వచ్చే నెల 15 నుంచి రైతుల రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించేందుకు సర్కారు కసరత్తు
మాఫీ కోసం రూ. 35 వేల కోట్లకుపైగా అవసరమని అంచనా
ఈ సీజన్ ‘రైతు భరోసా’కు రూ.10,500 కోట్లు..
రైతుబీమా, పంటల బీమాకు మరో రూ.4 వేల కోట్లు..
రెండు నెలల్లో రూ.50 వేల కోట్ల మేర నిధులు కావాలి
‘రైతు కార్పొరేషన్’ పెట్టి రుణం తీసుకోవాలనే ఆలోచన
నేరుగా బహిరంగ మార్కెట్లో అప్పులు చేసే యోచన..
ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టే దిశగా కూడా ప్రతిపాదన
పథకాల భారం తగ్గించుకునేందుకు ‘పరిమితుల’ పరిశీలన
రైతు భరోసాకు కిసాన్ సమ్మాన్ నిబంధనల వర్తింపు!
ఐదెకరాల పరిమితి, సాగు చేసే రైతులకే సాయంపైనా దృష్టి
రుణమాఫీ విషయంలోనూ ‘భారం’ తగ్గించుకునే మార్గాలపై ప్రభుత్వంఫోకస్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల రుణమాఫీని దశల వారీగా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది. గత ప్రభుత్వ హయాంలో చేసినట్టుగానే విడతల వారీగా పంటల రుణమాఫీ చేపట్టాలని.. వచ్చే నెల 15వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభించాలని భావిస్తున్నట్టు తెలిసింది. తొలుత రూ. 50 వేల వరకు ఉన్న రుణాలను, తర్వాత రూ. 75 వేల వరకు, అనంతరం రూ.లక్ష.. ఇలా రూ. 2లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీనాటికి రూ.2 లక్షల వరకు ఉన్న రైతుల పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. రైతుల్లో 70% మందికి రూ.లక్ష లోపే రుణాలు ఉన్నట్టు అంచనా. వీరికి తొలిదశలో మాఫీ చేసి.. తర్వాత మిగతా వారికి అమలు చేయాలనే ప్రతిపాదనపైనా చర్చ జరుగుతోంది. నిధుల సేకరణపై స్పష్టత వచ్చాక అర్హుల గుర్తింపు ప్రక్రియ మొదలవుతుందని అధికారవర్గాలు చెప్తున్నాయి. రుణమాఫీకి భారీగా నిధులు అవసరం కావడంతో సేకరణ కోసం ప్రభుత్వం అన్నిరకాల మార్గాలను అన్వేషిస్తోందని అంటున్నాయి.
నాలుగు పథకాలకు రూ.50 వేల కోట్లు!
రాష్ట్ర ప్రభుత్వం వచ్చే రెండు నెలల్లో రుణమాఫీ, రైతుభరోసా అమలు చేయాల్సి ఉంది. ఈ రెండింటికీ నిధులు సమీకరించడం సవాల్‌గా మారిందని అధికార వర్గాలు చెప్తున్నాయి. రుణమాఫీ కోసం వడ్డీతో కలిపి సుమారు రూ.35 వేల కోట్లు అవసరమని అంచనా. రైతు భరోసా కింద ప్రస్తుత వానాకాలం సీజన్‌లో ఎకరాకు రూ.7,500 చొప్పున ఇచ్చేందుకు రూ.10,500 కోట్ల మేరకు కావాలి. రైతు బీమా పథకం ప్రీమియం చెల్లించేందుకు రూ.1,500 కోట్లు కావాలి.
పంటల బీమా పథకం కింద ప్రభుత్వమే రైతుల తరఫున ప్రీమియం చెల్లించాలంటే దాదాపు రూ.2,500 కోట్ల మేరకు ఖర్చు అవుతుందని అంచనా. ఇలా ఈ నాలుగింటికి కలిపి రూ.50 వేల కోట్ల వరకు అవసరం. రైతుభరోసా కింద ఈ నెల నుంచే పెట్టుబడి సాయం ఇవ్వాలి. రైతు బీమా, పంటల బీమాకు కూడా ఇప్పుడే చెల్లించాల్సి ఉంటుంది. రుణమాఫీపై ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15వ తేదీలోగా చెల్లించాలి. అంటే ఈ రెండు నెలల్లోనే నిధులన్నీ సమకూర్చుకోవాలి.
భారం తగ్గించుకోవడంపై దృష్టి!
భారీగా నిధుల అవసరం ఉండటంతో.. ఈ నాలుగు పథకాల భారాన్ని ఎలా తగ్గించుకోవాలన్న దానిపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసినట్టు తెలిసింది. ఇందుకోసం ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో రుణమాఫీ అమలు తీరును పరిశీలించింది. వ్యవసాయ, ఆర్థికశాఖల అధికారులు మహారాష్ట్రకు వెళ్లి అక్కడ రుణమాఫీ అమలుతీరును అధ్యయనం చేసి వచ్చారు. రాజస్తాన్‌లో రుణమాఫీ అమలుతీరును కూడా అడిగి తెలుసుకున్నారు. ఆయా రాష్ట్రాల్లో అనుసరించిన విధి విధానాలు, నిర్దేశించిన అర్హతలను కూడా పరిశీలిస్తున్నారు. అర్హులైన రైతులకు లబ్ధిచేకూరేలా విధివిధానాలు ఎలా ఉండాలనే కసరత్తు కొనసాగుతోంది. నిజానికి రైతులందరికీ రుణమాఫీ, రైతు భరోసా ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీయిచ్చింది.
కానీ ఆయా పథకాలకు అర్హులను గుర్తించాలని యోచిస్తున్నట్టు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకం కింద దేశవ్యాప్తంగా అర్హులైన రైతులకు ఏటా రూ.6 వేలు ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ పథకం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జెడ్పీ ఛైర్మన్లు, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు, కేంద్ర రాష్ట్ర ఉద్యోగులు, అధిక ఆదాయం ఉండి ఆదాయ పన్ను చెల్లించేవారిని మినహాయించింది.
ఇప్పుడు ‘‘రైతు భరోసాకు, రుణమాఫీ అమలుకు అటువంటి ప్రత్యేక మార్గదర్శకాలు పాటించాలా? అలా చేస్తే అసలైన రైతులకు మేలు జరుగుతుందా? ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రతి రైతుకు మేలు జరగాలంటే ఎలాంటి విధి విధానాలుండాలి?’’ అన్నదిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని సీఎంవో వర్గాలు చెప్తున్నాయి. అంటే పథకాల భారాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పీఎం కిసాన్‌లో మినహాయింపు ఉన్న వర్గాలతోపాటు ఐదెకరాల పరిమితి పెట్టడం, సాగుచేసే రైతులకే భరోసా సాయం ఇవ్వడం వంటివి అమలు చేస్తే ఆర్థిక భారం తగ్గుతుందని భావిస్తున్నట్టు చెప్తున్నారు. రుణమాఫీకి కూడా ఇలాంటి నిబంధనలు పెడితే ఎలా ఉంటుందనే కోణంలోనూ ఆలోచన సాగుతున్నట్టు సమాచారం.
నిధుల సమీకరణ ఎలా?
ఈ నాలుగు పథకాల కోసం ఒకేసారి రూ.50 వేల కోట్ల మేరకు నిధులు సమీకరించడం అంత సులువైన వ్యవహారం కాదని.. ఒకవేళ ఆంక్షలు విధించి, కోతలు పెట్టినా కూడా అంత పెద్ద మొత్తంలో సొమ్ము సేకరణ కష్టమేనని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం భారం తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తూనే, నిధుల సమీకరణకు ఏర్పాట్లు మొదలుపెట్టింది. కొత్తగా ‘రైతు సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్’ ఏర్పాటు చేసి, రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చి.. ఒకేసారి రూ.35 వేల కోట్ల వరకు రుణం తీసుకునే అవకాశం ఉందా అన్న ఆలోచన జరుగుతోంది.
అయితే ఏదైనా కార్పొరేషన్‌కు భారీగా రుణం ఇవ్వాలంటే.. దానిని అదే సంస్థ తిరిగి చెల్లించగలదంటూ ఆదాయ మార్గాలను చూపాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. ఏదైనా సంస్థ లేదా పథకం పేరుతో బ్యాంకులు ఇచ్చే రుణం సొమ్మును ఆ పనికి మాత్రమే వినియోగించాలని.. లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం పూచీకత్తు ఇవ్వడం చెల్లకుండా చూడాలని ఇటీవల రిజర్వుబ్యాంకు వర్కింగ్ గ్రూప్ సిఫార్సు చేసిందని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రుణ సేకరణకు ఉన్న ఇతర అవకాశాలేమిటన్న దానిపై ప్రభుత్వం ఉన్నతస్థాయిలో చర్చలు జరుపుతోంది.
వృథాగా ఉన్న ప్రభుత్వ భూములను బ్యాంకుల్లో కుదువపెట్టి రుణాలు తీసుకోవాలన్న ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చినట్టు తెలిసింది. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో 700 ఎకరాలకుపైగా భూములను ప్రభుత్వం గుర్తించింది. అందులో కొన్ని భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టడం ద్వారా రూ.20 వేల కోట్ల వరకు సమకూర్చుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. దీనిపై ఇప్పటికే రిజర్వుబ్యాంకు గవర్నర్‌తో ఉన్నతాధికారులు సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment