
సర్కారుకు సమకూరిన రూ.9,995 కోట్లపై స్పష్టత
రాష్ట్ర ప్రభుత్వం, టీజీఐఐసీల సంయుక్త ప్రణాళికతోనే నిధులు
ఆర్‌బీఐకి పూచీకత్తు సమర్పించిన రాష్ట్ర ప్రభుత్వం
నిధులు సేకరించి ఇచ్చిన సంస్థకు 400 ఎకరాలు తాకట్టు పెట్టిన టీజీఐఐసీ
బాండ్ల ద్వారా తీసుకున్న మొత్తం 2034 నాటికి తిరిగి చెల్లించేలా షెడ్యూల్
టీజీఐఐసీ చెల్లించలేని పక్షంలో తాము చెల్లిస్తామన్న ప్రభుత్వం
బాండ్లు కొన్న కంపెనీలకు డిబెంచర్ ట్రస్టీగా ఉన్న బీకన్ ట్రస్టీషిప్ సంస్థ
సాక్షి, హైదరాబాద్: కంచ గచ్చిబౌలిలోని వివాదాస్పద 400 ఎకరాల భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు ఎలా సమకూరాయన్న అంశం ఓ కొలిక్కి వచ్చింది. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (టీజీఐఐసీ) జారీ చేసిన బాండ్ల ద్వారా తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది.
తాము జారీ చేసిన బాండ్లను కొనుగోలు చేసే సంస్థలకు డిబెంచర్ ట్రస్టీగా వ్యవహరించిన బీకన్ ట్రస్టీషిప్ లిమిటెడ్ అనే సంస్థకు టీజీఐఐసీ ఆ 400 ఎకరాల భూములను తాకట్టు పెట్టింది. ఈ రెండు ప్రక్రియల ద్వారానే రూ.9,995 కోట్లను ప్రభుత్వం సమకూర్చుకుందని తేలింది. గత ఏడాది డిసెంబర్ 16న తమ పూచీకత్తును ఆర్‌బీఐకి రాష్ట్ర ప్రభుత్వం పంపగా, ఈ ఏడాది మార్చి 24న బీకన్ ట్రస్టీషిప్ లిమిటెడ్‌కు టీజీఐఐసీ ఆ 400 ఎకరాల భూములను తనఖా పెట్టిందని డాక్యుమెంట్లు వెల్లడిస్తున్నాయి.
ప్రక్రియ ఎలా ప్రారంభమైందంటే..
కంచ గచ్చిబౌలి భూములు ఆసరాగా బహిరంగ మార్కెట్ నుంచి డిబెంచర్లు లేదా బాండ్ల రూపంలో నిధులు సమీకరించుకునేందుకు టీజీఐఐసీ గత ఏడాది జూన్‌లో నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ద్వారా ట్రస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థను మర్చంట్ బ్యాంకర్‌గా ఎంపిక చేసింది. నిధుల సమీకరణకు అవసరమైన సలహాలు ఇవ్వడంతో పాటు రుణం ఇవ్వగలిగే పరపతి కలిగిన ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు జరపడం ఈ మర్చంట్ బ్యాంకర్ బాధ్యత.
అయితే ఈ బాధ్యతల నిర్వహణ కోసం ఆ సంస్థ మరో డిబెంచర్ ట్రస్టీని ఏర్పాటు చేసుకుంది. అదే ముంబై కేంద్రంగా పనిచేసే బీకన్ ట్రస్టీషిప్ లిమిటెడ్ (సెబీలో రిజిస్టర్ అయిన సంస్థ). ఈ ట్రస్టీ సంస్థ బాండ్లు కొనుగోలు చేసే సంస్థలతో సంప్రదింపులు జరిపి వారి ద్వారా బాండ్లు కొనుగోలు చేయించి, ఆయా కంపెనీల నుంచి నిధులను సేకరించి టీజీఐఐసీకి అప్పగించింది.
ఇందుకోసం మర్చంట్ బ్యాంకర్ అయిన ట్రస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ ప్రైవేటు లిమిటెడ్‌కు టీజీఐఐసీ కమీషన్ రూపంలో రూ.169.83 కోట్లు చెల్లించింది. దీంతో పాటు ఈ ఏడాది మార్చి 24న టీజీఐఐసీ ఆ 400 ఎకరాలకు చెందిన టైటిల్ డీడ్స్‌ను నిధులు సేకరించి ఇచ్చిన బీకన్ ట్రస్టీషిప్‌కు డిపాజిట్ చేసింది. అంటే తనఖా పెట్టిందన్నమాట. ఈ ప్రక్రియ అధికారికంగా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ రూపంలో జరిగింది.
బాధ్యత మాదే: ప్రభుత్వం
టీజీఐఐసీ జారీ చేసిన బాండ్లు కొనుగోలు చేసిన సంస్థలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా తనదే బాధ్యత అని, నిర్దేశిత షెడ్యూల్‌లో ఆ బాండ్ల మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లిస్తామని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి సంతకంతో 2024, డిసెంబర్ 16న పంపిన లేఖను ఈ ఏడాది జనవరి 3వ తేదీన ఆర్‌బీఐ ఆమోదించింది. ఈ లేఖ ప్రకారం.. బాండ్లకు సంబంధించిన ప్రతి అంశంలోనూ ప్రభుత్వమే పూచీకత్తుగా ఉంటుంది. ఆర్‌బీఐ ద్వారా నిర్వహించే రాష్ట్ర ప్రభుత్వ ఖాతా నుంచే చెల్లింపులను జమ చేసుకోవచ్చు.
చెల్లింపు షెడ్యూల్‌కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో తగిన మొత్తం లేకపోతే, ప్రత్యేక ఉపసంహరణ సౌలభ్యం (ఎస్‌డీఎఫ్), వేజ్ అండ్ మీన్స్‌తో పాటు అవసరమైతే ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లి మరీ ఆర్‌బీఐ నేరుగా ప్రభు త్వ ఖాతా ద్వారానే బాండ్లు కొనుగోలు చేసిన సంస్థలకు చెల్లింపులు చేయవచ్చు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్‌బీఐ ఎలాంటి సమాచారం ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు.
అసలు, వడ్డీ మొత్తం రూ.15,776 కోట్లు
బాండ్ల ద్వారా తీసుకున్న మొత్తాన్ని ఎప్పుడెప్పుడు ఎంత తిరిగి చెల్లించాలనే షెడ్యూల్‌ను ఆర్‌బీఐ ఇచ్చింది. అసలు, దానికి వడ్డీ కలిపి 2025 మార్చి 31 నుంచి 2034 నవంబర్ 24 వరకు 40 దఫాల్లో రూ.15,776 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ఇందులో రూ.9,995 కోట్లు అసలు కాగా, పదేళ్ల కాలంలో రూ.5,781 కోట్లు వడ్డీ కింద చెల్లించాల్సి ఉంది. కాగా మొదటి రెండేళ్లలో చెల్లించే మొత్తాన్ని వడ్డీ కిందనే జమ చేసుకుంటారు. జరిగింది ఇది కాగా టీజీఐఐసీ భూములను ఐసీఐసీఐకి తాకట్టు పెట్టిందనే ప్రచారం జరిగింది.
కొనుగోలు చేసిన ప్రముఖ సంస్థలు ఇవే
టీజీఐఐసీ బాండ్లను పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు కొనుగోలు చేశాయి. ఒక్కో బాండ్ విలువను రూ.1 లక్షగా నిర్ణయించారు. మొత్తం 37 కంపెనీలు 9,995 కోట్ల విలువైన 9,99,528 బాండ్లను కొనుగోలు చేశాయి. ఇందులో అత్యధికంగా బార్‌క్లేస్ బ్యాంక్ పీఎల్‌సీ సంస్థ లక్ష బాండ్లు కొనుగోలు చేసింది. ఆదిత్య బిర్లా ఫైనాన్స్, ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్ లిమిటెడ్, కొటక్ మహీంద్రా, లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్‌అండ్‌టీ), మోర్గాన్ స్టాన్లీ ఏషియా, నిప్పాన్ లాంటి ప్రముఖ సంస్థలు కూడా బాండ్లు కొనుగోలు చేశాయి.
డిబెంచర్ లేదా బాండ్ అంటే..?
ఒక కంపెనీ లేదా సంస్థ జారీ చేసే అప్పు పత్రాన్ని బ్యాంకింగ్ పరిభాషలో డిబెంచర్ లేదా బాండుగా వ్యవహరిస్తారు. ఈ బాండ్లను నిర్దిష్ట కాల వ్యవధితో నిర్దిష్ట వడ్డీ రేటుతో జారీ చేస్తారు. ఈ అప్పు పత్రం తీసుకునే (కొనుగోలు చేసే) కంపెనీలు డబ్బును ఆ పత్రం జారీ చేసిన కంపెనీ లేదా సంస్థకు ఇస్తాయి. అప్పులు ఇచ్చిపుచ్చుకునే సంస్థల మధ్య ఆ అప్పు పత్రం లేదా బాండే హామీగా ఉంటుంది.