సెల్ఫ్ డిక్లరేషన్ మాత్రం తప్పనిసరి!.. మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయం
ఎంత భూమిలో సాగు చేశాడో స్వయంగా తెలియజేస్తూ రైతు ఇచ్చేదే సెల్ఫ్ డిక్లరేషన్
ఎంత మేర భూమి సాగు చేస్తే అంత విస్తీర్ణానికే లెక్కగట్టి పెట్టుబడి సాయం
శాటిలైట్ ఇమేజ్, రిమోట్ సెన్సింగ్ డేటాతో నిర్ధారణ
వ్యవసాయాధికారి ఇచ్చే లెక్కలతో సరిపోల్చుకున్న తర్వాతే భరోసా
రైతుల్లో జవాబుదారీతనం పెంపొందుతుందంటున్న ప్రభుత్వం
ఎకరాకు రూ.7,500 చొప్పున చెల్లింపుపై కొరవడిన స్పష్టత
ఒక్కో రైతుకు ఎన్ని ఎకరాలకు సాయం ఇవ్వాలనేదీ ఖరారు కాని వైనం
జనవరి 2 లేదా 3న మరోసారి ఉప సంఘం భేటీ
4న జరిగే కేబినెట్ సమావేశంలో విధివిధానాలకు ఆమోదముద్ర!
ఏమిటీ సెల్ఫ్ డిక్లరేషన్?
‘అయ్యా.. ఫలానా గ్రామానికి చెందిన నాకు సర్వే నంబర్ 1లో ఎకరం పొలం ఉంది. నా ఇంటి ఆవరణతో కలిపి 100వ సర్వే నంబర్‌లో మరో ఎకరం చెలక ఉంది. ఇంటి జాగా 2 గుంటలు పోను మొత్తం ఎకరా 38 గుంటల్లో కూరగాయలు సాగు చేస్తున్నాను. ఇందులో ఎలాంటి తప్పుడు లెక్కలు చూపినట్లు తేలినా.. ప్రభుత్వం తీసుకునే చర్యలకు కట్టుబడి ఉంటాను. దయచేసి నేను సాగు చేసే భూమికి సంబంధించి రైతు భరోసా అందించగలరని మనవి’
రైతు భరోసా పథకం కింద లబ్ధి పొందాలనుకునే రైతు ఎవరైనా భవిష్యత్తులో వ్యవసాయ శాఖకు ఇవ్వాల్సిన ‘సెల్ఫ్ డిక్లరేషన్ ’ నమూనా ఇది.
సాక్షి, హైదరాబాద్: ‘రైతుభరోసా’ అమలుకు ముహూర్తం ఖరారైంది. కొత్త సంవత్సరంలో సంక్రాంతి కానుకగా ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత కొన్నేళ్లుగా అమల్లో ఉన్న పెట్టుబడి సాయం ‘రైతుబంధు’ స్థానంలో ‘రైతు భరోసా’ను కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఏర్పాటైన కేబినెట్ సబ్‌కమిటీ ఇప్పటికే పలుమార్లు సమావేశమై పథకం మార్గదర్శకాలపై చర్చించింది.
తాజాగా రెండురోజుల క్రితం జరిగిన సమావేశంలో తుది కసరత్తు కూడా పూర్తి చేసింది. వానాకాలం, యాసంగి సీజన్లలో రైతు ఎంత మేర భూమి సాగు చేస్తే అంత విస్తీర్ణానికే లెక్కగట్టి రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది. గతంలో ఎంత భూమి ఉంటే అంత భూమికి రైతుబంధు అందేది. ఇలాఉండగా రైతు ఎంత భూమిలో సాగు చేశాడో స్వయంగా తెలియజేసే ‘సెల్ఫ్ డిక్లరేషన్’ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని కూడా మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది.
శాటిలైట్ ఇమేజ్, రిమోట్ సెన్సింగ్ డేటా ఆధారంగా రైతు సాగు చేసిన భూమిని లెక్కగట్టనున్నారు. అలాగే వ్యవసాయాధికారి ఇచ్చే పంటల విస్తీర్ణంతో రైతు నుంచి తీసుకున్న ‘సెల్ఫ్ డిక్లరేషన్’ను సరిపోల్చుకున్న తర్వాతే పెట్టుబడి సాయాన్ని రైతు ఖాతాలో జమ చేస్తారు. రైతే స్వయంగా తన పేరిట ఉన్న భూమి, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలను తెలియజేయడంతో పాటు తాను ఎంత విస్తీర్ణంలో ఏ పంట వేస్తున్నాననే విషయాన్ని ప్రకటించేలా చూడటం ద్వారా రైతుల్లో జవాబుదారీతనాన్ని పెంచవచ్చనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. తద్వారా ప్రభుత్వ సొమ్ము దారి మళ్లకుండా రైతు సాగు చేసిన భూమికే కచ్చితంగా పెట్టుబడి సాయం అందుతుందని భావిస్తోంది.
సాగు విస్తీర్ణంలో కచ్చితత్వం కోసమే అంటున్న సర్కారు
రైతు అందించే సెల్ఫ్ డిక్లరేషన్ వల్ల ఒక గ్రామంలో ఉన్న పట్టా భూమి ఎంత? అందులో సాగవుతున్న విస్తీర్ణం ఎంతో తెలియడమే కాకుండా రాష్ట్రంలో సాగవుతున్న పంటల వివరాలు కూడా కచ్చితంగా తెలుస్తాయని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు ప్రతి సీజన్‌లో ఇచ్చే పంటల సాగు విస్తీర్ణం లెక్కల్లో కచ్చితత్వం ఉండడం లేదని భావిస్తున్న ప్రభుత్వం.. రైతు భరోసా పథకం ద్వారా ఈ వివరాలను కూడా తెలుసుకోవాలని నిర్ణయించింది.
ఉదాహరణకు ఈ యాసంగిలో పంటల సాధారణ సాగు విస్తీర్ణం 63.54 లక్షల ఎకరాలు కాగా, రైతులు ఏకంగా 79.40 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ లెక్కలు వేసింది. ఇందులో వరి 63.20 లక్షల ఎకరాల్లో, మొక్కజొన్న 7.18 లక్షల ఎకరాల్లో సాగవుతుందంటూ ప్రతిపాదనలు రూపొందించింది.
అయితే ఇప్పుడు రైతు భరోసాకు రైతు సెల్ఫ్ డిక్లరేషన్ నిబంధన వల్ల ఈ పంటలకు సంబంధించి కచ్చితమైన వివరాలు తెలిసే అవకాశం ఉందని, అలాగే ఏ పంటల లోటు ఎంత ఉందో తెలుసుకుని తదనుగుణంగా ఆయా పంటల విస్తీర్ణం పెంచే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.
అలాగే పంట సాగు చేస్తేనే పెట్టుబడి సాయం అందుతుందనే నిబంధన వల్ల..గతంలో పునాసలో మాత్రమే సాగు చేసే రైతు యాసంగిలో కూడా తప్పకుండా ఏదో ఒక పంట పండించేందుకు ఆసక్తి చూపుతారని, తద్వారా యాసంగిలోనూ సాగు విస్తీర్ణం పెరుగుతుందని మంత్రివర్గ ఉప సంఘం అభిప్రాయపడింది.
ఎంత పెద్ద రైతుకైనా భరోసా ఖాయం!
రైతు భరోసా కింద ఒక్కో సీజన్‌లో ఎకరాకు రూ.7,500 చొప్పున చెల్లించాలని భావిస్తున్నప్పటికీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో దీనిని ఎంతకు పరిమితం చేయాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. జనవరి 2 లేదా 3వ తేదీన ఉపసంఘం మరోసారి సమావేశమై దీనిపై చర్చించే అవకాశం ఉంది. అదే సమయంలో ఒక్కో రైతుకు ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాలనే అనే అంశాన్ని కూడా ఖరారు చేయనున్నట్లు సమాచారం.
అయితే ఎంత పెద్ద రైతైనా నిరీ్ణత సీలింగ్ పరిధికి లోబడి సాగు చేసిన భూమికి రైతు భరోసా ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించారు. పీఎం కిసాన్ పథకంలో ఐదెకరాలు పైనున్న భూ యజమానికి పెట్టుబడి సాయం అందని విషయం విదితమే. రైతు భరోసాకు సంబంధించిన విధివిధానాలతో కూడిన నివేదికను మంత్రివర్గ ఉప సంఘం 3వ తేదీలోపు ప్రభుత్వానికి అందజేస్తే 4వ తేదీన జరిగే కేబినెట్ భేటీలో ఆమోదముద్ర పడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment