సాక్షి, హైదరాబాద్: అమెరికా..అమెరికా అంటూ విద్యార్థులు అమెరికా తరలిపోతున్నారు. కోవిడ్ నేపథ్యంలో ఉన్నత చదువు కోసం తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికా వెళ్లే విద్యార్థుల సంఖ్య కొంత తగ్గింది. ప్రస్తుతం పరిస్థితులు మారడం, కోవిడ్ నిబంధనల సడలింపుతో ఈ విద్యా సంవత్సరంలో ఎమ్మెస్, ఇతర కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు పరుగులు పెడుతున్నారు. అమెరికా కూడా ప్రస్తుతం ఒక్క స్టూడెంట్ వీసాలు తప్ప సాధారణ వీసాలు అంత త్వరగా జారీ చేయడం లేదు. సాధారణ వీసా కోసం కనీసం రెండు, మూడు నెలల పాటు నిరీక్షించవలసి వస్తోంది. దీంతో సాధారణ ప్రయాణికులు, పర్యాటకులు అమెరికాకు వెళ్లడం కష్టంగా మారింది.
విద్యార్థుల రద్దీని ఆసరాగా చేసుకుని విమానయాన సంస్థలు టికెట్ల ధరలు పెంచేశాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి అమెరికాకు రూ.75 వేల వరకు టికెట్ ధర ఉంటే ఇప్పుడది ఏకంగా రూ.1.5 లక్షలకు చేరింది. కొన్ని సంస్థలు రూ.2 లక్షల వరకు కూడా వసూలు చేస్తున్నాయి. అయినప్పటికీ విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో విద్యార్థులు అమెరికాకు పోటెత్తినట్లు తరలిపోతున్నారని, టికెట్లు దొరకడం కష్టంగా మారిందని ట్రావెల్ ఏజెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు. ఫ్లైట్ చార్జీ లు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప, విద్యార్థుల రద్దీ తగ్గేవరకు మరో మూడు నెలలపాటు ప్రయాణాలను వాయిదా వేసుకోవడమే మంచిదని సూచిస్తున్నారు.
రెట్టింపైన విద్యార్ధులు
ప్రస్తుతం అన్ని రకాల ఆంక్షలు తొలగిపోయి అమెరికాలోని విశ్వవిద్యాలయాలు తెరుచుకోనున్నాయి. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విద్యార్ధులు తమ అమెరికా కలను సాకారం చేసుకొనేందుకు ఫ్లైట్ ఎక్కేస్తున్నారు. అమెరికాలో వర్క్ పర్మిట్‌లకు అవకాశం ఉండటంతో ఆ దేశానికే ఎక్కువ డిమాండ్ నెలకొంది. ఈసారి సుమారు 30 వేల మందికి పైగా విద్యార్ధులు అమెరికా వెళ్లే క్రమంలో ఉన్నట్లు అంచనా.
ఇదే సమయంలో సాధారణ ప్రజలు కూడా ఇంతకాలం వాయిదా వేసుకున్న అమెరికా ప్రయాణానికి సమాయత్తమవుతున్నారు. దీంతో టికెట్లకు డిమాండ్ బాగా పెరిగింది. కానీ రద్దీకి తగిన విమానాలు అందుబాటులో లేవు. కోవిడ్ అనంతరం అన్ని ఎయిర్‌లైన్స్ విమాన సేవలను పునరుద్ధరించినప్పటికీ విమానాల సంఖ్యను కుదించారు. గతంలో వారానికి ఏడు ఫ్లైట్‌లు నడిపిన ఎయిర్‌లైన్స్ ఇప్పుడు నాలుగు మాత్రమే నడుపుతున్నాయి. సిబ్బంది కొరత వంటి అంశాలు విమానాల సంఖ్య తగ్గడానికి కారణమని ట్రావెల్ ఏజెన్సీల ప్రతినిధులు చెబుతున్నారు.
హైదరాబాద్–చికాగో ఒక్కటే
హైదరాబాద్ నుంచి నేరుగా అమెరికాకు వెళ్లే ఫ్లైట్‌లు చాలా తక్కువ. ఎయిర్ ఇండియా మాత్రమే హైదరాబాద్ – చికాగో ఫ్లైట్ నడుపుతోంది. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ హైదరాబాద్ నుంచి దుబాయ్ మీదుగా కనెక్టింగ్ ఫ్లైట్స్‌ను ఏర్పాటు చేసింది. అలాగే ఖతార్, బ్రిటిష్ ఎయిర్‌వేస్‌లు ఖతార్, లండన్ మీదుగా విమానాలను నడుపుతున్నాయి. ఇత్తేహాద్ సంస్థ అబుదాబి మీదుగా న్యూయార్క్‌కు నడుపుతోంది. దీంతో చాలామంది ఢిల్లీ, ముంబయిల నుంచి అమెరికాకు బయలుదేరుతున్నారు. వివిధ నగరాల మీదుగా వెళ్లే కనెక్టింగ్ ఫ్లైట్‌లలో కొంత మేరకు చార్జీలు తక్కువ ఉన్నప్పటికీ బ్రేక్ జర్నీలో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది.
చాలావరకు ఎయిర్‌లైన్స్ రెట్టింపు చార్జీలు వసూలు చేస్తుండగా.. హైదరాబాద్ నుంచి జెడ్డా మీదుగా అమెరికాకు విమానాలు నడుపుతున్న సౌదీ ఎయిర్‌లైన్స్‌లో మాత్రం చార్జీలు కొంత తక్కువగా ఉన్నట్టు తెలిసింది. వన్‌వే చార్జీ రూ.లక్ష వరకు ఉన్నట్లు అంచనా. కానీ జెడ్డాలో ఏకంగా 13 గంటల పాటు నిరీక్షించాల్సివస్తోంది. పెరిగిన టికెట్ ధరలను భారంగా భావించే విద్యార్ధులు, సాధారణ ప్రయాణికులు ఈ ఎయిర్‌లైన్స్‌ను ఎంపిక చేసుకుంటున్నట్లు ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి. ఇలా ప్రయాణించే వారు ఆ 13 గంటలు జెడ్డాలో పర్యటించేందుకు వీలుగా సౌదీ ఎయిర్‌లైన్స్ ప్రత్యేక అనుమతితో కూడిన వీసాలు ఇస్తున్నట్లు ఐఆర్‌సీటీసీ ప్రతినిధి ఒకరు తెలిపారు.
డిమాండ్‌కు తగ్గ విమానాల్లేవు
టికెట్ ధరలు పెరగడానికి, డిమాండ్‌కు తగ్గట్లుగా విమానాలు అందుబాటులో లేకపోవడమే కారణం. ప్రయాణికుల భర్తీ రేషియో వంద శాతం ఉంటే హైదరాబాద్ నుంచి 50 శాతంసీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో సహజంగానే టికెట్ ధరలు పెరుగుతున్నాయి. రూ.లక్షలు వెచ్చించినా టికెట్‌లు దొరకడం కష్టంగా ఉంది. కనీసం 3 నెలల ముందే టికెట్‌లు తీసుకుంటే మంచిది.
– వాల్మీకి హరికిషన్, వ్యవస్థాపకులు, వాల్మీకి ట్రావెల్ అండ్ టూరిజమ్ సొల్యూషన్స్
Comments
Please login to add a commentAdd a comment