విద్యార్థుల గుండెల్లో ట్రంప్‌ ‘బెల్స్‌’ | Flight Charges Hiked: Crowd of students and tourists | Sakshi
Sakshi News home page

విద్యార్థుల గుండెల్లో ట్రంప్‌ ‘బెల్స్‌’

Published Sun, Dec 15 2024 4:48 AM | Last Updated on Sun, Dec 15 2024 5:00 AM

Flight Charges Hiked: Crowd of students and tourists

అమెరికాకు పరుగులు తీస్తున్న మన విద్యార్థులు

వచ్చే నెల 20న అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్న ట్రంప్‌

ఇమిగ్రేషన్‌ నిబంధనలు కఠినతరం కావొచ్చనే ఆందోళన

త్వరగా క్యాంపస్‌కు చేరుకోవాలంటూ అమెరికా వర్సిటీల నుంచి నోటీసులు 

విద్యార్థులు, పర్యాటకుల రద్దీతో భారీగా పెరిగిన విమాన చార్జీలు 

తప్పుడు సర్టిఫికెట్లు లేకుంటే ఆందోళన అవసరం లేదంటున్న నిపుణులు

దొడ్డిదారుల్లో, తప్పుడు మార్గాల్లో అమెరికా వెళ్లొద్దని స్పష్టీకరణ

సాక్షి, హైదరాబాద్‌: ‘అమెరికా ఫస్ట్‌’ అన్న అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నినాదం మన విద్యార్థులు, ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ట్రంప్‌ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారీ విజయం సాధించి జనవరి 20న బాధ్యతలు స్వీకరించనుండటం ఒకవైపు మోదాన్ని, మరోవైపు ఖేదాన్ని కలిగిస్తోంది. ప్రతిభావంతులైన నిపుణులకు అమెరికా రెడ్‌ కార్పెట్‌ పరుస్తుందని చెబుతూనే... విద్య, ఉద్యోగ అవకాశాల కోసం వచ్చే వారిపై ఆంక్షలు విధిస్తామని, ఇమిగ్రేషన్‌ నిబంధనలను కఠినతరం చేస్తామని ఎన్నికల సమయంలో ట్రంప్‌ ప్రకటించారు.

ఇది లక్షలాది మంది తెలుగు విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. దీనితో అమెరికాలోని వివిధ విద్యాసంస్థల్లో చదువుకుంటున్న మన విద్యార్ధులు జనవరి 20వ తేదీలోగా అమెరికాకు చేరుకోవాలనే ఉద్దేశంతో పరుగులు పెడుతున్నారు. ఇమిగ్రేషన్‌ నిబంధనలు కఠినతరం కావొచ్చనే ఉద్దేశంతో ఆ దేశ విశ్వవిద్యాలయాలు కూడా విదేశాల్లోని తమ విద్యార్థులు త్వరగా క్యాంపస్‌కు చేరుకోవాలంటూ నోటీసులు ఇస్తున్నాయి. జూమ్‌ మీటింగ్‌లు, వెబ్‌నార్‌లు ఏర్పాటు చేస్తున్నాయి. 

దీనితో సెలవుల కోసం ఇళ్లకు వచ్చిన తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 1.5 లక్షల మందికిపైగా విద్యార్థులు తమ సెలవులు పూర్తికాకుండానే అమెరికాకు పయనం అవుతున్నారు. మరోవైపు ట్రంప్‌ రాక నేపథ్యంలో స్టూడెంట్‌ వీసాలు కూడా గణనీయంగా తగ్గినట్టు తెలిసింది. గతేడాదితో పోల్చితే ఈసారి 40 శాతం వీసాలు తగ్గినట్లు కన్సల్టెన్సీలు చెబుతున్నాయి. అమెరికాలో చదువుకోవాలనుకొనే విద్యార్ధులను ఇది నిరాశకు గురిచేస్తోందని పేర్కొంటున్నాయి.

గత హయాంలోనే ట్రంప్‌ కొరడా..
ట్రంప్‌ గతంలో తొలిసారి అమెరికా అధ్యక్షుడిగా అధికారం చేపట్టిన వెంటనే ఇమిగ్రేషన్‌ నిబంధనలను కఠినం చేశారు. వెనిజులా, మెక్సికోతోపాటు తొమ్మిది అరబ్‌ దేశాల విద్యార్థులు, జనం రాకపోకలపై ఆంక్షలు విధించారు. రకరకాల విద్యాసంస్థల్లో చదువుకుంటున్నట్టు అడ్మిషన్లు తీసుకొని ఫుల్‌టైమ్‌ ఉద్యోగాలు చేసే విదేశీ విద్యార్థులపై తీవ్ర ఆంక్షలు విధించారు. అడ్డదారుల్లో హెచ్‌–1 వీసాలు పొంది ఉద్యోగులుగా చలామణీ అయ్యే వారిని గుర్తించి వీసాలు రద్దు చేసేం దుకు కూడా చర్యలు చేపట్టారు. అంతేకాదు.. అమెరికాకు వెళ్లే విదేశీ విద్యార్థులకు సంబంధించి ఏ చిన్న పొరపాటు ఉన్నా స్వదేశాలకు తిప్పి పంపారు కూడా. అమెరికన్లకు దక్కాల్సిన ఉద్యోగాలను విదేశాలకు చెందినవారు ఎగరేసుకెళ్తున్నారన్న ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టినట్టు ట్రంప్‌ ప్రకటించడం గమనార్హం.

ఇప్పుడు మరింత కఠినంగా ఆంక్షలు!
ఇటీవలి ఎన్నికల్లోనూ ట్రంప్‌ ఇదే తరహాలో ప్రకటనలు చేశారు. విదేశాలకు చెందిన భార్యాభర్తలు అమెరికాలో ఉంటూ పిల్లలను కంటే వారికి అమెరికన్‌ పౌరసత్వం (బర్త్‌ రైట్స్‌) ఇవ్వబోమని తేల్చి చెప్పారు. తప్పుడు పద్ధతుల్లో ఉద్యోగాలు చేసేవారి ఇమిగ్రేషన్‌ను రద్దు చేస్తామన్నారు. మరోవైపు అమెరికాలోని టాప్‌ విశ్వవిద్యాలయాల్లో చదువుకొనేవారు, క్యాంపస్‌ ఎంపికల్లోనే ఉద్యోగాలు పొందేవారికి నేరుగా గ్రీన్‌కార్డు ఇస్తామని కూడా ట్రంప్‌ ప్రకటించారు. దీనితో అమెరికా ఇమిగ్రేషన్‌ చట్టాల్లో ఎలాంటి మార్పులైనా చోటు చేసుకోవచ్చని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ దేశ విద్యాసంస్థలు విదేశీ విద్యార్ధులను త్వరగా యూఎస్‌కు చేరుకోవాలని స్పష్టం చేస్తున్నాయి. గత హయాంలోని పరిణామాలను దృష్టిలో ఉంచుకుని.. ఈసారి జనవరి 20 తర్వాత వెళ్లేవారికి పోర్ట్‌ ఆఫ్‌ ఎంట్రీలో ఇబ్బందులు తలెత్తవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.

విద్యా సంస్థల ఎంపికే కీలకం..
ట్రంప్‌ ఆంక్షలను కొట్టిపారేయడానికి వీల్లేదని, అలాగని అతిగా భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. విద్యార్థులు ఎంపిక చేసుకొనే విద్యా సంస్థలు, యూనివర్సిటీలు, చేరబోయే ఉద్యోగాలు ఏమిటన్నది కీలకమని సూచిస్తున్నారు. ‘‘నిబంధనలకు విరుద్ధంగా సరైన సర్టిఫికెట్లు ఇవ్వడం, డాక్యుమెంట్లు సమర్పించకపోవడం, నకిలీ విద్యాసంస్థల్లో చదవ డం వంటివి చేసేవారు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కో వాల్సి ఉంటుంది’’ అని హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌కు చెందిన ఓ కన్సల్టెన్సీ సంస్థ ప్రతినిధి స్పష్టం చేశారు.

విద్యార్థులకు తోడు న్యూ ఇయర్‌ సందడితో..
విద్యార్థులు అమెరికాకు క్యూ కట్టడంతోపాటు క్రిస్‌మస్‌ సెల వులు, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో యూఎస్‌కు వెళ్లే పర్యాటకుల సంఖ్య పెరిగింది. దీనితో విమాన టికెట్లకు డిమాండ్‌ మరింతగా పెరిగి.. చార్జీలు అనూహ్యంగా పెరిగాయి. గతంలో రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకు అందుబాటులో ఉన్న రౌండప్‌ చార్జీలు ఇప్పుడు రూ.2 లక్షల వరకు చేరడం గమనార్హం.

యూఎస్‌లో భారతీయ విద్యార్ధులు: 3.35 లక్షలు
అందులో తెలుగు విద్యార్ధులు: సుమారు 56 శాతం
వీరిలో తెలంగాణ నుంచి వెళ్లినవారు: 34 శాతం..
ఏపీ నుంచి వెళ్లినవారు: 22 శాతం..

హడావుడిగా పెళ్లిళ్లు..
ఇమిగ్రేషన్‌ నిబంధనలు కఠిన తరం కావొచ్చనే వార్తల నేపథ్యంలో యూఎస్‌లో హెచ్‌–1బీ వీసాలపై ఉంటున్నవారు హడావుడిగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. జనవరి 20 తర్వాత డిపెండెంట్‌ వీసాల్లో మార్పులు రావొచ్చని.. ఆలోగానే పెళ్లి చేసుకొని జీవిత భాగస్వామితో కలిసి అమెరికా వెళ్లాలని భావిస్తున్నారు. ఇలాంటి వారు ఎంగేజ్‌మెంట్‌ అయినా కాకున్నా ముహూర్తాలు పెట్టేసుకుంటుండటం గమనార్హం.

ఈ నెల 20వ తేదీన యూఎస్‌ విమానాల రౌండప్‌ చార్జీలు ఇవీ(రూ.ల్లో) (సుమారుగా)
హైదరాబాద్‌ – డల్లాస్‌ 2,05,000
బెంగళూర్‌ – షికాగో 2,15,000

బెంగళూర్‌ – శాన్‌ఫ్రాన్సిస్కో 1,40,000
చెన్నై– న్యూయార్క్‌ 1,32,000
న్యూఢిల్లీ– వాషింగ్టన్‌ డీసీ     1,65,000

ఇల్లీగల్‌ ఉద్యోగాల జోలికి వెళ్లొద్దు..
ఓపీటీ (పార్ట్‌ టైమ్‌)కి మాత్రమే అర్హత కలిగిన వాళ్లు సీపీటీ (ఫుల్‌టైమ్‌) ఉద్యోగాల వైపు మొగ్గుచూపుతున్నారు. సీనియర్ల మాటలు విని నష్టపోతున్నారు. అలాంటి తప్పుడు పద్ధతులు కష్టాలకు గురిచేస్తాయి. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లేవారిలో కొందరు ఏదో ఒక విద్యాసంస్థలో చేరి.. నిబంధనలకు విరుద్ధంగా ఫుల్‌ టైమ్‌ ఉద్యోగాలు చేస్తున్నారు. సంపాదించుకోవాలనే ఉద్దేశంతో కొందరు ఆన్‌లైన్‌ కోర్సుల్లో చేరి ఫుల్‌టైమ్‌ ఉద్యోగాలను ఆశిస్తు న్నారు. తాము చదివే విద్యాసంస్థలకు, పనిచేసే ప్రదేశాలకు ఏ మాత్రం సంబంధం ఉండదు. అలాంటి వారికి సమస్య. స్టేటస్‌ ఉన్న నిజమైన విద్యార్ధులు సెలవులు ముగిసిన తర్వాత ఎప్పుడైనా అమెరికా వెళ్లవచ్చు
– హిమబిందు, కాన్వోకేషన్స్‌స్క్వేర్‌ ఎడ్యుకేషన్‌ కన్సల్టెన్సీ,అమీర్‌పేట్‌

బాగా చదివేవాళ్లకు మంచి అవకాశాలు ఉంటాయి
మంచి విద్యాసంస్థల్లో చదివేవాళ్లు ఏమాత్రం భయపడాల్సిన పనిలేదు. ట్రంప్‌ కాలంలో కష్టాలు ఉంటాయనేది అపోహ మాత్రమే. బాగా చదివేవాళ్లకు అద్భుత అవకాశాలు ఉంటాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ దొడ్డిదారుల్లో (షార్ట్‌కట్‌) ఉద్యోగాల్లో చేరవద్దు. వర్సిటీల్లో చేరిన తర్వాత పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలకు ఇప్పటివరకు 3 ఏళ్లే చాన్స్‌ ఉంది. దీన్ని 6 ఏళ్లకు పెంచాలని ట్రంప్‌ భావిస్తున్నారు. ఇది మనవాళ్లకు గొప్ప అవకాశం. కానీ పార్ట్‌టైమ్‌ అర్హత మాత్రమే ఉన్నవాళ్లు అత్యాశకు పోయి ఫుల్‌టైమ్‌ ఉద్యోగాల్లో చేరవద్దు – సూర్యగణేశ్‌ వాల్మీకి, (వాల్మీకి గ్రూప్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement