
ఇప్పటివరకు 41 మందికి రూ.20 కోట్ల వరకు అందజేత
1,100 నిర్మాణాలకు రూ.వెయ్యి కోట్ల పరిహారం అవసరం
త్వరలో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ మెట్రో పనులు పట్టాలెక్కి పరుగులు తీస్తున్నాయి. మెట్రో రూట్‌లో కూల్చివేతలు ఊపందుకున్నాయి. మీరాలంమండి నుంచి చాంద్రాయణగుట్ట వరకు ఉన్న మార్గంలో కూల్చివేతలు చకచకా సాగుతున్నాయి. మెట్రో రెండో దశలో భాగంగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మేర మెట్రో మార్గం (Metro Route) నిర్మించనున్న సంగతి తెలిసిందే. దీంతో జేబీఎస్ (JBS) నుంచి చాంద్రాయణగుట్ట వరకు అతి పెద్ద గ్రీన్‌కారిడార్ (Green Corridor) అందుబాటులోకి రానుంది. ఈ రూట్‌లో రోడ్డు విస్తరణ, ఆస్తుల సేకరణను సకాలంలో పూర్తి చేసేందుకు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఏఎంఎల్) కార్యాచరణను వేగవంతం చేసింది. ఎంజీబీఎస్ – చాంద్రాయణగుట్ట వరకు తొలగించాల్సిన 1,100 ఆస్తులను అధికారులు ఇప్పటికే గుర్తించారు.
41 మందికి రూ.20 కోట్ల వరకు చెల్లింపు...
భూసేకరణ చట్టానికి అనుగుణంగా సేకరించనున్న ఆస్తులకు పరిహారం చెల్లించేందుకు హెచ్‌ఏఎంఎల్ (HAML) చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు 41 మందికి రూ.20 కోట్ల వరకు చెల్లించినట్లు అధికారులు తెలిపారు. పాతబస్తీలో గుర్తించిన 1100 ఆస్తులకు సుమారు రూ.వెయ్యి కోట్ల వరకు చెల్లించవలసి ఉంటుందని అంచనా. గజానికి రూ.81 వేల చొప్పున చెల్లించేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. రోడ్డు విస్తరణ, మెట్రో నిర్మాణంలో మతపరమైన, చారిత్రక కట్టడాలకు నష్టం వాటిల్లకుండా సమర్ధవంతమైన ఇంజినీరింగ్ పరిష్కారాలతో పరిరక్షిస్తున్నట్లు హెచ్‌ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి (NVS Reddy) తెలిపారు.
పర్యాటకంగా మరింత ఆకర్షణ...
మెట్రో రైల్ రాకతో పాత నగరానికి కొత్త సొబగులు సమకూరనున్నాయి. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుకానున్నాయి. కాలుష్యరహితంగా, పర్యాటకంగా అభివృద్ధి చెందనుంది. మెట్రో అందుబాటులోకి వస్తే మరింత ఎక్కువ మంది పర్యాటకులు పాతబస్తీని సందర్శించే అవకాశం ఉంది. అటు నగరంలోని ప్రధాన ప్రాంతాల నుంచి, ఇటు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణికులు, పర్యాటకులు ఎలాంటి ఇబ్బంది లేకుండా పాతబస్తీకి రాకపోకలు సాగించనున్నారు. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులకు చార్మినార్ సందర్శన ఒక ప్రత్యేకత. మెట్రో రాకతో ఇది మరింత ప్రాధాన్యతను సంతరించుకోనుంది.

ఆస్తులను కోల్పోవడంపై విచారం
మరోవైపు దశాబ్దాలుగా తాము నివాసం ఉంటున్న, ఉపాధి పొందుతున్న భవనాలు, షాపులను మెట్రోరైల్ నిర్మాణంలో భాగంగా కోల్పోవడం పట్ల పాతబస్తీ ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆస్తులను కోల్పోవడం బాధగానే ఉన్నప్పటికీ పాతబస్తీ అభివృద్ధి దృష్ట్యా అంగీకరిస్తున్నట్లు మీరాలంమండికి చెందిన ఇబ్రహీం అనే ఛాయ్ దుకాణదారు తెలిపారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న వస్త్ర, కిరాణా దుకాణాలు, హోటళ్లు కనుమరుగు కానున్నాయి.
చదవండి: మరో రెండు అంతర్జాతీయ విమాన సర్వీసులు