మాటకు కట్టుబడి మాఫీ | CM Revanth Reddy started the loan waiver scheme | Sakshi
Sakshi News home page

మాటకు కట్టుబడి మాఫీ

Published Fri, Jul 19 2024 4:14 AM | Last Updated on Fri, Jul 19 2024 4:14 AM

CM Revanth Reddy started the loan waiver scheme

తొలివిడతలో రూ. లక్ష వరకు రుణమాఫీ పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి

పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి, వ్యవసాయ మంత్రి తుమ్మల 

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రైతులను ఉద్దేశించి ప్రసంగించిన రేవంత్‌రెడ్డి 

11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 6,098 కోట్లు జమ

వరంగల్‌ రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ 

కాంగ్రెస్‌ మాటే శిలా శాసనమని మరోసారి రుజువైంది 

ఆగస్టు పూర్తి కాకముందే మొత్తం మూడు విడతల్లో రూ.2 లక్షలు మాఫీ 

దేశ చరిత్రలో తొలిసారిగా రూ.31 వేల కోట్లు మాఫీ చేస్తున్నామన్న సీఎం 

7 నెలల్లో పథకాలకు రూ.29 వేల కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడి  

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఏకకాలంలో రుణ­మాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పా­రు. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6,098 కోట్ల నగదు జమ చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్‌ మాటే శిలాశాసనమని మరోసారి రుజువైందని అన్నారు. రైతుల రుణ మాఫీ పథకంలో భాగంగా గురువారం సచివాలయంలో తొలి విడతగా రూ. లక్ష వరకు మాఫీ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతో కలిసి ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల వద్ద ఉన్న రైతులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన మాట్లాడారు.  

ఇది మరపురాని రోజు 
‘నాడు కరీంనగర్‌లో సోనియాగాంధీ మాట ఇచ్చారు. అనంతరం పార్టీకి తీరని నష్టం జరుగుతుందని తెలిసినా, మాట తప్పని, మడమ తిప్పని నాయకురాలిగా, రాష్ట్ర ప్రజలు శాశ్వతంగా గుర్తుపెట్టుకునేలా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. గత పాలకులు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి రెండుసార్లు మాట తప్పారు. మొదటి ఐదేళ్లలో కేసీఆర్‌ రూ.16 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి రూ.12 వేల కోట్లు మాత్రమే ఇచ్చారు. రెండోసారి ప్రభుత్వంలో రూ.12 వేల కోట్లు మాఫీ చేస్తానని చెప్పి కేవలం రూ.9 వేల కోట్లు మాత్రమే చేశారు. 

రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నా కేసీఆర్‌ ప్రజలకిచ్చిన మాటను పూర్తిస్థాయిలో నెరవేర్చలేదు. ఈ నేపథ్యంలో 2022 మే 6న వరంగల్‌లో లక్షలాది మంది రైతుల సమక్షంలో రాహుల్‌గాంధీ రైతు డిక్లరేషన్‌ ప్రకటించారు. రుణమాఫీ చేస్తామన్నారు. 2023 సెపె్టంబర్‌ 17న తుక్కుగూడాలో సోనియాగాంధీ ఆరు గ్యారెంటీలను ప్రకటించారు. రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చారు. వారిచ్చిన మాట ప్రకారమే నేడు సచివాలయంలో కూర్చొని ధైర్యంగా తెలంగాణ రైతుల ఖాతాల్లో రూ.6,098 కోట్లను జమ చేస్తున్నాం. 

నా 16 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఇది మరుపురాని రోజు. రుణమాఫీ చేసే భాగ్యం నాకు కలిగింది. కేసీఆర్‌ కటాఫ్‌ పెట్టిన తేదీ మరునాటి నుంచే రుణమాఫీ అమలు చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసిన సోనియాగాంధీ పుట్టిన రోజు డిసెంబర్‌ 9ని రుణమాఫీ కటాఫ్‌గా పెట్టాం. ఏ అవాంతరాలు లేకుండా రుణమాఫీ పూర్తి చేస్తాం. ముందుగా ఈ రోజు రూ.లక్ష వరకు రుణ విముక్తి కల్పించాం. రూ.లక్ష నుంచి రూ. లక్షన్నర రుణం ఉన్న రైతులకు త్వరలోనే రుణ విముక్తి కలుగుతుంది. ఆగస్టు నెల పూర్తి కాకముందే రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేసి తీరతాం. ఇది దేశ చరిత్రలోనే తొలిసారి..’అని సీఎం అన్నారు. 

రేషన్‌కార్డు ప్రాతిపదిక కాదు 
‘కొంతమంది రైతు రుణమాఫీకి రేషన్‌కార్డు తప్పనిసరిగా ఉండాలనే అపోహ çసృష్టిస్తున్నారు. రైతు రుణమాఫీకి రేషన్‌ కార్డు ప్రాతిపదిక కాదు. పాస్‌ బుక్‌నే కొలబద్ద. దొంగలు చెప్పే దొంగ మాటలు నమ్మొద్దు. రుణాలు తీసుకున్న దాదాపు 6.36 లక్షల మందికి రేషన్‌ కార్డులు లేవు. అందుకే పాసుబుక్‌ ఆధారంగా రుణమాఫీ చేస్తున్నాం. ప్రతి రైతు రుణమాఫీకి కావాల్సిన చర్యలు చేపడుతున్నాం. సమస్యలు తలెత్తితే బ్యాంకు అధికారులను సంప్రదించాలి. బ్యాంకు అధికారులు కూడా రైతులకు అవగాహన కల్పించాలి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల స్వయంగా రైతు. ఆర్థిక మంత్రిగా భట్టి విక్రమార్క రుణమాఫీకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రయత్నం చేశారు..’అని రేవంత్‌ చెప్పారు.  

త్వరలో వరంగల్‌లో రాహుల్‌గాందీతో సభ 
‘గత ప్రభుత్వంలో ఉద్యోగులకు జీతాలు కూడా సరిగా ఇవ్వలేదు. మా ప్రభుత్వం ఒకటో తారీఖున జీతాలు ఇస్తోంది. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే సంక్షేమ కార్యక్రమాలకు రూ.29 వేల కోట్లు ఖర్చు చేశాం. గత ప్రభుత్వ అప్పులకు మిత్తీగా ప్రతి నెలా రూ.7 వేల కోట్లు చెల్లిస్తున్నాం. జీతాలు, పింఛన్ల కోసం రూ.5 వేల కోట్లు కేటాయిస్తున్నాం. ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. వ్యవసాయం దండగ కాదు.. పండుగ అని నిరూపించాం. 

రైతు రుణమాఫీలో దేశానికి తెలంగాణ మోడల్‌గా ఉండబోతుంది. 8 నెలల్లో రుణమాఫీ హామీని నెరవేర్చి దేశంలోనే తలెత్తుకునేలా ఉన్నాం. సవాల్‌ చేసిన ఆయనను రాజీనామా చేయమని మేం అడగం. ఇప్పటికైనా గాంధీ కుటుంబం మాట ఇస్తే తప్పదని వారు గుర్తు పెట్టుకోవాలి. రైతు రుణమాఫీ సందర్భంగా రాహుల్‌గాంధీని ఆహా్వనించి వరంగల్‌లో బహిరంగ సభ నిర్వహిస్తాం. త్వరలో మంత్రివర్గ సహచరులతో కలిసి ఢిల్లీ వెళ్లి ఆయన్ను ఆహ్వానిస్తాం..’అని ముఖ్యమంత్రి తెలిపారు.  

రాష్ట్ర రైతులకు పెద్ద పండుగ: భట్టి 
రాష్ట్రంలో ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తున్న తెలంగాణ వైపు దేశం మొత్తం ఆశ్చర్యంగా చూస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేసిన చరిత్ర లేదని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఇది పెద్ద పండుగ అని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలు ఇప్పటికే అమలు చేయడంతో పాటు ఈ రోజు రైతు రుణమాఫీ అమలు చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుందని అన్నారు. 

ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి రూ.7 లక్షల కోట్ల అప్పుతో తమకు అప్పజెప్పినప్పటికీ రూపాయి రూపాయి పోగేసి రుణమాఫీ అమలు చేసి చూపిస్తున్నామని చెప్పారు. కాగా రైతు రుణమాఫీ పురస్కరించుకుని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాం«దీకి ధన్యవాదాలు తెలుపుతు సమావేశంలో తీర్మానం చేశారు. కార్యక్రమం చివర్లో కొందరు రైతులకు రుణమాఫీ చెక్కులు సీఎం పంపిణీ చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement