
వంగల అజయ్‌రెడ్డి, సాయి మనోజ్ఞ
‘సాక్షి’తో జేఈఈ మెయిన్ టాపర్ వంగల అజయ్‌రెడ్డి
ఐఐటీ బాంబేలో సీఎస్‌ఈలో చేరడమే లక్ష్యం
ఇష్టంతో చదివితే.. ఒత్తిడి ఉండదు
పదో తగరతి: 9.7 జీపీఏ
ఇంటర్ ఫస్టియర్: 465 మార్కులు
జేఈఈ మెయిన్ తొలి సెషన్ మార్కులు: 276
జేఈఈ మెయిన్ రెండో సెషన్ మార్కులు: 300
సాక్షి, ఎడ్యుకేషన్: ‘జనవరి సెషన్‌లో చిన్న పొరపాట్ల వల్ల 100 పర్సంటైల్ కొద్దిలో కోల్పోయా. పొరపాట్లను సరిదిద్దుకొని.. మ రింత ప్రాక్టీస్ చేసి 100 శాతం మార్కులే లక్ష్యంగా ఏప్రిల్ సెషన్ రాశా. ఇష్టంతో చదివితే ఎలాంటి మానసిక ఒత్తిడి ఉండదు’ అని జేఈఈ–మెయిన్ ఫలితాల్లో 300 మార్కులతో టాపర్‌గా నిలిచి న వంగల అజయ్‌రెడ్డి అన్నాడు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించి ఐఐటీ–ముంబైలో సీఎస్‌ఈలో చేరడమే తన లక్ష్యమన్న అజయ్ ‘సాక్షి’తో తన విజయ ప్రస్థానాన్ని పంచుకున్నాడు.
అన్నయ్య స్ఫూర్తి.. వ్యక్తిగత ఆసక్తితో..: ఐఐటీల్లో బీటెక్ చేయాలనే సంకల్పానికి మా అన్నయ్య అక్షయ్‌రెడ్డి స్ఫూర్తి ఎంతో ఉంది. ప్రస్తుతం ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఐఐటీల్లో ఇంజనీరింగ్ పూర్తి చేస్తే కెరీర్ బాగుంటుందని చెప్పేవాడు. దీంతో నాకు కూడా ఐఐటీపై ఆసక్తి పెరిగింది. అదే లక్ష్యంగా తొమ్మిదో తరగతి నుంచే జేఈఈ దిశగా అడుగులు వేశా.
కర్నూలు నుంచి హైదరాబాద్‌కు..: ఐఐటీలో చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నాక కర్నూలు నుంచి హైదరాబాద్‌కు వచ్చా. నాన్న వెంకటరమణారెడ్డి ఎంతో ప్రోత్సహించారు. తొమ్మిదో తరగతి నుంచి ఐఐటీ ఫౌండేషన్ కోర్సులో చేరా. బేసిక్స్‌తో మొదలు పెట్టి జేఈఈకి అవసరమైన అన్ని అంశాలపై అవగాహన ఏర్పరచుకున్నా.
ఒత్తిడి లేదు..: టెన్త్ అయ్యాక ఇంటర్, జేఈఈకి ఏకకాలంలో ప్రిపరేషన్ సాగించా. రోజుకు 14 గంటలు ప్రిపరేషన్‌కు కేటాయించా. కానీ ఎప్పుడూ ఒత్తిడికి గురి కాలేదు. కాలేజీలో స్టడీ మెటీరియల్, వీక్లీ టెస్ట్‌లు, గ్రాండ్ టెస్ట్‌లు రాస్తూ ఎప్పటికప్పుడు పొరపాట్లను సరిదిద్దుకొని ప్రిపేర్ అవడంతో విజయం చేకూరింది.
జనవరిలో సెషన్‌లో లోపాలతో..: జేఈఈ మెయిన్ జనవరి సెషన్‌లో 276 మార్కులు (99.996 పర్సంటైల్) వచ్చాయి. కాలిక్యులేషన్స్‌కు ఎక్కువ సమయం తీసుకోవడం, సమాధానాలు గుర్తించడంలో పొరపాట్లే అందుకు కారణమని గుర్తించా. ఫిజిక్స్‌లో 90 మార్కులే రావడంతో ఆ సబ్జెక్ట్‌పై మరింత దృష్టి పెట్టా. ఇంటర్ పరీక్షల తర్వాత పూర్తి సమయం కేటాయించి ప్రతి సబ్జెక్ట్‌లో ప్రతి కాన్సెప్ట్‌పై కూలంకషంగా అధ్యయనం చేయడంతో.. ఏప్రిల్ సెషన్‌లో ఆశించిన ఫలితం పొందగలిగా. మూడు సబ్జెక్ట్‌లలోనూ నూటికి నూరు శాతం మార్కులు వచ్చాయి.
హార్డ్‌వర్క్, వ్యూహం ఉండాలి..: జేఈఈ మెయిన్ వంటి పోటీపరీక్షలకు సిద్ధమయ్యేందుకు కష్టపడేతత్వంతోపాటు వ్యూహం ఉండాలి. ప్రతి టాపిక్ అధ్యయనానికి తగిన సమయం కేటాయించుకోవాలి. రివిజన్ స్ట్రాటజీ, బలహీనతలను గుర్తించడం ఎంతో ముఖ్యం. దీనివల్ల ఏ టాపిక్‌లో వెనుకబడ్డామో తెలుసుకొని వాటిని పరిష్కరించుకునే సంసిద్ధత పొందొచ్చు.
ఐఐటీ బాంబేలో సీఎస్‌ఈలో చేరడం: జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు కూడా ప్రిపేర్ అవుతున్నాను. అందులో మంచి ర్యాంకు సాధించి ఐఐటీ ముంబైలో సీఎస్‌ఈ బ్రాంచ్‌లో బీటెక్‌లో అడుగు పెట్టడమే లక్ష్యం.
ఐఐటీలో ఈసీఈలో చేరడమే లక్ష్యం: సాయి మనోజ్ఞ(Sai Manojna)
⇒ ‘సాక్షి’తో జేఈఈ మెయిన్ మహిళల విభాగం టాపర్ సాయి మనోజ్ఞ
⇒ రోజుకు 12 గంటలు ప్రిపరేషన్‌కు సమయం కేటాయించా
⇒ గ్రాండ్ టెస్ట్‌లు, మోడల్ టెస్ట్‌లు రాస్తూ తప్పులు సరిదిద్దుకున్నా
పదో తరగతి (ఐసీఎస్‌ఈ): 588 మార్కులు
ఇంటర్: 987 మార్కులు
జేఈఈ మెయిన్ జనవరి సెషన్: 295 మార్కులు
జేఈఈ మెయిన్ ఏప్రిల్ సెషన్: 300 మార్కులు
‘జేఈఈ మెయిన్ జనవరి సెషన్‌లోనూ 100 పర్సంటైల్ సాధించా. కానీ మార్కులు తగ్గడంతో 300 మార్కులు లక్ష్యంగా ఏప్రిల్ సెషన్‌కు హాజరయ్యా. నిర్దిష్ట ప్రణాళికతో ఆ మార్కులు సాధించగలిగా’ అని జేఈఈ మెయిన్ మహిళల విభాగం ఏపీ టాపర్, గుంటూరుకు చెందిన గుత్తికొండ సాయిమనోజ్ఞ చెప్పింది. ఐఐటీలో ఈసీఈలో బీటెక్ చేయడమే తన లక్ష్యమన్న మనోజ్ఞ ‘సాక్షి’తో తన ప్రిపరేషన్ తీరుతెన్నులను పంచుకుంది.
కాన్సెప్ట్స్‌పై అవగాహనతో..: జేఈఈ మెయిన్ పరీక్షలో విజయానికి.. ఆయా సబ్జెక్ట్‌లలో కాన్సెప్ట్‌ల పై, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే సమయంలో ఫార్ములా లను అన్వయించే విధానంపై పట్టు సాధించా. ఇది ఎంతో ఉపయోగపడింది. పరీక్షలో ప్రశ్నలకు సరైన సమాధానం ఇచ్చేందుకు తోడ్పడింది.
టెన్త్ నుంచే జేఈఈ దిశగా..: ఐఐటీలో చేరాలనే లక్ష్యంతో పదో తరగతి నుంచే ప్రిపరేషన్ సాగించా. ఇంటర్‌కు ఐసీఎస్‌ఈ నుంచి బోర్డ్ సిలబస్ వైపు మారా. ఇందులో ఉండే అంశాలు జేఈఈ సిల బస్‌కు అనుగుణంగా ఉండటం, బోధన, పుస్తకాలు ఎక్కువగా లభించడమే అందుకు కారణం.
ప్రిపరేషన్ ఇలా..: జేఈఈలో విజయం సాధించేందుకు ఇంటర్ తొలిరోజు నుంచే రోజుకు కనీసం 12 గంటలు ప్రిపరేషన్‌కు సమయం కేటాయించేదాన్ని. గ్రాండ్ టెస్ట్‌లు, మోడల్ టెస్ట్‌లకు హాజరవడం కూడా ఎంతో ప్రయోజనం చేకూర్చాయి. ఆ పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చినప్పుడల్లా ఏయే అంశాల్లో ఎందుకు మార్కులు తగ్గాయో తెలుసుకొని వెంటనే వాటిని సరిదిద్దుకుంటూ ప్రిపరేషన్ సాగించా. ఒక టాపిక్‌ను చదివేటప్పుడు అందులో ఎన్ని రకాలుగా ప్రశ్నలు అడుగుతారో ఊహించి అభ్యాసం చేశా. ప్రతి సబ్జెక్ట్‌కు నిర్దిష్ట సమయం కేటాయించుకొని ఆ సమయంలో ఆ సబ్జెక్ట్‌లోని టాపిక్‌ను పూర్తిచేయడం నాకు ఎంతో ఉపయోగపడింది.
జనవరి సెషన్‌లో 295 మార్కులు: జేఈఈ మెయిన్ జనవరి సెషన్‌లో కూడా నాకు 100 పర్సంటైల్ వచ్చింది. కానీ మార్కులు 295 మాత్రమే వచ్చాయి. దీంతో 300కు 300 మార్కులు సాధించాలనే లక్ష్యంతో ఏప్రిల్ సెషన్‌కు హాజర య్యా. బోర్డ్ పరీక్షలు ముగిశాక పూర్తి సమయం రివిజన్‌కు, మోడల్ టెస్ట్‌లకు కేటాయించా. వాటి ఫలితంగానే ఇప్పుడు 300 మార్కులు వచ్చాయి.
ఐఐటీలో ఈసీఈ చేస్తా..: జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు కూడా ప్రిపరేషన్ సాగిస్తున్నా. అందులో మంచి ర్యాంకుతో ఐఐటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ) బ్రాంచ్‌లో బీటెక్‌లో చేరడమే నా లక్ష్యం. ఆ తర్వాత అదే రంగంలో ఉన్నతవిద్య, ఉద్యోగం దిశగా అడుగులు వేయాలనుకుంటున్నా. నా విషయంలో నాన్న కిశో ర్ చౌదరి, అమ్మ పద్మజల ప్రోత్సాహం ఎంతో ఉంది. నాన్న ఇంజనీరింగ్ కాలేజీలో అధ్యాపకులుగా ఉండటంతో ఇంజనీరింగ్‌పై ఆసక్తి పెరిగింది.