విభజన అధికారికంగా జరగడానికి ముహూర్తం ముంచు కొచ్చింది. మరికొన్ని గంటల్లోనే రాష్ట్రం రెండుగా విడిపోతోంది. పార్లమెంటులో తలుపులు మూసి విభజన బిల్లు ఆమోదించిన క్షణాన సీమాంధ్ర ప్రజల గుండె రెండు నిముషాలు స్తంభించినట్టు... రెండు రాష్ట్రాలు అధికారి కంగా విడిపోతున్న తరుణంలో ప్రభుత్వ పరంగా పౌర సేవలన్నీ రెండు రోజులపాటు స్తంభించిపోయాయి. ఇది సంధికాలం...
ప్రత్తిపాడు/మాచర్ల, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్‌ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విభజించేందుకు జూన్ రెండవ తేదీని అపాయింటెడ్ డేగా ప్రకటించినందున మీసేవ, ఈ-సేవలకు విరామం ప్రకటించారు. ఆన్‌లైన్ ద్వారా అందిస్తున్న ఈ రెండు సేవలకు సంబంధించిన సర్వర్లు డౌన్ కావడంతో సంబంధిత లావాదేవీలన్నీ శుక్రవారం అర్థరాత్రి నుంచి నిలిచిపోయాయి. తిరిగి సోమవారం ఉదయం నుంచి పునఃప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆన్‌లైన్ ద్వారా రెవెన్యూ, వ్యవసాయ, పౌర సరఫరాలు, ఆర్‌టీఏ, విద్యాశాఖ, సంక్షేమశాఖ, పురపాలకశాఖ, పంచాయతీరాజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్లుకు సంబంధించిన సుమారు వంద రకాల సేవలు రెండు రోజుల పాటు నిలిచిపోయాయి. అపాయింటెడ్ డే అనంతరం రాష్ట్రం రెండుగా విడిపోయిన తరువాత మాత్రమే ఈ ఆన్‌లైన్ సేవలు పునఃప్రారంభం కానున్నాయి. విభజన ప్రక్రియకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసేందుకు ముందుగా ఆయా శాఖలకు సంబంధించిన ఆన్‌లైన్ సేవలను ప్రభుత్వం నిలిపివేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు వేరువేరుగా నిధుల కేటాయింపు, పనులు చేపట్టేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. సిద్ధమైన ప్రతిపాదనలను అమలు చేయాలంటే ప్రస్తుతం ఎటువంటి కార్యకలాపాలు జరిపినా సాంకేతికంగా ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉందని ఆలోచించిన ప్రభుత్వం ఎక్కువ శాఖల్లో ఆన్‌లైన్ సేవలను నిలిపివేసింది. సబ్‌ట్రెజరీ కార్యాలయంలో 26వ తేదీ రాత్రి నుంచే ఆన్‌లైన్ సేవలు నిలిచిపోయాయి. జూన్ 2వతేదీ తరువాతనే సబ్‌ట్రెజరీ కార్యాలయంలో బిల్లుల చెల్లింపు కార్యక్రమం చేపడతారు. అప్పటి వరకు ఎటువంటి సర్వర్ పని చేయకుండా ఆన్‌లైన్ సేవలను నిలిపివేశారు. దీంతో సబ్‌ట్రెజరీ కార్యాలయ ఉద్యోగులు కార్యాలయానికి నామమాత్రంగా వచ్చిపోతున్నారు.
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం మూతపడడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. రాష్ట్ర విభజన ప్రక్రియ కొనసాగింపులో భాగంగా ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్లను పూర్తి స్థాయిలో నిలిపివేసింది. రవాణా శాఖలో కూడా ఆన్‌లైన్ సేవలు నిలిపివేసి లెసైన్సులు మంజూరు చేయడం లేదు. అధికారులు కూడా సరిహద్దుల్లో చెక్‌పోస్టుల ఏర్పాటులో నిమగ్నమై ఉన్నారు. ఎంపీడీవో కార్యాలయాల్లో కూడా ఎటువంటి సేవలు అందుబాటులో లేవు. రాష్ట్ర విభజన ప్రక్రియ నేపథ్యంలో వారంరోజుల పాటు ఆన్‌లైన్ సేవలు పని చేసే అవకాశం ఉండకపోవచ్చునని, నూతన రాష్ట్ర ప్రభుత్వం ప్రక్రియ పూర్తయిన అనంతరం ఆయా కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.
నిలిచిన వ్యాపార లావాదేవీలు.. మీ సేవలు పనిచెయ్యకపోతుండడంతో ప్రజలకు కష్టాలు తప్పలేదు. వివిధ పనుల నిమిత్తం మీ సేవ కేంద్రాలకు వెళ్లిన ప్రజలు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. దానికి తోడు రిజిస్ట్రేషన్లు కూడా నిలిచిపోవడంతో భారీగా వ్యాపార లావాదేవీలు నిలిచిపోయాయి. విషయం తెలియక ప్రత్తిపాడు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం వద్దకు చేరుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రజలు ఉసూరుమంటూ తిరుగుముఖం పట్టారు. ఇదే పరిస్థితి మరికొన్ని కార్యాలయాల్లో సైతం చోటుచేసుకుంది.
సర్వర్ డౌన్ సేవలకు సెలవు
Published Sun, Jun 1 2014 12:02 AM | Last Updated on Sat, Sep 2 2017 8:08 AM
Advertisement
Advertisement