం సమస్యలు పరిష్కారమైనట్లేనని అంటున్నారు. ఒకటే రికార్డు కావాలంటే భూముల సమగ్ర సర్వే జరగాలి. ఒకటే పట్టా కావాలంటే ప్రభుత్వమే టైటిల్ గ్యారంటీ ఇవ్వాలి. ఒకటే చట్టం కావాలంటే రెవెన్యూ కోడ్ అమల్లోకి రావాలి. ఇవి మూడూ జరగాలంటే రాజకీయ నిబద్ధత కావాల్సిందే. వీటితో పాటు లా కమిషన్, సర్వీస్ కమిషన్, స్టేట్‌ఫైనాన్స్ కమిషన్ తరహాలో భూ కమిషన్ ఏర్పాటు డిమాండ్ కూడా ఉంది. కౌలు–వ్యవసాయ భూముల చట్టం (1950) ప్రకారం అధికారులు, నిపుణులు, ప్రజాప్రతినిధులతో ఈ కమిషన్ ఏర్పాటు తప్పనిసరి. అయితే 1950 నుంచి ఓ దశాబ్దంపాటు అమల్లో ఉన్న ఈ కమిషన్ ఆ తర్వాత క్రమంగా కనుమరుగైంది. భూమికి సంబంధించిన ఇతర డిమాండ్లు ఇవి ♦ ఆర్ఓఆర్ చట్టాన్ని సవరించి పెండింగ్‌లో ఉన్న సాదా బైనామా దరఖాస్తులను పరిష్కరించి పట్టాలివ్వాలి. ♦ పోడు సాగు చేస్తున్న అర్హులైన గిరిజనులందరికీ అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి హక్కు పత్రాలను అందించాలి. ♦ భూపంపిణీకి ప్రత్యేక పథకం రూపొందించాలి. సీలింగ్ చట్టంతో మిగులు భూమిని భూమిలేని వ్యవసాయ పేద కుటుంబాలకు పునఃపంపిణీ చేయాలి. ♦ భూవివాదాల పరిష్కారానికి జిల్లాకో భూమి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి. రాష్ట్ర స్థాయిలో అప్పీలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటుతోపాటు పేదలకు ఉచిత న్యాయ సాయం, పారాలీగల్ పథకాలను అమలు చేయాలి. ♦ ధరణి సమస్యల పరిష్కారం కోసం గ్రామ స్థాయిలో రెవెన్యూ కోర్టులు నిర్వహించాలి. కంప్యూటర్లో ఉన్న భూరికార్డులు వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా ఉండాలి. రికార్డుల్లో తప్పులను సత్వరమే సవరించేలా సాఫ్ట్వేర్ రూపొందించాలి. కంప్యూటర్లో ఉన్న రికార్డులకు భద్రత కల్పించాలి. ♦ నిషేధిత జాబితా (22ఏ)లో పొరపాటున నమోదైన పట్టా భూములను వెంటనే జాబితా నుంచి తొలగించాలి. ♦ గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు భూపరిపాలన యంత్రాంగాన్ని పటిష్టపర్చాలి. అవసరాలకు తగినట్టు వారికి తగిన శిక్షణ ఇవ్వడం కోసం భూ అకాడమీని ఏర్పాటు చేయాలి. ♦ భూవిధానం, భూమి వినియోగ విధానం, 2014లో చేసిన భూసేకరణ చట్టం యథాతథంగా అమలు చేయాలి. ♦ కౌలుదారులను సాగుదారులుగా గుర్తించి వారికి పట్టా రైతులుగా అందాల్సిన అన్ని రకాల సాయం అందించాలి. కొత్త కౌలు చట్టం రూపొందించాలి. ‘సర్వే’జనా..! భూముల సమగ్ర సర్వే కూడా రాజకీయ ఎజెండా కావాల్సిందేననేది రైతుహితుల అభిప్రాయం. గుజరాత్‌తోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్తాన్‌లలో భూసర్వే జరిగింది. ఏపీలో జరుగుతున్న సర్వే దక్షిణాదిలో ఉత్తమమైన సర్వేగా గుర్తింపు పొందింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే దేశంలోనే భూముల సమగ్ర సర్వే చేసిన మొదటి రాష్ట్రంగా గుర్తింపు పొందుతుంది. తెలంగాణలో ఈ సర్వే చేసేందుకు 2016లో రూ.580 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. ఇప్పుడు అది రూ.800 కోట్లకు చేరింది. శాటిలైట్, డ్రోన్, డీజీపీఎస్ (డిజిటల్ జియో పొజిషనింగ్ సిస్టమ్స్)ల ద్వారా గ్రామ సరిహద్దులు, హైస్కేల్ మెజర్మెంట్స్ తీసుకొని యునీక్ ల్యాండ్ పార్సిల్ ఐడెంటిఫికేషన్ నంబర్ (యూఎల్‌పిన్) లేదా ల్యాండ్ పార్సిల్ నంబర్ ఇవ్వడం ద్వారానే భూమి హక్కులకు భద్రత కలగనుంది. ఇక మరో కీలకాంశం అసైన్డ్ భూములకు పట్టా హక్కుల కల్పన. ప్రస్తుతం బీఆర్ఎస్ మేనిఫెస్టోలో, కాంగ్రెస్ రైతు డిక్లరేషన్‌లో ఈ అంశం పొందుపర్చారు. భూ బదలాయింపు (పీఓటీ) చట్టాన్ని సవరించడం ద్వారా ఆ భూములు కేటాయించిన 20 ఏళ్ల తర్వాత ఏపీ, కర్ణాటకల్లో, 15 ఏళ్ల తర్వాత తమిళనాడులో పూర్తిస్థాయి యాజమాన్య హక్కులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాయి. తెలంగాణలో కూడా 1950 నుంచి పేదలకు అసైన్ చేసిన 25 లక్షల ఎకరాల అసైన్డ్ భూములున్నాయి. ఈ భూములపై హక్కులకల్పన రాజకీయ ఎజెండా అయితే పేదల ఆర్థిక ముఖచిత్రంలో ఊహించని మార్పులు రానున్నాయి. -మేకల కళ్యాణ్ చక్రవర్తి -
..భూమార్గం పట్టిద్దాం!
‘తెలంగాణలో భూమి అనేది చాలా ప్రధానమైన అంశం. ప్రపంచంలోని ఎక్కడా లేని భూపోరాటాలు ఇక్కడే జరిగినా 75 ఏళ్ల తర్వాత కూడా∙భూసమస్యలు అసంపూర్తి పనిగానే మిగిలిపోయాయి. అసంపూర్ణమైన భూసంస్కరణలే ఇందుకు కారణం. ప్రభుత్వాలు చేసే పనుల కారణంగా పేదల భూములకు భద్రత కల్పించడం మాట అటుంచితే పేదల భూములు లాక్కుంటున్నారని, ఉన్న కాసిన్ని భూములు పేదల చేతుల నుంచి పోతున్నాయని ఐక్యరాజ్యసమితి చెప్పింది. ఇదీ అసలు సమస్య. ప్రజలకున్న అసలు సమస్యలే కదా ఎన్నికల ఎజెండా కావాలి. ప్రజల ప్రతి సమస్యా ఎజెండా అయితే ఆ సమస్యలు తీరుస్తామని రాజకీయ పార్టీలు చెప్పాలి..’ అని భూచట్టాల నిపుణులు, నల్సార్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ఎం.సునీల్‌కుమార్ అన్నారు. తెలంగాణలో ధరణి ఒక్కటే భూ సమస్య కాదని పేర్కొన్నారు. ప్రజలు కోరుకుంటున్న భూవిధానాలను తీసుకురావడం ఎన్నికల ఎజెండా అయినప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయంటున్నారు. 75–80 ఏళ్ల నాటి పరిస్థితే ఇప్పటికీ.. భూమిని ప్రజల కోణంలో చూడాలి. భూమి లేని వారికి భూమి ఇవ్వడం, భూమి ఉన్న వారి హక్కులకు భద్రత ఉన్నప్పుడే ఆస్తి సంపదగా మారుతుంది. అయితే ఈ రెండింటి విషయంలో 75–80 ఏళ్ల నాటి పరిస్థితే ఇప్పటికీ ఉంది. భూమి లేని గ్రామీణ కుటుంబాలు తెలంగాణలో 56 శాతం ఉన్నాయని లెక్కలు చెపుతున్నాయి. భూములున్న కుటుంబాల విషయంలో ఊరికో 200 సమస్యలున్నాయి. ఈ సమస్యలు ఎన్నికల ఎజెండా కావాలి. దురదృష్టవశాత్తూ అలా జరగడం లేదు. గత మూడు ఎన్నికలను పరిశీలిస్తే.. 2014 ఎన్నికల్లో పార్టీల మేనిఫెస్టోల్లో భూమి ప్రస్తావన ఉంది. 2018లో కొందరే ప్రస్తావించారు. కానీ ఈసారి భూమి అంశం చర్చకే రావడం లేదు. ధరణిని రద్దు చేస్తామని ఒకరు అంటుంటే, అసైన్డ్ భూములపై హక్కులు కలి్పస్తామని బీఆర్ఎస్ అంటోంది. తెలంగాణలో భూసమస్య అంటే ధరణి ఒక్కటేనా? కీలకమైన భూసర్వే ఏ పార్టీ మేనిఫెస్టోలో అయినా ఉందా? అంటే మెల్లగా భూమి అనేది ఎన్నికల ఎజెండా కాకుండా మాయమైపోతోందన్న మాట. సమస్యలు కొనసాగితేనే పార్టీలకు ఉపయోగం రాజకీయ పార్టీలు ఎన్నికల్లో భూమిని ఎజెండాగా చేయాలనుకోవడం లేదనే చెప్పాలి. ఇతర అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల కానీ, ఉద్దేశపూర్వకంగా కానీ, లేదంటే పరిష్కరించలేక పోవడం వల్ల కానీ భూమి అంశాన్ని పార్టీలు చేపట్టలేకపోతున్నాయి. భూమి సమస్యను యథాతథంగా కొనసాగించాలన్న ఆలోచన కూడా రాజకీయ పార్టీలకు ఉండొచ్చు. భూములకు సంబంధించిన సమస్యలు ఉంటేనే కదా రాజకీయ పార్టీలకు ఉపయోగం. ప్రతి గుంట భూమిని సర్వే చేయాలి తెలంగాణలో భూముల సమగ్ర సర్వే చేయాలి. ఇందుకు రూ.700–800 కోట్ల వరకు ఖర్చవుతుంది. తెలంగాణలో ప్రతి గుంట భూమిని సమగ్రంగా సర్వే చేసి కొత్త రికార్డులను తయారు చేస్తేనే సమస్య పరిష్కారమవుతుంది. కానీ సర్వే చేస్తామని ఎవరైనా చెప్తున్నారా? భూ చట్టాల్లో సమగ్ర మార్పు రావాలి. ఆర్వోఆర్, పీవోటీ, కౌలు చట్టాలు మార్చాలి. ఏ పార్టీ అయినా భూ చట్టాల్లో మార్పు తెస్తామని ప్రకటిస్తోందా? రెవెన్యూ కోడ్ తెస్తామని చెప్తోందా? భూమి హక్కులకు ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చే టైటిల్ గ్యారంటీ చట్టం తెస్తామని ఏ పార్టీ అయినా చెపుతోందా? భూమి లేని పేదలకు భూములిస్తామని ఎవరైనా అన్నారా? తెలంగాణలో 10 లక్షల మందికి పైగా ఉన్న కౌలు రైతులను గుర్తిస్తామని ఎవరైనా చెపుతున్నారా? సమగ్ర చట్టం లేకుండా కౌలుదారులను ఎలా గుర్తిస్తారు? ఎలా డబ్బులిస్తారు? భూపరిపాలన మెరుగుపరుస్తామని ఎవరైనా అంటున్నారా? ఇవి ప్రజలు చేసే డిమాండ్లే. కంప్యూటర్ రికార్డు తప్పనిసరి పేరేదైనా సరే.. భూమికి కంప్యూటర్ రికార్డు ఉండి తీరాలి. తెలంగాణలో భూమి కంప్యూటర్ రికార్డులు బ్రహ్మాండంగా ఉన్నాయమని అధికారపక్షం చెపుతోంది. ప్రతిపక్షమేమో చెండాలంగా ఉందని అంటోంది. వీళ్లు రద్దు చేస్తామంటారు. వాళ్లు యథాతథంగా కొనసాగిస్తామంటున్నారు. ఇద్దరూ చెబుతున్నదీ తప్పే. రద్దు సమస్యకు పరిష్కారం కాదు. అసలు కంప్యూటర్ రికార్డు అయితే ఉండాలి కదా? ఏదో ఒక రికార్డుండాలి. కొత్త రికార్డు ఎలా తెస్తారు? అనేది చెప్పాలి కదా? ఏం చేస్తారనే పరిష్కారం చెప్పకుండా రద్దు సమంజసం కాదు. అంతా బాగుందని చెప్పడం సరైంది కాదు. అంటే ఈ రెండు పక్షాలు ప్రజలేం కోరుకునేదానివైపు వెళ్లడం లేదన్నది అర్థమవుతోంది. కంప్యూటరీకరణ అవసరమా? భూమికి కాగితాలిచ్చే ప్రక్రియ ప్రపంచమంతా జరుగుతోంది. ఎందుకంటే భూమి ఉన్నా.. ఆ భూమికి సరైన కాగితాలున్న వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా 30 శాతమేనట. అంటే రికార్డులు లేని వారే ఎక్కువ ఉన్నారు. ఈ రికార్డులను కల్పించడంలో భాగంగా జరిగే ప్రక్రియనే ఫార్ములైజేషన్ ఆఫ్ ల్యాండ్ రైట్స్ అంటారు. అంటే భూములకు రికార్డులు రూపొందించాలి. వాటిని కంప్యూటరీకరించాలి. అమ్మకాలు, కొనుగోళ్లు సులభంగా జరగాలి. వీటి వల్ల భూమి హక్కులకు భద్రత ఏర్పడుతుంది. పేదలకు కూడా భూములు కొనుగోలుచేయగలిగిన ధైర్యం వస్తుంది. భూవినియోగ విధానం ఉండాలి భూమి విధానం, భూమి వినియోగ విధానాలు ప్రతి రాష్ట్రానికి ఉండాలి. ఎన్నికల సమయంలోనే ఇవి చర్చకు రావాలి. ఉచితాలు అనేవి తాత్కాలిక లబ్ధి చేకూర్చేవి. అందువల్ల రాజకీయ పార్టీల హామీలు భూమి చుట్టూ తిరగాలి. స్థిరాస్తి కల్పనపై అవి దృష్టి సారించాలి. గుంట భూమి ఉంటే ఎన్ని సమస్యలో.. అది కూడా లేని వారి పరిస్థితేంటో అందరికీ తెలిసిందే. భూములివ్వడం, ఉన్న భూములను కాపాడడం చుట్టూ ఎన్నికల ఎజెండా తిరిగితేనే మెరుగైన ఫలితాలు వస్తాయి. - మేకల కళ్యాణ్ చక్రవర్తి -
సుప్రీం కోర్ట్ తీర్పును వెంటనే అమలుపర్చాలిని ప్రభుత్వానికి విజ్ఞప్తి
-
డీబార్ దానయ్యకు కోటు తొడిగి..! ఈనాడు పరువు తీసిన సీఎం జగన్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘‘రైతు బాగుంటేనే.. రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం మనది. నా ప్రతి అడుగులోనూ రైతు సంక్షేమం ఉంటుంది. భూమితో వారికున్న అనుబంధం తెలిసిన వ్యక్తిగా రైతన్నలకు మేలు చేసే కార్యక్రమాలను చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 97 వేలకుపైగా రైతు కుటుంబాలకు మంచి చేస్తూ చుక్కల భూములపై సర్వ హక్కులు కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం’’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో చుక్కల భూములపై రైతులకు హక్కుపత్రాలపంపిణీ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. ఆ వివరాలివీ.. సర్వ హక్కులు కల్పిస్తూ.. రాష్ట్రంలో దాదాపు లక్ష కుటుంబాలకు మేలు చేస్తూ దేవుడి దయతో ఇవాళ మరో మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. 2,06,171 ఎకరాల చుక్కల భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో తగిన మార్పులు చేసి రైతులకు సర్వ హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 22–ఏ నుంచి వాటిని తొలగిస్తూ మంచి చేస్తున్నాం. ఇన్నాళ్లూ 22–ఏలో ఉన్న ఈ భూముల రిజిస్ట్రేషన్ విలువ దాదాపు రూ.8 వేల కోట్లు. బయట వీటి మార్కెట్ విలువ కనీసం రూ.20 వేల కోట్లు ఉంటుంది. పుండుపై కారం చల్లిన చంద్రబాబు దాదాపు వందేళ్ల క్రితం ఆంగ్లేయుల హయాంలో జరిగిన భూముల సర్వేలో ఒక భూమిని ప్రభుత్వ భూమా? లేక ప్రైవేట్ భూమా? అనే విషయాన్ని సరిగా నిర్ధారణ చేయలేదు. రెవెన్యూ రికార్డుల్లో అంటే రీ సెటిల్మెంట్ రిజిస్టర్ (ఆర్ఎస్ఆర్)లో ఆ పట్టాదారుడి గడిలో చుక్కలు పెట్టి వదిలేశారు. బ్రిటీష్ వారి కాలంలో ఇలా చుక్కలు పెట్టి లెక్కలు తేల్చకుండా వదిలేసిన భూములను రైతులు దశాబ్దాలుగా సాగు చేసుకుంటూ వస్తున్నారు. తరతరాలుగా సాగు చేస్తున్నా రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరగని అధ్వాన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. రైతన్నల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే పరిష్కారం చూపాల్సిన చంద్రబాబు ప్రభుత్వం 2016లో పుండుమీద కారం చల్లినట్లుగా రిజిస్ట్రేషన్లు జరగకుండా ఒక మెమో ద్వారా 22–ఏ నిషేధిత జాబితాలో చేర్చి అన్నదాతల జీవితాలతో ఆడుకుంది. ఇలా అన్యాయానికి గురైన రైతులు తమ పిల్లల పెళ్లిళ్లు, వైద్యం, ఇతర అవసరాలకు భూమిని విక్రయించేందుకు వీలులేని పరిస్థితి ఏర్పడింది. చుక్కల భూముల యజమానులు నిషేధిత జాబితా నుంచి డీనోటిఫై చేయించుకునేందుకు గత ప్రభుత్వ హయాంలో పడ్డ కష్టాలను నా సుదీర్ఘ పాదయాత్రలో స్వయంగా చూశా. ఒక్క నెల్లూరు జిల్లాలోనే 43 వేల ఎకరాలు, పక్కనే ఉన్న ప్రకాశం జిల్లాలో మరో 37 వేల ఎకరాలు, కడప, అన్నమయ్య జిల్లాల్లో 22 వేల ఎకరాల చుక్కల భూములున్నాయి. చిత్తూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రదక్షిణలు, లంచాలతో పని లేకుండా... కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఒక్క రూపాయి కూడా ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పని లేకుండా కలెక్టర్ల ద్వారా ఈ భూములన్నీ గుర్తించాం. 22–ఏ నిషేధిత జాబితా నుంచి చుక్కల భూములకు విముక్తి కల్పిస్తూ రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేసి 2 లక్షల ఎకరాలకు చెందిన దాదాపు లక్ష రైతు కుటుంబాలకు మంచి చేస్తూ వారికి ఈ భూములపై పూర్తి హక్కులు కల్పిస్తున్నాం. షరతులు గల పట్టా భూములూ పరిష్కారం చుక్కల భూముల మాదిరిగానే సమస్యలు ఎదుర్కొంటున్న షరతులు గల పట్టా భూములు మరో 35 వేల ఎకరాలకు సంబంధించి 22 వేల మంది రైతులకు మేలు చేస్తూ ఆర్నెళ్ల క్రితమే అవనిగడ్డ నియోజకవర్గంలో అందించాం. నిషేధిత జాబితా నుంచి ఆ భూములను తొలగిస్తూ ఆ ప్రాంత రైతులందరికి మంచి చేశాం. ఇది కూడా మీ బిడ్డ హయాంలోనే జరిగింది. భూ వివాదాలు శాశ్వతంగా పరిష్కారం ఎప్పుడో వందేళ్ల నాటి భూముల సర్వే తర్వాత రికార్డులు అప్డేట్ కాకపోవడంతో గ్రామాల్లో నెలకొన్న విభేదాలు, వివాదాలను శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంతో దేశంలో ఎక్కడా జరగని విధంగా మన రాష్ట్రంలో సమగ్ర సర్వే చేపట్టాం. 17,476 రెవెన్యూ గ్రామాలకి సంబంధించి ప్రతి గ్రామంలో సర్వే చేస్తూ రైతులందరికి హక్కు పత్రాలిచ్చే కార్యక్రమానికి నాంది పలికాం. ఇప్పటికే రెండు వేల రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తి చేసి హక్కు పత్రాలిచ్చే కార్యక్రమం వేగంగా జరుగుతోంది. సుమారు 7 లక్షలకు పైగా భూహక్కు పత్రాలను అప్డేట్ చేసి రైతులకు అందించాం. సరిహద్దు రాళ్లను కూడా ఉచితంగా పాతే కార్యక్రమాన్ని రెండు వేల గ్రామాల్లో మే 20 నాటికి పూర్తి చేస్తాం. ఆ తర్వాత మే నెలాఖరు నుంచి మరో 2 వేల గ్రామాల చొప్పున మూడు నెలలకు ఒకసారి రెండు వేల గ్రామాల్లో పూర్తి చేసుకుంటూ వెళతాం. మనసున్న ప్రభుత్వంగా, రైతులకు మంచి జరగాలన్న ఆలోచనతో మనస్ఫూర్తిగా ఇవన్నీ చేస్తున్నాం. రైతు బాంధవుల వేషం.. రావణ సైన్యం నాలుగేళ్లుగా ప్రతి అడుగులో రైతులకు మంచి జరగాలన్న తపన, తాపత్రయంతో అడుగులు వేశాం. రైతులను చేయి పట్టుకుని నడిపించే విధంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం. వైఎస్సార్ రైతు భరోసా, ఉచిత పంటల బీమా, పగటి పూటే 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్, సీజన్ ముగియక ముందే అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ, భూరక్ష, ఈ–క్రాప్‌తోపాటు దళారులు లేకుండా ఆర్బీకేల స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నాం. పంట నష్టపోయి¯నా ధాన్యం తడిసినా, రంగు మారినా కొనుగోలు చేస్తామని చెప్పాం. కేంద్రం ఎంఎస్పీ ఇవ్వని పంటలకు సైతం కనీస మద్దతు ధర ప్రకటించి ఆర్బీకేల్లో బోర్డులు ఏర్పాటు చేశాం. రైతన్నల కోసం మన ప్రభుత్వం ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే కొందరు ఓర్వలేకపోతున్నారు. ఏటా కనీసం 300 మండలాల్లో కరువు తాండవిస్తున్నా రైతులను గాలికి వదిలేసిన చంద్రబాబు, ఆయనకు మద్దతు ఇస్తున్న దత్తపుత్రుడు ఇవాళ రైతు బాంధవుల వేషంలో రోడెక్కారు. వారికి మద్దతుగా రావణ సైన్యం ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 వీళ్లంతా రామాయణంలో శూర్పణక మాదిరిగా రైతులపై దొంగ ప్రేమ నటిస్తున్నారు. ప్యాకేజీలు.. పొలిటికల్ యాక్షన్ అక్షరాలా రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలను తొలి సంతకంతో మాఫీ చేస్తానన్న చంద్రబాబు రైతులను నమ్మించి దగా చేశాడు. రుణమాఫీ దేవుడెరుగు.. చివరకు సున్నా వడ్డీ కూడా ఎగ్గొట్టిన ఘనుడు ఆయనే. వ్యవసాయం దండగన్న చంద్రబాబు ఇప్పుడు ఎన్నికల భయంతో రోడ్డెక్కుతున్నారు. చంద్రబాబుకి డేట్లు ఇచ్చి ఆయన స్క్రిప్ట్ ప్రకారం డైలాగులు చెబుతూ పొలిటికల్ యాక్షన్ చేస్తూ ప్యాకేజీలు తీసుకుని నటిస్తున్న స్టార్ ఒకవైపు.. వారి డ్రామాలను రక్తి కట్టించేందుకు ఎల్లో మీడియా మరోవైపు పోటీ పడుతున్నాయి. ఎవరి డ్రామా వారు ఆడుతున్నారు. నాలుగేళ్లుగా కొన్నదెవరు మరి? ప్రతి రైతన్నకూ చెబుతున్నా. వీళ్ల డ్రామాలను నమ్మొద్దు. తాము వస్తేగానీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని చెబుతున్నారు. మరి నాలుగేళ్లుగా కొన్నది ఎవరు? రైతన్నలకు తోడుగా జగన్ ప్రభుత్వం కనిపిస్తున్నా వక్రీకరిస్తున్నారు. దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా ఏకంగా రూ.2.10 లక్షల కోట్లు డీబీటీ ద్వారా నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేశాం. ఎక్కడా లంచాలు, వివక్ష లేదు. చివరికి మీ జగనన్నకు ఓటు వేయకపోయినా సరే.. అర్హత ఉంటే చాలు తోడుగా నిలిచాడు. ప్రతి పేదవాడికి తోడుగా ఉంటూ అడుగులు పడుతున్నాయి. సంక్షేమ పథకాలు దండగట! పేదలకు జగన్ ఉచితంగా డబ్బులు పంచిపెడుతున్నారని, ఇదంతా బాధ్యతారాహిత్యమంటూ టీడీపీ, గజదొంగల ముఠా చేస్తున్న ప్రచారాలను గమనించండి. వారి టీవీ డిబేట్లలోనూ ఇవే వార్తలు చూస్తున్నాం. గతంలో ఇదే ఈనాడు, ఎల్లో మీడియాలో సంక్షేమ పథకాలను రద్దు చేయాలని ఇద్దరు మాజీ ఐఏఎస్‌లతో చెప్పించారు. చంద్రబాబు మాటగా సంక్షేమ పథకాలు దండగని మొదటి పేజీలో అచ్చు వేసి చెప్పారు. అంటే చంద్రబాబుకు ఓటు వేయడమంటే ఇక పేదలెవరికీ పథకాలు రావనే దాని అర్థం. అందరూ దీనిపై ఆలోచన చేయండి. కులాల యుద్ధం కాదు.. క్లాస్‌వార్ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు. క్లాస్ వార్ జరుగుతోంది. పేదవాడు ఒకవైపు, పెత్తందారీ మనస్తత్వం ఉన్నవారు మరోవైపున యుద్ధం జరుగుతోంది. పేదల ప్రతినిధిగా ఇక్కడ మీ జగన్ ఉన్నాడు. పేదరికం నుంచి ఎలా బయటకు తేవాలని మీ బిడ్డ అడుగులు వేస్తున్నాడు. అందుకే ప్రతి గ్రామంలో సచివాలయాలు కనిపిస్తున్నాయి. ప్రతి 50 ఇళ్లకు వలంటీర్ కనిపిస్తాడు. ఎక్కడా లంచాలు, వివక్ష లేని పాలన కనిపిస్తోంది. మన పిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లు కావాలి. నైపుణ్యం ఉన్న వ్యక్తులుగా మారాలని చదువులపై పెట్టుబడులు పెడుతున్నాం. హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్‌లో మన రాష్ట్రం దేశానికే దిక్సూచి అవుతుంది. నైపుణ్యం ఉన్నవారు లేక జర్మనీ ఇబ్బంది పడుతోందని ఓ ఆర్టికల్ చదివా. నిపుణులైన మానవ వనరులు ఉండాలంటే ఒక విత్తనం పడి వృక్షం కావాలి. మీరంతా ఒక్కటే గుర్తు పెట్టుకోండి. మీ ఇంట్లో మంచి జరిగిందా..? లేదా..? అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మంచి జరిగితే మీ బిడ్డకు మీరే సైన్యంగా నిలబడండి. డీబార్ దానయ్యకు కోటు తొడిగి..! రెండు రోజుల క్రితం ఈనాడులో జీవీ రావు అనే వ్యక్తి ఇంటర్వ్యూ ప్రచురించారు. ఆ పెద్ద మనిషి ఎవరని ఆరా తీస్తే.. చార్టెడ్ అకౌంటెంట్ (సీఏ)గా ఆయనకు ప్రాక్టీసు రద్దైంది. చార్టెడ్ అకౌంటెన్సీ వారు ఆయన సర్టిఫికెట్‌ను రద్దు చేసి డీబార్ చేశారు. అలాంటి డీబార్ అయిన దానయ్యను పట్టుకుని ఓ కోటు తొడిగి ఆర్థిక నిపుణుడిగా చూపిస్తూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఉండడానికి వీల్లేదని ఆయనతో చెప్పిస్తారు. అది ఈనాడు రాస్తుంది. ఎల్లో మీడియా డిబేట్లు పెడుతుంది. జగన్ మాదిరిగా పరిపాలన చేస్తే రాష్ట్రం దివాళా తీస్తుందట.. అప్పులు పాలవుతుందని చెప్పిస్తారు. అబద్ధాలు చెప్పించడానికి వీరంతా అలా వాడుకుంటారు. కావలి కరువుతీరేలా వరాలు! కావలి నియోజకవర్గానికి సంబంధించి టౌన్లో ట్యాంకు కెపాసిటీ పెంచి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేస్తే మంచి జరుగుతుందని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కోరారు. అందుకు రూ.35 కోట్లు మంజూరు చేస్తున్నాం. కావలికి హైలెవల్ కెనాల్ నుంచి నీళ్లు రావడంలో ఇబ్బందులు ఉన్నందున సంగం బ్యారేజీ నుంచి లింక్ కెనాల్‌కు రూ.20 కోట్లు అడిగారు. అది కూడా మంజూరు చేస్తున్నాం. రూ.56 కోట్లతో కావలి ట్రంక్ రోడ్డు పనులు జరుగుతున్నాయి. మరో రూ.15 కోట్లు అదనంగా మంజూరు చేస్తున్నాం. కావలి మున్సిపాలిటీ 16 వార్డులో ఇందిరమ్మ కాలనీలో మౌలిక సదుపాయాలకు మరో రూ.80 కోట్లు ఖర్చు చేయడానికి శ్రీకారం చుట్టబోతున్నాం. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కోట్లుపెట్టి కట్టిన పోలీస్ కమాండ్ కంట్రోల్ రూం ఎందుకు?: కిషన్ రెడ్డి
సాక్షి, వికారాబాద్: కేసీఆర్ సర్కార్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం భూ ఆక్రమణలకు పాల్పడుతోందన్నారు కిషన్ రెడ్డి. రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేసి విలువైన భూములను బినామీ రియల్ ఎస్టేట్ కంపెనీలకు దోచిపెట్టడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ధరణి పోర్టల్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాగా, కిషన్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రైతుల సమస్యలను పరిష్కరిస్తామని కేసీఆర్ ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చారు. ధరణితో లక్షలాది మంది రైతులు, భూ యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోర్టల్ కారణంగా చట్టబద్ధమైన లక్షల ఎకరాల భూమి ప్రొబేటరీ ల్యాండ్‌గా ప్రకటించడం వల్ల చాలా మంది కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ పోర్టల్ ను అడ్డుపెట్టుకుని మధ్యవర్తులు, దళారీలను బీఆర్ఎస్ నేతలు ప్రోత్సహిస్తున్నారు. మరో ప్రత్యామ్నాయం లేక దళారీల ఉచ్చులో పడి సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. హైకోర్టును ఆశ్రయించడం తప్ప ఎవరిని కలిస్తే ఈ సమస్య పరిష్కారమవుతుందనేది తెలియడంలేదు గతంలో గతంలో కొన్ని భూ సంబంధిత సమస్యలు ఉంటే ధరణి పోర్టల్ వల్ల ఇవి భారీగా పెరిగిపోయాయి. పాస్ పుస్తకంలో తప్పులను సరిదిద్దేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ధరణిలో ఏదైనా మార్పులు చేర్పులు చేయాలన్నా అది ప్రగతిభవన్ నుంచే చేపట్టాలి. సాక్షాత్తు ప్రభుత్వమే భూ ఆక్రమణలకు పాల్పడుతోంది. ఒకప్పుడు గ్రామ స్థాయిలోనే సమస్యలు పరిష్కారమయ్యేవి.. కానీ నేడు ప్రగతిభవన్ వరకు అది వచ్చిందంటే ప్రభుత్వం ఎంత ఆక్రమణలకు పాల్పడుతుందో అర్థం చేసుకోవచ్చు. రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేసి విలువైన భూములను బినామీ రియల్ ఎస్టేట్ కంపెనీలకు దోచిపెట్టడం వాస్తవం కాదా?. కొందరు ప్రజాప్రతినిధులు, రియల్ వ్యాపారులు కుమ్మక్కై ప్రజల నుంచి అక్రమంగా స్వాధీనం చేసుకున్న భూములకు విక్రయాలు చేపడుతున్నారు. ధరణిలో తప్పొప్పుల సవరణ కూడా జరగకపోవడంతో ప్రభుత్వ పథకాలు, ఇతర స్కీమ్ లు సామాన్యులకు చేరడం లేదు. వాటిని బీఆర్ఎస్ నేతలు గద్దల్లా తన్నుకుపోతున్నారు బ్రోకర్లను పెంచి పోషిస్తున్నట్లుగా ధరణి పోర్టల్ ఉందని న్యాయస్థానాలు కూడా చెప్పాయి. రైతులు తమ సమస్యలు పరిష్కరించాలని అందించిన దరఖాస్తులు ఏమయ్యాయి? ధరణి బాగానే ఉంటే కేబినెట్ సబ్ కమిటీ ఎందుకు వేసినట్లు కేసీఆర్. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టులో ఏముంది? బయటపెట్టాలి. ధరణిలో భూ సమస్యలపై ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎన్ని పరిష్కరించారో బయటపెట్టండి. ప్రగతిభవన్‌లో అవినీతి, అక్రమాలకు ఆలోచన చేసే వ్యక్తులు ఇచ్చే సలహాలను అమలుచేస్తున్నారు తప్ప.. కేంద్రం ప్రవేశపెడుతున్న పథకాలను అమలుచేయడం లేదు. ఒవైసీ గతంలోనే చెప్పాడు.. కారు స్టీరింగ్ నా చేతిలోనే ఉందని. తాను బ్రేకులు వేస్తేనే ఆగుతుంది.. తాను యాక్సిలరేటర్ ఇస్తేనే ముందుకు పోతుందని చెప్పాడు. రాజాసింగ్ సెక్రటేరియట్‌కు వెళ్తే ఎందుకు అడ్డుకున్నారు?. ఒక ఎమ్మెల్యేను అడ్డుకోవాల్సిన దుస్థితి ఎందుకొచ్చింది?. జర్నలిస్టులు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాల నేతలు కూడా సెక్రటేరియట్‌కు వెళ్లేందుకు అనుమతిలేదు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి వారినే లోనికి పంపించడం లేదు. పాతబస్తీలోకి ఓ పోలీస్, ఓ ప్రభుత్వ అధికారి కానీ ధైర్యంగా వెళ్లే పరిస్థితి కనిపించడంలేదు. ప్రభుత్వం ఎంతసేపు ఫోన్లు ట్యాప్ చేయడం, ధర్నాలు చేసేవారిని అడ్డుకోవడం వంటి పనులు మాత్రమే చేస్తోంది. తెలంగాణ పోలీసుల చాలా ధైర్యవంతులు. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలి. కానీ, తెలంగాణ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది. హైదరాబాద్‌లో రూ.కోట్లతో కట్టిన కమాండ్ కంట్రోల్ రూం ఏం చేస్తోంది. పోలీసులకు ప్రభుత్వం స్వేచ్చ ఇవ్వాలి అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: నా ప్రాణానికి ముప్పు.. మోదీ, అమిత్‌షాకు ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖలు -
‘ధరణి’ దంగల్! రెవెన్యూ యంత్రాంగం, కలెక్టర్ల మధ్య ‘కోల్డ్ వార్’
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ కారణంగా రాష్ట్రంలోని రెవెన్యూ యంత్రాంగం, కలెక్టర్ల మధ్య ‘కోల్డ్ వార్’నడుస్తోంది. పోర్టల్ అందుబాటులో వచ్చినప్పటి నుంచి భూసమస్యల తుది పరిష్కార అధికారాన్ని ప్రభుత్వం కలెక్టర్లకు కట్టబెట్టినా.. సదరు పరిష్కార ఉత్తర్వులను మాత్రం తహసీల్దార్ల డిజిటల్ సంతకాలతో జారీ చేస్తున్నారు. దీనిపై తహసీల్దార్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్లు విచక్షణ మేరకు తీసుకునే నిర్ణయాలకు తమ డిజిటల్ సంతకాలు పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్తులో ఏదైనా ఇబ్బంది తలెత్తితే తాము బాధ్యులం కావాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని రెవెన్యూ సంఘాలు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా స్పందన లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లను ప్రస్తావిస్తూ ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు చేసిన వ్యాఖ్యలు ఈ ఆందోళనను మరింత తీవ్రతరం చేశాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏం చేయాలి? సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి తేవాలి? అన్న దానిపై రెవెన్యూ వర్గాల్లో తర్జన భర్జన జరుగుతోంది. నిర్ణయం కలెక్టర్‌ది.. సంతకం తహసీల్దార్‌ది ధరణి పోర్టల్‌లో వివరాల నమోదులో తప్పులతో లక్షల కొద్దీ భూసంబంధిత సమస్యలు తలెత్తాయి. వాటి పరిష్కారం కోసం రైతులు ధరణి పోర్టల్‌లో దరఖాస్తు చేసుకుంటే.. అది నేరుగా జిల్లా కలెక్టర్/ కలెక్టర్ కార్యాలయంలోని ధరణి ఆపరేటర్ లాగిన్‌కు వెళుతుంది. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఈ దరఖాస్తును ఆన్లైన్లోనే తహసీల్దార్‌కు పంపుతుంది. తహసీల్దార్లు దానిపై విచారణ జరిపి.. ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో రెండు నివేదికలు తయారుచేసి ఆర్డీవో కార్యాలయానికి పంపుతారు. ఆర్డీవో కార్యాలయంలో పరిశీలన తర్వాత దరఖాస్తులు ఆన్లైన్లోనే తిరిగి కలెక్టర్ లాగిన్‌కు చేరుతాయి. తహసీల్దార్లు ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా, ఆర్డీవో అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని సదరు దరఖాస్తును అంగీకరించాలా లేదా తిరస్కరించాలా అన్నదానిపై కలెక్టర్లు నిర్ణయం తీసుకుంటారు. అయితే ఈ నిర్ణయం తీసుకునే సమయంలో కేవలం బయోమెట్రిక్, డిజిటల్ కీ మాత్రమే కలెక్టర్‌ది వాడుతున్నారు. నిర్ణయం తీసుకున్న తర్వాత ఎలాంటి ప్రొసీడింగ్స్ రావడం లేదు. కేవలం కలెక్టర్లు ఆమోదించినదీ, తిరస్కరించినదీ మాత్రమే ఆన్లైన్లో కనిపిస్తుంది. ఈ ఆన్లైన్ ధ్రువీకరణపై తహసీల్దార్ డిజిటల్ సంతకం వస్తోంది. ఇక్కడ సమస్య ఏమిటంటే.. తహసీల్దార్ విచారణ పూర్తయి నివేదిక పంపాక కూడా పలు దరఖాస్తుల విషయంలో జిల్లాల కలెక్టర్లపై రాజకీయ, ఇతర ఒత్తిడులు వస్తున్నాయి. దీంతో తహసీల్దార్ల నివేదిక ఎలా ఉన్నా కలెక్టర్లు ధ్రువీకరిస్తున్నారు. మొత్తం దరఖాస్తుల్లో 20 శాతానికిపైగా దరఖాస్తుల్లో తహసీల్దార్ల అభిప్రాయానికి, నివేదికకు భిన్నంగా కలెక్టర్లు నిర్ణయాలు తీసుకుంటున్నట్టు అంచనా. ఏదైనా సమస్య వస్తే బాధ్యులెవరు? తమ అభిప్రాయాలకు భిన్నంగా జారీ అయ్యే ధరణి ఉత్తర్వులపై.. తమ డిజిటల్ సంతకాలే ఉండటంపై తహసీల్దార్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. రాజకీయ, ఇతర కారణాలతో భూముల ఉత్తర్వులపై ఫిర్యాదులు వస్తే.. సదరు నిర్ణయాలపై తమ సంతకాలు ఉంటాయని, తాము కూడా బాధ్యులం కావాల్సి వస్తుందని తహసీల్దార్లు వాపోతున్నారు. కలెక్టర్లతోపాటు తాము కూడా బదిలీ కావడమో, విచారణ ఎదుర్కోవాల్సి రావడమో జరిగితే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. ఏదైనా భూసమస్య కోర్టుకు వెళితే అక్కడ తాము సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని, లేకుంటే తమపై చర్యలు తప్పవని అంటున్నారు. ఈ క్రమంలో ధరణి ఉత్తర్వులపై జిల్లా కలెక్టర్ల సంతకాలే ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ చట్టాల ప్రకారం సంతకంతో సమస్యలు పరిష్కరించే అధికారం జిల్లా కలెక్టర్లకు లేనందున.. భూసమస్యల పరిష్కార విచక్షణాధికారం తమకే ఇవ్వాలని కోరుతున్నారు. అలాగైతే నిర్ణయాలకు తామే బాధ్యత వహిస్తామని చెప్తున్నారు. ట్రెసాపై ఒత్తిడి ‘ధరణి’సంతకాల విషయమై వారం, పది రోజులుగా రెవెన్యూ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. దీనిపై ప్రభుత్వం స్పందించే పరిస్థితి లేకుంటే హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయాలని, లేదంటే కొందరు తహసీల్దార్లు కలిసి పిటిషన్ వేయాలనే అభిప్రాయం ఆ చర్చల్లో వ్యక్తమవుతోంది. కోర్టుకు వెళ్లడం కుదరకపోతే మానవ హక్కుల సంఘం (హెచ్చార్సీ), లోకాయుక్త వంటి సంస్థలను ఆశ్రయించాలని భావిస్తున్నారు. మరోవైపు తమ ఆందోళనను బహిరంగంగా ప్రభుత్వానికి తెలియపర్చాలని, ఇందుకోసం జిల్లాల్లో కలెక్టర్లను కలిసి వినతిపత్రాలు అందజేయాలనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. అవసరమైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు విధుల బహిష్కరణకు పిలుపునివ్వాలని ‘తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా)’పై తహసీల్దార్లు ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. -
AP: భూ వివాదాలకు చెక్
సాక్షి, రాజమహేంద్రవరం: భూ వివాదాల శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ‘వైఎస్సార్ జగనన్న భూహక్కు, భూరక్ష’ పథకం కింద మూడు దశల్లో భూముల సమగ్ర సర్వే చేపట్టిన విషయం తెలిసిందే. తద్వారా భూ సంబంధిత సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా తొలి దశ సర్వే ప్రక్రియను అధికార యంత్రాంగం చేపట్టింది. అప్పట్లో జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించి, శాశ్వత భూహక్కు పత్రాలు సైతం పంపిణీ చేసింది. ప్రస్తుతం రెండో దశ సర్వే జిల్లాలో యుద్ధప్రాతిపదికన జరుగుతోంది. రెండో దశ 50 శాతం పూర్తి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 272 గ్రామాల పరిధిలోని 16,52,706 ఎకరాల్లో వివిధ దశల్లో రీసర్వే చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. తొలి దశలో 44 గ్రామాల్లోని 64,336 ఎకరాల్లో సర్వే పూర్తి చేశారు. రెండో దశలో జిల్లా వ్యాప్తంగా 17 గ్రామాలను ఎంపిక చేశారు. మొత్తం 47,189.2 ఎకరాల రీసర్వేకు ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే 10 గ్రామాల్లోని 22,223.91 ఎకరాల్లో సర్వే పూర్తి చేసి, సుమారు 50 శాతం లక్ష్యాన్ని చేరుకున్నారు. మిగిలిన 7 గ్రామాల పరిధిలోని 24,965.78 ఎకరాల్లో సైతం త్వరితగతిన పూర్తి చేయనున్నారు. ఈ నెలాఖరుకు లక్ష్యాన్ని అధిగమించాల్సి ఉండగా.. కొన్ని సమస్యల కారణంగా మార్చి 10వ తేదీ నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. పకడ్బందీగా.. రెండో దశ రీసర్వే పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ భూములు, నివాస గృహాలు, వీధులు, ప్రైవేటు భూములు, పరిశ్రమలు.. ఇలా గ్రామానికి చెందిన మొత్తం విస్తీర్ణాన్ని సర్వే చేస్తున్నారు. తొలుత గ్రౌండ్ ట్రూతింగ్, గ్రౌండ్ వాలిడేషన్ పూర్తి చేస్తున్నారు. సర్వే చేస్తున్న గ్రామానికి పొరుగున ఉన్న వీఆర్ఓలు, గ్రామ సర్వేయర్ల సేవలను వినియోగించుకుంటున్నారు. ప్రతి గట్టూ తిరిగి సరిహద్దులు నిర్ధారిస్తున్నారు. ఫలితంగా సమయం అవుతోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం రీసర్వేలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. కంటిన్యూస్ ఆపరేటింగ్ రిఫరింగ్ స్టేషన్ నెట్వర్క్ సాయంతో ఈ ప్రక్రియ సాగుతోంది. చిన్న వాటి నుంచి పెద్ద పెద్ద కమతాల వరకూ ప్రతీది నమోదు చేస్తున్నారు. డ్రోన్లను రంగంలోకి దింపి సర్వేలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నారు. మొదటి రెండు దశల్లో ఇప్పటి వరకూ 1,474.629 చదరపు కిలోమీటర్ల మేర డ్రోన్లతో సర్వే నిర్వహించారు. హద్దు రాళ్లు సర్వే పూర్తయిన రెవెన్యూ గ్రామాల పరిధిలో ఫ్రీజోన్ యాక్టివిటీస్ కింద భూముల హద్దులకు సంప్రదాయ పద్ధతిలో సున్నం మార్కింగ్ చేపట్టారు. రాళ్లను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించారు. రెండో దశలో 15,113 రాళ్లు పాతాల్సి ఉండగా.. ఇప్పటి వరకూ 5,522 రాళ్లు పాతారు. కొలిక్కి వస్తున్న వివాదాలు ఈ సర్వే పుణ్యమా అని దశాబ్ద కాలం నాటి భూ వివాదాలు ఓ కొలిక్కి వస్తున్నాయి. దశాబ్దం క్రితం నిర్వహించిన సర్వేలో 5 శాతం అలవెన్సు అమలు చేశారు. అప్పట్లో చైన్లతో కొలతలు వేయడంతో అటూ ఇటూ భూ విస్తీర్ణంలో 5 % సరిహద్దులు నిర్ణయించారు. ఈ క్రమంలో రికార్డుల్లో ఉన్న విస్తీర్ణానికి, భూమి మీద ఉన్న విస్తీర్ణానికి తేడాలు రావడంతో కొందరు రైతులు వాగ్వాదాలకు దిగుతున్నారు. 1906లో నిర్వహించిన సర్వే ఆధారంగా ప్రస్తుతం భూ సంబంధిత లావాదేవీలు కొనసాగిస్తున్నారు. ఒకే సర్వే నంబరుపై పలుమార్లు లావాదేవీలు జరిగాయి. వారసులు పంచుకోవడం, బహుమతిగా ఇవ్వడం, క్రయవిక్రయాలు జరిగినా అందుకు అనుగుణంగా భూమి మీద సబ్ డివిజన్ జరగకపోవడంతో తరచూ సమస్యలు తలెత్తుతున్నాయి. పత్రాల మీద లావాదేవీలు జరిగినా క్షేత్ర స్థాయిలో సర్వే చేయకుండానే నోషనల్ ఖాతాల వల్ల అనేక సమస్యలు మొదలయ్యాయి. తప్పుడు సర్వే నంబర్లతో భూములు రిజిస్ట్రేషన్ కావడం, రిజిస్ట్రేషన్ అయిన భూమికి, వాస్తవంగా భూమి మీద ఉన్న విస్తీర్ణానికి తేడాలు ఉండటం, నిషేధిత భూములు రిజిస్ట్రేషన్ చేయడం వంటి కారణాలతో రెవెన్యూ సమస్యలు నిత్యకృతమయ్యాయి. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం రీసర్వేను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాం. వారికి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నాం. క్షేత్ర స్థాయిలో స్వయంగా పర్యటించి, ప్రక్రియ పర్యవేక్షిస్తున్నా. ఎలాంటి లోటుపాట్లకూ తావు లేకుండా పకడ్బందీగా సర్వే చేస్తున్నాం. రెండో దశలో ఇప్పటికే 50 శాతం లక్ష్యాలను అధిగమించాం. మిగిలిన వాటిని సైతం త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నాం. నిజమైన హక్కుదారుకు న్యాయం చేయాలన్నదే లక్ష్యంగా పని చేస్తున్నాం. – ఎన్.తేజ్‌భరత్, జాయింట్ కలెక్టర్ లక్ష్యాలను అధిగమిస్తాం రెండో దశ రీసర్వే ప్రక్రియ వేగంగా చేపడుతున్నాం. వివాదాల పరిష్కారానికి సలహాలు ఇస్తున్నాం. ఇప్పటికే జిల్లాలోని 22,223.91 ఎకరాల్లో పూర్తి చేశాం. మిగిలినది సైతం త్వరలోనే పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. – పి.లక్ష్మణరావు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ జిల్లా అధికారి -
కామారెడ్డి ‘మాస్టర్‌ప్లాన్’ వెనక్కి!
సాక్షి, కామారెడ్డి/కామారెడ్డి టౌన్: ‘భూమిని మింగే మాస్టర్ ప్లాన్ మాకొద్దు’అంటూ నెలన్నర కాలంగా రైతు ఐక్యకార్యాచరణ కమిటీ చేస్తున్న పోరాటం ఫలించింది. కామారెడ్డి మున్సిపల్ పాలకవర్గం మాస్టర్‌ప్లాన్ రద్దుకు ముందుకు వచ్చింది. ఈ నెల 20న మున్సిపల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ముసాయిదా రద్దు కోరుతూ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపనున్నట్టు మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి గురువారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. దీంతో గడచిన నెలన్నర రోజులుగా జరుగుతున్న ఆందోళనలకు ఫుల్స్టాప్ పడనుందని రైతులు భావిస్తున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి రైతు ఐక్యకార్యాచరణ కమిటీ అనేక రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు, బంద్‌లు నిర్వహించింది. విలీన గ్రామాల కౌన్సిలర్లు తొమ్మిది మంది రాజీనామా చేయాలని గురువారం సాయంత్రం వరకు డెడ్‌లైన్ విధించింది. ఈ క్రమంలో బీజేపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు తమ రాజీనామా లేఖలను మున్సిపల్ కమషనర్‌కు అందించారు. దీంతో అధికార పార్టీ కౌన్సిలర్లపై ఒత్తిడి పెరిగింది. ముందు నుయ్యి, వెనక గొయ్యిలా వారి పరిస్థితి తయారైంది. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఇంటిని ముట్టడించాలని పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు చర్చించి ఈ నెల 20న మున్సిపల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ముసాయిదా రద్దు కోరుతూ తీర్మానించాలని నిర్ణయించారు. ఎట్టకేలకు రైతుల పోరాటాల ఫలితంగా బల్దియా పాలకవర్గం మాస్టర్‌ప్లాన్ ముసాయిదా రద్దుకు సిద్ధమైంది. -
మరో రైతు ఆత్మహత్యాయత్నం
సాక్షి, కామారెడ్డి: తన భూమిని రిక్రియేషన్ జోన్లో కలిపారన్న ఆవేదనతో మంగళవారం ఓ రైతు గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కామారెడ్డి కొత్త మాస్టర్‌ప్లాన్‌లో పంట భూములను ఇండస్ట్రియల్, గ్రీన్, రిక్రియేషన్ జోన్ల కింద పేర్కొనడంపై రైతాంగం నెలన్నర రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం రామేశ్వర్పల్లికి చెందిన రైతు మర్రిపల్లి బాలక్రిష్ణ గడ్డిమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అతన్ని వెంటనే జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించగా, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నాడు. తనకున్న ఎకరం భూమి రిక్రియేషన్ జోన్‌లోపోతే పిల్లలను ఎలా పెంచాలి, పెళ్లిళ్లు ఎలా చేయాలని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు, మాస్టర్‌ప్లాన్‌ను రద్దు చేయాలంటూ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో 8గ్రామాలకు చెందిన రైతులు కలెక్టరేట్ ముట్టడి, కుటుంబ సభ్యులతో ర్యాలీ వంటి నిరసన వంటి కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఆయా గ్రామాలకు చెందిన 9 మంది కౌన్సిలర్లు ఈనెల 19లోపు రాజీనామా చేయాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ డెడ్‌లైన్ విధించింది. దీంతో బీజేపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు రాజీనామా లేఖలను రైతు జేఏసీకి అందించారు. -
పరిహారం కోసం రైతు ఆత్మహత్యాయత్నం
భూపాలపల్లి: సింగరేణి ఓపెన్‌కాస్ట్ ఏర్పాటులో ఉన్న భూమి పోయింది. పరిహారం కోసం ఆఫీసుల చుట్టూ ఎంత తిరిగినా పూర్తిస్థాయిలో అందలేదు. దీంతో విసిగివేసారిన ఓ రైతు కలెక్టరేట్లో ప్రజావాణి వద్దకు వచ్చి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. సోమవారం కలెక్టరేట్ పక్కన ఉన్న ఇల్లందు క్లబ్‌హౌస్‌లోని మీటింగ్ హాల్లో ప్రజావాణి కార్యక్రమం జరుగుతోంది. కలెక్టర్ భవేష్ మిశ్రా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలో గణపురం మండలం మాధవరావుపల్లికి చెందిన జిట్టబోయిన సాంబయ్య అనే రైతు క్లబ్‌హౌస్ బయట క్రిమిసంహారక మందు తాగి పడిపోయాడు. అక్కడున్న వారు అతడిని లేపి ఏమైందని అడగ్గా.. తనకు అన్యాయం జరిగిందని, ఎవరూ పట్టించుకోకపోవడంతో పురుగుమందు తాగానని చెప్పాడు. మాధవరావుపల్లిలో సర్వే నంబర్ 318/92లో తనకు ఎకరన్నర భూమిలో 500 టేకు చెట్లు ఉండేవని, 2019లో సింగరేణి సంస్థ ఓపెన్‌కాస్ట్–3 నిర్మాణంలో భాగంగా ఆ భూమిని సేకరించిందన్నాడు. ఎకరన్నర భూమికి గాను ఎకరాకే పరిహారం వచ్చిందని, మిగిలిన 20 గుంటల పరిహారం ఓ దళారి పేరుపై వచ్చిందని వాపోయాడు. అలాగే, 78 చెట్లకు కూడా పరిహారం రాలేదన్నాడు. నష్టపరిహారం కోసం మూడేళ్లుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నానని చెప్పాడు. గతంలో గణపురం తహసీల్దార్‌ను ప్రశ్నిస్తే.. విధులకు ఆటంకం కలిగించానని పోలీసులకు ఫిర్యాదు చేశారని, పది రోజులు జైల్లో ఉండి వచ్చానని సాంబయ్య పేర్కొన్నాడు. రైతు ఆత్మహత్యాయత్నం విషయం తెలుసుకున్న కలెక్టర్ భవేష్ మిశ్రా వెంటనే సిబ్బందిని పంపి రైతును ఆస్పత్రిలో చేర్పించారు. సాంబయ్య ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించారు. -
మా భూములకూ పట్టాలు ఇవ్వండి
సాక్షి, మహబూబాబాద్: ‘తాతలు, తండ్రుల కాలం నుంచి అడవి బిడ్డలతో కలసి బతుకుతున్నాం. అడవిలోనే పుట్టాం.. ఇక్కడే పెరిగాం. మేం సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వకపోతే ఎలా? మేము ఎక్కడికి వెళ్లాలి.. ఎలా బతకాలి’అంటూ మహబూబాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల గిరిజనేతర రైతులు తమ గోడు వినిపించారు. తమకు పట్టాలు ఇచ్చేవరకు ఉద్యమాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. తాము సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ డేవిడ్‌కు గురువారం వినతిపత్రం సమర్పించారు.ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించిన నేపథ్యంలో గిరిజనేతరులకు పట్టా లు ఇచ్చేందుకు సాధ్యం కాని నిబంధనలు విధించింది. దీంతో తమకు పట్టాలు వచ్చే అవకాశం లేదని భావించిన గంగారం, కొత్తగూడ, గూడూరు, బయ్యారం ఏజెన్సీ మండలాలకు చెందిన రైతుల ఆధ్వర్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో బంద్ పాటించారు. అనంతరం ట్రాక్టర్లు, ఆటోల ద్వారా పెద్ద ఎత్తున గిరిజనేతరులు మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే కలెక్టరేట్‌కు వెళ్తున్న ర్యాలీని మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీలో పాల్గొన్న ముఖ్య నాయకులను తమ వాహనాల్లో కలెక్టర్ కార్యాలయానికి తీసుకెళ్లి అక్కడ అదనపు కలెక్టర్ డేవిడ్‌కు వినతిపత్రం అందజేసేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం తిరిగి వారిని ర్యాలీ వద్దకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గిరిజనులతో సమానంగా తమకు కూడా పట్టాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పీరయ్య, శ్రీనివాస్‌రెడ్డి, చల్ల నారాయణరెడ్డి, కొమ్మెనబోయిన వేణు, ఖాసీం, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.