
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్‌పై పోరాటాన్ని ఉధృతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ‘మన భూమి–మన హక్కు’పేరిట రైతులకు ప్రత్యేకంగా ధరణి కార్డులు జారీ చేస్తూ తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తామంటూ హామీ ఇస్తోంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ధరణి సమస్యలపై గ్రామస్థాయిలో అదాలత్‌లు నిర్వహించేందుకు పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘భూరక్షక్’లకు మంగళవారం గాంధీభవన్‌లో శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.
జనగామ, హనుమకొండ, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల కార్యకర్తలు ఈ శిక్షణకు హాజరయ్యారు. దీనికి టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, సీనియర్ నేతలు హర్కర వేణుగోపాల్, అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్‌రెడ్డి తదితరులు హాజరు కాగా, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోట నీలిమ, సీనియర్ నాయకురాలు వరలక్ష్మి, సి.శ్రీనివాస్‌లతోపాటు సాంకేతిక, న్యాయనిపుణులు భూరక్షక్‌లకు శిక్షణనిచ్చారు.
14 అంశాలతో వివరాల సేకరణ: శిక్షణలో భాగంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే విధానాన్ని భూరక్షక్‌లకు వివరించారు. ఇందుకోసం యాప్‌ను ఉపయోగించే విధానం గురించి అవగాహన కల్పించారు. ధరణి పోర్టల్ ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల సమస్యలు, 14 అంశాలతో కూడిన వివరాలను ఆ యాప్‌లో నమోదు చేయాలని భూరక్షక్‌లకు సూచించారు.
ఈ మేరకు ప్రత్యేక కార్డులు యాప్‌లోనే రూపొందుతాయని, వీటిని రైతులకు అందజేయడంతో సమస్య నమోదు ప్రక్రియ పూర్తవుతుందని వెల్లడించారు. శిక్షణ అనంతరం డాక్టర్ నీలిమ మాట్లాడుతూ త్వరలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల భూరక్షక్‌లకు శిక్షణనిస్తామని, అన్ని గ్రామాల్లో ధరణి అదాలత్‌లు నిర్వహించేందుకు షెడ్యూల్‌ను కూడా త్వరలోనే ఖరారు చేస్తామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment