రైతుల పంట రుణాల మాఫీ మార్గదర్శకాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
రేషన్ కార్డుల ఆధారంగానే రైతు కుటుంబాలను గుర్తించాలని నిర్ణయం
పీఎం కిసాన్ నిబంధనలను అవసరమైన మేరకు పరిగణనలోకి తీసుకుంటాం
రూ. 2 లక్షలకు మించి రుణం ఉంటే.. ఆపై ఉన్న రుణాన్ని రైతు చెల్లిస్తేనే మాఫీ
మాఫీ సొమ్ము రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ
బంగారం తాకట్టుపై తీసుకున్న పంట రుణాలపై మార్గదర్శకాల్లో లేని ప్రస్తావన.. తప్పుడు పత్రాలతో మాఫీ పొందినట్టు తేలితే రికవరీ చేస్తామని స్పష్టీకరణ
రుణమాఫీపై అభ్యంతరాలు, సలహాలకు మండల స్థాయిలో సహాయ కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల పంట రుణాల మాఫీ రేషన్‌కార్డు ఉన్నవారికే అమలుకానుంది. ఆహార భద్రత కార్డుల ఆధారంగానే రైతు కుటుంబాలను గుర్తిస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లబ్ధిదారులను తేల్చడానికి.. బ్యాంకుల్లో రైతుల రుణఖాతాలోని ఆధార్‌ను.. పట్టాదారు పాస్‌బుక్ డేటాబేస్‌లో ఉన్న ఆధార్‌తో, పీడీఎస్ (రేషన్) డేటాబేస్‌లోని ఆధార్‌తో అనుసంధానం చేయనున్నట్టు పేర్కొంది.
అర్హులుగా తేల్చిన ఒక్కో రైతు కుటుంబానికి 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9వ తేదీ మధ్య ఉన్న పంట రుణాల బకాయిల్లో రూ.2 లక్షల వరకు మాఫీ చేయనున్నట్టు ప్రకటించింది. తప్పుడు పత్రాలతో రుణమాఫీ పొందినట్టు తేలితే ఆ మొత్తాన్ని రికవరీ చేస్తామని తెలిపింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు సోమవారం ‘పంట రుణ మాఫీ పథకం–2024’ మార్గదర్శకాలను విడుదల చేశారు. ఈ ఉత్తర్వులను తెలుగులో విడుదల చేయడం విశేషం.
పథకం అమలు ప్రక్రియ, ఏర్పాట్లు చేసేదిలా..
⇒ వ్యవసాయ శాఖ డైరెక్టర్ పంటల రుణమాఫీ పథకాన్ని అమలు చేసే అధికారిగా ఉంటారు. హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసీ) ఈ పథకానికి ఐటీ భాగస్వామిగా ఉంటుంది.
⇒ వ్యవసాయశాఖ డైరెక్టర్, ఎన్‌ఐసీ సంయుక్తంగా ఈ పథకం అమలు కోసం ఒక ఐటీ పోర్టల్‌ను నిర్వహిస్తాయి. ఈ పోర్టల్‌లో ప్రతి రైతు కుటుంబానికి సంబంధించిన లోన్ అకౌంట్ డేటా సేకరణ, డేటా వాలిడేషన్, అర్హత మొత్తం నిర్ణయించబడుతుంది. ఈ ఐటీ పోర్టల్‌లోనే.. ఆర్థికశాఖ నిర్వహించే ఐఎఫ్‌ఎంఐఎస్‌కు బిల్లులు సమర్పించడానికి, రుణమాఫీ పథకానికి సంబంధించిన భాగస్వాములందరితో సమాచారాన్ని పంచుకోవడానికి, రైతులు ఇచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేకంగా మాడ్యూల్స్ ఉంటాయి.
⇒ ఈ పథకం అమలుకోసం ప్రతి బ్యాంకులో ఒక అధికారిని బ్యాంకు నోడల్ అధికారిగా (బీఎస్‌ఐ) నియమించాలి. ఆ నోడల్ అధికారులు తమ బ్యాంక్ పంట రుణాల డేటాపై డిజిటల్ సంతకం చేయాలి.
⇒ ప్రతి బ్యాంకు తమ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ (సీబీఎస్) నుంచి.. రిఫరెన్స్–1 మెమో, ప్రొఫార్మా– 1లో డిజిటల్ సంతకం చేసిన టేబుల్‌ను ప్రభుత్వానికి సమర్పించాలి. ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలు సీబీఎస్‌లో లేవు కాబట్టి.. ప్యాక్స్‌కు అనుబంధమైన సంబంధిత బ్యాంకు బ్రాంచ్, రిఫరెన్స్–2వ మెమో, ప్రొఫార్మా–2లో డేటాను డిజిటల్‌గా సంతకం చేసి సమర్పించాలి.
⇒ ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం తప్పుడు చేరికలు, తప్పుడు తీసివేతలను నివారించడమే.. అవసరమైతే వ్యవసాయ శాఖ డైరెక్టర్, ఎన్‌ఐసీ డేటా వ్యాలిడేషన్ తనిఖీలను చేపట్టాలి.
⇒ అర్హతగల రుణమాఫీ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో (డీబీటీ పద్ధతిలో) జమ చేస్తారు. ప్యాక్స్ విషయంలో రుణమాఫీ మొత్తాన్ని డీసీసీబీ, బ్యాంకు బ్రాంచికి విడుదల చేస్తారు. ఆ బ్యాంకు వారు రుణమాఫీ మొత్తాన్ని ప్యాక్స్‌లో ఉన్న రైతుల ఖాతాల్లో జమచేస్తారు.
⇒ ప్రతి రైతు కుటుంబానికి రుణమొత్తం ఆధారంగా ఆరోహణ క్రమంలో మాఫీ మొత్తాన్ని జమ చేయాలి.
⇒ కటాఫ్ తేదీ నాటికి ఉన్న మొత్తం రుణం, లేదా రూ.2 లక్షలు.. వీటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని రైతు కుటుంబం పొందే అర్హత ఉంటుంది.
⇒ ఏదైనా రైతు కుటుంబానికి రూ.2 లక్షలకుపైగా రుణం ఉంటే.. రైతులు అదనంగా ఉన్న రుణాన్ని మొదట బ్యాంకుకు చెల్లించాలి. ఆ తర్వాతే రూ.2లక్షల మొత్తాన్ని రైతు కుటుంబ సభ్యుల రుణ ఖాతాలకు బదిలీచేస్తారు.
⇒ రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణమున్న పరిస్థితులలో.. కుటుంబంలో మహిళల పేరిట ఉన్న రుణాన్ని మొదట మాఫీ చేసి, మిగతా మొత్తాన్ని దామాషా పద్ధతిలో కుటుంబంలోని పురుషుల పేరిట ఉన్న రుణాలను మాఫీ చేస్తారు.
వీరికి రుణమాఫీ వర్తించదు
⇒ పంట రుణమాఫీ పథకం ఎస్‌హెచ్‌జీలు, జేఎల్‌జీలు, ఆర్‌ఎంజీలు, ఎల్‌ఈసీఎస్‌లు తీసుకున్న రుణాలకు వర్తించదు.
⇒ పునర్వ్యవస్థీకరించిన లేదా రీషెడ్యూల్ చేసిన రుణాలకు వర్తించదు.
⇒ కంపెనీలు, సంస్థలు తీసుకున్న పంట రుణాలకు వర్తించదు. అయితే ప్యాక్స్‌ల ద్వారా తీసుకున్న పంట రుణాలకు వర్తిస్తుంది.
⇒ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం మినహాయింపుల నిబంధనలను.. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీని ఆచరణాత్మకంగా అమలు చేయడం కోసం వీలైనంత వరకు పరిగణనలోకి తీసుకుంటారు.
మార్గదర్శకాల మేరకు బ్యాంకులు, రైతుల బాధ్యతలివీ..
⇒ ప్రతి బ్యాంకు ప్రభుత్వం ఇచ్చిన ప్రొఫార్మాలో డేటాను ప్రభుత్వానికి సమర్పించాలి.
⇒ పథకం కోసం నిర్వహించే ప్రతి డాక్యుమెంటుపై, రూపొందించిన ప్రతి జాబితాపై బ్యాంకు బీఎన్‌వో డిజిటల్ సంతకం చేయాలి. నిర్ణీత మార్గదర్శకాలను ఉల్లంఘించి డేటాను సమర్పించినట్టు భవిష్యత్తులో గుర్తిస్తే చట్టప్రకారం బ్యాంకులపై చర్యలు ఉంటాయి.
⇒ ఈ పథకం కింద రుణమాఫీ పొందడానికి రైతులు తప్పుడు సమాచారం ఇచ్చినట్టు గుర్తించినా, లేదా మోసపూరితంగా పంటరుణం పొందినట్టుగానీ, అసలు పంట రుణమాఫీకి అర్హులుకారని తేలినా.. ఆ మొత్తాన్ని రికవరీ చేయడానికి వ్యవసాయశాఖ డైరెక్టర్‌కు అధికారం ఉంటుంది.
⇒ రైతుల రుణఖాతాల్లోని డేటా యదార్థతను నిర్ధారించేందుకు... సహకార శాఖ డైరెక్టర్, సహకార సంఘాల రిజి్రస్టార్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో ముందస్తు శాంపిల్ ప్రీఆడిట్‌ను చేపట్టాలి. అమలు అధికారికి ఆ వివరాలను అందజేయాలి.
⇒ రుణమాఫీ పథకంపై రైతుల సందేహాలను, ఇబ్బందులను పరిష్కరించడానికి వ్యవసాయశాఖ డైరెక్టర్ ఒక పరిష్కార విభాగాన్ని ఏర్పాటు చేయాలి. రైతులు తమ ఇబ్బందులపై ఐటీ పోర్టల్ ద్వారా లేదా మండల స్థాయిలో నెలకొల్పే సహాయ కేంద్రాల ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ప్రతి అభ్యర్ధనను సంబంధిత అధికారులు 30 రోజుల్లోపు పరిష్కరించి, దరఖాస్తుదారుకు వివరాలు తెలపాలి.
Comments
Please login to add a commentAdd a comment