సాక్షి, హైదరాబాద్: మెట్రోరైలు విస్తరణ పనులు మరింత ఆలస్యమయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి. హైదరాబాద్ మెట్రోరైలు రెండో దశ కింద చేపట్టాలని భావించిన మూడు ప్రాజెక్టుల్లో ఒకటైన రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు కేరిడార్‌ను రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు శంకుస్థాపన కూడా చేసింది. మిగతా రెండు ప్రాజెక్టులైన బీహెచ్‌ఈఎల్ నుంచి లక్డీకాపూల్, నాగోల్ నుంచి ఎల్‌బీనగర్ వరకు పొడిగింపు ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వంతో కలిసి జాయింట్ వెంచర్‌గా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ.. ఆ దిశగా అడుగులు అంత వేగంగా పడడం లేదు.
ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి సామాజిక కార్యకర్త ఇనుగంటి రవికుమార్ ఆర్‌టీఐ ద్వారా కేంద్రాన్ని కోరగా, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి వికాష్ కుమార్ ఈ మేరకు సమాధానమిచ్చారు. హైదరాబాద్ మెట్రో రెండో దశకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖలకు తాము స్పందించామని, తదుపరి కార్యాచరణ లేదని స్పష్టం చేశారు. మెట్రో రెండో దశ ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ రాసిన లేఖకు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి సమాధానమిస్తూ మెట్రో మంజూరుకు కీలకమైన డీపీఆర్‌లో మార్పులతో పాటు సాధ్యాసాధ్యాలపై పలు సందేహాలు వ్యక్తం చేశారు.
వివరణ పంపని రాష్ట్రం
డీపీఆర్‌ను ప్రస్తుత ధరలకు అనుగుణంగా మార్చాలని సూచించడంతో పాటు 14 అంశాలపై వివరణ కోరారు. తాము కోరిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణలు వస్తే పరిశీలిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు అర్వింద్‌కుమార్‌కు గత డిసెంబర్ 1న లేఖ రాసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి వివరణ పంపలేదు. కేంద్రం అడిగిన కేబినెట్ తీర్మానం కాపీ, స్పెషల్ పర్పస్ వెహికిల్, నిధులు సమకూర్చే సంస్థను ఎంపిక చేయడం, రోడ్‌మ్యాప్ మొదలైనవాటిని ఫైనలైజ్ చేసి పంపాలని కోరినా రాష్ట్ర ప్రభుత్వం ఏమీ పంపలేదని ఆర్‌టీఐ ద్వారా అడిగిన ప్రశ్నలకు కేంద్రం సమాధానమిచ్చింది. ఈ నేపథ్యంలో రెండోదశ మెట్రో పనులపై అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment