ట్రంప్‌తో ట్రబుల్సే.. అక్కడెందుకిక.. ఇంటికొచ్చేయక | Indian parents demand children be brought back from America | Sakshi
Sakshi News home page

ట్రంప్‌తో ట్రబుల్సే.. అక్కడెందుకిక.. ఇంటికొచ్చేయక

Published Mon, Feb 10 2025 3:10 AM | Last Updated on Mon, Feb 10 2025 5:25 AM

Indian parents demand children be brought back from America

అమెరికా నుంచి పిల్లలను తిరిగొచ్చేయాలంటున్న భారతీయ తల్లిదండ్రులు

సాక్షి, హైదరాబాద్‌: అమెరికా రాజకీయ ముఖచిత్రం మారిపోవడంతో.. అక్కడ చదువుకుంటున్న మన దేశ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన పెరుగుతోంది. మెజారిటీ భారతీయ(Indian) విద్యార్థుల(Students)కు ఇప్పటికిప్పుడు సమస్య లేకున్నా.. భవిష్యత్‌ ఆశాజనకంగా ఉండదనే భయం వెంటాడుతోంది. పార్ట్‌ టైం ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి లేక.. జీవన వ్యయం సమకూర్చుకునే దారిలేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. డబ్బులు పంపాలంటూ భారత్‌లోని తమ కుటుంబాలను కోరుతున్నారు.

ఇప్పటికే అప్పులు చేసి పిల్లలను అమెరికా పంపిన తల్లిదండ్రులు(Indian parents) తలకు మించిన భారం మోయలేక అల్లాడుతున్నారు. ఈ క్రమంలో మన దేశంలో పరిస్థితి బాగుంటుందనే అంచనాలను గుర్తు చేసుకుంటూ.. పిల్లలను తిరిగి వచ్చేయాలని కోరుతున్నారు. మరోవైపు మన దేశంలో కృత్రిమ మేధ (ఏఐ) నిపుణులకు డిమాండ్‌ పెరగడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే దిశగా
కోవిడ్‌ తర్వాత ఐటీ రంగం క్రమంగా కుదేలైంది. ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో అమెరి­కాలో ఎంఎస్‌ (ఇంజనీరింగ్‌ పీజీ) చేయడం, అక్కడే ఉద్యోగం సంపాదించడం విద్యార్థుల లక్ష్యంగా మారింది. ఫలితంగా అమెరికా వెళ్లే భారతీ­యుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం అమెరికాలో 11.26 లక్షల మంది విదేశీ విద్యార్థులున్నారు. అందులో 29 శాతం భారతీయులే. 2022–23లో 1,96,567 మంది, 2023–24లో 3,31,602 మంది అమెరికా వెళ్లారు. వారికి నాలుగేళ్ల వీసా ఇస్తారు. ఎంఎస్‌ రెండేళ్లు ఉంటుంది. మిగతా రెండేళ్లలో పూర్తిస్థాయి ఉద్యోగం పొందితే అక్కడే కొన­సాగవచ్చు.

దీనికోసం మనవాళ్లు చదువు పూర్త­వగానే తాత్కాలిక ఉద్యోగాల కోసం ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (ఓపీటీ) చేస్తారు. ఈ శిక్షణ కోసం ఈ ఏడాది 97,556 మంది నమోదు చేసు­కున్నారని.. ఇది గతేడాదికన్నా 41 శాతం ఎక్కు­వని అమెరికన్‌ ఎంబసీ ఇటీవలే వెల్లడించింది. మన దేశం నుంచి వెళ్లిన విద్యార్థులు కన్సల్టెన్సీల ద్వారా ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం పొంది వీసాను పొడిగించుకోవడం, అవకాశాన్ని బట్టి పార్ట్‌ టైం ఉద్యోగాలు చేసి డబ్బు సంపాదించడం జరుగుతూ వస్తోంది. కానీ.. డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడవటంతో పార్ట్‌టైం ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి. భవిష్యత్తులో హెచ్‌1–బి వీసా రావడం కష్టమనే భావన బలపడుతోంది.

కొన్ని నెలల్లో పరిస్థితి చక్కబడే చాన్స్‌
మరోవైపు అమెరికాలో ప్రస్తుత పరిస్థితి మూడు, నాలుగు నెలలకు మించి ఉండదనే నమ్మకం మన వారిలో కనిపిస్తోంది. అక్కడి హోటల్స్, చిన్నాచితకా వ్యాపార సంస్థల్లో పనిచేయడానికి మానవ వనరులు అవసరమని.. ఎల్లకాలం పార్ట్‌ టైం ఉద్యోగాలను అడ్డుకోలేరని కొందరు విద్యార్థులు అంటున్నారు.

ఇదే మంచి చాన్స్‌..
ఏఐ దూకుడు చూస్తుంటే ఇండియాలోనూ మంచి అవకాశాలు లభిస్తాయని చాలామంది తల్లిదండ్రులు భావిస్తున్నారు. అమెరికన్‌ ఐటీ కంపెనీలు ప్రాజెక్టుల కోసం ఇండియాలో మానవ వనరులపై ఆధారపడటం పెరిగిన నేపథ్యంలో.. డేటా సైన్స్, ఏఐ అంశాల్లో ఎంఎస్‌ చేసినవారు మంచి ఉద్యోగం పొందవచ్చని భావిస్తున్నారు. ఇంకా అమెరికాలో వేచి చూస్తే.. అప్పటికే ఇండియాలో ఉద్యోగులకు అనుభవం పెరుగుతుందని, తర్వాత వస్తే ప్రయోజనం ఉండదని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు.

భారత్‌లోని కన్సల్టెన్సీలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ఇప్పుడు సాధారణ ఐటీ ఉద్యోగాలు తగ్గినా.. ఏఐ ఎంఎల్, బ్లాక్‌చైన్, ఏఆర్‌వీఆర్, సైబర్‌ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఓపెన్‌ టెక్నాలజీ వంటి నైపుణ్యాలకు డిమాండ్‌ పెరిగిందని స్పష్టం చేస్తున్నాయి. దేశంలో 2026 నాటికి 10 లక్షల మంది ఏఐ నిపుణులు అవసరమని వీబాక్స్‌ అనే కన్సల్టెన్సీ సంస్థ అంచనా వేసింది. ఏఐపై పనిచేస్తున్న ఉద్యోగులు భారత్‌లో ప్రస్తుతం 4.16 లక్షల మంది ఉన్నారు. ఫిక్కీ అంచనా ప్రకారం.. ఈ ఏడాది చివరి నాటికి 6.29 లక్షల మంది, 2026 నాటికి 10 లక్షల మంది అవసరం. దీంతో ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేసుకోవడం మేలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావిస్తున్నారు.

కష్టంగానే ఉంది
డేటా సైన్స్‌పై ఎంఎస్‌ చేశాను. ఇంతకాలం స్కిల్‌ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ పార్ట్‌ టైం జాబ్‌ చేశాను. ఇప్పుడు పార్ట్‌ టైం చేయడం కష్టంగా మారింది. ఇంకో మూడు నెలలు ఈ పరిస్థితి ఉండొచ్చు.  అప్పుచేసి యూఎస్‌ వచ్చాను. ఇంటి దగ్గర్నుంచి 
ఇంకా డబ్బులు తెప్పించుకోవడం ఇబ్బందే.     – కృష్ణమోహన్‌ దూపాటి, అమెరికాలో భారతీయ విద్యార్థి

కొంత ఆశ ఉంది
రూ.40 లక్షలు అప్పు చేసి అమెరికా వచ్చాను. పార్ట్‌ టైం ఉద్యోగం చేసే పరిస్థితి లేక, ఖర్చులు పెరిగి ఇబ్బందిగా ఉంది. ఇంకో ఏడాది అయితే ఎంఎస్‌ పూర్తవుతుంది. తర్వాత ఇండియాలోనే మంచి ఉద్యోగం చూసుకోవచ్చని మా నాన్న చెబుతున్నారు. నాకూ అదే మంచిదనిపిస్తోంది.     – నవీన్‌ చౌదరి, అమెరికాలో ఎంఎస్‌ చేస్తున్న వరంగల్‌ విద్యార్థి

ఇండియాలో బూమ్‌ ఉంటుంది
అమెరికాలోనే జాబ్‌ చేయాలనే ఆశలు పెట్టుకోవడం మంచిది కాదు. భవిష్యత్‌ మొత్తం ఏఐదే. ఇప్పుడిప్పుడే భారత్‌లో దానికి డిమాండ్‌ పెరుగుతోంది. నిపుణుల కొరత ఉంది. అమెరికాలో ఎంఎస్‌ చేసిన విద్యార్థులకు మన దేశంలోనే మంచి వేతనంతో ఉద్యోగాలు వచ్చే చాన్స్‌ ఉంది.     – విశేష్‌ వర్మ, ఏఐ ఆధారిత కంపెనీలో హెచ్‌ఆర్‌ మేనేజర్‌

ప్రతీ క్షణం టెన్షనే
ఏడాది క్రితం కుమారుడిని అమెరికా పంపాను.  మా వాడి నుంచి ఇప్పుడు ఫోన్‌ వచ్చిందంటే భయం వేస్తోంది. ఖర్చులకు డబ్బులు అడిగితే ఇవ్వలేక.. ఇప్పటికే ఉన్న అప్పులు తీర్చలేక ఆవేదన పడుతు­న్నాం. ఇండియాలో ఏఐ ఆధారిత ఉద్యోగాలకు మంచి డిమాండ్‌ ఉంటుందని వచ్చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చాను.     – జనార్దన్‌రెడ్డి రేపల్లె, అమెరికా వెళ్లిన విద్యార్థి తండ్రి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement