సాక్షి, నాగర్‌కర్నూల్: ధరణి పోర్టల్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం రైతుల భూములను గుంజుకుంటోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. రాష్ట్రంలో రైతులను వేధింపులకు గురిచేసేందుకే ఈ పోర్టల్‌ను తెచ్చారని..తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌తో పాటు బీఆర్‌ఎస్ పోర్టల్ కూడా బంద్ అవుతుందని చెప్పారు. తన కుటుంబాన్ని కాపాడుకునేందుకే బీఆర్‌ఎస్ పేరుతో కేసీఆర్ కొత్తరాగం ఎత్తుకున్నారని విమర్శించారు. పేరు మారినంత మాత్రాన వారి గుణం మారదని, ‘ఆ పార్టీ బీఆర్‌ఎస్ కాదు.. భ్రష్టాచార్ రాక్షసుల సమితి’ అని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో పీఎం ఆవాస్ యోజన కింద మంజూరు చేసిన ఇళ్లలోనూ కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని, ప్రజా, రైతు వ్యతిరేక కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని పిలుపునిచ్చారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఆదివారం సాయంత్రం ‘నవ సంకల్ప బహిరంగ సభ’లో ఆయన మాట్లాడారు.
విపక్షాల ప్రయాస ఫొటో సెషన్లకే పరిమితం
దేశంలో ప్రతిపక్ష పార్టీలు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఏకమవుతున్నాయని, వారి ప్రయాస అంతా ఫొటో సెషన్లకే పరిమితమవుతుందని నడ్డా విమర్శించారు. కాంగ్రెస్‌తో పాటు ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీ, టీఎంసీ, ఠాక్రే పార్టీలన్నీ తమ కుటుంబాలను కాపాడుకునేందుకే తహతహలాడుతున్నాయని, ఒక్క బీజేపీ మాత్రమే దేశ ప్రజల హితం కోసం పనిచేస్తోందని చెప్పారు. మోదీ చేసిన అభివృద్ధిపై విమర్శలు చేయలేకనే, ఆయన కులం పేరుతో చాయ్‌వాలా అంటూ విపక్షాలు అక్కసు వెళ్లగక్కుతున్నాయని అన్నారు. ప్రధాని మోదీ మాత్రం విషాన్ని మింగినట్టుగా విమర్శలను మింగుతూ నిరంతరం దేశ ప్రజల కోసం పనిచేస్తున్నారని చెప్పారు.
మోదీ ముందుచూపుతో ఆర్థిక వ్యవస్థ పటిష్టం
కరోనా సంక్షోభం, ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులను సైతం తట్టుకుని మోదీ ముందు చూపుతో దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టపర్చారని నడ్డా చెప్పారు. ప్రపంచంలో పదో స్థానంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను నేడు ఐదో స్థానంలో నిలిపారని అన్నారు. గతంలో దేశంలో 28 శాతం ఉన్న పేదరికం, మోదీ ప్రభుత్వ పథకాల ఫలితంగా 10 శాతానికి తగ్గిందని వివరించారు. గతంలో 97 శాతం మొబైల్ ఫోన్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్లమని, ఇప్పుడు 97 శాతం ఫోన్లు దేశంలోనే తయారవుతున్నాయని తెలిపారు. ‘దునియా మే మోదీ ఈజ్ ది బాస్, యువర్ హీరో, గ్లోబల్ లీడర్’ అంటూ మోదీని ప్రపంచ నేతలు కొనియాడుతున్నారని చెప్పారు.
తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని నడ్డా చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 65 ఏళ్లలో చేయలేని పనులను కేవలం తొమ్మిదేళ్లలో మోదీ ప్రభుత్వం చేసిందని చెప్పారు. తెలంగాణలో 65 ఏళ్లలో మొత్తం 2,500 కి.మీ. మేర జాతీయ రహదారులు వేస్తే, బీజేపీ తొమ్మిదేళ్ల పాలనలోనే 2,500 కి.మీ రహదారులను నిర్మించామని తెలిపారు. ఇటీవల ప్రధాని మోదీ చేతుల మీదుగా రాష్ట్రంలో రూ.11 వేల కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించామంటూ గుర్తు చేశారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను ఆధునికీకరించడంతో పాటు కొత్తగా ఎంఎంటీఎస్ రైళ్లను అందుబాటులోకి తెచ్చామన్నారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతి, విశాఖలకు రెండు వందే భారత్ రైళ్లను నడిపిస్తున్నట్టు వివరించారు. హైదరాబాద్– నల్లగొండ, హైదరాబాద్– వరంగల్ ఇండ్రస్టియల్ కారిడార్లు, రాష్ట్రానికి మెగా టెక్స్‌టైల్ పార్క్ మంజూరు చేశామని చెప్పారు. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు కోసం కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుందని గుర్తుచేశారు. తెలంగాణ అభివృద్ధికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, రాష్ట్రంలో బీజేపీ పాలన వస్తే ఇంకా ఎన్ని మార్పులు ఉంటాయో ఆలోచించాలని కోరారు.
పోరాటవీరుడు నడ్డా: బండి సంజయ్
పదిహేనేళ్ల చిరుప్రాయంలోనే దేశంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన వీరుడు జేపీ నడ్డా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ పేరుతో పోరాడుతూ బీజేపీని ప్రతి గడపకు చేర్చి ప్రపంచంలోనే శక్తివంతమైన పార్టీగా తీర్చిదిద్దారని చెప్పారు. నాగర్‌కర్నూల్‌లో బీజేపీ ఎక్కడుందీ.. అని అంటున్న వాళ్లకు ఇక్కడికి వచ్చిన జనసందోహాన్ని చూపించాలని అన్నారు. సభలో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, మహేంద్రనాథ్ పాండే, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, నేతలు జితేందర్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ వస్తే 'ధరణి బంద్'!
Published Mon, Jun 26 2023 3:26 AM | Last Updated on Mon, Jun 26 2023 9:40 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment