రైతు భరోసా పథకంపై కేబినెట్ సబ్ కమిటీ మార్గదర్శకాలు సిద్ధం
పెట్టుబడి సాయం కోసం ఏడు ఎకరాల సీలింగ్ విధించే అవకాశం
ఒక కుటుంబంలో ఎందరి పేరిట ఎంత భూమి ఉన్నా.. మొత్తంగా ఏడెకరాలకే పెట్టుబడి సాయం!
ఎన్‌ఆర్‌ఎస్‌సీ సహకారంతో సాగు భూముల శాటిలైట్ సర్వే
క్షేత్ర స్థాయిలో సహాయ వ్యవసాయ అధికారులతో నిర్ధారణ
ఐటీ చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు పెట్టుబడి సాయం కట్?
పీఎం కిసాన్ సమ్మాన్ నిధిలోని కొన్ని మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోనున్న ప్రభుత్వం
ఈ నెల 30న జరిగే కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపే చాన్స్.. సంక్రాంతి నుంచి అమలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగులో ఉన్న భూములకు మాత్రమే పెట్టుబడి సాయం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులు సాగు చేసిన భూమిని శాస్త్రీయ పద్ధతిలో లెక్కగట్టి తదనుగుణంగా ‘రైతు భరోసా’ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. రైతులు భూమిని సాగు చేశారో లేదో తెలుసుకునేందుకు ప్రతి సీజన్‌లో శాటిలైట్ సర్వే చేయాలని కూడా నిర్ణయించింది. ఇందుకోసం నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ) సహకారాన్ని తీసుకోనుంది. అదే సమయంలో సహాయ వ్యవసాయ అధికారుల (ఏఏఓలు)తో క్షేత్రస్థాయిలో పంటల లెక్కలు సేకరించనుంది.
ఎన్‌ఆర్‌ఎస్‌సీ సాంతికేతిక పరిజ్ఞానంతో ఏ రైతు ఎంత భూమిలో ఏ పంట సాగు చేశాడనే వివరాలను తీసుకుని.. ఏఏఓలు ఇచ్చే నివేదికలతో సరిపోల్చుకొని రైతు భరోసాను జమ చేయాలనే అభిప్రాయంతో ఉన్నట్టు తెలిసింది. తద్వారా సాగు చేసే భూమికే పెట్టుబడి సాయం అందించడంతోపాటు రైతులను వ్యవసాయం దిశగా ప్రోత్సహించినట్టు అవుతుందని భావిస్తున్నట్టు సమాచారం. దీని ప్రకారం రైతులకు ఖరీఫ్ (వానకాలం)లో వచ్చే పెట్టుబడి సాయానికి, రబీ (యాసంగి)లో అందే సాయానికి మధ్య కూడా తేడా ఉండే అవకాశం ఉంది. రాష్ట్రంలో రబీలో సాగు విస్తీర్ణం తక్కువగా ఉంటుండటమే దీనికి కారణం.
మార్గదర్శకాల రూపకల్పన దాదాపు పూర్తి
రైతులకు ఆరేళ్లుగా అందుతున్న పెట్టుబడి సాయం ‘రైతుబంధు’ స్థానంలో... కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న ‘రైతు భరోసా’ పథకానికి మార్గదర్శకాల రూపకల్పన దాదాపు పూర్తయింది. కొత్త సంవత్సరంలో సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించినట్టు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఇటీవల శాసనసభలో ప్రకటించారు కూడా. ఈ నెల 30న జరిగే మంత్రివర్గ సమావేశంలో రైతు భరోసాకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ‘రైతు భరోసా’ అమలులో ప్రభుత్వం అనుసరించనున్న విధివిధానాలపై చర్చ జరుగుతోంది.
ఏడెకరాల సీలింగ్?
ఇక ఒక రైతుకు గరిష్టంగా ఎన్ని ఎకరాల వరకు రైతుభరోసా పెట్టుబడి సాయం ఇవ్వాలనే విషయంలో మంత్రివర్గ సమావేశంలో స్పష్టత రానుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఐదెకరాల్లోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వ పెట్టుబడి సాయం అందుతున్న నేపథ్యంలో... రాష్ట్ర పథకంలోనూ భూమికి సీలింగ్ విధించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేసినట్లు సమాచారం.
పదెకరాలలోపు భూమికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని తొలుత అభిప్రాయం వ్యక్తమైనా.. మధ్యే మార్గంగా ఏడెకరాల సీలింగ్‌ను అమలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. పీఎం కిసాన్ పథకంలో ఐదెకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతుకు పెట్టుబడి సాయం అందదు. రాష్ట్ర ప్రభుత్వం అలా కాకుండా ఎంత భూమి ఉన్నా గరిష్టంగా ఏడెకరాలకు రైతు భరోసా సాయం అందించాలని భావిస్తున్నట్టు సమాచారం.
కుటుంబం యూనిట్‌గా తీసుకుంటే..?
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో కుటుంబం యూనిట్‌గా తీసుకున్నారు. రైతు రుణమాఫీకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే విధానాన్ని అనుసరించి కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుని.. ఒక కుటుంబం మొత్తానికి కలిపి రూ. 2లక్షల రుణమాఫీ చేసింది.
ఇప్పుడు రైతు భరోసాకు కూడా కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. అంటే ఒక కుటుంబంలో ఎంత మంది పేర్ల మీద ఎంత భూమి ఉన్నప్పటికీ... ఆ కుటుంబం మొత్తానికి కలిపి ఏడెకరాలకే ప్రభుత్వ సాయం అందేలా విధి విధానాలు రూపొందించినట్టు తెలిసింది.
ఇక గత ఐదేళ్లలో వరుసగా రెండేళ్లపాటు ఆదాయ పన్ను చెల్లించినవారు కుటుంబంలో ఒక్కరున్నా కూడా.. ఆ కుటుంబానికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వర్తించదు. ఈ విధానాన్ని రైతు భరోసాకు కూడా వర్తింపజేస్తే పెద్ద సంఖ్యలో అర్హులు తగ్గిపోయే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, పలు వర్గాలకు కోత!
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్రం ఇచ్చే పెట్టుబడి సాయానికి కఠిన నిబంధనలు అమలవుతున్నాయి. అందులో ఒకటి ఆదాయ పరిమితి. ఆదాయపన్ను చెల్లించే వ్యాపారులు, కార్పొరేట్ ఉద్యోగులతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులను పీఎం కిసాన్ సమ్మాన్‌నిధి నుంచి మినహాయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్రాంతి నుంచి తీసుకురానున్న రైతుభరోసాలో కూడా ఇదే విధానాన్ని అమలు చేయనున్నట్టు తెలిసింది.
సాగు చేసే నిజమైన రైతులకే సర్కార్ సాయం అందాలన్న లక్ష్యంలో భాగంగా వీరికి రైతుభరోసా తొలగించాలని మంత్రివర్గ ఉపసంఘం సూచించినట్టు తెలిసింది. అయితే ఇందులో నాలుగో తరగతి ఉద్యోగులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను మినహాయించినట్టు సమాచారం. కుటుంబ ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకొని.. కుటుంబంలోని ఇతర సభ్యులు ఐటీ చెల్లింపుదారులుగా ఉంటే కోత పెట్టాలనే యోచన ఉన్నట్టు తెలిసింది.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సాయానికి అనర్హులు వీరే..
ప్రజాప్రతినిధులు
ప్రభుత్వ ఉద్యోగులు (జీతాలు పొందేవారు, పెన్షనర్లు)
ఆదాయ పన్ను చెల్లించేవారు (గత ఐదేళ్లలో కనీసం వరుసగా రెండేళ్లు ఐటీ చెల్లించినవారు. ఒక్కరున్నా ఆ కుటుంబానికి పథకం వర్తించదు)
డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్ట్స్ వంటి నిపుణులు
కుటుంబంలో ఎంత మంది రైతులు ఉన్నా సరే.. ఒక్కరికి మాత్రమే పెట్టుబడి సాయం
రైతులు, పెట్టుబడి సాయంలో తగ్గుదల
కొత్త మార్గదర్శకాలతో రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయం తగ్గే అవకాశం ఉంది. రాష్ట్రంలో పీఎం కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా 30 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందుతుండగా.. రైతుబంధు ద్వారా 1,48,70,045 ఎకరాలకు సంబంధించి 65 లక్షల మంది రైతులకు సాయం అందుతూ వస్తోంది. ఏటా సగటున రూ.13 వేల కోట్ల చొప్పున ఆరేళ్లలో రూ.80,453.41 కోట్లను ప్రభుత్వం అందజేసింది.
ఇందులో రూ.21,283.66 కోట్లు సాగులో లేని భూములకు, గుట్టలు, రాళ్లతో కూడిన భూములకు అందాయని మంత్రి తుమ్మల అసెంబ్లీలో చెప్పారు. ఇలా సాగులో లేని భూములతోపాటు ప్రభుత్వం పెట్టనున్న ఆంక్షలతో.. ఏటా రూ.3 వేల కోట్ల నుంచి రూ. 4 వేల కోట్ల మేర పెట్టుబడి సాయంలో కోతపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment