Mental stress
-
ఒడుపైన ఎత్తు.. ఒత్తిడే చిత్తు
సాక్షి, హైదరాబాద్: ఒకచోట అర్ధరాత్రి ఆత్మల్లా విహారం. మరోచోట ఆమని ఒడిలో చిన్నారుల్లా కేరింతలు. భయపెడుతూ, భయపడుతూ, భయాన్ని అధిగమించే సన్నివేశం ఒకటి. బాల్యంలోకి తీసుకెళ్లి బడి ఒత్తిడిని తగ్గించే కార్యక్రమం మరొకటి. దేశంలోని ఉన్నత విద్యా సంస్థలైన ఐఐటీల్లో విద్యార్థులకు మానసిక ఒత్తిడి, భయాన్ని తగ్గించేందుకు అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా ఐఐటీ భువనేశ్వర్‌లో ఏటా నిర్వహించే హాలోవీన్ నైట్, ఐఐటీ హైదరాబాద్ నిర్వహించే సన్‌షైన్ కార్యక్రమాలు అద్భుత ఫలితాలు ఇస్తున్నాయి.ఐఐటీలో ఆత్మల రాత్రి అర్ధరాత్రి.. ఆత్మ మాదిరిగా వేషధారణ.. అక్కడక్కడ శవపేటికలు.. దెయ్యాల కొంపల్లా భవనాల అలంకరణ.. పుర్రెలతో డెకరేషన్.. మసక మసక చీకటితో కూడిన లైటింగ్.. ఐఐటీ భువనేశ్వర్‌లో ఏటా అక్టోబర్ చివరలో నిర్వహించే హాలోవీన్ నైట్ కార్యక్రమం దృశ్యాలివి. విద్యార్థులను తీవ్రమైన మానసిక ఒత్తిడి నుంచి బయటపడేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ విద్యాసంస్థలో నవంబర్ మూడో వారం నుంచి సెమిస్టర్ పరీక్షలు మొదలవుతాయి. ఈ పరీక్షల కోసం విద్యార్థులు రేయింబవళ్లు కష్టపడుతుంటారు. పుస్తకాలతో కుస్తీలు పడుతుంటారు. ల్యాప్‌టాప్‌లలో మునిగిపోతారు.ఈ క్రమంలో అనేక మంది విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. కొందరైతే డిప్రెషన్లోకి వెళ్లిపోతుంటారు. ప్రధానంగా మొదటి సంవత్సరం విద్యార్థుల్లో ఈ భయం ఎక్కువగా ఉంటుంది. దీన్ని అధిగమించేందుకు ఈ ఉన్నత విద్యా సంస్థ ఏటా ఇలా హాలోవీన్ నైట్ (పిశాచాల రాత్రి) అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటుంది. విద్యార్థుల్లో మానసిక స్థైర్యాన్ని పెంచేందుకు ఇందులో సీఎస్టీ (కౌన్సిలింగ్ సర్వీస్ టీం) అనే ప్రత్యేక విభాగం పనిచేస్తోంది. ఇందులో విద్యార్థులతో పాటు పాఠాలు బోధించే ఫ్రొఫెసర్లు, వ్యక్తిత్వ వికాస నిపుణులు కూడా ఉంటారు.ఐఐటీహెచ్‌లో మెంటల్ హెల్త్ మంత్రాళ్లపై బోమ్మలు (స్టోన్ పెయింటింగ్).. మట్టితో వివిధ ఆకృతులు (క్లే థెరపీ).. ఇవన్నీ చూస్తుంటే ఏదో ప్లే స్కూల్లో చిన్నారులు చదువుకునే విధానంలా ఉంది కదా? కానీ, టెక్నాలజీ పరంగా దేశంలోనే అత్యున్న విద్యా సంస్థల్లో ఒకటైన హైదరాబాద్ ఐఐటీలో విద్యార్థులు ఒత్తిడిని అధిగమించేందుకు అవలంభిస్తున్న మార్గాలివి. సన్‌షైన్ పేరుతో పనిచేస్తున్న ప్రత్యేక విభాగం ఏటా అక్టోబర్‌లో మెంటల్ హెల్త్ మంత్ నిర్వహిస్తోంది. విద్యార్థులు చదువుల ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. మ్యూజిక్ ఆర్ట్ థెరపీ, ఎమోస్నాప్.. హీల్ అవుట్ లౌడ్.. ఇలా ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతోంది. ఈ సన్‌షైన్ విభాగంలో స్టూడెంట్ బడ్డీ, మెంటార్స్, కౌన్సిలర్లు, మానసిక వ్యక్తిత్వ నిపుణులు భాగస్వాములుగా ఉంటారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ యాప్‌నే అబివృద్ధి చేశారు. చాట్‌బాట్ రూపంలో ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒత్తిడిని జయించే మార్గాలను సలహాలను సూచనలు పొందేలా ఏర్పాట్లు చేశారు. ఐఐటీహెచ్‌లో తొలి నేషనల్ వెల్బీయింగ్ కాంక్లేవ్ హైదరాబాద్ ఐఐటీ వేదికగా తొలి నేషనల్ వెల్బీయింగ్ కాంక్లేవ్ శనివారం ప్రారంభమైంది. దేశంలోని అన్ని ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిబుల్ఐటీలు, ఇతర ప్రతిష్టాత్మక ఉన్నత విద్యా సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, ఫ్రొఫెసర్లు ఈ సదస్సుకు హాజరయ్యారు. విద్యార్థులు ఒత్తి డిని జయించేందుకు ఆయా విద్యా సంస్థలు అవలంభిస్తున్న మార్గాలను వివరించేందుకు ప్రత్యేకంగా స్టాల్లను ప్రదర్శించారు. ఒత్తిడిని జయించేందుకు ఎంతో ఉపయోగం విద్యార్థులు మానసిక ఒత్తి డితో బాధపడుతు న్నట్లు తమ దృష్టికి వస్తే వెంటనే ఆ విద్యార్థితో స్టూడెంట్ గైడ్ మాట్లాడుతారు. అవస రం మేరకు ఆ విద్యార్థి పరిస్థితిని వ్యక్తిత్వ వికాస నిపుణుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను అధిగమించేలా చేస్తున్నాము. ఇందుకోసం మా విద్యా సంస్థల్లో సీఎస్టీ (కౌన్సిలింగ్ సరీ్వస్ టీం) పనిచేస్తోంది. – మంగిపూడి శ్రావ్య, బీటెక్ మెట్లర్జీ, ఐఐటీ భువనేశ్వర్ -
మీ పిల్లలను సరైన క్రమంలో తీర్చిదిద్దాలంటే ఇలా చేయండి!
మీరు.. మీ పిల్లల ఆలోచనలను, వారి నడవడికను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారా? అయితే.. అది మీకు, మీ పిల్లలకి మధ్య భావోద్వేగ అంతరానికి కారణం కావచ్చు. ఈ దూరాన్ని తగ్గించడానికి ఉత్తమ మార్గం మీ పిల్లలతో చాలా మాట్లాడటం. కొన్ని ప్రశ్నలు అడుగుతూండటం చేయాలి. మీరడిగే ప్రతీది వారి మనస్సును మలుచుకోవడంలో సహాయమవుతుంది. భావోద్వేగాలను పంచుకోవడంలో తోడ్పడుతుంది. అలాగే, వారిలో పాతిపెట్టిన విషయాలను చెప్పడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇలా చేసి చూడండి!ప్రతీ తల్లితండ్రులు తమ పిల్లలను అడగాల్సిన ప్రశ్నలివే..1. 'నీవు ఏ విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తావు?'.. అనే ఈ ప్రశ్న అడగడంతో.. పిల్లవాడిని ఆలోచించేలా చేస్తాయి. దీంతో మీరు అతని అంతర్గత ఆలోచనలు, సమస్యలను మెరుగైన మార్గంలో ఉంచగలుగుతారు. ఇలాంటి విషయాలను తల్లిదండ్రులు పిల్లలను ప్రైవేట్‌గా అడగడమే ఉత్తమం.2. 'నీకు నచ్చే విషయమేంటి? ఎలా సంతోషంగా ఉంటావ్?'.. ఈ ప్రశ్న అతనికి తన గురించి చెప్పే అవకాశాన్ని ఇస్తుంది. దీంతో తన కోరికలను వ్యక్తం చేయగలడు.3. మీరు మీ పిల్లల్ని తప్పకుండా అడగాల్సిన ప్రశ్న ఏంటంటే? 'నేను మీతో తక్కువ లేదా ఎక్కువ సమయం గడుపుతున్నప్పుడు మీకు ఏమనిపిస్తోంది?' ఈ విధంగా సూటిగా చూస్తూ అడగడంతో.. వారి కళ్ళ నుంచి మీకు, మీ బిడ్డకు మధ్య ఉన్న సరైన బంధాన్ని అర్థం చేసుకోగలరు.4. పిల్లలు పెరుగుతున్నప్పుడు.. తరచుగా కొన్ని ఆలోచనలలో మునిగిపోతూంటారు. ఆ సమయంలో మీరు వారిని తప్పకుండా అడగాల్సిన విషయం ఇదే.. 'నీ జీవితంలో నీవు ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నావా? ఏదైనా సమస్యా?' అని అడగడంతో వారిలో ఏదైనా ప్రశ్న ఉన్నా భయ సంకోచాన్ని వదిలేస్తారు.5. 'కుటుంబంతో నీవు కలిగి ఉన్న ఉత్తమ జ్ఞాపకం ఏంటి?' ఇలా అడిగితే.. వాళ్లు కుటుంబంతో గడిపిన మంచి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. పిల్లలు ఏ సమయంలో ఎలా ప్రవర్తిస్తారో కూడా మీరు అర్థం చేసుకుంటారు.6. 'ఒత్తిడికి లేదా ఆందోళనకు గురికావడం వంటివి ఏవైనా ఉన్నాయా?' ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే? నేటి జీవనశైలిలో 'మానసిక ఒత్తిడి' పిల్లల జీవితాలను అతలాకుతలం చేస్తుంది. వారి వ్యక్తిత్వ ఎదుగుదలపై ప్రభావితం చూపుతుంది. ఈ ఒత్తిడిని పెద్దలు నిర్వహించగలరు. కానీ పిల్లలు తరచుగా ఈ సమస్యలలో చిక్కుకుంటున్నారు. దీని పర్యవసానాలు చాలా ప్రమాదకరమైనవి. కనుక వారిని తరచుగా అడగండి.. ఒత్తిడి నుంచి ఎలా బయటపడాల్లో నేర్పించండి.7. 'మీరు నాతో ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నారా!' అని అడగడంతోపాటు వారి ఆశను నెరవేర్చాలి. ఎందుకంటే? పిల్లలు తరచుగా ఒంటరిగా ఉంటారు. తల్లిదండ్రులతో కొంత నాణ్యమైన సమయాన్ని గడపాలని లోలోనే తపిస్తుంటారు. అటువంటి పరిస్థితిలో వారితో కలిసి కొన్ని కొత్త విషయాలను నేర్చుకోవడంలో మంచి అవకాశాన్ని ఇస్తుంది. -
విద్యార్థులు మానసిక ఒత్తిడిని జయించాలి: జయంత్ చల్లా
మానసిక స్థైర్యంతో తమకి ఉన్న ఒత్తిడులను తొలగించుకోవాలని ఆటా వేడుకల చైర్, ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఆటా వేడుకల్లో భాగంగా 20 రోజుల పాటు నిర్వహించే సేవ కార్యక్రమాల్లో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో అల కుటుంబం, ఆటా సెక్రెటరీ రామకృష్ణ రెడ్డి ఆల వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఎడ్యుకేషనల్ సెమినార్లో మోటివేషనల్ స్పీకర్, RGUKT, బాసర విసి వి.వెంకటరమణతో కలిసి జయంత్ చల్లా హాజరయ్యారు. ఈ సందర్భంగా జయంత్ చల్లా మాట్లాడుతూ.. విద్యార్థులకు తల్లిదండ్రులు, అధ్యాపకులు, స్నేహితులు అందరితో ఒత్తిడులు, సవాళ్లు వుంటాయని, వాటిని ఎదుర్కొని నిలబడి విద్యార్థి తమ అనుకున్న లక్ష్యానికి చేరుకోవాలని అన్నారు. అలాగే వచ్చే భవిష్యత్ అంతా కూడా... విద్యార్థులదేనని అందుకు అనుగుణంగా కష్టపడాలి అన్నారు. మా ఆటా సేవ లక్ష్యాలలో విద్య కూడా వుందని, విద్యార్థులు ఏ సహాయం కోరినా ఆటా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి తమ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ సెమినార్ ను ఏర్పాటు చేసిన ఆటా సెక్రెటరీ రామకృష్ణ రెడ్డి అల ను అభినందించారు. ఇదే సందర్భంలో మోటివేషనల్ స్పీకర్, RGUKT బాసర విసి వెంకటరమణ విద్యార్థులు తమ భవిష్యత్ ప్రణాళికలు ఎలా సిద్దం చేసుకోవాలి, ఇతర దేశాలకి వెళ్లి సెటిల్ కావడం, చదువుకోవడం లాంటివి ఎలా? అనే విషయాన్ని ప్రతి ఒక్కటి విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. విద్యార్థులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆటా వేడుకల కో చైర్ వేణు సంకినేని, ఆటా సెక్రెటరీ రామకృష్ణారెడ్డి అల, ఆటా కోశాధికారి సతీష్ రెడ్డి, 18వ ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కో ఆర్డినేటర్ సాయి సుధిని, ఆటా జాయింట్ సెక్రటరీ రవీందర్ గూడూరు, మీడియా కో ఆర్డినేటర్ ఈశ్వర్ బండా, ఆటా బోర్డు ఆఫ్ ట్రస్టీస్ నరసింహారెడ్డి ద్యాసాని, కాశీ కొత్త, కిషోర్ గూడూరు, వనపర్తి పరిధిలో గల 10 కాలేజీల ప్రిన్సిపాల్స్, అధ్యాపక బృందం, 250 మందికి పైగా విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. (చదవండి: అట్టహాసంగా టీటీఏ మొదటి రోజు మెడికల్ క్యాంపు) -
ఎంబీబీఎస్ సీటు రాక.. బీఏఎంఎస్‌లో వాట్సాప్‌లో ఫ్రెండ్‌కు మెసేజ్ పెట్టి..
వెంగళరావునగర్ (హైదరాబాద్): మానసిక ఒత్తిడి కారణంగా ఓ మెడికల్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నారాయణపేట జిల్లా విఠలాపూర్ గ్రామానికి చెందిన జి.డి మాణిక్యప్ప వ్యవసాయం చేస్తుంటారు. ఆయనకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు జగదీశ్ (23)కు చిన్నప్పటి నుంచి ఎంబీబీఎస్ చదివి డాక్టర్ కావాలని కోరిక. ఈ క్రమంలో గత ఏడాది నీట్ ఎంట్రన్స్ రాశాడు. ఎంబీబీఎస్ సీటు రాకపోవడంతో ఎర్రగడ్డ ఆయుర్వేద కళాశాలలో బీఏఎంఎస్ మొదటి సంవత్సరంలో చేరాడు. వెంగళరావునగర్ డివిజన్ జవహర్‌నగర్‌లో తన స్నేహితుడు ఫణీంద్రతో కలిసి రూం తీసుకుని ఉంటున్నాడు. బీఏఎంఎస్ చేయడం ఇష్టం లేకపోవడంతో కళాశాలకు కూడా సరిగా వెళ్లలేకపోయాడు. ఈ క్రమంలో ఈ నెల 25వ తేదీ నుంచి బీఏఎంఎస్ పరీక్షలు జరుగుతున్నట్టు నోటీసు వచ్చింది. జగదీశ్ సరిగా కళాశాలకు హాజరు కాలేకపోవడంతో హాల్ టికెట్ పొందేందుకు ఇబ్బంది ఎదుర్కొన్నాడు. తనకు హాల్ టికెట్ ఇవ్వరేమో, పరీక్షలు రాయడానికి వీలుపడదేమో అనుకుని ఒత్తిడికి గురయ్యాడు. ఒకవైపు ఇష్టమైన ఎంబీబీఎస్ సీటు రాకపోవడం, మరోవైపు బీఏఎంఎస్ హాల్ టికెట్ ఇస్తారో లేదో అనే ఆందోళనతో జగదీశ్ మానసిక సంఘర్షణకు లోనయ్యాడు. ఇదిలాఉండగా బుధవారం ఉదయం 7.30 గంటలకు జగదీశ్ రూంలో ఉంటున్న ఫణీంద్ర తన మరో స్నేహితుడైన రాజ్‌కుమార్ రూంకు వెళ్లాడు. జగదీశ్ 8.30 గంటల సమయంలో తన స్నేహితుడు అజయ్‌కు వాట్సాప్ ద్వారా తాను చనిపోతున్నట్టు మెసేజ్ పెట్టాడు. వెంటనే అజయ్ ఆందోళన చెంది ఫోన్ చేయగా, తాను చనిపోతున్నట్టు చెప్పి ఫోన్ కట్ చేశాడు. హుటాహుటిన అజయ్ తన స్నేహితుడు నవీన్‌కు ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే నవీన్, ఫణీంద్ర, ప్రశాంత్ కలిసి హుటాహుటిన జవహర్‌నగర్‌కు వచ్చి చూడగా గదిలో జగదీశ్ ఉరి వేసుకుని ఉన్నాడు. జగదీశ్‌ను ఈఎస్ఐ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని తండ్రి మాణిక్యప్పకు తెలియజేయడంతో ఆయన హుటాహుటిన మధురానగర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. తన కుమారుడి మరణంపై అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
కాబోయే వైద్యులకూ కావాలి వైద్యం!
వారంతా స్టెత్‌పట్టి రోగుల నాడి చూడాల్సిన మెడికోలు... కానీ వారిలో కొందరు మానసిక ఒత్తిళ్లకు చిత్తవుతున్నారు! మనోవేదనను తాళలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు!! గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా ఈ ధోరణి చోటుచేసుకుంటోంది. రాష్ట్రంలోనూ ఇటీవల కాలంలో పలువురు వైద్య విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. భావిభారత వైద్యులకు ఈ పరిస్థితి ఎందుకు తలెత్తుతోంది? అందుకుగల కారణాలు ఏమిటి? సాక్షి, హైదరాబాద్: జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) చేపట్టిన అధ్యయనం ప్రకారం 2010 నుంచి 2019 మ«ధ్య దేశవ్యాప్తంగా 125 వైద్య విద్యార్థులు, 105 మంది రెసిడెంట్ డాక్టర్లు, 128 మంది వైద్యులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. బలవన్మరణాలకు పాల్పడిన ప్రతి 10 మందిలో ఏడుగురు 30 ఏళ్లలోపు వారేనని అధ్యయనంలో వెల్లడైంది. అలాగే ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలోనే (కేరళ మినహా) ఎక్కువ మంది మెడికోల ఆత్మహత్యలు నమోదయ్యాయని, గత ఐదేళ్లలో 64 మంది ఎంబీబీఎస్, 55 పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికోలు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఎన్ఎంసీ వెల్లడించింది. ఒత్తిళ్లు.. విభేదాలు.. అనారోగ్యం.. మెడికోల ఆత్మహత్యలను ఎన్ఎంసీ విశ్లేషించగా విస్తుగొలిపే విషయాలు వెల్లడయ్యాయి. మెడికోల ఆత్మహత్యలు ఎక్కువగా జరిగే విభాగాల్లో అనస్తీ షియాలజీ (22.4 శాతం) తొలి స్థానంలో నిలవగా ఆ తర్వాత స్థానంలో ప్రసూతి–గైనకాలజీ (16 శాతం) నిలిచింది. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వైద్య విద్యార్థుల్లో (45.2 శాతం), రెసిడెంట్ డాక్టర్లలో (23.1 శాతం) చదువుల ఒత్తిడి కారణమవుతోంది. అలాగే వైద్యుల దాంపత్య జీవితంలో మనస్పర్థలు (26.7 శాతం), మానసిక సమస్యలు (వైద్య విద్యార్థుల్లో 24 శాతం, వైద్యుల్లో 20 శాతం), వేధింపులు (20.5 శాతం) ఆత్మహత్యలకు ఇతర కారణాలుగా నిలిచాయి. ఆత్మహత్యలకు పాల్పడిన వారిలో 13 శాతం మంది గతంలో మానసిక వైద్య సహాయం కోరడం గమనార్హం. ఆర్టీఐ కార్యకర్త వివేక్ పాండే ఇటీవల అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ అధ్యయన ఫలితాల్ని విడుదల చేసింది. మరోవైపు వైద్యవృత్తిలో ఉన్నవారిలో ఆత్మహత్య ప్రమాదం సాధారణ జనాభా కంటే దాదాపు 2.5 రెట్లు ఎక్కువని ఇండియన్ మెడికల్ అసోసియేషన్–జూనియర్ డాక్టర్స్ నెట్వర్క్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ కమిటీ హెడ్ రిమీ డే పేర్కొన్నారు. చదువుకు గుడ్‌బై చెబుతున్నారు దాదాపు అన్ని మెడికల్ కాలేజీల్లో నియమాలు, రక్షణలు సహాయక వ్యవస్థలు ఉన్నప్పటికీ సక్రమంగా అమలు కావడం లేదని... అందుకే 1,166 మంది విద్యార్థులు వైద్య కళాశాలలకు వీడ్కోలు పలికారని అధ్యయనం తేలి్చంది. వారిలో 160 మంది ఎంబీబీఎస్, 1,006 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు చదువుతున్న వారు ఉన్నారు. ఎన్ఎంఏ కీలక సూచనలివీ... ♦ వైద్య విద్యార్థులు మాదకద్రవ్యాలు, మద్యం, పొగాకు ఇతర దురలవాట్లకు దూరంగా ఉండాలి. ♦సామాజిక మాధ్యమ పరిధి, ఉపయోగంతో పాటు విచక్షణారహిత వినియోగంతో వచ్చే వృత్తిపరమైన ప్రమాదాల గురించి వైద్య విద్యార్థులు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ♦ రోగులతో సమర్థంగా కమ్యూనికేట్ చేయడానికి స్థానిక భాషను నేర్చుకోవాలి. ♦ విద్యార్థులు ఎదుర్కొనే ఒత్తిడి, మానసిక అనారోగ్య సమస్యల గురించి ప్రొఫెసర్లు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ♦ వైద్య విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి అందుబాటులో ఉన్న పరిష్కార ప్రక్రియల గురించి అవగాహన పెంచుకోవాలి. అధ్యయనం జరగాలి... ‘వెలుగులోకి వచ్చేవి, మీడియా లో చర్చకు నోచుకున్నవే కాదు. బయటకు రాని మరికొన్ని ఆ త్మహత్యల ఉదంతాలూ ఉన్నా యి. ప్రైవేటు మెడికల్ కాలేజీ ల్లో నిబంధనల పేరిట విద్యార్థుల్ని విపరీతమైన ఒత్తిడికి లోనుచేస్తున్నారు. ఇక ఆస్పత్రుల్లో 24/7 షిఫ్టులు, కుటుంబానికి దూరంగా ఉండటం, ఆర్థిక కష్టాలు, కొన్ని చోట్ల ర్యాగింగ్, కుల వివక్ష, భవిష్యత్తుపై భయం వంటివి వైద్య విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. దీనిపై సమగ్ర అధ్యయనం జరపాలి. నివారించే దిశగా కార్యాచరణ రూపొందించాలి. – డాక్టర్ బీఎన్ రావు, ఐఎంఏ అధ్యక్షుడు ఒత్తిడి ఉంది... పరీక్షల దశలోనే ఒత్తిడి బా గా ఉంది. ఇంటర్న్స్, పీజీలకు రెగ్యులర్ డ్యూటీల భారం ఉంటోంది. ముఖ్యంగా ప్రభుత్వాస్పత్రుల్లో ఎక్కు వమంది రోగులు, తక్కువ మంది వైద్యులు ఉండటం వల్ల నిర్ణీత పనివేళలు ఉండవు. సర్జరీల్లో ఉండే వారికి మరింత ఎక్కువ పనిభారం ఉంటోంది. –డాక్టర్ కౌశిక్ డెర్మా, జూనియర్ వైద్యుల సంఘం అధ్యక్షుడు -
‘ఫోకస్’ తప్పుతోంది
కంచర్ల యాదగిరిరెడ్డి : అర నిమిషం తీరిక లేదు... అర్ధరూపాయి సంపాదన లేదు.. ఈ సామెత వింటుంటే ఈ తరం బడిపిల్లలు గుర్తుకు వస్తున్నారు. ఎప్పుడు చూసినా పుస్తకాల్లో తలమునకలై ఉంటారు. బాగా చదువుతున్నారే అని మురిసిపోయినా.. పరీక్షల్లో వచ్చిన మార్కులు చూస్తే అత్తెసరు. ఈ తరం పిల్లల్లో ఎక్కువ మంది ఫోకస్డ్గా లేకపోవడమే దీనికి కారణమని నిపుణులు చెప్తున్నారు. అసలు పెద్దవారి ఏకాగ్రత కూడా బాగా తగ్గిపోతోందని.. స్మార్ట్ఫోన్లు, ఇతర డిజిటల్ పరికరాలు, మాధ్యమాల వల్లే ఈ పరిస్థితి నెలకొందని స్పష్టం చేస్తున్నారు. దృష్టి మళ్లే దారులెన్నో.. మునుపటితో పోలిస్తే పిల్లల దృష్టి మళ్లేందుకు స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, టీవీలు ఇలా ఎన్నో కారణమవుతున్నాయి. నిత్యం ఎవరో ఒకరి నుంచో, ఏదో వాట్సాప్ గ్రూపులోనో మెసేజీలు రావడం, ఫేస్బుక్ నోటిఫికేషన్లు, స్మార్ట్ వాచ్ మెసేజ్.. ఇలా తరచూ మన దృష్టిని తప్పిస్తున్నాయని, దీనివల్ల తదేకంగా ఒక పనిని శ్రద్ధగా చేసే శక్తిని కోల్పోతున్నామని నిపుణులు చెప్తున్నారు. సెల్ఫోన్లు రాకముందు, సాంకేతిక విప్లవం లేనప్పుడు మనుషులు ఎలా ఉన్నారు? ఇప్పుడెలా ఉన్నారన్నదానిపై అమెరికాలోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్, అండ్ హ్యూమన్ డెవలప్మెంట్’ఇటీవల ఓ అధ్యయనం చేసింది. 1946–1975 మధ్య కాలంలో పుట్టి, రకరకాల రంగాల్లో పనిచేస్తున్న వారిని, 1976–2000 మధ్య పుట్టి పలు రంగాల్లో ఉన్న వారిని, ప్రైమరీ స్కూల్, హైసూ్కల్, కాలేజీ విద్యార్థులను ప్రశ్నించి.. ఐక్యూ టెస్ట్ పెట్టింది. ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా దేశాల్లో ఈ అధ్యయనం సాగింది. ఏ పనికైనా ఫోకస్ అవసరం! మనం ఏ పనిచేయాలన్నా ఫోకస్ అనేది చాలా అవసరం. లేకుంటే ఏ పని సరిగా, త్వరగా పూర్తి చేయలేం. తరాలు మారుతున్న కొద్దీ ఫోకస్ టైం మారుతూ వస్తోందని అధ్యయనంలో తేలింది. ఉదాహరణకు బేబీ బూమర్లు అంటే 1946–1964 మధ్య పుట్టినవాళ్లకు ఫోకస్ టైం ఇరవై నిమిషాలు ఉండేది. తర్వాతి తరం జనరేషన్ ఎక్స్ అంటే 1965–1980 మధ్య పుట్టినవారి ఏకాగ్రత 12 నిమిషాలకు చేరింది. 1981, ఆ తర్వాత పుట్టినవారికి ఇది కేవలం ఎనిమిది నుంచి 12 నిమిషాలే.. ఫోకస్ పెట్టలేక పోయినప్పుడు అరగంటలో చేయాలనుకున్న పని గంట, గంటన్నర పడుతుంది. పైగా చేసే పనిలో నాణ్యత ఉండదని.. యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి సమస్యలూ వస్తాయని, మానసిక ఒత్తిడి పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. నాలుగేళ్ల కితం జరిగిన ఒక పరిశోధన ప్రకారం.. ఇంటర్నెట్ వాడకం మన మెదడులోని పలు ప్రాంతాల్లో మార్పులకు కారణమవుతుందని తేలింది. ఇలా మారిపోయే విషయాల్లో మన జ్ఞాపకాలూ ఉన్నాయని వెల్లడైంది. ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్, అండ్ హ్యూమన్ డెవలప్మెంట్’అధ్యయనం ప్రకారం కూడా.. నిద్రకు ఉపక్రమించే ముందు స్మార్ట్‌ఫోన్ లేదా ఇతర డిజిటల్ స్క్రీన్లను చూడటం వల్ల నిద్రకు చేటు కలుగుతుంది. అది కాస్తా వారి రోజువారీ కార్యక్రమాలపై ప్రభావం చూపుతుంది. వాటితో కేవలం పరధ్యానమే.. కంప్యూటర్ల వాడకంతో మనుషుల మానసిక స్థితిపై కలిగే ప్రభావంపై ఇంకో అధ్యయనం కూడా జరిగింది. ఆ్రస్టేలియాకు చెందిన డాక్టర్ షరోన్ హార్వుడ్ నిర్వహించిన ఆ అధ్యయనం ప్రకారం.. టెక్నాలజీ అనేది మన మేధో సామర్థ్యాన్ని వెంటనే మార్చేస్తుందనడం పూర్తిగా వాస్తవమేమీ కాదు. యుగాలుగా రకరకాల పరిస్థితు లను ఎదుర్కొని పరిణామం చెందిన మెదడు పనితీరు ఒక్క తరంలో మారిపోదని ఆమె చెప్తున్నా రు. కాకపోతే డిజిటల్ పరికరాలు మన మనసును పరధ్యానంలో పడేస్తాయని స్పష్టం చేస్తున్నారు. పక్కన ఉన్నా ప్రభావమే.. మన పరిసరాల్లో స్మార్ట్‌ఫోన్, ఇతర డిజిటల్ స్క్రీన్ డివైజ్ ఉంటే చాలు మన ఏకాగ్రత స్థాయి గణనీయంగా తగ్గిపోతుందంటున్నారు నిపుణులు. ఆలోచించడం, గుర్తుంచుకోవడం, భావోద్వేగాల నియంత్రణకు కారణమైన విషయాలపై దృష్టిపెట్టడం వంటివాటిపై స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్, కంప్యూటర్ల వంటివి ప్రభావం చూపగలవని ఎన్నో అధ్యయనాల్లో తేలిందని స్పష్టం చేస్తున్నారు. చేతుల్లో, లేదా జేబులో, పక్కన టేబుల్‌పైనో స్మార్ట్‌ఫోన్ ఉంటే.. మన మనసు చేసే పనిపై కాకుండా ఫోన్‌కు వచ్చే నోటిఫికేషన్లు లేదా అది చేసే శబ్దాలపై పడుతుందని వెల్లడైందని వివరిస్తున్నారు. క్షణం విడిచి ఉండలేకుండా.. రోజులో గంటా రెండు గంటల పాటు స్మార్ట్‌ఫోన్ అందుబాటులో లేకపోయినా సరే నానా హైరానా పడే వారి సంఖ్య బాగా పెరిగిందని నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే పాశ్చాత్యదేశాల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారని.. మన దేశంలోనూ ఆ పరిస్థితి వస్తోందని హెచ్చరిస్తున్నారు. తక్షణ తృప్తి (ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్) కారణంగానే మనుషులు డిజిటల్ పరికరాలకు బానిసలవుతున్నట్టు వివరిస్తున్నారు. చాలా దేశాల్లో పిల్లలు నిపుణులు సూచించిన దాని కంటే ఎక్కువ సమయం డిజిటల్ తెరల ముందు గడుపుతుండటం ఆందోళనకరమని స్పష్టం చేస్తున్నారు. సమస్యను గుర్తించడం ఎలా? ♦ చేపట్టిన పనిని పూర్తి చేసేందుకు కష్టపడుతుంటే, కష్టం అనిపిస్తుంటే, అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోతుంటే ఫోకస్ కోల్పోయామని అర్థం. ♦ అకారణంగా చిరాకు అనిపిస్తున్నా, మన దృష్టి సులువుగా పక్కదారి పడుతున్నా, రెస్ట్‌లెస్‌గా అనిపిస్తున్నా.. ఫోకస్ కోల్పోయామని స్పష్టంగా తెలుస్తుంది. ♦ ముఖ్యమైన అంశాలను అప్పటికప్పుడు మర్చిపోతుంటే ఫోకస్ పోతున్నట్టే. ఏమిటి పరిష్కారం? ♦ ఫోకస్ పెంచుకునేందుకు సులువైన మార్గాలెన్నో ఉన్నాయి. మన ఏకాగ్రతను దెబ్బతీస్తున్న మొబైల్ ఫోన్ నోటిఫికేషన్, కంప్యూటర్ నోటిఫికేషన్ వంటివి ఆఫ్ చేయాలి లేదా అత్యవసరమైనవే వచ్చేలా సెట్ చేసుకోవాలి. ♦ ఏ పని ముందు చేయాలి? ఏ పని తరువాత చేయాలి? దేనికి ప్రాధాన్యత ఎక్కువ? దేనిని నిర్ణీత సమయం (డెడ్‌లైన్)లోపు పూర్తి చేసుకోవాలన్న దానిపై కొంత వర్క్ చేసుకుని ప్రాధాన్య క్రమంలో పూర్తి చేయడం నేర్చుకుంటే ఫోకస్ పెరుగుతుంది. ♦ ప్రతిరోజు మైండ్ ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయాలి. అంటే పూర్తిగా చేసే పనిపైనే ధ్యాస నిలిపాలి. ఉదాహరణకు.. ఉదయం లేవగానే బ్రష్ చేసేటప్పుడు ఆ బ్రషింగ్పై మాత్రమే, కాఫీ తాగేటప్పుడు దానిపై మాత్రమే ధ్యాస నిలిపేందుకు ప్రయత్నించాలి. ఇలా అన్ని పనులకూ వర్తింపజేయాలి. దీనిని రోజూ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఫోకస్ ఆటోమేటిగ్గా పెరుగుతుంది. –విశేష్ , సైకాలజిస్ట్ ఇంటర్నెట్కు బానిసవుతున్న జనం ప్రపంచవ్యాప్తంగా జనం ఇంటర్నెట్కు బానిసగా మారుతున్నారని పలు అధ్యయనాల్లో తేలింది. వాటి ప్రకారం.. రోజులో ఒక్కొక్కరూ కనీసం 149 నిమిషాల పాటు స్మార్ట్‌ఫోన్‌ను చూస్తూ గడుపుతున్నారు. ప్రతి ఐదుగురిలో ఒకరు రాత్రిళ్లు నిద్రలేచి మరీ సోషల్ మీడియా పోస్టులు చూసుకుంటున్నారు. వీడియో గేమ్స్ ఆడే యువకులు వారంలో వాటిపై గడిపే సమయం 8 గంటలకు పైనే.. అమెరికాలో ట్రాఫిక్ ప్రమాదాల్లో 26శాతం స్మార్ట్‌ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేయడం వల్లనే జరుగుతున్నాయి! -
జీతం కాదు.. మానసిక ప్రశాంతతే ముఖ్యం
మానవ సమాజానికి కరోనా ప్రత్యక్ష, పరోక్ష రూపాల్లో నేర్పినన పాఠాలు అన్నీ ఇన్నీ కాదు. దాదాపు మూడేళ్ల క్రితం ప్రాణాంతక కోవిడ్ వైరస్ వ్యాప్తిలోకి వచ్చి ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా అన్ని వర్గాల ప్రజలు ఏదో ఒక రూపంలో తీవ్రంగా ప్రభావితమైన తీరు తెలిసిందే. మళ్లీ కరోనా కేసుల పెరుగుదల, దేశవ్యాప్తంగా ఫ్లూ కేసులు, వివిధ రకాల ఇన్‌ఫ్లూయెంజా వైరస్ల వ్యాప్తి నేపథ్యంలో ఒత్తిళ్లకు దూరంగా జీవనం, మానసిక ప్రశాంతత వంటివి అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. జీతం కంటే మానసిక ప్రశాంతతకే ఓటు వేస్తున్న ఉద్యోగుల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా గణనీయంగా పెరుగుతోంది. వివిధ దేశాల్లో అధిక శాతం ఉద్యోగులు పని ప్రదేశాల్లో మానసిక ఆరోగ్యం అనేది చాలా కీలకమని అంగీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ సహా పది దేశాల్లోని ఉద్యోగులపై చేసిన ఓ తాజా అధ్యయనంలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. అన్నిట్లోనూ మార్పు దిశగా అడుగులు మనుషులకు సవాళ్లు ఎదురైనప్పుడే వాటిని ఎలా అధిగమించాలనే దానిపై దృష్టి పెడతారు. జీవితం దుర్లభంగా మారుతోందనగానే దానిని ఎదుర్కొని అనుకూలంగా మార్చుకునేందుకు ఏమి చేయాలనే ఆలోచనలు వస్తాయి. పరిస్థితులకు తగ్గట్టుగా తమను తాము మార్చుకోవడం, జీవిత ప్రాధామ్యాల్లోనూ మార్పులు, చేర్పులు చేసుకోవడం జరుగుతుంది. ఏది చేస్తే మనసుకు, శరీరానికి స్వాంతన దొరుకుతుందనే దానికి అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. మానసిక ప్రశాంతతకే అత్యధిక ప్రాధాన్యతనివ్వాలనే ట్రెండ్ ఎప్పటికీ ఉంటుందా? అంటే ఇప్పుడే చెప్పలేం. కొంతకాలం మాత్రం తప్పకుండా ఉంటుంది. అందువల్లే చాలామంది ఆరోగ్యం మీద ఫోకస్ పెడుతున్నారు. పని పద్ధతులు, పని సమయాలు, తీసుకునే ఆహారం, ధరించే దుస్తులు.. ఇలా అన్నిటిలోనూ మార్పు దిశగా అడుగులు వేస్తున్నారు. మనుషులపై కరోనా పరిస్థితులు తెచ్చిన ప్రభావం మాత్రం రాబోయే 4, 5 ఏళ్ల పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. – సి.వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్ భారత్‌లో ఇలా.. ►పనిచేసే ప్రదేశాల్లో మానసిక ఆరోగ్య పరిరక్షణే ప్రధానమన్న అధిక శాతం ఉద్యోగులు ► ఒత్తిళ్లకు దూరంగా ప్రశాంతతతో జీవించేందుకు.. అధిక జీతాలొచ్చే ఉద్యోగాలు సైతం వదులుకునేందుకు సిద్ధమని 88% మంది చెప్పారు. ►71 శాతం మంది పని భారం వల్ల తలెత్తే ఒత్తిళ్లు వ్యక్తిగత జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. ►వ్యక్తిగత సంబంధాలనూ ప్రభావితం చేస్తున్నాయన్న 62% మంది. ►కుటుంబ సభ్యులతో మెరుగైన సంబంధాలు, సంతోషకరమైన జీవితమే ముఖ్యమన్న 46% మంది. ►పని ఒత్తిళ్లతో సాయంత్రాని కల్లా నిస్త్రాణంగా మారుతున్నామని 26% మంది చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే... ► ఇతర దేశాల ఉద్యోగులు సైతం మన దేశంలో మాదిరి అభిప్రాయాలనే వ్యక్తం చేశారు. ►అధిక జీతమొచ్చే ఉద్యోగం కంటే మంచి మానసిక ఆరోగ్యానికి అనువైన ఉద్యోగానికే 81% మంది మొగ్గు చూపారు. ►తమ పనితీరుపై మానసిక ఒత్తిళ్లు ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని 78% మంది చెప్పారు. ►తాము చేస్తున్న ఉద్యోగం మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తోందని 60% మంది పేర్కొన్నారు. మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది ప్రస్తుతం ఉద్యోగులతో పాటు అందరూ మానసిక ఆరోగ్యానికి బాగా ప్రాధాన్యత ఇస్తున్నారు. మన జీవితాల్లో కరోనా పరిస్థితులు తెచ్చిన అనిశ్చితి అంతా ఇంతా కాదు. మహమ్మారి ఉధృతంగా ఉన్నప్పటి తీవ్రమైన భయం ఇప్పటికీ కొనసాగుతోంది. దాదాపు అన్నివర్గాల వారు డబ్బు ఆదా చేయడం కంటే మానసిక ప్రశాంతతే ముఖ్యమనే భావనకు వచ్చారు. మానసిక ఒత్తిళ్లకు దూరంగా ఉండేలా జీవనశైలిని మార్చుకోవాలనే శ్రద్ధ పెరిగింది. గతంలో ఇలాంటి పరిస్థితి అంతగా ఉండేది కాదు. కానీ కరోనాతో చాలా మార్పు వచి్చంది. ప్రతిఒక్కరూ మానసిక ప్రశాంతత కోరుకోవడం ఎక్కువైంది. – డాక్టర్ బి.అపర్ణా రెడ్డి, హెచ్ఆర్ నిపుణురాలు -
జీవితంలో సుడిగుండం.. మానసిక శక్తిని దెబ్బతీసిన కరోనా
‘కరోనాతో రెండేళ్ల పాటు ఇంట్లోనే ఆన్లైన్ క్లాస్‌లకు అటెండ్ అయ్యాను. అప్పట్లో సరిగా చదువుపై దృష్టి సారించలేదు. ప్రస్తుతం ఆఫ్‌లైన్ క్లాస్‌లు నడుస్తున్నాయి. రోజూ కాలేజీకి వెళుతున్నాను. కానీ టీచర్ చెప్పేది అర్థం కావడం లేదు. పరీక్షల్లో మార్కులు తక్కువగా వస్తున్నాయి. రాత్రిళ్లు నిద్ర కూడా పట్టడం లేదు’ – ఓ ఇంటర్ విద్యార్థి ‘ఓ వైపు ఆఫీస్, మరోవైపు ఇల్లు.. ఇలా రెండు చోట్లా సమస్యలు వేధిస్తున్నాయి. ఫలితంగా మానసిక ప్రశాంతత కోల్పోతున్నాను. ఒంటరిగా జీవించాలనే భావన పెరుగుతోంది’ – ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి సాక్షి, అమరావతి: వివిధ మానసిక సమస్యలతో సతమతమవుతున్న వారు వైద్య శాఖ ఏర్పాటు చేసిన ‘టెలీ మానస్’ కాల్ సెంటర్‌ను సంప్రదిస్తున్నారు. సమస్యలను వివరంగా తెలుసుకుంటున్న కాల్ సెంటర్లోని కౌన్సిలర్లు బాధితులకు సాంత్వన చేకూరుస్తున్నారు. అవసరం మేరకు దగ్గర్లోని ప్రభుత్వాస్పత్రిలోని మానసిక వైద్యులకు రిఫర్ చేసి వైద్య సేవలు అందేలా చూస్తున్నారు. కరోనా మహమ్మారి, వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ చాలా మందిలో మానసిక శక్తిని దెబ్బతీసింది. దీనికి తోడు వివాహ బంధాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, విద్యా, ఉద్యోగం, అనారోగ్యం ఇతరత్రా కారణాలతో మానసిక సమస్యలతో సతమతమయ్యే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. దేశంలో సుమారు 15 కోట్ల మంది మానసిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని గతేడాది నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్(ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్) సర్వే వెల్లడించింది. డిప్రెషన్‌కు లోనై.. రాష్ట్రంలో మానసిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం, సలహాలు, సూచనలివ్వడం కోసం గతేడాది అక్టోబర్‌లో వైద్య శాఖ కాల్ సెంటర్‌ను ప్రారంభించింది. విజయవాడ ప్రభుత్వ వైద్య కళాశాలలో కాల్ సెంటర్ ఉంది. ఈ కాల్ సెంటర్‌కు ఇప్పటి వరకూ వివిధ సమస్యలతో 2,452 మంది ఫోన్ చేశారు. ప్రస్తుతం రోజుకు సగటున 30 వరకూ కాల్స్ వస్తున్నాయి. కాల్ సెంటర్‌ను సంప్రదించిన వారిలో ఎక్కువ మందిలో డిప్రెషన్ సమస్య ఉన్నట్టు కౌన్సెలర్లు చెబుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి భయం, లాక్డౌన్ కారణంగా ఎక్కువ రోజులు ఒంటరిగా గడపడం, కుటుంబ సభ్యులు, సన్నిహతులు మృత్యువాత పడటం.. ఆర్థిక ఇబ్బందులు మొదలైనవి డిప్రెషన్‌కు ముఖ్య కారణాలుగా బాధితులు చెబుతున్నట్టు వెల్లడైంది. కొందరిలో ఈ సమస్య ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్నట్టు తెలిసింది. మరికొందరిలో సమస్య తీవ్రమై.. తమ చుట్టూ ఉండే కుర్చీలు, బల్లలు, ఇతర వస్తువులు మాట్లాడుతున్నాయన్న భావన కలుగుతోందని చెబుతున్నారు. ఇంటర్, పదో తరగతి విద్యార్థులు సైతం కాల్ సెంటర్‌కు ఫోన్ చేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్న వారే. కరోనా కారణంగా రెండేళ్ల పాటు అకడమిక్ ఇయర్ దెబ్బతింది. దీనికి తోడు, కొందరు తల్లిదండ్రులు పిల్లల అభిరుచులు, సామర్థ్యాలు పట్టించుకోకుండా పదో తరగతి, ఇంటర్లో మంచి మార్కులు రావాలి, ఐఐటీ, నీట్లో ర్యాంక్‌లు సాధించాలి.. అంటూ పిల్లలపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలు సైతం మార్కులు, ర్యాంక్‌ల కోణంలోనే విద్యార్థులను వేధిస్తున్నాయి. ఈ ధోరణుల మధ్య తాము తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నామని కాల్ సెంటర్‌కు ఫోన్ చేస్తున్న విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక దశలో వైద్యులను సంప్రదించడం ఉత్తమం మానసిక సమస్యలు ఉన్నవారు ప్రాథమిక దశలోనే కౌన్సెలర్లు, వైద్యులను సంప్రదిస్తే మంచిది. అయితే చూసే వాళ్లు ఏమనుకుంటారోనని కౌన్సిలర్లు, వైద్యులను సంప్రదించడానికి విముఖత వ్యక్తం చేస్తుంటారు. అలాంటి వారు 14416 లేదా 180089114416 నంబర్‌కు కాల్ చేసి మానసికంగా ఉపశమనం పొందుతున్నారు. నచ్చిన పాటలు వినడం, సినిమాలు చూడటం, విహార యాత్రలకు వెళ్లడం వంటి కార్యకలాపాలు చేస్తే మానసికంగా ప్రశాంతంగా ఉండొచ్చు. – ఎ.అనంత్‌కుమార్, కౌన్సెలర్, సూపర్వైజర్ టెలీ మానస్ కాల్‌సెంటర్ -
కన్నీళ్లు తెప్పించే ఘటన.. నీవు లేక నేను లేను..
అమలాపురం టౌన్: భార్య మృతిని తట్టుకోలేని భర్త కొద్దిసేపటికే బలవన్మరణానికి పాల్పడ్డాడు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం పట్టణంలోని కొంకాపల్లిలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ విషాద ఘటన కలకలం రేపింది. పట్టణ ఇన్చార్జి సీఐ వీరబాబు, స్థానికుల కథనం ప్రకారం.. కొంకాపల్లిలో భార్యాభర్తలు బోనం తులసీలక్ష్మి(45), శ్రీరామ విజయకుమార్(47) ఇంట్లోనే కొద్ది నిమిషాల తేడాలో మృతి చెందారు. ఓఎన్జీసీ సబ్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న విజయకుమార్ ఇటీవల ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాడు. భార్య తులసీలక్ష్మికి మూడు నెలల కిందట మెదడుకు సంబంధించిన శస్త్రచికిత్స జరిగి, అనారోగ్యంతో అవస్థలు పడుతోంది. శనివారం రాత్రి ఇద్దరూ ఇంట్లో నిద్రపోయారు. తెల్లవారుజామున తులసీలక్ష్మి బెడ్ రూమ్‌లో మంచంపై విగతజీవిగా ఉంది. ఆమె మరణాన్ని భర్త విజయకుమార్ తట్టుకోలేకపోయాడు. అప్పటికే ఆర్థిక సమస్యలతో మానసిక ఒత్తిడికి గురవుతున్న అతనికి భార్య మృతి మరింత కుంగదీసింది. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురై తన ఇంటి రెండో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వీరి కుమారుడు కృష్ణ విజయవాడలో ఇంటర్ చదువుతున్నాడు. తల్లిదండ్రుల మరణవార్త తెలియడంతో అతడు విజయవాడ నుంచి హుటాహుటిన వచ్చి.. అమ్మానాన్నల మృతదేహాలపై పడి ఏడ్వడం అందరినీ కలచివేసింది. తులసీలక్ష్మి తండ్రి గోవిందు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వీరబాబు తెలిపారు. -
ఆఫీస్‌లో పని ఒత్తిడా..? అయితే ఇలా చేయండి
ఆఫీసుల్లో పని భారం ఎక్కువైనప్పుడు ఒత్తిడికి గురవడం సహజమే. అయితే ఇది ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. అందుకే దీన్ని తొందరగా తగ్గించుకోవాలి. కొన్ని సాధారణమైన చిట్కాలను పాటిస్తే ఒత్తిడి నుంచి తక్షణమే ఉపశమనం లభిస్తుంది. ప్రస్తుత కాలంలో చాలా మంది మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఆఫీస్ పనులకు వ్యక్తిగతమైన పనులు కూడా తోడు కావడంతో ఒక్కోసారి ఊపిరి సలపనంత పనులతో అవిశ్రాంతంగా పని చేయవలసి వస్తుంది. దీనివల్ల విపరీతమైన ఒత్తిడికి గురవుతుంటారు. ఇది మన శరీరంపై కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఫలితంగా పనులను అస్సలు పూర్తిచేయలేము సరికదా.. ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఈ ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేటందుకు కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే సరి. అవేమిటో తెలుసుకుందాం. గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిది. ఇది బరువును తగ్గించడానికి, వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి, ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా మానసిక ఒత్తిడిని కూడా తొలగిస్తుంది. ఆఫీసులో ఏదైనా కారణం వల్ల మీరు ఒత్తిడికి గురైన ప్పుడు వెంటనే కప్పు గ్రీన్ టీని తాగితే మానసిక స్థితి మెరుగుపడి గందర గోళం తొలగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. సంగీతంతో సాంత్వన సంగీతం మనస్సును ప్రశాంతంగా మారుస్తుంది. అంతేకాదు ఇది ఒత్తిడి నుంచి తక్షణమే ఉపశమనం కలిగిస్తుంది. ఒత్తిడిస్థాయులు ఎక్కువైనాయనిపించినప్పుడు వెంటనే మనసుకు నచ్చిన పాటలను వింటే సరి... ఎందుకంటే సంగీతం కోపాన్ని కూడా అదుపు చేస్తుంది. మనసుకు హాయిని కలిగిస్తుంది. దీంతో ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలిగే శక్తి వస్తుంది. పజిల్ గేమ్స్ ఆఫీసులో పని ఒత్తిడి పెరిగినప్పుడు విసుగ్గా అనిపిస్తుంది. అందులో పని పూర్తికాకపోతే చిరాకుతోపాటుగా ఒత్తిడి కూడా పెరిగిపోతుంది. ఇక కొన్ని కారణాల వల్ల పై అధికారి పదిమందిలోనూ మీపై చిరాకు పడినప్పుడు ఒకవిధమైన మానసిక అస్థిరత ఏర్పడుతుంది. ఇలాంటి క్లిష్ట సమయాల్లోనే చాలా మంది తప్పుడు నిర్ణయాలను తీసుకుంటారు. లేదా మరింత ఎక్కువ ఒత్తిడికి గురవుతారు. ఈ ఒత్తిడి లేని పోని రోగాలకు దారితీస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి పజిల్ గేమ్స్ మీకు బాగా ఉపయోగపడతాయి. ఒత్తిడిగా అనిపిస్తే కాసేపు ఆటలు ఆడండి. ఒత్తిడి కొన్ని సెకన్లలో పోతుంది. ఇష్టమైన వారితో గడపండి కొందరికి సంగీతం అంటే ఆసక్తి ఉండకపోవచ్చు. పజిల్ గేమ్స్ పూర్తి చేయలేకపోవచ్చు. అయితే ఇష్టమైన వాళ్లు అందరికీ ఉంటారు. అటువంటి వాళ్లతో కొద్దిసేపు నవ్వుతూ సరదాగా గడిపితే సరి... మానసిక ఒత్తిడి మటుమాయం అవుతుంది. చివరగా ఒక విషయం ఏమిటంటే... ఒత్తిడిగా అనిపించినప్పుడు ఆ విషయాన్ని ఎవరితో ఒకరితో పంచుకోవాలి. ఆ భారం తీర్చుకునే మార్గం ఆలోచించాలి. లేదంటే ఒత్తిడి మనల్ని ఒత్తేస్తుంది. చదవండి: Green Peas Akki Roti: బియ్యప్పిండి, పచ్చి బఠాణీలతో.. గ్రీన్ పీస్ అక్కీ రోటీ తయారీ -
Kanala hindola: ఆటలకు మానసిక బలం
ఆటల్లో ఒకరు గెలిస్తే మరొకరు ఓడాలి. గెలిచినప్పుడు పొంగిపోకుండా ఓడినప్పుడు కుంగిపోకుండా ఉండగలిగేవారు స్పోర్టివ్ స్పిరిట్ ఉన్నావారు. కాని అందరూ అలా ఉండరు. ఆటల్లో రాణించాలంటే వారిని ఓటమి భయం వెంటాడుతూ ఉంటుంది. ప్రత్యర్థి గురించి ఆందోళనలు ఉంటాయి. చిన్నపిల్లల దగ్గరి నుంచి సీనియర్ ఆటగాళ్ల వరకూ ఈ ఒత్తిడి తప్పించుకోని వారు ఉండరు. మరి వీరికి సాయం? హిందోళ వంటి స్పోర్ట్స్ సైకాలజిస్ట్‌ను కలవడమే. ‘మైండ్ లీడ్’ అనే ప్రోగ్రామ్ ద్వారా ఆటగాళ్ల ఒత్తిడిని తొలగిస్తూ వారికి అవసరమైన మానసిక బలం అందిస్తోంది హైదరాబాద్ వాసి హిందోళ. ‘స్పోర్ట్స్ సైకాలజీ అనేది ఒకటుంటుందని మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. దాని అవసరం ఏముందిలే అనుకోవచ్చు. కానీ ఈ రంగంలో ఈ సైకాలజీ అవసరం ఎంతో ఉంది’ అంటోంది హైదరాబాద్ మాదాపూర్‌లో ఉంటున్న హిందోళ. అందుకు డియర్ కామ్రెడ్‌లోని ఒక సీన్‌ను ఉదాహరిస్తూ.. ‘లిల్లీ క్రికెటర్‌గా రాణిస్తున్న అమ్మాయి. రాష్ట్రస్థాయి క్రీడాకారిణి. మంచి నైపుణ్యం ఉన్న అమ్మాయి సడెన్‌గా డిప్రెషన్ బారిన పడుతుంది. ఎవరికీ అర్థం కాదు. ఎవరూ అర్థం చేసుకోలేరు. క్రికెట్టే లోకంగా బతికిన ఆ అమ్మాయి మూడేళ్లపాటు మానసికంగా ఒంటరైపోతుంది. ఆసుపత్రి పాలైన ఆ అమ్మాయిని హీరో వచ్చి ఆమెను మానసిక వేదన నుంచి బయటికి తీసుకొస్తాడు. అందరి జీవితాల్లోనూ అలాంటి హీరోలు ఉండకపోవచ్చు. కానీ, మానసిక స్థైర్యం ఇవ్వగలిగేవాళ్లు ఉండాలి. ఇటీవల తొమ్మిదవ తరగతి చదువుతున్న ఓ అమ్మాయి బ్యాడ్మింటన్ చాలా బాగా ఆడేది. సడెన్‌గా అకాడమీకి రావడం మానేసింది. ఆ స్పోర్ట్స్ అకాడమీకి సైకాలజిస్ట్‌గా పనిచేస్తున్న నేను ఏమైందని తెలుసుకోవడానికి వారి తల్లిదండ్రులను సంప్రదించాను. తనను కష్టపెడుతున్న సమస్యలు ఆమె తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేకపోయింది. తోటి వారి నుంచి వస్తున్న కామెంట్స్ ఆమెను ఆ ఆట నుంచి తప్పుకునేలా చేశాయి. ఈ విషయంపై కొన్నిరోజుల పాటు చేసిన కౌన్సెలింగ్ ఆమెలో మార్పు తీసుకువచ్చింది. లేదంటే, ఇదే ప్రభావం ఆమె చదువుమీద ఆ తర్వాత తన కెరియర్ మీద పడుతుంది. ముఖ్యంగా అమ్మాయిలకు బయటకు చెప్పుకోలేని ఎన్నో సమస్యలు ఉంటాయి. అవి కోచ్‌ల ద్వారా కావచ్చు, తోటి క్రీడాకారుల ద్వారా కావచ్చు, ఆత్మన్యూనత కావచ్చు, మరేవిధమైన మానసిక సంఘర్షణ అయినా కావచ్చు. ఇలాంటప్పుడు స్పోర్ట్స్ సైకాలజిస్టుల మద్దతు అవసరం అవుతుంది’ అని వివరించింది ఈ మైండ్లీడ్ ఛాంపియన్. అకాడమీలో సైకాలజిస్ట్‌గా.. తను చేస్తున్న వర్క్స్, ప్రణాళికల గురించి వివరిస్తూ – ‘బెంగళూరులోని పదుకొనే ద్రావిడ్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్’లో పనిచేస్తున్నాను. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అథ్లెట్స్తోనూ మాట్లాడుతుంటాను. దీంతో ఏ స్థాయిలో స్పోర్ట్ సైకాలజీ అవసరం అనేది మరింత క్షుణ్ణంగా అర్ధమవుతుంది. చాలామంది క్రీడలలో మానసిక అంశాలకు సంబంధించిన విషయాలు ఎప్పుడూ పక్కన పెట్టేస్తారు. మన దేశంలో అయితే చాలా వరకు దీనిని విస్మరిస్తుంటారు. అందుకే, క్రీడాకారులందరికీ మానసిక శిక్షణను అందుబాటులో ఉంచాలని ఆన్లైన్లో మైండ్లీడ్ ప్రోగ్రామ్ ద్వారా వర్క్‌షాప్స్ నిర్వహిస్తున్నాను. బలమైన స్థితి క్రీడలకు మానసిక బలం అవసరమని విదేశీయులకు బాగా తెలుసు. అందుకే వారు ప్రతి పోటీలో స్పోర్ట్స్ సైకాలజిస్ట్‌ల గైడెన్స్ తప్పక తీసుకుంటారు. మన దేశంలో కూడా దీనిని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన దగ్గర ఇంకా రకరకాల భావజాలాలు ఉన్నాయి. అమ్మాయిలను ఓ స్థాయి వరకే క్రీడలకు పరిమితం చేస్తుంటారు. కుటుంబం, బయట, అకాడమీ, స్కూల్, కాలేజీ.. ప్రతిచోటా వెనక్కి లాగడానికే ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఈ విధానంలో మార్పులు తీసుకురావడానికి ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించాను. దీని ద్వారా అథ్లెట్లు, కోచ్‌లు, బృందాలు, తల్లిదండ్రులకు, సహాయక సిబ్బందికి వినూత్నమైన విధానంలో మానసిక శిక్షణతో పాటు కౌన్సెలింగ్ ఇస్తున్నాను. రాహుల్ ద్రావిడ్‌తో... ఈ భిన్నమైన కోర్సును ఎంచుకున్నప్పుడు మా అమ్మ మాలతి, నాన్న సుధాకర్ల మద్దతుగా నిలిచారు. వారి వల్లే ఈ రంగంలో మరింతగా కృషి చేయగలుగుతున్నాను. ఈ మైండ్ లీడ్ ప్రోగ్రామ్ ద్వారా స్కూల్స్ కాలేజీలలో వర్క్‌షాప్స్ నిర్వహించబోతున్నాను. గ్రామీణ స్థాయి క్రీడాకారులలోనూ మానసిక చైతన్యం నింపే దిశగా కృషి చేస్తున్నాను’ అని వివరించింది ఈ యువ స్పోర్ట్స్ సైకాలజిస్ట్. ఆటలు పరిచిన బాట ‘చిన్నప్పటి నుంచి నాకు ఆటల్లో ఆసక్తి ఎక్కువ. బహుశా కేంద్రీయ విద్యాలయంలో చదవడం, అక్కడ అన్ని ఆటల్లో పోటీపడటం వల్ల క్రీడలు నా జీవితంలో కీలకమయ్యాయి. నా దృష్టి ఎక్కువగా బ్యాడ్మింటన్‌పై ఉండేది. అదే నన్ను ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సన్స్‌కి పరిచయం చేసింది. ఈ రంగంలో కొత్త కొత్త వ్యక్తులను కలిశాను. గెలుపు కోసం ప్రయత్నించేవారితో కలిసి ఉండటం వల్ల ప్రతిరోజూ నన్ను నేను కొత్తగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. ఇందులో ఉండే చేదు అనుభవాలు, పంచుకున్నవారి వేదనలు.. ఇవన్నీ నా కెరియర్ని డిసైడ్ చేసుకునేలా చేశాయి. అందుకే, స్కూల్ చదువు పూర్తవగానే స్పోర్ట్స్ సైకాలజీ దిశగా అడుగులు వేశాను. దీనికోసం బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకాలజీ అండ్ రీసెర్చ్ నుండి సైకాలజీ, జర్నలిజం అండ్ ఉమన్ స్టడీస్‌లో డిగ్రీ చేశాను. ఆ తర్వాత స్పోర్ట్స్ సైకాలజీలో మాస్టర్స్ చేయడానికి మణిపూర్ వెళ్లాను. ఇక్కడే క్రీడలలో మైండ్‌ఫుల్‌నెస్‌పై ప్రయోగాత్మక పరిశోధన చేశాను. భారతదేశంలోని అథ్లెట్ల కోసం సొంతంగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించాను.’ కె.హిందోళ, స్పోర్ట్స్ సైకాలజిస్ట్ – నిర్మలారెడ్డి -
Health Tips: ఎక్కువ సేపు కూర్చుని ఉంటున్నారా? అయితే...
Health Tips In Telugu: సంతోషకరమైన జీవితం ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం, ఒత్తిడి లేని జీవన శైలిని అలవరుచుకోవాలి. దీనిపై పెద్దవాళ్లు, అనుభవజ్ఞులు, ఆయుర్వేద వైద్యనిపుణులు స్పష్టమైన ఆరోగ్యసూత్రాలను ఎప్పుడో చెప్పారు. వాటిని పాటించడం వల్ల మానసిక దృఢత్వం కలుగుతుంది. ఉండవలసిన దినచర్య ►యోగా చేయడం ►ఏడెనిమిది గంటలకు తగ్గకుండా మంచి నిద్ర ►తొందరగా నిద్ర లేవడం ►జాగింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, వాకింగ్, డాన్సింగ్ వంటి ఏరోబిక్ ఎక్సర్సైజ్లు చేయడం. ►తోటివారితో కరుణతో వ్యవహరించడం, పెద్దలు, ఇతరుల పట్ల గౌరవం కలిగి ఉండడం. ►దినచర్య, రుతుచర్య పాటించడం, దయతో వ్యవహరించడం. ►పరోపకార గుణం కలిగి ఉండడం. ►ఆధ్యాత్మిక భావాలు ఉంటే పూజ చేసుకోవడం, పవిత్ర గ్రంథాలు పఠించడం ►కుటుంబంతో ఉల్లాసంగా గడపడం. ►రీడింగ్, సింగింగ్, గార్డెనింగ్, పేయింటింగ్, మ్యూజిక్ వినడం వంటి అలవాట్లతో ఒత్తిడిని దూరం చేసుకోవడం. ►అనవసర జోక్యాలు లేకుండా మనసును నియంత్రించడం చేయకూడనివి ►ఆలస్యంగా నిద్ర పోవడం, ఆలస్యంగా లేవడం, అసలు నిద్ర పోకుండా ఉండడం ►పగటి నిద్ర పోవడం ►శారీరక శ్రమ, వ్యాయామం లేకుండా అధికంగా కూర్చుని ఉండే జీవన సరళి కలిగి ఉండడం ►అధికంగా ఒత్తిడి కలిగి ఉండడం ►కామం, క్రోధం, లోభం వంటివాటిపై నియంత్రణ లేకపోవడం ►సామాజిక నిబంధనలు, నైతిక విలువలు పాటించక, అసహజ ప్రవర్తన కలిగి ఉండడం ►అతిగా ఆలోచించడం, ఏవో పాత సంఘటనలని తలచుకుని నిరంతరం బాధపడుతుండడం, ఆందోళన పడటం ►నిరంతరం టీవీ, మొబైల్ చూడటం.. దీనివల్ల సెన్స్ ఆర్గాన్స్పై ఒత్తిడి ►కోపం, భావోద్వేగాలపై నియంత్రణ లేకపోవడం ►అతిగా భయం, కామం వంటి వాటికి లోనయ్యే చర్యలకు పాల్పడడం చదవండి: Diet For Mental Health: మానసిక దృఢత్వం కోసం.. ముడి పెసలు, ఉసిరి.. ఇంకా! ఇవి మాత్రం మానేయాలి! Health Tips: కాలీఫ్లవర్, క్యారెట్లు, బీట్రూట్, పుట్టగొడుగులు అతిగా తింటే అంతే సంగతులు! కాస్త.. -
Stress Management: వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఒత్తిడిని ఇలా దూరం చేయండి..
కరోనా మూలంగా చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఇంటి నుంచి పని చేయడం చాలా సులువుగా ఉంటుంది అనుకుంటారు. ఇంట్లోంచి పనిచేస్తే ఆఫీసు/ కాలేజీ/ బడికి వెళ్లే ప్రయాణ సమయం కొంత మిగిలినట్లే కనిపించినా, రానురానూ దానివల్ల ఇబ్బందులు తప్పించి, అంతగా ప్రయోజనాలు లేకపోయినా, థర్డ్ వేవ్ మూలంగా వర్క్ ఫ్రమ్ హోమ్‌ను కొనసాగిస్తున్నట్లు సాఫ్ట్వేర్ సంస్థల ఉద్యోగులకు ఉత్తర్వులు అందాయి. దాంతో తిరిగి ఇంటినుంచి పనిని కొనసాగించక తప్పడం లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసే వారు ఒత్తిడికి, అనారోగ్యానికి గురి కాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఈ వారం చూద్దాం... ఆఫీసులో ఉంటే ఉండే వాతావరణం వేరు. ఇంటిలో ఉండి పని చేస్తే ఉండే వాతావరణ వేరు. ఎందుకంటే, చాలామందికి ఇంటినుంచి పని చేయడానికి కావలసిన సాధన సంపత్తి అందుబాటులో ఉండదు. చిన్న చిన్న గదులు గలవారికి మరీ ఇబ్బంది. ప్రశాంతంగా వుండే ప్రత్యేకమైన గది, చుట్టుపక్కలవారు పని చేస్తుంటే వారితో కలిసి పని చేయడం, ఏమైనా సందేహాలు వస్తే సీనియర్లను, లేదంటే విషయ పరిజ్ఞానం కల కొలీగ్స్‌ను అడిగి తెలుసుకుంటూ ఆడుతూ పాడుతూ పని చేయడం సులువు. అయితే ఇంటిలో ఉండి పని చేసేటప్పుడు అందరికీ తగిన వసతులు ఉండకపోవచ్చు. ముఖ్యంగా సరైన ఎత్తులో వుండే మేజా బల్ల, కుర్చీ, దానికి వీపు ఆన్చడానికి వీలుగా వుండే వాలు, చేతులు మోపడానికి ఆర్మ్ రెస్ట్ వంటివి ఇంటిలో అందుబాటులో ఉండవు. ►చాలామంది ఒళ్లో లాప్ టాప్ పెట్టుకుని మంచం మీదో, సోఫాలోనో ఒరిగిపోయి లేదా వాలిపోయి రోజంతా వేళ్లను టప టపలాడిస్తూ అదేపనిగా పని చేస్తూ ఉండడం వల్ల రకరకాల జబ్బుల బారిన పడుతున్నారు. నాలుగైదు గంటలు గడిచేసరికి విపరీతమైన వీపు నొప్పి, మెడనొప్పి, మౌస్ ఎక్కువగా వాడే వారికి మణికట్టు నొప్పులతోబాధ పడినట్లు ఇటీవల జరిగిన ఒక సర్వేలో తెలియ వచ్చింది. చదవండి: Beauty Tips: కళ్ల చుట్టూ ఏర్పడ్డ నల్లటి వలయాలు తగ్గాలంటే... ► గ్రాఫిక్స్ మీద పనిచేసేవారు తీక్షణంగా రెప్ప వాల్చకుండా దృష్టి మరల్చకుండా స్క్రీన్ కేసి అదేపనిగా చూడటం వల్ల కళ్లు లాగేసి తలనొప్పి వస్తోంది. బయటికి కదలకుండా ఇంట్లోనే కూర్చోడం మూలంగా డీ విటమిన్ లోపాలు తలెత్తే అవకాశం మెండుగా వుంది. కాబట్టి ఇంట్లోంచి పని చేసినా ఆఫీసు కి వెళుతున్నట్లే ఒక నిత్యకృత్యంలా నిబద్ధతతో ఆఫీస్/ చదువు టైం ప్రకారం ముగించి, కాసేపు దుకాణం కట్టేసి, వీలుంటే డాబా మీదో, వరండాలోనో, పెరట్లోనో కాసేపు అటూ ఇటూ తిరిగి గాలిపోసుకోవడం వల్ల రిఫ్రెష్మెంట్తోపాటు కంటికి, ఒంటికి కొంత మేలు. ►ఆఫీస్‌లో అయితే పొద్దున 10 నుంచి సాయంత్రం 5 లేదా 6 వరకు అనే టైమింగ్స్ ఉంటాయి. ఇంటినుంచి పని చేసేవారు అలాంటి నిబంధన పెట్టుకోకుండా వీలు కుదిరినప్పుడు మొదలు పెట్టి, అది పూర్తి అయ్యే వరకు దానితోనే కుస్తీలు పడుతుంటారు. అయితే అలాకాకుండా ఆఫీస్‌లో ఉండి పని చేస్తున్నట్లే ఇంటి దగ్గర కూడా మనకు మనమే టైమింగ్స్ సెట్ చేసుకోవాలి. అదే ఆఫీస్ వాళ్లకు మనం చెప్పాలి. ఈ సమయంలో నేను అందుబాటులో ఉంటాను. తర్వాత ఉండనని సంకేతాలు ఇవ్వాలి. లేదా వారితో ముందుగానే సూటిగా చెప్పాలి. అప్పుడే ఈ సమస్య నుంచి బయటపడగలరు. చదవండి: ఒక ఊరికథ..మంచిపని ఊరకే పోలేదు...ఎన్నో ఊళ్లకు స్ఫూర్తి ఇచ్చింది ఆఫీసు వాతావరణం ఎలా? ఇంటినుండి పనిచేసేటపుడు ఒక ప్రత్యేకమైన గదిలో ఆఫీసు లో కూర్చున్నట్లు కూర్చొని పని చేసుకోడం మంచిది. ఆ సమయంలో ఇంట్లో వారితో మాట్లాడటం లేదా కొన్ని ఇంటి పనులు చేయడం పెట్టుకోవద్దు. సాధారణంగా కొంత మంది ఇంటిపని ఆఫీసు పని కలిపి అక్కడో కాలు ఇక్కడో కాలు అన్నట్లుగా చేస్తూ ఉంటారు. అప్పుడు ఆందోళన ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా ఆడవాళ్లు వంటచేసుకోవడం, పిల్లలను చూసుకోవడం, ఆఫీసు పని చేసుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఈ ఆందోళన పెరుగుతుంది. అలాంటప్పుడు పిల్లలను చూసుకోవడానికి, వంట చేయడానికి వేరేవారి సహాయం తీసుకోవడం కొంత మెరుగు. ఇంటి నుంచి పని చేయడం వల్ల ఉబకాయమే కాకుండా ఇతర సమస్యలు వస్తున్నాయి. వాటితో పాటుగా నడుం నొప్పి , మెడనొప్పి వంటి సమస్యలు చాలా మందిలో సాధారణం. కొన్ని చిట్కాలు పాటించడం వల్ల ఈ నొప్పి తగ్గే అవకాశం ఉంది. నిద్ర పోయేటప్పుడు తల కింద ఎల్తైన దిండు పెట్టుకోకుండా మెత్తటి క్లాత్‌ను మడిచి దిండులా వాడటం వల్ల మెడ నొప్పి రాకుండా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు నడుము నొప్పి తగ్గాలంటే మకరాసనం, శలభాసనం, మర్కటాసనం, భుజంగాసనం వేస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు. చదవండి: Shanta Balu: పూనా పవార్.. వయసు 86.. అయినా తగ్గేదేలే.. ధైర్యంగా.. ఒత్తిడినుంచి ఇలా తప్పుకోవచ్చు ►అదేపనిగా పని చేస్తూ ఉండకుండా రోజూ సాయంత్రం కాసేపు నడవటం, ►పిల్లతో ఆడుకోవడం, పెద్దలతో మనసు విప్పి మాట్లాడటం, ►తల్లి/భార్యకు ఇంటి పనుల్లో సాయం చేయడం, ►కూరగాయలు/పండ్ల మార్కెట్‌కు వెళ్లడం ►కొత్త వంటలను వండేందుకు ప్రయత్నించడం ►టెర్రస్ గార్డెన్ లేదా బాల్కనీ గార్డెనింగ్ చేయడం, ►ఫ్రెండ్స్, బంధువులతో అప్పుడప్పుడు వీడియో కాల్స్ మాట్లాడుకోవడం ►క్యారమ్స్, షటిల్ వంటి ఆటలను ఆడటం వల్ల కాస్త రిలాక్సింగ్‌గా ఉంటుంది. ►స్క్రీన్ మీద పని చేసేటప్పుడు 20–20 20 చిట్కా పాటించడం మంచిది. -
పని ఒత్తిడితో చిర్రెత్తి ఉన్నారా!.....అయితే ఈ వీడియో చూడండి చాలు
న్యూఢిల్లీ: పని ఒత్తిడితో సతమవుతు ఉన్నారా.! పైగా అస్సలు సంతోషంగా ఉండే అవకాశం కూడా లేదని బాధపడిపోతూ కూర్చొకండి. ఇదే సరైన సమయం ఈ వీడియో చూడగానే మీ ఒత్తిడి దూరం అవుతుంది. ఒక్కసారి మీ ముఖంలో చిరునవ్వు తప్పక తొంగి చూస్తుంది. అసలు ఏం ఉందబ్బా ఈ వీడియోలో అని సందేహంతో ఉన్నారా!. (చదవండి: ఉబర్ డ్రైవర్ని వరించిన రూ. 75 లక్షల లాటరీ) అసలు విషయంలోకెళ్లితే...అందమైన పసుపు రంగు బాతులు ముద్దు ముద్దుగా ఎలా ఆడుకుంటున్నాయో చూడండి. ఎంతో అద్భుతంగా చూడ ముచ్చటగా ఉంది. అంతేకాదు ఒక్కసారిగా ఒత్తిడి మరిచిపోయి ఆనందంగా మైమరచి చూస్తాం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవ్వుతోంది. దీంతో నెటిజన్లు ఇది ప్రకృతి అందం కదా అంటూ రకరకాలుగా ట్వీట్‌చేశారు. అంతేకాదు ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: సంవత్సరాల తేడాతో ఒకే నెల ఒకే తేదిలో జన్మించినన ముగ్గురు అక్కాచెల్లెళ్లు) -
Health Tips: ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టడం లేదా? చెర్రీ, తేనె, అరటి, వేడిపాలు.. తింటే..
ప్రస్తుత జీవన శైలి వల్ల చివరికి నిద్ర కూడా కరువైపోతుంది. ఉరుకుల పరుగుల పనులు, ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ వినియోగం, మితిమీరిన ఒత్తిడి.. కారణమేదైనా ఎంతో మంది నిద్రలేమితో సతమతమౌతున్నారు. కేవలం శరీరానికి విశ్రాంతి ఇవ్వడానికి మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా తగినంత నిద్ర అవసరం అంటున్నారు నిపుణులు. చర్మం ముడతలు పడటం, జుట్టు రాలిపోవడం ఇవన్నీ నిద్రలేమితో సంభవించేవే. సరైన నిద్ర లేకపోతే ఆరోగ్యంపై కూడా అనేక దుష్ఫభావాలు పడే అవకాశం ఉంది. మరి ఎలా ? ఎంత ప్రయత్నించినా నిద్రపట్టట్లేదని వాపోతున్నారా? రాత్రి పడుకునే ముందు ఈ ఆహారాలు తీసుకుంటే వెంటనే నిద్రపోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.. వేడి పాలు మన పేరెంట్స్ నిద్రపోతే ముందు గ్లాస్ వేడిపాలు తాగడానికి ఇస్తారు. ఎందుకో తెలుసా? రోజు ముగింపు సమయంలో వేడిపాలు తాగితే వెంటనే నిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిలోని ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడులోని మెలటోనిన్, సెరటోనిన్ లను ప్రభావితం చేసి నిద్రవచ్చేలా ప్రేరేపిస్తుంది. సెరోటోనిన్ మానసిక స్థితిని స్థిరీకరించడానికి, క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుంది. చదవండి: డ్రీమ్ హౌస్ షిఫ్టింగ్.. సముద్రంపై పడవలతో గమ్యానికి చేర్చి..! సీమ చేమంతి టీ సీమ చేమంతి టీ నరాలపై ఎలా ఉపశమనం కలిగిస్తుంది, నిద్రను ప్రేరేపించడంలో ఎలా సహాయపడుతుందనే విషయాల గురించి కంప్లీట్ బుక్ ఆఫ్ ఆయుర్వేదిక్ హోమ్ రెమెడీస్ వివరంగా తెలుపుతుంది. దీనిలో యాంటీఆక్సిడెంట్ నిండుగా ఉంటాయి. ముఖ్యంగా సీమ చేమంతి టీ ఆందోళనను తగ్గించి, ప్రశాంతమైన నిద్రపట్టేలా చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. అరటి పండు అరటిపండ్లలో సహజంగానే కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉంటుంది. ఇది నిద్ర మత్తును కలిగించడానికి సహాయపడుతుంది. అరటిలోని ప్రీబయోటిక్స్ నిద్ర వచ్చేలా చేస్తుందని కొలొరడో బౌల్డర్ యూనివర్సిటీ తాజా అధ్యయనాలు వెల్లడించాయి. అంతేకాకుండా పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు తోడ్పడుంది. చెర్రీ పండ్లు పీనియల్ గ్రంథి మెలటోనిన్ అనే హార్మోన్‌ను విడుదల చేసేలా చెర్రీ పండ్లు ప్రేరేపిస్తాయి. ఈ హార్మోన్ మనసును ప్రశాతంగా ఉంచి నిద్ర వచ్చేలా చేస్తుంది. 'ది కంప్లీట్ బుక్ ఆఫ్ హోమ్ రెమెడీస్' పుస్తకం ప్రకారం.. రోజుకు 10-12 చెర్రీ పండ్లు తింటే మానసిక అలసట, ఒత్తిడి దూరం చేసి హాయిగా నిద్రవచ్చేలా చేస్తుంది. తేనె తేనెలోని సహజ చక్కెరలు శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచి, మెలటోనిన్, ట్రిప్టోఫాన్లు మెదడులో విడుదల్యేలా ప్రేరేపిస్తుంది. శరీరం విశ్రాంతి స్థితిలోకి వెళ్లడానికి సహాయపడుతుంది. తేనె సెరటోనిన్‌ను మెలటోనిన్‌గా మార్చి సుదీర్ఘ సమయం నిద్రపోయేలా చేస్తుందని శుఖ్థా హాస్పిటల్‌కు చెందిన డా. మనోజ్ కె అహుజ సూచించారు. చదవండి: ఢిల్లీలో హఠాత్తుగా పెరిగిన వాయుకాలుష్యం.. కారణం అదే! -
ప్రాణాలు పోతున్నా... ఏమీ చేయలేకపోతున్నాం
రేయింబవళ్లు నిద్రాహారాలు మానుకొని పని పని పని.. మండు వేసవిలో శరీరాన్ని పీపీఈ కిట్లతో బంధించి కోవిడ్ రోగులకు చికిత్స అందివ్వాలి. కళ్లముందే ప్రాణాలు పోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి. సెకండ్ వేవ్ వచ్చేసరికి భారత్‌లో వైద్యులు శారీరకంగా అలసిపోతున్నారు. మానసికంగా ఆందోళనకు లోనవుతున్నారు. కన్నీరు కారుస్తూ ప్రజలే జాగ్రత్తలు తీసుకోవాలంటూ వేడుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో వైద్యులు పెడుతున్న పోస్టులు, వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. అవేంటో చూద్దాం.. సూపర్ హీరోలం అనుకోవద్దు మేము ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాం. బాధతో హృదయం ముక్కలవుతోంది. 34 ఏళ్ల యువకుడు వెంటిలేటర్ మీద చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. పరిస్థితి మా చేతులు కూడా దాటేస్తోంది. అందుకే అందరూ మాస్కు తప్పనిసరిగా వేసుకోండి. ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోండి – డాక్టర్ తృప్తి గిలాడా, ముంబై నా ఫోన్ రింగ్ ఆగడం లేదు ప్రతీ అయిదు నిముషాలకు ఒకసారి నా ఫోన్ రింగ్ అవుతూనే ఉంటుంది. ఆసపత్రిలో బెడ్స్ కోసం పేషెంట్లు నిరంతరం కాంటాక్ట్ చేస్తూనే ఉంటారు. వారు దీనంగా బెడ్ కోసం అడుగుతూ ఉంటే ఏం చెయ్యాలో తెలీడం లేదు. ముంబైలో బెడ్స్ ఖాళీ లేవు. అందుకే ఆస్పత్రి అవసరం రాకుండా ప్రజలే జాగ్రత్తలు తీసుకోవాలి. – డాక్టర్ పింటో, ముంబై ముందు జాగ్రత్తలు లేవు కరోనా ఫస్ట్ వేవ్‌కి, సెకండ్‌వేవ్‌కి మధ్య కొంత సమయం దొరికింది. అయినా ప్రభుత్వాలు, ప్రజలు కూడా సన్నద్ధతపై దృష్టి పెట్టలేదు. ఢిల్లీ కూడా మరో మహారాష్ట్రలా మారడానికి ఎన్నో రోజులు పట్టదు. ప్రభుత్వాల అలసత్వం, ప్రజల నిర్లక్ష్యంతోనే ఈ పరిస్థితి వచ్చింది. కళ్ల ముందే కోవిడ్ రోగులు ఊపిరాడక మరణిస్తూ ఉంటే తట్టుకోవడం కష్టంగా ఉంది – డాక్టర్ రేష్మా తివారి బసు, గుర్గావ్ ప్రాణాలు పోతున్నా... ఏమీ చేయలేకపోతున్నాం నా కెరీర్ మొత్తంలో ఇలాంటి దుస్థితి చూడలేదు. కళ్ల ముందే ఆక్సిజన్ లేక రోగులు ప్రాణాలొదిలేస్తుంటే ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోతున్నాం. మేమూ మనుషులమే మాకూ భావోద్వేగాలుంటాయి. శారీరకంగా, మానసికంగా అలిసిపోతున్నాం. ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్.. అందరూ మాస్కులు వేసుకోండి. – డాక్టర్ దీప్శిఖ ఘోష్, ముంబై అందరం కలిసి నిరసనకు దిగుదాం దేశవ్యాప్తంగా భారీ జనసందోహం హాజరవుతున్న సమావేశాలకు వ్యతిరేకంగా మనందం నిరసనకు దిగుదాం. డాక్టర్లు, నర్సుల అసోసియన్లు అందరూ కలిసి రండి. మన దేశంలో ఆరోగ్య వ్యవస్థ కుప్ప కూలిపోతోంది. కేసులు సునామీలా ముంచేస్తున్నాయి. ప్రజలు జాగ్రత్తలు తీసుకోకపోతే ఎవరి చేతుల్లోనూ ఏమీ ఉండదు. – డాక్టర్ పారల్ ఎం శర్మ, ఢిల్లీ -
పిల్లల్లోనూ మానసిక ఒత్తిడి!
సాక్షి, హైదరాబాద్: పన్నెండేళ్ల శివాని గతంలో హోంవర్క్ అయ్యాక.. ఇంటి పనిలో సాయపడేది. లాక్డౌన్ తరువాత అస్సలు సాయం చేయడం లేదు. చిన్న పని చెప్పినా చికాకుపడుతోంది. పదహారేళ్ల శివ లాక్‌డౌన్‌కు ముందు చలాకీగా ఉండేవాడు. సాయంకాలం వారి హోటల్లో పనులు చక్కబెట్టేవాడు. లాక్డౌన్ కారణంగా బాగా బరువు పెరిగి లావయ్యాడు. చీటికీ మాటికీ చికాకుపడుతున్నాడు. ఇదీ..ప్రస్తుతం విద్యార్థుల మానసిక పరిస్థితి. లాక్డౌన్ సమస్త మానవాళి జీవన విధానాన్ని పూర్తిగా మార్చివేసింది. లాక్డౌన్ సమయంలో ఇంటి నుంచి కాలు బయట పెడితే.. కరోనా కాటు వేస్తుందన్న భయంతో అంతా ఇంటికే పరిమితమయ్యాం. లాక్డౌన్ ఆంక్షలు సడలించాక కేసులు రెట్టింపు సంఖ్యలో నమోదవుతుండటంతో ఇప్పుడు కూడా పిల్లల్ని బయటికి పంపే పరిస్థితి లేదు. దీంతో వారు ఆంక్షల మధ్య జీవిస్తూ ఒత్తిడికి గురవుతున్నారు. మునుపటిలా స్నేహితులను కలవలేకపోవడం, కలిసి ఆడుకోలేకపోవడం వల్ల చికాకుపడుతున్నారు. అందుకే, చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటున్నారు. పిల్లల్లో ఈ ఆకస్మిక ప్రవర్తన చూసి తల్లిదండ్రులు విస్మయపోతున్నా.. లాక్డౌన్ కావడంతో చేసేదిలేక సర్దుకుపోతున్నారు. వాస్తవానికి పిల్లల్లో కనిపిస్తోన్న ఈ విపరీత ధోరణికి కారణం వారికి తగినంత శారీరక శ్రమ లేకపోవడమే. వాస్తవానికి ప్రతిరోజూ పిల్లలు ఇంటి వద్ద లేదా బడిలో ఎంతోకొంత సమయం ఆడుకునేవారు. ఆటల వల్ల శరీరంలో ఒత్తిడిని తగ్గించే ఎండార్ఫిన్ లాంటి పలు హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి శరీరాన్ని ఒత్తిడి నుంచి దూరంగా ఉంచి, మానసిక ప్రశాంతత చేకూరుస్తాయి. అంతేకాదు, ఆటల వల్ల శరీరం అలసి మంచి నిద్ర కూడా వస్తుంది. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేకపోవడంతో విద్యార్థుల లైఫ్‌స్టైల్ పూర్తిగా మారిపోయింది. శారీరక శ్రమ అస్సల్లేదు. ఎప్పుడు పడుకుంటున్నారో.. ఎప్పుడు లేస్తున్నారో.. ఎప్పుడు తింటున్నారో.. వారికే తెలియడం లేదు. వేళాపాళా లేని జీవనశైలి వల్ల చిన్న విషయాలకే ఒత్తిడికి గురవుతున్నారు. 24 గంటలు ఇంటికే పరిమితమవడంతో బరువు కూడా పెరిగి లావవుతున్నారు. చికాకు పెరిగితే చిక్కులే లాక్డౌన్ పరిస్థితులను పిల్లలు అర్థం చేసుకుం టున్నారు కాబట్టి. పిల్లల్లో ఈ చికాకు అప్పుడప్పుడు మాత్రమే బయటపడుతోందని ప్రముఖ సైకాలజిస్టు వీరేందర్ అంటున్నారు. దేశంలో అధిక శాతం పేద, దిగువ, మధ్యతరగతి కుటుంబాలే. వీరిలో చాలామందివి సింగిల్ బెడ్రూమ్ ఇళ్లే. లాక్డౌన్లో బయటికి వెళితే.. ప్రాణాల మీదకు వస్తుందన్న భయంతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని బయటికి అనుమతించడం లేదు. పిల్లలు కూడా అర్థం చేసుకుంటున్నారు. కానీ, అప్పుడప్పుడు వచ్చే కోపాన్ని, చికాకును నియంత్రించుకోలేక ఇలా బయట పడుతున్నారని వివరిస్తున్నారు. తల్లిదండ్రులు ఇలాంటి ఘటనలను పెద్దగా పట్టించుకోకుండా.. వారి పరిస్థితిని అర్థం చేసుకుని, అనునయించే యత్నం చేయాలని హితవు పలుకుతున్నారు. లేకపోతే ఇవే పెద్ద గొడవలుగా మారి, బంధాలు దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నారు. –వీరేందర్, సైకాలజిస్టు ఏం జరుగుతోంది..? ► మార్చి 22 నుంచి అంటే దాదాపుగా 105 రోజులుగా విద్యార్థులంతా ఇంట్లోనే ఉంటున్నారు. ► టీవీలు, ఇంటర్నెట్, సెల్‌ఫోన్‌తో కాలక్షేపం చేస్తున్నారు. ► ఆటపాటలు లేకపోవడంతో శరీరానికి వ్యాయామం దూరమైంది. పలువురు పిల్లలు తమ శరీర బరువులో మార్పు రావడాన్ని స్వయంగా గ్రహిస్తున్నారు. ► ఒత్తిడిని అధిగమించే హార్మోన్లు సరిగా విడుదల కాకపోవడంతో కోపం, చికాకు తెచ్చుకుంటున్నారు. ► ఇంకొందరు తల్లిదండ్రులతో వాదనలకు దిగుతూ నానా హంగామా చేస్తున్నారు. ఏం చేయాలి? ► ఇంట్లో పిల్లలకు యోగాసనాలు, ప్రాణాయామం నేర్పించాలి. ► ప్రతిరోజూ పిల్లలతో కనీసం 45 నిమిషాలపాటు చిన్న చిన్న వర్కవుట్లు చేయించాలి. ► రోజూ తింటున్న కేలరీలకు, ఖర్చు చేస్తున్న కేలరీల మధ్య వ్యత్యాసం ఎక్కువైతే శరీర బరువు పెరిగిపోతుందన్న విషయం వివరించాలి. ► వర్క్ ఫ్రం హోం చేసే తల్లిదండ్రులు తమ పిల్లలకు కథలు వినిపించడం, రాయమని ప్రోత్సహించడం చేయాలి. ► లాక్డౌన్, కరోనా వైరస్ తదనంతర పరిస్థితులపై వారి భయాల్ని పోగొట్టాలి. ► ఆన్లైన్ క్లాసులు ముగిసిన వెంటనే చదువు అంటూ పదేపదే పోరుపెట్టకూడదు. ► ఒకవేళ పిల్లలు సబ్జెక్టు అర్థం కాలేదని చికాకు పడుతుంటే.. ఆ విషయాలను వారితో చర్చించి స్కూలు ఉపాధ్యాయులతో మాట్లాడించండి. -
ఒత్తిడిని తగ్గించుకోవడానికి అద్భుత చిట్కా!
పెద్దింటివాడికైనా, పేదింటివాడికైనా మానసిక ఒత్తిడి ప్రశాంతత లేకుండా చేస్తుంది. దీన్ని ప్రారంభంలోనే గుర్తించి చికిత్స తీసుకోవడమో, నివారించడమో చేయకపోతే ఘోరమైన దుష్ప్రభావాలు చవిచూడక మానదు. అందుకు నిలువెత్తు ఉదాహరణ బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య. అతని చిరునవ్వు కోట్లాదిమంది మనసుల్లో అలజడి రేపే ఆయుధం. అతనికి ఎన్ని కష్టాలున్నాయో, ఎన్ని బాధల సుడిగుండాల్లో చిక్కుకున్నాడో.. కానీ వాటన్నంటినీ గుండెల్లోనే దాస్తూ చిరునవ్వు చెరగనిచ్చేవాడు కాదు. కానీ కాలం కరుగుతున్న కొద్దీ అతనిపై మానసిక ఒత్తిడి పై చేయి అవుతూ వచ్చింది. అంతిమంగా అతను చావుకు తలొంచుతూ అందరికీ శాశ్వత వీడ్కోలు పలికాడు. (అవును... త్వరగా వెళ్లిపోయావ్ సుశాంత్..) నిజంగానే మానసిక ఒత్తిడిని మనం జయించలేమా? అది మనల్ని పొట్టన పెట్టుకునే వరకూ చూస్తూ ఉండాలా? దీనికి ఓ ప్రొఫెసర్ వీడియోతో సమాధానం చెప్పారు. ఆయన ఓ గాజు గ్లాసులో నీళ్లు తీసుకుని విద్యార్థుల ఎదుట నిలబడ్డారు. ఇప్పుడు అది ఎంత బరువుందని అడగ్గా... విద్యార్థులు రకరకాల సమాధానాలిచ్చారు. దీనికి ఆ ప్రొఫెసర్ బదులిస్తూ.. ‘ఇక్కడ గ్లాసు బరువు అనేది ప్రామాణికం కాదు. దాన్ని ఎంతసేపు పట్టుకుంటున్నామనేది ముఖ్యం. ఓ నిమిషం దాన్ని అలాగే చేతులతో పట్టుకుని ఉంటే ఏమీ అవదు. గంటసేపు పట్టుకుంటే నా చేయి నొప్పి పెడుతుంది. ఇక రోజంతా పట్టుకునే ఉంటే నా చేయి మొద్దుబారిపోయి చచ్చుబడిపోతుంది. (‘ఆత్మహత్య చేసుకోవాలనిపించేది’ ) కానీ వీటన్నింటికి గ్లాసు బరువు కారణం కాదు. దాన్ని ఎంతసేపు పట్టుకున్నామనేదే ముఖ్యం. అలాగే జీవితంలోని ఒత్తిడి కూడా అంతే. అది కూడా నీళ్ల గ్లాసు వంటిదే. కాసేపు వాటి కోసం ఆలోచిస్తే ఏమీ కాదు. కానీ కొంచెం ఎక్కువసేపు ఆలోచించారనుకో అది మిమ్మల్ని బాధిస్తుంది. అదే రోజంతా ఆలోచిస్తూనే ఉన్నారనుకో.. మీరు మొద్దుబారిపోతారు. ఏ పనీ సరిగా చేయలేరు. కాబట్టి చేయాల్సిందొక్కటే గ్లాసు పక్కన పెట్టేసినట్లు వాటి కోసం ఆలోచించడం వదిలేయండి’ అని సెలవిచ్చారు. ఈ వీడియోను టాలీవుడ్ దర్శకుడు దేవా కట్ట ట్విటర్లో షేర్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతోమంది తప్పకుండా అనుసరించాల్సిన మార్గమిది. -
ఈ రోజు నా గడువు తీరిందని లేఖలో ..
భద్రాద్రి కొత్తగూడెం,కూసుమంచి: కుటుంబసభ్యులు సుమారు మూడేళ్ల క్రితం కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో ఒంటరిగా మిగిలిన యువకుడు వారులేని లోటును భరించలేక బతుకు సాగించలేక తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండల పరిధిలోని జీళ్లచెరువు గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. జీళ్లచెరువు గ్రామానికి చెందిన షేక్ లాల్‌సాహెబ్ (29) తల్లిదండ్రులతో పాటు అతని అన్న, వదిన, పిల్లలు 2017లో పాలేరులోని మినీ హైడల్ ప్రాజెక్టు కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పటి నుంచి లాల్‌సాహెబ్ ఒంటరిగా ఉంటున్నాడు. స్నేహితులతో గడుపుతూ కాలం వెళ్లదీస్తున్నాడు కన్నవారు, తోడబుట్టిన వారు దూరం కావటాన్ని జీర్ణించుకోలేక పలు మార్లు ఆత్మహత్యకు యత్నించాడు. చివరకు గ్రామ శివారులోని ఓ వెంచర్లో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు లాల్‌సాహెబ్ మృతదేహాన్ని గుర్తించి గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందించారు. బుధవా రం రాత్రే ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. నా టైమ్ తీరింది.. ఆత్మహత్యకు పాల్పడ్డ లాల్‌సాహెబ్ జేబులో ఒక లేఖను పోలీసులు గుర్తించారు. ఆ లేఖలో తాను ఎందుకు చనిపోవాల్సి వచ్చిందో తన డ్రస్సింగ్ టేబుల్ వద్ద మరో లేఖ ఉందని, దాన్ని చదవాలని రాసిఉంది. డ్రస్సింగ్ టేబుల్ వద్ద మరో లేఖ లభ్యంకాగా అందులో తనవారందరూ తనకు దూరమయ్యారని, అప్పటి నుంచి సంతోషంగా బతకలేకపోతున్నాని, తాను ఎప్పటి నుంచో చనిపోవాలని అనుకుంటున్నానని పేర్కొన్నాడు. ప్రతి వస్తువుకు గడువుతేదీ ఉన్నట్లు తనకు ఈ రోజు గడువు తీరిందని, తన స్నేహితులు తనను నమ్మి అప్పులు ఇచ్చారని, తన ఇల్లు, మిగిలిఉన్న కొంత భూమి అప్పులు అమ్మి తీర్చాలని అధికారులను, గ్రామపెద్దలను కోరాడు. లేఖలో రూ.14 లక్షల 80వేల అప్పులు ఉన్నట్లు, ఎవరికి ఎంత ఇవ్వాలో పేర్లతో రాసి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు అంత్యక్రియలు పూర్తిచేశారు. కాగా మృతుడు అవివాహితుడు. -
తెల్ల జుట్టుకు బై చెప్పచ్చు
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం మనం తరచూ చూస్తూంటాం. విపరీతమైన ఒత్తిడి దీనికి కారణమన్న విషయమూ మనకు తెలుసు. అయితే కారణమేమిటన్నది మాత్రం నిన్న మొన్నటివరకూ ఎవరికీ తెలియదు. ఈ లోటును పూరించారు హార్వర్డ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. ఒత్తిడికి, జుట్టు నెరుపుకూ మధ్య ఉన్న సంబంధం ఏమిటన్నది తెలుసుకునేందుకు తాము విస్తృత స్థాయిలో పరిశోధనలు చేపట్టామని హార్వర్డ్ శాస్త్రవేత్త యా ఛీ హూ తెలిపారు. వృద్ధాప్య లక్షణాలు వేగంగా చోటు చేసుకునేందుకు ఒత్తిడి కారణమవుతుందని, అందువల్లనే జుట్టు తెల్లబడుతోందని ఇప్పటివరకూ అనుకునేవారు. కానీ పరిశోధనల్లో మాత్రం భిన్నమైన ఫలితాలు కనిపించాయి. ఒత్తిడి ఎక్కువైనా వెంట్రుకల కుదుళ్లలో నల్లటి రంగును ఉత్పత్తి చేసే కణాలు తక్కువేమీ కాలేదు. అలాగే.. కార్టిసాల్ అనే హార్మోన్‌కూ వెంట్రుకల నెరుపుకూ సంబంధం లేదని స్పష్టమైంది. వెంట్రుకల కుదుళ్లలో ఉండే కొన్ని రకాల మూలకణాలు ఒత్తిడి ఎక్కువయినప్పుడు అతిగా స్పందిస్తున్నట్లు ఎలుకలపై జరిగిన పరిశోధనల ద్వారా తెలిసిందని, ఈ క్రమంలో ఆ మూలకణాల సంఖ్య తగ్గిపోవడం వల్ల నల్లటి రంగును ఉత్పత్తి చేసే కణాలూ తగ్గిపోతున్నట్లు తెలిసిందని హూ తెలిపారు. ఇంకోలా చెప్పాలంటే సాధారణ స్థితిలో నల్లటి రంగును ఉత్పత్తి చేసే కణాలుగా మారే మూలకణాలు ఒత్తిడి సమయంలో అతిగా స్పందించడం వల్ల జుట్టు నెరుస్తోందన్నమాట! అంతా బాగుందికానీ.. ఒత్తిడి సమయాల్లో మన శారీరక వ్యవస్థలోని సింపథెటిక్ నెర్వస్ సిస్టమ్ విడుదల చేసే నోరీపైనిఫ్రైన్ అనే రసాయనం మూలకణాలను చైతన్యవంతం చేస్తోందని కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. వెంట్రుకలు తెల్లబడకుండా కొత్త మందులు కనుక్కునేందుకు ఈ పరిశోధన ఉపకరిస్తుందని అంచనా. -
వేర్వేరు అవయవాలపై ఒత్తిడి ప్రభావం అధిమించండి
మీరు బాగా ఒత్తిడిలో ఉన్నారా? ఆ విషయం మీ శరీరం ద్వారానూ మీకు స్పష్టంగా తెలుస్తోందా? ఎందుకంటే దాని ప్రభావం ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. మానసిక ఒత్తిడి తీవ్రమైనప్పుడు కొందరిలో తలనొప్పి రావచ్చు. మరికొందరిలో ఛాతీ బరువుగా ఉన్నట్లు అనిపించవచ్చు. ఇలా తల మొదలుకొని, పాదాల వరకు రకరకాల అవయవాల్లోని ఇబ్బందులు రకరకాల రూపాల్లో వ్యక్తమవుతాయి. మానసిక ఒత్తిడి మీలోని ఏ అవయవాన్ని ఎలా ప్రభావితం చేసి, ఏయే లక్షణాలను కనబరుస్తోందో... దాన్ని బట్టి ఒత్తిడిని ఎదుర్కొనేందుకు ఏం చేయాలో తెలుసుకోండి. ఇవి చాలా తేలికైనవి. అనుసరించి చూడండి. రిలాక్స్ అవ్వండి. తల, మెడ భాగాల్లో కొందరిలో ఒత్తిడి వల్ల తల గట్టిగా పట్టేసినట్లుగా అనిపిస్తుంది. నుదురు ముడుచుకుపోతుంది. ఆ తర్వాత సన్నగా తలనొప్పి మొదలై తీవ్రం కావచ్చు. మరికొందరిలో తెలియని భారమంతా తమ భుజాలపైన ఉన్నట్లుగానూ, ఆ బరువు తమను కుంగదీస్తున్నట్లుగానూ ఉండవచ్చు. మెడ, భుజాల కండరాలు గట్టిగా పట్టేసినట్టు అనిపించవచ్చు. ఇది తగ్గాలంటే కొన్ని చిట్కాలివి... ►మొదట కుర్చీలో హాయిగా, సౌకర్యంగా కూర్చుని రిలాక్స్ అవ్వండి. చేతులు, కాళ్లు రిలాక్స్డ్గా ఉంచాలి. ►మీ ముఖాన్ని కుడి భుజం వైపుకు, మళ్ళీ ఎడమ భుజం వైపు తిప్పాలి. ఆ తర్వాత పైకీ, ఆ వెంటనే కిందకు వంచాలి. ఇలా ఐదు సార్లు చేయాలి. ►మీ తలను మొదట ఎడమ భుజం వైపు తర్వాత ఛాతీ వైపుకు, అక్కడి నుంచి కుడి భుజం వైపుకు ఇలా గుండ్రంగా తిప్పాలి. ఆ తర్వాత మళ్లీ నెమ్మదిగా వ్యతిరేక దిశలో తిప్పాలి. ఇలా ఐదు సార్లు చేయాలి. ►నోటిని పెద్దగా తెరవాలి, కళ్ళను రెప్పలతో గట్టిగా నొక్కిపెట్టాలి. నోటితో గట్టిగా అరుస్తున్నట్టుగా నోరు తెరవాలి. కానీ ఎలాంటి శబ్దం చేయకూడదు. అలా విశాలంగా నోరు తెరచి గాలిని బాగా పీల్చాలి. మీకు బాగా తలనొప్పిగా ఉన్నప్పుడు ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. ఛాతి: ఒత్తిడి కారణంగా ఛాతీ చాలా బరువుగా ఉన్నట్లు అనిపించడం, శ్వాస గుండెల నిండా పూర్తిగా తీసుకోలేకపోవడం, ఏదో ఇబ్బందిగా ఉన్నట్టు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే ఈ కింది విధంగా చేయండి. ►రిలాక్స్డ్గా కూర్చోవాలి. ఆ సమయంలో నడుమును నిటారుగా ఉంచాలి. ►కళ్ళు మూసుకుని మీ శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ►ఐదు వరకు అంకెలు లెక్కపెడుతూ నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. అలాగే మళ్లీ ఐదు అంకెలు లెక్కపెడుతూ శ్వాసను నెమ్మదిగా బయటకు వదిలేయాలి. ►వీలైతే శ్వాస లోపలికి తీసుకుంటున్నప్పుడు ఉదరాన్ని బయటకు పెట్టాలి. అలాగే శ్వాసను వదలుతున్నప్పడు ఉదరాన్ని లాగినట్టుగా లోపలికి తీసుకోవాలి. ►ఇప్పుడు మీ ఉచ్ఛాస్వ–నిశ్శాస్వలను లెక్కించండి. ఈ లెక్కపెట్టడం రివర్స్‌లో జరగాలి. మీకు సమయం ఉంటే 60 నుంచి వెనక్కి సున్న వచ్చేంత వరకూ, సమయం లేకపోతే కనీసం 20 సంఖ్య నుంచి వెనక్కి సున్న వచ్చేంత వరకూ లెక్కించాలి. శ్వాస లోపలికి తీసుకున్నప్పుడు ఒక అంకె, శ్వాస వదిలినప్పుడు తర్వాత అంకె... ఇలా సున్న వరకు లెక్కించి, సున్న తర్వాత కళ్ళు తెరవాలి. ఛాతీ, మొండెం భాగాల్లో మీరు ఒత్తిడికి గురయ్యినప్పుడల్లా మీరు ఎలా నుంచున్నారో లేదా కూర్చొని ఉన్నారో మీ పోశ్చర్‌ను ఒకసారి గమనించుకోండి. సాధారణంగా ఒత్తిడి తీవ్రమైనప్పుడు చాలామంది ఒంగిపోయి, తల ఒంచుకుని ఉంటారు. ఇది మీ వెన్ను మీద ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఈ కింది చిట్కాలు పాటించి ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. ►మొదటగా మీకు తెలిసిందే... తలవంచుకుని లేదా తలవాల్చి ఉండవద్దు. నిటారుగా కూర్చోండి. ►ఎక్కువ సేపు కూర్చుని చేసే ఉద్యోగాల్లో ఉండేవారు ప్రతి అరగంటకి ఒకసారి లేచి నిలబడి అక్కడికక్కడే ఒకటిరెండు నిమిషాలు నడవండి. ►నడుం నొప్పి వచ్చేవారికి భుజంగానసం చాలా బాగా పనిచేస్తుంది. కాళ్లు... పాదాలపై చాలామందిలో ఒత్తిడి తమ పాదాలపై ప్రభావం చూపుతుంది. మరీ ఒత్తిడికి గురైన చాలామందిలో పిక్కలు పట్టేయడం, కాళ్ల కండరాలు పట్టేయడం (మజిల్ క్రాంప్స్) కనిపిస్తాయి. ఒత్తిడి వల్ల కాళ్లు, పాదాలు ప్రభావితమయ్యేవారు ఈ కింది టిప్స్ పాటించాలి... ►కాళ్ళను కాస్తంత ఎత్తు మీద పీటలాంటిదానిపై పెట్టి ఉంచండి. ►మీ కాళ్ళను స్ట్రెచ్ చేసి మీ పాదాలను మీ వైపు తీసుకురావడానికి ప్రయత్నించండి, అలాగే దానికి వ్యతిరేక దిశలో మళ్లీ స్ట్రెచ్ చేయండి. ►నిలబడి గాని, కూర్చునిగాని ఒక కాలిని పైకి లేపి మడమను గుడ్రంగా రొటేట్ చేస్తున్నట్లుగా తిప్పాలి. మొదట కుడివైపుకు, తర్వాత ఎడమవైపుకు తిప్పాలి. రెండుకాళ్లతో ఇలా ఐదుసార్లు చేయాలి. ►పెడిక్యూర్ చేయడం /పాదాల మసాజ్ వల్ల కూడా పాదాలపై ఒత్తిడి తగ్గుతుంది. అదనంగా... ►పైన పేర్కొన్న వాటన్నింటితో పాటు టెన్నిస్, ఫుట్‌బాల్, బాస్కెట్ బాల్, హాకీ లేదా క్రికెట్ వంటి ఆటలు కూడా ఆడుతుండటం మంచిది. ►ప్రతి రోజు ఒక గంట ఎరోబిక్స్ చేయడం మంచిది. టీవీ చూస్తూ డ్యాన్స్ కూడా చేయవచ్చు. ►వాకింగ్, జాగింగ్, స్విమింగ్ వీటిలో ఏదో ఒకటి రోజుకు గంట పాటు చేయాలి. వీటన్నింటి వల్ల మన గుండె , ఊపిరితిత్తులు, రక్తకణాలు చాలా ఆరోగ్యంగా ఉంటాయి. కండరాలు, కీళ్ళు గట్టిపడతాయి. దేహమంతా ఆరోగ్యంగా ఉంటుంది. ఎండార్ఫిన్స్ వంటి మంచి హార్మోన్లు విడుదలయ్యి అవి ఒత్తిడిని కలిగించే రసాయనాలకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. కళ్లు ఒత్తిడి బాగా ఉన్నప్పుడు కొందరిలో కళ్లు నొప్పిగా ఉండటం, కళ్లు లాగినట్లు అనిపించడం, కళ్ల వెంట నీరుకారడం జరుగుతుంది. టీవీ, మొబైల్స్ ఎక్కువగా వాడటం, కంప్యూటర్‌పై ఎక్కువగా పనిచేయడం వల్ల కూడా కళ్లపై ఒత్తిడి పడి ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఈ కింది సూచనలు పాటించండి. ►ప్రతి గంటకోసారి కళ్లను గట్టిగా కాకుండా, మృదువుగా మూసుకొని... కళ్లపై మునివేళ్లతో నెమ్మదిగా మర్దన చేసుకోవాలి. ఇది గుండ్రంగా చేయాలి. తొలుత క్లాక్‌వైజ్‌గా ఐదుసార్లు, ఆ తర్వాత యాంటీక్లాక్‌వైజ్‌గా మరో ఐదుసార్లు చేయాలి. ►కళ్లకు ఆహ్లాదంగా ఉండే రంగు (సూదింగ్ కలర్) లైట్ గ్రీన్. కాబట్టి కిటికీలోంచి పచ్చటి చెట్లను చూడవచ్చు. లేదా కంప్యూటర్ మానిటర్ పక్కన ఇన్డోర్ ప్లాంట్స్ పెట్టుకొని చూస్తుండటం కూడా మంచి పద్ధతి. ►కంప్యూటర్ / మొబైల్ ఫోన్స్‌లో రీడింగ్ మోడ్‌లో ఉంచి చదవడం మంచిది. ►రోజూ రాత్రి పడుకునే ముందు కళ్లమీద తాజానీటిలో ముంచిన తడిగుడ్డ కాసేపు ఉంచుకోవడంమంచిది. వీటన్నింటివల్ల ప్రయోజనం కనిపించినప్పుడు ఒకసారి కంటి డాక్టర్‌ను సంప్రదించి తమ ఐ–సైట్ చెక్ చేయించుకోవాలి. డా. సుధీంద్ర ఊటూరి లైఫ్‌స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
ఈ వెండి సంతోషానివ్వదు...
సాధారణంగా వెండి రంగు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అందరికీ కనువిందు చేస్తుంది. కానీ ఈ వెండి రంగు మాత్రం సంతోషాన్నివ్వదు. పైగా బాధను నింపుతుంది. మరికొందరిలోనైతే... ‘‘అప్పుడేనా?... ఈ వయసులోనేనా...?’’ అనే ఫీలింగ్ ఇస్తుంది. అవే వెంట్రుకలు తెల్లబడటం. సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ వెంట్రుకలు తెల్లబడటం అనేది చాలా సహజమైన ప్రక్రియ. ఏజింగ్‌లో భాగంగా అందరిలోనూ జరిగే ప్రక్రియే. అయితే కొందరిలో అది చాలా చిన్న వయసులోనే జరుగుతుంది. అలా నెరవడాన్ని ‘బాలనెరుపు’ అంటారు. ఇలా బాలనెరుపు వచ్చేందుకు కారణాలేమిటో, వాటి నివారణ ఎలాగో తెలుసుకుందాం. వెంట్రుకలు తెల్లబడటానికి కారణమిదే... మన వెంట్రుకల మూలాన్ని మనం హెయిర్ ఫాలికిల్ అని పిలుస్తాం. ఈ మూలంలో మెలనోసైట్స్ అనే కణాలు ఉంటాయి. ఈ మెలనోసైట్స్ అనే కణాలు మెలనిన్ అనే రంగునిచ్చే పిగ్మెంట్ను ఉత్పత్తి చేస్తాయి. అప్పుడప్పుడే తెల్లబడుతున్న వెంట్రుకలను ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ కింద పరిశీలించినప్పుడు అక్కడి మెలనోసోమ్స్ అనే చోట్ల తగినంత మెలనిన్ ఉండకపోవడాన్ని డాక్టర్లు గమనిస్తారు. అదే తెల్లవెంట్రుకల విషయానికి వస్తే అక్కడ మెలనోసైట్స్ అనే కణాలు ఉండవు. ఈ పిగ్మెంట్ వల్లనే వెంట్రుకకు నల్లటి రంగు వస్తుంది. కొన్ని వెంట్రుకల్లో ఈ మెలనిన్ ఉత్పత్తి ఆగిపోవడం ఫలితంగా ఆ వెంట్రుక నల్లరంగును కోల్పోయి తెల్లగా మారుతుందన్నమాట. వాస్తవానికి మనకు 50 ఏళ్ల వయసు వచ్చేనాటికి మన జుట్టుకు రంగునిచ్చే 50 శాతం పిగ్మెంట్ను కోల్పోతాం. కానీ కొందరిలో ఆ వయసుకు ముందే జుట్టు తెల్లబడుతుంది.నిజానికి వెంట్రుక తెల్లగా మారదు. మెలనిన్ ఇచ్చే నలుపు రంగును కోల్పోవడం వల్ల అది పూర్తిగా కాకుండా, ఒక మేరకు పారదర్శకం (ట్రాన్స్లుసెంట్)గా మారుతుంది. అదే నల్లటి వెంట్రుకల నేపథ్యంలో తెల్లగా అనిపిస్తుంటుంది. వెంట్రుకలు తెల్లబడటానికి కారణాలు వెంట్రుకలు తెల్లబడటానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో అన్నింటికంటే ప్రధానమైన కారణాలు జన్యుపరమైనవి. తల్లిదండ్రుల్లో ఎవరికైనా వెంట్రుకలు త్వరగా నెరిస్తే పిల్లల్లోనూ అవి త్వరగా తెల్లబడటానికి ఆస్కారం ఉంది. ఇలా కొందరిలో చాలా త్వరగా వెంట్రుకలు తెల్లబడటానికి మరికొన్ని కారణాలు ఇవే... స్వాభావికంగా వెంట్రుకలు నల్లబడాలంటే... ►ఐరన్, జింక్ సమృద్ధిగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. ►విటమిన్ బి–12 పుష్కలంగా అందేలా తగిన ఆహారం తీసుకోవడం వల్ల వెంట్రుకల నెరుపు తగ్గుతుంది. మాంసాహారులైతే మాంసం, శాకాహారులైతే రోజూ గ్లాసెడు పాలు తాగడంతో పాటు, పొట్టుతీయని తృణధాన్యాలు తినాలి. ఇవి తీసుకున్న తర్వాత కూడా మీ ఒంటికి సరైన మోతాదులో విటమిన్ బి12 అందకపోతే డాక్టర్ సలహా మేరకు వైటమిన్ బి12 అందేలా టాబ్లెట్లు వాడటం అవసరం. ∙ క్యాల్షియం పాంటోథనేట్, పాబా అమైన్ సప్లిమెంట్లు తీసుకుంటే తెల్లవెంట్రుకలు తగ్గే అవకాశం ఉంది. ►కరివేపాకు వేసిన మజ్జిగ వల్ల కూడా వెంట్రుకలు తెల్లబడే ప్రక్రియ మందగిస్తుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. ►ఇక వాతావరణ కాలుష్యాలకు సైతం వీలైనంత దూరంగా ఉంటూ మంచి స్వాభావికమైన వాతావరణంలో ఉండాలి. ►వ్యాయామం కూడా వెంట్రుకలు నెరిసే ప్రక్రియను మందగించేలా చేస్తుంది. అందుకే ప్రతిరోజూ కనీసం 45 నిమిషాలకు తగ్గకుండా వ్యాయామం చేయడం మంచిది. ఇది వెంట్రుకలు తెల్లబడకుండా నివారించడంతో పాటు ఓవరాల్ హెల్త్కూ మంచిది. చికిత్స: హెయిర్ పెప్టైడ్ సీరమ్ వంటి కొన్ని మందులను వాడితే ప్రయోజనం ఉంటుంది. అయితే ఇలాంటి వాటిని తప్పనిసరిగా డాక్టర్ సలహా మేరకే వాడాలని గుర్తుంచుకోవాలి. మానసిక ఒత్తిడి కారణంగా... ►మనలో పెరిగే మానసిక ఒత్తిడి వల్ల మన జీవకణాల్లోని కొన్ని పొరలు (సెల్యులార్ స్ట్రక్చరల్ మెంబ్రేన్స్), కొవ్వుపదార్థాలు (లైపిడ్స్), ప్రోటీన్లు, డీఎన్ఏ దెబ్బతిని వెంట్రుక తెల్లబడుతుంది. ►తీవ్రమైన మానసిక ఉద్వేగాలకు లోనుకావడం (ఎమోషనల్, ఇన్ఫ్లమేటరీ స్ట్రెస్) ►కణంలోని రోగనిరోధక శక్తి తగ్గడం ►థైరాయిడ్ లోపం ►రక్తహీనత (అనీమియా) ►పొగతాగే అలవాటు ►హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉత్పత్తి (మన రోమమూలాల్లో హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా ఉత్పత్తి అవుతుంటుంది. ఇది చాలా ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నప్పుడు కూడా వెంట్రుక తెల్లబడుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది). ►వీటికి తోడు కాలుష్యం, పోషకాహార లోపం కూడా కొంతమేరకు తెల్లవెంట్రుకలకు కారణమవుతాయి. కొన్ని మూలకాల/పోషకాల లోపాలు ►ఐరన్ లోపించడం ►కాపర్ లోపించడం ►జింక్ లోపించడం ►విటమిన్ బి–12, విటమిన్–ఈ, విటమిన్–సి లోపించడం డాక్టర్ స్వప్నప్రియ, డర్మటాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
గజరాజులకు మానసిక ఒత్తిడి!
సాక్షి, హైదరాబాద్: ఆలయాల్లో ఊరేగింపులకు, పర్యాటకుల విహారానికి, అటవీ ఉత్పత్తుల తరలింపునకు ఏనుగులను ఎక్కువగా వాడటం, వాటిని తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నట్లు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) అనుబంధ సంస్థ లాకోన్స్ శాస్త్రవేత్తలు గుర్తించారు. తగిన శిక్షణ లేని మావటీల కారణంగా అవి హింసకు గురవుతున్నట్లు వారు వెల్లడించారు. తద్వారా ఒత్తిడి పెరిగి వాటి ప్రవర్తనపై ప్రభావం పడుతోందని, సంతానోత్పత్తి సామర్థ్యం కూడా తగ్గిపోతోందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఏనుగుల జాతి దీర్ఘకాలం మనుగడ సాగించాలంటే ఈ ఒత్తిడిని తగ్గించాలని లాకోన్స్ శాస్త్రవేత్త డాక్టర్ జి.ఉమాపతి నేతృత్వంలో జరిగిన పరిశోధన స్పష్టం చేస్తోంది. ఆసియా ప్రాంతంలో 20 శాతం ఏనుగులు నిర్బంధంలో ఉన్నాయని, ఒత్తిడి కారణంగా 1993 – 2003 మధ్యకాలంలో దాదాపు 274 మందిపై ఏనుగులు దాడులు చేశాయని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో లాకోన్స్ శాస్త్రవేత్తలు వేర్వేరు పరిస్థితుల్లో గజరాజుల ఆరోగ్యం, ఒత్తిళ్లపై పరిశోధనలు చేపట్టారు. మైసూరు జంతు సంరక్షణాలయంతోపాటు మధుమలై, బాంధవ్‌గఢ్ ఎలిఫెంట్ క్యాంపుల్లోని 870 ఏనుగుల వ్యర్థ నమూనాలను పరిశీలించారు. దసరా ఉత్సవాల్లో పాల్గొనే ఏనుగుల్లో ఒత్తిడికి సంబంధించిన హార్మోన్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. మతపరమైన కార్యక్రమాల్లో ఏనుగులను వీలైనంత తక్కువగా వాడాలని, పునరుత్పత్తి చేయగల వయసులో ఉన్న ఆడ ఏనుగులను అసలు వాడరాదని శాస్త్రవేత్తలు సూచించారు. గజరాజులతో పనులు చేయించేందుకు మరింత సులువైన, హింసకు తావివ్వని పద్ధతులు పాటించేందుకు తమ పరిశోధన ఉపయోగపడుతుందని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా ఒక ప్రకటనలో తెలిపారు. -
టెండనైటిస్ తగ్గుతుందా?
నా వయసు 35 ఏళ్లు. నేను క్రీడాకారుణ్ణి కావడంతో అన్ని రకాల ఆటలు బాగా ఆడుతుంటాను. నాకు కొంతకాలంగా చేయి కదిలించినప్పుడు భుజంలో విపరీతమైన నొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే టెండన్స్‌కి సంబంధించిన వ్యాధి అని చెప్పారు. మందులు వాడుతున్నా సమస్య నుంచి ఉపశమనం లభించడం లేదు. అసలు ఈ సమస్య ఎందుకు కలుగుతుంది? హోమియో చికిత్స ద్వారా దీన్ని పూర్తిగా నయం చేసే అవకాశం ఉందా? సలహా ఇవ్వండి. మీరు వివరంగా తెలిపిన లక్షణాలను బట్టి మీరు టెండినైటిస్ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి హోమియో ద్వారా పూర్తి పరిష్కారం లభిస్తుంది. సాధారణంగా మన శరీరంలోని కండరాలను ఎముకలతో జతపరిచే తాడు లాంటి కణజాలాన్ని టెండన్స్ అని అంటారు. ఇవి ఫైబ్రస్ కణజాలంతో ఏర్పడతాయి. వీటికి సాగే గుణం ఉండటం వల్ల ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటాయి. కాబట్టి అవి కండరాలు ముడుచుకునే సమయంలో, ఎముకలు, కీళ్ల కదలికలకు సహకరిస్తాయి. ఏ కారణం చేతనైనా వీటికి హానికలిగితే, కదలికలు ఇబ్బందికరంగా మారి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. ఈ టెండన్స్ ఇన్ఫెక్షన్కు గురికావడాన్ని టెండినైటిస్ అంటారు. శరీరంలో ఎక్కడైనా ఏర్పడే ఈ సమస్య... భుజాలలో, మోచేతుల్లో, మణికట్టు, బొటనవేలు మొదటి భాగంలో, తుంటి, మోకాలు, మడమలు వంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఏ వయసు వారిలోనైనా కనిపించే ఈ సమస్య ఎక్కువగా పెద్దవయసు వారిలో (ముఖ్యంగా 40 ఏళ్లు పైబడినవారిలో) కనిపిస్తుంది. ఆ వయసు వారిలో సాధారణంగా టెండాన్స్ సాగేతత్వం, ఒత్తిడిని తట్టుకునే శక్తి తగ్గిపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. కారణాలు వయసు పెరగడం, గాయం కావడం, వృత్తిరీత్యా లేదా హాబీల కారణంగా టెండన్స్‌పై అధిక ఒత్తిడి కలిగించే ఒక రకమైన కదలికలను ఎక్కువగా కొనసాగించడం. ఉదా: కంప్యూటర్ కీ–బోర్డులు, మౌస్‌లు ఎక్కువగా వాడటం, కార్పెంటింగ్, పెయింటింగ్ మొదలైనవి. క్రీడల వల్ల : ►పరుగెత్తడం, టెన్నిస్, బాస్కెట్‌బాల్, గోల్ఫ్, బౌలింగ్ మొదలైనవాటివల్ల. ►డయాబెటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, స్థూలకాయం వంటి ఇబ్బందులతో బాధపడేవారిలో ఈ సమస్యకు గురయ్యే అవకాశం ఉంది. ►కొన్ని ఇన్ఫెక్షన్ల వల్ల కూడా ఈ టెండినైటిస్ సంభవించే అవకాశం ఉంది. లక్షణాలు టెండినైటిస్‌కి గురైన ప్రదేశంలో నొప్పి, బిగువుగా ఉండటం, ఆ భాగాన్ని కదిలించినప్పుడు నొప్పి అధికమవ్వడం, కొన్ని రకాల శబ్దాలు వినిపించడం, వాపు, చేతితో తాకితే ఆ ప్రదేశం వేడిగా అనిపించడం, ఎర్రగా మారడంవంటి లక్షణాలను గమనించవచ్చు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ►కంప్యూటర్లను, కీబోర్డులను, మౌస్‌లను సరైన పొజిషన్లో సర్దుబాటు చేసుకోవడం. ►పనిలో కొంత విశ్రాంతి తీసుకోవడం ►వ్యాయామాలు ఒకేసారి అధిక ఒత్తిడికి గురిచేసేలా కాకుండా నెమ్మదిగా ప్రారంభించడం ►క్రీడలలో కోచ్ సలహా మేరకు జాగ్రత్తలు పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి దూరంగా ఉండవచ్చు. చికిత్స జెనెటిక్ కాన్స్టిట్యూషన్ చికిత్స విధానం ద్వారా రోగి మానసిక, శారీరక పరిస్థితులు, తత్వాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందించడం ద్వారా రోగి తాలూకు రోగ నిరోధకశక్తిని సరిచేయడం వల్ల ఎలాంటి ఇన్ఫ్లమేషన్ ఉన్నా దానిని నయం చేయడమే కాకుండా టెండన్స్‌ను దృఢపరచి సమస్యను సమూలంగా దూరం చేయడం జరుగుతుంది. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ మైగ్రేన్‌కు చికిత్స ఉందా? నా వయసు 25 ఏళ్లు. నాకు విపరీతమైన తలనొప్పి వస్తోంది. వారంలో ఒకటి, రెండు సార్లు తీవ్రంగా వస్తోంది. ఎన్నో రక్తపరీక్షలు, ఎక్స్–రే, స్కానింగ్ పరీక్షలు చేయించాను. డాక్టర్లు దీన్ని మైగ్రేన్‌గా నిర్ధారణ చేశారు. జీవితాంతం వస్తుంటుందని చెప్పారు. హోమియోపతిలో దీనికి చికిత్స ఉందా? తరచూ తలనొప్పి వస్తే అశ్రద్ధ చేయకూడదు. నేటి ఆధునికయుగంలో శారీరక, మానసిక ఒత్తిడి, అనిశ్చితి, ఆందోళనలు తలనొప్పికి ముఖ్యమైన కారణాలు. ఇంకా రక్తపోటు, మెదడు కణుతులు, మెదడు రక్తనాళాల్లో రక్తప్రసరణల్లో మార్పులు, సైనసైటిస్ మొదలైన వాటివల్ల తలనొప్పి వచ్చేందుకు ఆస్కారం ఉంది. తలనొప్పి ఏ రకానికి చెందినదో నిర్ధారణ తర్వాత ఖచ్చితమైన చికిత్స చేయడం సులువవుతుంది. మైగ్రేన్ తలనొప్పిని పార్శ్వపు తలనొప్పి అంటారు. మానసిక ఆందోళన, ఒత్తిడి, జరిగిపోయిన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం, డిప్రెషన్, నిద్రలేమి, అధిక ప్రయాణాలు, సూర్యరశ్మి, స్త్రీలలో హార్మోన్ సమస్యల వల్ల ఈ పార్శ్వపు తలనొప్పి వస్తుంటుంది. పురుషులతో పోలిస్తే ఇది స్త్రీలలోనే ఎక్కువ. మైగ్రేన్‌లో దశలూ, లక్షణాలు సాధారణంగా మైగ్రేన్ వచ్చినప్పుడు 24 గంటల నుంచి 72 గంటలలోపు అదే తగ్గిపోతుంది. ఒకవేళ 72 గంటలకు పైనే ఉంటే దాన్ని స్టేటస్ మైగ్రేన్ అంటారు. దీంతోపాటు వాంతులు కావడం, వెలుతురునూ, శబ్దాలను అస్సలు భరించలేకపోవడం వంటి లక్షణాలూ కనిపిస్తాయి. వ్యాధి నిర్ధారణ రక్తపరీక్షలు, రక్తపోటును పరీక్షించడం, సీటీస్కాన్, ఎంఆర్ఐ పరీక్షల ద్వారా మైగ్రేన్‌ను నిర్ధారణ చేయవచ్చు. మైగ్రేన్ రావడానికి చాలా అంశాలు దోహదపడతాయి. ఉదాహరణకు మనం తినే ఆహారంలో మార్పులు, మనం ఆలోచించే విధానం, మానసిక ఒత్తిడి, వాతావారణ మార్పులు, నిద్రలేమి, మహిళల్లో రుతుసమస్యలు వంటి కారణాలతో వచ్చినప్పుడు జీవనశైలిలో మార్పులతో దీన్ని కొంతవరకు నివారించవచ్చు. ఇక మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు వ్యాయామం, యోగా, ప్రాణాయామం చేయాలి. చికిత్స మైగ్రేన్‌ను పూర్తిగా తగ్గించడానికి హోమియోలో మంచి మందులు ఉన్నాయి. శారీరక, మానసిక, కుటుంబ, అనువంవశిక, వాతావరణ, వృత్తిసంబంధమైన కారణాలను అంచనా వేసి, వాటిని అనుగుణంగా మందును ఎంపిక చేయాల్సి ఉంటుంది. వారి జెనెటిక్ కన్స్టిట్యూషన్ సిమిలియమ్ వంటి అంశాలన పరిగణనలోకి తీసుకొని చికిత్స అందిస్తారు. బెల్లడోనా, ఐరిస్, శ్యాంగ్యునేరియా, ఇగ్నీషియా, సెపియా వంటి కొన్ని మందులు మైగ్రేన్‌కు అద్భుతంగా పనిచేస్తాయి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ ఒళ్లంతా తెల్లమచ్చలు... తగ్గేదెలా? నా వయసు 39 ఏళ్లు. నా శరీరమంత తెల్లమచ్చలు వచ్చాయి. మొదట్లో కాస్త చిన్నవిగా ఉండి, ఇప్పుడు క్రమంగా పెద్దవవుతూ అందరూ గమనించేలా ఉంటున్నాయి. ఎంతో మానసిక వేదన అనుభవిస్తున్నాను. నాకు హోమియోలో పరిష్కారం సూచించండి. శరీరానికి చర్మం ఒక కవచం లాంటిది. అన్ని అవయవాలలో చర్మం అతి పెద్దది. ఇందులో చెమట గ్రంథులు, రక్తనాళాలు, నరాలతో పాటు చర్మం చాయకు కారణమైన మెలనోసైట్స్ కూడా ఉంటాయి. ఏప్రాంతంలోనైనా చర్మంలో ఉండే ఈ కణాలు తగ్గినప్పుడు అక్కడ తెల్ల మచ్చలు వస్తాయి. ఈ మచ్చలనే బొల్లి లేదా ల్యూకోడెర్మా అంటారు. ఇప్పుడు మీరు ఇదే సమస్యతో బాధపడుతున్నారు. చర్మం వెలుపల పొరల్లో ఉండే మెలనోసైట్ కణజాలాలు విడుదల చేసే ‘మెలనిన్ అనే ప్రత్యేక పదార్థం, టైరోసినేజ్ అనే ఎంజైమ్ వల్ల సరైన మోతాదులో విడుదల అవుతుంది. బొల్లి వ్యాధిలో ఈ ఎంజైము అనేక కారణాల వల్ల లోపిస్తుంది. దాంతో మెలనిన్ విడుదలకు అంతరాయం ఏర్పడి, చర్మం రంగును కోల్పోతుంది. ►బొల్లి వ్యాధికి ముఖ్యమైన కారణాల్లో మానసిక ఒత్తిడి ఒకటి. ఇది స్త్రీ, పురుషుల తేడా లేకుండా, వయసుతో సంబంధం లేకుండా రావచ్చు. డిప్రైషన్, యాంగై్జటీ న్యూరోసిస్ మొదలైన మానసిక పరిస్థితులు దీనికి దారితీయవచ్చు. ►పోషకాహారలోపం కూడా బొల్లి వ్యాధికి దారితీయవచ్చు. ►జన్యుపరమైన కారణాలతో వంశపారంపర్యంగా కూడా వ్యాధి రావచ్చు. దీర్ఘకాలిక గ్యాస్ట్రిక్ సమస్యలు : ఆహారంలో రాగి, ఇనుము మొదలైన ధాతువులు లోపించడం వల్ల విటమిన్లు, ప్రోటీన్ల వంటి పోషకాహార లోపం వల్ల గానీ, అమీబియాసిస్, బద్దెపురుగుల వంటి పరాన్నజీవుల వల్లగానీ తెల్లమచ్చలు కనిపించవచ్చు. ►మందులు, రసాయనాలు దుష్ఫలితాలు, క్వినోన్స్, క్లోరోక్విన్, యాంటీబయాటిక్స్ వంటి పరిశ్రమల్లో పనిచేయడం లేదా వాటిని సరైన మోతాదులో వాడకపోవడం వల్ల కూడా బొల్లి వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ►కొన్ని ఎండోక్రైన్ గ్రంథులు స్రవించే హర్మోన్స్ లోపాలు, డయాబెటిస్‌లో వంటి వ్యాధులలో తెల్లమచ్చలు ఎక్కువగా కనిపించే వీలుంది. ►వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) తగ్గడం, మన వ్యాధి నిరోధకత మనకే ముప్పుగా పరిణమించే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల మన సొంతకణాలే మనపై దాడి చేయడం వల్ల కూడా బొల్లి సోకే అవకాశం ఉంది. లక్షణాలు మొదట చిన్న చిన్న మచ్చలుగా ఏర్పడి, ఆ తర్వాత శరీరం అంతటా వ్యాపిస్తాయి. చివరకు తెలుపు రంగులోకి మారతాయి. చర్మం పలుచబడినట్లు అవుతుంది. కొన్నిసార్లు ఎండవేడిని తట్టుకోలేరు. జుట్టు రంగుమారడం, రాలిపోవడం, వంటి లక్షణాలు ఉంటాయి. ఈ మచ్చలు ముఖ్యంగా చేతులు, పెదవులు, కాల్ల మీద రావచ్చు. ఇవి పెరగవచ్చు లేదా అని పరిమాణంలో ఉండిపోవచ్చు. చికిత్స తెల్లమచ్చలకు హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. తూజా, నైట్రిక్ యాసిడ్, నేట్రమ్‌మ్యూరియాటికమ్, ఆర్సెనికమ్ ఆల్బమ్, లాపిస్ అల్బా, రస్టాక్స్ వంటి మందులతో తెల్లమచ్చలకు సమర్థంగా చికిత్సను అందించవచ్చు. డాక్టర్ టి.కిరణ్‌కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
మార్కుల యజ్ఞంలో విద్యార్థులే సమిధలు
సచిన్ పది పాస్ కాలేదు..అయినా క్రికెట్‌కి దేవుడయ్యాడు.కమల్‌హాసన్ 2వ తరగతే చదివాడు.. దేశం మెచ్చిన మహానటుల్లో ఒకడిగా నిలిచాడు. ఏఆర్ రెహమాన్ స్కూలుకైనా వెళ్లలేదు, అయినా ఆస్కార్‌ను గెలిచాడు. జీవితం ఎవరికీ వడ్డించిన విస్తరి కాదు. కష్టనష్టాల కోరిస్తేనే విజయం విలువ రుచి చూడగలం. బతుకు గొప్పదనం తెలుసుకోగలం. కానీ, నేటి జీవితంలో ఆటపాటలు కరువై, చదువే లోకంగా బతుకుతున్న విద్యార్థులు ఒక్క సబ్జెక్టులో తప్పినా ఆత్మన్యూనతకులోనై వెంటనే ప్రాణాలు తీసుకుంటున్నారు. తప్పు తమది కాకపోయినా.. ప్రాణాలు తీసుకోవడం ఒక్కటే సమస్యకు పరిష్కారం అనుకుంటున్నారు. పరిష్కారం కోసం వెతికే ఓపిక,ఎదిరించే పోరాట పటిమ నేటితరంలో లేకుండా చేసింది కార్పొరేట్ విద్యావ్యవస్థ,అదే నిజమనుకుంటున్న తల్లిదండ్రులదే అసలైన తప్పు అంటున్నారు సామాజిక వేత్తలు. రెక్కలు కత్తిరించిన స్వేచ్ఛ ఎందుకు? పిల్లలకు అడిగినా, అడగకపోయినా అన్నీ ఇస్తున్నారు నేటికాలం తల్లిదండ్రులు. కానీ స్వేచ్ఛారెక్కలు కత్తిరించి తాము చెప్పినట్లు ర్యాంకుల కోసం చదవమంటున్నారు. కష్టాలు వచ్చినప్పుడు ఎదుర్కొనే నేర్పరితనం, నాయకత్వ లక్షణాలు అస్సలు కనిపించడం లేదు. పైగా ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై, న్యూక్లియర్ ఫ్యామిలీలు పెరగడం కూడా పిల్లల మానసిక ఒత్తిడికి మరో కారణం. తల్లిదండ్రులు కాకుండా ఓదార్చే కుటుంబ సభ్యులెవరూ లేకపోవడం కూడా సమస్యను పెంచుతోంది. ఏటా 3 లక్షలమంది ఎంసెట్ రాస్తున్నారు. ఐఐటీ, ఐఐఎంలో ఉండే 1000 సీట్లు రాకుంటే వారు అనర్హుల కింద లెక్కగట్టే ధోరణి మారాలి. ప్రొ. డాక్టర్ సతీశ్‌కుమార్, సామాజిక వేత్త ఆటపాటలు, స్కౌట్స్, ఎన్సీసీ అంటే తెలియవు! ఇప్పుడు పిల్లల్లో ఆటపాటలు లేవు. కార్పొరేట్ జైళ్లలో కాలేజీలు. అందుకే, పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అదే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు ఆటపాటలు, స్కౌట్స్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వంటి అంశాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి నుంచి సమస్యలపై పోరాడే తత్వం అలవడుతుంది. దేశభక్తి, సామాజిక బాధ్యత పెరుగుతాయి. ఓడిపోయినా.. కుంగిపోకుండా విజయం సాధించే పోరాటతత్వం, అవసరమైనప్పుడు నలుగురికి నేతృత్వం వహించే నాయకత్వ లక్షణాలు నేర్చుకుంటున్నారు. కానీ, ప్రైవేటు, కార్పొరేట్ విద్యార్థుల్లో ఇవేమీ కానరావడం లేదంటే అతిశయోక్తి కాదు. స్మార్ట్ఫోన్లు, సోషల్ మీడియాలో గంటలకొద్దీ గడుపుతూ విపరీత మనస్తత్వాన్ని పెంచుకుంటున్నారు. ఫలితాలు వచ్చినప్పటి నుంచి 18 మంది.. ఈసారి ఇంటర్ ఫలితాల్లోతీవ్ర గందరగోళం నెలకొంది. లెక్కకుమించిన తప్పులతో విద్యార్థులు తమ ప్రమేయం లేకుండా ఫెయిల య్యారు. చివరికి తమది తప్పు కాదని తెలిసినా విద్యార్థులు జీర్ణించుకోలేక పోతున్నారు. సమస్యపై పోరాడలేక చేతులెత్తేస్తున్నారు. తమ ప్రతిభను ర్యాంకులు, గ్రేడులు అంటూ తూకమేసి కొలుస్తున్న ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలో ఇమడలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇంటర్ ఫలితాలు వెలువడిన నాటి నుంచి నేటి వరకు దాదాపుగా 18 మంది విద్యార్థులు కన్నవారికి కడుపుకోత మిగిల్చారు. లోపం ఎక్కడుంది? విద్యార్థులు మరీ ఇంత సున్నిత మనస్కులుగా తయారవడానికి మనమే కారణమంటున్నారు సామాజికవేత్తలు. పిల్లలు పది పాస్ కాగానే, కార్పొరేట్ కాలేజీల్లో చేర్పించడం, సమాజానికి దూరంగా, చదువేలోకంగా, బ్రాయిలర్ కోళ్లలా రాత్రింబవళ్లు చదువుతున్నారు. తమ సంతానం ఇంజనీర్, డాక్టర్ అవ్వాలని పుట్టగానే డిసైడ్ చేస్తున్నారు తల్లిదండ్రులు. పిల్లల ఇష్టంతో పనిలేదు. వారికి కష్టం అంటే తెలియకుండా కాలు కందనీయకుండా, ఆటపాటలకు దూరంగా చదువే పరమావధిగా ఉండే స్కూళ్లు, కాలేజీల్లో వేస్తున్నారు. 90 శాతం రాకపోతే అసలు అది చదువే కాదన్న మానసిక స్థితికి పిల్లలను తీసుకువస్తున్నారు. అలాంటి పిల్లలు అకస్మాత్తుగా వ్యతిరేక ఫలితాలు చూసి తట్టుకోలేక తనువు చాలిస్తున్నారు. పిల్లలకు భరోసా ఇవ్వండి ఫెయిలైన పిల్లలకు తల్లిదండ్రులు ముందు ధైర్యం చెప్పాలి. తప్పె క్కడ జరిగిందో అన్వేషించాలి. ఆత్మహత్యల వార్తలు, దృశ్యాల నుంచి పిల్లలను దూరంగా ఉంచాలి. నేటి పిల్లలు తెలివైన వారు, కాకపోతే సున్నిత మనస్కులు. సమస్య పరిష్కారమయ్యే వరకు వెంట ఉంటామన్న భావన కుటుంబ సభ్యులు వారిలో కల్పించాలి. అప్పటికీ మార్పు లేకపోతే కౌన్సెలింగ్ ఇప్పించాలి. - సుమతి, ఎస్పీ, విమెన్ ప్రొటెక్షన్ సెల్