భారతీయ విద్యార్థులకు షాకే.. | Trump Shock To Indian Students | Sakshi
Sakshi News home page

అప్పులు చేసి అమెరికా వెళ్లిన వారికి ఊహించని దెబ్బ!

Published Wed, Feb 5 2025 12:27 PM | Last Updated on Wed, Feb 5 2025 12:49 PM

Trump Shock To Indian Students

ట్రంప్‌ నిర్ణయాలపై తీవ్ర వ్యతిరేకత

 

నిజామాబాద్‌: భవిష్యత్‌పై ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లిన వారు ట్రంప్‌ Donald Trump నిర్ణయాలతో ఆందోళన చెందుతున్నారు. అక్కడ ఉద్యోగులు చేస్తున్న, మాస్టర్స్‌ పూర్తి చేసిన వారు తమ పరిస్థితి ఏమిటని అంటున్నారు. తమ పిల్లలు అమెరికా వెళ్లేందుకు అప్పులు చేశామని, బ్యాంక్‌ లోన్‌లు తీసుకున్నామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్‌ నిర్ణయాలు ఊహించని దెబ్బ అని, కేంద్ర ప్రభుత్వం స్పందించి భారతీయులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

 దేశాలు అంగీకరించవు
నా కుమారుడు అమెరికాలో మాస్టర్స్‌ చేశాడు. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పదేళ్లుగా ఉద్యోగం చేస్తున్నాడు. మేథస్సు ఎవరి సొత్తు కాదు. భారతీయ విద్యార్థులను ఆపడం ఎవరితరం కాదు. ఈ గ్లోబలైజేషన్‌లో ఎవరు ఎక్కడైనా ఉద్యోగాలు చేసుకోవచ్చు. బలవంతపు నిరాకరణ సరికాదు. ప్రపంచ దేశాలు ట్రంప్‌ నిర్ణయాన్ని అంగీకరించవు. 


– గంగాధర్, విశ్రాంత అధ్యాపకుడు, కంఠేశ్వర్‌

ట్రంప్‌ నిర్ణయం కోర్టుల్లో చెల్లదు
నా కుమార్తె లాస్‌ఎంజెల్స్‌లో ఉద్యోగం చేస్తోంది. కొన్నేళ్లుగా సాఫ్ట్‌వేర్‌ డెవలర్‌గా టీమ్‌ను లీడ్‌ చేస్తోంది. ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం దిగ్భ్రాంతికి గురిచేసింది. అయినా ఆయన నిర్ణయం కోర్టుల్లో చెల్లదు. అమెరికాలోని బిజినెస్‌మెన్‌లే ముందుగా  వ్యతిరేకిస్తారు. అమెరికేతర సాఫ్టువేర్‌ నిపుణులతోనే అక్కడి కంపెనీలు నడుస్తున్నాయి.  


– రాజేంద్రకుమార్, డిప్యూటీ కమిషనర్‌

ఇబ్బందులు తప్పవు
ప్రస్తుత గ్లోబలైజేషన్‌ యుగంలో ఎవరు ఎక్కడైనా వెళ్లొచ్చు, ఏ దేశంలోనైనా పని చేసుకోవచ్చు. ఒకే దేశంలో పని చేయాలని ఏం లేదు. ఆసియా దేశాల కారణంగా అమెరికా ఎకనామీ పెరుగుతుంది. చాలా మంది స్టూడెంట్‌ వీసా, ఎస్‌బీ – 1 వీసాపై వెళ్లి అక్కడ సెటిల్‌ అయ్యారు. కొంతమంది  లీగల్‌గా ఉన్నా వారికి కూడా భవష్యత్‌లో ఇబ్బందులు తప్పవు.  


– జలగం తిరుపతిరావు, ప్రొఫెసర్, జనరల్‌ మెడిసిన్‌

విద్యార్థులకు న్యాయం చేయాలి
మన విదేశాంగశాఖ మంత్రి, ప్రధాని మోడీ  దౌత్యపరమైన నిర్ణయాలతో అమెరికాలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా న్యాయం చేయాలి. మేక్‌ ఇన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియాను దృష్టిలో పెట్టుకొని దేశ ఆర్థికాభివృద్దిలో విద్యార్థులు భాగస్వాములయ్యేలా ఆలోచన చేయాలి.  ట్రంప్‌ నిర్ణయంతో అమెరికాలో ఉన్న ప్రతి ఒక్కరికీ నష్టం జరుగుతుంది.


– కెంపుల నాగరాజు, జిల్లా అధ్యక్షుడు, తెలంగాణ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ 

ట్రంప్‌ నిర్ణయాలు సరైనవి కావు..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయాలు సరైనవి కావు. భారతీయులకు ఇబ్బందికరమైనవి. విద్యార్థులకు గతంలో కొనసాగిన విధానాలనే కొనసాగించాలి. ట్రంప్‌ తన నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలి. అమెరికాలో భారతీయులకు గతంలో ఉన్న విధివిధానాలనే కొనసాగిస్తూ నిర్ణయాలు అమలు చేయాలి.  


– లాల్‌సింగ్, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్, తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక

ప్రభుత్వం స్పందించాలి
భారత ప్రభుత్వం అమెరికా నుంచి తిరిగివచ్చినవారికి న్యాయం చేయాలి. అలాగే అమెరికా అమలు చేస్తున్న నూతన విధివిధానాలపై ఆ దేశంతో మాట్లాడాలి. భారతీయులకు నష్టం జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ట్రంప్‌ నిర్ణయాలు సరైనవికావు.


– రఘురాం, ఏఐఎస్‌ఎఫ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement