సూత్రప్రాయంగా నిర్ణయించిన రాష్ట్ర సర్కారు
పేద రైతులందరికీ న్యాయం.. ధనిక రైతులు ఔట్
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్‌లకు నో
ఐటీ చెల్లించే కొందరికి పూర్తిగా కట్ చేసే యోచన
పీఎం కిసాన్ మార్గదర్శకాల్లో కొన్నిఅమలు చేసే చాన్స్
ప్రజల్లో వ్యతిరేకత వస్తుందా అనే సంశయంలో సర్కార్
నేడే కేబినెట్ ప్రత్యేక భేటీ.. రుణమాఫీ మార్గదర్శకాలపై ఉత్కంఠ.. కటాఫ్ తేదీపై స్పష్టత.. నిధుల సమీకరణపై వీడనున్న గందరగోళం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల రుణ మాఫీకి ఆంక్షలు విధించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. అనర్హులకు రుణమాఫీతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదని.. అర్హులందరికీ పూర్తి న్యాయం జరిగేలా రుణమాఫీ ప్రక్రియ ఉంటుందని అధికారులు చెప్తున్నారు. రుణమాఫీ అంశంపై శుక్రవారం తెలంగాణ కేబినెట్ ప్రత్యేకంగా సమావేశం అవుతోంది. ఈ సమావేశంలోనే పూర్తిస్థాయిలో చర్చించి రుణమాఫీపై ఒక నిర్ణయానికి వస్తారని.. మార్గదర్శకాలకు ఒక రూపం ఇస్తారని తెలిసింది. ఇందుకు సంబంధించి వ్యవసాయ, ఆర్థిక శాఖలు పెద్ద ఎత్తున కసరత్తు చేశాయని సమాచారం.
ధనికులు, ప్రముఖులను మినహాయిస్తూ..
సీఎం కార్యాలయ వర్గాలు, వ్యవసాయశాఖ ఉన్నతాధికారుల అంచనా ప్రకారం.. ధనికులకు రుణమాఫీ ఎట్టి పరిస్థితుల్లోనూ చేసే అవకాశం లేదు. ప్రస్తుతం కేంద్రం అమలు చేస్తున్నా పీఎం కిసాన్ పథకం కింద.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జెడ్పీ చైర్ పర్సన్లు, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అధిక ఆదాయం ఉండి ఆదాయ పన్ను చెల్లించేవారిని మినహాయించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయనున్న రైతు రుణమాఫీలోనూ ఈ వర్గాలను మినహాయించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఆదాయ పన్ను చెల్లించే ప్రతీ ఒక్కరినీ కాకుండా.. అధిక ఆదాయమున్న వారిని మాత్రమే మినహాయిస్తారని అంటున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ అందరినీ కాకుండా.. అటెండర్లు వంటి చిన్నస్థాయి ఉద్యోగులకు రైతు రుణమాఫీ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారని వివరిస్తున్నాయి. ఇలాంటి వారికి రుణమాఫీని మినహాయిస్తే ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం పెద్దగా ఉండదని ప్రభుత్వం భావిస్తున్నట్టు చెప్తున్నాయి. ఇక రుణమాఫీకి కటాఫ్ తేదీని కూడా మంత్రివర్గ సమావేశంలోనే ఖరారు చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తేదీ, లేదా సోనియాగాంధీ పుట్టినరోజును ప్రామాణికంగా తీసుకునే ప్రతిపాదన ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ రెండు తేదీల్లో ఏదో ఒకదాన్ని ఫైనల్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.
భూసీలింగ్ ఏదైనా వర్తింపజేస్తారా?
ఆగస్టు 15వ తేదీలోగా రైతులకు రుణమాఫీ చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రైతులకు ఇచి్చన హామీ ప్రకారం గడువులోగా రుణమాఫీ చేసేందుకు సన్నాహాలు చేయాలని వ్యవసాయ, ఆర్థికశాఖ అధికారులను ఆదేశించారు కూడా. రుణమాఫీకి ఎన్ని నిధులు అవసరం? అందుకు తగ్గట్టుగా నిధుల సమీకరణకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలు, అందుబాటులో ఉన్న వనరులేమిటన్న దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గతంలో జరిగిన రుణమాఫీ అమలు తీరును పరిశీలించటంతోపాటు ఇతర రాష్ట్రాల్లో రుణమాఫీ పథకాలు, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలకు అనుసరించిన పద్ధతులపై అధికారులు అధ్యయనం చేశారు.
ఆ పథకాల ప్రయోజనాలు, అనుసరించిన విధివిధానాలు, నిర్దేశించిన అర్హతలను కూడా పరిశీలించారు. రాష్ట్ర ఆర్థిక, వ్యవసాయశాఖల అధికారులు ముంబై వెళ్లి మహారాష్ట్ర రుణమాఫీని అధ్యయనం చేసి వచ్చారు. ఏం చేసినా అసలైన రైతులకు మేలు జరిగేలా, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రతీ రైతుకు ప్రయోజనం కలిగించేలా విధివిధానాలు ఉంటాయని అధికారులు చెప్తున్నారు. అయితే ధనిక రైతులకు ఈ పథకాన్ని వర్తింపజేసే అవకాశం ఉండదన్న చర్చ కూడా జరుగుతోంది. కానీ కొన్ని నిబంధనలను కఠినంగా అమలు చేసే ప్రతిపాదన ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. రైతు భరోసాను ఐదు లేదా పదెకరాలకు పరిమితం చేసే ఆలోచన ఉన్నట్లు ప్రచారం జరిగింది. అలాగే రుణమాఫీకి కూడా అలాంటి పరిమితి విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం.
ఇంకా తర్జనభర్జన
రైతు రుణమాఫీ కోసం వడ్డీతో కలిపి దాదాపు రూ.35 వేల కోట్లు కావాలని అధికారులు అంచనా వేశారు. కటాఫ్ తేదీ, షరతులను బట్టి ఆర్థికభారం తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఆర్థికభారం తగ్గించుకునేందుకు ఎక్కువ షరతులు విధిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందా? అన్న సంశయం ప్రభుత్వంలో వ్యక్తమవుతున్నట్టు చెప్తున్నారు. ఉద్యోగులను మినహాయిస్తే వారి నుంచి వ్యతిరేకత వస్తుందేమోనన్న చర్చ జరుగుతోంది. అలాగే ఐదు లేదా పదెకరాలకే పరిమితి విధిస్తే.. మిగతా రైతుల నుంచి వ్యతిరేకత రావొచ్చని అంటున్నారు.
షరతులు పెడితే ఆర్థికంగా పెద్ద మొత్తంలో మిగులు ఉండాలని.. అలాకాకుండా మిగిలేది తక్కువే ఉంటే షరతులు ఎక్కువగా పెట్టకపోవడమే మంచిదన్న అభిప్రాయం కూడా నెలకొంది. ఈ క్రమంలో ‘మినహాయింపుల’పై ప్రభుత్వం తర్జనభర్జన పడుతూనే ఉంది. మరోవైపు ఒకేసారి పెద్ద మొత్తంలో సొమ్మును సమకూర్చడం సాధ్యంకానందున.. విడతల వారీగా రుణమాఫీ జేసే ఆలోచన ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment