నాలుగేళ్లలో పనులు పూర్తి చేయాలని లక్ష్యం
మొత్తం 8 లక్షలకు చేరనున్న ప్రయాణికుల సంఖ్య
హైదరాబాద్ మెట్రో రెండో దశకు రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో కేంద్రం అనుమతి తప్పనిసరిగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం ఆమోదం కీలకంగా మారింది. మొదటి దశ ప్రాజెక్టు అనంతరం రెండో దశకు ప్రణాళికలను రూపొందించినప్పటికీ.. ఇప్పటికే తీవ్ర జాప్యం నెలకొంది. ఢిల్లీ తర్వాత హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. ఈ జాప్యం కారణంగా ఇతర మెట్రోపాలిటన్ నగరాల్లో మెట్రో రెండు, మూడో దశలు కూడా పూర్తయ్యాయి. కానీ.. నగరంలో రెండోదశ ఏడెనిమిదేళ్లు ఆలస్యంగా ప్రారంభం కావడం గమనార్హం. కేబినెట్ ఆమోదంతో ఒక అడుగు ముందుకు పడింది కానీ ఇప్పుడు కేంద్రం అనుమతితో పాటు నిధుల కేటాయింపే కీలకంగా మారింది.
2029 నాటికి పూర్తయ్యే అవకాశం..
భాగ్య నగరం శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మెట్రో రెండో దశ అనివార్యంగా మారింది. మొదటి దశలో మూడు కారిడార్‌లలో మెట్రో పరుగులు తీస్తోంది. నిత్యం సుమారు 5 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. రెండో దశ పూర్తయితే 8 లక్షల మంది మెట్రోల్లో పయనించే అవకాశం ఉంది. నాగోల్ నుంచి రాయదుర్గం వరకు, ఎల్‌బీనగర్ నుంచి మియాపూర్ వరకు, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు చేపట్టిన మెట్రో మొదటి దశ నిర్మాణానికి రూ.22 వేల కోట్ల వరకు ఖర్చు కాగా, ప్రస్తుత రెండో దశకు రూ.24, 269 కోట్లతో హైదరాబాద్ మెట్రో రైల్ డీపీఆర్‌ను రూపొందించింది. 5 కారిడార్‌లలో 76.4 కిలో మీటర్ల మేర నిర్మాణం చేపట్టనున్నారు. కేంద్రం సకాలంలో అనుమతించి నిధులు కేటాయిస్తే 2029 నాటికి రెండో దశ పూర్తయ్యే అవకాశం ఉంది. కేంద్రం నుంచి అనుమతి లభించడంలో ఆలస్యం జరిగితే ఈప్రాజెక్టు మరింత వెనక్కి వెళ్లనుంది. రానున్న బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్రం ఆమోదంతో పాటు నిధుల కేటాయింపు తప్పనిసరి.
9వ స్థానానికి..
మెట్రో రెండో దశలో ఆలస్యం కారణంగా ఢిల్లీ తర్వాత రెండో స్థాననంలో ఉన్న హైదరాబాద్ ఇప్పుడు 9వ స్థానానికి పడిపోయినట్లు రవాణారంగ నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి పెద్ద నగరాలతో పాటు, పుణె, నాగపూర్, అహ్మదాబాద్ వంటి చిన్న నగరాలు కూడా మెట్రో విస్తరణలో హైదరాబాద్‌ను అధిగమించాయి. రెండో దశ నిర్మాణంలో జరిగిన ఆలస్యం వల్ల ప్రాజెక్టు అంచనా వ్యయం కూడా భారీగా పెరిగింది. గత ప్రభుత్వ హయాంలోనే పీపీపీ పద్ధతిలో పూర్తి చేయాల్సిన ఎంజీబీఎస్– ఫలక్‌నుమా మార్గం నిలిచిపోయింది. ప్రస్తుతం దాన్ని రెండో దశలో కలిపి చాంద్రాయణగుట్ట వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.
చదవండి: జన్వాడ ఫామ్ హౌస్ కేసులో మరో ట్విస్ట్!
ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన అనంతరం మెట్రో రెండో దశతో పాటు మూసీ ప్రక్షాళనను ప్రతిష్టాత్మకంగా భావించి కార్యాచరణ చేపట్టారు. ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ.24.269 కోట్లలో 30 శాతం అంటే రూ.7,313 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం, 18 శాతం అంటే రూ.4,230 కోట్లు కేంద్ర ప్రభుత్వం వెచ్చించాల్సి ఉంది. మిగతా 52 శాతం నిధులను రుణాలతో పాటు పీపీపీ విధానంలో సమకూర్చుకోవాలని నిర్ణయించారు.
5 కారిడార్‌లలో రెండో దశ..
నాగోల్– శంషాబాద్ ఎయిర్ పోర్టు (36.8 కి.మీ)
రాయదుర్గం–కోకాపేట్ నియోపొలిస్ (11.6 కి.మీ)
ఎంజీబీఎస్–చాంద్రాయణగుట్ట (7.5 కి.మీ)
మియాపూర్–పటాన్‌చెరు (13.4కి.మీ)
ఎల్‌బీనగర్–హయత్ నగర్ (7.1 కి.మీ.)
Comments
Please login to add a commentAdd a comment