గతంలో అనుసరించిన పద్ధతిలోనే ఇప్పుడూ అమలు
ఒక కుటుంబంలో అందరికీ కలిపి గరిష్టంగా రూ.2లక్షల వరకు మాఫీ
పీఎం కిసాన్ మార్గదర్శకాల్లో కొన్నింటిని పరిగణనలోకి తీసుకునే అవకాశం
నేడో, రేపో మార్గదర్శకాలు రావొచ్చన్న వ్యవసాయ శాఖ వర్గాలు
పంటలు పండించే ప్రతి రైతుకు లబ్ధి చేకూరేలా పథకం ఉంటుందని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: కుటుంబం యూనిట్‌గా పంటల రుణమాఫీని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఒక కుటుంబంలోని వారి పేరిట బ్యాంకుల్లో పంట రుణాలు ఎంత ఉన్నా.. గరిష్టంగా రూ.2 లక్షల వరకు మాత్రమే మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు కసరత్తు పూర్తయిందని.. నేడో, రేపో మార్గదర్శకాలు విడుదల కావొచ్చని తెలిపాయి. ఒక కుటుంబాన్ని ఎలా లెక్కలోకి తీసుకోవాలన్న దానిపై అధికారులు ప్రాథమికంగా నిర్ణయానికి వచి్చనట్టు తెలిసింది. రేషన్‌కార్డుగానీ, గ్రామ పంచాయతీ రికార్డుగానీ, వ్యవసాయశాఖ వద్ద ఇప్పటికే ఉన్న డేటాను ఆధారం చేసుకొనిగానీ కుటుంబాలను అంచనా వేయాలని భావిస్తున్నట్టు సమాచారం.
అనంతరం ఒక రైతు కుటుంబానికి ఎన్ని బ్యాంకు ఖాతాలు, వాటిలో ఎన్ని పంట రుణాలు ఉన్నప్పటికీ.. మొత్తం రూ.2 లక్షల వరకే మాఫీ చేయనున్నారు. రుణాలు ఉన్న కుటుంబ సభ్యుల మధ్య దామాషా ప్రకారం ఈ మాఫీ సొమ్మును విభజిస్తారు. ఒక కుటుంబం అంటే.. భర్త, భార్య, వారిపై ఆధారపడి ఉన్న పిల్లలను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ మార్గదర్శకాలు విడుదలైన వెంటనే గ్రామాల వారీగా రైతుల జాబితా తయారు చేస్తారు. బ్యాంకుల అధికారులతో కలసి రుణాలున్న వారి జాబితా తయారు చేస్తారు. చివరగా గ్రామసభలో చర్చించి తుది జాబితాను సిద్ధం చేయనున్నారు.
పీఎం కిసాన్ నిబంధనల అమలు యోచన!
వచ్చే నెల 15వ తేదీ నాటికి పంట రుణాలను మాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం రూ.31 వేల కోట్లు అవసరమని అంచనా వేశారు. 2018 డిసెంబర్ 12వ తేదీ నుంచి 2023 డిసెంబర్ 9 వరకు ఐదేళ్లలో రాష్ట్ర రైతులు తీసుకున్న రూ.2 లక్షల మేరకు పంట రుణాలను మాఫీ చేయనున్నారు. దాదాపు 47 లక్షల మంది రైతులకు దీనితో లబ్ధి జరుగుతుందని అంచనా. అయితే రుణమాఫీ కోసం పీఎం కిసాన్ పథకంలోని మార్గదర్శకాలను అమలు చేసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.
పీఎం కిసాన్ పథకంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జెడ్పీ చైర్మన్లు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అధిక ఆదాయం ఉండి ఐటీ పన్ను చెల్లించేవారిని మినహాయించారు. అదే తరహాలో ఇప్పుడు రుణమాఫీని మినహాయించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఆదాయ పన్ను చెల్లించే అందరినీ కాకుండా అధిక ఆదాయం ఉన్నవారిని మాత్రమే మినహాయించే ఆలోచన ఉన్నట్టు సమాచారం.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో అందరినీ మినహాయించకుండా.. అటెండర్లు వంటి చిన్నస్థాయి ఉద్యోగులకు రైతు రుణమాఫీ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. అయితే ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాలని.. మిగిలే మొత్తం ఎక్కువగా ఉంటేనే పీఎం కిసాన్ నిబంధనలు అమలు చేయాలని, లేకుంటే ఉదారంగానే రుణమాఫీ ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఏదేమైనా పంటలు పండించే ప్రతి రైతుకు ప్రయోజనం కలిగించేలా పథకం అమలు జరుగుతుందని అధికారులు అంటున్నారు.
బంగారం పెట్టి తీసుకున్న రుణాలు కూడా..!
బంగారం తాకట్టు పెట్టి పంట రుణాలు తీసుకున్న రైతులకు కూడా రుణమాఫీ పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. గ్రామీణ బ్యాంకుల్లో పట్టాదారు పాస్‌బుక్‌ను జతచేసి, పంటల కోసం తీసుకున్న బంగారం రుణాలకు మాత్రమే రుణమాఫీ చేయాలని భావిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో తీసుకున్న బంగారు రుణాలను మాఫీ నుంచి మినహాయించాలనే యోచన ఉన్నట్టు సమాచారం.
గతంలోనూ ఇదే తరహా నిబంధనలు అమలు చేశారు. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్‌లు, కో–ఆపరేటివ్ క్రెడిట్ సంస్థలు (అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంకులు సహా), ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రైతులకు పంపిణీ చేసిన రుణాలు, బంగారం తాకట్టుపెట్టి తీసుకున్న పంట రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment