సాక్షి, హైదరాబాద్/విశాఖ: మైక్రోసాఫ్ట్ సర్వర్‌లో సాంకేతిక సమస్య కారణంగా విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సర్వర్ సమస్య కాస్తా ఎయిర్‌లైన్స్ సర్వర్లపై ప్రభావం చూపించడంతో పలు విమాన సర్వీసులు రద్దు అవుతున్నాయి.
కాగా, విశాఖలో ఎయిర్ లైన్స్‌లో సాంకేతిక సమస్య కారణంగా విమానాల ఆపరేషన్‌లో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో, ఎయిర్‌పోర్టు సిబ్బంది మాన్యువల్‌గా బోర్డింగ్‌ను క్లియర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణీకులకు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ కారణంగా ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు రద్దీ పెరిగింది. ఎక్కడి విమానాలు అక్కడే నిలిచిపోవడంతో ప్రయాణం ఆలస్యమవుతోంది.
ఇదిలా ఉండగా.. ఇటు శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సర్వర్‌లో టెక్నికల్ సమస్య కారణంగా దాదాపు 35 విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలకు సంబంధించిన డిస్‌ప్లే బోర్డులు పనిచేయకపోవడంతో అధికారులు మాన్యువల్‌గా బోర్డులు ఏర్పాటు చేశారు. ఇక, వివిధ రాష్ట్రాలకు, దేశాలకు వెళ్లాల్సిన విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గన్నవరంలో ఇదీ పరిస్థితి..
మైక్రోసాఫ్ట్ సాంకేతిక సమస్యతో గన్నవరం విమానాశ్రయంలో పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ సందర్భంగా గన్నవరం ఎయిర్‌పోర్టు డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. గన్నవరం నుండి ప్రతీరోజూ 23 విమాన సర్వీసులు వివిధ ప్రాంతాలకు నడుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మైక్రోసాఫ్ట్ సాంకేతిక లోపంతో 13 సర్వీసులు మాత్రమే గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్లాయి. మరో ఏడు సర్వీసులు ఆలస్యంగా బయలుదేరి వెళ్లాయి. విమాన సర్వీసుల ఆలస్యం కారణంగా ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఎయిర్‌పోర్టులో ఇదే పరిస్థితి ఉంది. గన్నవరంలో టికెట్ కౌంటర్‌లో ప్రయాణీకులకు టికెట్లు ఇవ్వడం నిలిపివేయడం జరిగింది. మాన్యువల్‌గా బోర్డింగ్ పాస్ ఇచ్చి ప్రయాణికులను పంపిస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment