work permit
-
ఆ దేశం వెళ్లాలంటే ఇక కష్టమే.. వీసా నిబంధనల్లో భారీ మార్పులు
వెల్లింగ్టన్ : మీరు ఆ దేశానికి వెళ్లేందుకు, అక్కడ పనిచేసేందుకు మక్కువ చూపుతున్నారా? ఇందుకోసం వీసాకి అప్లయి చేస్తున్నారా? అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ దేశానికి వెళ్లడం కొంచెం కష్టంతో కూడుకున్న పనేనని విసా నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగాలు, చదువు అనేది సగటు మధ్యతరగతి కుటుంబాల నుంచి ఉన్నత వర్గాల వారి వరకూ విదేశం అనేది ఓ కల. అందుకే దేశీయంగా ఆదరణ, అవకాశాలు ఎక్కువగా ఉన్న కోర్స్‌లు చదివి విదేశాలకు క్యూకడుతుంటారు. దీనికి తోడు ఆయా దేశాల అభివృద్దిలో భాగం చేసేందుకు వీసా మంజూరులో మార్పులు, చేర్పులు చేస్తున్నాయి. వలసదారుల్ని ప్రోత్సహిస్తున్నాయి. ఈ తరుణంలో న్యూజిలాండ్ ఎంప్లాయింటెంట్ వీసా ప్రోగ్రాంలో భారీగా మార్పులు చేసింది. గత ఏడాది రికార్డ్ స్థాయిలో విదేశీయులు తమ దేశానికి వలదారులు భారీ ఎత్తున క్యూ కట్టారని, దీంతో విసాలో మార్పులు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. చాలా తక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగాల్లో పనిచేసే వారికి న్యూజిలాండ్‌లో వసతి ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించింది. న్యూజిలాండ్ వీసాలో చేసిన కీలక మార్పులు తక్కువ నైపుణ్యం కలిగిన లెవల్ 4, లెవల్ 5 కోసం ఉద్యోగాల్లో పనిచేసేందుకు మక్కువ చూపుతున్న వలసదారులకు ఇంగ్లీష్ తప్పని సరి చేసింది. కనీస నైపుణ్యాలు వర్క్ ఎక్స్‌పీరియన్స్‌లో మార్పులు లెవల్ 4, లెవల్ 5 వంటి లో స్కిల్డ్ ఉద్యోగాల్లో పనిచేసేందుకు ఆయా సంస్థలు సంబంధిత విభాగాల ఉద్యోగులకు వీసా ఇచ్చే విషయంలో వారి జీతాల్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. లెవల్ 4, లెవల్ 5 ఉద్యోగులకు న్యూజిలాండ్‌లో నివసించే కాలవ్యవధిని 5 నుంచి 3ఏళ్లకు తగ్గించింది. ఫ్రాంఛైజీ అక్రిడిటేషన్‌ను రద్దు చేసింది. విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి సంస్థలు ప్రామాణిక, హైవ్యాల్యూమ్ ఉపాధి అక్రిడిటేషన్ ప్రక్రియలను అనుసరించాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా న్యూజిలాండ్‌లో నైపుణ్యం కొరత ఉన్న సెకండరీ టీచర్ల వంటి అత్యంత నైపుణ్యం కలిగిన వలసదారులను ఆకర్షించడం,నిలుపుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించింది’ అని ఇమ్మిగ్రేషన్ మంత్రి ఎరికా స్టాన్ఫోర్డ్ ఒక ప్రకటనలో తెలిపారు. అదే సమయంలో నైపుణ్యాల కొరత లేని ఉద్యోగాల కోసం న్యూజిలాండ్ వాసులు ముందు వరుసలో ఉండేలా చూసుకోవాలి అని ఆమె అన్నారు. కాగా, గత సంవత్సరం, దాదాపు 173,000 మంది న్యూజిలాండ్‌కు వలస వెళ్ళారు. సుమారు 5.1 మిలియన్ల జనాభా ఉన్న న్యూజిలాండ్‌కు కోవిడ్ తగ్గుముఖం పెట్టిన తర్వాత విదేశీయుల తాకిడి ఎక్కువైంది. పొరుగున ఉన్న ఆస్ట్రేలియా కూడా వలసదారులు పెరిగారు. దీంతో రాబోయే రెండేళ్లలలో వలసదారుల్ని తగ్గించేందుకు సన్నాహకాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. -
గుడ్‌న్యూస్! కెనడాలో వర్క్ పర్మిట్.. కీలక మార్పులు
Canada work permit : కెనడాలో చదువుతున్న భారతీయ విద్యార్థులకు శుభవార్త ఇది. పోస్ట్-గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ ప్రోగ్రామ్ (PGWP) కి కెనడా ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. రెండేళ్లలోపు వ్యవధి ఉన్న మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసిన విద్యార్థులు కూడా ఇప్పుడు 3 సంవత్సరాల పీజీడబ్ల్యూపీకి అర్హత పొందుతారు. 2024 ఫిబ్రవరి 15 నుంచి ఈ మార్పులను ఆ దేశ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. అయితే 2024 సెప్టెంబరు 1 నుండి కరికులమ్ లైసెన్సింగ్ అగ్రిమెంట్ ప్రోగ్రామ్‌లలో నమోదు చేసుకున్న విద్యార్థులు ఇకపై పోస్ట్-గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ ప్రోగ్రామ్‌కి అర్హత పొందలేరు. అలాగే దూరవిద్య, పీజీడబ్ల్యూపీ చెల్లుబాటు కోసం ప్రత్యేక చర్యలను 2024 ఆగస్టు 31 వరకు పొడిగించింది. పోస్ట్-గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ అనేది కెనడాలో చదువులు పూర్తయిన తర్వాత విదేశీ విద్యార్థులకు మంజూరు చేసే ఓపెన్ వర్క్ పర్మిట్. పీజీడబ్ల్యూపీ హోల్డర్లు కెనడాలో ఎక్కడైనా ఏ కంపెనీలో అయినా తమకు నచ్చినన్ని గంటలు పని చేసుకోవచ్చు. పీజీడబ్ల్యూపీ చెల్లుబాటు ఎంత కాలం ఉంటుందనేది స్టడీ ప్రోగ్రామ్ స్థాయి, వ్యవధితోపాటు పాస్‌పోర్ట్ గడువు తేదీపై ఆధారపడి ఉంటుంది. విదేశీ విద్యార్థులందరూ అర్హులేనా? కెనడాలోని ఆమోదిత విద్యా సంస్థలలో కనీసం రెండు సంవత్సరాల నిడివి ఉన్న డిగ్రీ ప్రోగ్రామ్‌లు పూర్తి చేసి తాత్కాలికంగా కొన్నాళ్లపాటు కెనడాలో ఉండాలనుకుంటున్న విదేశీ విద్యార్థులందరూ 3 సంవత్సరాల పోస్ట్-గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ ప్రోగ్రామ్ (PGWP)కి అర్హులు. ఇక మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్‌ల విషయానికి వస్తే కనీసం 8 నెలలు (లేదా 900 గంటల క్యూబెక్ క్రెడెన్షియల్స్ ) వ్యవధి ఉండాలి. అన్ని ఇతర అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నంత వరకు మాస్టర్స్ డిగ్రీ వ్యవధి 2 సంవత్సరాల కంటే తక్కువగా ఉన్నప్పటికీ 3 సంవత్సరాల పీజీడబ్ల్యూపీకి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇది సర్టిఫికేట్ లేదా డిప్లొమా ప్రోగ్రామ్‌లకు వర్తించదు. -
ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ కార్డులు
వాషింగ్టన్: అమెరికాలో నివసిస్తున్న విదేశీయులకు యూఎస్ సిటిజెన్షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) తీపి కబురు అందించింది. గ్రీన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నవారితోపాటు కొన్ని నాన్–ఇమిగ్రేషన్ కేటగిరీల్లో ఉన్నవారికి ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ కార్డులు(ఈఏడీ) అందజేయనున్నట్లు ప్రకటించింది. ఈ కార్డులు ఐదేళ్లపాటు చెల్లుబాటు అవుతాయని వెల్లడించింది. ఈఏడీలతో అమెరికాలో వేలాది మంది భారతీయులకు లబ్ధి చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ కార్డులతో వారికి అక్కడ ఉద్యోగాలు చేసుకోవడానికి సులభంగా అనుమతి లభిస్తుందని పేర్కొంటున్నారు. అమెరికాలో 10.5 లక్షల మందికిపైగా భారతీయులు ఎంప్లాయ్మెంట్ ఆధారిత గ్రీన్‌కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. నిబంధనల ప్రకారం వీరందరికీ గ్రీన్‌కార్డులు రావాలంటే 50 ఏళ్లు పడుతుందని సమాచారం. -
భారతీయులకు కెనడా శుభవార్త
టొరంటో: కెనడాలో పనిచేస్తున్న వేలాది మంది భారతీయ ఐటీ వృత్తినిపుణుల కుటుంబసభ్యులకు తీపి కబురు! ఓపెన్ వర్క్ పర్మిట్ (ఓడబ్ల్యూపీ) కింద అక్కడ పనిచేస్తున్న భారతీయుల కుటుంబసభ్యులు కూడా ఇకపై తాత్కాలిక వర్క్ పర్మిట్లతో పనిచేసుకోవచ్చు. వలసలు, శరణార్థులు, పౌరసత్వ వ్యవహారాల మంత్రి సీన్ ఫ్రాసర్ శుక్రవారం ఈ మేరకు ప్రకటించారు. వర్క్ పర్మిట్లున్న వారి జీవిత భాగస్వామి, పిల్లలు వచ్చే ఏడాది నుంచి ఉద్యోగాలు చేసుకోవచ్చంటూ ట్వీట్ చేశారు. ‘‘దేశంలో సమస్యగా మారిన ఉద్యోగుల కొరతకు పరిష్కారంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. దీంతో 2,00,000 మందికిపైగా ఉన్న విదేశీ ఉద్యోగులకు తోడు వారి కుటుంబసభ్యులకు కెనడాలో కొలువుకు అవకాశం దక్కుతుంది. గతంలో ఓపెన్ వర్క్ పర్మిట్ ఉన్న ఉద్యోగి హై–స్కిల్డ్ ఉద్యోగం చేస్తేనే జీవితభా గస్వామికి వర్క్ పర్మిషన్ ఇచ్చేవాళ్లం. నిబంధనలను సడలించడంతో వర్క్ పర్మిట్ ఉద్యోగు లు కుటుంబంతో కలిసుంటారు. వారి శారీరక ఆరోగ్యం, ఆర్థిక స్థిరత్వం మెరుగుపడుతుంది’ అని ఫ్రాసర్ అభిప్రాయపడ్డారు. దీన్ని మూడు దశల్లో అమలు చేస్తారు. -
కష్టంగా మారిన అమెరికా ప్రయాణం.. ఏకంగా రూ.1.5 లక్షలకు చేరిన..
సాక్షి, హైదరాబాద్: అమెరికా..అమెరికా అంటూ విద్యార్థులు అమెరికా తరలిపోతున్నారు. కోవిడ్ నేపథ్యంలో ఉన్నత చదువు కోసం తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికా వెళ్లే విద్యార్థుల సంఖ్య కొంత తగ్గింది. ప్రస్తుతం పరిస్థితులు మారడం, కోవిడ్ నిబంధనల సడలింపుతో ఈ విద్యా సంవత్సరంలో ఎమ్మెస్, ఇతర కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు పరుగులు పెడుతున్నారు. అమెరికా కూడా ప్రస్తుతం ఒక్క స్టూడెంట్ వీసాలు తప్ప సాధారణ వీసాలు అంత త్వరగా జారీ చేయడం లేదు. సాధారణ వీసా కోసం కనీసం రెండు, మూడు నెలల పాటు నిరీక్షించవలసి వస్తోంది. దీంతో సాధారణ ప్రయాణికులు, పర్యాటకులు అమెరికాకు వెళ్లడం కష్టంగా మారింది. విద్యార్థుల రద్దీని ఆసరాగా చేసుకుని విమానయాన సంస్థలు టికెట్ల ధరలు పెంచేశాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి అమెరికాకు రూ.75 వేల వరకు టికెట్ ధర ఉంటే ఇప్పుడది ఏకంగా రూ.1.5 లక్షలకు చేరింది. కొన్ని సంస్థలు రూ.2 లక్షల వరకు కూడా వసూలు చేస్తున్నాయి. అయినప్పటికీ విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో విద్యార్థులు అమెరికాకు పోటెత్తినట్లు తరలిపోతున్నారని, టికెట్లు దొరకడం కష్టంగా మారిందని ట్రావెల్ ఏజెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు. ఫ్లైట్ చార్జీ లు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప, విద్యార్థుల రద్దీ తగ్గేవరకు మరో మూడు నెలలపాటు ప్రయాణాలను వాయిదా వేసుకోవడమే మంచిదని సూచిస్తున్నారు. రెట్టింపైన విద్యార్ధులు ప్రస్తుతం అన్ని రకాల ఆంక్షలు తొలగిపోయి అమెరికాలోని విశ్వవిద్యాలయాలు తెరుచుకోనున్నాయి. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విద్యార్ధులు తమ అమెరికా కలను సాకారం చేసుకొనేందుకు ఫ్లైట్ ఎక్కేస్తున్నారు. అమెరికాలో వర్క్ పర్మిట్లకు అవకాశం ఉండటంతో ఆ దేశానికే ఎక్కువ డిమాండ్ నెలకొంది. ఈసారి సుమారు 30 వేల మందికి పైగా విద్యార్ధులు అమెరికా వెళ్లే క్రమంలో ఉన్నట్లు అంచనా. ఇదే సమయంలో సాధారణ ప్రజలు కూడా ఇంతకాలం వాయిదా వేసుకున్న అమెరికా ప్రయాణానికి సమాయత్తమవుతున్నారు. దీంతో టికెట్లకు డిమాండ్ బాగా పెరిగింది. కానీ రద్దీకి తగిన విమానాలు అందుబాటులో లేవు. కోవిడ్ అనంతరం అన్ని ఎయిర్‌లైన్స్ విమాన సేవలను పునరుద్ధరించినప్పటికీ విమానాల సంఖ్యను కుదించారు. గతంలో వారానికి ఏడు ఫ్లైట్లు నడిపిన ఎయిర్‌లైన్స్ ఇప్పుడు నాలుగు మాత్రమే నడుపుతున్నాయి. సిబ్బంది కొరత వంటి అంశాలు విమానాల సంఖ్య తగ్గడానికి కారణమని ట్రావెల్ ఏజెన్సీల ప్రతినిధులు చెబుతున్నారు. హైదరాబాద్–చికాగో ఒక్కటే హైదరాబాద్ నుంచి నేరుగా అమెరికాకు వెళ్లే ఫ్లైట్లు చాలా తక్కువ. ఎయిర్ ఇండియా మాత్రమే హైదరాబాద్ – చికాగో ఫ్లైట్ నడుపుతోంది. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ హైదరాబాద్ నుంచి దుబాయ్ మీదుగా కనెక్టింగ్ ఫ్లైట్స్‌ను ఏర్పాటు చేసింది. అలాగే ఖతార్, బ్రిటిష్ ఎయిర్‌వేస్‌లు ఖతార్, లండన్ మీదుగా విమానాలను నడుపుతున్నాయి. ఇత్తేహాద్ సంస్థ అబుదాబి మీదుగా న్యూయార్క్‌కు నడుపుతోంది. దీంతో చాలామంది ఢిల్లీ, ముంబయిల నుంచి అమెరికాకు బయలుదేరుతున్నారు. వివిధ నగరాల మీదుగా వెళ్లే కనెక్టింగ్ ఫ్లైట్లలో కొంత మేరకు చార్జీలు తక్కువ ఉన్నప్పటికీ బ్రేక్ జర్నీలో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. చాలావరకు ఎయిర్‌లైన్స్ రెట్టింపు చార్జీలు వసూలు చేస్తుండగా.. హైదరాబాద్ నుంచి జెడ్డా మీదుగా అమెరికాకు విమానాలు నడుపుతున్న సౌదీ ఎయిర్‌లైన్స్‌లో మాత్రం చార్జీలు కొంత తక్కువగా ఉన్నట్టు తెలిసింది. వన్‌వే చార్జీ రూ.లక్ష వరకు ఉన్నట్లు అంచనా. కానీ జెడ్డాలో ఏకంగా 13 గంటల పాటు నిరీక్షించాల్సివస్తోంది. పెరిగిన టికెట్ ధరలను భారంగా భావించే విద్యార్ధులు, సాధారణ ప్రయాణికులు ఈ ఎయిర్‌లైన్స్‌ను ఎంపిక చేసుకుంటున్నట్లు ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి. ఇలా ప్రయాణించే వారు ఆ 13 గంటలు జెడ్డాలో పర్యటించేందుకు వీలుగా సౌదీ ఎయిర్‌లైన్స్ ప్రత్యేక అనుమతితో కూడిన వీసాలు ఇస్తున్నట్లు ఐఆర్సీటీసీ ప్రతినిధి ఒకరు తెలిపారు. డిమాండ్‌కు తగ్గ విమానాల్లేవు టికెట్ ధరలు పెరగడానికి, డిమాండ్‌కు తగ్గట్లుగా విమానాలు అందుబాటులో లేకపోవడమే కారణం. ప్రయాణికుల భర్తీ రేషియో వంద శాతం ఉంటే హైదరాబాద్ నుంచి 50 శాతంసీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో సహజంగానే టికెట్ ధరలు పెరుగుతున్నాయి. రూ.లక్షలు వెచ్చించినా టికెట్లు దొరకడం కష్టంగా ఉంది. కనీసం 3 నెలల ముందే టికెట్లు తీసుకుంటే మంచిది. – వాల్మీకి హరికిషన్, వ్యవస్థాపకులు, వాల్మీకి ట్రావెల్ అండ్ టూరిజమ్ సొల్యూషన్స్ -
Saudi Arabia: రెసిడెన్సీ పర్మిట్లపై కొత్త చట్టం
సౌదీ అరేబియా రెసిడెన్సీ వర్క్ పర్మిట్ల విషయంలో కొత్త చట్టం చేసింది. మూడు నెలలకు ఓసారి అక్కడ పని చేస్తున్న కార్మికులకు రెసిడెన్సీ వర్క్ పర్మిట్లు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సౌదీ అంతర్గత వ్యవహరాలు, మానవనరుల శాఖ ఆదేశాలు జారీ చేసింది. సౌదీ అరేబియాలో పని చేస్తున్న వలస కార్మికులు నివాసం ఉండేందుకు జారీ చేసే పర్మిట్లను ఇకమాగా పేర్కొంటారు. వలస కార్మికులకు పని కల్పించే ఎంప్లాయర్లే ఈ పర్మిట్లకు సంబంధించిన ఫీజులు చెల్లిస్తూంటారు. గతంలో ఏడాదితో పాటు ఆరు నెలలు, తొమ్మిది నెలల కాలానికి ఈ పర్మిట్లు జారీ చేసేవారు. అయితే ఇక్మాల జారీని మరింత సులభతరం చేసే ఉద్దేశంతో కనీస కాలపరిమితి మూడు నెలలకు తీసుకువచ్చారు. అయితే ఇళ్లలో పని చేస్తున్న కార్మికులు కొత్త నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇక్మా రెన్యువల్ చేసుకునేవారు అబ్షేర్ ఇండివిడ్యువల్, అబ్షేర్ బిజినెస్, ముఖీమ్, కివా వంటి ఆన్లైన్ ప్లాట్ఫార్మ్స్లను ఉపయోగించుకోవచ్చు. స్వల్పకాలానికి సంబంధించిన పనులకు వలస కార్మికులను రప్పించుకునే విషయంలో కొత్త నిబంధనల వల్ల ఎంప్లాయర్లకు తక్కువ భారం పడుతుందని సౌదీ ప్రభుత్వం అంటోంది. ముఖ్యంగా ప్రైవేటు రంగానికి ఎంతో ఊతం లభిస్తుందని పేర్కొంది. -
వలస కార్మికులకు కువైట్ సర్కార్ ఊరట
మోర్తాడ్ (బాల్కొండ): తమ దేశంలో ఉన్న విదేశీ వలస కార్మికుల సంఖ్యను తగ్గించుకోవడానికి 60 ఏళ్ల వయసు పైబడిన వారిని స్వదేశాలకు పంపిన కువైట్ ఇప్పుడు ఆ నిబంధనను ఎత్తివేసింది. వలస కార్మికులను బలవంతంగా పంపించడంతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం ఏర్పడటంతో 60 ఏళ్ల పైబడిన వారిని మళ్లీ విధులలో కొనసాగించాలని కువైట్ నిర్ణయం తీసుకుంది. కరోనా సమయంలో తమ దేశ పౌరులకు ఉపాధి కల్పించే బాధ్యత కువైట్ ప్రభుత్వంపై పడటంతో 2020 డిసెంబర్లో విదేశీ వలస కార్మికులను తగ్గించుకోవాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో వ్యాపార, వాణిజ్య రంగాలు మళ్లీ పుంజుకున్నాయి. కువైట్ పౌరులలో ఎక్కువ మందికి వ్యాపార, సాంకేతిక రంగాల్లో అనుభవం లేక పోవడం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న వ్యాపారాలకు ప్రతిబంధకంగా మారింది. దీంతో వృత్తి నైపుణ్యం ఉన్న విదేశీ వలస కార్మికులను వయసుతో సంబంధం లేకుండా పనుల్లోకి తీసుకోవాలని కువైట్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 2021 జనవరి 1 నాటికి 60 ఏళ్లు నిండిన వలస కార్మికులను స్వదేశాలకు పంపించగా ఆ తర్వాత కూడా 60 ఏళ్లు నిండిన వారికి వీసాలను రెన్యూవల్ చేయలేదు. 60 ఏళ్ల వయసు నిబంధనను ఎత్తివేయడంతో తెలుగు రాష్ట్రాల కార్మికులకు ఊరట లభించింది. కువైట్‌లో ఉపాధి పొందుతున్న తెలుగు రాష్ట్రాల వలస కార్మికుల సంఖ్య దాదాపు 3.5 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇదిలా ఉండగా కరోనాతో నిలిపివేసిన కువైట్ ప్రభుత్వం నిలిపివేసిన వీసాలను ఇప్పుడు జారీచేయడానికి ఆమోదం తెలిపింది. (చదవండి: ఆ విషయంలో దేశానికే ఆదర్శం.. హైదరాబాద్) -
అమెరికాలో మనోళ్లపై ‘ట్రంప్’ దెబ్బ
సాక్షి, హైదరాబాద్: అమెరికా ఫస్ట్ అంటూ ట్రంప్ సర్కార్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు ప్రవాస భారతీయుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి! అమెరికాలో హెచ్1 బీ వీసా కలిగిన వృత్తినిపుణుల జీవిత భాగస్వామ్యులకు వర్క్ పర్మిట్ ను (హెచ్4 వీసా) ట్రంప్ సర్కార్ రద్దు చేస్తే దాదాపుగా లక్ష మంది ఉద్యోగాలు కోల్పోతారని ఒక తాజా అధ్యయనం అంచనా వేసింది. అమెరికా ప్రభుత్వ ప్రణాళికలతో వేలాది ప్రవాస భారతీయుల కుటుంబాలపైనా, వారు పనిచేస్తున్న కంపెనీ యాజమాన్యాలపైన ప్రతికూల ప్రభావం పడుతుందని వెల్లడించింది. ట్రంప్ సర్కార్ వీసా విధానాన్ని కఠినతరం చేస్తే సామాజికంగా, ఆర్థికంగా చూపించే ప్రభావాలపై టెన్నసీ యూనివర్సిటీకి చెందిన క్రిస్టోఫర్ జే.ఎల్. కన్నింగమ్,యూనివర్సిటీ ఆఫ్ లైమ్రిక్లో కెమ్మి బిజినెస్ స్కూలుకి చెందిన పూజ బి విజయ్‌కుమార్‌లు ఒక అధ్యయనం నిర్వహించారు. 1800 మంది ప్రవాస భారతీయ కుటుంబాలతో వారు మాట్లాడారు. తుది నివేదిక రూపకల్పనకు 416 మంది అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకున్నారు. అధ్యయనంలో వెల్లడైన అంశాలు లక్ష మంది వరకు ఉద్యోగాలు కోల్పోతారు. జీవితభాగస్వామ్యులందరూ సామాజికంగా ఏకాకిగా మారతారు. ఇళ్లల్లో ఒత్తిడితో కూడుకున్న వాతావరణం ఏర్పడుతుంది మెరుగైన జీవనం కోసం వచ్చిన కుటుంబాల ఆదాయం భారీగా తగ్గిపోతుంది స్థిరనివాసం ఏర్పాటు చేసుకోవాలని కలలు కనే ప్రవాస కుటుంబాలకు 2,50,000 డాలర్ల నుంచి 10 లక్షల డాలర్ల నష్టం వస్తుంది అత్యంత నిపుణులైన ప్రవాసులు ఉద్యోగాలు వదులుకుని అమెరికా విడిచిపెట్టే ప్రమాదం ఉంది 93 శాతం భారతీయులే హెచ్1బీ వీసాపై అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వారి భాగస్వామ్యులకు 2015కి ముందు పని చేసే అవకాశం లేదు. 2015లో ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో హెచ్4 వీసా కలిగిన జీవిత భాగస్వామ్యులకు అమెరికాలో చట్టబద్ధంగా పనిచేయడానికి అనుమతులు ( ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ –ఈఏడీ) ఇవ్వడం మొదలు పెట్టడంతో అమెరికాలో స్థిరపడాలనుకునే ఎన్నో భారతీయ కుటుంబాలకు అది వరంలా మారింది. 2015 నుంచి 2017 డిసెంబర్ నాటికి లక్షా 26 వేలకు పైగా హెచ్4 ఈఏడీనిమంజూరు చేస్తే, వారిలో 93 శాతం మంది భారతీయులే ఉన్నారు. ఇక అయిదు శాతం వీసాలతో తర్వాత స్థానంలో చైనా ఉంటే, మిగిలిన దేశాలన్నింటికీ కలిపి మిగిలిన 2 శాతం వీసాలున్నాయి. ఈఏడీ పొందిన వారిలో అయిదింట ఒక వంతు మంది కాలిఫోర్నియాలో నివసిస్తూ ఉంటే, టెక్ హబ్‌లుగా పేరు పొందిన సిలికాన్ వ్యాలీ, న్యూజెర్సీ, సియాటిల్, డల్లాస్, హస్టన్, వాషింగ్టన్ల నుంచి అత్యధికులు ఉన్నారు. వర్క్ పర్మిట్ పొందినవారిలో 93 శాతం మంది మహిళలైతే ఏడు శాతం పురుషులు ఉన్నారు. అత్యంత నిపుణులైన వారి భాగస్వామ్యులకూ పని చేసే సౌకర్యం ఉంటే వారు అమెరికా వీడి వెళ్లకుండా ఉంటారన్న ఉద్దేశంతో ఒబామా సర్కార్ దీనిని అమల్లోకి తెచ్చింది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా ఫస్ట్ అన్న నినాదాన్ని అందిపుచ్చుకొని అమెరికన్ల ఉద్యోగాలు విదేశీయులు కొల్లగొట్టేస్తున్నారని ఆరోపిస్తూవీసా నిబంధనలు కఠినతరం చేయడంలో భాగంగా హెచ్4 వీసాను రద్దు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీంతో ఎప్పుడేం జరుగుతుందోనన్న అభద్రతా భావంలో భారతీయ కుటుంబాలు ఉన్నాయి. రద్దు చేస్తే ఇంటిదారే... హెచ్1బీ వీసాదారుల జీవితభాగస్వాముల వర్క్ పర్మిట్‌ను రద్దు చేస్తే తిరిగి భారత్‌కు వెళ్లిపోవడానికి చాలా మంది సన్నాహాలు చేసుకుంటున్నట్టు ఈ అధ్యయనంలో వెల్లడైంది. ‘నా భార్య తీవ్రమైన నిరాశనిస్పౄహలకు లోనవుతోంది. అంత చదువు చదివి కెరీర్ ముందుకు వెళ్లకపోతే ఇంక అమెరికాలో ఎందుకు ఉండాలని ప్రశ్నిస్తోంది. భార్యలు పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే ఒక్కరి జీతంతోనే బతకడం అంటే చాలా కష్టం, ట్రంప్ నిర్ణయాలు సరైనవి కావు. అందుకే ఇండియాకు తిరిగి వెళ్లిపోవాలని అనుకుంటున్నామ’ని అధ్యయనంలో పాల్గొన్న పలువురు స్పష్టం చేశారు. వ్యతిరేకిస్తున్న దిగ్గజ సంస్థలు వీసా నిబంధనలు కఠినతరం చేయాలన్న ట్రంప్ సర్కార్ ప్రణాళికలను గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ వంటి సంస్థలు బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నాయి. ఇలాంటి చర్యల వల్ల వీసా హోల్డర్లు, వారి భాగ్యస్వామ్యులు ముఖ్యంగా మహిళల మనోభావాలను దెబ్బ తింటాయని, అది సరైన పనికాదని వారంటున్నారు. ట్రంప్ ప్రభుత్వం పూర్తి సమాచారం లేకుండా, ఎలాంటి ప్రతికూల ప్రభావాలు పడతాయో అంచనా వేయకుండా విధాన పరమైన నిర్ణయాలు తీసుకుంటోందని అధ్యయనకారులు తప్పుబడుతున్నారు. -
చివరి దశలో హెచ్-4 వీసా రద్దు
వాషింగ్టన్: భారతీయ ఐటి నిపుణుల గుండెల్లో గుబులు పుట్టించే వార్త. హెచ్-4 వీసాను రద్దు చేసే ప్రక్రియ చివరి దశల్లో ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సంకేతాలు అందించింది. అమెరికాలో హెచ్ -1బి వీసా మీద పనిచేస్తున్న వృత్తి నిపుణుల జీవిత భాగస్వాములకు ఇచ్చే స్పౌస్ వీసా హెచ్-4ను రద్దు చేయాలన్న నిర్ణయం తుది దశలో ఉందని ట్రంప్ పరిపాలన విభాగం అమెరికా కోర్టుకు తెలియజేసింది. ప్రతిపాదిత నియమం తుది దశంలో ఉందని డిపార్ట్మెంట్ అఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) ఫెడరల్ కోర్టుకు గురువారం నివేదించింది. ఈ నిర్ణయం తుదిరూపు దాల్చి అమలులోకి వస్తే అమెరికాలో నివసిస్తున్న వేలాది మంది భారతీయులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది. హెచ్1బి వీసా మీద అమెరికాలో పనిచేసే వృత్తినిపుణుల జీవిత భాగస్వాములు హెచ్-4 వీసా కింద అమెరికాలో నివసించడానికి అనుమతి లభిస్తుంది. అయితే.. అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా ఉన్న సమయంలో (2015)లో హెచ్1బి వీసాదారుల జీవిత భాగస్వాములు కూడా అమెరికాలో చట్టబద్ధంగా పనిచేయటానికి అనుమతించిన ఈఏడీ (ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్) కి చరమగీతం పాడాలని ట్రంప్ సర్కార్ ప్రణాళికలు రచిస్తున్న సంగతి తెలిసిందే. కాగా హెచ్-4 వీసాదారులకు ఈఏడీల జారీని రద్దు చేస్తామని యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) 2017 సెప్టెంబర్‌లో ప్రకటించింది. అయితే 2018 ఫిబ్రవరిలో దీనికి సంబంధించిన ప్రకటన జారీ చేస్తామని అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ పేర్కొంది. అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే అన్న నినాదంలో భాగంగా హెచ్-4 వీసాదారులు అమెరికాలో ఉద్యోగాలు చేయటానికి ఇచ్చే అనుమతులను రద్దు చేయాలనీ ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో హెచ్-1బీ, హెచ్-4 వీసాలను ఎక్కువగా పొందుతున్న భారతీయ ఐటీ నిపుణుల్లో ఇప్పటికే తీవ్ర ఆందోళన నెలకొన్న సంగతి విదితమే. దాదాపు 70వేల మంది హెచ్-4 వీసాదారుల ఆశలు ఆవిరయ్యే ప్రమాదం పొంచి ఉంది. -
స్వాప్నికులకు పీడకలేనా!
చిన్నప్పుడే అమెరికా వచ్చిన వలసదారులపై నేడు ట్రంప్ నిర్ణయం ► ఆందోళనలో 8 లక్షల మంది యువత ►వీరిలో 7 వేల మంది భారతీయులు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వలస దారులు, శరణార్థులపై కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొద్ది గంటల్లో మరో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. చిన్నపిల్లలుగా ఉన్నప్పడు తల్లిదండ్రులతో పాటు అమెరికా వచ్చి అక్కడే ఉద్యోగాలు చేస్తున్న యువతను అక్రమ వలసదారులుగా గుర్తించే అంశంపై నేడు నిర్ణయం వెలువరించే అవకాశముంది. వీరిని అమెరికాలో డ్రీమర్లు (స్వాప్నికులు)గా పిలుస్తారు. ట్రంప్ తీసుకునే నిర్ణయం తో 8 లక్షల మంది కలల సౌధాలు కూలిపోవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. వీరిలో ఏడు వేల మంది భారతీయ అమెరికన్ యువకులు కూడా ఉన్నారు. అమెరికాలో నివసించేందుకు, పనిచేసేందుకు వీరికి అధికారికంగా ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేవు. ఈ డ్రీమర్లు దేశ ఆర్థికవ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్నారని, వారిపై దయ చూపాలే తప్ప శిక్షించరాదనే అభిప్రాయంతో ఒబామా 2012లో చట్టపరంగా వెసులుబాటు కల్పించారు. ‘బాల్యంలో వచ్చినవారిపై చర్యల వాయిదా’ (డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్–డీఏసీఏ) సహాయ కార్యక్రమాన్ని 2012 జూన్ 15న ఆయన ప్రకటించారు. అమెరికా ఫెడరల్ సర్కారు నిధులతో అమలయ్యే ఈ కార్యక్రమంలో 8 లక్షల మంది పెట్టుకున్న దరఖాస్తుల్ని ఆమోదించారు. వీరు ప్రతి రెండేళ్లకు తమ వర్క్ పర్మిట్లను పొడిగించుకునే అవకాశం కల్పించారు. ఆ వర్క్ పర్మిట్ల రద్దుపైనే ట్రంప్ నేడు ప్రకటన చేయనున్నారు. ఎన్నికల ప్రచారంలో ట్రంప్ హామీ అధికారంలోకి రాగానే డీఏసీఏను రద్దు చేస్తానని అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ హామీనిచ్చారు. వర్క్ పర్మిట్ల పునరుద్ధరణను రద్దు చేసి, వారిని స్వదేశాలకు పంపాలని రెండేళ్ల క్రితమే డిమాండ్ మొదలైంది. డ్రీమర్ల వల్ల స్థానిక అమెరికన్ల ఉపాధికి ప్రమాదమని, వారిలో కొందరు చట్టవ్యతిరేక కార్యకలా పాల్లో పాల్గొంటున్నారని ట్రంప్ మద్దతుదారుల ఆరోపణ. ఈ వలసదారుల్లో ఎక్కువమంది పొరుగుదేశమైన మెక్సికో, మధ్య, దక్షిణ అమెరికా దేశాలకు చెందినవారే. భారత్, వియత్నాం వంటి ఆసియా దేశాలకు చెందిన యువత తొమ్మిది శాతం వరకూ ఉండొచ్చని అంచనా. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టెక్ దిగ్గజాలు ఇన్ని లక్షల మందిని అర్ధంతరంగా వారికి తెలియని దేశాలకు పంపడం అన్యాయమని అన్ని పార్టీల నేతలు వాదిస్తున్నారు. డీఏసీఏ రద్దును ఫేస్బుక్ సీఈవో జుకర్‌బర్గ్, యాపిల్ సీఈఓ టిమ్ కుక్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, అమెజాన్ సీఈవోలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వలసదారులకు చట్టపరంగా రక్షణ కొనసాగించాలని, డీఏసీఏను రద్దు చేస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరమంటూ 300 మంది టెక్, బిజినెస్ దిగ్గజాలు ఇప్పటికే ట్రంప్‌కు లేఖ రాశారు. పాలకపక్షమైన రిపబ్లికన్ పార్టీకి చెందిన సెనెటర్లు, ప్రతినిధుల సభ సభ్యులు, స్పీకర్ కూడా రద్దును వద్దని కోరుతున్నారు. కాగా ఒబామా హయాంలో ఇచ్చిన ఉత్తర్వుల్ని మంగళవారంలోగా రద్దు చేయకుంటే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని రిపబ్లికన్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు హెచ్చరించాయి. దీంతో సందిగ్ధంలో పడ్డ ట్రంప్ వర్క్ పర్మిట్ల పథకాన్ని వెంటనే రద్దుచేయకుండా ఆరు నెలలు యధాతథ స్థితి కొనసాగించాలని యోచిస్తున్నట్లు సమాచారం. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
వలస కార్మికులకు కువైట్‌లో ఇబ్బందులు
• వీసా, వర్క్ పర్మిట్ ఉన్నా.. కార్మికులకు తప్పని కష్టాలు • మన విదేశాంగ శాఖ చొరవ చూపాలని కోరుతున్న కార్మికులు మోర్తాడ్: కువైట్‌లోని అరబ్బుల ఇళ్లలో పనికోసం వెళ్తున్న కార్మికులకు తనిఖీల పేరిట ఎయిర్‌పోర్టులో ఆ దేశ ఉన్నతాధికారులు చుక్కలు చూపిస్తున్నారు. మన దేశం నుంచి కువైట్‌కు వెళ్తున్న కార్మికులు ఎయిర్‌పోర్టు నుంచి బయటపడటానికి పడరాని పాట్లు పడుతున్నారు. వారికి ఇమిగ్రేషన్, వీసా, వర్క్‌పర్మిట్ అన్నీ సక్రమంగా ఉన్నా లేనిపోని అభ్యంతరాలు చెబుతూ గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి కల్పిస్తున్నారు. దీంతో కువైట్‌లోని వివిధ కంపెనీల్లో పని చేసే కార్మికులకు ఇమిగ్రేషన్ ప్రక్రియను తొందరగా ముగిస్తున్న అధికారులు.. కేవలం ఇంటి పని కోసం వెళ్తున్న వారిని గంటల తరబడి నిరీక్షించేలా చేస్తున్నారు. కువైట్‌లోని అరబ్బుల ఇళ్లలో వంట పని, డ్రైవింగ్, గార్డెనింగ్ తదితర పనులు చేయడానికి తెలంగాణ జిల్లాల నుంచి అనేకమంది కార్మికులు వెళ్తున్నారు. ఇప్పటికే కొంతమంది అక్కడ పనిచేస్తుండగా మరికొందరు కార్మికులకు వీసా లభించడంతో కువైట్‌కు వెళ్తున్నారు. వీరిలో ఇంటిపని కోసం వెళ్లినవాళ్లనే ప్రత్యేకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పక్షం రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలానికి చెందిన రాములు కువైట్‌కు చేరుకోగా అతని వీసాను పరిశీలించిన అధికారులు ఇంటి పనికి సంబంధించిన వీసా ఉండటంతో దాదాపు 24 గంటలపాటు ఎయిర్‌పోర్టులో నిర్బం ధించారు. రాములుతోపాటు తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన మరో 15 మంది కార్మికులను ఎయిర్‌పోర్టులోనే అధికారులు నిర్బంధించారు. చివరకు తమకు తెలిసిన వారి ద్వారా కువైట్‌లోని యజమానులకు సమాచారం అందిస్తే వారి చొరవతో ఎయిర్‌పోర్టు నుంచి బయటకు అధికారులు పంపించారు. ఇలా ఆరు నెలల నుంచి వలస కార్మికులకు ఇబ్బందులు కలుగుతున్నాయని కువైట్‌లో సప్లయింగ్ కంపెనీ నిర్వహిస్తున్న ఏర్గట్ల వాసి అబ్బన్నోల్ల రాజేశ్వర్ ‘సాక్షి’కి వివరించారు. మన విదేశాంగశాఖ ఉన్నతాధికారులు చొరవ తీసుకుంటేనే వలస కార్మికులకు ఎయిర్‌పోర్టులో కష్టాలు తప్పుతాయని ఆయన తెలిపారు. ఇప్పటికైనా విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు స్పందించి కువైట్ ప్రభుత్వంతో చర్చించి వలస కార్మికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. -
హెచ్1-బీ వీసాదారుల జీవిత భాగస్వాములకూ వర్క్ పర్మిట్
- మే 26 నుంచి అమలు చేయనున్న అమెరికా వాషింగ్టన్: అమెరికాలో హెచ్1-బీ వీసా ద్వారా ఉద్యోగం చేస్తున్న విదేశీయుల జీవిత భాగస్వాములూ ఇకపై వివిధ ఉద్యోగాలు చేసుకునేందుకు వీలు కానుంది. హెచ్1-బీ వీసాదారుల జీవిత భాగస్వాములు అత్యున్నత నైపుణ్యం గల ఉద్యోగాలు చేసేందుకు వర్క్ పర్మిట్‌ను అమెరికా ప్రభుత్వం మే 26 నుంచి అమలు చేయనుంది. దీంతో గ్రీన్ కార్డుల కోసం దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న విదేశీయులకు, ప్రధానంగా వేలాది మంది భారతీయులకు ఎంతో ఊరట కలగనుంది. వలస విధానంపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నిర్ణయం మేరకు గతేడాది ఖరారైన ఈ ప్రతిపాదన త్వరలో అమలులోకి రానుంది. ప్రస్తుతం ఉన్న విధానం వల్ల హెచ్1-బీ వీసాదారుల భాగస్వాములకు ఉద్యోగం చేసేందుకు అనుమతి లేకపోవడంతో వారు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. తాజా మార్పు వల్ల వచ్చే ఏడాది కాలంలో 1.79 లక్షల మందికి, తర్వాతి సంవత్సరాల్లో మరో 55 వేల మందికి ప్రయోజనం కలగనుంది. అత్యున్నత నైపుణ్యం గల ఉద్యోగుల జీవిత భాగస్వాములకు తాత్కాలిక వీసాల విషయంలో ఆస్ట్రేలియా, కెనడాలు ఇలాంటి మార్పులను ఇంతకుముందే అమలు చేశాయి. దీంతో అమెరికాలో కూడా నిబంధనలను మార్చేలా వచ్చిన ఒత్తిడి మేరకు ఒబామా ఈ నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో గ్రీన్‌కార్డులు పొందేందుకు విదేశీయులకు కొన్నిసార్లు పదేళ్లకు పైగా సమయం పడుతోన్న నేపథ్యంలో ఆ ప్రక్రియను వేగవంతం చేసేందుకు, హెచ్1-బీ వీసాలపై పరిమితిని ఎత్తేసేందుకూ ఒబామా గత నవంబర్‌లో ఆమోదం తెలిపారు. -
ఆర్జించు.. సముపార్జించు...
ఆర్థిక మాంద్య పరిస్థితులు, డాలర్‌తో రూపాయి మారకం విలువ తగ్గడం వంటి కారణాలతో విదేశీ విద్య.. భారతీయ విద్యార్థికి భారంగా మారుతోంది. కాబట్టి విదేశాల్లో అందుబాటులో ఉన్న పార్ట్‌టైమ్ జాబ్స్.. ఆయా యూనివర్సిటీలు వారానికి ఎన్నిగంటలు జాబ్ చేసుకునే వెసులుబాటు ఇస్తాయి? తదితర అంశాల గురించి తెలుసుకుంటే ఆర్థిక ఇబ్బందుల నుంచి సులువుగా గట్టెక్కొచ్చు. అమెరికా: ఎఫ్-1 వీసాతో అమెరికాకు వచ్చిన విదేశీ విద్యార్థులకు కోర్సు మొదటి ఏడాదిలో ఆఫ్ క్యాంపస్ జాబ్ చేసుకునేందుకు అనుమతి ఉండదు. సంబంధిత అధికారి ప్రత్యేక అనుమతి ఇస్తేనే జాబ్ చేసుకోవచ్చు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్.. కోర్సు మొదటి ఏడాది పూర్తయ్యాక ఆఫ్ క్యాంపస్ జాబ్స్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వొచ్చు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే వారానికి 20 గంటలపాటు ఆన్ క్యాంపస్ జాబ్ చేసుకోవచ్చు. సెలవుల్లో వారానికి 40 గంటల వరకూ ఆన్ క్యాంపస్ ఉద్యోగం చేసుకునే వెసులుబాటు ఉంటుంది. బ్రిటన్: బ్రిటన్‌లో బ్యాచిలర్ కోర్సులు, అంతకంటే ఉన్నతస్థాయి కోర్సుల్లో చేరిన విదేశీ విద్యార్థులు.. కాలేజీ జరుగుతున్నప్పుడు వారానికి 20 గంటల వరకు జాబ్ చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. సెలవుల్లో అయితే ఫుల్‌టైమ్ చేసుకోవచ్చు. బ్యాచిలర్ కంటే కింది స్థాయి కోర్సుల్లో చేరిన విద్యార్థులు తరగతులు జరుగుతున్నప్పుడు వారానికి 10 గంటలు ఉద్యోగం చేసుకునే వీలుంది. సింగపూర్: చదువు కోసం వచ్చిన విద్యార్థులకు కోర్సు తరగతులు జరుగుతున్నప్పుడు, సెలవుల్లో ఉద్యోగం చేసుకునేందుకు ఎంప్లాయిమెంట్ ఆఫ్ ఫారిన్ మ్యాన్‌పవర్ ప్రత్యేకంగా వర్క్పాస్ ఎగ్జమ్షన్ ఇస్తే పార్ట్‌టైమ్ జాబ్ చేసుకునే వీలుంటుంది. కొన్ని స్కూల్స్‌లో మాత్రం 14 ఏళ్ల వయసు దాటిన వారికి వర్క్పాస్ ఎగ్జమ్షన్ అవసరం ఉండదు. ఈ స్కూల్స్‌లో సెలవుల్లో ఉద్యోగం చేసుకోవచ్చు. ఆస్ట్రేలియా: విదేశీ విద్యార్థులకు వర్క్‌పర్మిట్ విషయంలో వెసులుబాటు బాగానే ఉందని చెప్పొచ్చు. ఇక్కడి యూనివర్సిటీల్లో చేరిన విద్యార్థులు తరగతులు జరుగుతున్నప్పుడు 15 రోజులకు 40 గంటలపాటు జాబ్ చేసుకోవచ్చు. అదే సెలవుల్లో అయితే ఎన్నిగంటలైనా పార్ట్‌టైమ్ ఉద్యోగం చేసుకునే వీలుంటుంది. ఆస్ట్రేలియాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన వారికి ఉన్న మరో వెసులుబాటు ఏమంటే.. పోస్ట్‌గ్రాడ్యుయేట్ రీసెర్చ్ విద్యార్థులకు సంబంధించి ఇన్ని గంటలే పని చేయాలనే నియంత్రణ ఏమీ లేదు. కెనడా: పబ్లిక్ యూనివర్సిటీలు, కమ్యూనిటీ కాలేజీలు, ప్రభుత్వ నిధులతో నడిచే టెక్నికల్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్‌లో చేరిన విద్యార్థులు ఎలాంటి వర్క్ పర్మిట్ లేకుండానే తమ క్యాంపస్‌లలో వారానికి 20 గంటలు పనిచేసుకోవచ్చు. కోర్సులో చేరిన ఇన్స్టిట్యూట్ కోసం, ఆ ఇన్స్టిట్యూట్ క్యాంపస్‌లో ఏర్పాటైన ప్రైవేట్ బిజినెస్‌లో విదేశీ విద్యార్థులు పార్ట్‌టైమ్ జాబ్ చేసుకునే వీలుంటుంది. ఆఫ్ క్యాంపస్ వర్క్‌పర్మిట్ ప్రోగ్రామ్ ద్వారా విదేశీ విద్యార్థులు రెగ్యులర్ అకడెమిక్ సెషన్ సమయంలో వారానికి 20 గంటలు పనిచేసుకోవచ్చు. వేసవి, శీతాకాల సెలవులప్పుడు ఎన్నిగంటలైనా జాబ్ చేసుకోవచ్చు. -
సౌదీలో స్తంభించిన జనజీవనం
రియాద్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: సౌదీ అరేబియా తీసుకొచ్చిన నూతన కార్మిక చట్టం ‘నతాఖా’ ప్రభావంతో అక్కడ చాలా వరకు జనజీవనం స్తంభించిపోయింది. సరైన పత్రాలు లేక (వర్క్ పర్మిట్ లేక) అరెస్టవడంతో పాటు, అవగాహన లేక పెద్ద సంఖ్యలో కార్మికులు ఇళ్లకే పరిమితం కావడంతో.. వ్యాపార సంస్థలు, కార్యాలయాలు, పరిశ్రమలను మూసి ఉంచాల్సి వస్తోంది. దాంతో ప్రధాన నగరాలైన జిద్దా, రియాత్, దమ్మామ్, హల్-కోబర్, మక్కా, మదీనా తదితర ప్రాంతాల్లో కార్యకలాపాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో వలస వచ్చినవారితో పాటు, సౌదీ అరేబియా ప్రజల్లోనూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ చట్టం కింద అరెస్టయిన కార్మికుల్లో ఎక్కువగా ప్లంబర్లు, పెయింటర్లు, డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లు, క్లీనర్స్, స్వీపర్లు ఉన్నారు. దాంతో చాలా సంస్థలు, వ్యాపార సముదాయాలు, హోటళ్లు, కార్యాలయాల్లో కిందిస్థాయి సిబ్బంది రాకపోవడంతో కార్యకలాపాలు నిలిచిపోయి, సౌదీ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఉద్యోగ వీసాపై వెళ్లిన ఉద్యోగులు తమ కఫిల్ల నుంచి ఫ్యామిలీ వీసా అనుమతి తీసుకొని భార్యాపిల్లలను సౌదీ అరేబియాకు తీసుకెళ్లారు. వారిని భారత ఎంబసీ స్కూళ్లలో, స్థానిక ప్రైవేటు పాఠశాలల్లో టీచర్లుగా చేర్పించారు. కానీ, ‘నతాఖా’ చట్టంతో వారంతా పాఠశాలలకు వెళ్లకపోవడంతో చాలా స్కూళ్లు మూతపడ్డాయి. చట్టంపై అవగాహన లేకనే.. సౌదీ అరేబియాకు వెళ్లిన వారికి తమ వద్ద అఖామా (వర్క్ పర్మిట్) ఉన్నప్పటికీ.. పిలిచిన వ్యక్తి (కఫిల్) పేర్కొన్న పనికి సంబంధించిన వివరాలపై అవగాహన కల్పించే విధానం లేదు. దాంతో ఇప్పుడు కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ‘నతాఖా’ ప్రకారం వర్క్ పర్మిట్‌లో ఏ పని చేస్తారని పేర్కొన్నారో.. కార్మికులు అదే పని మాత్రమే చేయాలి. దీని ప్రకారం అఖామాలో డ్రైవర్‌గా ఉండి.. స్వీపర్ విధులు నిర్వహిస్తున్న వారిని కూడా అరెస్టు చేస్తున్నారు. దీంతో వర్క్ పర్మిట్ ఉన్న కార్మికులు కూడా విధులకు హాజరుకావడానికి భయపడుతున్నారు. నివాసాల్లోనే ఉంటూ బిక్కుబిక్కుమంటూ జీవితం గడుపుతున్నారు. ఈ చట్టంపై అవగాహన లేకపోవడంతో పాటు, అక్కడి స్థానిక భాష అరబ్బీ రాకపోవడంతో విదేశాల కార్మికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ చట్టం ఎవరికి వర్తిస్తుంది? ఎవరికి వర్తించదనే విషయాలపై అక్కడి ప్రభుత్వం.. అవగాహన కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. దీంతో విదేశీ కార్మికులు, ఉద్యోగుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. 25 వేల మంది అరెస్టు? : ఇప్పటి వరకు అక్రమంగా ఉంటున్న 25 వేల మందిని అరెస్టు చేసినట్లు సౌదీ అరేబియా ప్రభుత్వ ప్రతినిధి అల్ మన్సూర్ టర్కీ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంకా ఎంతమంది అక్రమంగా నివాసం ఉంటున్నారో ఇకపై అరెస్టులతో తెలుస్తుందన్నారు.అరెస్టయిన వారిలో చాలా మంది అనారోగ్యంతో బాధపడుతున్నారని ప్రశ్నించగా... వారికి సౌదీ ప్రభుత్వం ద్వారా ఉచితంగా వైద్యం చేయిస్తామని ఇప్పటికే సౌదీ రాజు ప్రకటించారని చెప్పారు. విదేశీయుల మాన, ప్రాణ రక్షణ విషయంలో సౌదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. కేవలం అక్రమంగా ఉంటున్న వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నామని పేర్కొన్నారు. వారం రోజులుగా రెస్టారెంట్ మూతపడింది.. ‘‘వారం రోజులుగా మా రెస్టారెంట్‌ను మూసి ఉంచాల్సి వస్తోంది. మా రెస్టారెంట్లో పని చేస్తున్నవారికి వర్క్ పర్మిట్లు ఉన్నాయి. కానీ, పర్మిట్లలో పేర్కొన్న పనుల్లో వారు లేరు. ‘నతాఖా’ అరెస్టులకు భయపడి ఎవరూ విధులకు రావడం లేదు. దాంతో వారికి స్పాన్సర్షిప్ కోసం దరఖాస్తు కూడా చేసుకున్నాం. విదేశీయులు తక్కువ వేతనాలకు పనిచేస్తారు. అదే ఈ చట్టం ద్వారా స్థానికులకు ఉద్యోగాలిస్తే ఎక్కువ వేతనాలు ఇవ్వాల్సి వస్తుంది. దాంతో నష్టాల పాలవుతాం.’’ - అలీ హద్దాద్, జిద్దా రెస్టారెంట్ మేనేజర్ సౌదీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి.. ‘‘నేను మూడేళ్లుగా రియాద్‌లో ఉంటున్నాను. నేను వచ్చినప్పుడు నా కఫిల్ (నాకు వీసా ఇచ్చిన వ్యక్తి) నా పాస్‌పోర్టును తన వద్ద ఉంచుకొని అఖామా (వర్క్ పర్మిట్)ను ఇచ్చాడు. ఆ అఖామాలో తన కంపెనీలో పని కోసం పిలిచినట్లుగా ఉంది. కానీ, ఆయన నాకు తన కంపెనీలో ఉద్యోగం ఇవ్వకుండా, బయట పని చేసుకొమ్మన్నాడు. దాంతో ఒక ఆటోమొబైల్ కంపెనీలో పనిచేస్తున్నాను. నాకు అఖామా ఉంది. కానీ, కొత్త చట్టం కింద నన్ను అరెస్ట్ చేసే అవకాశముంది. కఫిల్ తప్పుతో నేను ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇది సౌదీ ప్రభుత్వం నిర్లక్ష్యం. ఆ చట్టంలో మార్పులు చేయాలి.’’ - నహీం సిద్ధిఖీ, రియాద్, ఆటో మోబైల్ కంపెనీ వర్కర్.