
మన విద్యార్థులకు ట్రంప్ కష్టాలు
అటు బ్యాంక్ రుణాలు.. ఇటు అమెరికా ఖర్చులు
పార్ట్‌టైమ్ జాబ్స్ వదిలేయాల్సిన పరిస్థితి
పిల్లల పరిస్థితికి తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు
హైదరాబాద్‌లోని మీర్జాలగూడ (Mirjalguda) నివాసితులైన దంపతుల కుమారుడు ప్రస్తుతం కాలిఫోర్నియాలో పీజీ చేస్తున్నాడు.. ఖర్చుల కోసం తల్లిదండ్రులపై ఆధారపడకుండా ఉండాలని, అక్కడే ఒక హోటల్‌లో హౌస్ కీపింగ్ విభాగంలో పనిచేస్తున్నాడు. అది కూడా వారానికి రెండు రోజులు మాత్రమే.. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రతిరోజూ తల్లిదండ్రులకు ఫోన్ చేస్తూ ఉద్యోగం మానేయాలా వద్దా? లేక అమెరికా(United States of America) నుంచి తిరిగి వచ్చేయాలా? అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.
నగరంలో నివసించే దంపతుల ఇద్దరు కుమారులూ అమెరికాలో ఉన్నత చదువులు చదువుతున్నారు. అక్కడ పంజాబ్‌కు చెందిన ఆభరణాల వ్యాపారుల దగ్గర మంచి వేతనానికి పనిచేస్తున్నారు. వీరు ఇంకా ఉద్యోగం మానమని చెప్పినా వినకపోవడంతో తల్లిదండ్రులు వీరి గురించి ఆందోళన చెందుతున్నారు.
⇒ కొన్నేళ్లుగా అటు చదువు.. ఇటు పార్ట్ టైమ్ ఉద్యోగాలతో(Part time Job) అటు చదువు కోసం చేసిన అప్పుల్ని అమెరికాలో జీవన వ్యయాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్న పలువురు నగర విద్యార్థుల పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలు చేస్తున్న కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాలతో బహిష్కరణ భయాల మధ్య యునైటెడ్ స్టేట్స్
(యూఎస్)లోని మన విద్యార్థులు పార్ట్‌టైమ్ ఉద్యోగాలను వదులుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.
నిన్నా మొన్నటి దాకా..
మధ్యతరగతికి చెందినప్పటికీ స్థోమతకు మించి విదేశీ విద్యను ఎంచుకున్న మన విద్యార్థుల్లో అత్యధికులు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చదువు కోసం చేసిన భారీ రుణాలను తిరిగి చెల్లించడంతో పాటు అక్కడి జీవన వ్యయాలను భరించడానికి పార్ట్ టైమ్ ఉద్యోగాలపై ఆధారపడుతూ వచ్చిన విద్యార్థుల్లో ప్రస్తుతం తీవ్ర ఆందోళన నెలకొంది. ఇది తదుపరి ఉన్నత చదువులకు అడ్మిషన్లపై ప్రభావం చూపక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. నిన్నా మొన్నటి దాకా అమెరికాకు అత్యధిక సంఖ్యలో విద్యార్థులను పంపిన మన రాష్ట్రం నుంచి భవిష్యత్తులో అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నవారిని ఈ పరిస్థితులు పునరాలోచనలో పడేస్తున్నాయి.
ఉద్యోగాలకు అనుమతి ఉన్నా..
హెచ్–1 వీసాలపై అమెరికాలో ఉన్న విద్యార్థులు తాము చదువుతున్న క్యాంపస్‌లోనే వారానికి 20 గంటల వరకు పనిచేయడానికి అనుమతిస్తారు. అయితే కాలేజీ క్యాంపస్‌లలో పనిచేసేందుకు అనుమతి ఉన్నప్పటికీ అక్కడ తగినన్ని ఉద్యోగావకాశాలు లేకపోవడం లేదా అక్కడ ఆశించిన ఆదాయం రాకపోవడంతో చాలా మంది విద్యార్థులు ఖర్చుల్ని భరించడం కోసం క్యాంపస్ వెలుపల రెస్టారెంట్లు, గ్యాస్ స్టేషన్లు, రిటైల్ స్టోర్‌లలో అనధికారికంగా పనిచేస్తున్నారు.
⇒ కాలేజీ సమయం ముగిసిన తర్వాత ఒక చిన్న
కేఫ్‌లో ప్రతిరోజూ 6 గంటలు పని చేసేవాడిని. గంటకు 7 డాలర్లు చొప్పున లభించేవి. ప్రస్తుతం ఇమ్మిగ్రేషన్ అధికారుల కఠిన వైఖరితో వారం రోజుల క్రితం పని వదిలేశా.. ఇది ఇబ్బంది పెట్టే సంగతే.. అయినా ఇక్కడ చదువుకోవడానికి 50,000 డాలర్లు(సుమారు రూ.43.5 లక్షలు) రుణం తీసుకున్నా. జాబ్ కోసం చదువును పణంగా పెట్టే పరిస్థితిలో లేను’ అని ఇల్లినాయిస్‌లో గ్రాడ్యుయేట్ చేస్తున్న విద్యార్థి
ధ్రువన్ చెప్పాడు.
⇒ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వ్యాపార సంస్థలు కూడా చెల్లుబాటయ్యే వర్క్ వీసాలు కలిగిన వ్యక్తులను మాత్రమే నియమించుకోవడం ప్రారంభించాయి. గతంలో స్థానిక వ్యాపారాలు, ముఖ్యంగా భారతీయ రెస్టారెంట్లు, కిరాణా దుకాణాలు మన విద్యార్థులపై ఆధారపడేవి. ఇప్పుడు, వారు విద్యార్థులను తొలగించి, చెల్లుబాటు అయ్యే జాబ్ వీసాలో ఉన్నవారిని నియమించుకుంటున్నారు.
న్యూయార్క్‌లో మాస్టర్స్ చదువుతున్న ఓ విద్యార్థిని నేహా మాట్లాడుతూ ‘పని ప్రదేశాలలో తనిఖీలు చేస్తున్నారు.. దాంతో నన్ను నా ఫ్రెండ్స్‌ను పార్ట్‌టైమ్ ఉద్యోగాలు మానేయాలని మాకు జాబ్స్ ఇచ్చినవారు వెళ్లగొట్టారు. ఇది చాలా కష్టం, కానీ పూర్తి బహిష్కరణకు గురికావడం లేదా మా విద్యార్థి వీసా స్థితిని కోల్పోవడం మరింత నష్టం. నన్ను ఇక్కడికి పంపించడానికి నా తల్లిదండ్రులు ఇప్పటికే చాలా రకాల త్యాగాలు చేశారు’ అని చెప్పింది.
ఈ పరిస్థితులపై ఇమ్మిగ్రేషన్ న్యాయవాది ఒకరు మాట్లాడుతూ ‘విద్యార్థులు క్యాంపస్ వెలుపల పనిచేయడం అక్కడ చట్టవిరుద్ధం. మునుపటి పాలకుల్లా కాకుండా ప్రస్తుత ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో హెచ్1బీ, గ్రీన్‌కార్డ్‌లతో పాటు తమ భవిష్యత్ ఇమ్మిగ్రేషన్ అవకాశాల గురించి విద్యార్థులు భయపడుతుండటం సహజమే’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment