
పొదలకూరు: కరోనా లాక్‌డౌన్ సమయంలో తండ్రి వ్యాపారం బాగా దెబ్బతిన్న నేపథ్యంలో.. తీవ్ర మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన బుధవారం రాత్రి శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. సీఐ జి.గంగాధరరావు అందించిన సమాచారం మేరకు.. పొదలకూరు పట్టణానికి చెందిన భార్యా భర్తలు తన్నీరు రాఘవేంద్ర, రత్నమ్మ మెయిన్ బజార్లో కిరాణా దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. వారికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడు. ఆడపిల్లలకు వివాహం చేశారు. కొడుకు తన్నీరు రాజేష్(21) బీఎస్సీ డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
కరోనా సమయంలో తండ్రి వ్యాపారం బాగా దెబ్బతిన్న విషయాన్ని గమనించిన రాజేష్ తీవ్ర ఆందోళనకు గురవుతూ వచ్చాడు. అదే ధ్యాసలో ఉంటూ మానసికంగా కుంగిపోయాడు. చదువుపై దృష్టి పెట్టలేక పోయాడు. ఎంతో డబ్బు ఖర్చు చేసి తనను చదివిస్తున్న తల్లిదండ్రులను సరిగా చూసుకోలేమోనని బాధపడుతూ ఉండేవాడు. ఆ ఒత్తిడి తట్టుకోలేక ఎవరూ లేని సమయంలో బుధవారం రాత్రి ఇంట్లోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ‘అమ్మా, నాన్న ఇక సెలవు, తీవ్రమైన ఆలోచనలతో నా చదువు సక్రమంగా సాగడం లేదు. భవిష్యత్తులో మిమ్మల్ని సక్రమంగా చూసుకోలేనని ఆవేదనగా ఉంది. అందుకే మీకు భారం కాకూడదని చనిపోతున్నా’ అంటూ సూసైడ్ నోట్లో వివరించాడు. ఒక్కగానొక్క కొడుకు అఘాయిత్యానికి పాల్పడడంతో రాజేష్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment