
కొనసాగుతున్న నిర్మాణాల కూల్చివేతలు
ఇప్పటి వరకు 205 ఆస్తుల సేకరణ
బాధిత కుటుంబాలకు రూ. 212 కోట్ల పరిహారం
మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడి
పాతబస్తీ మెట్రోరైల్ విస్తరణలో భాగంగా ఆస్తుల సేకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 205 ఆస్తుల సేకరణ పనులు పూర్తయ్యాయి. బాధిత కుటుంబాలకు రూ.212 కోట్ల పరిహారం చెల్లించినట్లు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు పాతబస్తీలోని లహోటీ బిల్డింగ్, అక్బర్ ఫంక్షన్ హాళ్లను తొలగించారు. షబ్బార్ కేఫ్, మీనా ప్లాజా, పిస్తాహౌజ్, స్వాగత్ హోటల్, ఆక్వా ప్యూరిఫైర్ షాప్, అక్బర్ మెకానిక్ షాప్, లిల్లీరోజ్ స్కూల్ భవనాల కూల్చివేత పనులు కొనసాగుతున్నాయని ఎన్వీఎస్ రెడ్డి (NVS Reddy) తెలిపారు.
–సాక్షి, సిటీబ్యూరో
1,100 ఆస్తుల గుర్తింపు..
మెట్రో రెండో దశలో భాగంగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట (Chandrayangutta) వరకు 7.5 కిలోమీటర్ల మార్గంలో మెట్రో నిర్మాణం చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు హెచ్‌ఏఎంఆర్‌ఎల్ పనులు చేపట్టింది. గత ఏడాది క్షేత్రస్థాయిలో భూమి సర్వే, మెట్రో కారిడార్ మార్కింగ్ అనంతరం ఆస్తుల సేకరణ, రోడ్డు విస్తరణపై అధికారులు దృష్టి సారించారు. 7.5 కిలోమీటర్ల మార్గంలో మొత్తం 1,100 ఆస్తులను గుర్తించిన సంగతి తెలిసిందే. చదరపు గజానికి రూ.8,1000 నుంచి రూ.లక్ష చొప్పున ధర నిర్ణయించి పరిహారం చెల్లించేందుకు చర్యలు చేపట్టారు. అదే క్రమంలో కూల్చివేత పనులు కూడా కొనసాగుతున్నాయి.
అత్యంత అప్రమత్తంగా..
ప్రస్తుతం వివిధ చోట్ల రోడ్లకు రెండు వైపులా చిక్కు ముడులుగా ఉన్న కొన్ని క్లిష్టమైన విద్యుత్, టెలిఫోన్ కేబుళ్లను అత్యంత అప్రమత్తంగా తొలగించి తమ ఇంజినీరింగ్ సిబ్బంది మార్గాన్ని సుగమం చేశారని మెట్రో ఎండీ వెల్లడించారు. మెట్రో అధికారులతో పాటు, రెవిన్యూ, పోలీసుల పర్యవేక్షణలో మెట్రో మార్గం విస్తరణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయన్నారు. ప్రభావిత ఆస్తుల యజమానులు స్వచ్ఛందంగా స్పందించి ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన నష్ట పరిహారాన్ని ఆమోదించి తమ ఆస్తులను మెట్రో మార్గం కోసం ఇచ్చారని చెప్పారు.
7.5 కిలోమీటర్లకు రూ.2,714 కోట్లు
మెట్రో రెండో దశలో మొదటి 5 కారిడార్‌లకు రూ.24,269 కోట్లతో సమగ్రమైన ప్రాజెక్టు నివేదికలను రూపొందించారు. ఇందులో భాగంగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు నిర్మించనున్న 7.5 కిలోమీటర్ల మెట్రో నిర్మాణంలో భాగంగా ఆస్తులు కోల్పోయిన వారికి చెల్లించే పరిహారం కాకుండా సుమారు రూ.2,714 కోట్లు ప్రాజెక్టు ఖర్చు కానున్నట్లు అంచనా. దీంతో జూబ్లీబస్‌స్టేషన్ నుంచి నేరుగా చాంద్రాయణగుట్ట వరకు రాకపోకలు సాగించేందుకు అవకాశం లభిస్తుంది. అలాగే.. చార్మినార్‌తో పాటు వివిధ ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చే జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులకు మెట్రో రైల్ రవాణా సదుపాయాన్ని అందజేయనుంది.
చాంద్రాయణగుట్ట నుంచి ఎయిర్‌పోర్టు (Airport) వరకు మెట్రో విస్తరించనున్న సంగతి తెలిసిందే. చాంద్రాయణగుట్ట వద్ద అమీర్‌పేట్ తరహాలో అతిపెద్ద టెర్మినల్ ఏర్పాటు చేయనున్నారు. ఇటు జేబీఎస్ వద్ద అంతర్జాతీయ ప్రమాణాల మేరకు మెట్రో హబ్‌ను ఏర్పాటు చేసి రెండో దశలోనే నార్త్‌సిటీకి మెట్రో విస్తరణ చేపట్టాలనేది ప్రభుత్వ ప్రతిపాదన. నార్త్ సిటీతో పాటు, ఫోర్త్ సిటీ మెట్రో కారిడార్‌ల డీపీఆర్‌లను త్వరలోనే ప్రభుత్వానికి అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు.
చదవండి: కంచ గచ్చిబౌలి భూములపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
కేంద్రం అనుమతి రాగానే..
ఇప్పటికే రోడ్డు విస్తరణ కోసం పలు భవనాలు, కట్టడాలను కూల్చివేసి నిర్మాణ వ్యర్థాలను కూడా తొలగించినట్లు పేర్కొన్నారు. మరోవైపు సున్నితమైన కట్టడాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. రంజాన్ సందర్బంగా విస్తరణ పనుల వేగం కొంత తగ్గినప్పటికీ, ప్రస్తుతం తిరిగి వేగం పుంజుకున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanath Reddy) ఆదేశాల మేరకు త్వరితగతిన పాత నగరం విస్తరణ పనులు పూర్తి చేసి, కేంద్రం అనుమతి లభించిన వెంటనే మెట్రో నిర్మాణ పనులను ప్రారంభిస్తామన్నారు.