
త్వరలో ఉత్తర్వులు వెలువడే అవకాశం
సంస్థను మరింత బలోపేతం చేసేలా అడుగులు
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ దారిద్య్ర నిర్మూలన సంస్థ (సెర్ప్)ను పూర్తిస్థాయిలో పునర్‌వ్యవస్థీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వపరంగా స్వల్ప, దీర్ఘకాలిక లక్ష్యాల సాధన దిశగా ఈ సంస్థను మరింత క్రియాశీలం చేసేలా కార్యాచరణ ప్రణాళికలను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రా«థమ్యాలకు తగ్గట్టుగా, ఆయా అంశాలకు ఇస్తున్న ప్రాధాన్యతలకు అనుగుణంగా అధికారులు, సిబ్బంది చురుగ్గా పనిచేసేలా సెర్ప్‌లో మార్పులు చేర్పులు చేపడుతున్నట్టు అధికారవర్గాల సమాచారం.
ఇందులో భాగంగా ఏడెనిమిదేళ్లుగా హైదరాబాద్‌లో, సొంత జిల్లాల్లో పాతుకుపోయిన అధికారులకు స్థానచలనం కల్పించి.. బదిలీలు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఒకేచోట ఎక్కువ కాలం పాతుకుపోయిన వారిని తప్పనిసరిగా ఇతర ప్రాంతాలకు పంపించాలని అనుకుంటున్నారు. కొద్దినెలల క్రితం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి జరిపిన సాధారణ బదిలీలు వీరికి వర్తించలేదు. దీంతో సెర్ప్‌లో పనిచేస్తున్న 3,800 మందిని అతి త్వరలో బదిలీ చేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. దీనికి సంబంధించి మంత్రి స్థాయిలో నిర్ణయమైందని..ఒకటి, రెండురోజుల్లోనే ఉత్తర్వులు వెలువడొచ్చునని అధికారవర్గాల సమాచారం.
మరిన్ని ఫలితాలు సాధించేలా...
సెర్ప్‌ను ఒక రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం యోచిస్తోంది. మహిళలు.. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేద, ఇతర వర్గాల మహిళలకు ఆర్థిక చేయూతతో స్వయంసమృద్ధి సాధించే దిశలో వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో వేగం మరింత పెంచాలని పీఆర్‌శాఖ నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లోని కోటిమంది మహిళలకు ప్రయోజనం చేకూర్చేందుకు వివిధ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే.
మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు, ఆర్టీసీకి అద్దెకు బస్సులు ఇవ్వడం, పెట్రోల్ బంక్‌లు ఇతర రూపాల్లో అవకాశాల కల్పనకు చర్యలు చేపడుతున్నారు. మహిళా సాధికారత సాధనలో భాగంగా ఆర్థిక, వ్యాపార రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా సమగ్రాభివృద్ధి సాధించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ దిశగా మంత్రి సీతక్క సైతం ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలిసింది.
స్వయం సహాయక బృందాలకు వడ్డీ చెక్కుల విడుదల, అంగన్‌వాడీ సిబ్బంది, మహిళా సంఘ సభ్యులకు చీరల పంపిణీ, మేజర్ రైల్వే స్టేషన్లలో స్వయం సహాయక సంఘాల స్టాళ్ల (వన్ స్టేషన్–వన్ స్టాల్) ఏర్పాటు వంటివి చేపడుతున్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో పెట్రోల్ బంక్‌లు, గ్యాస్ ఏజెన్సీలను మహిళా సంఘాలకు ఇప్పించే యోచనలో సర్కారు ఉంది. దీనికి సంబంధించి త్వరలోనే అయిల్ కంపెనీలతో చర్చలు జరపనున్నట్టు సమాచారం.