‘ధరణి’ దంగల్‌! రెవెన్యూ యంత్రాంగం, కలెక్టర్ల మధ్య ‘కోల్డ్‌ వార్‌’ | Agitation among Tehsildars regarding Land Settlement Orders | Sakshi
Sakshi News home page

‘ధరణి’ దంగల్‌! రెవెన్యూ యంత్రాంగం, కలెక్టర్ల మధ్య ‘కోల్డ్‌ వార్‌’.. ఎందుకీ పరిస్థితి?

Published Fri, Feb 24 2023 2:08 AM | Last Updated on Fri, Feb 24 2023 9:20 AM

Agitation among Tehsildars regarding Land Settlement Orders - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ధరణి పోర్టల్‌ కారణంగా రాష్ట్రంలోని రెవెన్యూ యంత్రాంగం, కలెక్టర్ల మధ్య ‘కోల్డ్‌ వార్‌’నడుస్తోంది. పోర్టల్‌ అందుబాటులో వచ్చినప్పటి నుంచి భూసమస్యల తుది పరిష్కార అధికారాన్ని ప్రభుత్వం కలెక్టర్లకు కట్టబెట్టినా.. సదరు పరిష్కార ఉత్తర్వులను మాత్రం తహసీల్దార్ల డిజిటల్‌ సంతకాలతో జారీ చేస్తున్నారు. దీనిపై తహసీల్దార్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కలెక్టర్లు విచక్షణ మేరకు తీసుకునే నిర్ణయాలకు తమ డిజిటల్‌ సంతకాలు పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్తులో ఏదైనా ఇబ్బంది తలెత్తితే తాము బాధ్యులం కావాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని రెవెన్యూ సంఘాలు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా స్పందన లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లను ప్రస్తావిస్తూ ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు చేసిన వ్యాఖ్యలు ఈ ఆందోళనను మరింత తీవ్రతరం చేశాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏం చేయాలి? సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి తేవాలి? అన్న దానిపై రెవెన్యూ వర్గాల్లో తర్జన భర్జన జరుగుతోంది. 

నిర్ణయం కలెక్టర్‌ది.. సంతకం తహసీల్దార్‌ది 
ధరణి పోర్టల్‌లో వివరాల నమోదులో తప్పులతో లక్షల కొద్దీ భూసంబంధిత సమస్యలు తలెత్తాయి. వాటి పరిష్కారం కోసం రైతులు ధరణి పోర్టల్‌లో దరఖాస్తు చేసుకుంటే.. అది నేరుగా జిల్లా కలెక్టర్‌/ కలెక్టర్‌ కార్యాలయంలోని ధరణి ఆపరేటర్‌ లాగిన్‌కు వెళుతుంది. జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఈ దరఖాస్తును ఆన్‌లైన్‌లోనే తహసీల్దార్‌కు పంపుతుంది. తహసీల్దార్లు దానిపై విచారణ జరిపి.. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో రెండు నివేదికలు తయారుచేసి ఆర్డీవో కార్యాలయానికి పంపుతారు.

ఆర్డీవో కార్యాలయంలో పరిశీలన తర్వాత దరఖాస్తులు ఆన్‌లైన్‌లోనే తిరిగి కలెక్టర్‌ లాగిన్‌కు చేరుతాయి. తహసీల్దార్లు ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా, ఆర్డీవో అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని సదరు దరఖాస్తును అంగీకరించాలా లేదా తిరస్కరించాలా అన్నదానిపై కలెక్టర్లు నిర్ణయం తీసుకుంటారు. అయితే ఈ నిర్ణయం తీసుకునే సమయంలో కేవలం బయోమెట్రిక్, డిజిటల్‌ కీ మాత్రమే కలెక్టర్‌ది వాడుతున్నారు.

నిర్ణయం తీసుకున్న తర్వాత ఎలాంటి ప్రొసీడింగ్స్‌ రావడం లేదు. కేవలం కలెక్టర్లు ఆమోదించినదీ, తిరస్కరించినదీ మాత్రమే ఆన్‌లైన్‌లో కనిపిస్తుంది. ఈ ఆన్‌లైన్‌ ధ్రువీకరణపై తహసీల్దార్‌ డిజిటల్‌ సంతకం వస్తోంది.

ఇక్కడ సమస్య ఏమిటంటే.. తహసీల్దార్‌ విచారణ పూర్తయి నివేదిక పంపాక కూడా పలు దరఖాస్తుల విషయంలో జిల్లాల కలెక్టర్లపై రాజకీయ, ఇతర ఒత్తిడులు వస్తున్నాయి. దీంతో తహసీల్దార్ల నివేదిక ఎలా ఉన్నా కలెక్టర్లు ధ్రువీకరిస్తున్నారు. మొత్తం దరఖాస్తుల్లో 20 శాతానికిపైగా దరఖాస్తుల్లో తహసీల్దార్ల అభిప్రాయానికి, నివేదికకు భిన్నంగా కలెక్టర్లు నిర్ణయాలు తీసుకుంటున్నట్టు అంచనా. 
 
ఏదైనా సమస్య వస్తే బాధ్యులెవరు? 

తమ అభిప్రాయాలకు భిన్నంగా జారీ అయ్యే ధరణి ఉత్తర్వులపై.. తమ డిజిటల్‌ సంతకాలే ఉండటంపై తహసీల్దార్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. రాజకీయ, ఇతర కారణాలతో భూముల ఉత్తర్వులపై ఫిర్యాదులు వస్తే.. సదరు నిర్ణయాలపై తమ సంతకాలు ఉంటాయని, తాము కూడా బాధ్యులం కావాల్సి వస్తుందని తహసీల్దార్లు వాపోతున్నారు. కలెక్టర్లతోపాటు తాము కూడా బదిలీ కావడమో, విచారణ ఎదుర్కోవాల్సి రావడమో జరిగితే ఎలాగని ప్రశ్నిస్తున్నారు.

ఏదైనా భూసమస్య కోర్టుకు వెళితే అక్కడ తాము సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని, లేకుంటే తమపై చర్యలు తప్పవని అంటున్నారు. ఈ క్రమంలో ధరణి ఉత్తర్వులపై జిల్లా కలెక్టర్ల సంతకాలే ఉండాలని డిమాండ్‌ చేస్తున్నారు. రెవెన్యూ చట్టాల ప్రకారం సంతకంతో సమస్యలు పరిష్కరించే అధికారం జిల్లా కలెక్టర్లకు లేనందున.. భూసమస్యల పరిష్కార విచక్షణాధికారం తమకే ఇవ్వాలని కోరుతున్నారు. అలాగైతే నిర్ణయాలకు తామే బాధ్యత వహిస్తామని చెప్తున్నారు. 
 
ట్రెసాపై ఒత్తిడి 
‘ధరణి’సంతకాల విషయమై వారం, పది రోజులుగా రెవెన్యూ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. దీనిపై ప్రభుత్వం స్పందించే పరిస్థితి లేకుంటే హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేయాలని, లేదంటే కొందరు తహసీల్దార్లు కలిసి పిటిషన్‌ వేయాలనే అభిప్రాయం ఆ చర్చల్లో వ్యక్తమవుతోంది. కోర్టుకు వెళ్లడం కుదరకపోతే మానవ హక్కుల సంఘం (హెచ్చార్సీ), లోకాయుక్త వంటి సంస్థలను ఆశ్రయించాలని భావిస్తున్నారు.

మరోవైపు తమ ఆందోళనను బహిరంగంగా ప్రభుత్వానికి తెలియపర్చాలని, ఇందుకోసం జిల్లాల్లో కలెక్టర్లను కలిసి వినతిపత్రాలు అందజేయాలనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. అవసరమైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు విధుల బహిష్కరణకు పిలుపునివ్వాలని ‘తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ట్రెసా)’పై తహసీల్దార్లు ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement