
విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి సమస్యకు అవే పరిష్కారం
స్కూలు స్థాయిలోనే కౌన్సెలింగ్ ప్రారంభం కావాలి
పాఠశాలలు మానసిక వికాస ప్రాంగణాలుగా మారాలి
మానసిక పరిపక్వత, భావోద్వేగ స్థిరత్వంపై శిక్షణ ఇవ్వాలి
ఐసీ3 మూవ్‌మెంట్ వ్యవస్థాపకులు గణేశ్ కోహ్లి
సాక్షి, ఎడ్యుకేషన్: ప్రస్తుత విద్యా వ్యవస్థ కారణంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి సమస్యను పరిష్కరించాలంటే... వారికి పాఠశాల స్థాయిలోనే కెరీర్ గైడెన్స్, వారి నైపుణ్యాలపై కౌన్సెలింగ్ ఇవ్వడం వంటి చర్యలు తీసుకోవాలని ఐసీ3 (ఇంటర్నేషనల్ కాలేజ్ అండ్ కెరీర్ కౌన్సెలింగ్) మూవ్‌మెంట్ వ్యవస్థాపకులు, ప్రముఖ కెరీర్ కౌన్సిలర్, టెడెక్స్ స్పీకర్ గణేశ్ కోహ్లి చెప్పారు. పోటీ వాతావరణం, పరీక్షల్లో మార్కులనే ప్రతిభకు కొలమానంగా భావించడం, ఇతరులతో పోల్చుకోవడం వంటి పలు కారణాలతో విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారన్నారు.
దీంతో వారి మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటోందని, ఈ కారణంగానే ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యలకు పాఠశాల స్థాయి నుంచే పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. ‘కౌన్సెలింగ్ ఇన్ ఎవ్రీ స్కూల్’అనే ఉద్దేశంతో ఐసీ3 మూవ్‌మెంట్‌కు రూపకల్పన చేసి, దాదాపు 90 దేశాల్లో విద్యార్థులకు కౌన్సెలింగ్, కెరీర్ గైడెన్స్ నిర్వహిస్తున్న గణేశ్ కోహ్లి.. విద్యార్థుల మానసిక ఒత్తిడి అందుకు కారణాలు, పరిష్కార మార్గాలపై పలు సూచనలు ఇచ్చారు.
మానసిక ఒత్తిడికి ఎన్నో కారణాలు
విద్యార్థుల్లో నెలకొంటున్న మానసిక ఒత్తిడి సమస్యలు చివరికి వారు ఆత్మహత్యలకు పాల్పడే స్థాయికి చేరుకుంటున్నాయి. 2012లో 6,654గా ఉన్న విద్యార్థుల ఆత్మహత్యలు, 2022 నాటికి 13,044కు చేరాయి. విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురి కావడానికి అకడమిక్స్‌తో పాటు మరెన్నో అంశాలు కారకాలుగా నిలుస్తున్నాయి. ఆర్థిక అస్థిరత, వ్యక్తిగత ఆహార్యం, సహచరులు– బంధువుల ఒత్తిడి, వైఫల్యం అంటే విపరీతమైన భయం వంటివి వీటిలో ముఖ్యమైనవిగా చెప్పొచ్చు.
సంపూర్ణ వికాసం కల్పించడం కంటే అత్యున్నత గ్రేడ్లకే విలువనిచ్చే విద్యావ్యవస్థ ఇందుకు మరో ముఖ్యమైన కారణం. మరోవైపు చిన్నతనం నుంచే పిల్లలను వారి సహచరులతో పోల్చడం వల్ల తమ సామర్థ్యంపై అపనమ్మకం ఏర్పడి దీర్ఘకాలిక ఒత్తిడికి గురవుతున్నారు. దీన్ని గుర్తించకపోవడం వల్ల ఎన్నో ప్రతికూల పరిణామాలు చూడాల్సి వస్తోంది.
విదేశాల్లో ఇప్పటికే నివారణ చర్యలు
ఇతర దేశాల్లోనూ విద్యార్థుల మానసిక ఆరోగ్యం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే పలు దేశాలు ఈ ప్రభావాన్ని తగ్గించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఫిన్‌లాండ్, కెనడా, నెదర్లాండ్స్ తదితర పాశ్చాత్య దేశాల్లో పరీక్షల్లో మార్కుల కంటే సామర్థ్య ఆధారిత అభ్యసనానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కౌన్సెలింగ్, మెంటార్íÙప్, ప్రయోగాలతో కూడిన అభ్యసనం వంటి మార్గాల ద్వారా కెరీర్‌పై విస్తృత అవగాహన కల్పిస్తున్నారు.
కానీ మన దేశంలో అకడమిక్‌గా పొందిన ఘనతనే విజయంగా గుర్తిస్తున్నారు. సక్సెస్ అంటే మార్కులే అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడి, మానసిక సమస్యల విషయంలో కౌన్సెలింగ్ కార్యక్రమాలు ఎంతో సత్ఫలితాలనిస్తాయి. పలు దేశాల్లో ఇది నిరూపితమైంది. మన దేశంలోనూ కౌన్సెలింగ్ సమ్మిళిత సాధనాలను అందుబాటులోకి తెస్తే మానసిక దృఢత్వాన్ని సొంతం చేసుకుని సవాళ్లను స్వీకరించే స్థాయికి విద్యార్థులు ఎదుగుతారు.
సవాళ్లను ఎదుర్కొనేలా సంసిద్ధుల్ని చేయాలి
నేటి విద్యా వ్యవస్థను పరిశీలిస్తే పాఠశాలలు విద్యార్థులకు కేవలం అకడమిక్ అభ్యసన కేంద్రాలుగానే ఉంటున్నాయి. వాటిని విద్యార్థుల భావోద్వేగాలను, సామాజిక, మానసిక సమస్యలను తీర్చే ప్రాంగణాలుగా రూపొందించాల్సిన ఆవశ్యకత నెలకొంది. విద్యార్థుల్లో మానసిక ఆరోగ్య సమస్యలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు తరగతి గదిలో, బాహ్య ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా సంసిద్ధులను చేసేందుకు చర్యలు తీసుకోవాలి.
పిల్లల మాట తల్లిదండ్రులు వినాలి
విద్యార్థుల మానసిక ఒత్తిడి విషయంలో తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. పిల్లలు తమ సమస్యలను, ఆలోచనలను తమతో పంచుకునే వాతావరణాన్ని కల్పించాలి. దీనికి భిన్నంగా పిల్లల మాటలను తీసిపారేసేలా ప్రవర్తిస్తే వారు మరింత న్యూనతకు గురవుతారు. సక్సెస్ అంటే ఒక ప్రతిష్టాత్మక కాలేజీలో చేరడం మాత్రమే కాదని పిల్లల బలాలు, ఆకాంక్షలను నెరవేర్చుకునేలా వ్యవహరించడం అని గుర్తించాలి.
పరీక్ష విధానంపై పునరాలోచన చేయాలి
దేశంలోని పరీక్షల విధానంపైనా పునరాలోచన చేయాల్సిన ఆవశ్యకత నెలకొంది. కేవలం సబ్జెక్ట్ నాలెడ్జ్‌నే పరీక్షించే విధంగా ఉండడంతో విద్యార్థులపై విపరీతమైన ఒత్తిడి పడుతోంది. దీంతో విద్యార్థులు కూడా ఆయా పాఠ్యాంశాలకు సంబంధించిన భావనలను, నిజ జీవిత పరిస్థితుల్లో వాటిని అన్వయించే నైపుణ్యాలను పొందడంపై దృష్టి పెట్టకుండా..మార్కుల కోసం బట్టీ పట్టి చదువుతున్నారు. పర్యవసానంగా వాస్తవ పరిస్థితుల్లో ఆయా పాఠ్యాంశాల ప్రాధాన్యత ఏంటో తెలియట్లేదు. సామర్థ్య ఆధారిత మూల్యాంకనం దిశగా అడుగులు వేయాలని జాతీయ విద్యా విధానం సూచించిన సంగతి తెలిసిందే.
పాఠశాలల పాత్ర కీలకం
ప్రస్తుత పరిస్థితుల్లో మార్పు తేవాలంటే పాఠశాలలు ముందు నిలవాలి. మానసిక పరిపక్వత, భావోద్వేగ స్థిరత్వం వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వాలి. అదే విధంగా విద్యార్థులు ఆత్మవిశాసం పెపొందించుకోవడానికి కెరీర్ కౌన్సెలింగ్ తోడ్పడుతుంది. నిర్దిష్టమైన కెరీర్ గైడెన్స్ పొందిన విద్యార్థులు వారి భవిష్యత్తు గురించి ఎంతో ఆత్మ విశ్వాసంతో ఉంటారని.. ఆనిశి్చతి, ఆందోళనలను తగ్గించుకుంటారని పలు పరిశోధనల్లో తేలింది.
ఏం చేయాలి..
⇒ పిల్లల్లోని ఒత్తిడి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించేలా టీచర్లకు శిక్షణనివ్వాలి.
⇒ విద్యార్థులు భావోద్వేగాలను నియత్రించుకోవడం, స్వీయ అవగాహన పెంపొందించుకోవడంపై బోధించాలి.
⇒ మాధ్యమిక పాఠశాల స్థాయి నుంచే కెరీర్ కౌన్సెలింగ్‌ను కరిక్యులంలో భాగం చేయాలి.
⇒ విద్యార్థులు సహచరులతో మానసిక సమస్యల గురించి చర్చించుకునే పరిస్థితిని, ఎక్స్‌ట్రాకరిక్యులర్ యాక్టివిటీస్‌లో పాల్గొనే వాతావరణాన్ని కల్పించాలి.
Comments
Please login to add a commentAdd a comment