Student Education
-
ప్రతి విద్యార్థికీ ప్రత్యేక నంబర్
సాక్షి, అమరావతి: ‘ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ’ (అపార్) పేరుతో విద్యార్థులకు ఆధార్ తరహాలో ప్రత్యేక నంబర్‌తో కూడిన గుర్తింపు కార్డు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు ‘వన్ నేషన్–వన్ ఐడీ’ కార్డును అందుబాటులోకి తీసుకొస్తోంది. విద్యార్థులకు ఈ గుర్తింపు కార్డు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించాలని కేంద్రం ఇప్పటికే అన్ని రాష్ట్రాలనూ ఆదేశించడంతో రాష్ట్రంలోని పాఠశాల విద్యాశాఖ కూడా ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. తొలి విడతలో 9 నుంచి 12 (ఇంటర్) తరగతుల విద్యార్థుల వివరాలు నమోదు చేసేందుకు ప్రణాళికను సిద్ధంచేసింది. దసరా సెలవుల్లో ఆయా తరగతుల విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అనుమతి పత్రాలపై సంతకాలు తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించిన పత్రాలను ఇప్పటికే అందించారు. జాతీయ విద్యావిధానం–2020లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ అపార్ నంబర్ కేటాయింపు ప్రక్రియ చేపట్టింది. అధార్ వివరాలను చాలా రాష్ట్రాలు బహిర్గతం చేయడాన్ని సమ్మతించకపోవడంతో ఆధార్ తరహాలోనే అపార్ నమోదు ప్రక్రియ చేపట్టారు.చదువు పూర్తయ్యే వరకూ ఇదే నెంబరు..నిజానికి.. విద్యార్థుల ఆధార్ కార్డులోని వివరాల ఆధారంగా ప్రస్తుతం బడుల్లో చేరికలు జరుగుతున్నాయి. ఇలా చేరిన తర్వాత ప్రతి విద్యార్థికీ ‘పర్మినెంట్ ఎన్రోల్మెంట్ నంబర్’ (పెన్)ను కేటాయించి యూడైస్ ప్లస్‌లో నమోదు చేస్తున్నారు. ఇప్పుడు ఈ నంబర్‌కు అదనంగా 12 అంకెలతో కూడిన ‘అపార్’ నంబర్ కేటాయిస్తారు. ఇదే నంబరును విద్యార్థి చదువు పూర్తయ్యే వరకు అన్ని సర్టిఫికెట్లపైనా, ఐడీ కార్డుపైనా ముద్రిస్తారు. ఈనెల 14న అన్ని పాఠశాలల్లోనూ విద్యార్థుల నుంచి ధ్రువపత్రాలు తీసుకుని వాటిని కేంద్ర విద్యాశాఖ యూడైస్ ప్లస్ వెబ్సైట్లో నమోదు చేస్తారు.9–12 తరగతుల్లో 18 లక్షల విద్యార్థులు..అపార్ నంబర్ కేటాయింపు ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం 2022లోనే ప్రవేశపెట్టి, అన్ని రాష్ట్రాలు దీనిని పాటించాలని కోరింది. ఈ క్రమంలో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 34 కోట్ల మంది విద్యార్థుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవగా, ఆంధ్రప్రదేశ్‌లో దసరా సెలవుల తర్వాత ప్రారంభం కానుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో సుమారు 18 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. తొలి విడతలో వీరి వివరాలు నమోదు చేస్తారు. తర్వాత మిగిలిన విద్యార్థుల నమోదు ప్రక్రియ చేపడతారు. ఈ అంశంపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని, అందుకోసం దసరా సెలవుల అనంతరం నిర్వహించే తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమావేశం (పీటీఎం)లో చర్చించాలని పాఠశాల విద్యాశాఖ డీఈఓలను, ప్రధానోపాధ్యాయులను ఆదేశించింది. తొలి విడతలో 9 నుంచి 12 తరగతుల విద్యార్థుల వివరాలు నమోదు చేయాలని నిర్ణయించారు. దీంతో అన్ని పాఠశాలల్లోను మంగళవారమే విద్యార్థులకు దరఖాస్తు పత్రాలను అందించారు. వాటిపై తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలని సూచించారు.అపార్‌తో నకిలీ సర్టిఫికెట్లకు అడ్డుకట్ట..ఇక కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఈ ‘అపార్’.. హైస్కూల్ నుంచి ఉన్నత విద్య వరకు విద్యార్థుల చదువుకు సంబంధించి సమగ్ర డిజిటల్ సమాచార కేంద్రంగా పనిచేస్తుంది. వివిధ బోర్డులు, విశ్వవిద్యాలయాలు జారీచేసే ప్రతి సర్టిఫికెట్ పైనా ఈ అపార్ నంబరును ముద్రిస్తారు. ముఖ్యంగా ఉద్యోగ నియామకాల సమయంలో సమర్పించిన సర్టిఫికెట్లపై అనేక ఫిర్యాదులు రావడం, అవి అసలువా లేక నకిలీవా అనేది తేల్చేందుకు జాప్యం జరుగుతుండడంతో అభ్యర్థికి నష్టం జరుగుతోంది. ఈ క్రమంలో విద్యలో జవాబుదారీతనం, పారదర్శకతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ‘వన్ నేషన్–వన్ స్టూడెంట్ ఐడీ’ అనే కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చింది. దేశంలో ఎక్కడ చదువుతున్నా సదరు విద్యార్థిని సులభంగా గుర్తించేందుకు, గత అకమిక్ వివరాలు తెలుసుకునేందుకు ఈ ‘అపార్’ ఉపయోగపడుతుంది. అంతేగాక.. ఇదే నంబరును డిజీ లాకర్‌తో అనుసంధానం చేయడంతో పాటు వాటిపై ఇదే నంబర్ ముద్రించడం ద్వారా విద్యా సంబంధమైన అన్ని పత్రాలు అసలైనవిగా గుర్తించేందుకు అవకాశం ఉంటుంది. -
Abhaya Foundation: పేదలకు అభయం బాలచంద్రుని ఆనంద నిలయం
పరాన్న జీవులుగా కాదు.. పరమాత్మ జీవులుగా మనమంతా ఎదగాలి’ అంటారు సుంకు బాలచంద్ర. పదిహేడేళ్లుగా సేవారంగంలో వేలాది మందికి అండగా ఉంటున్నారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉంటున్న యాభై ఏళ్ల బాలచంద్ర. అభయ ఆనంద నిలయం పేరుతో నిరుపేదలకు ఆశ్రయం కల్పిస్తున్నారు. ఉద్యోగం చేస్తూ వచ్చిన ఆదాయాన్ని పేదలకు పంచుతూ మొదలుపెట్టిన సేవామార్గం ఇప్పుడు ఎంతో మందికి నీడనిస్తుంది. అనాథ వృద్ధులను చేరదీస్తూ, విద్యార్థుల చదువుకు అవసరాలను సమకూరుస్తూ, రోగులకు వైద్యచికిత్సను అందజేస్తూ, నిరుద్యోగుల ఉపాధికి కావల్సిన నైపుణ్యాలను అందిస్తున్నారు. స్కూల్ పిల్లలను కలుస్తూ, వారి ప్రశ్నలకు సమాధానాలను పుస్తక రూపంలో తీసుకువచ్చారు. పది వేల రూపాయలతో మొదలుపెట్టిన సేవా మార్గం నేడు ఎంత మందికి చేరవయ్యిందో తెలియజేస్తూ మనం తలుచుకుంటే సమాజంలో పేదరికం, కష్టాలు, కన్నీళ్లు లేకుండా చేయచ్చు అని వివరిస్తున్నారు. పద్దెనిమిదవ వసంతంలోకి అడుగు పెడుతున్న తన సేవా ప్రస్థానాన్ని ఇలా ముందుంచారు. ‘‘ఎనిమిదేళ్ల క్రితం ఓ రోజు నాగర్‌కర్నూలు నుంచి ఫోన్ వస్తే అక్కడకు వెళ్లాను. ఎనభై ఏళ్ల ముసలాయన బాగోగులు చూడలేక వారి పిల్లలు ఇంటి నుంచి అతన్ని రోడ్డు మీదకు తోసేస్తే కొన్ని రోజులుగా చెత్త కుప్ప వద్ద ఉన్నాడు. అతన్ని ఆశ్రమానికి తీసుకువచ్చిన ఆరునెలలకు ఆయన భార్య కూడా వచ్చింది. ఇద్దరూ ఎనిమిదేళ్లపాటు నాతోనే ఉన్నారు. నాకు కరోనా వచ్చి ఆసుపత్రిలో ఉంటే ఆవిడ బెంబేలెత్తిపోయి తన మెడలో ఉన్న మంగళసూత్రాలు, కమ్మలు ఇచ్చి ‘అమ్మి, ఆ బాబును బతికించడయ్యా’ అని వేడుకుంది. కోలుకుని వచ్చాక విషయం తెలిసి కళ్ల నీళ్లు వచ్చాయి. పన్నెండేళ్ల క్రితం పాతికేళ్లమ్మాయి రోడ్డు ప్రమాదంలో హిప్బాల్ దెబ్బతిని మంచానికి పరిమితం అయ్యింది. హైదరాబాద్ గాంధీ నగర్లో ఉండే ఆమెను గుండె నొప్పితో బాధపడే తల్లి తప్ప చూసుకునేవారు ఎవరూ లేరు. నాలుౖగైదేళ్లు ఆ అమ్మాయి బెడ్‌మీదే ఉండిపోయింది. ఆమెకు పలుమార్లు ఆపరేషన్ చేయిస్తే ఏడెనిమిదేళ్లకు కోలుకుంది. ఇప్పుడు పెళ్లి చేసుకొని కుటుంబంతో సంతోషంగా ఉంది. మా అమ్మాయి బాగా చదువుకుంటుంది. డాక్టర్ కావాలన్నది తన కల. కానీ, చదివించే స్థోమత మాకు లేదని బాధపడుతూ వచ్చారు ఒకమ్మాయి తల్లిదండ్రులు. ఆ బిడ్డ ఈ రోజు డాక్టర్ అయి పేదలకు సేవలందిస్తోంది. ఈ పదిహేడేళ్లలో ఇలాంటి కథనాలు ఎన్నో... స్వచ్ఛందంగా ఎంతో మంది కదిలివచ్చి ‘అభయ ఫౌండేషన్’తో చేయీ చేయీ కలిపారు. ఉపనయనం డబ్బులతో... పుట్టి పెరిగింది అనంతపురం జిల్లా తాడిపత్రిలో. బీఎస్సీ ఎల్ఎల్బీ చేశాను. ఇరవై నాలుగేళ్ల క్రితం నాకు ఉపనయనం చేసినప్పుడు బంధువుల ద్వారా పది వేల రూపాయలు వచ్చాయి. ఆ డబ్బుతో నలుగురికి మేలు కలిగే పని చేయాలనుకుంటున్నాను అని మా కుటుంబంలో అందరికీ చెప్పాను. అందరూ సరే అన్నాను. వారందరి మధ్యనే ‘అభయ’ అనే పేరుతో ఫౌండేషన్‌ను ఏర్పాటు చేస్తున్నాను అని, తమకు తోచిన సాయం అందిస్తూ ఉండమని కోరాను. అక్కణ్ణుంచి హైదరాబాద్ వచ్చి, ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు చేశాను. నా ఖర్చులకు పోను మిగతా జీతం డబ్బులు, బంధుమిత్రులు ఇచ్చినదానితో ఫుట్‌పాత్‌ల మీద ఉండే నిరాశ్రయులకు సాయం చేస్తూ ఉండేవాణ్ణి. నైపుణ్యాల వెలికితీత.. ఏ మనిషి అయినా ఎవ్వరి మీదా ఆధారపడకుండా బతకాలి. అందుకు తగిన నైపుణ్యం కూడా ఉండాలి. దీంతో వారాంతాలు స్కిల్ ప్రోగ్రామ్‌లు ఏర్పాటు చేస్తుండేవాడిని. చదువుకున్న రోజుల్లో నేను మా బంధువుల నుంచి పుస్తకాలు, ఫీజులు, బట్టల రూపంలో సాయం పొందాను. వారందరిలోనూ ఒక ఎఫెక్షన్ చూశాను. నాలాగే ఎంతో మంది సాయం కోసం ఎదురుచూస్తుండవచ్చు అనే ఆలోచనతో విద్యార్థుల చదువుకు ఊతంగా ఉండాలనుకున్నాను. పుట్టి పెరిగిన జిల్లాతో పాటు ఇప్పుడు దాదాపు 17 రాష్ట్రాలలో నిరుపేద విద్యార్థుల చదువుకు అండగా ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను. తెలుగు రాష్ట్రాలతో పాటు మరో మూడు రాష్ట్రాల్లో 12 వేల మంది యువతకు ఉపాధి అవకాశాలకు శిక్షణ ఇస్తున్నాం. వీరిలో మహిళలూ ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. కర్ణాటక రాష్ట్రంలో నాదస్వరం స్కూల్‌ను కూడా ఏర్పాటు చేశాం. ఏ వృత్తుల వారికి ఆ వృత్తులలో ప్రత్యేక శిక్షణ ఇచ్చి, వారి కాళ్ల మీద వారు నిలబడేలా సాయంగా ఉంటున్నాం. సేవకు చేయూత ఒక మంచి పని చేస్తే ఎంత దూరమున్నవారినైనా ఆకట్టుకుంటుందని ఓ సంఘటన నాకు అర్థమయ్యేలా చేసింది. పదేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో ఒక సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అక్కడకు 75 ఏళ్ల ఆవిడ వచ్చి ‘నేనూ మీ సేవలో పాలు పంచుకుంటాను, నెలకు 5వేల రూపాయలు ఇవ్వగలను’ అంది. ఆశ్చర్యంగా చూస్తే ‘నేను రిటైర్డ్ ప్రిన్సిపాల్‌ను. 20 వేల రూపాయల పెన్షన్ వస్తుంది. ప్రతి నెలా ఐదు వేల రూపాయలు సేవకు నా జమ’ అంది. నోటమాటరాలేదు. ఎక్కడ సేవ రూపంలో వెళితే అక్కడకు పది, వంద రూపాయలు సాయం అందించినవారున్నారు. ఇంతమందిలో మానవత్వం ఉంటే ఇక మనకు కొరతేముంది అనుకున్నాను. ఎవరికి సాయం అందిందో తిరిగి వాళ్లు ఎంతో కొంత సాయం అందిస్తూ వచ్చారు. కొంతమంది పిల్లలు తమ కిడ్డీ బ్యాంకులో దాచుకున్న డబ్బును కూడా సాయంగా ఇచ్చారు. స్వచ్ఛందంగా ముందుకు.. నేపాల్ కరువైనా, ఉత్తరాఖండ్ వరదలైనా, ఆంధ్ర, తమిళనాడు, కేరళలలో అకాల వర్షాలు ముంచెత్తినా.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సాయం అవసరమున్నవారికి అండగా ఉంటే చాలు అన్న తపన నన్ను చాలా మందికి చేరువ చేసింది. నాతో పాటు ఎలాంటి స్టాఫ్ లేదు. ప్రత్యేకించి ఆఫీసు లేదు. అందరూ స్వచ్ఛందంగా తమ చేయూతను ఇస్తున్నారు. దీనికి నేను చేస్తున్నదల్లా సాయం చేసే చేతులను కలపడం. ఈ సేవా ప్రస్థానంలో ఇప్పుడు వేల మంది జమ కూడారు. అంతా నా కుటుంబమే! సేవ మార్గమే నా ప్రయాణం కాబట్టి, పెళ్లి, కుటుంబం వద్దనుకున్నాను. హైదరాబాద్‌లో ఒక ప్లాట్ ఉంది. ఇటీవల ఆ ఇంటిని అభయ ఫౌండేషన్‌కు ఇచ్చేశాను. ఆరేళ్ల క్రితం ఇబ్రహీంపట్నంలో వృద్ధులకు, వైద్య సాయం అవసరమైన పేదలకు అభయ ఆనంద నిలయం ఏర్పాటు చేశాను. నేను మరణించేదాకా, మరణించాక కూడా నలుగురిని బతికించే ప్రయత్నం చేయాలన్నది తపన. ఈ ప్రయాణంలో ఎన్నో ఆవేదనలు చుట్టుముట్టాయి. ఎందరి కష్టాలనో దగ్గరుండి చూసి, దుఃఖం కలిగేది. చేసే ప్రతి పనినీ దైవాంశగా భావిస్తూ వచ్చాను. పిల్లల కోసం కంపాస్ రేపటి తరం బాగుండాలంటే విద్యార్థుల్లో మానవతా స్పృహ కలగాలి. అందుకే, ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి చిన్నారులకు మన దేశ నాయకుల గురించి, సంస్కార పాఠాలు అందించే ప్రయత్నం చేస్తున్నాను. పిల్లలు అడిగిన ఎన్నో ప్రశ్నలకు సమాధానంగా ‘కంపాస్’అనే పేరుతో పుస్తకం తీసుకువచ్చాను. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రతి రోజూ ఉదయం నుంచి 10 వేల మందికి టచ్‌లో ఉంటాం. నేను కోరేది ఒక్కటే ... వాలంటీర్లుగా వారంలో ఒక్క రోజు మాకివ్వండి. సేవా మార్గంలో తోడవ్వండి. అంకితభావంతో ఉన్న యువత ఇలాంటి సంస్థలలో పనిచేయడం వల్ల వారిలో జీవన నైపుణ్యాలు పెరుగుతాయి. సమాజం బాగుండాలంటే యువత చేతులు ఏకమవ్వాలి’’ అని తెలియజేస్తున్నారు బాలచంద్ర. – నిర్మలారెడ్డి -
ఎగ్జామ్స్ అనేసరికి తీవ్రమైన జ్వరం వస్తుందా? ఒత్తిడి తగ్గించడం ఎలా?
కిషోర్ చాలా తెలివైన విద్యార్థి. టెన్త్ ్త క్లాస్‌లో 10జీపీఏతో పాసయ్యాడు. దాంతో ఒక కార్పొరేట్ కాలేజీవాళ్లు ఫ్రీ సీట్ ఇచ్చారు, హాస్టల్‌తో సహా. కానీ హాస్టల్‌కి వెళ్లాక కిషోర్ జీవితమే మారిపోయింది. పొద్దున్నే ఐదు గంటలకు లేస్తే బెడ్ ఎక్కేసరికి రాత్రి 11 గంటలవుతుంది. ప్రతిరోజూ ఇదే పరిస్థితి. మరోవైపు ఫ్రీ సీట్ కాబట్టి మంచి మార్కులు తెచ్చుకోవాలని కాలేజీ యాజమాన్యం ఒత్తిడి. మార్కులు తగ్గితే ఫ్రీ సీట్ కేన్సిల్ చేస్తారని, ఫీజు మొత్తం చెల్లించాల్సి వస్తుందని పేరెంట్స్ ఒత్తిడి. ఈ మధ్యకాలంలో కాలేజీలో మోటివేషన్ క్లాస్ పెట్టించారు. ఆ స్పీకర్ చెప్పినట్లు తాను సాధించలేకపోతే ఎలా? అంటూ కిషోర్‌లో ఒత్తిడి మరింత పెరిగింది. ఒకరోజు కాలేజీలో స్పృహ తప్పి పడిపోయాడు. కాలేజీ యాజమాన్యం అతన్ని హుటాహుటిన హాస్పిటల్లో చేర్పించి పేరెంట్స్‌కి ఫోన్ చేసింది. అన్ని రకాల వైద్య పరీక్షలు చేసినా కిషోర్ అనారోగ్యానికి కారణం తెలియలేదు, ఎన్ని మందులు వాడినా అనారోగ్యం తగ్గడం లేదు. ఇంటర్మీడియట్ చదువుతున్న శిరీషది మరో రకమైన సమస్య. రెగ్యులర్ స్లిప్ టెస్టులతో ఎలాంటి సమస్యా లేదు. ఫైనల్ ఎగ్జామ్ అనేసరికి తీవ్రమైన జ్వరం వచ్చేస్తుంది. హాస్పిటల్లో చేర్పించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. టెన్త్ క్లాస్‌లో అలాగే హాస్పిటల్ నుంచి వెళ్లి పరీక్షలు రాసి 8జీపీఏతో గట్టెక్కింది. ఇంటర్ ఫస్టియర్‌లోనూ అదే సమస్య. ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండియర్‌లోనూ అదే సమస్య ఎదురవుతుందని తల్లిదండ్రులు భయపడుతున్నారు. నీట్ పరీక్ష సమయంలో ఇలా జ్వరం వస్తే ఏం చేయాలని కంగారు పడుతున్నారు. కిషోర్, శిరీష అంత సీరియస్ కాకపోయినా చాలామంది విద్యార్థులకు పరీక్షలంటే కొద్దిపాటి ఆందోళన లేదా భయం ఉంటుంది. దీన్నే టెస్ట్ యాంగ్జయిటీ అంటారు. తాను పరీక్షల్లో సరిగా పెర్ఫార్మ్ చేయలేనేమో, ఫెయిల్ అవుతానేమోనని స్టూడెంట్స్ ఆందోళన చెందుతుంటారు. ఒక మోతాదు వరకు టెస్ట్ యాంగ్జయిటీ ఉండటం మంచిదే. అది పరీక్షలకు సిద్ధమయ్యేలా చేస్తుంది. మోతాదు మించితేనే రకరకాల సమస్యలకు దారి తీస్తుంది. విద్యార్థుల్లో టెస్ట్ యాంగ్జయిటీకి ప్రధాన కారణం తల్లిదండ్రులు, అధ్యాపకులు లేదా కాలేజీ యాజమాన్యాల ఒత్తిడి. పరీక్షల్లో తప్పితే లేదా మంచి మార్కులు రాకపోతే భవిష్యత్తు ఉండదని పదేపదే చెప్పడం వల్ల కొంతమంది విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. సరిగా ప్రిపేర్ కాకపోవడం లేదా గత పరీక్షల్లో ఆశించిన మార్కులు రాకపోవడం వల్ల కూడా పరీక్షలంటే భయం ఏర్పడుతుంది. ఆ పరీక్షలు తప్పించుకునేందుకు మనసు రకరకాల వేషాలు వేస్తుంది. అనారోగ్యం పాలయ్యేలా చేస్తుంది. టెస్ట్ యాంగ్జయిటీ లక్షణాలు: విద్యార్థుల్లో టెస్ట్ యాంగ్జయిటీ అనేది రకరకాల రూపాల్లో కనిపిస్తుంది. శారీరక, భావోద్వేగ, కాగ్నిటివ్ లక్షణాలుంటాయి. శారీరక లక్షణాలు: తలనొప్పి, కడుపునొప్పి, జ్వరం, విపరీతమైన చెమట, ఊపిరి ఆడకపోవడం, గుండె కొట్టుకునే వేగం పెరగడం, తలతిరగడం, స్పృహ తప్పి పడిపోవడం. భావోద్వేగ లక్షణాలు: ఒత్తిడి, భయం, నిస్సహాయత, నిరాశ, ప్రతికూల ఆలోచనలు, గతంలో పరీక్ష తప్పిన ఘటనలు పదే పదే గుర్తుకు రావడం, పరీక్ష తప్పితే తల్లిదండ్రుల ప్రవర్తన గురించిన ఆలోచనలు, ఫ్రెండ్స్ ఎలా ఎగతాళి చేస్తారోననే భయం. ప్రవర్తనా/అభిజ్ఞా లక్షణాలు: ఏకాగ్రత లోపించడం, వాయిదా వేయడం, ఇతరులతో పోల్చుకుని ఆత్మన్యూనతగా ఫీలవ్వడం. టెస్ట్ యాంగ్జయిటీని ఎలా తగ్గించాలి? ∙పరీక్షలకు ముందు.. బాగా చదవడానికి వేరే ప్రత్యామ్నాయమేదీ లేదు. చదవాల్సిన సిలబస్‌ను చిన్నచిన్న భాగాలుగా చేసుకుంటే త్వరగా నేర్చుకోవచ్చు, ఒత్తిడి తగ్గుతుంది ∙చాలామంది విద్యార్థులకు ఎలా చదివితే గుర్తుంటాయో తెలియకే బోల్తాపడుతుంటారు. అందువల్ల ముందుగా ఎఫెక్టివ్ స్టడీ స్ట్రాటజీస్ నేర్చుకుని, వాటి ప్రకారం చదువుకోవాలి. ∙కాఫీ, టీలు మానేసి సమయానికి తినడం, వ్యాయామం చేయడం, తగినంత నిద్ర పోవడం ద్వారా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒత్తిడి నుంచి శరీరాన్ని, మనస్సును కాపాడుకునేందుకు జాకబ్సన్ ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ రోజూ ప్రాక్టీస్ చేయండి. పరీక్షకు ముందురోజు నైట్ అవుట్ చేయకుండా, కచ్చితంగా 7–9 గంటలు నిద్ర ఉండేలా చూసుకోండి. మీ ఆందోళన మరింత పెరగకుండా ఉండేందుకు పరీక్ష సెంటర్‌కి.. ముందే చేరుకుని మీ సీట్లో కూర్చోండి ∙పరీక్షకు ముందు ఐదు నిమిషాలు దీర్ఘంగా శ్వాస తీసుకోండి. ఐదు నిమిషాలు రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయండి ∙మిమ్నల్ని మీరు గ్రౌండింగ్ చేసుకోండి. మీ చుట్టూ ఉన్నవారికన్నా మీరు మెరుగైనవారని విజువలైజ్ చేసుకోండి. గతంలో మీరు బాగా పెర్ఫార్మ్ చేసిన పరీక్షలను గుర్తు చేసుకోండి. అది మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. హాయిగా, ప్రశాంతంగా పరీక్ష రాయండి. టెస్ట్ యాంగ్జయిటీని తగ్గించుకోవాలంటే అత్యంత ముఖ్యమైంది తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మద్దతు. రిజల్ట్స్ కోసం విద్యార్థిపై ఒత్తిడి పెంచకుండా, బెస్ట్ పెర్ఫార్మెన్స్ని ఇస్తే చాలని భరోసానివ్వాలి. సమస్య తీవ్రంగా ఉంటే ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్‌ని సంప్రదించాలి. -
ఇంజినీరింగ్ చేస్తే సైబర్ సెంటర్లో పనిచేయాలి.. ఆవేదనతో విద్యార్థి ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): ప్రస్తుత విద్యా వ్యవస్థ నచ్చక ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హాసన్ జిల్లాలో చోటుచేసుకుంది. అరసీకెరె తాలూకా గండసి గ్రామానికి చెందిన హేమంత్‌గౌడ ఆత్మహత్యకు పాల్పడ్డ ఇంజినీరింగ్ విద్యా ర్థి. హేమంత్ హాసన్‌లోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. మంగళవారం సెల్ఫీ వీడియో విడుదల చేసిన హేమంత్ నేటి విద్యా వ్యవస్థపై ఆగ్రహం వ్యక్తం చేసాడు. 20 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదన్నాడు. తన తండ్రి ఉపాధ్యాయుడని, ఆయన వద్ద చదువుకున్న ఎంతోమంది ఉన్నత స్థానాలను అలంకరించారన్నారు. ఇప్పుడు ఇంజినీరింగ్ చేస్తే సైబర్ సెంటర్లో పనిచేయాలని అసంతృప్తి వ్యక్తం చేసాడు. విద్యా వ్యవస్థలో మార్పులు రావాలని కోరాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన అంత్యక్రియలకు ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, ఆదిచుంచనగిరి స్వామి రావాలని, తన అవయవాలు దానం చేయాలని వీడియోలో కోరాడు. చదవండి: Tamilnadu Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు సజీవదహనం -
నాన్న.. నాకు చదువొద్దు చనిపోతున్నా..
సాక్షి ప్రతినిధి, చెన్నై: చదువు భారమై.. మానసిక ప్రశాంతతకు దూరమై ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని దారుణమైన రీతిలో తల్లిదండ్రుల ముందే ప్రాణాలు తీసుకుంది. ఈ దయనీయమైన ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన తంగకుమార్ తమిళనాడు రాష్ట్రంలోని అరియలూరు జిల్లాలోని సిమెంట్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడి కుమార్తె అబిదా (19) శ్రీపెరంబుదూరులోని ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతోంది. చదువంటే ఇష్టం లేదు.. అమ్మానాన్నల బలవంతం మీద కాలేజీలో చేరానని హాస్టల్లోని తోటి విద్యార్థుల వద్ద తరచూ వాపోయి.. మానసిక కుంగుబాటుకు లోనైంది. ఈ విషయం ప్రిన్సిపల్‌కు తెలియడంతో తల్లిదండ్రులను పిలిపించాడు. అమ్మాయి బాగా కోలుకున్న తరువాత ఆమెకు ఇష్టమైతేనే కాలేజీకి పంపాలని ఆయన సూచించగా వారు సమ్మతించారు. సోమవారం రాత్రి ఇంటికి బయలుదేరే ముందు.. హాస్టల్ గదిలో ఉన్న సామాన్లు తెచ్చుకుంటానంటూ తల్లిదండ్రులను గౌండ్ ఫ్లోర్లో కూర్చోబెట్టి అబిదా మిద్దెపైకి వెళ్లింది. ఐదో అంతస్తుకు చేరుకుని అక్కడి నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తమ కళ్లముందే అబిదా ప్రాణాలు తీసుకోవడంతో తల్లిదండ్రులు, హాస్టల్ సిబ్బంది తల్లడిల్లిపోయారు. మరో ఘటనలో.. తమ్ముడు తిట్టాడని మరో విద్యార్థిని.. చెన్నై తిరువీక నగర్‌కు చెందిన అశోకన్‌కు ప్లస్ వన్ చదువుతున్న కుమార్తె కావ్య (17) ఉంది. ఆమెకు, తమ్ముడికి మధ్య సోమవారం వాదులాట చోటుచేసుకుంది. తల్లిదండ్రులు ఇద్దరికీ నచ్చజెప్పి బయటకు వెళ్లారు. మనస్థాపానికి గురైన కావ్య గదిలోకి వెళ్లి ఉరివేసుకుంది. అక్కను చూసి ఆందోళన చెందిన తమ్ముడు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. వారొచ్చి కుమార్తెను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చదవండి: నిమిషాల వ్యవధిలో రెండు సార్లు వ్యాక్సిన్.. తట్టుకోలేక.. -
ప్రాణం తీసిన నెట్వర్క్ సమస్య
భువనేశ్వర్: ఆన్లైన్ పాఠాలు వినేందుకు కొండ మీదకు వెళ్లిన విద్యార్థి తిరిగి కిందకు రాలేదు. ప్రమాదవశాత్తు కొండపై నుంచి జారిపడి విద్యార్థి ప్రాణాలు విడిచిన ఘటన రాయగడ జిల్లా, పద్మపూర్ సమితి, పండరగుడలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పండగరగుడలో నివశిస్తున్న ఆంధ్రయ జగరంగ(13).. జగరంగ కటక్ గ్రామంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఏడో తరగతి చదువుతున్నాడు. కోవిడ్ కారణంగా వీరికి కేవలం ఆన్లైన్లోనే పాఠాలు చెబుతున్నారు. గ్రామంలో నెట్వర్క్ సదుపాయం లేకపోవడంతో విద్యార్థులు జగరంగ కొండపైకి వెళ్లి, పాఠాలు వింటుంటారు. ఎప్పటిలాగే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఆంధ్రయ కొండపైకి వెళ్లాడు. వానలు కురుస్తున్న కారణంగా ఆ దారంతా జారుడుగా ఉండడంతో ప్రమాదవశాత్తు అక్కడి కొండపై నుంచి కిందికి జారిపడిపోయాడు. దీంతో అతడి తలకు బలమైన గాయమైంది. ఈ విషయంపై తోటి విద్యార్థులు బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో అతడిని వైద్యసేవల కోసం పద్మపూర్‌లోని ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఉన్నత వైద్యం కోసం అక్కడి నుంచి బరంపురం ఎంకేసీజీ మెడికల్‌కి తరలిస్తుండగా, మార్గం మధ్యంలో ఆ విద్యార్థి చనిపోయాడు. ఈ దుర్ఘటనతో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. -
అమ్మా, నాన్న ఇక సెలవు
పొదలకూరు: కరోనా లాక్డౌన్ సమయంలో తండ్రి వ్యాపారం బాగా దెబ్బతిన్న నేపథ్యంలో.. తీవ్ర మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన బుధవారం రాత్రి శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. సీఐ జి.గంగాధరరావు అందించిన సమాచారం మేరకు.. పొదలకూరు పట్టణానికి చెందిన భార్యా భర్తలు తన్నీరు రాఘవేంద్ర, రత్నమ్మ మెయిన్ బజార్లో కిరాణా దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. వారికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడు. ఆడపిల్లలకు వివాహం చేశారు. కొడుకు తన్నీరు రాజేష్(21) బీఎస్సీ డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కరోనా సమయంలో తండ్రి వ్యాపారం బాగా దెబ్బతిన్న విషయాన్ని గమనించిన రాజేష్ తీవ్ర ఆందోళనకు గురవుతూ వచ్చాడు. అదే ధ్యాసలో ఉంటూ మానసికంగా కుంగిపోయాడు. చదువుపై దృష్టి పెట్టలేక పోయాడు. ఎంతో డబ్బు ఖర్చు చేసి తనను చదివిస్తున్న తల్లిదండ్రులను సరిగా చూసుకోలేమోనని బాధపడుతూ ఉండేవాడు. ఆ ఒత్తిడి తట్టుకోలేక ఎవరూ లేని సమయంలో బుధవారం రాత్రి ఇంట్లోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ‘అమ్మా, నాన్న ఇక సెలవు, తీవ్రమైన ఆలోచనలతో నా చదువు సక్రమంగా సాగడం లేదు. భవిష్యత్తులో మిమ్మల్ని సక్రమంగా చూసుకోలేనని ఆవేదనగా ఉంది. అందుకే మీకు భారం కాకూడదని చనిపోతున్నా’ అంటూ సూసైడ్ నోట్లో వివరించాడు. ఒక్కగానొక్క కొడుకు అఘాయిత్యానికి పాల్పడడంతో రాజేష్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పబ్జీ మత్తులో విద్యార్థి ఆత్మహత్య
-
మార్కుల యజ్ఞంలో విద్యార్థులే సమిధలు
సచిన్ పది పాస్ కాలేదు..అయినా క్రికెట్‌కి దేవుడయ్యాడు.కమల్‌హాసన్ 2వ తరగతే చదివాడు.. దేశం మెచ్చిన మహానటుల్లో ఒకడిగా నిలిచాడు. ఏఆర్ రెహమాన్ స్కూలుకైనా వెళ్లలేదు, అయినా ఆస్కార్‌ను గెలిచాడు. జీవితం ఎవరికీ వడ్డించిన విస్తరి కాదు. కష్టనష్టాల కోరిస్తేనే విజయం విలువ రుచి చూడగలం. బతుకు గొప్పదనం తెలుసుకోగలం. కానీ, నేటి జీవితంలో ఆటపాటలు కరువై, చదువే లోకంగా బతుకుతున్న విద్యార్థులు ఒక్క సబ్జెక్టులో తప్పినా ఆత్మన్యూనతకులోనై వెంటనే ప్రాణాలు తీసుకుంటున్నారు. తప్పు తమది కాకపోయినా.. ప్రాణాలు తీసుకోవడం ఒక్కటే సమస్యకు పరిష్కారం అనుకుంటున్నారు. పరిష్కారం కోసం వెతికే ఓపిక,ఎదిరించే పోరాట పటిమ నేటితరంలో లేకుండా చేసింది కార్పొరేట్ విద్యావ్యవస్థ,అదే నిజమనుకుంటున్న తల్లిదండ్రులదే అసలైన తప్పు అంటున్నారు సామాజిక వేత్తలు. రెక్కలు కత్తిరించిన స్వేచ్ఛ ఎందుకు? పిల్లలకు అడిగినా, అడగకపోయినా అన్నీ ఇస్తున్నారు నేటికాలం తల్లిదండ్రులు. కానీ స్వేచ్ఛారెక్కలు కత్తిరించి తాము చెప్పినట్లు ర్యాంకుల కోసం చదవమంటున్నారు. కష్టాలు వచ్చినప్పుడు ఎదుర్కొనే నేర్పరితనం, నాయకత్వ లక్షణాలు అస్సలు కనిపించడం లేదు. పైగా ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై, న్యూక్లియర్ ఫ్యామిలీలు పెరగడం కూడా పిల్లల మానసిక ఒత్తిడికి మరో కారణం. తల్లిదండ్రులు కాకుండా ఓదార్చే కుటుంబ సభ్యులెవరూ లేకపోవడం కూడా సమస్యను పెంచుతోంది. ఏటా 3 లక్షలమంది ఎంసెట్ రాస్తున్నారు. ఐఐటీ, ఐఐఎంలో ఉండే 1000 సీట్లు రాకుంటే వారు అనర్హుల కింద లెక్కగట్టే ధోరణి మారాలి. ప్రొ. డాక్టర్ సతీశ్‌కుమార్, సామాజిక వేత్త ఆటపాటలు, స్కౌట్స్, ఎన్సీసీ అంటే తెలియవు! ఇప్పుడు పిల్లల్లో ఆటపాటలు లేవు. కార్పొరేట్ జైళ్లలో కాలేజీలు. అందుకే, పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అదే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు ఆటపాటలు, స్కౌట్స్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వంటి అంశాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి నుంచి సమస్యలపై పోరాడే తత్వం అలవడుతుంది. దేశభక్తి, సామాజిక బాధ్యత పెరుగుతాయి. ఓడిపోయినా.. కుంగిపోకుండా విజయం సాధించే పోరాటతత్వం, అవసరమైనప్పుడు నలుగురికి నేతృత్వం వహించే నాయకత్వ లక్షణాలు నేర్చుకుంటున్నారు. కానీ, ప్రైవేటు, కార్పొరేట్ విద్యార్థుల్లో ఇవేమీ కానరావడం లేదంటే అతిశయోక్తి కాదు. స్మార్ట్ఫోన్లు, సోషల్ మీడియాలో గంటలకొద్దీ గడుపుతూ విపరీత మనస్తత్వాన్ని పెంచుకుంటున్నారు. ఫలితాలు వచ్చినప్పటి నుంచి 18 మంది.. ఈసారి ఇంటర్ ఫలితాల్లోతీవ్ర గందరగోళం నెలకొంది. లెక్కకుమించిన తప్పులతో విద్యార్థులు తమ ప్రమేయం లేకుండా ఫెయిల య్యారు. చివరికి తమది తప్పు కాదని తెలిసినా విద్యార్థులు జీర్ణించుకోలేక పోతున్నారు. సమస్యపై పోరాడలేక చేతులెత్తేస్తున్నారు. తమ ప్రతిభను ర్యాంకులు, గ్రేడులు అంటూ తూకమేసి కొలుస్తున్న ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలో ఇమడలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇంటర్ ఫలితాలు వెలువడిన నాటి నుంచి నేటి వరకు దాదాపుగా 18 మంది విద్యార్థులు కన్నవారికి కడుపుకోత మిగిల్చారు. లోపం ఎక్కడుంది? విద్యార్థులు మరీ ఇంత సున్నిత మనస్కులుగా తయారవడానికి మనమే కారణమంటున్నారు సామాజికవేత్తలు. పిల్లలు పది పాస్ కాగానే, కార్పొరేట్ కాలేజీల్లో చేర్పించడం, సమాజానికి దూరంగా, చదువేలోకంగా, బ్రాయిలర్ కోళ్లలా రాత్రింబవళ్లు చదువుతున్నారు. తమ సంతానం ఇంజనీర్, డాక్టర్ అవ్వాలని పుట్టగానే డిసైడ్ చేస్తున్నారు తల్లిదండ్రులు. పిల్లల ఇష్టంతో పనిలేదు. వారికి కష్టం అంటే తెలియకుండా కాలు కందనీయకుండా, ఆటపాటలకు దూరంగా చదువే పరమావధిగా ఉండే స్కూళ్లు, కాలేజీల్లో వేస్తున్నారు. 90 శాతం రాకపోతే అసలు అది చదువే కాదన్న మానసిక స్థితికి పిల్లలను తీసుకువస్తున్నారు. అలాంటి పిల్లలు అకస్మాత్తుగా వ్యతిరేక ఫలితాలు చూసి తట్టుకోలేక తనువు చాలిస్తున్నారు. పిల్లలకు భరోసా ఇవ్వండి ఫెయిలైన పిల్లలకు తల్లిదండ్రులు ముందు ధైర్యం చెప్పాలి. తప్పె క్కడ జరిగిందో అన్వేషించాలి. ఆత్మహత్యల వార్తలు, దృశ్యాల నుంచి పిల్లలను దూరంగా ఉంచాలి. నేటి పిల్లలు తెలివైన వారు, కాకపోతే సున్నిత మనస్కులు. సమస్య పరిష్కారమయ్యే వరకు వెంట ఉంటామన్న భావన కుటుంబ సభ్యులు వారిలో కల్పించాలి. అప్పటికీ మార్పు లేకపోతే కౌన్సెలింగ్ ఇప్పించాలి. - సుమతి, ఎస్పీ, విమెన్ ప్రొటెక్షన్ సెల్ -
గురుకులం.. సమస్యలకు నిలయం..
సాక్షి, ఇల్లెందుఅర్బన్: పట్టణంలోని 24 ఏరియాలో ఉన్న బాలికల కోసం ఏర్పాటు చేసిన ఎస్సీ గురుకుల పాఠశాల సమస్యలకు నిలయంగా మారింది. చాలీచాలని గదుల్లో విద్యార్థినులు కాలం వెళ్లదీస్తున్నారు. పాఠశాలకు పక్కా భవనం లేదు. నిరుపయోగంగా ఉన్న సివిల్ కార్యాలయం భవనాన్ని గురుకులానికి అప్పజెప్పారు. పాఠశాలలో 5 నుంచి 8వ తరగతి చదివే విద్యార్థులు సుమారు 320మంది ఉన్నారు. ఈ భవనంలో 18 గదులు ఉండగా వీటిల్లో 8గదుల్లో విద్యార్థినులకు విద్యాబోధన కొనసాగుతోంది. మిగిలిన గదుల్లో బస చేయడానికి వినియోగిస్తున్నారు. అరకొర గదుల వల్ల వరండాలోనే చిన్నారులకు విద్యాబోధన చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఒక్కో గదుల్లో సుమారు 40మందికి పైగా విద్యార్థినులు నిద్రిస్తున్నారు. పాఠశాలకు సింగరేణి నీరే దిక్కు. ఈ నీరు నెలలో ఐదారు రోజులు వరుసగా నిలిచిపోవుతుండటంతో విద్యార్థినుల బాధలు వర్ణనాతీతం. వేసవి కాలంలో పరిస్థితి మరింత దయనీయంగా ఉంటోంది. ఆటస్థలం కరువు.. విద్యార్థినులకు ఆటస్థలం లేకుండాపోయింది. పాఠశాలకు సమీపంలో ఉన్న సింగరేణి ఆటస్థలాన్ని అప్పుడప్పుడు వినియోగించుకుంటున్నారు. సంపూర్తిగా ఆటస్థలం అందుబాటులో లేకపోవడంతో విద్యార్థినులు క్రీడలకు దూరమవుతున్నారు. క్రీడల్లో రాణించే సత్తా ఉన్న విద్యార్థినులు నిరుత్సాహానికి గురవుతున్నారు. పక్కాభవనం నిర్మాణానికి మంజూరు కాని నిధులు.. ఎస్సీ బాలికల గురుకులం పాఠశాలకు పక్కా భవనం నిర్మించేందుకు ప్రభుత్వం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల పక్కనే.. సుమారు 8 ఎకరాల భూమిని కేటాయించారు. కానీ నిర్మాణాకి నిధులు మంజూరు కాలేదు. దీంతో పనులు మొదలు కావడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పక్కా భవనం నిర్మాణానికి నిధులను మంజూరు చేయాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యార్థినులకు వసతులు కొదువుగా ఉన్నాయి.. ఎస్సీ బాలికల గురుకులంలోని విద్యార్థినులకు సరిపడా గదులు లేకపోవడంతో కొంత మేరకు ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా పక్కా భవనానికి స్థలం కేటాయించారు. కాని నిధులు మంజూరు కాకపోవడంతో నిర్మాణం జాప్యమవుతోంది. వైరా నియోజకవర్గంలోని కారేపల్లి మండలంలో.. ఓ ఇంజనీరింగ్ భవనాకి గురుకులాన్ని తరలించేందుకు ప్రయత్నిస్తున్నాం. -ఎస్కె.పాషా, గురుకులం ప్రిన్సిపాల్, ఇల్లెందు -
చదువుకు సాయం
శ్రీకాకుళం: నిరుపేద బ్రాహ్మణ విద్యార్థులు చదువుకోవడానికి ఓ సాయం అందుబాటులో ఉంది. బ్రాహ్మణ విద్యార్థుల విద్యాభ్యాసానికి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ (ఏబీసీ) లిమిటెడ్ ఆధ్వర్యంలో ‘భారతీ విద్యా పథకం’ అమలు చేస్తున్నారు. విద్యార్థి చదువుకు ఏటా ఈ పథకం లో నగదు ప్రోత్సాహకం అందిస్తారు. అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్ 30లోపు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి. అర్హతలు... ⇒ విద్యార్థి తల్లిదండ్రులు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర నివాసితులై ఉండాలి. ⇒ 1 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో అనాథ పిల్లలు లేదా తల్లిదండ్రుల్లో ఒక్కరే ఉన్న వారు మాత్రమే అర్హులు. ⇒ దరఖాస్తుదారులు ప్రభుత్వ గుర్తింపు గల సంస్థల్లో చదువుతూ ఉండాలి. ⇒ తల్లితండ్రులు/సంరక్షకుని వార్షిక ఆదాయం రూ. 3 లక్షల లోపు ఉండాలి. ⇒ 2016-17 సంవత్సరంలో పాఠశాల/కళాశాల/ఇన్స్టిట్యూట్/ విశ్వవిద్యాలయంలో రెగ్యులర్ కోర్సు చదువుతూ ఉండాలి. ⇒ ముందు సంవత్సరంలోని చదువు లో అన్ని సబ్జెక్టులు ఉత్తీర్ణులై ఉండాలి. ⇒ విద్యార్థి ఇతర ప్రభుత్వ పథకాల్లో ఎలాంటి లబ్ధి పొంది ఉండరాదు. అయితే అర్చక సంక్షేమ ట్రస్ట్ ద్వారా లబ్ధి పొందిన విద్యార్థులు మాత్రం ఈ పథకానికి కూడా అర్హులే. దరఖాస్తు చేసుకోండిలా.. ⇒ దరఖాస్తులను ఆన్లైన్లో www.and-h-ra-bra-h-m-in.ap.go-v.in వెబ్సైట్లో సెప్టెంబర్ 30లోపు పొందుపర్చాలి. సమాచారం కోసం టోల్‌ఫ్రీ నం : 1800 102 3579లో సంప్రదించవచ్చు. ⇒ దరఖాస్తుతోపాటు వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సిన ధ్రువీకరణ పత్రాలు ⇒ ఒక్కొక్కటీ 250 కేబీ లోపు పీడీఎఫ్ ఫార్మెట్లో ఉండాలి. ఏ కోర్సుకు దరఖాస్తుతోపాటు ఏయే ధ్రువీకరణ పత్రాలు అప్లోడ్ చేయాలో ఏబీసీ వెబ్సైట్లో పొందుపరిచారు. ⇒ విద్యార్థి రాష్ట్రంలో చదివితే ఆంధ్రాబ్యాంకు ఖాతా, రాష్ట్రం వెలుపల చదివితే ఏ జాతీయ బ్యాంక్ ఖాతా అయినా తప్పనిసరిగా ఉండాలి. ⇒ ఎంపిక విధానంలో అనాథ, ఒంటరి తల్లి, శారీరక వైకల్యం, బాలిక, ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రాధాన్యత క్రమం పాటిస్తారు. నిర్ణీత మొత్తాన్ని ఒకే దఫాగా ఎంపిక చేసిన విద్యార్థుల సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో జమచేస్తారు. -
టీచర్ల గైర్హాజర్‌తో విద్య కుంటు
రాష్ట్రస్థాయి సెమినార్లో తళవార్ ఆవేదన కోలారు : రాష్ట్రంలో ఉపాధ్యాయులు 45 శాతం పాఠశాలకు గైర్హాజర్ అవుతున్నారని, ఇది విద్యార్థుల విద్యపై తీవ్ర ప్రభావం చూపుతోందని బెంగుళూరు విశ్వ విద్యాలయం విద్యా విభాగం ప్రముఖుడు ఎంఎస్ తళవార్ విచారం వ్యక్తం చేశారు. నగర సమీపంలోని హేమాద్రి బీఎడ్ కళాశాలలో గుణాత్మక విద్యపై ఉపాధ్యాయుల ముందున్న సవాళ్లపై రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి సెమినార్‌ను శుక్రవారం ప్రారంభించిన ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులు పాఠశాలకు వెళ్లి హాజరు పుస్తకంలో సంతకం చేసి తరగతులకు మాత్రం వెళ్లడం లేదన్నారు. దీంతో విద్యార్థులకు గుణాత్మక విద్య లభించడం లేదన్నారు. 50 శాతం మంది పిల్లలకు తమ మాతృభాషలో తమ పేరు రాయడం రాదంటే మనం విద్యార్థులకు ఎలాంటి విద్యను అందిస్తున్నామని ఆలోచించాలన్నారు. సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం పిల్లలకు రోజుకు ఒకటిన్నర గంట కాలం మాత్రమే తరగతి గదిలో కూర్చునే ఉత్సాహం ఉంటుందని, కాని నేడు పాఠశాలల్లో నిత్యం పిల్లలను పాఠాలు చెబుతూనే ఉన్నారని అన్నారు. యువత విద్యకు దూరమైతే సమాజంలో అరాచకత్వం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బుద్ధమార్గ స్మరణ సంచికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో హేమాద్రి విద్యా సంస్థ అధ్యక్షుడు ఎస్బీ మునివెంకటప్ప, డెరైక్టర్ హేమంత్, డాక్టర్ పూర్వి, జయలక్ష్మి మునివెంకటప్ప తదితరులు పాల్గొన్నారు.