మార్కుల యజ్ఞంలో విద్యార్థులే  సమిధలు | Suicide idea is not correct | Sakshi
Sakshi News home page

మార్కుల యజ్ఞంలో విద్యార్థులే  సమిధలు

Published Fri, Apr 26 2019 12:05 AM | Last Updated on Fri, Apr 26 2019 12:05 AM

Suicide idea is not correct - Sakshi

సచిన్‌ పది పాస్‌ కాలేదు..అయినా క్రికెట్‌కి దేవుడయ్యాడు.కమల్‌హాసన్‌ 2వ తరగతే చదివాడు.. దేశం మెచ్చిన మహానటుల్లో ఒకడిగా నిలిచాడు. ఏఆర్‌ రెహమాన్‌ స్కూలుకైనా వెళ్లలేదు, అయినా ఆస్కార్‌ను గెలిచాడు.

జీవితం ఎవరికీ వడ్డించిన విస్తరి కాదు. కష్టనష్టాల కోరిస్తేనే విజయం విలువ రుచి చూడగలం. బతుకు గొప్పదనం తెలుసుకోగలం. కానీ, నేటి జీవితంలో ఆటపాటలు కరువై,  చదువే లోకంగా బతుకుతున్న విద్యార్థులు ఒక్క సబ్జెక్టులో తప్పినా ఆత్మన్యూనతకులోనై వెంటనే ప్రాణాలు తీసుకుంటున్నారు. తప్పు తమది కాకపోయినా.. ప్రాణాలు తీసుకోవడం ఒక్కటే సమస్యకు పరిష్కారం అనుకుంటున్నారు. పరిష్కారం కోసం వెతికే ఓపిక,ఎదిరించే  పోరాట పటిమ నేటితరంలో లేకుండా చేసింది కార్పొరేట్‌ విద్యావ్యవస్థ,అదే నిజమనుకుంటున్న తల్లిదండ్రులదే అసలైన తప్పు అంటున్నారు సామాజిక వేత్తలు. 

రెక్కలు కత్తిరించిన స్వేచ్ఛ ఎందుకు?
పిల్లలకు అడిగినా, అడగకపోయినా అన్నీ ఇస్తున్నారు నేటికాలం తల్లిదండ్రులు. కానీ స్వేచ్ఛారెక్కలు కత్తిరించి తాము చెప్పినట్లు ర్యాంకుల కోసం చదవమంటున్నారు. కష్టాలు వచ్చినప్పుడు ఎదుర్కొనే నేర్పరితనం, నాయకత్వ లక్షణాలు అస్సలు కనిపించడం లేదు. పైగా ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై, న్యూక్లియర్‌ ఫ్యామిలీలు పెరగడం కూడా పిల్లల మానసిక ఒత్తిడికి మరో కారణం. తల్లిదండ్రులు కాకుండా ఓదార్చే కుటుంబ సభ్యులెవరూ లేకపోవడం కూడా సమస్యను పెంచుతోంది. ఏటా 3 లక్షలమంది ఎంసెట్‌ రాస్తున్నారు. ఐఐటీ, ఐఐఎంలో ఉండే 1000 సీట్లు రాకుంటే వారు అనర్హుల కింద లెక్కగట్టే ధోరణి మారాలి.
ప్రొ. డాక్టర్‌ సతీశ్‌కుమార్, సామాజిక వేత్త 

ఆటపాటలు, స్కౌట్స్, ఎన్‌సీసీ అంటే తెలియవు! 
ఇప్పుడు పిల్లల్లో ఆటపాటలు లేవు. కార్పొరేట్‌ జైళ్లలో కాలేజీలు. అందుకే, పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అదే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు ఆటపాటలు, స్కౌట్స్, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ వంటి అంశాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి నుంచి సమస్యలపై పోరాడే తత్వం అలవడుతుంది. దేశభక్తి, సామాజిక బాధ్యత పెరుగుతాయి. ఓడిపోయినా.. కుంగిపోకుండా విజయం సాధించే పోరాటతత్వం, అవసరమైనప్పుడు నలుగురికి నేతృత్వం వహించే నాయకత్వ లక్షణాలు నేర్చుకుంటున్నారు. కానీ, ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యార్థుల్లో ఇవేమీ కానరావడం లేదంటే అతిశయోక్తి కాదు. స్మార్ట్‌ఫోన్లు, సోషల్‌ మీడియాలో గంటలకొద్దీ గడుపుతూ విపరీత మనస్తత్వాన్ని పెంచుకుంటున్నారు.

ఫలితాలు వచ్చినప్పటి నుంచి 18 మంది..
ఈసారి ఇంటర్‌ ఫలితాల్లోతీవ్ర గందరగోళం నెలకొంది. లెక్కకుమించిన తప్పులతో విద్యార్థులు తమ ప్రమేయం లేకుండా ఫెయిల య్యారు. చివరికి తమది తప్పు కాదని తెలిసినా విద్యార్థులు జీర్ణించుకోలేక పోతున్నారు. సమస్యపై పోరాడలేక చేతులెత్తేస్తున్నారు. తమ ప్రతిభను ర్యాంకులు, గ్రేడులు అంటూ తూకమేసి కొలుస్తున్న ఈ కార్పొరేట్‌ విద్యా వ్యవస్థలో ఇమడలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇంటర్‌ ఫలితాలు వెలువడిన నాటి నుంచి నేటి వరకు దాదాపుగా 18 మంది విద్యార్థులు కన్నవారికి కడుపుకోత మిగిల్చారు.

లోపం ఎక్కడుంది?
విద్యార్థులు మరీ ఇంత సున్నిత మనస్కులుగా తయారవడానికి మనమే కారణమంటున్నారు సామాజికవేత్తలు. పిల్లలు పది పాస్‌ కాగానే, కార్పొరేట్‌ కాలేజీల్లో చేర్పించడం, సమాజానికి దూరంగా, చదువేలోకంగా, బ్రాయిలర్‌ కోళ్లలా రాత్రింబవళ్లు చదువుతున్నారు. తమ సంతానం ఇంజనీర్, డాక్టర్‌ అవ్వాలని పుట్టగానే డిసైడ్‌ చేస్తున్నారు తల్లిదండ్రులు. పిల్లల ఇష్టంతో పనిలేదు. వారికి కష్టం అంటే తెలియకుండా కాలు కందనీయకుండా, ఆటపాటలకు దూరంగా చదువే పరమావధిగా ఉండే స్కూళ్లు, కాలేజీల్లో వేస్తున్నారు. 90 శాతం రాకపోతే అసలు అది చదువే కాదన్న మానసిక స్థితికి పిల్లలను తీసుకువస్తున్నారు. అలాంటి పిల్లలు అకస్మాత్తుగా వ్యతిరేక ఫలితాలు చూసి తట్టుకోలేక తనువు చాలిస్తున్నారు.

పిల్లలకు భరోసా ఇవ్వండి
ఫెయిలైన పిల్లలకు తల్లిదండ్రులు ముందు ధైర్యం చెప్పాలి. తప్పె క్కడ జరిగిందో అన్వేషించాలి. ఆత్మహత్యల వార్తలు, దృశ్యాల నుంచి పిల్లలను దూరంగా ఉంచాలి. నేటి పిల్లలు తెలివైన వారు, కాకపోతే సున్నిత మనస్కులు. సమస్య పరిష్కారమయ్యే వరకు వెంట ఉంటామన్న భావన కుటుంబ సభ్యులు వారిలో కల్పించాలి. అప్పటికీ మార్పు లేకపోతే కౌన్సెలింగ్‌ ఇప్పించాలి.
- సుమతి, ఎస్పీ, విమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement