
వివరాల నమోదుకు తప్పని ఇబ్బందులు
14తో ముగియనున్న దరఖాస్తు గడువు
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ యువ వికాసం(Rajiv Yuva Vikasam) పథకానికి దరఖాస్తు చేసే క్రమంలో సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తరచూ సర్వర్‌డౌన్ అవుతోంది. దీంతో దరఖాస్తుదారులు సతమతం అవుతున్నారు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించిన మూడు వారాల వ్యవధిలో ఏకంగా 12 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే నాలుగైదు రోజులుగా ఈ పథకానికి సంబంధించిన వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలతో దరఖాస్తు ప్రక్రియ ముందుకు సాగడం లేదు.
వెబ్‌సైట్ తెరిచి వివరాలు నమోదు చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా వెబ్‌పేజీ నిలిచిపోతోంది. ఎంతసేపటికీ పేజీ ముందుకు సాగకుండా స్తంభించిపోతోంది. దీంతో తిరిగి వెబ్‌సైట్‌ను తెరిచి దరఖాస్తు ప్రక్రియ మొదట్నుంచి ప్రారంభించాల్సి వస్తోంది. ఫలితంగా దరఖాస్తు ప్రక్రియలో తీవ్ర గందరగోళం నెలకొంది. యువ వికాసం పథకం దరఖాస్తు ప్రక్రియ ఈనెల 14వ తేదీతో ముగియనుంది. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో దరఖాస్తుదారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, గడువు పొడిగింపు లేదని, ఇప్పటికే ఒకసారి గడువు పొడిగించి అవకాశం కల్పించినట్టు చెప్పుకొస్తున్నారు.
వరుస సెలవులు : గడువు ముగిసేలోగా 20 లక్షల దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేసినా, సాంకేతిక సమస్యలతో దరఖాస్తుల జోరుకు బ్రేక్ పడింది. మరోవైపు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ప్రభుత్వ సెలవులు ఎక్కువగా వచ్చాయి. ఉగాది, రంజాన్, జగ్జీవన్‌రామ్ జయంతి, రెండో శనివారం, అంబేడ్కర్ జయంతి ఇలా ఏడు రోజులకు పైబడి సెలవులు వచ్చాయి. దీంతో రెవెన్యూ సేవల్లో జాప్యం నెలకొంది.